కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 36

మనుషుల్ని పట్టే జాలరిగా అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

మనుషుల్ని పట్టే జాలరిగా అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

“భయపడకు. ఇప్పటినుండి నువ్వు మనుషుల్ని పట్టే జాలరిగా ఉంటావు.”—లూకా 5:10.

పాట 73 మాకు ధైర్యాన్నివ్వు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యేసు నలుగురు జాలర్లకు ఏ ఆహ్వానం ఇచ్చాడు? వాళ్లు ఏం చేశారు?

పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులు వృత్తిరీత్యా జాలర్లు. “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా * చేస్తాను” అని యేసు వాళ్లను ఆహ్వానించినప్పుడు వాళ్లెంత ఆశ్చర్యపోయి ఉంటారో ఒకసారి ఊహించండి. అప్పుడు వాళ్లు ఏం చేశారు? బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లు వెంటనే తమ వలలు వదిలేసి ఆయన వెంట వెళ్లారు.” (మత్త. 4:18-22) ఆ నిర్ణయం వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక వాళ్లు చేపలు పట్టే బదులు ‘మనుషుల్ని పట్టే జాలర్లుగా’ ఉంటారు. (లూకా 5:10) నేడు కూడా, సత్యాన్ని ప్రేమించే మంచి మనసున్న వాళ్లను యేసు ఆహ్వానిస్తున్నాడు. (మత్త. 28:19, 20) మనుషుల్ని పట్టే జాలరిగా అవ్వమని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని మీరు అంగీకరించారా?

2. మనుషుల్ని పట్టే జాలర్లు అవ్వాలనే నిర్ణయం గురించి మనం ఎందుకు జాగ్రత్తగా ఆలోచించాలి? ఆ నిర్ణయం తీసుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

2 బహుశా మీరు కొంతకాలంగా బైబిలు స్టడీ తీసుకుంటూ, మీ జీవితంలో మార్పులు చేసుకొని ఉండవచ్చు. ఇప్పుడు మీరు ప్రచారకుడు అవ్వాలో వద్దో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే, మీరు యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించాలో వద్దో తేల్చుకోలేకపోతుంటే నిరుత్సాహపడకండి. ఆ నిర్ణయం ఎంత ప్రాముఖ్యమైందో గ్రహించారు కాబట్టే మీరలా వెనకాడుతుండవచ్చు. నిజమే పేతురు, ఆయన సహచరులు తమ వలల్ని “వెంటనే” వదిలేశారని బైబిలు చెప్తుంది. అయితే వాళ్లు తీసుకున్నది తొందరపాటు నిర్ణయం కాదు. వాళ్లు ఆరు కన్నా ఎక్కువ నెలల క్రితమే యేసు గురించి తెలుసుకుని, ఆయన్ని మెస్సీయగా అంగీకరించారు. (యోహా. 1:35-42) అదేవిధంగా మీరు కూడా యెహోవా గురించి, యేసు గురించి ఇప్పటికే చాలా విషయాలు నేర్చుకుని, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటుండవచ్చు. కానీ ప్రచారకులు అవ్వాలని నిర్ణయించుకునే ముందు మీరు దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. పేతురుకు, అంద్రెయకు, ఇతరులకు ఆ నిర్ణయం తీసుకునేలా ఏది సహాయం చేసింది?

3. యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించడానికి మీకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?

3 యేసు మొదటి శిష్యులకు చేపలు పట్టే పని మీద ప్రేమ, ఆ పని చేయడానికి కావాల్సిన జ్ఞానం, ధైర్యం, క్రమశిక్షణ ఉన్నాయి. మనుషుల్ని పట్టే పనిని సమర్థవంతంగా చేయడానికి కూడా వాళ్లకు ఆ నాలుగు లక్షణాలు సహాయం చేసి ఉంటాయి. మంచివార్తను చక్కగా ప్రకటించడానికి, ఇతరులకు బోధించడానికి ఆ లక్షణాలు మీకు కూడా సహాయం చేస్తాయి. వాటిని ఎలా అలవర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

ప్రకటనా పని మీద ప్రేమ పెంచుకోండి

పేతురు, ఆయన సహచరులు మనుషుల్ని పట్టే జాలర్లు అయ్యారు. ఈ ప్రాముఖ్యమైన పని మనకాలంలో కూడా కొనసాగుతోంది (4-5 పేరాలు చూడండి)

4. పేతురు చేపలు పట్టే పనిని ఎందుకు చేసేవాడు?

4 పేతురు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చేపలు పట్టేవాడు. అది ఆయనకు కేవలం వృత్తి మాత్రమే కాదు, ఆయన ఆ పనిని ప్రేమించి ఉంటాడు. (యోహా. 21:3, 9-15) మనుషుల్ని పట్టే పనిని కూడా ఆయన ప్రేమించాడు. యెహోవా సహాయంతో పేతురు ఆ పనిలో మంచి నైపుణ్యం సంపాదించాడు.—అపొ. 2:14, 41.

5. లూకా 5:8-11 ప్రకారం, పేతురు భయానికి కారణం ఏంటి? మనకున్న ఆందోళనల్ని అధిగమించడానికి ఏది సహాయం చేస్తుంది?

5 మనం ప్రకటనా పని చేయడానికి గల అత్యంత ప్రాముఖ్యమైన కారణం, యెహోవా మీద మనకున్న ప్రేమ. ఆ పని చేసేంత అర్హత మనకు లేదేమో అనే ఆలోచనను అధిగమించడానికి యెహోవా మీద మనకున్న ప్రేమ సహాయం చేస్తుంది. మనుషుల్ని పట్టే జాలరిగా అవ్వమని ఆహ్వానించినప్పుడు యేసు పేతురుతో, “భయపడకు” అని అన్నాడు. (లూకా 5:8-11 చదవండి.) అద్భుతరీతిలో ఎక్కువ చేపలు పడేలా చేసిన యేసును చూసి, ఆయనతో కలిసి పని చేసేంత అర్హత తనకు లేదని పేతురు భయపడ్డాడు. అంతేగానీ, శిష్యుడైతే ఏమేం చేయాల్సి వస్తుందో అనే దానిగురించి పేతురు ఆందోళన పడలేదు. కానీ మీ పరిస్థితి కాస్త భిన్నంగా ఉండవచ్చు. క్రీస్తు శిష్యులుగా మీరు చేయాల్సిన పనుల గురించి ఆందోళన పడుతుండవచ్చు. ఒకవేళ అదే నిజమైతే యెహోవా మీద, యేసు మీద, మీ పొరుగువాళ్ల మీద ప్రేమ పెంచుకోండి. అప్పుడు, మనుషుల్ని పట్టే జాలరిగా అవ్వమని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించాలనే కోరిక మీలో కలుగుతుంది.—మత్త. 22:37, 39; యోహా. 14:15.

6. మనం ప్రకటనా పని చేయడానికి గల ఇంకొన్ని కారణాలు ఏంటి?

6 మనం ప్రకటనా పని చేయడానికి గల ఇంకొన్ని కారణాల్ని పరిశీలించండి. “వెళ్లి . . . శిష్యుల్ని చేయండి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు మనం లోబడాలని కోరుకుంటాం. (మత్త. 28:19, 20) అంతేకాదు ప్రజలు “చర్మం ఒలిచేయబడి, వదిలేయబడ్డారని,” వాళ్లు రాజ్య సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని మనకు తెలుసు. (మత్త. 9:36, అధస్సూచి) అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని యెహోవా కోరుకుంటున్నాడు.—1 తిమో. 2:4.

7. ప్రకటనా పని చాలా ముఖ్యమైనదని రోమీయులు 10:13-15 వచనాలు ఎలా చూపిస్తున్నాయి?

7 ప్రకటనా పని ప్రజల ప్రాణాల్ని ఎలా కాపాడగలదో ఆలోచించినప్పుడు, ఆ పని చేయాలనే కోరిక మనలో కలుగుతుంది. సాధారణంగా జాలర్లు అమ్ముకోవడానికో లేదా తినడానికో చేపలు పడతారు. కానీ మనుషుల్ని పట్టే జాలర్లమైన మనం ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి ఆ పనిలో పాల్గొంటాం.—రోమీయులు 10:13-15 చదవండి; 1 తిమో. 4:16.

జ్ఞానం సంపాదించుకోండి

8-9. ఒక జాలరికి ఏమేం తెలిసుండాలి? ఎందుకు?

8 యేసు కాలంలో, జాలరిగా పని చేసే ఒక ఇశ్రాయేలీయుడికి ఏ రకమైన చేపలు పట్టాలో తెలిసుండాలి. (లేవీ. 11:9-12) అంతేకాదు, ఆ చేపలు ఎక్కడ దొరుకుతాయో కూడా అతనికి తెలిసుండాలి. చేపలు సాధారణంగా నీళ్లు అనుకూలంగా ఉండే చోట, ఆహారం ఎక్కువగా దొరికే చోట ఉంటాయి. ఏ సమయంలో చేపలు పట్టాలనేది కూడా ప్రాముఖ్యమే. చేపలు పట్టాల్సిన సమయం గురించి, పసిఫిక్‌ ద్వీపానికి చెందిన ఒక సహోదరుడు ఏమన్నాడో గమనించండి. ఆయన ఒక మిషనరీని తనతోపాటు చేపలు పట్టడానికి రమ్మని ఆహ్వానించినప్పుడు, “నేను రేపు ఉదయం తొమ్మిదింటికి వస్తాను” అని ఆ మిషనరీ అన్నాడు. అప్పుడు ఆ సహోదరుడు, “మీకు అర్థంకావట్లేదు. మనకు అనుకూలంగా ఉండే సమయంలో కాదు, అవి దొరికే సమయంలో మనం వెళ్లాలి” అన్నాడు.

9 అదేవిధంగా, మొదటి శతాబ్దంలోని మనుషుల్ని పట్టే జాలర్లు ప్రజలు ఉండే చోట్లలో, సమయాల్లో ప్రకటించారు. ఉదాహరణకు, యేసు అనుచరులు ఆలయంలో, సమాజమందిరాల్లో, ఇంటింటా, సంతల్లో ప్రకటించారు. (అపొ. 5:42; 17:17; 18:4) మనకు కూడా మన ప్రాంతంలోని ప్రజలు ఎప్పుడు, ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలిసుండాలి. దానికి తగ్గట్టు ప్రకటించే సమయాన్ని, పద్ధతుల్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.—1 కొరిం. 9:19-23.

నైపుణ్యం గల జాలర్లు . . . 1. చేపలు ఎక్కువగా దొరికే సమయాల్లో, చోట్లలో చేపలు పడతారు (8-9 పేరాలు చూడండి)

10. యెహోవా సంస్థ మనకు ఏ పనిముట్లను ఇస్తోంది?

10 జాలరి దగ్గర సరైన పరికరాలు లేదా పనిముట్లు ఉండాలి, అంతేకాదు వాటిని ఎలా ఉపయోగించాలో తెలిసుండాలి. అదేవిధంగా మన దగ్గర కూడా ప్రకటనా పని చేయడానికి సరైన పనిముట్లు ఉండాలి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలిసుండాలి. మనుషుల్ని పట్టే పనికి సంబంధించి యేసు తన శిష్యులకు స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చాడు. వాళ్లు ఏమేం తీసుకెళ్లాలో, ఎక్కడ ప్రకటించాలో, ఏం చెప్పాలో ఆయన తెలియజేశాడు. (మత్త. 10:5-7; లూకా 10:1-11) నేడు యెహోవా సంస్థ ప్రకటనా పని చక్కగా చేయడానికి కావల్సిన బోధనా పనిముట్లను ఇస్తోంది. * అంతేకాదు వాటిని ఎలా ఉపయోగించాలో కూడా నేర్పిస్తోంది. ఆ శిక్షణ వల్ల మనం ప్రకటనా పని చేయడానికి కావల్సిన ఆత్మవిశ్వాసాన్ని, నైపుణ్యాన్ని సంపాదించుకుంటాం.—2 తిమో. 2:15.

నైపుణ్యం గల జాలర్లు . . . 2. తమ పనిముట్లను సరిగ్గా ఉపయోగిస్తారు (10వ పేరా చూడండి)

ధైర్యాన్ని పెంచుకోండి

11. జాలర్లు ఎందుకు ధైర్యంగా ఉండాలి?

11 జాలర్లు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే సముద్రంలో పరిస్థితులు ఉన్నట్టుండి ఎలా మారిపోతాయో, ఎప్పుడు తుఫాను వస్తుందో తెలీదు. పైగా వాళ్లు తరచూ రాత్రుళ్లు పని చేయాల్సి ఉంటుంది. మనుషుల్ని పట్టే జాలర్లకు కూడా ధైర్యం అవసరం. మనం ప్రకటించడం, యెహోవాసాక్షులమని చెప్పుకోవడం మొదలుపెట్టినప్పుడు కుటుంబ సభ్యులు మనల్ని వ్యతిరేకించవచ్చు, స్నేహితులు ఎగతాళి చేయవచ్చు, ప్రజలు మన సందేశాన్ని వినకపోవచ్చు. అలాంటి తుఫానులు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే తన అనుచరుల్ని వ్యతిరేకుల మధ్యకు పంపిస్తున్నానని యేసు ముందే హెచ్చరించాడు.—మత్త. 10:16.

12. యెహోషువ 1:7-9 ప్రకారం, ధైర్యాన్ని ఎలా పెంచుకోవచ్చు?

12 మీరు ధైర్యాన్ని ఎలా పెంచుకోవచ్చు? మొదటిగా, యేసు పరలోకం నుండి ఈ పనిని నిర్దేశిస్తూనే ఉంటాడని గుర్తుంచుకోండి. (యోహా. 16:33; ప్రక. 14:14-16) తర్వాత, మిమ్మల్ని చూసుకుంటానని యెహోవా చేసిన వాగ్దానం మీద విశ్వాసం పెంచుకోండి. (మత్త. 6:32-34) మీ విశ్వాసం బలపడే కొద్దీ మీలో ధైర్యం పెరుగుతుంది. పేతురు, ఆయన సహచరులు తమ వృత్తిని విడిచిపెట్టి యేసును అనుసరించినప్పుడు గొప్ప విశ్వాసం చూపించారు. అదేవిధంగా మీరు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటున్నారని, వాళ్ల మీటింగ్స్‌కు వెళ్తున్నారని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు మీరు కూడా గొప్ప విశ్వాసం చూపించారు! అంతేకాదు యెహోవా నీతి ప్రమాణాలకు తగ్గట్టు మీ ప్రవర్తనలో, జీవన విధానంలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నారు. అందుకు చాలా విశ్వాసం, ధైర్యం అవసరమై ఉంటుంది. మీరు ధైర్యాన్ని పెంచుకుంటుండగా, మీరు వెళ్లే ప్రతీ చోట మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడనే నమ్మకంతో ఉండవచ్చు.—యెహోషువ 1:7-9 చదవండి.

నైపుణ్యం గల జాలర్లు . . . 3. వాతావరణ పరిస్థితులు మారినా ధైర్యంగా పనిచేస్తారు (11-12 పేరాలు చూడండి)

13. ధైర్యాన్ని పెంచుకోవడానికి ధ్యానించడం, ప్రార్థించడం ఎలా సహాయం చేస్తాయి?

13 ధైర్యాన్ని పెంచుకోవడానికి ఇంకా ఏం చేయవచ్చు? ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థించండి. (అపొ. 4:29, 31) యెహోవా మీ ప్రార్థనలకు జవాబిస్తాడు, ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంతేకాదు యెహోవా గతంలో తన సేవకుల్ని ఎలా కాపాడాడో మీరు ధ్యానించవచ్చు. సవాళ్లను అధిగమించడానికి ఆయన మీకెలా సహాయం చేశాడో, మీ జీవన విధానంలో మార్పులు చేసుకోవడానికి కావల్సిన బలాన్ని ఎలా ఇచ్చాడో కూడా ఆలోచించండి. ఎర్ర సముద్రం గుండా తన ప్రజల్ని నడిపించిన యెహోవా, మీరు క్రీస్తు శిష్యులుగా ఉండేలా ఖచ్చితంగా సహాయం చేయగలడు. (నిర్గ. 14:13) కీర్తనకర్తలాగే మీరు కూడా, “యెహోవా నా పక్షాన ఉన్నాడు; నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?” అనే నమ్మకంతో ఉండండి.—కీర్త. 118:6.

14. మాసే, టొమోయో అనుభవాల నుండి ఏం నేర్చుకోవచ్చు?

14 ధైర్యాన్ని పెంచుకోవడానికి మరో మార్గం ఏంటంటే, ధైర్యంగా ఉండేలా యెహోవా బిడియస్థులైన వాళ్లకు ఎలా సహాయం చేశాడో పరిశీలించడం. మాసే అనే సహోదరి అనుభవం గమనించండి. ఆమెకు సిగ్గు ఎక్కువ, ప్రకటనా పనిలో ఎప్పటికీ పాల్గొనలేనని ఆమె అనుకుంది. పరిచయంలేని వాళ్లతో మాట్లాడడం అనే ఆలోచనే ఆమెకు ఒక పెద్ద అడ్డుగోడలా అనిపించింది. కాబట్టి ఆమె దేవుని పట్ల, తన పొరుగువాళ్ల పట్ల ప్రేమ పెంచుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేసింది. మనం జీవిస్తున్న ఈ సమయంలో ప్రకటనా పని ఎంత అత్యవసరమైనదో ఆమె గుర్తించింది, అంతేకాదు ప్రకటించాలనే తన కోరికను పెంచుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించింది. ఆమె తన భయాల్ని అధిగమించి, క్రమ పయినీరుగా కూడా సేవ చేసింది. ‘ధైర్యంగా ఉండేలా’ యెహోవా కొత్త ప్రచారకులకు కూడా సహాయం చేయగలడు. టొమోయో అనే సహోదరి అనుభవం పరిశీలించండి. ఆమె ఇంటింటి పరిచర్య ప్రారంభించినప్పుడు, మొదటి ఇంటావిడే “నాకు యెహోవాసాక్షులతో మాట్లాడడం ఇష్టంలేదు!” అని గట్టిగా అరిచి, తలుపు వేసేసింది. టొమోయో ఏమాత్రం భయపడకుండా, తనతోపాటు వచ్చిన సహోదరితో ఇలా అంది: “ఆమె ఏమని అందో విన్నావా? నేను ఒక్కమాట కూడా మాట్లాడకముందే ఆమె నన్ను యెహోవాసాక్షిగా గుర్తించింది. నాకు చాలా సంతోషంగా ఉంది!” టొమోయో ఇప్పుడు క్రమ పయినీరుగా సేవ చేస్తోంది.

క్రమశిక్షణను అలవర్చుకోండి

15. క్రమశిక్షణ గల వాళ్లు ఏం చేస్తారు? క్రైస్తవులకు క్రమశిక్షణ ఎందుకు అవసరం?

15 క్రమశిక్షణ గల జాలర్లు మంచి ఫలితాలు సాధిస్తారు. క్రమశిక్షణ గల వాళ్లు అన్ని పనుల్ని పద్ధతిగా చేస్తారు. పొద్దున్నే లేవాలన్నా, చేపలు పడే వరకు ఆ పని చేయాలన్నా, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు కూడా ఆ పనిని కొనసాగించాలన్నా జాలర్లకు క్రమశిక్షణ అవసరం. ప్రకటనా పనిని చివరి వరకు కొనసాగించడానికి, దాన్ని పూర్తిచేయడానికి మనకు కూడా క్రమశిక్షణ అవసరం.—మత్త. 10:22.

16. క్రమశిక్షణను ఎలా అలవర్చుకోవచ్చు?

16 సాధారణంగా మనం పనుల్ని సులభమైన పద్ధతిలో చేయడానికి ఇష్టపడతాం. కానీ కొన్నిసార్లు అత్యంత ప్రాముఖ్యమైన పనులు సులభంగా ఉండవు. కాబట్టి క్రమశిక్షణను అలవర్చుకోవాలంటే మనకు ఆత్మనిగ్రహం అవసరం. కష్టమనిపించే పనుల్ని చేసేలా మనకు మనం శిక్షణ ఇచ్చుకోవడానికి సహాయం అవసరం. ఆ సహాయాన్ని యెహోవా తన పవిత్రశక్తి ద్వారా ఇస్తాడు.—గల. 5:22, 23.

17. క్రమశిక్షణ అలవర్చుకోవడానికి తాను చేసిన కృషిని 1 కొరింథీయులు 9:25-27 లో పౌలు ఎలా వివరించాడు?

17 అపొస్తలుడైన పౌలు క్రమశిక్షణ గల వాడు. కానీ కొన్నిసార్లు సరైనది చేయడానికి తన ‘శరీరాన్ని నలగ్గొట్టుకోవాల్సి’ వచ్చిందని ఆయన ఒప్పుకున్నాడు. (1 కొరింథీయులు 9:25-27 చదవండి.) క్రమశిక్షణ కలిగి ఉండమని, అన్నిటినీ “మర్యాదగా, పద్ధతి ప్రకారం” చేయమని ఆయన ఇతరుల్ని ప్రోత్సహించాడు. (1 కొరిం. 14:40) మనుషుల్ని పట్టే పనిని, ఇతర ఆధ్యాత్మిక పనుల్ని క్రమంగా చేయాలంటే మనం క్రమశిక్షణ అలవర్చుకోవాలి.—అపొ. 2:46.

ఆలస్యం చేయకండి

18. మనం ఏం చేస్తే యెహోవా దృష్టిలో విజయం సాధించినట్టు?

18 ఒక జాలరి ఎక్కువ చేపలు పడితే అతను ఆ పనిలో విజయం సాధించినట్టు. అయితే మన విజయం మాత్రం దేవుని సంస్థలోకి ఎంతమందిని తీసుకొచ్చాం అనేదాని మీద ఆధారపడి ఉండదు. (లూకా 8:11-15) మంచివార్త ప్రకటించడంలో, ఇతరులకు బోధించడంలో కొనసాగినంత కాలం యెహోవా దృష్టిలో మనం విజయం సాధించినట్టే. ఎందుకు? ఎందుకంటే మనం యెహోవాకు, ఆయన కుమారునికి లోబడుతున్నాం.—మార్కు 13:10; అపొ. 5:28, 29.

19-20. మనం ఇప్పుడే ప్రకటనా పని చేయడానికి ఏ ప్రత్యేకమైన కారణం ఉంది?

19 కొన్ని దేశాల్లో, చేపలు పట్టడానికి కొన్ని నెలల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ నెలలు ముగింపుకు వస్తున్నప్పుడు జాలర్లు తమ పనిని ఇంకా ఎక్కువ చేయాలని కోరుకోవచ్చు. ఈ వ్యవస్థ ముగింపు వేగంగా సమీపిస్తుండగా, మనం కూడా ప్రకటనా పనిని ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటాం! ప్రాణాల్ని కాపాడే ఈ పనిలో పాల్గొనడానికి కొంచెం సమయమే మిగిలివుంది. కాబట్టి ఆలస్యం చేయకండి. ఈ ప్రాముఖ్యమైన పనిలో పాల్గొనడానికి మీ జీవితంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా మారేవరకు ఎదురుచూడకండి.—ప్రసం. 11:4.

20 ప్రకటనా పని మీద ప్రేమ పెంచుకోవడానికి, బైబిలు సందేశం గురించిన జ్ఞానాన్ని సంపాదించడానికి, ధైర్యాన్ని పెంచుకోవడానికి, క్రమశిక్షణను అలవర్చుకోవడానికి ఇప్పుడే కృషి చేయండి. మనుషుల్ని పట్టే పనిని చేస్తున్న 80 లక్షల కన్నా ఎక్కువమందిలో మీరూ ఒకరు అవ్వండి. అప్పుడు మీరు యెహోవా ఇచ్చే సంతోషాన్ని పొందుతారు. (నెహె. 8:10) ఈ పనిలో వీలైనంత ఎక్కువగా పాల్గొనాలని, యెహోవా ఆపమని చెప్పేంతవరకు అందులో కొనసాగాలని నిర్ణయించుకోండి. మనుషుల్ని పట్టే జాలర్లమైన మనం రాజ్య ప్రకటనా పనిని కొనసాగించాలనే మన నిర్ణయాన్ని ఏ మూడు విధాలుగా బలపర్చుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 66 మంచివార్త చాటండి

^ పేరా 5 వినయం, కష్టపడే స్వభావం ఉన్న జాలర్లను తన శిష్యులవ్వమని యేసు ఆహ్వానించాడు. అలాంటి లక్షణాలున్న ప్రజల్ని యేసు నేడు కూడా ఆహ్వానిస్తున్నాడు. మనుషుల్ని పట్టే జాలరిగా అవ్వమనే ఆహ్వానాన్ని అంగీకరించడానికి వెనకాడుతున్న బైబిలు విద్యార్థులు ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

^ పేరా 1 పదాల వివరణ: “మనుషుల్ని పట్టే జాలరులు” అనే మాట మంచివార్తను ప్రకటిస్తూ, క్రీస్తు శిష్యులయ్యేలా ఇతరులకు బోధించే వాళ్లందర్నీ సూచిస్తుంది.

^ పేరా 10 కావలికోట, అక్టోబరు 2018, 11-16 పేజీల్లో “సత్యాన్ని బోధించండి” అనే ఆర్టికల్‌ చూడండి.