కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 31

“నిజమైన పునాదులుగల నగరం” కోసం మీరు ఎదురుచూస్తున్నారా?

“నిజమైన పునాదులుగల నగరం” కోసం మీరు ఎదురుచూస్తున్నారా?

“అతను నిజమైన పునాదులుగల నగరం కోసం ఎదురుచూశాడు; దాని రూపకర్త, నిర్మాణకుడు దేవుడే.”—హెబ్రీ. 11:10.

పాట 22 రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదికి రావాలి!

ఈ ఆర్టికల్‌లో . . . *

1. చాలామంది ఎలాంటి త్యాగాలు చేశారు? ఎందుకు?

మనకాలంలో లక్షలమంది దేవుని ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. చాలామంది సహోదర సహోదరీలు పెళ్లి చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. పెళ్లయినవాళ్లు కొంతకాలం పాటు పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నారు. కొన్ని కుటుంబాలు సాదాసీదాగా జీవించాలని నిర్ణయించుకున్నాయి. వాళ్లందరూ యెహోవా సేవను వీలైనంత ఎక్కువగా చేయడానికే ఆ నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్లు ఉన్నవాటితో తృప్తిపడుతూ, తమకు నిజంగా అవసరమైన వాటన్నిటినీ యెహోవా ఇస్తాడని నమ్ముతున్నారు. వాళ్ల నమ్మకం సరైనదేనా? సరైనదే! అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, గతంలో యెహోవా తన సేవకులకు కావల్సినవన్నీ ఇచ్చాడు. ఉదాహరణకు, “విశ్వాసం చూపించే వాళ్లందరికీ తండ్రి” అయిన అబ్రాహామును యెహోవా దీవించాడు.—రోమా. 4:11.

2. (ఎ) హెబ్రీయులు 11:8-10, 16 ప్రకారం, అబ్రాహాము ఊరును ఎందుకు ఇష్టపూర్వకంగా విడిచిపెట్టాడు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 అబ్రాహాము ఊరు అనే నగరంలో ఉన్న సౌకర్యవంతమైన జీవితాన్ని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన “నిజమైన పునాదులుగల నగరం కోసం ఎదురుచూశాడు.” (హెబ్రీయులు 11:8-10, 16 చదవండి.) ఆ “నగరం” ఏంటి? ఆ నగర నిర్మాణం కోసం ఎదురుచూస్తుండగా అబ్రాహాముకు ఎలాంటి సవాళ్లు వచ్చాయి? మనం అబ్రాహామును, ఆయనలాంటి ఆధునిక కాల సేవకులను ఎలా అనుకరించవచ్చు?

“నిజమైన పునాదులుగల నగరం” అంటే ఏంటి?

3. అబ్రాహాము ఎదురుచూసిన నగరం ఏంటి?

3 అబ్రాహాము ఎదురుచూసిన నగరం దేవుని రాజ్యమే. అది యేసుక్రీస్తుతో, అలాగే 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవులతో రూపొందించబడింది. పౌలు ఆ రాజ్యాన్ని, “జీవంగల దేవుని నగరమైన పరలోక యెరూషలేము” అని పిలిచాడు. (హెబ్రీ. 12:22; ప్రక. 5:8-10; 14:1) యేసు ప్రార్థించమని తన శిష్యులకు చెప్పింది ఆ రాజ్యం గురించే. రాజ్యం రావాలని, దేవుని ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలని ఆయన ప్రార్థించమన్నాడు.—మత్త. 6:10.

4. ఆదికాండం 17:1, 2, 6 ప్రకారం, దేవుడు వాగ్దానం చేసిన నగరం లేదా రాజ్యం గురించిన ఏ వివరాలు అబ్రాహాముకు తెలుసు?

4 దేవుని రాజ్యం ఎలా రూపొందుతుంది అనే వివరాలు అబ్రాహాముకు తెలుసా? తెలీదు. వందల సంవత్సరాల పాటు ఆ వివరాలు ‘పవిత్ర రహస్యంగా’ ఉంచబడ్డాయి. (ఎఫె. 1:8-10; కొలొ. 1:26, 27) కానీ తన సంతానంలో కొంతమంది రాజులౌతారని అబ్రాహాముకు తెలుసు. యెహోవా ఆ విషయాన్ని తన వాగ్దానంలో అబ్రాహాముకు స్పష్టంగా తెలియజేశాడు. (ఆదికాండం 17:1, 2, 6 చదవండి.) అబ్రాహాముకు యెహోవా వాగ్దానాల మీద ఎంత విశ్వాసం ఉందంటే, దేవుని రాజ్యానికి రాజుగా ఉండే మెస్సీయను లేదా అభిషిక్తుణ్ణి ఆయన కళ్లారా చూస్తున్నట్టు భావించాడు. అందుకే యేసు తన కాలంలోని యూదులతో ఇలా అన్నాడు: “మీ తండ్రి అబ్రాహాము నా రోజును చూస్తాననే ఆశతో చాలా సంతోషించాడు. అతను దాన్ని చూశాడు, సంతోషించాడు.” (యోహా. 8:56) అవును, యెహోవా స్థాపించే రాజ్యంలో తన వంశస్థులు భాగంగా ఉంటారని అబ్రాహాముకు తెలుసు. యెహోవా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు వేచివుండడానికి అబ్రాహాము ఇష్టపడ్డాడు.

అబ్రాహాము యెహోవా వాగ్దానాల మీద విశ్వాసాన్ని ఎలా చూపించాడు? (5వ పేరా చూడండి)

5. దేవుడు రూపొందించే నగరం కోసం ఎదురుచూస్తున్నానని అబ్రాహాము ఎలా నిరూపించుకున్నాడు?

5 దేవుడు రూపొందించే నగరం లేదా రాజ్యం కోసం ఎదురుచూస్తున్నానని అబ్రాహాము ఎలా నిరూపించుకున్నాడు? మొదటిగా, ఆయన ఈ భూమ్మీదున్న ఏ రాజ్యంలోనూ చేరలేదు. ఆయన ఏదోక రాజ్యంలో స్థిరపడిపోయి దాన్ని పరిపాలించే మానవ రాజులకు మద్దతిచ్చే బదులు, ఒక చోటు నుండి ఇంకో చోటుకు మారుతూ ఉన్నాడు. అంతేకాదు, తానే స్వయంగా ఒక రాజ్యాన్ని స్థాపించాలని అబ్రాహాము అనుకోలేదు. బదులుగా యెహోవాకు లోబడుతూ ఆయన వాగ్దానాలు నెరవేరే వరకు వేచివున్నాడు. ఆ విధంగా అబ్రాహాము యెహోవా మీద గొప్ప విశ్వాసం చూపించాడు. ఇప్పుడు మనం ఆయన ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడో, దాన్నుండి ఏం నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం.

అబ్రాహాముకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

6. ఊరు నగరం ఎలా ఉండేది?

6 అబ్రాహాము విడిచిపెట్టిన ఊరు నగరం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేది. అక్కడి ప్రజలు బాగా చదువుకున్నవాళ్లు, ధనవంతులు. ఆ నగరానికి మూడు వైపులా పెద్ద ప్రాకారం, నీళ్లున్న లోతైన కందకం ఉండేవి. అక్కడి ప్రజలు రచనల్లో, గణితంలో ప్రవీణులు. ఆ నగరం వ్యాపార కేంద్రం కూడా అయ్యుంటుంది. ఎందుకంటే పురావస్తు తవ్వకాల్లో అక్కడ చాలా వ్యాపార దస్తావేజులు బయటపడ్డాయి. అక్కడి ఇళ్లు ఇటుకలతో కట్టబడేవి; వాటికి సున్నం వేసిన నున్నటి గోడలు ఉండేవి. కొన్ని ఇళ్లలో పదమూడు నుండి పద్నాలుగు గదులు, ఆవరణ ఉండేవి. ఆవరణలో రాళ్లు పరిచి ఉండేవి.

7. యెహోవా తనను, తన కుటుంబాన్ని కాపాడతాడనే నమ్మకాన్ని అబ్రాహాము ఎందుకు చూపించాలి?

7 యెహోవా తనను, తన కుటుంబాన్ని కాపాడతాడనే నమ్మకాన్ని అబ్రాహాము చూపించాలి. ఎందుకు? అబ్రాహాము శారాలు ఊరు నగరంలో సురక్షితమైన, సౌకర్యవంతమైన ఇంటిని విడిచిపెట్టి, కనానులో ఊరి బయట డేరాలు వేసుకుని నివసిస్తున్నారు. ఇప్పుడు ఆయన, ఆయన కుటుంబం పెద్దపెద్ద గోడల మధ్య, లోతైన కందకాల మధ్య సురక్షితంగా లేరు. వాళ్లకు భద్రత లేదు, శత్రువులు ఎప్పుడైనా వాళ్లమీద దాడి చేయవచ్చు.

8. ఒక సందర్భంలో అబ్రాహాము జీవితంలో ఏం జరిగింది?

8 అబ్రాహాము దేవుని ఇష్టాన్ని చేశాడు. అయితే ఒక సందర్భంలో ఆయన తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. యెహోవా ఆయన్ని ఏ దేశానికి పంపించాడో ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు చాలా తీవ్రంగా ఉండడంతో, అబ్రాహాము తన కుటుంబాన్ని తీసుకుని ఐగుప్తుకు వెళ్లి కొంతకాలం అక్కడే ఉన్నాడు. అప్పుడు ఐగుప్తు రాజైన ఫరో అబ్రాహాము భార్యను తన దగ్గరికి తెప్పించుకున్నాడు. యెహోవా కలగజేసుకోవడంతో ఫరో ఆమెను తిరిగి అబ్రాహాముకు అప్పగించేశాడు. అప్పటివరకు అబ్రాహాము ఎంత ఆందోళన పడివుంటాడో ఊహించండి.—ఆది. 12:10-19.

9. అబ్రాహాముకు కుటుంబ జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

9 అబ్రాహాముకు కుటుంబ జీవితంలో కూడా సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన ప్రియమైన భార్య శారాకు పిల్లలు లేరు. వాళ్లిద్దరు చాలా సంవత్సరాల పాటు ఆ బాధను అనుభవించారు. తర్వాత శారా తన దాసి అయిన హాగరును అబ్రాహాముకు ఇచ్చి ఆమె ద్వారా తనకు, అబ్రాహాముకు పిల్లలు కలగాలని కోరుకుంది. కానీ హాగరు గర్భవతి అయినప్పుడు శారాను హీనంగా చూడడం మొదలుపెట్టింది. అప్పుడు శారా ఆమెను అవమానించింది, దాంతో హాగరు పారిపోయింది.—ఆది. 16:1-6.

10. ఇష్మాయేలు, ఇస్సాకులకు సంబంధించి ఏయే సందర్భాల్లో అబ్రాహాము యెహోవా మీద నమ్మకం ఉంచాల్సి వచ్చింది?

10 చివరికి శారా గర్భవతి అయ్యి అబ్రాహాముకు కుమారుణ్ణి కనింది. అబ్రాహాము అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. అబ్రాహాముకు తన కుమారులైన ఇష్మాయేలు, ఇస్సాకు ఇద్దరూ ఇష్టమే. అయితే ఇష్మాయేలు ఇస్సాకుతో చెడుగా వ్యవహరించినందుకు అబ్రాహాము ఇష్మాయేలును, అతని తల్లి అయిన హాగరును పంపించేయాల్సి వచ్చింది. (ఆది. 21:9-14) కొన్ని సంవత్సరాల తర్వాత, ఇస్సాకును బలిగా అర్పించమని యెహోవా అబ్రాహాముకు చెప్పాడు. (ఆది. 22:1, 2; హెబ్రీ. 11:17-19) ఆ రెండు సందర్భాల్లో, తన కుమారుల విషయంలో యెహోవా చేసిన వాగ్దానాలు నెరవేరతాయని అబ్రాహాము నమ్మకం ఉంచాల్సి వచ్చింది.

11. యెహోవా కోసం ఓపిగ్గా ఎదురుచూడడాన్ని అబ్రాహాము ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది?

11 ఆ సమయమంతట్లో, యెహోవా కోసం ఓపిగ్గా ఎదురుచూడడాన్ని అబ్రాహాము నేర్చుకోవాల్సి వచ్చింది. బహుశా 70 కన్నా ఎక్కువ సంవత్సరాల వయసులో అబ్రాహాము తన కుటుంబాన్ని తీసుకుని ఊరు నుండి బయటికి వచ్చాడు. (ఆది. 11:31–12:4) దాదాపు వంద సంవత్సరాల పాటు ఆయన కనాను దేశంలో ఒక చోటు నుండి ఇంకో చోటుకు మారుతూ డేరాల్లో నివసించాడు. ఆయన 175 సంవత్సరాల వయసులో చనిపోయాడు. (ఆది. 25:7) అబ్రాహాము తిరిగిన దేశాన్ని అతని వంశస్థులకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం నెరవేరడం ఆయన చూడలేదు. అంతేకాదు “నగరం,” అంటే దేవుని రాజ్యం స్థాపించబడడం కూడా ఆయన చూడలేదు. అయినా అబ్రాహాము “మంచి వృద్ధాప్యంలో సంతృప్తితో తుదిశ్వాస విడిచాడు” అని బైబిలు చెప్తుంది. (ఆది. 25:8) ఎన్ని సవాళ్లు ఎదురైనా అబ్రాహాము బలమైన విశ్వాసం చూపించాడు, యెహోవా కోసం సంతోషంగా ఎదురుచూశాడు. ఆయన ఆ సవాళ్లను ఎలా తట్టుకోగలిగాడు? అబ్రాహాము బ్రతికినంత కాలం యెహోవా ఆయన్ని కాపాడాడు, ఒక స్నేహితునిలా చూశాడు.—ఆది. 15:1; యెష. 41:8; యాకో. 2:22, 23.

అబ్రాహాము, శారాల్లా దేవుని సేవకులు విశ్వాసాన్ని, ఓర్పును ఎలా చూపిస్తున్నారు? (12వ పేరా చూడండి) *

12. మనం దేని కోసం ఎదురుచూస్తున్నాం? ఇప్పుడు మనం ఏం పరిశీలిస్తాం?

12 అబ్రాహాములాగే మనం నిజమైన పునాదులుగల నగరం కోసం ఎదురుచూస్తున్నాం. అయితే అది నిర్మించబడడం కోసం మనం ఎదురుచూడట్లేదు. ఎందుకంటే దేవుని రాజ్యం 1914⁠లో స్థాపించబడి, ఇప్పటికే పరలోకంలో పూర్తి అధికారాన్ని పొందింది. (ప్రక. 12:7-10) అయితే అది భూమంతటినీ పరిపాలించే సమయం కోసం మనం ఎదురుచూస్తున్నాం. ఈలోగా మనం అబ్రాహాము శారాల్లాగే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆధునిక కాల యెహోవా సేవకుల్లో అబ్రాహాము లాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అబ్రాహాము శారాల్లాగే నేడు చాలామంది విశ్వాసం, ఓర్పు చూపించారని కావలికోట పత్రికలో వచ్చిన జీవిత కథలు నిరూపిస్తున్నాయి. వాటిలో కొన్నిటిని పరిశీలించి, మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం.

అబ్రాహామును అనుకరించిన వాళ్ల ఉదాహరణలు

బిల్‌ వాల్డెన్‌ ఇష్టపూర్వకంగా త్యాగాలు చేశాడు, యెహోవా ఆశీర్వాదాల్ని పొందాడు

13. సహోదరుడు వాల్డెన్‌ అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

13 త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి. మనం దేవుని నగరానికి అంటే రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వాలంటే, అబ్రాహాములా దేవున్ని సంతోషపెట్టడం కోసం ఇష్టపూర్వకంగా త్యాగాలు చేయాలి. (మత్త. 6:33; మార్కు 10:28-30) బిల్‌ వాల్డెన్‌ అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. * 1942⁠లో ఆయన ఒక అమెరికన్‌ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అప్పుడు ఆయన యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఇంజనీరింగ్‌ పూర్తయ్యేలోపే వాళ్ల ప్రొఫెసర్‌ ఒక ఉద్యోగం చూసి పెట్టాడు, కానీ బిల్‌ దానికి ఒప్పుకోలేదు. మంచి జీతం వచ్చే ఉద్యోగం చేసే బదులు, దేవుని సేవలోనే ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్టు ఆయన వివరించాడు. అయితే కొంతకాలానికే, సైన్యంలో చేరమని ప్రభుత్వం ఆయన్ని ఆదేశించింది. కానీ ఆయన దాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించాడు. దాంతో ఆయనకు పదివేల డాలర్ల జరిమానా, అలాగే ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. మూడేళ్ల తర్వాత ఆయన్ని విడుదల చేశారు. తర్వాత ఆయన గిలియడ్‌ పాఠశాలకు హాజరై, ఆఫ్రికాలో మిషనరీగా సేవచేశాడు. తర్వాత ఆయన ఈవ అనే సహోదరిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్లిద్దరూ కలిసి ఆఫ్రికాలో సేవచేశారు. అందుకోసం వాళ్లు ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత బిల్‌ వాళ్ల అమ్మను చూసుకోవడానికి వాళ్లిద్దరూ అమెరికాకు తిరిగెళ్లారు. ఆయన తన జీవిత కథను ఇలా ముగించాడు: “70 కన్నా ఎక్కువ సంవత్సరాలు తనను సేవించే అవకాశాన్ని యెహోవా నాకిచ్చాడు. దాన్ని గుర్తుచేసుకున్నప్పుడల్లా నా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. నా జీవితాన్ని తన సేవ కోసం ఉపయోగించేలా సహాయం చేసినందుకు నేను తరచూ ఆయనకు కృతజ్ఞతలు చెప్తాను.” మీరు కూడా మీ జీవితాన్ని పూర్తికాల సేవ కోసం ఉపయోగించగలరా?

ఎలెనీ, ఆరిస్టాట్లీస్‌ యెహోవా తమను బలపర్చడాన్ని గుర్తించారు

14-15. సహోదరుడు ఆరిస్టాట్లీస్‌, ఆయన భార్య అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

14 జీవితం కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని అనుకోకండి. తమ జీవితం మొత్తాన్ని యెహోవా సేవకే అంకితం చేసుకున్నవాళ్లకు కూడా కష్టాలు వస్తాయని అబ్రాహాము ఉదాహరణ తెలియజేస్తుంది. (యాకో. 1:2; 1 పేతు. 5:9) ఆరిస్టాట్లీస్‌ ఆపొస్టోలీడీస్‌ అనే సహోదరుని విషయంలో అది నిజమైంది. * ఆయన 1946⁠లో, గ్రీసులో బాప్తిస్మం తీసుకున్నాడు. 1952⁠లో తనలాంటి లక్ష్యాలే ఉన్న ఎలెనీ అనే సహోదరితో ఆయనకు పెళ్లి నిశ్చయమైంది. అయితే ఎలెనీ అనారోగ్యం పాలైంది, ఆమెకు మెదడులో కణితి (ట్యూమర్‌) ఉందని తేలింది. ఆపరేషన్‌ చేసి ఆ కణితిని తీసేసినా, వాళ్లకు పెళ్లయిన కొన్నేళ్లకే అది మళ్లీ వచ్చింది. డాక్టర్లు మళ్లీ ఆపరేషన్‌ చేశారు కానీ ఆమెకు కొద్దిగా పక్షవాతం వచ్చింది, మాట్లాడే సామర్థ్యం తగ్గిపోయింది. అనారోగ్యం, ప్రభుత్వ నిషేధం ఉన్నా ఆమె పరిచర్యను ఉత్సాహంగా చేసింది.

15 ఆరిస్టాట్లీస్‌ 30 సంవత్సరాల పాటు తన భార్యను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ సమయమంతట్లో ఆయన సంఘ పెద్దగా, సమావేశ కమిటీ సభ్యునిగా సేవచేశాడు. అంతేకాదు ఒక సమావేశ హాలు నిర్మాణంలో సహాయం చేశాడు. తర్వాత 1987⁠లో ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు ఎలెనీ ఒక ప్రమాదంలో గాయపడింది. దానివల్ల ఆమె మూడు సంవత్సరాలు కోమాలో ఉండి చనిపోయింది. ఆరిస్టాట్లీస్‌ తన జీవిత కథంతా చెప్పి, చివర్లో ఇలా అన్నాడు: ‘ఎంతో కష్టమైన పరిస్థితుల్ని, సవాళ్లను, అనుకోని సంఘటనల్ని నేను చాలా సంవత్సరాల పాటు ఎదుర్కొన్నాను. వాటిని తట్టుకోవడానికి ధైర్యం, పట్టుదల అవసరమయ్యాయి. అయినా, సమస్యల్ని అధిగమించడానికి కావల్సిన బలాన్ని యెహోవా నాకు ఎప్పుడూ ఇస్తూనే వచ్చాడు.’ (కీర్త. 94:18, 19) సమస్యలున్నా తన సేవలో చేయగలిగినదంతా చేస్తున్న వాళ్లను యెహోవా ఎంతో ప్రేమిస్తాడు!

ఓడ్రీ హైడ్‌ భవిష్యత్తు నిరీక్షణ మీదే మనసుపెట్టింది

16. సహోదరుడు నార్‌ తన భార్యకు ఏ మంచి సలహా ఇచ్చాడు?

16 భవిష్యత్తు మీద మనసుపెట్టండి. యెహోవా భవిష్యత్తులో ఇచ్చే దీవెనల మీద అబ్రాహాము మనసుపెట్టాడు, దానివల్ల తనకు ఎదురైన సమస్యల్ని సహించగలిగాడు. సహోదరి ఓడ్రీ హైడ్‌ కూడా అబ్రాహాములాగే భవిష్యత్తు నిరీక్షణ మీద మనసుపెట్టడానికి కృషి చేసింది. * ఆమె మొదటి భర్త నేథన్‌ హెచ్‌. నార్‌ కాన్సర్‌తో చనిపోయాడు, రెండో భర్త గ్లెన్‌ హైడ్‌కు అల్జీమర్స్‌ వ్యాధి వచ్చింది. సహోదరుడు నార్‌ చనిపోవడానికి కొన్ని వారాల ముందు అన్న మాటలు తనకెంతో సహాయం చేశాయని చెప్తూ, ఆమె ఇలా అంది: ‘మరణం తర్వాత మన నిరీక్షణ నిజమౌతుందని, మనం మళ్లీ ఎప్పుడూ బాధ అనుభవించమని నేథన్‌ నాకు గుర్తుచేశాడు. అంతేకాదు “ముందుకు చూడు, అక్కడే నీ బహుమానం ఉంది. . . . పనిలో నిమగ్నమై ఇతరుల కోసం ఏదైనా చేయడానికి నీ జీవితం ఉపయోగించు. జీవించడంలో ఉన్న ఆనందాన్ని కనుగొనడానికి ఇది నీకు సహాయం చేస్తుంది” అని నన్ను ప్రోత్సహించాడు.’ ఇతరులకు మంచి చేస్తూ బిజీగా ఉండమని, ‘నిరీక్షణను బట్టి సంతోషించమని’ ఆయన చెప్పిన సలహా ఎంత మంచిదో కదా!—రోమా. 12:12.

17. (ఎ) భవిష్యత్తు మీద మనసుపెట్టడానికి మనకు ఏ కారణాలు ఉన్నాయి? (బి) భవిష్యత్తు ఆశీర్వాదాల్ని పొందడానికి మీకా 7:7⁠లోని మాటలు మనకెలా సహాయం చేస్తాయి?

17 భవిష్యత్తు మీద మనసుపెట్టడానికి మనకు ఇప్పుడు ఎక్కువ కారణాలు ఉన్నాయి. మనం చివరి రోజుల ముగింపులో జీవిస్తున్నామని ప్రపంచ సంఘటనలు స్పష్టంగా చూపిస్తున్నాయి. అతి త్వరలో నిజమైన పునాదులుగల నగరం భూమంతటినీ పరిపాలిస్తుంది. అప్పుడు మనం అనుభవించే ఎన్నో ఆశీర్వాదాల్లో ఒకటి, తిరిగి బ్రతికిన మన ప్రియమైన వాళ్లను సంతోషంగా ఆహ్వానించడం. భూమ్మీద జీవించేలా అబ్రాహామును, ఆయన కుటుంబాన్ని తిరిగి బ్రతికించడం ద్వారా యెహోవా ఆయన విశ్వాసానికి, ఓర్పుకు ప్రతిఫలమిస్తాడు. వాళ్లకు స్వాగతం పలకడానికి మీరు అక్కడ ఉంటారా? ఒకవేళ మీరు అబ్రాహాములా దేవుని రాజ్యం కోసం ఇష్టపూర్వకంగా త్యాగాలు చేస్తే, సమస్యలు వచ్చినా విశ్వాసాన్ని బలంగా ఉంచుకుంటే, యెహోవా కోసం ఓపిగ్గా వేచివుంటే మీరు అక్కడ ఉండవచ్చు.—మీకా 7:7 చదవండి.

పాట 74 రండి, రాజ్య గీతం పాడదాం!

^ పేరా 5 ఏదైనా వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురుచూస్తున్నప్పుడు మన ఓర్పుకు, కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. అబ్రాహాము ఉదాహరణ నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? యెహోవా వాగ్దానాల నెరవేర్పు కోసం ఓపిగ్గా వేచి ఉండడానికి అవి మనకెలా సహాయం చేస్తాయి? కొందరు ఆధునిక కాల యెహోవా సేవకులు మనకు ఎలాంటి ఆదర్శం ఉంచారు?

^ పేరా 13 సహోదరుడు వాల్డెన్‌ జీవిత కథ డిసెంబరు 1, 2013, కావలికోట (ఇంగ్లీషు) పత్రిక 8-10 పేజీల్లో వచ్చింది.

^ పేరా 14 సహోదరుడు ఆరిస్టాట్లీస్‌ జీవిత కథ ఫిబ్రవరి 1, 2002, కావలికోట పత్రిక 24-28 పేజీల్లో వచ్చింది.

^ పేరా 16 సహోదరి హైడ్‌ జీవిత కథ జూలై 1, 2004, కావలికోట పత్రిక 23-29 పేజీల్లో వచ్చింది.

^ పేరా 56 చిత్రాల వివరణ: ఒక వృద్ధ జంట సమస్యలున్నా యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతున్నారు. భవిష్యత్తు గురించి యెహోవా చేసిన వాగ్దానాల మీద మనసుపెడుతూ వాళ్లు తమ విశ్వాసాన్ని బలంగా ఉంచుకుంటున్నారు.