కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒనేసిమ్‌, జెరాల్డిన్‌

స్వదేశానికి తిరిగెళ్లిన వాళ్లు మెండైన దీవెనలు పొందారు

స్వదేశానికి తిరిగెళ్లిన వాళ్లు మెండైన దీవెనలు పొందారు

ఎక్కువ డబ్బు సంపాదించడానికి విదేశాలకు వెళ్లిన చాలామంది సహోదర సహోదరీలు తమ స్వదేశానికి తిరిగొచ్చారు. యెహోవా మీద, సాటిమనుషుల మీద ఉన్న ప్రేమ వల్ల తమ స్వదేశంలో అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడానికి వాళ్లు వచ్చారు. (మత్త. 22:37-39) వాళ్లు ఎలాంటి త్యాగాలు చేశారు? దానివల్ల ఏ దీవెనలు పొందారు? అది తెలుసుకోవడానికి, పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న కామెరూన్‌ దేశానికి వెళ్దాం.

“ఎక్కువ ‘చేపలు’ పడే స్థలం”

కామెరూన్‌కు చెందిన ఒనేసిమ్‌, 1998 లో వేరే దేశానికి వెళ్లి అక్కడ 14 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఒకరోజు మీటింగ్‌లో, ప్రకటనా పని గురించి ఒక ఉదాహరణ విన్నాడు. ప్రసంగీకుడు ఈ ఉదాహరణ చెప్పాడు: “ఇద్దరు స్నేహితులు ఒక చెరువు దగ్గరికి వెళ్లి వేర్వేరు చోట్ల చేపలు పడుతున్నారు. మొదటి వ్యక్తికి ఎక్కువ చేపలు పడుతున్నాయి, రెండో వ్యక్తికి తక్కువ చేపలు పడుతున్నాయి. అప్పుడు రెండో వ్యక్తి ఏం చేస్తాడు? ఎక్కువ చేపలు పడే చోటికి వెళ్లడా?”

ఆ ఉదాహరణ విన్నాక, కామెరూన్‌కు తిరిగెళ్లి అక్కడున్న ఎంతోమంది ఆసక్తిపరులకు ప్రకటించాలని ఒనేసిమ్‌కు అనిపించింది. అయితే, ‘ఇన్ని సంవత్సరాలు విదేశాల్లో ఉండి ఇప్పుడు స్వదేశానికి వెళ్తే, అక్కడి పరిస్థితులకు అలవాటు పడగలనా?’ అని ఆయన సందేహపడ్డాడు. అందుకే ఒక ఆరు నెలలు ఉండి చూద్దామని కామెరూన్‌కు వెళ్లాడు. తర్వాత 2012 లో పూర్తిగా అక్కడికి వెళ్లిపోయాడు.

ఒనేసిమ్‌ ఇలా అంటున్నాడు: “నేను ఇక్కడి వేడి వాతావరణానికి, పరిస్థితులకు అలవాటు పడాల్సి వచ్చింది. రాజ్యమందిరంలో మళ్లీ చెక్క బల్లల మీద కూర్చోవడం అలవాటు చేసుకోవాల్సి వచ్చింది.” అయితే ఆయన నవ్వుతూ ఇంకా ఇలా అంటున్నాడు: “మీటింగ్స్‌లో చెప్పే విషయాల మీద ఎక్కువగా మనసుపెట్టడం వల్ల ఆ చెక్క బల్లలు నాకు ఇబ్బందిగా అనిపించలేదు.”

తర్వాత 2013 లో ఆయన జెరాల్డిన్‌ అనే సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా తొమ్మిది సంవత్సరాలు ఫ్రాన్స్‌లో ఉండి కామెరూన్‌కు తిరిగొచ్చింది. యెహోవా ఇష్టానికి మొదటి స్థానం ఇవ్వడం వల్ల ఆ జంట ఎలాంటి దీవెనలు పొందారు? ఒనేసిమ్‌ ఇలా అంటున్నాడు: “మేమిద్దరం కలిసి రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాం, బెతెల్‌లో సేవచేశాం. పోయిన సంవత్సరం మా సంఘంలో 20 మంది బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకున్నారు. నేను ఇప్పుడు ఎక్కువ ‘చేపలు’ పడే స్థలంలో ఉన్నట్టు అనిపిస్తోంది.” (మార్కు 1:17, 18) జెరాల్డిన్‌ ఇలా అంటోంది: “నేను ఊహించిన దానికన్నా ఎక్కువ దీవెనలు పొందాను.”

శిష్యుల్ని చేయడంలో ఉన్న ఆనందం

జూడిత్‌, శామ్‌-కాసెల్‌

జూడిత్‌ అనే సహోదరి కామెరూన్‌ నుండి అమెరికాకు వెళ్లింది, కానీ పరిచర్య ఎక్కువ చేయాలనే కోరిక ఆమెకు ఉండేది. ఆమె ఇలా అంటోంది: “మా కుటుంబ సభ్యుల్ని చూడడానికి కామెరూన్‌కు వెళ్లి తిరిగొచ్చే ప్రతీసారి నాకు బాధగా అనిపించేది. ఎందుకంటే అక్కడ నేను చాలా స్టడీలు మొదలుపెట్టేదాన్ని, వాళ్లను విడిచిపెట్టి రావాలంటే నాకు మనసు ఒప్పేది కాదు.” అయితే కామెరూన్‌కు పూర్తిగా తిరిగొచ్చేయడానికి ఆమె వెనకాడింది. ఎందుకంటే, కామెరూన్‌లో ఉంటున్న తన తండ్రికి వైద్యం జరగాలంటే ఆమె మంచి జీతం వచ్చే ఉద్యోగంలో కొనసాగాలి. అయినప్పటికీ యెహోవా మీద భారం వేసి ఆమె కామెరూన్‌కు వచ్చేసింది. విదేశాల్లో ఉన్నన్ని సౌకర్యాలు ఇక్కడ తనకు లేవని ఆమె ఒప్పుకుంటోంది. ఇక్కడ సర్దుకుపోవడానికి సహాయం చేయమని ఆమె యెహోవాకు ప్రార్థించింది. అంతేకాదు ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు, ఆయన భార్య జూడిత్‌ను ప్రోత్సహించి బలపర్చారు.

జూడిత్‌ ఇలా గుర్తుచేసుకుంటోంది: “మూడు సంవత్సరాల్లోనే నా బైబిలు విద్యార్థుల్లో నలుగురు బాప్తిస్మం తీసుకోవడం చూసి నాకు సంతోషంగా అనిపించింది.” ఆమె ప్రత్యేక పయినీరుగా సేవ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు తన భర్త శామ్‌-కాసెల్‌తో కలిసి ప్రాంతీయ సేవలో కొనసాగుతోంది. మరి వాళ్ల నాన్న ఎలా ఉన్నాడు? విదేశాల్లో ఉన్న ఒక హాస్పిటల్‌, వాళ్ల నాన్నకు ఉచితంగా ఆపరేషన్‌ చేయడానికి ఒప్పుకుంది. ఆ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది.

యెహోవా సహాయాన్ని రుచిచూడడం

కారోలిన్‌, విక్టర్‌

విక్టర్‌ అనే సహోదరుడు కామెరూన్‌ నుండి కెనడాకు వెళ్లాడు. ఉన్నత విద్య గురించిన ఒక కావలికోట ఆర్టికల్‌ చదివిన తర్వాత, ఆయన యూనివర్సిటీ విద్యను ఆపేసి, కొంతకాలంలోనే పూర్తయ్యే టెక్నికల్‌ కోర్సు తీసుకున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “దానివల్ల త్వరగా ఉద్యోగం దొరికింది, అంతేకాదు ఎప్పటినుండో కోరుకుంటున్న పయినీరు సేవను మొదలుపెట్టగలిగాను.” తర్వాత ఆయన కారోలిన్‌ అనే సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకసారి వాళ్లిద్దరూ కామెరూన్‌ బ్రాంచి కార్యాలయాన్ని చూడడానికి వెళ్లినప్పుడు, కామెరూన్‌లో సేవ చేయగలరేమో ఆలోచించమని సహోదరులు వాళ్లను ప్రోత్సహించారు. విక్టర్‌ ఇలా అంటున్నాడు: “ఆ ఆహ్వానాన్ని కాదనడానికి మా దగ్గర ఎలాంటి కారణమూ లేదు. అప్పటికే సాదాసీదాగా జీవించడం అలవాటు చేసుకున్నాం కాబట్టి మేము దాన్ని అంగీకరించగలిగాం.” కారోలిన్‌కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా, వాళ్లిద్దరూ కామెరూన్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఆసక్తిపరులకు ఎక్కువగా సహాయం చేయడం కోసం విక్టర్‌, కారోలిన్‌ కామెరూన్‌లో క్రమ పయినీర్లుగా సేవ చేయడం మొదలుపెట్టారు. దాచిపెట్టుకున్న డబ్బులు అయిపోయేంత వరకు వాళ్లకు ఉద్యోగం చేయాల్సిన అవసరం రాలేదు. తర్వాత వాళ్లు కొన్ని నెలలు కెనడాలో ఉద్యోగం చేయడానికి వెళ్లి, ఇక పూర్తిగా కామెరూన్‌కు తిరిగొచ్చేసి తమ పయినీరు సేవను కొనసాగించారు. వాళ్లు ఎలాంటి దీవెనలు పొందారు? వాళ్లు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు హాజరయ్యారు, ప్రత్యేక పయినీర్లుగా సేవ చేశారు, ఇప్పుడు నిర్మాణ పనిలో కొనసాగుతున్నారు. విక్టర్‌ ఇలా అంటున్నాడు: “సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టడం వల్ల మేము యెహోవా సహాయాన్ని రుచి చూడగలిగాం.”

యెహోవాకు సమర్పించుకునేలా ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం

స్టిఫనీ, అలన్‌

2002 లో, జర్మనీకి చెందిన అలన్‌ అనే సహోదరుడు యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు? అనే కరపత్రం చదివాడు. ఆ సమయంలో ఆయన యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కరపత్రం చదివాక ఆయన తన లక్ష్యాల్ని మార్చుకున్నాడు. 2006 లో ఆయన పరిచర్య శిక్షణా పాఠశాలకు వెళ్లాడు, తర్వాత తన స్వదేశమైన కామెరూన్‌లో సేవ చేయడానికి నియమించబడ్డాడు.

కామెరూన్‌ వెళ్లాక అలన్‌ ఒక పార్ట్‌-టైం ఉద్యోగం చేశాడు. తర్వాత ఆయన మంచి జీతం వచ్చే ఉద్యోగంలో చేరాడు. కానీ ఆ ఉద్యోగం వల్ల పరిచర్య ఎక్కువ చేయలేకపోతున్నానని ఆయన ఆందోళన పడ్డాడు. అందుకే, ప్రత్యేక పయినీరుగా సేవచేసే అవకాశం వచ్చినప్పుడు, తన యజమాని ఇస్తానన్న ఎక్కువ జీతాన్ని కూడా కాదనుకుని, ఆ నియామకాన్ని వెంటనే అంగీకరించాడు. తర్వాత, ఫ్రాన్స్‌లో ఎక్కువకాలం ఉండి కామెరూన్‌కు వచ్చిన స్టిఫనీ అనే సహోదరిని పెళ్లిచేసుకున్నాడు. కామెరూన్‌లో ఆమె ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది?

స్టిఫనీ ఇలా అంటోంది: “నాకు చిన్నచిన్న అనారోగ్య సమస్యలు, అలెర్జీలు వచ్చాయి. కానీ క్రమంగా మందులు వాడడం వల్ల అవి కాస్త తగ్గాయి.” వాళ్లిద్దరూ చూపించిన సహనానికి మంచి ఫలితాలు వచ్చాయి. అలన్‌ ఇలా అంటున్నాడు: “మేము కేట్‌ అనే ఒక మారుమూల గ్రామంలో ప్రీచింగ్‌కి వెళ్లినప్పుడు, చాలామంది బైబిలు స్టడీ పట్ల ఆసక్తి చూపించారు. తర్వాత, మేము వాళ్లతో ఫోన్‌ ద్వారా స్టడీలు చేయగలిగాం. వాళ్లలో ఇద్దరు బాప్తిస్మం తీసుకున్నారు, ఒక గ్రూపు కూడా ఏర్పడింది.” స్టిఫనీ ఇలా అంటోంది: “యెహోవాకు సమర్పించుకునేలా ఇతరులకు సహాయం చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ సేవ చేయడం వల్ల అలాంటి ఆనందాన్ని చాలాసార్లు రుచి చూశాం.” ఇప్పుడు అలన్‌, స్టిఫనీ ప్రాంతీయ సేవలో కొనసాగుతున్నారు.

“మేము చేయాల్సిందే చేశాం”

లియోన్స్‌, జసెల్‌

జసెల్‌ ఇటలీలో మెడికల్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు బాప్తిస్మం తీసుకుంది. తనకు స్టడీ ఇచ్చిన పయినీరు జంట సాదాసీదాగా జీవించడం ఆమెకు బాగా నచ్చింది, ఆమె కూడా పరిచర్య ఎక్కువ చేయాలని కోరుకుంది. కాబట్టి, చదువు పూర్తవుతుండగా ఆమె పయినీరు సేవ మొదలుపెట్టింది.

కామెరూన్‌కు తిరిగెళ్లి యెహోవా సేవ ఎక్కువగా చేయాలని జసెల్‌ కోరుకుంది, కానీ ఆమె కొన్ని విషయాల గురించి ఆందోళనపడింది. ఆమె ఇలా అంటోంది: “దానికోసం నేను ఇటలీ పౌరసత్వాన్ని వదులుకోవాలి, ఇటలీలో ఉన్న స్నేహితులకు అలాగే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి.” అయినప్పటికీ 2016, మే నెలలో ఆమె కామెరూన్‌కు వచ్చేసింది. కొంతకాలానికి ఆమె లియోన్స్‌ అనే సహోదరుణ్ణి పెళ్లిచేసుకుంది. తర్వాత కామెరూన్‌ బ్రాంచి కార్యాలయం, వాళ్లను అవసరం ఎక్కువున్న అయోస్‌ అనే పట్టణానికి వెళ్లమని చెప్పింది.

అయోస్‌లో జీవితం ఎలా ఉండేది? జసెల్‌ ఇలా చెప్తోంది: “వారాల తరబడి కరెంటు ఉండేది కాదు, ఫోన్‌లకు చార్జింగ్‌ పెట్టడం కుదిరేది కాదు. దానివల్ల అప్పుడప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించగలిగే వాళ్లం. నేను కట్టెల పొయ్యి మీద వండడం అలవాటు చేసుకున్నాను. నీళ్ల కోసం, జనాలు తక్కువగా ఉండే రాత్రి సమయంలో టార్చిలైటు వేసుకుని తోపుడు బండి తీసుకుని వెళ్లేవాళ్లం.” వీటన్నిటికి అలవాటు పడడానికి వాళ్లకేది సహాయం చేసింది? జసెల్‌ ఇలా చెప్తోంది: “యెహోవా పవిత్రశక్తి అలాగే నా భర్త ఇచ్చిన మద్దతు సహాయం చేశాయి. అంతేకాదు కుటుంబ సభ్యులు, స్నేహితులు మమ్మల్ని ప్రోత్సహించేవాళ్లు, అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేసేవాళ్లు.”

తన స్వదేశానికి తిరిగొచ్చినందుకు జసెల్‌ సంతోషిస్తోందా? ఆమె ఇలా అంటోంది: “అవును! సంతోషిస్తున్నాను. మొదట్లో కొన్ని ఇబ్బందులు, నిరుత్సాహం ఎదురైనా, ఒక్కసారి వాటినుండి బయటపడ్డాక మేము చేయాల్సిందే చేశాం అని నేను, నా భర్త అనుకున్నాం. యెహోవా మీద మాకున్న నమ్మకం, ఆయనతో మాకున్న సంబంధం బలపడ్డాయి.” వాళ్లిద్దరూ రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లారు, ఇప్పుడు తాత్కాలిక ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్నారు.

జాలర్లు ఎక్కువ చేపలు పట్టడానికి కష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పనిచేస్తారు. అదేవిధంగా, రాజ్య సందేశానికి స్పందించే మంచి మనసున్న ప్రజలకు సహాయం చేయడానికి సహోదర సహోదరీలు తమ స్వదేశాలకు తిరిగెళ్తున్నారు. అందుకోసం వాళ్లు ఇష్టపూర్వకంగా త్యాగాలు చేస్తున్నారు, కష్టపడి పని చేస్తున్నారు. తన పేరు విషయంలో వాళ్లు చూపించిన ప్రేమను యెహోవా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు, వాళ్లను ఆశీర్వదిస్తాడు. (నెహె. 5:19; హెబ్రీ. 6:10) మీరు వేరే దేశంలో ఉంటున్నారా? మీ స్వదేశంలో రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉంటే, మీరు అక్కడికి వెళ్లి సేవ చేయగలరా? అలా చేస్తే మీరు ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు.—సామె. 10:22.