కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 2

“యేసు ప్రేమించిన శిష్యుడి” నుండి పాఠాలు

“యేసు ప్రేమించిన శిష్యుడి” నుండి పాఠాలు

“మనం ఒకరినొకరం ప్రేమిస్తూనే ఉందాం; ఎందుకంటే ప్రేమకు మూలం దేవుడు.”—1 యోహా. 4:7.

పాట 105 “దేవుడు ప్రేమ”

ఈ ఆర్టికల్‌లో . . . *

1. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం వల్ల మీకెలా అనిపిస్తుంది?

“దేవుడు ప్రేమ” అని అపొస్తలుడైన యోహాను రాశాడు. (1 యోహా. 4:8) ఆ చిన్న వాక్యం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. అదేంటంటే, జీవానికి మూలమైన దేవుడే ప్రేమకు కూడా మూలం. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు! అది తెలుసుకోవడం వల్ల మనకు సురక్షితంగా, సంతోషంగా, సంతృప్తిగా అనిపిస్తుంది.

2. మత్తయి 22:37-40 ప్రకారం, అన్నిటికన్నా ముఖ్యమైన రెండు ఆజ్ఞలు ఏంటి? రెండో ఆజ్ఞను పాటించడం మనకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

2 క్రైస్తవులు ఖచ్చితంగా ప్రేమ చూపించాలి, ఎందుకంటే అది ఒక ఆజ్ఞ. (మత్తయి 22:37-40 చదవండి.) యెహోవాను బాగా తెలుసుకున్నప్పుడు, మొదటి ఆజ్ఞను పాటించడం మనకు తేలిగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే యెహోవా పరిపూర్ణుడు, ఆయన మనల్ని పట్టించుకుంటాడు, మనతో దయగా వ్యవహరిస్తాడు. కానీ రెండో ఆజ్ఞను పాటించడం మనకు కష్టంగా ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే మనకు అతి సన్నిహితంగా ఉండే సాటిమనుషులు మన సహోదర సహోదరీలే, వాళ్లు అపరిపూర్ణులు. కొన్నిసార్లు వాళ్లు మనమీద శ్రద్ధ, దయ లేదన్నట్టుగా మాట్లాడవచ్చు, ప్రవర్తించవచ్చు. మనకు ఆ సమస్య ఎదురౌతుందని తెలిసే యెహోవా కొంతమంది వ్యక్తుల ద్వారా ఒకరి మీద ఒకరం ఎందుకు, ఎలా ప్రేమ చూపించుకోవాలో బైబిల్లో రాయించాడు. వాళ్లలో ఒకరు, యోహాను.—1 యోహా. 3:11, 12.

3. యోహాను ఏం నొక్కిచెప్పాడు?

3 యోహాను తాను రాసిన పుస్తకాల్లో, క్రైస్తవులు ప్రేమ చూపించాలని నొక్కిచెప్పాడు. నిజానికి, ‘ప్రేమ’ అనే పదం మిగతా మూడు సువార్త పుస్తకాల్లో కలిపి ఎన్నిసార్లు ఉందో, అంతకన్నా ఎక్కువసార్లు యోహాను సువార్తలో ఉంది. సువార్త పుస్తకాన్ని, మూడు ఉత్తరాల్ని రాసే సమయానికి యోహాను వయసు దాదాపు వందేళ్లు. దైవప్రేరణతో రాసిన ఆ పుస్తకాలు, క్రైస్తవుడు చేసే ప్రతీ పనిలో ప్రేమ కనిపించాలని నొక్కి చెప్తున్నాయి. (1 యోహా. 4:10, 11) అయితే, ఆ విషయాన్ని నేర్చుకోవడానికి యోహానుకు కాస్త సమయం పట్టింది.

4. యోహాను అన్ని సందర్భాల్లో ఇతరుల మీద ప్రేమ చూపించాడా?

4 యువకుడిగా ఉన్నప్పుడు యోహాను కొన్నిసార్లు ప్రేమ చూపించడంలో విఫలమయ్యాడు. ఉదాహరణకు ఒక సందర్భంలో యేసు, ఆయన శిష్యులు సమరయ గుండా యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఒక సమరయ గ్రామంవాళ్లు వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడు యోహాను ఎలా స్పందించాడు? ఆయన ఆ గ్రామంలో ఉన్న వాళ్లందరినీ నాశనం చేయడానికి ఆకాశం నుండి అగ్నిని రప్పించమంటావా అని యేసును అడిగాడు! (లూకా 9:52-56) మరో సందర్భంలో, యోహాను తోటి అపొస్తలుల మీద ప్రేమ చూపించడంలో విఫలమయ్యాడు. యోహాను, ఆయన సహోదరుడైన యాకోబు రాజ్యంలో తమకు ప్రముఖ స్థానాలు ఇవ్వమని యేసును అడిగారు. బహుశా వాళ్ల అమ్మ చేత అలా అడిగించి ఉంటారు. వాళ్లు చేసింది తెలిసినప్పుడు మిగతా అపొస్తలులకు చాలా కోపం వచ్చింది! (మత్త. 20:20, 21, 24) యోహాను ఆ పొరపాట్లన్నీ చేసినా యేసు ఆయన్ని ప్రేమించాడు.—యోహా. 21:7.

5. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

5 ఈ ఆర్టికల్‌లో యోహాను ఉంచిన ఆదర్శాన్ని, ప్రేమ గురించి ఆయన రాసిన కొన్ని విషయాల్ని పరిశీలిస్తాం. అలా పరిశీలిస్తున్నప్పుడు, మన సహోదర సహోదరీల మీద ఎలా ప్రేమ చూపించవచ్చో తెలుసుకుంటాం. అంతేకాదు, ఒక కుటుంబ పెద్ద తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని చూపించే ఒక ముఖ్యమైన మార్గం ఏంటో కూడా తెలుసుకుంటాం.

ప్రేమను చేతల్లో చూపించండి

మనకోసం చనిపోయేలా తన కుమారుణ్ణి భూమ్మీదికి పంపించడం ద్వారా యెహోవా మనమీద ప్రేమ చూపించాడు (6-7 పేరాలు చూడండి)

6. మనమీద తనకున్న ప్రేమను యెహోవా ఎలా తెలియజేశాడు?

6 సాధారణంగా ప్రేమ అంటే దయగల మాటల్లో వ్యక్తమయ్యే ఒక మంచి భావన అనుకుంటాం. కానీ నిజమైన ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లో కూడా కనిపిస్తుంది. (యాకోబు 2:17, 26 తో పోల్చండి.) ఉదాహరణకు, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు. (1 యోహా. 4:19) ఆయన ఆ ప్రేమను బైబిల్లో రాయించిన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. (కీర్త. 25:10; రోమా. 8:38, 39) అయితే యెహోవా మాటల్లోనే కాదు, చేతల్లో కూడా మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు. యోహాను ఇలా రాశాడు: “దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి లోకంలోకి పంపించినప్పుడు ఆయనకు మనమీద ఉన్న ప్రేమ వెల్లడైంది. ఆ కుమారుని ద్వారా మనం జీవం పొందాలని దేవుడు ఆయన్ని పంపించాడు.” (1 యోహా. 4:9) మనకోసం తన కుమారుడు బాధలు అనుభవించి చనిపోయేలా యెహోవా అనుమతించాడు. (యోహా. 3:16) యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు అనడంలో ఏదైనా సందేహం ఉందా?

7. మనమీద తనకున్న ప్రేమను యేసు ఎలా చూపించాడు?

7 యేసు తన శిష్యుల్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. (యోహా. 13:1; 15:15) వాళ్లమీద, మనమీద తనకెంత ప్రగాఢమైన ప్రేమ ఉందో యేసు మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించాడు. ఆయన ఇలా అన్నాడు: “స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు.” (యోహా. 15:13) యెహోవా, యేసు మనకోసం చేసినవాటి గురించి ఆలోచించినప్పుడు మనం ఏం చేయాలని కోరుకుంటాం?

8. మనం ఏం చేయాలని 1 యోహాను 3:18 చెప్తుంది?

8 యెహోవా, యేసు ఆజ్ఞాపించిన వాటిని పాటించడం ద్వారా మనం వాళ్లను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. (యోహా. 14:15; 1 యోహా. 5:3) మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలని యేసు ఆజ్ఞాపించాడు. (యోహా. 13:34, 35) మన సహోదర సహోదరీల్ని ప్రేమిస్తున్నామని మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించాలి. (1 యోహాను 3:18 చదవండి.) అందుకోసం మనం చేయగల కొన్ని పనులేంటి?

మీ సహోదర సహోదరీల్ని ప్రేమించండి

9. ఏం చేసేలా ప్రేమ యోహానును కదిలించింది?

9 కావాలనుకుంటే యోహాను తన తండ్రితోపాటే ఉండి, చేపల వ్యాపారం కొనసాగిస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన తన మిగతా జీవితమంతా యెహోవా గురించి, యేసు గురించి ఇతరులకు నేర్పించడానికే అంకితం చేశాడు. యోహాను ఎంచుకున్న జీవితం అంత తేలికైందేమీ కాదు. ఆయన హింసను అనుభవించాడు. అంతేకాదు మొదటి శతాబ్దం ముగింపులో, వృద్ధుడిగా ఉన్నప్పుడు బందీగా తీసుకెళ్లబడ్డాడు. (అపొ. 3:1; 4:1-3; 5:18; ప్రక. 1:9) యేసు గురించి ప్రకటిస్తున్నందుకు బంధించబడినా, యోహాను ఇతరుల గురించే ఆలోచిస్తున్నానని చూపించాడు. ఉదాహరణకు, ఆయన పత్మాసు ద్వీపంలో బందీగా ఉన్నప్పుడు దేవుడు తనకు బయల్పర్చిన విషయాల్ని రాసి, “త్వరలో జరగబోయేవాటిని” సంఘాలు కూడా తెలుసుకునేలా దాన్ని పంపించాడు. (ప్రక. 1:1) తర్వాత, అంటే బహుశా పత్మాసు నుండి విడుదలైన తర్వాత ఆయన యేసు జీవితం, పరిచర్య గురించి సువార్త పుస్తకాన్ని రాశాడు. తన సహోదర సహోదరీల్ని ప్రోత్సహించడానికి, బలపర్చడానికి మూడు ఉత్తరాలు కూడా రాశాడు. యోహాను చూపించిన స్వయంత్యాగ స్ఫూర్తిని మీరెలా అనుకరించవచ్చు?

10. మీరు ప్రజల్ని ప్రేమిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

10 మీరు ఎలాంటి జీవితాన్ని ఎంచుకుంటారు అనే దాన్నిబట్టి కూడా మీకు ప్రజల మీద ప్రేమ ఉందని చూపించవచ్చు. మీ సమయాన్ని, శక్తిని మీ కోసమే ఉపయోగించి డబ్బు, పేరుప్రతిష్ఠలు సంపాదించాలని సాతాను లోకం చెప్తుంది. కానీ, స్వయంత్యాగ స్ఫూర్తి చూపిస్తున్న రాజ్య ప్రచారకులు ప్రపంచవ్యాప్తంగా మంచివార్త ప్రకటించడానికి, యెహోవాకు దగ్గరయ్యేలా ప్రజలకు సహాయం చేయడానికి వీలైనంత ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. కొంతమందైతే పూర్తికాల సేవను కూడా ఎంచుకున్నారు.

సహోదర సహోదరీల్ని, కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తున్నామని మన చేతల్లో చూపిస్తాం (11, 17 పేరాలు చూడండి) *

11. యెహోవా మీద, సహోదర సహోదరీల మీద ప్రేమ ఉందని చాలామంది నమ్మకమైన ప్రచారకులు ఎలా చూపిస్తున్నారు?

11 చాలామంది నమ్మకమైన క్రైస్తవులు తమను, తమ కుటుంబాల్ని పోషించుకోవడానికి ఫుల్‌-టైం ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ, ఆ నమ్మకమైన ప్రచారకులు దేవుని సంస్థకు మద్దతివ్వడానికి తాము చేయగలిగింది చేస్తున్నారు. ఉదాహరణకు, కొంతమంది విపత్తు సహాయక పనుల్లో పాల్గొనగలుగుతున్నారు, ఇంకొంతమంది నిర్మాణ పనుల్లో సహాయం చేయగలుగుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్త పనికి విరాళమిచ్చే అవకాశం ప్రతీఒక్కరికి ఉంది. దేవుణ్ణి, సాటిమనిషిని ప్రేమిస్తున్నారు కాబట్టే వాళ్లు అలా చేస్తున్నారు. మనం ప్రతీవారం మీటింగ్స్‌కి వెళ్లడం ద్వారా, వాటిలో పాల్గొనడం ద్వారా మన సహోదర సహోదరీల మీదున్న ప్రేమను చూపిస్తున్నాం. మనం అలసిపోయినా మీటింగ్స్‌కి వెళ్తున్నాం, కాస్త భయం వేసినా కామెంట్స్‌ చెప్తున్నాం, అంతేకాదు మనందరికీ సమస్యలు ఉన్నా మీటింగ్‌కి ముందు లేదా తర్వాత ఇతరుల్ని ప్రోత్సహిస్తున్నాం. (హెబ్రీ. 10:24, 25) మన ప్రియ సహోదర సహోదరీలందరూ చేస్తున్న కృషి నిజంగా అమూల్యమైనది!

12. యోహాను తన సహోదర సహోదరీల మీద ఇంకా ఏవిధంగా ప్రేమ చూపించాడు?

12 యోహాను సహోదర సహోదరీల్ని మెచ్చుకోవడమే కాదు, వాళ్లకు సలహా ఇవ్వడం ద్వారా కూడా వాళ్లమీద ప్రేమ ఉందని చూపించాడు. ఉదాహరణకు, ఆయన తన ఉత్తరాల్లో సహోదర సహోదరీల విశ్వాసాన్ని, వాళ్ల మంచి పనుల్ని మెచ్చుకున్నాడు. అయితే, పాపం గురించి ఆయన వాళ్లను సూటిగా హెచ్చరించాడు కూడా. (1 యోహా. 1:8–2:1, 13, 14) అదేవిధంగా, మన సహోదర సహోదరీలు చేస్తున్న మంచి పనుల్ని మనం మెచ్చుకోవాలి. కానీ ఎవరైనా చెడు వైఖరిని లేదా అలవాటును వృద్ధి చేసుకుంటున్నారని తెలిస్తే, నేర్పుగా వాళ్లకు అవసరమైన సలహా ఇవ్వడం ద్వారా మనం ప్రేమ చూపించవచ్చు. స్నేహితునికి సలహా ఇవ్వాలంటే ధైర్యం కావాలి. కానీ నిజమైన స్నేహితులు ఒకరికొకరు పదును పెట్టుకుంటారని, అంటే సరిదిద్దుకుంటారని బైబిలు చెప్తుంది.—సామె. 27:17.

13. మనం ఏం చేయకూడదు?

13 కొన్ని పనులు చేయకుండా ఉండడం ద్వారా కూడా సహోదర సహోదరీల మీద మనకు ప్రేమ ఉందని చూపిస్తాం. ఉదాహరణకు, మనం వాళ్ల మాటలకు వెంటనే నొచ్చుకోం. యేసు భూజీవితం చివర్లో జరిగిన ఒక సంఘటన పరిశీలించండి. జీవాన్ని పొందాలంటే తన శరీరాన్ని తిని, తన రక్తాన్ని తాగాలని యేసు తన శిష్యులతో అన్నాడు. (యోహా. 6:53-57) ఆ మాటలకు అభ్యంతరపడి శిష్యుల్లో చాలామంది ఆయన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ఆయన నిజమైన స్నేహితులు అంటే యోహాను, మరితరులు అలా చేయలేదు. వాళ్లు ఆయన్ని నమ్మకంగా అంటిపెట్టుకుని ఉన్నారు. యేసు చెప్పింది వాళ్లకు అర్థం కాకపోయినా, ఆశ్చర్యం కలిగించినా వాళ్లు అభ్యంతరపడలేదు. ఆయన సత్యమే మాట్లాడతాడని తెలుసు కాబట్టి వాళ్లు ఆయన్ని నమ్మారు. (యోహా. 6:60, 66-69) మన స్నేహితుల మాటలకు వెంటనే నొచ్చుకోకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా! వాళ్ల మాటల్ని అపార్థం చేసుకునే బదులు, వాళ్ల ఉద్దేశం ఏంటో వివరించే అవకాశం వాళ్లకు ఇవ్వాలి.—సామె. 18:13; ప్రసం. 7:9.

14. మన హృదయంలో ద్వేషం పెరగకుండా మనం ఎందుకు జాగ్రత్తపడాలి?

14 మన సహోదర సహోదరీల్ని ద్వేషించకూడదని కూడా యోహాను సలహా ఇస్తున్నాడు. ఒకవేళ ఆ సలహాను పాటించకపోతే మనమే సాతానుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. (1 యోహా. 2:11; 3:15) క్రీ.శ. మొదటి శతాబ్దం చివర్లో కొంతమందికి అలా జరిగింది. దేవుని ప్రజల మధ్య ద్వేషాన్ని పెంపొందించి, వాళ్ల ఐక్యతను దెబ్బతీయడానికి సాతాను శతవిధాలా ప్రయత్నించాడు. యోహాను తన ఉత్తరాల్ని రాసే సమయానికి, సంఘంలో కొందరి ప్రవర్తన సాతానే స్వయంగా సంఘంలోకి చొరబడ్డాడా అన్నట్టు ఉంది. ఉదాహరణకు, దియొత్రెఫే సంఘంలో తీవ్రమైన విభజనలు సృష్టించడానికి ప్రయత్నించాడు. (3 యోహా. 9, 10) పరిపాలక సభ పంపిన ప్రయాణ ప్రతినిధుల్ని అతను గౌరవించలేదు. అంతేకాదు తనకు నచ్చనివాళ్లకు ఆతిథ్యమిస్తున్న క్రైస్తవుల్ని సంఘం నుండి వెళ్లగొట్టడానికి ప్రయత్నించాడు. అతను ఎంత అహంకారంగా ప్రవర్తించాడో కదా! దేవుని ప్రజల్ని విభజించి, పాలించడానికి సాతాను ఇప్పుడు కూడా అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నాడు. మనం మన సహోదరుల్ని ఎన్నడూ ద్వేషించకూడదు, వాళ్లకు మద్దతివ్వడం ఆపకూడదు.

మీ కుటుంబాన్ని ప్రేమించండి

యేసు తన తల్లి భౌతిక, ఆధ్యాత్మిక అవసరాల్ని చూసుకునే బాధ్యతను యోహానుకు అప్పగించాడు. నేడు కుటుంబ పెద్దలు తమ ఇంటివాళ్ల అవసరాల్ని తీర్చాలి (15-16 పేరాలు చూడండి)

15. ఒక కుటుంబ పెద్ద ఏం గుర్తుంచుకోవాలి?

15 కుటుంబ పెద్ద తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని చూపించే ఒక ముఖ్యమైన మార్గం, వాళ్లకు అవసరమైనవి సమకూర్చడం. (1 తిమో. 5:8) అయితే తన కుటుంబ భౌతిక అవసరాలు తీర్చడం కన్నా, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడం మరింత ప్రాముఖ్యమని ఆయన గుర్తుంచుకోవాలి. (మత్త. 5:3) కుటుంబ పెద్దలకు యేసు ఎలాంటి ఆదర్శం ఉంచాడో గమనించండి. యోహాను సువార్త చెప్తున్నట్టు, హింసాకొయ్య మీద చనిపోతున్న చివరి క్షణాల్లో కూడా యేసు తన కుటుంబం గురించి ఆలోచించాడు. యేసుకు మరణశిక్ష వేస్తున్న చోట ఆయన తల్లి మరియ, యోహాను నిలబడి ఉన్నారు. తీవ్రమైన వేదన అనుభవిస్తూ కూడా యేసు మరియ బాగోగుల్ని చూసుకునే బాధ్యతను యోహానుకు అప్పగించాడు. (యోహా. 19:26, 27) యేసు తమ్ముళ్లు, చెల్లెళ్లు మరియ భౌతిక అవసరాలు చూసుకుంటారు, కానీ అప్పటికింకా వాళ్లలో ఎవ్వరూ శిష్యులు అవ్వలేదని తెలుస్తోంది. కాబట్టి యేసు మరియ భౌతిక అవసరాలే కాకుండా, ఆధ్యాత్మిక అవసరాలు కూడా తీరే ఏర్పాటు చేశాడు.

16. యోహానుకు ఏ బాధ్యతలు ఉండేవి?

16 యోహానుకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అపొస్తలుల్లో ఒకడిగా ఆయన ప్రకటనా పనిని ముందుండి నడిపించాడు. బహుశా ఆయనకు పెళ్లయి ఉంటుంది. కాబట్టి తన కుటుంబ భౌతిక అవసరాల్ని, ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చడానికి ఎంతో కష్టపడి పనిచేసి ఉంటాడు. (1 కొరిం. 9:5) నేడున్న కుటుంబ పెద్దలు యోహాను నుండి ఏం నేర్చుకోవచ్చు?

17. కుటుంబ పెద్దకు తన కుటుంబం విషయంలో ఏ ప్రాముఖ్యమైన బాధ్యత ఉంది? దానివల్ల ఆయన కుటుంబం ఎలా ప్రయోజనం పొందుతుంది?

17 కుటుంబ పెద్దగా ఉన్న ఒక సహోదరునికి ఎన్నో బరువైన బాధ్యతలు ఉండవచ్చు. ఉదాహరణకు, ఆయన తన ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తూ యెహోవాకు మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలి. (ఎఫె. 6:5, 6; తీతు 2:9, 10) అంతేకాదు సంఘంలో ఆయనకు కాపరి సందర్శనాలు చేయడం, ప్రకటనా పనిని ముందుండి నడిపించడం వంటి బాధ్యతలు కూడా ఉండవచ్చు. ఆయన తన భార్యాపిల్లలతో కలిసి బైబిల్ని క్రమంగా అధ్యయనం చేయడం కూడా ప్రాముఖ్యం. తమ భౌతిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చడానికి ఆయన చేస్తున్న కృషిని కుటుంబ సభ్యులు తప్పకుండా విలువైనదిగా ఎంచుతారు.—ఎఫె. 5:28, 29; 6:4.

‘నా ప్రేమలో నిలిచి ఉండండి’

18. యోహాను ఏం నమ్మాడు?

18 యోహాను ఎన్నో ఏళ్లు జీవించాడు, తన జీవితంలో చాలా చూశాడు. తన విశ్వాసాన్ని బలహీనపర్చగల అన్నిరకాల కష్టాల్ని ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఎప్పుడూ యేసు ఆజ్ఞల్ని పాటించడానికి, మరిముఖ్యంగా సహోదర సహోదరీల్ని ప్రేమించాలనే ఆజ్ఞను పాటించడానికి శాయశక్తులా కృషిచేశాడు. దానివల్ల యెహోవా, యేసు తనను ప్రేమిస్తున్నారని; ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి కావాల్సిన బలాన్ని వాళ్లు ఇస్తారని యోహాను నమ్మాడు. (యోహా. 14:15-17; 15:10; 1 యోహా. 4:16) సహోదర సహోదరీల్ని ప్రేమించకుండా, మాటల్లో-చేతల్లో ఆ ప్రేమను చూపించకుండా సాతాను గానీ అతని లోకం గానీ యోహానును ఆపలేకపోయాయి.

19. మనం ఏం చేయాలని 1 యోహాను 4:7 ప్రోత్సహిస్తుంది? ఎందుకు?

19 యోహానులాగే మనం కూడా, ఎవ్వరి మీదా ప్రేమలేని సాతాను పరిపాలిస్తున్న లోకంలో జీవిస్తున్నాం. (1 యోహా. 3:1, 10) మనం సహోదర సహోదరీల్ని ప్రేమించడం ఆపేయాలని సాతాను కోరుకుంటున్నాడు. కానీ మనం అవకాశం ఇస్తే తప్ప సాతాను అలా చేయలేడు. కాబట్టి మన సహోదర సహోదరీల్ని ప్రేమించాలని, మన మాటల్లో-చేతల్లో ఆ ప్రేమను చూపించాలని నిశ్చయించుకుందాం. అలాచేస్తే యెహోవా కుటుంబంలో ఒకరిగా ఉన్నామనే సంతృప్తి ఉంటుంది, మన జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది.—1 యోహాను 4:7 చదవండి.

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

^ పేరా 5 “యేసు ప్రేమించిన శిష్యుడు” ఖచ్చితంగా అపొస్తలుడైన యోహానే అయ్యుంటాడు. (యోహా. 21:7) కాబట్టి యువకునిగా ఉన్నప్పుడే యోహానుకు ఎన్నో చక్కని లక్షణాలు ఉండివుంటాయి. యోహాను వృద్ధుడయ్యాక, యెహోవా ఆయన్ని ఉపయోగించుకుని ప్రేమ గురించి ఎన్నో విషయాలు రాయించాడు. ఈ ఆర్టికల్‌లో, యోహాను రాసిన కొన్ని విషయాల్ని పరిశీలిస్తాం, ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుంటాం.

^ పేరా 59 చిత్రాల వివరణ: బిజీగా ఉంటున్న ఒక కుటుంబ పెద్ద విపత్తు సహాయక పనుల్లో పాల్గొంటున్నాడు, ప్రపంచవ్యాప్త పనికి విరాళం ఇస్తున్నాడు, తమ కుటుంబ ఆరాధనకు ఇతరుల్ని ఆహ్వానిస్తున్నాడు.