కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 39

సంఘంలోని సహోదరీలకు మద్దతివ్వండి

సంఘంలోని సహోదరీలకు మద్దతివ్వండి

“మంచివార్తను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు.”—కీర్త. 68:11.

పాట 137 నమ్మకమైన స్త్రీలు, క్రైస్తవ సహోదరీలు

ఈ ఆర్టికల్‌లో . . . *

కష్టపడి పనిచేసే ఉత్సాహవంతులైన మన సహోదరీలు మీటింగ్స్‌లో, పరిచర్యలో పాల్గొంటారు; రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడంలో, మరమ్మతులు చేయడంలో సహాయం చేస్తారు; తోటి ఆరాధకుల మీద శ్రద్ధ చూపిస్తారు (1వ పేరా చూడండి)

1. సహోదరీలు సంస్థలో ఎలా కష్టపడి పనిచేస్తున్నారు? కానీ చాలామంది సహోదరీలు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు? (ముఖచిత్రం చూడండి.)

కష్టపడి పనిచేసే ఎంతోమంది సహోదరీలు మన సంఘంలో ఉండడం సంతోషకరమైన విషయం! ఉదాహరణకు వాళ్లు మీటింగ్స్‌లో, పరిచర్యలో పాల్గొంటారు. రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడంలో, మరమ్మతులు చేయడంలో సహాయం చేస్తారు, అలాగే తోటి ఆరాధకుల మీద శ్రద్ధ చూపిస్తారు. అయితే వాళ్లు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. కొంతమంది వయసుపైబడిన తల్లిదండ్రుల బాగోగుల్ని చూసుకుంటున్నారు. ఇంకొంతమంది కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒంటరి తల్లులు తమ పిల్లల్ని పోషించుకోవడానికి కష్టపడి పని చేస్తున్నారు.

2. సహోదరీలకు మద్దతివ్వడానికి మనం ఎందుకు కృషిచేయాలి?

2 సహోదరీలకు మనం ఎందుకు మద్దతివ్వాలి? ఎందుకంటే, ఈ లోకం తరచూ స్త్రీలకు తగిన గౌరవాన్ని ఇవ్వట్లేదు. అంతేకాదు వాళ్లకు మద్దతివ్వమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు ఫీబే అనే సహోదరిని చేర్చుకోమని, “ఆమెకు కావాల్సిన సహాయం” చేయమని రోములో ఉన్న సంఘాన్ని కోరాడు. (రోమా. 16:1, 2) పౌలు పరిసయ్యుడిగా ఉన్నప్పుడు, స్త్రీలను చిన్నచూపు చూసేవాళ్ల మధ్య జీవించాడు. కానీ ఆయన క్రైస్తవుడిగా మారిన తర్వాత యేసును అనుకరిస్తూ స్త్రీలతో గౌరవంగా, దయగా వ్యవహరించాడు.—1 కొరిం. 11:1.

3. యేసు స్త్రీలందర్నీ ఎలా చూశాడు? మరిముఖ్యంగా దేవుని ఇష్టం చేసే స్త్రీలను ఎలా చూశాడు?

3 యేసు స్త్రీలందర్నీ గౌరవించాడు. (యోహా. 4:27) తన కాలంనాటి యూదా మతనాయకుల్లా ఆయన స్త్రీలను చిన్నచూపు చూడలేదు. నిజానికి ఒక బైబిలు రెఫరెన్సు ఇలా చెప్తుంది: “యేసు ఎన్నడూ స్త్రీలను చులకనగా చూడలేదు, వాళ్లను తక్కువచేసి మాట్లాడలేదు.” మరిముఖ్యంగా, తన తండ్రి ఇష్టాన్ని చేసే స్త్రీల పట్ల యేసు ప్రత్యేక గౌరవం చూపించాడు. ఆయన వాళ్లను తన సహోదరీలని పిలిచాడు, తన తండ్రి ఇష్టం చేసే వాళ్లందర్నీ అంటే పురుషుల్ని, స్త్రీలను తన కుటుంబ సభ్యుల్లా చూశాడు.—మత్త. 12:50.

4. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

4 యేసు తన ఆధ్యాత్మిక సహోదరీలకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఆయన వాళ్లను మెచ్చుకున్నాడు, వాళ్ల తరఫున మాట్లాడాడు. సహోదరీల పట్ల శ్రద్ధ చూపించే విషయంలో మనం యేసును ఎలా అనుకరించవచ్చో పరిశీలిద్దాం.

మన ప్రియమైన సహోదరీల మీద శ్రద్ధ చూపించండి

5. కొంతమంది సహోదరీలకు మంచి సహవాసం దొరకడం ఎందుకు కష్టం అవ్వవచ్చు?

5 సహోదరులకు, సహోదరీలకు అందరికీ మంచి సహవాసం అవసరం. కానీ కొన్నిసార్లు సహోదరీలకు మంచి సహవాసం దొరకడం కష్టం అవ్వవచ్చు. ఎందుకు? కొంతమంది సహోదరీలు ఏమంటున్నారో చూడండి. జోర్డన్‌ * అనే సహోదరి ఇలా అంటోంది, “నేను ఒంటరిదాన్ని కాబట్టి సంఘంలో నాకంటూ ఒక గుర్తింపు లేదని, నేను సంఘంలో అంత విలువైనదాన్ని కాదని తరచూ అనిపిస్తుంది.” పరిచర్య ఎక్కువ చేయడం కోసం వేరే ప్రాంతానికి వెళ్లిన క్రిస్టిన్‌ అనే పయినీరు సహోదరి ఇలా అంటోంది, “ఏదైనా కొత్త సంఘానికి వెళ్లినప్పుడు మనకు ఒంటరిగా అనిపించవచ్చు.” కొంతమంది సహోదరులకు కూడా అలా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు సత్యంలో లేనివాళ్లకేమో అటు తమ కుటుంబానికి, ఇటు సహోదర సహోదరీలకు దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు. అనారోగ్యం వల్ల ఇంటికే పరిమితమైన వాళ్లకు, వాళ్లను చూసుకునే వాళ్లకు ఒంటరి వాళ్లమని అనిపించవచ్చు. ఆనెట్‌ అనే సహోదరి ఇలా అంటోంది, “మా అమ్మను ముఖ్యంగా నేనే చూసుకునేదాన్ని కాబట్టి సహోదర సహోదరీలతో సమయం గడపడం వీలయ్యేది కాదు.”

యేసులాగే మనం కూడా నమ్మకమైన సహోదరీల పట్ల ప్రేమ, శ్రద్ధ చూపించవచ్చు (6-9 పేరాలు చూడండి) *

6. లూకా 10:38-42 ప్రకారం, మార్త మరియలకు యేసు ఎలా సహాయం చేశాడు?

6 యేసు తన ఆధ్యాత్మిక సహోదరీలతో సమయం గడిపాడు, అంతేకాదు వాళ్లకు నిజమైన స్నేహితునిలా ఉన్నాడు. యేసుకు మార్త, మరియలతో ఉన్న స్నేహం గురించి ఆలోచించండి. బహుశా మార్త మరియలు ఇద్దరూ ఒంటరి సహోదరీలు అయ్యుండవచ్చు. (లూకా 10:38-42 చదవండి.) యేసు మాటలు, పనులు ఎలా ఉండేవంటే మార్త మరియలు ఏ ఇబ్బందీ లేకుండా ఆయన దగ్గరికి వెళ్లేవాళ్లు, ఆయనతో మొహమాటం లేకుండా మాట్లాడేవాళ్లు. ఒక శిష్యురాలిలా యేసు పాదాల దగ్గర కూర్చోవడానికి మరియ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. * అలాగే మార్త కూడా మరియ తనకు సహాయం చేయట్లేదన్న చికాకును యేసుకు చెప్పడానికి సంకోచించలేదు. ఆ సందర్భంలో యేసు వాళ్లిద్దరికీ విలువైన పాఠాలు నేర్పించాడు. వాళ్ల మీద, వాళ్ల సహోదరుడైన లాజరు మీద శ్రద్ధ చూపిస్తూ యేసు అప్పుడప్పుడు వాళ్ల ఇంటికెళ్లి కలిసేవాడు. (యోహా. 12:1-3) అందుకే లాజరుకు తీవ్రంగా జబ్బు చేసినప్పుడు, మార్త మరియలు యేసును సహాయం అడగగలిగారు.—యోహా. 11:3, 5.

7. సహోదరీల్ని మనం ఏ విధంగా ప్రోత్సహించవచ్చు?

7 కొంతమంది సహోదరీలకు, తోటి ఆరాధకుల్ని కలవడానికి మీటింగ్స్‌ తప్ప వేరే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్లను పలకరించాలి, వాళ్లతో మాట్లాడాలి, మనకు వాళ్ల మీద శ్రద్ధ ఉందని చూపించాలి. పైన ప్రస్తావించిన జోర్డన్‌ ఇలా అంటోంది, “వేరేవాళ్లు నా కామెంట్స్‌ని మెచ్చుకున్నప్పుడు, నాతో కలిసి పరిచర్య చేస్తానని చెప్పినప్పుడు, లేదా వేరే విధంగా నా మీద శ్రద్ధ చూపించినప్పుడు నాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది.” మన సహోదరీలు మనకు ఎంత ముఖ్యమైన వాళ్లో వాళ్లకు చూపించాలి. కియా అనే సహోదరి ఇలా చెప్తుంది, “నేనెప్పుడైనా మీటింగ్‌కి వెళ్లకపోతే, నేను బాగున్నానో లేదో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఎవరోఒకరు నాకు మెసేజ్‌ చేస్తారు. సహోదరసహోదరీలకు నా మీద శ్రద్ధ ఉందని అది చూపిస్తుంది.”

8. మనం ఇంకా ఏయే విధాలుగా యేసును అనుకరించవచ్చు?

8 యేసులాగే మనం కూడా సహోదరీల మీద శ్రద్ధ చూపిస్తూ వాళ్ల కోసం సమయం వెచ్చించడానికి కృషి చేయవచ్చు. బహుశా మనతో కలిసి భోజనం చేయడానికో, సరదాగా సమయం గడపడానికో వాళ్లను ఆహ్వానించవచ్చు. అలా ఆహ్వానించినప్పుడు మన మాటలు ప్రోత్సాహకరంగా ఉండేలా చూసుకోవాలి. (రోమా. 1:11, 12) సంఘ పెద్దలు యేసుకు ఉన్నలాంటి వైఖరి చూపించాలి. పెళ్లి చేసుకోకుండా ఉండడం కొంతమందికి కష్టంగా అనిపించవచ్చని యేసుకు తెలుసు. అయితే శాశ్వత సంతోషం అనేది పెళ్లి చేసుకోవడం మీదో, పిల్లల్ని కనడం మీదో ఆధారపడి ఉండదని ఆయన స్పష్టం చేశాడు. (లూకా 11:27, 28) మన జీవితంలో యెహోవా సేవకు మొదటిస్థానం ఇవ్వడం మీదే అది ఆధారపడి ఉంటుంది.—మత్త. 19:12.

9. సంఘ పెద్దలు సహోదరీలకు ఎలా సహాయం చేయవచ్చు?

9 సహోదరులు, ముఖ్యంగా పెద్దలు సంఘంలోని స్త్రీలను ఆధ్యాత్మిక సహోదరీలుగా, తల్లులుగా చూడాలి. (1 తిమో. 5:1, 2) పెద్దలు మీటింగ్స్‌కి ముందు లేదా తర్వాత సహోదరీలతో మాట్లాడడానికి సమయం వెచ్చించాలి. పై పేరాల్లో ప్రస్తావించిన క్రిస్టిన్‌ ఇలా అంటోంది, “ఒక సంఘ పెద్ద నేను తీరిక లేకుండా బిజీగా ఉండడం గమనించి, నా షెడ్యూల్‌ ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన నా మీద చూపించిన శ్రద్ధకు చాలా కృతజ్ఞురాలిని.” సంఘ పెద్దలు తమ ఆధ్యాత్మిక సహోదరీలతో మాట్లాడడానికి క్రమంగా సమయం వెచ్చించినప్పుడు, వాళ్ల మీద శ్రద్ధ ఉందని చూపిస్తారు. * పై పేరాల్లో ప్రస్తావించిన ఆనెట్‌, సంఘ పెద్దలతో క్రమంగా మాట్లాడడం వల్ల వచ్చే ఒక ప్రయోజనం గురించి వివరిస్తూ ఇలా అంటోంది: “నా గురించి వాళ్లు, వాళ్ల గురించి నేను బాగా తెలుసుకోగలుగుతాం. దానివల్ల, భవిష్యత్తులో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్లను సహాయం అడగడం నాకు తేలికౌతుంది.”

సహోదరీల పట్ల కృతజ్ఞత చూపించండి

10. మనం ఏం చేస్తే సహోదరీలు సంతోషిస్తారు?

10 స్త్రీలమైనా, పురుషులమైనా మన సామర్థ్యాల్ని వేరేవాళ్లు గుర్తించినప్పుడు, మన పనిని మెచ్చుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఒకవేళ వేరేవాళ్లు మన సామర్థ్యాల్ని, పనిని గుర్తించకపోతే మనకు నిరుత్సాహంగా అనిపిస్తుంది. పయినీరు సేవ చేస్తున్న అబీగయీల్‌ అనే సహోదరి, కొన్నిసార్లు ఇతరులు తనను పట్టించుకోనట్లు అనిపిస్తుందని చెప్తోంది. ఆమె ఇలా అంటోంది: “నన్ను ఫలానా వాళ్ల చెల్లిగానో, ఫలానా వాళ్ల కూతురిగానో చూస్తారు తప్ప నాకంటూ ఒక గుర్తింపు ఇవ్వరని కొన్నిసార్లు అనిపిస్తుంది.” అయితే, పామ్‌ అనే సహోదరి ఏమంటుందో గమనించండి. ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండి, చాలా సంవత్సరాలు మిషనరీగా సేవ చేసింది. తర్వాత తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి తన సొంత దేశానికి వచ్చేసింది. ఇప్పుడు ఆమెకు 70 ఏళ్లు దాటాయి, అయినా పయినీరు సేవ చేస్తోంది. ఆమె ఇలా అంటోంది: “వేరేవాళ్లు నా పనిని గుర్తించి నన్ను మెచ్చుకోవడం నాకెంతో సహాయం చేసింది.”

11. తనతోపాటు పరిచర్య చేసిన స్త్రీలను విలువైన వాళ్లుగా ఎంచుతున్నానని యేసు ఎలా చూపించాడు?

11 కొంతమంది దైవభక్తిగల స్త్రీలు “తమకున్న వాటితో” యేసుకు సేవలు చేశారు. వాళ్లు చేసిన సహాయాన్ని యేసు విలువైనదిగా ఎంచాడు. (లూకా 8:1-3) సేవచేసే అవకాశం ఇవ్వడమే కాదు, ఆయన వాళ్లకు లోతైన ఆధ్యాత్మిక సత్యాల్ని కూడా తెలియజేశాడు. ఉదాహరణకు, తాను చనిపోయి తిరిగి బ్రతికించబడతానని వాళ్లకు చెప్పాడు. (లూకా 24:5-8) రాబోయే పరీక్షలకు అపొస్తలుల్ని సిద్ధం చేసినట్టే, వీళ్లను కూడా సిద్ధం చేశాడు. (మార్కు 9:30-32; 10:32-34) గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు బంధించబడినప్పుడు అపొస్తలులు పారిపోయారు, కానీ ఆయనకు సేవలు చేసిన స్త్రీలలో కొంతమంది మాత్రం ఆయన హింసాకొయ్య మీద చనిపోతున్నప్పుడు పక్కనే ఉన్నారు.—మత్త. 26:56; మార్కు 15:40, 41.

12. యేసు స్త్రీలకు ఏ పని అప్పగించాడు?

12 యేసు స్త్రీలకు ప్రాముఖ్యమైన పని అప్పగించాడు. ఉదాహరణకు, ఆయన పునరుత్థానానికి మొట్టమొదటి సాక్షులు దైవభక్తిగల స్త్రీలే. తాను తిరిగి బ్రతికిన సంగతి అపొస్తలులకు తెలియజేయమని యేసు ఆ స్త్రీలకు చెప్పాడు. (మత్త. 28:5, 9, 10) అంతేకాదు, క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున పవిత్రశక్తి కుమ్మరించబడిన వాళ్లలో స్త్రీలు కూడా ఉండివుంటారు. అదే నిజమైతే, కొత్తగా అభిషేకించబడిన ఆ సహోదరీలు వేర్వేరు భాషల్లో మాట్లాడే వరాన్ని పొందివుంటారు, “దేవుని శక్తివంతమైన కార్యాల గురించి” ఇతరులకు చెప్పివుంటారు.—అపొ. 1:14; 2:2-4, 11.

13. నేడు సహోదరీలు ఏయే విధాలుగా సేవ చేస్తున్నారు? మీరు వాళ్లపట్ల ఎలా కృతజ్ఞత చూపించాలనుకుంటున్నారు?

13 మన సహోదరీలు యెహోవా సేవలో చేస్తున్న పనులన్నిటిని బట్టి మనం వాళ్లను మెచ్చుకోవాలి. ఉదాహరణకు వాళ్లు నిర్మాణ పనుల్లో-మరమ్మతు పనుల్లో సహాయం చేస్తున్నారు, వేరే భాషా గ్రూపులకు మద్దతిస్తున్నారు, బెతెల్‌లో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు, విపత్తు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు, ప్రచురణల్ని అనువదించడంలో సహాయం చేస్తున్నారు, పయినీర్లుగా, మిషనరీలుగా సేవ చేస్తున్నారు. సహోదరుల్లాగే వాళ్లు కూడా పయినీరు పాఠశాలకు, రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు, గిలియడ్‌ పాఠశాలకు హాజరౌతున్నారు. అంతేకాదు సంఘంలో, సంస్థలో బరువైన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న తమ భర్తలకు సహోదరీలు మద్దతిస్తున్నారు. భార్యల మద్దతు ఉండబట్టే ఆ సహోదరులు ‘మనుషుల్లో వరాలుగా’ చక్కగా సేవ చేయగలుగుతున్నారు. (ఎఫె. 4:8) అలాంటి సహోదరీలకు మీరు ఏయే విధాలుగా మద్దతివ్వవచ్చో ఆలోచించండి.

14. కీర్తన 68:11 ప్రకారం, తెలివైన పెద్దలు ఏం చేస్తారు?

14 సహోదరీలు ఇష్టపూర్వకంగా సేవచేసే “గొప్ప సైన్యం” అని, మంచివార్త చక్కగా ప్రకటించేది తరచూ వాళ్లేనని తెలివైన పెద్దలు గుర్తిస్తారు. (కీర్తన 68:11 చదవండి.) కాబట్టి వాళ్ల అనుభవం నుండి నేర్చుకోవడానికి పెద్దలు ప్రయత్నిస్తారు. పై పేరాల్లో ప్రస్తావించిన అబీగయీల్‌ ఇలా చెప్తుంది, ‘క్షేత్రంలోని ప్రజలకు సమర్థవంతంగా ప్రకటించడానికి నేను ఏ పద్ధతులు ఉపయోగిస్తున్నానో చెప్పమని సహోదరులు నన్ను అడిగినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. దానివల్ల యెహోవా సంస్థలో నాకూ ఒక విలువైన స్థానం ఉందని గుర్తించగలుగుతున్నాను.’ అంతేకాదు నమ్మకమైన, పరిణతిగల సహోదరీలు సవాళ్లు ఎదుర్కొంటున్న యువ సహోదరీలకు చక్కగా సహాయం చేయగలరని పెద్దలు గుర్తిస్తారు. (తీతు 2:3-5) ఖచ్చితంగా మన సహోదరీలు మన ప్రేమ, కృతజ్ఞత పొందడానికి అర్హులు!

సహోదరీల తరఫున మాట్లాడండి

15. ఏయే సందర్భాల్లో మన సహోదరీలకు తమ తరఫున మాట్లాడేవాళ్లు అవసరం అవ్వవచ్చు?

15 కొన్నిసార్లు, ఏదైనా సవాలును ఎదుర్కొంటున్న సహోదరీలకు వాళ్ల తరఫున మాట్లాడే వ్యక్తి అవసరం అవ్వవచ్చు. (యెష. 1:17) ఉదాహరణకు, విడాకులు తీసుకున్న సహోదరికి లేదా భర్త చనిపోయిన సహోదరికి కొన్నిసార్లు ఆమె తరఫున మాట్లాడే వ్యక్తి అవసరం ఏర్పడవచ్చు. కొన్ని పనులు చేసుకునే విషయంలో ఆమెకు సహాయం అవసరం అవ్వవచ్చు. అంతేకాదు, వయసుపైబడిన సహోదరి డాక్టర్లతో మాట్లాడే విషయంలో ఇతరుల సహాయాన్ని కోరుకుంటుండవచ్చు. యెహోవా సంస్థలో ఇతర పనులకు మద్దతిస్తున్న పయినీరు సహోదరి, మిగతా పయినీర్లలా ఎక్కువగా పరిచర్యలో పాల్గొనలేకపోతున్నందుకు విమర్శలు ఎదుర్కొంటుంటే, మనం ఆమె తరఫున మాట్లాడవచ్చు. మనం ఇంకా ఏయే విధాలుగా మన సహోదరీలకు సహాయం చేయవచ్చు? మరోసారి యేసు ఉదాహరణను పరిశీలిద్దాం.

16. మార్కు 14:3-9 ప్రకారం, యేసు మరియను ఎలా సమర్థించాడు?

16 ఇతరులు తన ఆధ్యాత్మిక సహోదరీల్ని అపార్థం చేసుకున్నప్పుడు యేసు వెంటనే వాళ్ల తరఫున మాట్లాడేవాడు. ఉదాహరణకు, మార్త మరియను విమర్శించినప్పుడు యేసు మరియను సమర్థిస్తూ మాట్లాడాడు. (లూకా 10:38-42) మరో సందర్భంలో, ఇతరులు మరియ చేసిన పనిని తప్పుపడుతూ ఆమెను విమర్శించినప్పుడు యేసు ఆమెను సమర్థించాడు. (మార్కు 14:3-9 చదవండి.) మరియ ఎందుకలా చేసిందో అర్థంచేసుకుని యేసు ఆమెను ఇలా మెచ్చుకున్నాడు: “ఆమె నా విషయంలో మంచి పనే చేసింది. . . . ఆమె చేయగలిగింది ఆమె చేసింది.” అంతేకాదు, “ప్రపంచంలో సువార్త ప్రకటించే ప్రతీ చోట” ఆమె దయతో చేసిన ఈ పనిని గుర్తుచేసుకుంటారని ఆయన ప్రవచించాడు. ఇప్పుడు ఈ ఆర్టికల్‌ ద్వారా మనం కూడా ఆమె చేసిన పనిని గుర్తుచేసుకుంటున్నాం. ఆమె నిస్వార్థంగా చేసిన ఆ పనిని యేసు ప్రపంచవ్యాప్త ప్రకటనా పనితో ముడిపెట్టడం ఎంత గొప్ప విషయమో కదా! ఇతరులు ఆమెను తప్పు పట్టినప్పుడు యేసు అన్న ఈ మాటలు ఆమెకు ఎంతో ఊరటనిచ్చి ఉంటాయి!

17. మనం ఎలాంటి సందర్భంలో సహోదరీల తరఫున మాట్లాడాల్సి రావచ్చో ఒక ఉదాహరణ చెప్పండి.

17 అవసరమైనప్పుడు మీ ఆధ్యాత్మిక సహోదరీల తరఫున మీరు మాట్లాడతారా? ఈ ఉదాహరణ పరిశీలించండి. అవిశ్వాసియైన భర్త ఉన్న ఒక సహోదరి తరచూ మీటింగ్స్‌కి లేటుగా రావడం, మీటింగ్‌ అయిపోయిన వెంటనే వెళ్లిపోవడం కొంతమంది ప్రచారకులు గమనించారు. ఆమె తన పిల్లల్ని కూడా అప్పుడప్పుడు మాత్రమే మీటింగ్స్‌కి తీసుకొస్తుంది. కాబట్టి, ఆమె తన భర్త విషయంలో ఇంకొంచెం స్థిరంగా ఉండాలి అంటూ కొంతమంది ప్రచారకులు ఆమెను విమర్శించారు. కానీ వాస్తవం ఏంటంటే, ఆ సహోదరి తాను చేయగలిగినదంతా చేస్తోంది. ఆమె ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్లాలి అనేది ఆమె చేతుల్లో లేదు, పైగా పిల్లల విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ఆమెకు లేదు. ఇప్పుడు మీరేం చేయవచ్చు? మీరు ఆ సహోదరిని మెచ్చుకుని, ఆమె చేయగలుగుతున్న వాటి గురించి ఇతరులతో చెప్పినప్పుడు, వేరేవాళ్లు ఆమెను విమర్శించడం ఆపేస్తారు.

18. మనం ఇంకా ఏయే విధాలుగా సహోదరీలకు సహాయం చేయవచ్చు?

18 మన సహోదరీల పట్ల మనకు ఎంత శ్రద్ధ ఉందో చేతల్లో చూపించవచ్చు. (1 యోహా. 3:18) అనారోగ్యంగా ఉన్న తన తల్లిని చూసుకుంటున్న ఆనెట్‌ ఇలా చెప్తుంది: “కొంతమంది సహోదరసహోదరీలు కాసేపు మా అమ్మను చూసుకోవడానికి వచ్చేవాళ్లు, లేదా మా కోసం భోజనం తెచ్చేవాళ్లు. వాళ్లకు నా మీద ప్రేమ ఉందని, సంఘంలో నాకూ విలువైన స్థానం ఉందని అది చూపించేది.” సహోదరి జోర్డన్‌కు కూడా సహాయం దొరికింది. కారు మెయింటెనెన్స్‌ గురించి ఒక సహోదరుడు ఆమెకు మంచి సలహాలు ఇచ్చాడు. ఆమె ఇలా చెప్తుంది: “నా సహోదరసహోదరీలు నా భద్రత గురించి ఆలోచిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది.”

19. పెద్దలు ఇంకా ఏయే విధాలుగా సహోదరీలకు సహాయం చేయవచ్చు?

19 సంఘ పెద్దలు సహోదరీలకు ఉన్న అవసరాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం సహోదరీల పట్ల శ్రద్ధ చూపించాలని యెహోవా కోరుకుంటున్నాడని పెద్దలకు తెలుసు. (యాకో. 1:27) కాబట్టి పెద్దలు యేసును అనుకరిస్తూ సహేతుకంగా ఉంటారు. నియమాలు పట్టుకువేలాడే బదులు దయగా ఉంటూ ఇతరుల్ని అర్థం చేసుకుంటారు. (మత్త. 15:22-28) పెద్దలు చొరవ తీసుకుని సహాయం చేసినప్పుడు, యెహోవాకు అలాగే ఆయన సంస్థకు తమ మీద శ్రద్ధ ఉందని సహోదరీలు గుర్తించగలుగుతారు. సహోదరి కియా ఇల్లు మారుతోందని తెలిసిన వెంటనే, గ్రూపు పర్యవేక్షకుడు ఆమెకు సహాయం అందేలా ఏర్పాటు చేశాడు. కియా ఇలా అంటోంది, “దానివల్ల నా ఆందోళనంతా పోయింది. పెద్దలు ప్రోత్సాహకరంగా మాట్లాడడం ద్వారా, అవసరమైన సహాయం అందించడం ద్వారా సంఘంలో నాకు విలువైన స్థానం ఉందని, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఒంటరిదాన్ని కాదని స్పష్టంగా చూపించారు.”

సహోదరీలందరికీ మన మద్దతు అవసరం

20-21. సహోదరీలందరూ మనకు విలువైనవాళ్లు అని ఎలా చూపించవచ్చు?

20 నేడు సంఘాల్లో, కష్టపడి పనిచేసే ఎంతోమంది సహోదరీలు మన మధ్య ఉన్నారు. వాళ్లందరికీ మన మద్దతు అవసరం. వాళ్ల కోసం సమయం వెచ్చించడం ద్వారా, వాళ్ల గురించి తెలుసుకోవడం ద్వారా వాళ్లకు సహాయం చేయవచ్చని యేసు ఉదాహరణ నుండి నేర్చుకున్నాం. దేవుని సేవలో వాళ్లు చేస్తున్న కృషిని బట్టి మనం కృతజ్ఞత చూపించవచ్చు. అంతేకాదు, అవసరమైనప్పుడు మనం వాళ్ల తరఫున మాట్లాడవచ్చు.

21 రోమీయులకు రాసిన ఉత్తరం చివర్లో, అపొస్తలుడైన పౌలు తొమ్మిదిమంది సహోదరీల పేర్లను ప్రస్తావించాడు. (రోమా. 16:1, 3, 6, 12, 13, 15) పౌలు తమను మెచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పడం విని ఆ సహోదరీలు ఖచ్చితంగా ప్రోత్సాహం పొందివుంటారు. మనం కూడా మన సంఘంలో ఉన్న సహోదరీలందరికీ మద్దతిద్దాం. అలా చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక కుటుంబంలో వాళ్లకూ విలువైన స్థానం ఉందని చూపిస్తాం.

పాట 136 యెహోవా “తగిన జీతాన్ని” ఇస్తాడు

^ పేరా 5 మన సహోదరీలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. యేసును అనుకరిస్తూ మన సహోదరీలకు ఎలా మద్దతివ్వవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. యేసు స్త్రీల మీద శ్రద్ధ చూపిస్తూ వాళ్ల కోసం సమయం వెచ్చించాడు, వాళ్లను మెచ్చుకున్నాడు, వాళ్ల తరఫున మాట్లాడాడు. ఆయన నుండి మనమేం నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 5 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 6 ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: “శిష్యులు తమ బోధకుల పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునేవాళ్లు. భవిష్యత్తులో వాళ్లు కూడా బోధకులు అవ్వడం కోసం అలా చేసేవాళ్లు. కానీ స్త్రీలకు బోధకులయ్యే అవకాశం ఉండేది కాదు. కాబట్టి, మరియ యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేవాటిని ఆసక్తిగా వినడం చూసి చాలామంది యూదా పురుషులు ఆశ్చర్యపోయి ఉంటారు.”

^ పేరా 9 సహోదరీలకు సహాయం చేస్తున్నప్పుడు పెద్దలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. ఉదాహరణకు, వాళ్లు ఒక సహోదరి ఇంటికి ఒంటరిగా వెళ్లరు.

^ పేరా 65 చిత్రాల వివరణ: నమ్మకమైన స్త్రీల పట్ల శ్రద్ధ చూపించిన యేసును అనుకరిస్తూ ఒక సహోదరుడు కారు టైరు మార్చడంలో ఇద్దరు సహోదరీలకు సహాయం చేస్తున్నాడు, ఇంకో సహోదరుడు అనారోగ్యంగా ఉన్న సహోదరి ఇంటికెళ్లి పలకరిస్తున్నాడు, మరో సహోదరుడు తన భార్యతో కలిసి ఒక తల్లి, ఆమె కూతురు చేసుకుంటున్న కుటుంబ ఆరాధనకు వెళ్లాడు.