కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 28

మీరు తెలుసుకున్నది సత్యమనే నమ్మకంతో ఉండండి

మీరు తెలుసుకున్నది సత్యమనే నమ్మకంతో ఉండండి

“నువ్వు నేర్చుకున్నవాటిని, నీకు నమ్మకం కుదిరినవాటిని పాటిస్తూ ఉండు.”—2 తిమో. 3:14.

పాట 56 సత్య మార్గంలో నడవండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మన దృష్టిలో “సత్యం” అంటే ఏంటి?

“మీరు సత్యం ఎలా తెలుసుకున్నారు?” “మీరు చిన్నప్పటి నుండి సత్యంలో ఉన్నారా?” “మీరు సత్యం ఎప్పుడు తెలుసుకున్నారు?” ఇలాంటి ప్రశ్నల్ని ఎవరో ఒకరు మిమ్మల్ని అడిగేవుంటారు లేదా మీరే వేరేవాళ్లను అడిగివుంటారు. అసలు మన దృష్టిలో “సత్యం” అంటే ఏంటి? సాధారణంగా మన నమ్మకాల్ని, ఆరాధన విధానాన్ని, జీవన విధానాన్ని వర్ణించడానికి సత్యం అనే పదాన్ని ఉపయోగిస్తాం. “సత్యంలో” ఉన్నవాళ్లకు బైబిలు ఏం బోధిస్తుందో తెలుసు, వాళ్లు అందులోని సూత్రాల్ని పాటిస్తారు. కాబట్టి వాళ్లు అబద్ధ మత బోధల్ని ఏమాత్రం నమ్మరు, సాతాను లోకంలో ఉంటూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు.—యోహా. 8:32.

2. యోహాను 13:34, 35 ప్రకారం, చాలామంది ఏం చూసి సత్యంలోకి వస్తారు?

2 మీరు సత్యంలోకి రావడానికి కారణం ఏంటి? బహుశా మీకు యెహోవా ప్రజల మంచి ప్రవర్తన నచ్చి ఉండవచ్చు. (1 పేతు. 2:12) లేదా, వాళ్లు చూపించిన ప్రేమ మిమ్మల్ని ఆకర్షించి ఉండవచ్చు. చాలామంది మీటింగ్‌కి వచ్చిన మొదటిసారే ఆ ప్రేమను గమనించారు; ఆ రోజు మీటింగ్‌లో విన్న విషయాల కన్నా, ప్రేమే వాళ్లను ఎక్కువగా ఆకట్టుకుంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే, ఒకరిమీద ఒకరం చూపించుకునే ప్రేమను బట్టే మనం తన శిష్యులని అందరికీ తెలుస్తుందని యేసు చెప్పాడు. (యోహాను 13:34, 35 చదవండి.) కానీ బలమైన విశ్వాసం సంపాదించుకోవడానికి, ఆ ప్రేమ ఒక్కటే సరిపోదు.

3. మన విశ్వాసం దేవుని ప్రజలు చూపించే ప్రేమ మీద మాత్రమే ఆధారపడితే ఏం జరగవచ్చు?

3 మన విశ్వాసం దేవుని ప్రజలు చూపించే ప్రేమ మీద మాత్రమే ఆధారపడి ఉండకూడదు. ఎందుకంటే అలాంటి విశ్వాసం బలంగా ఉండదు. ఉదాహరణకు ఒక ప్రచారకుడు గానీ, సంఘపెద్ద గానీ, పయినీరు గానీ ఘోరమైన పాపం చేస్తే మనం అభ్యంతరపడి యెహోవా సేవ ఆపేసే ప్రమాదం ఉంది. తోటి విశ్వాసి ఎవరైనా మనల్ని బాధపెడితే లేదా మతభ్రష్టునిగా మారి మన నమ్మకాలు తప్పని చెప్తే, మనం యెహోవాకు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన విశ్వాసం యెహోవాతో మనకున్న సంబంధం మీద ఆధారపడి ఉంటేనే, అది బలంగా ఉంటుంది. అలాకాకుండా, వేరే వాళ్ల పనుల్ని చూసి మీరు విశ్వాసాన్ని పెంపొందించుకుంటే, అది బలంగా ఉండదు. నిజమే, యెహోవా మీద, ఆయన ప్రజల మీద మీకు ఏర్పడిన అభిప్రాయం మీలో విశ్వాసాన్ని కలిగించవచ్చు. కానీ ఆ విశ్వాసం బలంగా ఉండాలంటే బైబిల్ని లోతుగా అధ్యయనం చేయాలి, అందులోని విషయాలు అర్థం చేసుకోవాలి, పరిశోధన చేయాలి. యెహోవా గురించి మీరు నేర్చుకుంటున్న విషయాలు సత్యమనే నమ్మకం కుదుర్చుకోవాలి. బైబిలు యెహోవా గురించి సత్యాన్ని బోధిస్తుందని మీరే పరీక్షించి తెలుసుకోవాలి.—రోమా. 12:2.

4. మత్తయి 13:3-6, 20, 21 ప్రకారం, విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు?

4 కొంతమంది సత్యాన్ని “సంతోషంగా” అంగీకరిస్తారు కానీ, సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని వదిలేస్తారని యేసు చెప్పాడు. (మత్తయి 13:3-6, 20, 21 చదవండి.) యేసును అనుసరించే వాళ్లకు కష్టాలు వస్తాయని వాళ్లు అర్థంచేసుకుని ఉండకపోవచ్చు. (మత్త. 16:24) లేదా క్రైస్తవులకు ఆశీర్వాదాలు తప్ప కష్టాలు ఉండవని వాళ్లు అనుకుని ఉంటారు. కానీ ఈ లోకంలో కష్టాలు అందరికీ వస్తాయి. జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల వల్ల మనం సంతోషాన్ని కోల్పోవచ్చు.—కీర్త. 6:6; ప్రసం. 9:11.

5. చాలామంది సహోదరసహోదరీలు తాము తెలుసుకున్నది సత్యమని నమ్ముతున్నట్టు ఎలా చూపిస్తున్నారు?

5 చాలామంది సహోదరసహోదరీలు, తాము తెలుసుకున్నది సత్యమని నమ్ముతున్నట్టు చూపిస్తున్నారు. ఎలా? తోటి విశ్వాసి బాధపెట్టినా లేదా ఘోరమైన పాపం చేసినా వాళ్లు విశ్వాసంలో స్థిరంగా కొనసాగుతున్నారు. (కీర్త. 119:165) పరీక్షలు ఎదురయ్యే కొద్దీ వాళ్ల విశ్వాసం బలపడుతుందే కానీ బలహీనపడదు. (యాకో. 1:2-4) అలాంటి బలమైన విశ్వాసాన్ని మీరెలా సంపాదించుకోవచ్చు?

“దేవుని గురించిన సరైన జ్ఞానం” సంపాదించండి

6. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల విశ్వాసం దేనిమీద ఆధారపడివుంది?

6 మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల విశ్వాసం లేఖనాల జ్ఞానం మీద, అలాగే యేసుక్రీస్తు బోధల మీద అంటే, “సత్యం గురించిన మంచివార్త” మీద ఆధారపడివుంది. (గల. 2:5) యేసు అర్పించిన విమోచన క్రయధనం, ఆయన పునరుత్థానం గురించిన వాస్తవాలతోపాటు క్రైస్తవ నమ్మకాలన్నీ ఆ సత్యంలో ఇమిడివున్నాయి. ఆ బోధలు నిజమని అపొస్తలుడైన పౌలు నమ్మాడు. ఎందుకంటే, ‘క్రీస్తు బాధలు పడడం, మృతుల్లో నుండి బ్రతకడం అవసరమని లేఖనాల్ని’ పరిశీలించి తెలుసుకున్నాడు. (అపొ. 17:2, 3) ఆ బోధల్ని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు అంగీకరించారు, పవిత్రశక్తి సహాయంతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్లు నేర్చుకుంటున్న విషయాలు లేఖనాల మీదే ఆధారపడి ఉన్నాయని పరిశోధించి తెలుసుకున్నారు. (అపొ. 17:11, 12; హెబ్రీ. 5:14) అవును, వాళ్ల విశ్వాసం సహోదరసహోదరీలు చూపించిన ప్రేమ మీద, వాళ్లతో గడిపినప్పుడు పొందిన సంతోషం మీద మాత్రమే ఆధారపడలేదు. బదులుగా, “దేవుని గురించిన సరైన జ్ఞానం” మీద ఆధారపడివుంది.—కొలొ. 1:9, 10.

7. బైబిలు బోధలు మీద ఆధారపడిన విశ్వాసం ఏం చేస్తుంది?

7 బైబిలు సత్యాలు ఎప్పటికీ మారవు. (కీర్త. 119:160) తోటి విశ్వాసి మనల్ని బాధపెట్టినా, ఘోరమైన పాపం చేసినా, మనకు కష్టాలు ఎదురైనా ఆ సత్యాలు మారవు. కాబట్టి మనకు బైబిలు బోధల మీద పూర్తి అవగాహన ఉండాలి, అవి సత్యమనే నమ్మకం కుదరాలి. తుఫాను వచ్చినప్పుడు పడవ కొట్టుకుపోకుండా లంగరు ఆపినట్టే, పరీక్షలు వచ్చినప్పుడు పడిపోకుండా బైబిలు బోధలు మీద ఆధారపడిన విశ్వాసం మనల్ని కాపాడుతుంది. అయితే, మనం తెలుసుకున్నది సత్యమనే నమ్మకాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

‘నమ్మకం కుదుర్చుకోండి’

8. రెండో తిమోతి 3:14, 15 ప్రకారం, తాను తెలుసుకున్నది సత్యమనే నమ్మకం తిమోతికి ఎలా కుదిరింది?

8 తిమోతికి తాను తెలుసుకున్నది సత్యమనే నమ్మకం కుదిరింది. ఎలా? (2 తిమోతి 3:14, 15 చదవండి.) తిమోతికి వాళ్ల అమ్మ, అమ్మమ్మ ‘పవిత్ర లేఖనాల్లో’ ఉన్న విషయాలు బోధించారు. అయితే, తిమోతి కూడా తన సమయాన్ని, శక్తిని వెచ్చించి పవిత్ర లేఖనాల్ని స్వయంగా అధ్యయనం చేసి ఉంటాడు. దాంతో ఆయనకు లేఖనాలు బోధించేవన్నీ సత్యమనే ‘నమ్మకం కుదిరింది.’ కొంతకాలం తర్వాత తిమోతి, వాళ్ల అమ్మ, అమ్మమ్మ యేసు అనుచరులు బోధించిన మంచివార్త విన్నారు. వాళ్లు చూపించిన ప్రేమ తిమోతికి ఖచ్చితంగా నచ్చివుంటుంది; సంఘంలోని సహోదరసహోదరీలతో సమయం గడపాలని వాళ్లను శ్రద్ధగా చూసుకోవాలని కూడా ఆయనకు అనిపించివుంటుంది. (ఫిలి. 2:19, 20) కానీ ఆయన విశ్వాసం తోటి విశ్వాసుల ప్రేమ మీద మాత్రమే ఆధారపడిలేదు. దేవుని గురించి లేఖనాలు చెప్పే సత్యాల మీద ఆధారపడివుంది. ఆ సత్యాలే ఆయన్ని యెహోవాకు దగ్గర చేశాయి. మీరు కూడా బైబిల్ని అధ్యయనం చేసి, యెహోవా గురించి అందులో ఉన్న సత్యాలు నిజమని నమ్మకం కుదుర్చుకోవాలి.

9. మీరు ఏ మూడు ప్రాథమిక సత్యాల పట్ల నమ్మకం కుదుర్చుకోవాలి?

9 మీరు నమ్మకం కుదుర్చుకోవాల్సిన మూడు ప్రాథమిక సత్యాలు ఉన్నాయి. మొదటిగా, యెహోవా దేవుడు సమస్తాన్ని సృష్టించాడని మీకు నమ్మకం కుదరాలి. (నిర్గ. 3:14, 15; హెబ్రీ. 3:4; ప్రక. 4:11) రెండోదిగా, మనుషుల కోసం దేవుడే బైబిల్ని రాయించాడని పరిశీలించి తెలుసుకోవాలి. (2 తిమో. 3:16, 17) మూడవదిగా, క్రీస్తు నాయకత్వం కింద తనను ఆరాధించేలా దేవుడు కొంతమంది ప్రజల్ని ఏర్పర్చుకున్నాడని, ఆ ప్రజలు యెహోవాసాక్షులని అర్థం చేసుకోవాలి. (యెష. 43:10-12; యోహా. 14:6; అపొ. 15:14) అయితే ఈ మూడు ప్రాథమిక సత్యాల పట్ల నమ్మకం కుదరాలంటే మీకు బైబిలు గురించి పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకున్నది సత్యమనే నమ్మకాన్ని మరింత బలపర్చుకునేలా “మీ ఆలోచనా సామర్థ్యాల్ని” ఉపయోగించడం మీ లక్ష్యమై ఉండాలి.—రోమా. 12:1.

ఇతరుల్లో నమ్మకాన్ని కలిగించండి

10. సత్యం పట్ల నమ్మకం కుదిరిన తర్వాత, మనం ఏం చేయగలగాలి?

10 దేవునికి, బైబిలుకు, దేవుని ప్రజలకు సంబంధించిన మూడు ప్రాథమిక సత్యాల పట్ల మీకు నమ్మకం కుదిరిన తర్వాత, మీరు లేఖనాల్ని ఉపయోగించి ఆ సత్యాల్ని ఇతరులకు వివరించగలగాలి. ఎందుకు? ఎందుకంటే, మనం నేర్చుకున్న సత్యాల్ని ఆసక్తి ఉన్నవాళ్లకు బోధించాల్సిన బాధ్యత క్రైస్తవులమైన మన మీద ఉంది. * (1 తిమో. 4:16) ఇతరుల్లో బైబిలు సత్యాల పట్ల నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నించినప్పుడు, వాటిపట్ల మనకున్న నమ్మకం కూడా మరింత బలపడుతుంది.

11. మనం ప్రజలకు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు పౌలును ఎలా అనుకరించవచ్చు?

11 అపొస్తలుడైన పౌలు ప్రజలకు బోధిస్తున్నప్పుడు, “మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో రాసివున్న వాటిని ఉపయోగిస్తూ యేసు గురించి వాళ్లను ఒప్పించడానికి ప్రయత్నించాడు.” (అపొ. 28:23) మనం ప్రజలకు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు పౌలును ఎలా అనుకరించవచ్చు? మనం వాళ్లకు బైబిలు ఏం బోధిస్తుందో చెప్తే సరిపోదు. లేఖనాల్ని అధ్యయనం చేయడం, వాటిగురించి లోతుగా ఆలోచించడం వాళ్లకు నేర్పించాలి. బైబిలు విద్యార్థులు మన మీద గౌరవంతో సత్యాన్ని అంగీకరించకూడదు. మన ప్రేమగల దేవుని గురించి వాళ్లు నేర్చుకున్న విషయాలు సత్యమని నమ్మి అంగీకరించాలి.

తల్లిదండ్రులారా, మీ పిల్లలకు “దేవుని లోతైన విషయాల్ని” బోధిస్తూ వాళ్లు బలమైన విశ్వాసం సంపాదించుకోవడానికి సహాయం చేయండి (12-13 పేరాలు చూడండి) *

12-13. తమ పిల్లలు సత్యంలో కొనసాగడానికి తల్లిదండ్రులు ఎలా సహాయపడవచ్చు?

12 తల్లిదండ్రులారా, మీ పిల్లలు సత్యంలో కొనసాగాలని మీరు ఎంతో కోరుకుంటారు. సంఘంలో మంచి స్నేహితులు ఉంటే, వాళ్లు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తారని మీరు అనుకోవచ్చు. అయితే, మీ పిల్లలు తాము నేర్చుకుంటున్న విషయాలు సత్యమని నమ్మాలంటే, వాళ్లకు సంఘంలో మంచి స్నేహితులు ఉంటే సరిపోదు. వాళ్లు దేవునితో మంచి సంబంధం ఏర్పర్చుకోవాలి, బైబిలు బోధించే విషయాలు సత్యమనే నమ్మకం వాళ్లకు కుదరాలి.

13 తమ పిల్లలకు దేవుని గురించిన సత్యం నేర్పించాలనుకునే తల్లిదండ్రులు బైబిల్ని ప్రతీరోజు చదవడం ద్వారా, సమయం తీసుకుని అందులోని విషయాల్ని ధ్యానించడం ద్వారా మంచి ఆదర్శం ఉంచాలి. అది గమనించినప్పుడు పిల్లలు కూడా అలా చేయడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమ బైబిలు విద్యార్థులకు నేర్పించినట్టే, రకరకాల ఉపకరణాల సహాయంతో బైబిల్ని అధ్యయనం చేయడం తమ పిల్లలకు కూడా నేర్పించాలి. అలా చేస్తే వాళ్లకు యెహోవా పట్ల, ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి ఆయన ఉపయోగించుకుంటున్న ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుని’ పట్ల కృతజ్ఞత పెరుగుతుంది. (మత్త. 24:45-47) తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కేవలం ప్రాథమిక బైబిలు సత్యాల్ని నేర్పిస్తే సరిపోతుందని అనుకోకండి. వాళ్ల వయసు, సామర్థ్యం బట్టి “దేవుని లోతైన విషయాల్ని” బోధిస్తూ, వాళ్లు బలమైన విశ్వాసం సంపాదించుకోవడానికి సహాయం చేయండి.—1 కొరిం. 2:10.

బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేయండి

14. మనం బైబిలు ప్రవచనాల్ని ఎందుకు అధ్యయనం చేయాలి? (“ ఈ ప్రవచనాల్ని వివరించగలరా?” అనే బాక్సు చూడండి.)

14 దేవుని వాక్యంలోని ప్రవచనాలు చాలా ముఖ్యమైనవి. అవి యెహోవా పట్ల బలమైన విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేస్తాయి. మీ విశ్వాసాన్ని బలపర్చిన ప్రవచనాలు ఏంటి? బహుశా “చివరి రోజుల” గురించిన ప్రవచనాలని మీరు చెప్పవచ్చు. (2 తిమో. 3:1-5; మత్త. 24:3, 7) ఇప్పటికే నెరవేరిన ఏ ఇతర ప్రవచనాలు మీ విశ్వాసాన్ని మరింత బలపర్చగలవు? ఉదాహరణకు, దానియేలు 2వ అధ్యాయంలో లేదా దానియేలు 11వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలు ఇప్పటికే ఎలా నెరవేరాయో, ఎలా నెరవేరుతున్నాయో మీరు వివరించగలరా? * మీ విశ్వాసం బైబిలు మీద ఆధారపడితే, అది ఎప్పటికీ చెక్కుచెదరదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, తీవ్రమైన హింసను ఎదుర్కొన్న జర్మనీలోని సహోదరుల అనుభవం గమనించండి. చివరి రోజుల గురించిన ప్రవచనాలు వాళ్లకు పూర్తిగా అర్థంకాకపోయినా, దేవుని వాక్యం మీద బలమైన విశ్వాసం కలిగివున్నారు.

బైబిల్ని, అందులోని ప్రవచనాల్ని అధ్యయనం చేస్తే హింసల్ని ధైర్యంగా ఎదుర్కొంటాం (15-17 పేరాలు చూడండి) *

15-17. బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల మన సహోదరులు హింసల్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోగలిగారు?

15 నాజీ జర్మనీ పరిపాలనలో, వేలమంది సహోదరసహోదరీల్ని కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో వేశారు. హిట్లర్‌, అలాగే అధికారి అయిన హైన్‌రిక్‌ హిమ్లర్‌ యెహోవాసాక్షుల్ని ద్వేషించేవాళ్లు. కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులోని సహోదరీలతో హిమ్లర్‌ ఇలా అన్నాడని ఒక సహోదరి చెప్పింది: “మీ యెహోవా పరలోకానికి పరిపాలకుడు కావచ్చు. కానీ ఈ ప్రపంచాన్ని పరిపాలించేది మాత్రం మేమే! ఈ భూమ్మీద యెహోవాసాక్షులు ఉంటారో, నాజీలు ఉంటారో చూద్దాం!” అలాంటి పరిస్థితుల మధ్య విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి యెహోవా ప్రజలకు ఏం సహాయం చేసింది?

16 దేవుని రాజ్య పరిపాలన 1914⁠లో మొదలైందని ఆ బైబిలు విద్యార్థులకు తెలుసు. వాళ్లకు ఎదురౌతున్న తీవ్రమైన హింసను చూసి వాళ్లు ఆశ్చర్యపోలేదు. దేవుని సంకల్పం నెరవేరకుండా ఏ మానవ ప్రభుత్వం అడ్డుకోలేదని యెహోవా ప్రజలు నమ్మారు. హిట్లర్‌ సత్యారాధనను నిర్మూలించలేడని, దేవుని రాజ్యం కన్నా బలమైన ప్రభుత్వాన్ని స్థాపించలేడని వాళ్లకు తెలుసు. హిట్లర్‌ పరిపాలన ఏదోకరోజు అంతమౌతుందని మన సహోదరులు బలంగా నమ్మారు.

17 వాళ్ల నమ్మకం నిజమైంది. కొంతకాలానికి నాజీ పరిపాలన అంతమైంది; ‘ఈ ప్రపంచాన్ని పరిపాలించేది మేమే’ అని చెప్పుకున్న హైన్‌రిక్‌ హిమ్లర్‌ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. అలా పారిపోతున్నప్పుడు, ఇదివరకు కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులో ఉన్న లూబ్కి అనే సహోదరుడు అతనికి కనిపించాడు. అవమాన భారంతో ఉన్న హిమ్లర్‌ ఆ సహోదరుడితో, ‘నువ్వు బైబిలు విద్యార్థివి కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పు’ అని అడిగాడు. నాజీ పరిపాలన అంతమౌతుందని, తాము విడుదలౌతామని యెహోవాసాక్షులకు ముందే తెలుసని సహోదరుడు అతనికి వివరించాడు. ఒకప్పుడు యెహోవాసాక్షుల్ని కించపరుస్తూ ఎన్నో మాటలు అన్న హిమ్లర్‌ ఆ క్షణం నోరు మెదపలేదు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? బైబిల్ని, అందులోని ప్రవచనాల్ని అధ్యయనం చేస్తే బలమైన విశ్వాసాన్ని సంపాదించుకుంటాం; అంతేకాదు హింసలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాం.—2 పేతు. 1:19-21.

18. యోహాను 6:67, 68 ప్రకారం, పౌలు చెప్పిన “సరైన జ్ఞానం, మంచి వివేచన” మనకు ఎందుకు అవసరం?

18 మనందరం నిజ క్రైస్తవులకు గుర్తింపు అయిన ప్రేమను చూపించాలి. దానితోపాటు, “సరైన జ్ఞానం, మంచి వివేచన” కూడా సంపాదించాలి. (ఫిలి. 1:9) లేదంటే మతభ్రష్టుల మాటల్ని, “కుయుక్తితో ఇతరుల్ని మోసం చేసేవాళ్ల తప్పుడు బోధల్ని” నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. (ఎఫె. 4:14) మొదటి శతాబ్దంలో చాలామంది శిష్యులు యేసును అనుసరించడం మానేశారు. కానీ అపొస్తలుడైన పేతురు మాత్రం, యేసు దగ్గరే “శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు” ఉన్నాయని బలంగా నమ్మాడు. (యోహాను 6:67, 68 చదవండి.) పేతురుకు యేసు చెప్పిన మాటలు పూర్తిగా అర్థంకాకపోయినా, క్రీస్తు గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల ఆయన్ని విడిచిపెట్టలేదు. మీరు కూడా బైబిలు బోధిస్తున్న వాటిపట్ల మీకున్న నమ్మకాన్ని బలపర్చుకోవాలి. అప్పుడు ఎలాంటి పరీక్షలు ఎదురైనా విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. అంతేకాదు, ఇతరులు కూడా అలాంటి బలమైన విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయగలుగుతారు.—2 యోహా. 1, 2.

పాట 72 రాజ్య సత్యాన్ని వెల్లడి చేద్దాం

^ పేరా 5 బైబిల్లోని సత్యం చాలా ప్రాముఖ్యమైనదని అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. మనం తెలుసుకున్నది సత్యమనే నమ్మకాన్ని ఎలా బలపర్చుకోవచ్చో కూడా వివరిస్తుంది.

^ పేరా 10 ప్రాథమిక బైబిలు సత్యాల గురించి ప్రజలతో మాట్లాడడానికి సహాయపడే ఆర్టికల్స్‌ 2010 నుండి 2015 ఇంగ్లీషు కావలికోట పత్రికల్లో “A Conversation With a Neighbor” (“మీతో మాట్లాడవచ్చా?”) అనే శీర్షికతో వచ్చాయి. ఉదాహరణకు, “యేసు దేవుడా?” “దేవుడు మనుషుల్ని నరకాగ్నిలో శిక్షిస్తాడా?” అనే ఆర్టికల్స్‌ ఆ పత్రికల్లో వచ్చాయి. తెలుగులోనైతే కావలికోట 2015 సంచికల్లో “మీతో మాట్లాడవచ్చా?” అనే శీర్షికతో వచ్చిన “దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది?” అనే ఆర్టికల్స్‌ చూడండి.

^ పేరా 14 ఈ ప్రవచనాల వివరణ కోసం జూన్‌ 15, 2012, అలాగే మే 2020 కావలికోట పత్రికల్ని చూడండి.

^ పేరా 60 చిత్రాల వివరణ: కుటుంబ ఆరాధనలో, తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి మహాశ్రమ గురించిన బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేస్తున్నారు.

^ పేరా 62 చిత్రాల వివరణ: మహాశ్రమ సమయంలో ఎదురౌతున్న పరిస్థితుల్ని చూసి ఆ కుటుంబం ఆశ్చర్యపోవట్లేదు.