కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

యేసు ఎప్పుడు ప్రధాన యాజకుడయ్యాడు? కొత్త ఒప్పందం స్థిరపర్చబడడం, అది అమల్లోకి రావడం వేర్వేరు సమయాల్లో జరిగిందా?

యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, అంటే క్రీ.శ. 29⁠లో ప్రధాన యాజకుడు అయ్యాడని రుజువులు స్పష్టం చేస్తున్నాయి. ఏంటా రుజువులు? యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, ‘దేవుని ఇష్టం’ అనే సూచనార్థక బలిపీఠం మీద తన ప్రాణాన్ని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చూపించాడు. (గల. 1:4; హెబ్రీ. 10:5-10) ఆ సూచనార్థక బలిపీఠం యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఉనికిలోకి వచ్చింది. బలిపీఠం ఆలయంలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి, ఆధ్యాత్మిక ఆలయం కూడా యేసు బాప్తిస్మంతోనే ఉనికిలోకి వచ్చి ఉంటుంది. యేసు బలి ఆధారంగా, యెహోవాను సరైన రీతిలో ఆరాధించడానికి చేయబడిన ఏర్పాట్లన్నిటినీ ఆధ్యాత్మిక ఆలయం సూచిస్తుంది.—మత్త. 3:16, 17; హెబ్రీ. 5:4-6.

ఆధ్యాత్మిక ఆలయం ఉన్నప్పుడు, దానిలో ఒక ప్రధాన యాజకుడు కూడా ఉండాలి. ఆ పని చేయడానికి దేవుడు యేసును ‘పవిత్రశక్తితో అభిషేకించి శక్తిని ఇచ్చాడు.’ (అపొ. 10:37, 38; మార్కు 1:9-11) మరి యేసు చనిపోయి, పునరుత్థానం అవ్వడం కన్నా ముందే ప్రధాన యాజకునిగా అభిషేకించబడ్డాడు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే అహరోను ఉదాహరణను, ఆయన తర్వాతి ప్రధాన యాజకుల ఉదాహరణను పరిశీలించాలి.

మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రత్యక్ష గుడారంలోని అతి పవిత్ర స్థలంలోకి గానీ, ఆ తర్వాత వచ్చిన ఆలయంలోని అతి పవిత్ర స్థలంలోకి గానీ ప్రవేశించే అర్హత ప్రధాన యాజకునికి మాత్రమే ఉండేది. పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరు చేస్తూ ఒక తెర ఉండేది. ప్రాయశ్చిత్త రోజున మాత్రమే ప్రధాన యాజకుడు ఆ తెర దాటి వెళ్లేవాడు. (హెబ్రీ. 9:1-3, 6, 7) అహరోను, ఆయన తర్వాతి ప్రధాన యాజకులు ప్రత్యక్ష గుడారంలో ఉన్న అక్షరార్థమైన “తెర గుండా” వెళ్లడానికన్నా ముందే అభిషేకించబడ్డారు. కాబట్టి, యేసు కూడా చనిపోయి “తెర గుండా” వెళ్లడానికన్నా ముందే అంటే, అక్షరార్థమైన శరీరం నుండి పరలోక జీవితంలోకి అడుగుపెట్టక ముందే అభిషేకించబడి ఉండాలి. (హెబ్రీ. 10:20) అందుకే అపొస్తలుడైన పౌలు యేసు గురించి మాట్లాడుతూ, ఆయన “ప్రధానయాజకునిగా” వచ్చి ‘మరింత గొప్పది, మరింత పరిపూర్ణమైనది అయిన గుడారంలో అడుగుపెట్టాడని’ చెప్పాడు. ఆయన అడుగుపెట్టిన గుడారం చేతులతో చేయబడింది కాదుగానీ, పరలోకమని పౌలు తెలియజేశాడు.—హెబ్రీ. 9:11, 24.

కొత్త ఒప్పందం స్థిరపర్చబడడం, అది అమల్లోకి రావడం ఒకేసారి జరిగాయి. అదెలా? యేసు పరలోకంలో అడుగుపెట్టి తన పరిపూర్ణ మానవ ప్రాణం విలువను మన తరఫున యెహోవాకు సమర్పించాడు. దాంతో, కొత్త ఒప్పందం స్థిరపర్చే ప్రక్రియతో పాటు, అది అమలు అయ్యే ప్రక్రియ కూడా మొదలైంది. ఆ ప్రక్రియలో ఏయే పనులు ఇమిడివున్నాయి?

మొదటిది, యేసు యెహోవా సన్నిధిలో ప్రవేశించాడు; రెండోది, తాను అర్పించిన బలి విలువను యెహోవా ముందు సమర్పించాడు; మూడోది, యేసు చిందించిన రక్తం విలువను యెహోవా అంగీకరించాడు. ఈ మూడు పనులు జరిగే వరకు, కొత్త ఒప్పందం వల్ల వచ్చే ప్రయోజనాలు అందుబాటులోకి రాలేదు.

అయితే, యేసు బలి విలువను యెహోవా ఖచ్చితంగా ఎప్పుడు అంగీకరించాడో బైబిలు చెప్పట్లేదు. కాబట్టి కొత్త ఒప్పందం స్థిరపర్చబడి, అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన రోజును గుర్తించడం వీలుకాదు. కానీ, యేసు పెంతెకొస్తు పండుగకు పది రోజుల ముందు పరలోకానికి వెళ్లాడని మనకు తెలుసు. (అపొ. 1:3) కాబట్టి ఆ పది రోజుల సమయంలో ఎప్పుడోకప్పుడు, యేసు తన బలి విలువను సమర్పించడం, యెహోవా దాన్ని అంగీకరించడం జరిగాయి. (హెబ్రీ. 9:12) కొత్త ఒప్పందం అమల్లోకి వచ్చింది అనడానికి స్పష్టమైన రుజువు పెంతెకొస్తు రోజున కనిపించింది. (అపొ. 2:1-4, 32, 33) కొత్త ఒప్పందం స్థిరపర్చబడి, అమల్లోకి వచ్చిందని ఆ రోజున స్పష్టమైంది.

సూటిగా చెప్పాలంటే, యేసు చిందించిన రక్తం విలువను యెహోవా అంగీకరించి, అభిషిక్తుల్ని ఆ ఒప్పందంలోకి తీసుకొచ్చిన తర్వాత కొత్త ఒప్పందం స్థిరపర్చబడింది, అమల్లోకి కూడా వచ్చింది. అప్పటినుండి ప్రధాన యాజకుడైన యేసు ఆ ఒప్పందానికి మధ్యవర్తిగా పనిచేస్తూ దాని ప్రయోజనాల్ని అందుబాటులోకి తెచ్చాడు.—హెబ్రీ. 7:25; 8:1-3, 6; 9:13-15.