కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి భవిష్యత్తు పొందే మార్గాన్ని ఎవరు చూపిస్తారు?

మంచి భవిష్యత్తు పొందే మార్గాన్ని ఎవరు చూపిస్తారు?

ముందు పేజీల్లో తెలుసుకున్నట్టు, మంచి భవిష్యత్తు పొందాలనేది ప్రతీఒక్కరి కోరిక. దానికోసం కొంతమంది అదృష్టాన్ని, తలరాతను నమ్ముతుంటే; ఇంకొంతమంది చదువు మీద, డబ్బు మీద ఆధారపడుతున్నారు. ఇంకొందరు సాటిమనుషులకు మేలు చేస్తే మంచి భవిష్యత్తు దొరుకుతుందని ఆశపడుతున్నారు. కానీ అవేవీ వాళ్లు కోరుకున్న జీవితాన్ని ఇవ్వట్లేదు. వాటిమీద ఆధారపడడం ఎలాంటిదంటే, తప్పు మ్యాప్‌ సహాయంతో ఒక కొత్త ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించడం లాంటిది. మరి మంచి భవిష్యత్తు ఎలా పొందాలో తెలుసుకునే మార్గమే లేదా? ఉంది!

ఉత్తమమైన సలహాలు ఎవరు ఇస్తారు?

మామూలుగా మనం ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకన్నా పెద్దవాళ్లను, తెలివైనవాళ్లను, అనుభవం ఉన్నవాళ్లను సలహాలు అడుగుతాం. అదేవిధంగా, మంచి భవిష్యత్తు ఎలా పొందాలో తెలుసుకోవడానికి వయసులో, తెలివిలో మనకన్నా చాలా ఉన్నతుడైన వ్యక్తి ఇచ్చే సలహాల మీద ఆధారపడాలి. అలాంటి ఆయన ఇచ్చిన సలహాలన్నీ ఒక గ్రంథంలో ఉన్నాయి. అది సుమారు 3,500 సంవత్సరాల క్రితమే రాయబడింది. ఆ గ్రంథాన్ని “బైబిలు” అని పిలుస్తారు.

బైబిల్లో ఉన్న విషయాల్ని మీరెందుకు నమ్మవచ్చు? ఎందుకంటే దాన్ని ఇచ్చిన ఆయన విశ్వంలోనే అందరికన్నా పెద్దవాడు, తెలివైనవాడు. ఆయనకు ఉన్నంత అనుభవం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆయన “మహా వృద్ధుడు” “యుగయుగాల నుండి ఉన్నాడు.” (దానియేలు 7:9; కీర్తన 90:2) ‘ఆయనే ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని నిర్మించాడు.’ (యెషయా 45:18) తన పేరు యెహోవా అని, స్వయంగా ఆయనే బైబిల్లో తెలియజేశాడు.—కీర్తన 83:18.

ఫలానా దేశంవాళ్లు లేదా ఫలానా భాషవాళ్లు గొప్పవాళ్లని బైబిలు చెప్పట్లేదు. ఎందుకంటే బైబిల్ని రాయించిన యెహోవాయే అన్నిరకాల ప్రజల్ని సృష్టించాడు. బైబిల్లో ఉన్న సలహాలు వెనుకటి కాలంలోని ప్రజలకు ఉపయోగపడ్డాయి, మనకాలంలోని వాళ్లకు కూడా ఉపయోగపడుతున్నాయి. దేశం, భాష అనే తేడా లేకుండా ఆ సలహాలు పాటించిన ప్రతీఒక్కరూ ప్రయోజనం పొందుతున్నారు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బైబిలు కొన్ని వేల భాషల్లో ఉంది; పైగా ప్రపంచంలో ఎక్కువమంది ప్రజల దగ్గర ఉంది. * కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నవాళ్లయినా బైబిల్ని చదివి తేలిగ్గా అర్థంచేసుకోవచ్చు, అందులోని సలహాల్ని పాటించి ప్రయోజనం పొందవచ్చు. దీన్నిబట్టి, బైబిలు చెప్తున్న ఈ మాటలు నిజమని స్పష్టమౌతోంది:

“దేవునికి పక్షపాతం లేదు. ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.” —అపొస్తలుల కార్యాలు 10:34, 35.

తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమిస్తారు, సరైన దారిలో నడిపిస్తారు. అలాగే మనందరికీ తండ్రి అయిన యెహోవా కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన రాయించిన బైబిలు ద్వారా మనకు సరైన దారేదో చూపిస్తున్నాడు. (2 తిమోతి 3:16) ఆయనిచ్చే సలహాల్ని మనం నమ్మవచ్చు. ఎందుకంటే యెహోవాయే మనల్ని చేశాడు, మన జీవితం బాగుండాలంటే మనం ఏం చేయాలో ఆయనకే బాగా తెలుసు.

ఇలాంటి మంచి జీవితం పొందాలంటే మీరు ఏం చేయాలి? తర్వాతి పేజీల్లో తెలుసుకుందాం.

^ పేరా 6 అనువదించడం, పంచిపెట్టడం విషయంలో బైబిలుకున్న చరిత్ర గురించి తెలుసుకోవడానికి www.pr418.com/te లో బైబిలు బోధలు అనే సెక్షన్‌లో > చరిత్ర, బైబిలు అనే విభాగం చూడండి.