కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 35

యెహోవా సంఘంలో ప్రతీఒక్కర్ని విలువైన వాళ్లుగా చూడండి

యెహోవా సంఘంలో ప్రతీఒక్కర్ని విలువైన వాళ్లుగా చూడండి

“కన్ను చెయ్యితో, ‘నువ్వు నాకు అవసరం లేదు’ అని అనలేదు.అలాగే తల పాదాలతో, ‘మీరు నాకు అవసరం లేదు’ అని అనలేదు.”—1 కొరిం. 12:21.

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా తన నమ్మకమైన సేవకుల్లో ప్రతీఒక్కరికి ఏం ఇచ్చాడు?

యెహోవా ప్రేమతో తన నమ్మకమైన సేవకుల్లో ప్రతీఒక్కరికి సంఘంలో ఒక స్థానం ఇచ్చాడు. సంఘంలో వేర్వేరు పనులు చేస్తున్నా మనందరం విలువైన వాళ్లమే, అందరికీ తోటివాళ్ల అవసరం ఉంది. ఈ ప్రాముఖ్యమైన పాఠాన్ని గుర్తించేలా అపొస్తలుడైన పౌలు మనకు సహాయం చేస్తున్నాడు. ఎలా?

2. ఎఫెసీయులు 4:16 ప్రకారం, మనం ఎందుకు ఒకరినొకరం విలువైన వాళ్లుగా చూడాలి, కలిసిమెలిసి పనిచేయాలి?

2 ఈ ఆర్టికల్‌ ముఖ్య వచనంలో పౌలు ఒక విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. అదేంటంటే మనలో ఎవ్వరమూ తోటి యెహోవా సేవకునితో, “నువ్వు నాకు అవసరం లేదు” అని అనకూడదు. (1 కొరిం. 12:21) సంఘంలో శాంతి సమాధానాలు ఉండాలంటే, మనం ఒకరినొకరం విలువైన వాళ్లుగా చూడాలి, కలిసిమెలిసి పనిచేయాలి. (ఎఫెసీయులు 4:16 చదవండి.) మనం కలిసికట్టుగా పనిచేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది, ప్రేమలో బలపడుతుంది.

3. ఈ ఆర్టికల్‌లో ఏం చర్చిస్తాం?

3 మనం ఏయే విధాలుగా సంఘంలోని తోటి క్రైస్తవుల పట్ల గౌరవం చూపించవచ్చు? ఈ ఆర్టికల్‌లో సంఘ పెద్దలు తోటి పెద్దల పట్ల ఎలా గౌరవం చూపించవచ్చో తెలుసుకుంటాం. తర్వాత, మనందరం పెళ్లికాని సహోదర సహోదరీల్ని విలువైన వాళ్లుగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చో పరిశీలిస్తాం. అంతేకాదు, మన భాష అంతగా మాట్లాడలేని వాళ్ల పట్ల ఎలా గౌరవం చూపించవచ్చో నేర్చుకుంటాం.

తోటి పెద్దల పట్ల గౌరవం చూపించండి

4. రోమీయులు 12:10 లో పౌలు ఇచ్చిన ఏ సలహాను సంఘ పెద్దలు పాటించాలి?

4 సంఘంలోని పెద్దలందరూ యెహోవా పవిత్రశక్తితో నియమించబడిన వాళ్లే. అయినా వాళ్లలో ప్రతీఒక్కరికి వేర్వేరు వరాలు, సామర్థ్యాలు ఉంటాయి. (1 కొరిం. 12:17, 18) కొంతమంది ఈమధ్యే పెద్దగా నియమించబడి ఉండవచ్చు, మిగతావాళ్లతో పోలిస్తే వాళ్లకు తక్కువ అనుభవం ఉండవచ్చు. ఇంకొంతమంది వయసు పైబడడం వల్ల, అనారోగ్య సమస్యల వల్ల సంఘంలో ఎక్కువగా పని చేయలేకపోవచ్చు. అయినప్పటికీ ఏ సంఘ పెద్దా తోటి సంఘ పెద్దల్లో ఎవ్వర్నీ, “మీరు నాకు అవసరం లేదు” అన్నట్టు చూడకూడదు. బదులుగా, ప్రతీ సంఘ పెద్ద రోమీయులు 12:10 లో పౌలు ఇచ్చిన సలహాను పాటించాలి.—చదవండి.

పెద్దలు తమ తోటి పెద్దలు చెప్పేది జాగ్రత్తగా వినడం ద్వారా వాళ్ల పట్ల గౌరవం చూపిస్తారు (5-6 పేరాలు చూడండి)

5. తోటి పెద్దల్ని గౌరవిస్తున్నామని పెద్దలు ఎలా చూపిస్తారు? అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

5 పెద్దలు తమ తోటి పెద్దలు చెప్పేది జాగ్రత్తగా వినడం ద్వారా వాళ్ల పట్ల గౌరవం చూపిస్తారు. ముఖ్యమైన విషయాల్ని చర్చించడానికి పెద్దల సభ కలుసుకున్నప్పుడు అలా గౌరవం చూపించడం మరింత అవసరం. ఎందుకు? అక్టోబరు 1, 1988 కావలికోట (ఇంగ్లీషు) పత్రిక ఇలా చెప్పింది: “ఫలానా పరిస్థితిలో ఏం చేయాలో లేదా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలో పెద్దల సభ మాట్లాడుకుంటున్నప్పుడు, అందుకు ఉపయోగపడే బైబిలు సూత్రాన్ని చెప్పేలా పవిత్రశక్తి ద్వారా క్రీస్తు ఏ పెద్దనైనా నిర్దేశించగలడని పెద్దలు గుర్తిస్తారు. (అపొ. 15:6-15) పవిత్రశక్తి పెద్దల సభలో ఒక్కరి మీదే కాదుగానీ, అందరి మీదా పనిచేస్తుంది.”

6. పెద్దలు ఎలా కలిసికట్టుగా పనిచేయవచ్చు? దానివల్ల సంఘం ఎలా ప్రయోజనం పొందుతుంది?

6 ఒక పెద్దకు తోటి పెద్దల మీద గౌరవం ఉంటే, పెద్దల కూటంలో ఎప్పుడూ తనే ముందు మాట్లాడాలని అనుకోడు. తనే ఎక్కువసేపు మాట్లాడాలని చూడడు, అన్నిసార్లూ తన అభిప్రాయమే సరైనదని అనుకోడు. బదులుగా తన అభిప్రాయాన్ని వినయంతో, అణకువతో చెప్తాడు. మిగతా పెద్దలు చెప్పేవాటిని జాగ్రత్తగా వింటాడు. మరిముఖ్యంగా బైబిలు సూత్రాల్ని చర్చించడానికి, “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఇచ్చే నిర్దేశాన్ని పాటించడానికి ముందుంటాడు. (మత్త. 24:45-47) పెద్దలు ప్రేమ, గౌరవం చూపించుకుంటూ విషయాల్ని చర్చించినప్పుడు వాళ్లమీద పవిత్రశక్తి పని చేస్తుంది, సంఘాన్ని బలపర్చే నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేస్తుంది.—యాకో. 3:17, 18.

పెళ్లికాని క్రైస్తవుల పట్ల గౌరవం చూపించండి

7. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడాన్ని యేసు ఎలా చూశాడు?

7 నేడు మన సంఘాల్లో పెళ్లయిన వాళ్లు, పెళ్లయి పిల్లలున్న వాళ్లు ఉన్నారు. అంతేకాదు, పెళ్లికాని సహోదర సహోదరీలు కూడా చాలామంది ఉన్నారు. ఒంటరి సహోదర సహోదరీల్ని మనం ఎలా చూడాలి? పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడాన్ని యేసు ఎలా చూశాడో పరిశీలించండి. యేసు భూమ్మీద పరిచర్య చేసినప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఆయన ఒంటరిగానే ఉండి, తనకు అప్పగించిన పనిమీదే మనసుపెడుతూ తన సమయాన్ని పరిచర్య కోసం ఉపయోగించాడు. క్రైస్తవులు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనో, చేసుకోకూడదనో యేసు ఎప్పుడూ చెప్పలేదు. అయితే, కొంతమంది క్రైస్తవులు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయించుకుంటారని యేసు చెప్పాడు. (మత్త. 19:11, 12) పెళ్లి చేసుకోని వాళ్లను యేసు గౌరవించాడు. ఆయన వాళ్లను చిన్నచూపు చూడలేదు, వాళ్లకు జీవితంలో ఏదో తక్కువైనట్టు మాట్లాడలేదు.

8. మొదటి కొరింథీయులు 7:7-9 లో పౌలు దేని గురించి ఆలోచించమని క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు?

8 యేసులాగే అపొస్తలుడైన పౌలు కూడా అవివాహితునిగానే పరిచర్య చేశాడు. క్రైస్తవులు పెళ్లి చేసుకోవడం తప్పని పౌలు ఎప్పుడూ చెప్పలేదు. అది వ్యక్తిగత విషయమని ఆయనకు తెలుసు. అయినా, పెళ్లి చేసుకోకుండానే యెహోవాను సేవించగలరేమో ఆలోచించమని ఆయన క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (1 కొరింథీయులు 7:7-9 చదవండి.) పెళ్లి చేసుకోని క్రైస్తవుల్ని ఆయన చిన్నచూపు చూడలేదు. బదులుగా యెహోవా సేవలో ముఖ్యమైన పనులు చేయడానికి ఒంటరి సహోదరుడూ యువకుడూ అయిన తిమోతిని ఎంచుకున్నాడు. * (ఫిలి. 2:19-22) కేవలం ఒక సహోదరుడు పెళ్లి చేసుకున్నాడా లేదా అనే దాన్నిబట్టి అతను ఎక్కువ అర్హుడు, తక్కువ అర్హుడు అని అనలేం.—1 కొరిం. 7:32-35, 38.

9. పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం మీద మనకు ఎలాంటి అభిప్రాయం ఉండాలి?

9 క్రైస్తవులు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని లేదా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని యేసు గానీ, పౌలు గానీ చెప్పలేదు. మరి పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం మీద మనకు ఎలాంటి అభిప్రాయం ఉండాలి? దీనికి అక్టోబరు 1, 2012 కావలికోట (ఇంగ్లీషు) పత్రిక చక్కని జవాబిచ్చింది: “నిజానికి [పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం] రెండూ దేవుడిచ్చిన వరాలే అని చెప్పవచ్చు. . . . యెహోవా దృష్టిలో పెళ్లి చేసుకోకపోవడం అనేది సిగ్గుపడాల్సిన లేదా బాధపడాల్సిన విషయం కాదు.” దీన్ని మనసులో ఉంచుకుని, సంఘంలో ఉన్న ఒంటరి సహోదర సహోదరీల్ని మనం గౌరవించాలి.

ఒంటరి క్రైస్తవుల మీద గౌరవం ఉంటే, మనం ఏం చేయం? (10వ పేరా చూడండి)

10. మనం ఒంటరి సహోదర సహోదరీల్ని గౌరవిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

10 మనం ఒంటరి సహోదర సహోదరీల భావాల్ని గౌరవిస్తున్నామని, వాళ్ల పరిస్థితుల్ని అర్థం చేసుకున్నామని ఎలా చూపించవచ్చు? కొంతమంది క్రైస్తవులు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారని మనం గుర్తుంచుకోవాలి. ఇంకొంతమంది క్రైస్తవులకు పెళ్లి చేసుకోవాలని ఉన్నా, సరైన జత దొరికి ఉండకపోవచ్చు. ఇంకొందరు క్రైస్తవుల విషయానికొస్తే, వాళ్ల భర్త లేదా భార్య చనిపోయి ఉండవచ్చు. ఏదేమైనా, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదని గానీ సంబంధం చూడమంటారా అని గానీ మనం వాళ్లను అడగాల్సిన అవసరం ఉందా? నిజమే, కొంతమంది ఒంటరి సహోదర సహోదరీలు మన సహాయం అడగవచ్చు. కానీ వాళ్లు సహాయం అడక్కుండానే మనం చొరవ తీసుకుంటే వాళ్లకెలా అనిపించవచ్చు? (1 థెస్స. 4:11; 1 తిమో. 5:13) నమ్మకంగా సేవచేస్తున్న కొందరు ఒంటరి సహోదర సహోదరీలు ఏమంటున్నారో పరిశీలిద్దాం.

11-12. మనం ఒంటరి క్రైస్తవుల్ని ఎలా నిరుత్సాహపర్చే ప్రమాదం ఉంది?

11 ప్రాంతీయ పర్యవేక్షకునిగా తన నియామకాన్ని సమర్థవంతంగా చేస్తున్న ఒక ఒంటరి సహోదరుడు, పెళ్లి చేసుకోకుండా ఉండడంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించాడు. కానీ సహోదర సహోదరీలు మంచి ఉద్దేశంతోనే, “మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు?” అని అడిగినప్పుడు తనకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నాడు. బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్న ఒక ఒంటరి సహోదరుడు ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు సహోదర సహోదరీలు పెళ్లి చేసుకోనివాళ్లను జాలిగా చూస్తారు. దానివల్ల పెళ్లి చేసుకోకుండా ఉండడం వరంగా కాకుండా భారంగా అనిపిస్తుంది.”

12 బెతెల్‌లో సేవచేస్తున్న ఒక ఒంటరి సహోదరి ఇలా చెప్పింది: “పెళ్లికాని వాళ్లందరూ వివాహజత కోసం వెతుకుతుంటారని, పదిమందితో కలిసే ప్రతీ సందర్భాన్ని వివాహజతను వెతుక్కునే అవకాశంలా చూస్తారని కొంతమంది అనుకుంటారు. ఒకరోజు నేను బెతెల్‌ పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లాను. అక్కడ నేను ఒక సహోదరి ఇంట్లో ఉన్నాను. ఆరోజు సాయంత్రం వాళ్ల మీటింగ్‌కు వెళ్లాను. ఆ సహోదరి నా వయసున్న ఇద్దరు సహోదరులు వాళ్ల సంఘంలో ఉన్నారని చెప్పింది. తను నాకు సంబంధాలు చూడను అని హామీ ఇచ్చింది. కానీ, రాజ్యమందిరంలోకి అడుగుపెట్టగానే నన్ను ఆ ఇద్దరు సహోదరుల దగ్గరికి లాక్కెళ్లింది. అప్పుడు మా ముగ్గురికి చాలా ఇబ్బందిగా అనిపించింది.”

13. ఒక ఒంటరి సహోదరి ఎవరి అనుభవం నుండి ప్రోత్సాహం పొందింది?

13 బెతెల్‌లో సేవచేస్తున్న మరో ఒంటరి సహోదరి ఇలా చెప్పింది: “పెద్దవయసు ఉన్న కొంతమంది ఒంటరి పయినీర్లు నాకు తెలుసు. వాళ్లు సమతుల్యంగా ఉంటూ, మంచి లక్ష్యాలు పెట్టుకుని, ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు, సంతోషంగా సేవచేస్తారు. వాళ్ల నుండి సంఘం ఎంతో ప్రయోజనం పొందుతుంది. పెళ్లి చేసుకోకుండా ఉండడం మీద వాళ్లకు సరైన అభిప్రాయం ఉంది. వాళ్లు ఒంటరిగా ఉన్నందుకు తామే గొప్పవాళ్లమని అనుకోరు లేదా తమకు వివాహజత, పిల్లలు లేనందుకు బాధపడరు.” ఒకరినొకరు గౌరవించే, విలువైన వాళ్లుగా ఎంచే అలాంటి సంఘంలో ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుంది. ఎవరూ తోటి క్రైస్తవుల్ని జాలిగా చూడరు లేదా ఈర్ష్యపడరు, చిన్నచూపు చూడరు లేదా ఆకాశానికి ఎత్తేయరు, బదులుగా ప్రేమ చూపిస్తారు.

14. ఒంటరి క్రైస్తవుల పట్ల మనమెలా గౌరవం చూపించవచ్చు?

14 పెళ్లయిందా లేదా అనేదాన్ని బట్టి కాకుండా, వాళ్ల మంచి లక్షణాల్ని బట్టి విలువైన వాళ్లుగా చూసినప్పుడు ఒంటరి సహోదర సహోదరీలు సంతోషిస్తారు. వాళ్లమీద జాలిపడే బదులు, యెహోవాకు నమ్మకంగా ఉంటున్నందుకు వాళ్లను మెచ్చుకోవాలి. అలా చేయడం ద్వారా, “మీరు నాకు అవసరం లేదు” అనే భావనను వాళ్లలో కలిగించకుండా ఉంటాం. (1 కొరిం. 12:21) అప్పుడు మనం వాళ్లను గౌరవిస్తున్నామని, విలువైన వాళ్లుగా ఎంచుతున్నామని వాళ్లు గుర్తిస్తారు.

మీ భాషను అంతగా మాట్లాడలేని వాళ్ల పట్ల గౌరవం చూపించండి

15. పరిచర్య ఇంకా ఎక్కువ చేయడానికి కొంతమంది ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు?

15 ఈమధ్య కాలంలో, చాలామంది ప్రచారకులు పరిచర్య ఇంకా ఎక్కువ చేయడానికి వేరే భాషను నేర్చుకోవాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అందుకోసం వాళ్లు ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వాళ్లు తమ మాతృభాష మాట్లాడే సంఘాన్ని విడిచిపెట్టి, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న వేరే భాషా సంఘంలో సేవ చేయడానికి వెళ్లారు. (అపొ. 16:9) ఆ విధంగా యెహోవా సేవను ఇంకా ఎక్కువగా చేయాలని వాళ్లు వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నారు. కొత్త భాషను స్పష్టంగా మాట్లాడడానికి వాళ్లకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, అయినప్పటికీ సంఘానికి వాళ్లు ఎన్నో విధాలుగా సహాయం చేస్తారు. వాళ్ల మంచి లక్షణాలు, అనుభవం సంఘాన్ని బలపరుస్తాయి. త్యాగాలు చేయడానికి ఇష్టపడే ఈ సహోదర సహోదరీల్ని మనం విలువైన వాళ్లుగా చూస్తాం!

16. పెద్దల సభ దేన్నిబట్టి సహోదరుల్ని పెద్దలుగా, సంఘ పరిచారకులుగా సిఫారసు చేస్తుంది?

16 కేవలం తమ భాషను స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడనే కారణాన్ని బట్టి ఒక సహోదరుణ్ణి పెద్దగా లేదా సంఘ పరిచారకునిగా సిఫారసు చేయడానికి పెద్దల సభ వెనకాడదు. పెద్దలకు, సంఘ పరిచారకులకు సంబంధించి బైబిల్లో ఉన్న అర్హతల్ని బట్టే పెద్దల సభ ఒక సహోదరుణ్ణి సిఫారసు చేస్తుంది. అంతేగానీ అతను స్థానిక సంఘ భాషను ఎంత బాగా మాట్లాడుతున్నాడనే దాన్నిబట్టి కాదు.—1 తిమో. 3:1-10, 12, 13; తీతు 1:5-9.

17. వేరేదేశానికి వెళ్లినప్పుడు కొన్ని కుటుంబాలు ఎలాంటి ప్రశ్నల గురించి ఆలోచించాల్సి వస్తుంది?

17 కొంతమంది క్రైస్తవులు తమ కుటుంబాన్ని తీసుకుని వేరేదేశానికి శరణార్థులుగా వెళ్లారు. ఇంకొందరు ఉద్యోగం కోసం వేరేదేశానికి వెళ్లారు. అక్కడ వాళ్ల పిల్లలు ఆ కొత్త దేశంలోని భాషలో చదువుకుంటుండవచ్చు. తల్లిదండ్రులు కూడా ఉద్యోగం కోసం ఆ దేశ భాషను నేర్చుకోవాల్సి రావచ్చు. ఒకవేళ అక్కడ వాళ్ల మాతృభాషా సంఘం లేదా గ్రూపు ఉంటే అప్పుడేంటి? ఆ కుటుంబం ఏ సంఘానికి వెళ్లాలి? ఆ దేశ భాష మాట్లాడే సంఘానికా, వాళ్ల మాతృభాషా సంఘానికా?

18. గలతీయులు 6:5 ప్రకారం, కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం పట్ల మనమెలా గౌరవం చూపించవచ్చు?

18 తన కుటుంబం ఏ సంఘానికి వెళ్లాలో కుటుంబ పెద్ద నిర్ణయించాలి. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి, తన కుటుంబానికి ఏది మంచిదో ఆయన ఆలోచించాలి. (గలతీయులు 6:5 చదవండి.) కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనం దాన్ని గౌరవిద్దాం, వాళ్లు మన సంఘానికి వస్తే ప్రేమపూర్వకంగా స్వీకరిద్దాం.—రోమా. 15:7.

19. కుటుంబ పెద్ద దేని గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాలి?

19 కొన్ని కుటుంబాలు తల్లిదండ్రుల మాతృభాషా సంఘానికి వెళ్తుండవచ్చు, కానీ వాళ్ల పిల్లలకు ఆ భాష అంతగా రాకపోవచ్చు. ఒకవేళ ఆ సంఘం ఆ దేశ భాష మాట్లాడే ప్రాంతంలో ఉంటే, పిల్లలకు మీటింగ్స్‌లో చెప్పేవి అంతగా అర్థం కాకపోవచ్చు, ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేకపోవచ్చు. ఎందుకు? ఎందుకంటే, వాళ్లు స్కూల్లో తమ తల్లిదండ్రుల మాతృభాషలో కాకుండా ఆ దేశ భాషలో చదువుకుంటుండవచ్చు. అలాంటప్పుడు తమ పిల్లలు యెహోవాకు, ఆయన ప్రజలకు మరింత దగ్గరవ్వడానికి ఏం చేస్తే బావుంటుందో కుటుంబ శిరస్సులు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాలి. వాళ్లు తమ మాతృభాషను స్పష్టంగా మాట్లాడేలా పిల్లలకు సహాయం చేయాలి లేదా పిల్లలకు బాగా అర్థమయ్యే భాషా సంఘానికి వెళ్లడం మంచిదేమో ఆలోచించాలి. కుటుంబ పెద్ద ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్లు వెళ్లే సంఘం ఆయన్ని, ఆయన కుటుంబాన్ని గౌరవించాలి, విలువైన వాళ్లుగా చూడాలి.

కొత్త భాష నేర్చుకుంటున్న వాళ్ల పట్ల ఎలా గౌరవం చూపించవచ్చు? (20వ పేరా చూడండి)

20. కొత్త భాష నేర్చుకుంటున్న సహోదర సహోదరీల పట్ల ఎలా గౌరవం చూపించవచ్చు?

20 పైన చర్చించుకున్న కారణాల్ని బట్టి, కొత్త భాష నేర్చుకోవడానికి కృషి చేస్తున్న సహోదర సహోదరీలు చాలా సంఘాల్లో ఉన్నారు. వాళ్ల ఆలోచనల్ని స్పష్టంగా తెలియజేయడానికి వాళ్లు కష్టపడుతుండవచ్చు. కొత్త భాషను వాళ్లు ఎలా మాట్లాడుతున్నారు అనేదాన్ని పక్కనపెడితే, యెహోవా మీద వాళ్లకున్న ప్రేమ, ఆయన సేవచేయాలనే వాళ్ల కోరిక మనకు కనిపిస్తాయి. ఈ చక్కని లక్షణాల్ని చూసినప్పుడు, మనం వాళ్లను ఎంతో విలువైన వాళ్లుగా ఎంచుతాం, గౌరవిస్తాం. కేవలం వాళ్లు మన భాషను స్పష్టంగా మాట్లాడలేనంత మాత్రాన, “మీరు నాకు అవసరం లేదు” అని అనం.

మనం యెహోవాకు విలువైన వాళ్లం

21-22. మనకు ఏ అమూల్యమైన అవకాశం దొరికింది?

21 తన సంఘంలో సేవచేసే అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మనం యెహోవాకు ఎంతో కృతజ్ఞులం. మనం సహోదరులమైనా సహోదరీలమైనా, పెళ్లయినా కాకపోయినా, యౌవనులమైనా వృద్ధులమైనా, ఫలానా భాష మనకు బాగా వచ్చినా అస్సలు రాకపోయినా అందరం యెహోవాకు, సంఘానికి విలువైన వాళ్లమే.—రోమా. 12:4, 5; కొలొ. 3:10, 11.

22 పౌలు చెప్పిన ఉదాహరణ నుండి నేర్చుకున్న ఎన్నో అద్భుతమైన విషయాల్ని పాటిస్తూ ఉందాం. అలా చేస్తే, యెహోవా సంఘంలో మన స్థానాన్ని, తోటివాళ్ల స్థానాన్ని మరింత విలువైనదిగా ఎంచుతాం.

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

^ పేరా 5 యెహోవా ప్రజల్లో వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినవాళ్లు ఉంటారు. వాళ్లు సంఘంలో వేర్వేరు పనులు చేస్తుంటారు. యెహోవా కుటుంబంలో ప్రతీఒక్కర్ని విలువైన వాళ్లుగా చూడడం ఎందుకు ప్రాముఖ్యమో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

^ పేరా 8 తిమోతి జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయాడని మనం ఖచ్చితంగా చెప్పలేం.