కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

సామెతలు 24:16లో ఇలా ఉంది: “నీతిమంతుడు ఏడుసార్లు పడిపోవచ్చు, కానీ అతను మళ్లీ లేస్తాడు.” ఒక వ్యక్తి ఎన్నిసార్లు పాపంలో పడిపోయినా దేవుడు అతన్ని క్షమిస్తాడని ఆ లేఖనం చెప్తుందా?

లేదు. బదులుగా, ఒక వ్యక్తి పదేపదే సమస్యలు లేదా కష్టాల వల్ల పడిపోయినా తిరిగి లేస్తాడని అంటే కోలుకుంటాడని ఆ లేఖనం చెప్తుంది.

ఆ లేఖన సందర్భాన్ని పరిశీలించండి: “దుష్టుడిలా నీతిమంతుని ఇంటి దగ్గర కాపుకాయకు; అతని విశ్రాంతి స్థలాన్ని పాడుచేయకు. ఎందుకంటే నీతిమంతుడు ఏడుసార్లు పడిపోవచ్చు, కానీ అతను మళ్లీ లేస్తాడు, అయితే విపత్తు వచ్చినప్పుడు దుష్టుడు పూర్తిగా పడిపోతాడు. నీ శత్రువు పడిపోయినప్పుడు ఆనందపడకు, అతను తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషపడనివ్వకు.”—సామె. 24:15-17.

16వ వచనం ప్రకారం, ఒక వ్యక్తి పాపంలో పడిపోయినా, అతను పశ్చాత్తాపపడి తిరిగి దేవునితో మంచి సంబంధం కలిగి ఉండగలడని కొంతమంది అనుకున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు మత గురువులు ఇలా రాశారు: ‘ప్రాచీన కాలంలో, ఆధునిక కాలంలో సువార్తికులు ఆ లేఖనాన్ని అలాగే వివరించారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం, ఒక మంచి వ్యక్తి ఘోరమైన పాపంలో పదేపదే పడిపోయినా అతను దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాడు, తప్పు చేసిన ప్రతీసారి పశ్చాత్తాపపడి మళ్లీ లేస్తాడు.’ పాపం చేయాలనే కోరికతో పోరాడడం ఇష్టంలేని వ్యక్తికి అలాంటి అభిప్రాయం నచ్చవచ్చు. తను పదేపదే పాపం చేసినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడని అతను అనుకోవచ్చు.

కానీ 16వ వచనం అర్థం అది కాదు.

16, 17 వచనాల్లో “పడిపోవచ్చు,” “పడిపోయినప్పుడు” అని అనువదించబడిన హీబ్రూ పదాన్ని వేర్వేరు విధాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఒక ఎద్దు దారిలో పడిపోవడం, ఒక వ్యక్తి డాబా మీద నుండి పడడం, ఒక రాయి నేల మీద పడడం వంటి సందర్భాల్లో ఆ పదాన్ని ఉపయోగించవచ్చు. (ద్వితీ. 22:4, 8; ఆమో. 9:9) అంతేకాదు, సూచనార్థకంగా పడిపోవడం గురించి చెప్పడానికి కూడా ఆ పదాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఈ లేఖనం గమనించండి: “యెహోవా ఒక మనిషి మార్గాన్ని చూసి సంతోషించినప్పుడు, ఆయన అతని అడుగుల్ని నిర్దేశిస్తాడు. అతను తొట్రిల్లినా కింద పడిపోడు, ఎందుకంటే యెహోవా తన చేతితో అతన్ని ఆదుకుంటాడు.”—కీర్త. 37:23, 24; సామె. 11:5; 13:17; 17:20.

ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ హెచ్‌. ప్లంప్టర్‌ ఇలా అంటున్నాడు: “ఆ హీబ్రూ పదాన్ని, పాపంలో పడిపోవడం గురించి మాట్లాడడానికి ఉపయోగించరు.” అందుకే మరో పండితుడు 16వ వచనాన్ని ఇలా వివరిస్తున్నాడు: “దేవుని ప్రజలకు హాని చేయడానికి ప్రయత్నించడం వ్యర్థం, ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ వర్ధిల్లుతారు కానీ దుష్టులు వర్ధిల్లరు.”

కాబట్టి సామెతలు 24:16, పాపంలో పడిపోవడం గురించి మాట్లాడట్లేదు గానీ, సమస్యల్ని లేదా కష్టాల్ని పదేపదే ఎదుర్కోవడం గురించి మాట్లాడుతోందని స్పష్టమౌతుంది. ఇప్పుడున్న దుష్టలోకంలో ఒక నీతిమంతుడు అనారోగ్య సమస్యల్ని లేదా వేరే సమస్యల్ని ఎదుర్కోవచ్చు. అతను ప్రభుత్వాల నుండి తీవ్రమైన హింసను కూడా ఎదుర్కోవచ్చు. కానీ ఆ సమస్యల్ని తట్టుకుని ముందుకు వెళ్లడానికి దేవుడు సహాయం చేస్తాడని, మద్దతిస్తాడని అతను నమ్మకంతో ఉండవచ్చు. దేవుని సేవకులకు అలా జరగడం మీరు ఎన్నోసార్లు చూసివుంటారు. ఎందుకంటే, “పడిపోయే వాళ్లందర్నీ యెహోవా ఆదుకుంటాడు, కృంగిపోయిన వాళ్లందర్నీ ఆయన పైకి లేపుతాడు” అని బైబిలు మనకు అభయం ఇస్తుంది.—కీర్త. 41:1-3; 145:14-19.

“నీతిమంతుడు” ఇతరుల సమస్యల్ని చూసి సంతోషించడు గానీ, “సత్యదేవుని మీద భయభక్తులు ఉన్నవాళ్లకు మంచి జరుగుతుంది” అని తెలుసుకుని సంతోషిస్తాడు. ఎందుకంటే “వాళ్లు దేవునికి భయపడతారు.”—ప్రసం. 8:11-13; యోబు 31:3-6; కీర్త. 27:5, 6.