కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాబోయే కొత్త లోకానికి మీరు ఇప్పుడే సిద్ధపడవచ్చు

కొత్తలోకం దగ్గర్లో ఉంది!

కొత్తలోకం దగ్గర్లో ఉంది!

నీతిమంతులు శాశ్వతంగా జీవించేలా దేవుడు భూమిని సృష్టించాడు. (కీర్తన 37:29) ఆయన మొదటి జంట అయిన ఆదాము, హవ్వను అందమైన ఏదెను తోటలో పెట్టాడు. అంతేకాదు ఈ భూమిని సేద్యం చేసి, దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆయన వాళ్లకు, వాళ్ల పిల్లల పిల్లలకు ఇచ్చాడు.—ఆదికాండం 1:28; 2:15.

దేవుడు అనుకున్నట్లుగా భూమి ఇప్పుడు పరదైసులా లేదు. అయితే దేవుని ఆలోచన మారలేదు. ఆయన ఈ భూమిని పరదైసుగా ఎలా మారుస్తాడు? మనం ముందటి ఆర్టికల్స్‌లో చూసినట్టు దేవుడు ఈ భూమిని నాశనం చేయడు. బదులుగా నమ్మకమైన ప్రజలకు ఈ భూమ్మీద జీవించే అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు తనిచ్చిన మాటను నెరవేర్చినప్పుడు ఈ భూమ్మీద పరిస్థితులు ఎలా ఉంటాయి?

భూమంతటినీ ఒకే ప్రభుత్వం పరిపాలిస్తుంది

త్వరలో దేవుని పరలోక ప్రభుత్వం మనుషులందరినీ పరిపాలిస్తుంది. అప్పుడు ప్రజలు సంతోషంగా, ఐక్యంగా ఉంటారు. అంతేకాదు అందరికీ సంతృప్తికరమైన పని ఉంటుంది. భూమంతటిని పరిపాలించడానికి దేవుడు యేసుక్రీస్తును ఎన్నుకున్నాడు. ఇప్పుడున్న చాలామంది పరిపాలకులు ప్రజల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ, యేసు అలా కాదు. ఎందుకంటే ఆయన ప్రజల అవసరాల్ని పట్టించుకుంటాడు. ఆయన ప్రేమగల, దయగల, కరుణగల రాజు. అంతేకాదు ఆయన పక్షపాతాన్ని కూడా చూపించడు.—యెషయా 11:4.

భూమ్మీద ఉన్న ప్రజలందరూ ఐక్యంగా ఉంటారు

త్వరలో భూమ్మీద జీవించే ప్రజల మధ్య కులమత భేదాలు ఉండవు. వాళ్లందరూ ఒకే కుటుంబంలా ఐక్యంగా ఉంటారు. (ప్రకటన 7:9, 10) భూమ్మీద జీవించే ప్రజలందరూ దేవున్ని, తమ పొరుగువాళ్లను ప్రేమిస్తారు. అంతేకాదు దేవుడు మొదట్లో అనుకున్నట్టు, ఆయన వాళ్లకు ఇచ్చిన భూమిని చూసుకునే విషయంలో మనుషులందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసి పనిచేస్తారు.—కీర్తన 115:16.

ప్రశాంతమైన వాతావరణం

దేవుని రాజ్యం భూమిని పరిపాలించినప్పుడు, దేవుడు వాతావరణాన్ని పూర్తిగా అదుపు చేస్తాడు, అంటే ప్రకృతి విపత్తులు లేకుండా చేస్తాడు. (కీర్తన 24:1, 2) భూమ్మీద ఉన్నప్పుడు, యేసు ఒక భయంకరమైన తుఫానును అదుపు చేశాడు. దేవుని శక్తితోనే అలా చేశాడు. (మార్కు 4:39, 41) క్రీస్తు పరిపాలనలో ప్రకృతి విపత్తులు వస్తాయని మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని రాజ్యం జంతువులకు, మనుషులకు మధ్య శాంతిని తిరిగి తీసుకొస్తుంది.—హోషేయ 2:18.

మంచి ఆరోగ్యం, అందరికీ సరిపోయేంత ఆహారం

దేవుని రాజ్యంలో ప్రతీ ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎవ్వరికీ అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం ఉండదు. (యెషయా 35:5, 6) ఒకప్పుడు ఏదెను తోటలో మొదటి దంపతులు అందమైన, పరిశుభ్రమైన వాతావరణంలో జీవించారు. అలాంటి వాతావరణాన్ని మళ్లీ ప్రజలందరూ ఆనందిస్తారు. ఏదెను తోటలో పండినట్టే, కొత్తలోకంలో కూడా అందరికీ సరిపోయేంత పంట పండుతుంది. అప్పుడు ప్రజలందరూ తినడానికి కావాల్సినంత ఆహారం ఉంటుంది. (ఆదికాండం 2:9) దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగే, పరదైసులో ప్రతీ ఒక్కరూ “కడుపునిండా ఆహారం తింటారు.”—లేవీయకాండం 26:4, 5.

శాంతిభద్రతలు

దేవుని ప్రపంచవ్యాప్త ప్రభుత్వం కింద ప్రజలందరూ శాంతిని అనుభవిస్తారు. అంతేకాదు ఒకరితో ఒకరు దయగా, పక్షపాతం లేకుండా ఉంటారు. అప్పుడు ఇక ఎవ్వరూ యుద్ధాలు చేయరు. తమ అధికారాన్ని తప్పుగా ఉపయోగించరు. అలాగే తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇప్పటిలా మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. బైబిలు ఇలా మాటిస్తుంది: “వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ ద్రాక్షచెట్టు కింద, తమ అంజూర చెట్టు కింద కూర్చుంటారు, ఎవ్వరూ వాళ్లను భయపెట్టరు.”—మీకా 4:3, 4.

అందరికీ మంచి ఇళ్లు, సంతృప్తినిచ్చే పని

ప్రతీ కుటుంబానికి ఒక మంచి ఇళ్లు ఉంటుంది. దాన్ని పోగొట్టుకుంటామేమో అనే భయం అప్పుడు ఉండదు. అలాగే మనం చేసే పనికి పూర్తి ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. బైబిలు చెప్తున్నట్లు, దేవుడు తెచ్చే కొత్తలోకంలో ఎవ్వరూ “వృథాగా ప్రయాసపడరు.” అంటే వాళ్ల కష్టం వల్ల వచ్చిన ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తారు.—యెషయా 65:21-23.

ఉత్తమమైన విద్య

బైబిలు ఇలా మాటిస్తుంది: “భూమి యెహోవా గురించిన జ్ఞానంతో నిండిపోతుంది.” (యెషయా 11:9) దేవుని రాజ్యంలో జీవించే ప్రజలు తమ సృష్టికర్త అయిన యెహోవాకు ఉన్న అద్భుతమైన జ్ఞానం నుండి, ఆయన అందమైన సృష్టి నుండి ఎన్నో నేర్చుకుంటారు. వాళ్లకు ఉన్న తెలివిని ఆయుధాలు తయారు చేయడానికి, లేదా ప్రజలకు హాని చేయడానికి ఉపయోగించరు. (యెషయా 2:4) బదులుగా, వాళ్లు ఒకరితో ఒకరు శాంతిగా ఎలా ఉండాలో, భూమిని ఎలా చూసుకోవాలో నేర్చుకుంటారు.—కీర్తన 37:11

శాశ్వత జీవితం

దేవుడు భూమిని సృష్టించడానికి చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఎందుకంటే మనుషులు ప్రతిరోజూ జీవితాన్ని ఆనందించాలని, ఈ భూమ్మీద శాశ్వతంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్తన 37:29; యెషయా 45:18) అందుకే “ఇక ఎప్పుడూ ఉండకుండా మరణాన్ని ఆయన మింగేస్తాడు.” (యెషయా 25:8) అంతేకాదు “మరణం ఇక ఉండదు, దుఃఖం గాని, ఏడ్పు గాని, నొప్పి గాని ఇక ఉండవు” అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 21:4) దేవుడు ఈ చెడ్డ లోకాన్ని నాశనం చేసినప్పుడు, తను కాపాడే వాళ్లకు, కొత్తలోకంలో తిరిగి బ్రతికే వాళ్లకు శాశ్వత జీవితాన్ని ఇస్తాడు.—యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యాలు 24:15.

దేవుని రాజ్యం చాలా దగ్గర్లో ఉంది. దానిలో జీవించడానికి లక్షలమంది ఇప్పటినుండే సిద్ధపడుతున్నారు. ఆ ప్రజలు అపరిపూర్ణులే కానీ, కొత్త లోకంలో జీవించడానికి ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని ఇప్పటి నుండే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా? యెహోవా దేవుని గురించి ఆయన పంపించిన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం ద్వారా వాళ్లు అలా చేస్తున్నారు.—యోహాను 17:3.

ఈ లోకాంతాన్ని తప్పించుకోడానికి, రాబోయే కొత్త లోకంలో జీవించడానికి మీరు ఏం చేయాలో ఇంకా ఎక్కువగా తెలుసుకోండి. దానికోసం యెహోవాసాక్షుల్లో ఒకరి దగ్గర, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకంతో ఉచిత బైబిలు స్టడీ కోర్సు తీసుకోండి.