కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 6

“స్త్రీకి శిరస్సు పురుషుడు”

“స్త్రీకి శిరస్సు పురుషుడు”

“స్త్రీకి శిరస్సు పురుషుడు.”—1 కొరిం. 11:3.

పాట 13 క్రీస్తు మన ఆదర్శం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సహోదరి ఏ విషయాల గురించి ఆలోచించాలి?

క్రైస్తవులందరూ పరిపూర్ణుడైన యేసుక్రీస్తు శిరస్సత్వం కింద ఉన్నారు. అయితే, ఒక క్రైస్తవ స్త్రీ పెళ్లి చేసుకున్నాక ఒక అపరిపూర్ణ మనిషి శిరస్సత్వం కిందికి వెళ్తుంది. అది ఆమెకు సవాలుగా ఉండవచ్చు. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సహోదరి ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది: ‘ఈ సహోదరుడు మంచి కుటుంబ శిరస్సుగా ఉండగలడని ఎలా చెప్పవచ్చు? ఆయన తన జీవితంలో యెహోవా సేవకు ప్రాముఖ్యత ఇస్తున్నాడా? ఒకవేళ ఇవ్వకపోతుంటే, పెళ్లయ్యాక ఆయన మంచి ఆధ్యాత్మిక శిరస్సు అవ్వగలడా?’ ఆ సహోదరి తన గురించి కూడా ఇలా ఆలోచించుకోవడం మంచిది: ‘వివాహ జీవితానికి ఉపయోగపడే ఏ లక్షణాలు నాలో ఉన్నాయి? నాకు ఓర్పు, ఉదార స్వభావం ఉన్నాయా? నాకు యెహోవాతో మంచి సంబంధం ఉందా?’ (ప్రసం. 4:9, 12) పెళ్లయిన తర్వాత ఆమె వివాహ జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది అనేది, కొంతవరకు పెళ్లికి ముందు ఆమె తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.

2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 లక్షలమంది క్రైస్తవ సహోదరీలు తమ భర్తలకు లోబడే విషయంలో చక్కని ఆదర్శం ఉంచుతున్నారు. నిజంగా మనం వాళ్లను మెచ్చుకోవాలి! ఈ నమ్మకమైన స్త్రీలతో కలిసి యెహోవాను సేవించడం చాలా సంతోషంగా ఉంది! ఈ ఆర్టికల్‌లో మూడు ప్రశ్నలకు జవాబులు చూస్తాం: (1) భార్యలకు ఎదురయ్యే కొన్ని సవాళ్లు ఏంటి? (2) భర్తకు లోబడాలని భార్య ఎందుకు కోరుకుంటుంది? (3) లోబడే విషయంలో యేసు, అబీగయీలు, యేసు తల్లి అయిన మరియ నుండి క్రైస్తవ భర్తలు, భార్యలు ఏం నేర్చుకోవచ్చు?

క్రైస్తవ భార్యలకు ఏ సవాళ్లు ఎదురౌతాయి?

3. పెళ్లయిన వాళ్లందరికీ ఎందుకు సమస్యలు వస్తాయి?

3 పెళ్లి అనేది దేవుడు ఇచ్చిన పరిపూర్ణ బహుమతి, కానీ భార్యాభర్తలు ఇద్దరూ అపరిపూర్ణులే. (1 యోహా. 1:8) అందుకే, భార్యాభర్తలకు సమస్యలు వస్తాయని అంటే “శరీర సంబంధమైన శ్రమలు” వస్తాయని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. (1 కొరిం. 7:28) ఒక భార్యకు ఎదురయ్యే కొన్ని సవాళ్లు ఏంటో పరిశీలించండి.

4. భార్య తన భర్తకు లోబడడాన్ని అవమానంలా ఎందుకు భావించవచ్చు?

4 బహుశా భార్య తాను పెరిగిన వాతావరణాన్ని బట్టి, భర్తకు లోబడడాన్ని అవమానంలా భావించవచ్చు. అమెరికాలో ఉంటున్న ఒక సహోదరి ఇలా చెప్తుంది: “నేను పెరిగిన ప్రాంతంలో, స్త్రీలు అన్ని విషయాల్లో పురుషులతో సమానంగా ఉండాలని మాకు పదేపదే చెప్పేవాళ్లు. యెహోవా భర్తలకు అధికారం ఇచ్చాడని, భార్యలు వాళ్లకు లోబడాలని, అంతేకాదు యెహోవా భార్యలకు గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడని నాకు తెలుసు. అయినప్పటికీ, కొన్నిసార్లు శిరస్సత్వ ఏర్పాటును సరైన దృష్టితో చూడడం నాకు కష్టంగా ఉంటుంది.”

5. కొంతమందికి స్త్రీల గురించి ఎలాంటి లేఖన విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి?

5 మరో సమస్య ఏంటంటే, ఆడవాళ్లను తక్కువగా చూసే వ్యక్తిని ఒక స్త్రీ పెళ్లి చేసుకుని ఉండవచ్చు. దక్షిణ అమెరికాలో ఉంటున్న ఒక సహోదరి ఇలా అంటుంది: “మా ప్రాంతంలో మగవాళ్లు తిన్న తర్వాతే ఆడవాళ్లు తినాలి. ఆడపిల్లలు ఇంటి పనులు, వంట పనులు చేయాలి. మగపిల్లలేమో ఇంట్లో అమ్మ చేత, అక్కాచెల్లెళ్ల చేత సేవలు చేయించుకుంటారు. వాళ్లు ‘ఇంటికి మహారాజులు’ అని చెప్తుంటారు.” ఆసియాలో ఉంటున్న ఒక సహోదరి ఇలా చెప్తుంది: “మా భాషలో ఉన్న ఒక సామెత ప్రకారం, స్త్రీలకు తెలివితేటలు గానీ సామర్థ్యాలు గానీ ఉండనక్కర్లేదు. వాళ్లు ఇంటి పనులన్నీ చేయాలి కానీ భర్తతో నోరు విప్పి తమ అభిప్రాయాన్ని చెప్పకూడదు.” ప్రేమలేని, లేఖన విరుద్ధమైన అలాంటి అభిప్రాయాలు గల భర్త తన భార్య జీవితాన్ని కష్టతరం చేస్తాడు. ఆయన యేసును అనుకరించట్లేదు, యెహోవాను సంతోషపెట్టట్లేదు.—ఎఫె. 5:28, 29; 1 పేతు. 3:7.

6. యెహోవాతో తమకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి భార్యలు ఏం చేయాలి?

6 ముందటి ఆర్టికల్‌లో చూసినట్లుగా, క్రైస్తవ భర్తలు తమ కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక, భావోద్వేగ, భౌతిక అవసరాలు తీర్చాలని యెహోవా చెప్తున్నాడు. (1 తిమో. 5:8) అయితే, పెళ్లయిన సహోదరీలు రోజూ దేవుని వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి, యెహోవాకు పట్టుదలగా ప్రార్థించడానికి సమయం తీసుకోవాలి. అది కష్టంగా ఉండవచ్చు. భార్యలకు చాలా పనులు ఉంటాయి కాబట్టి బైబిలు చదువుకోవడానికి, ప్రార్థించడానికి సమయం-ఓపిక లేవని వాళ్లు అనుకోవచ్చు. అయినప్పటికీ వాటికోసం సమయం కేటాయించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు? ఎందుకంటే ప్రతీ ఒక్కరు తనతో వ్యక్తిగత సంబంధం ఏర్పర్చుకోవాలని, దాన్ని కాపాడుకోవాలని యెహోవా కోరుతున్నాడు.—అపొ. 17:27.

7. భార్య తన బాధ్యతను నెరవేర్చడం ఎప్పుడు తేలికౌతుంది?

7 అపరిపూర్ణుడైన తన భర్తకు లోబడడానికి భార్య చాలా కృషి చేయాల్సి ఉంటుంది అన్నది నిజమే. కానీ ఆమె అలా లోబడాలని బైబిలు ఎందుకు చెప్తుందో అర్థం చేసుకుని, దాన్ని అంగీకరించినప్పుడు యెహోవా అప్పగించిన బాధ్యతను నెరవేర్చడం ఆమెకు తేలికౌతుంది.

భర్తకు లోబడాలని భార్య ఎందుకు కోరుకుంటుంది?

8. ఎఫెసీయులు 5:22-24 ప్రకారం, ఒక క్రైస్తవ భార్య భర్తకు లోబడాలని ఎందుకు కోరుకుంటుంది?

8 ఒక క్రైస్తవ భార్య భర్తకు లోబడాలని కోరుకుంటుంది, ఎందుకంటే ఆమె అలా లోబడాలని యెహోవా చెప్తున్నాడు. (ఎఫెసీయులు 5:22-24 చదవండి.) తన పరలోక తండ్రి ఏదైనా చెప్పాడంటే, అది తన మీద ప్రేమతోనే, తన మంచి కోసమే అని ఆమె నమ్ముతుంది.—ద్వితీ. 6:24; 1 యోహా. 5:3.

9. ఒక క్రైస్తవ సహోదరి తన భర్త అధికారాన్ని గౌరవించినప్పుడు ఏం జరుగుతుంది?

9 యెహోవా ప్రమాణాల్ని పట్టించుకోవద్దని, భర్తకు లోబడడం అవమానమని ఈ లోకం చెప్తుంది. అయితే, అలాంటి ఆలోచనను ప్రోత్సహించే వాళ్లకు మన ప్రేమగల తండ్రి గురించి తెలీదు. తన ప్రియమైన కూతుళ్లకు అవమానం కలిగించే ఆజ్ఞ యెహోవా ఎన్నడూ ఇవ్వడు. యెహోవా అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి కృషిచేసే సహోదరి తన కుటుంబంలో శాంతిని పెంపొందిస్తుంది. (కీర్త. 119:165) దానివల్ల ఆమె, ఆమె భర్త, పిల్లలు ప్రయోజనం పొందుతారు.

10. కెరోల్‌ చెప్పిన మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

10 అపరిపూర్ణుడైన తన భర్తకు లోబడడం ద్వారా, శిరస్సత్వ ఏర్పాటు చేసిన యెహోవాను ప్రేమిస్తున్నానని, గౌరవిస్తున్నానని భార్య చూపిస్తుంది. దక్షిణ అమెరికాలో ఉంటున్న కెరోల్‌ ఇలా చెప్తుంది: “నా భర్త పొరపాట్లు చేస్తాడని నాకు తెలుసు. అయితే ఆ పొరపాట్లకు నేను స్పందించే తీరు, యెహోవాతో నాకున్న సంబంధాన్ని నేను ఎంత విలువైనదిగా ఎంచుతున్నానో చూపిస్తుందని కూడా నాకు తెలుసు. కాబట్టి నా భర్తకు లోబడి ఉండడానికి నేను కృషి చేస్తాను. ఎందుకంటే నా పరలోక తండ్రిని సంతోషపెట్టాలని నేను కోరుకుంటున్నాను.”

11. క్షమించే విషయంలో ఆనీస్‌ అనే సహోదరికి ఏది సహాయం చేస్తుంది? ఆమె మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

11 భర్త తన భావాల్ని, ఆందోళనల్ని పట్టించుకోవట్లేదు అనిపించినప్పుడు ఆయన్ని గౌరవించడం, ఆయనకు లోబడడం భార్యకు కష్టంగా ఉండవచ్చు. అలా జరిగినప్పుడు ఆనీస్‌ అనే సహోదరి ఎలా స్పందిస్తుందో గమనించండి. ఆమె ఇలా అంటుంది: “నేను కోపం పెంచుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. అందరం పొరపాట్లు చేస్తామని గుర్తుంచుకుంటాను. యెహోవాలాగే మనస్ఫూర్తిగా క్షమించాలన్నది నా లక్ష్యం. అలా క్షమించినప్పుడు మనశ్శాంతిని తిరిగి పొందుతాను.” (కీర్త. 86:5) సాధారణంగా, క్షమించే గుణం ఉన్న భార్య తన భర్తకు సులభంగా లోబడుతుంది.

బైబిల్లో ఉన్న ఉదాహరణల నుండి ఏం నేర్చుకోవచ్చు?

12. బైబిల్లో ఏ ఉదాహరణలు ఉన్నాయి?

12 ఇతరులకు లోబడేవాళ్లు బలహీనులని లేదా పిరికివాళ్లని కొంతమంది అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఇతరులకు లోబడిన ధైర్యవంతుల ఉదాహరణలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. యేసు, అబీగయీలు, మరియ ఉదాహరణల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

13. యేసు యెహోవాకు ఎందుకు లోబడతాడు? వివరించండి.

13 యేసు యెహోవాకు లోబడతాడు. అంతమాత్రాన ఆయనకు తెలివితేటలు, నైపుణ్యాలు లేవనికాదు. యేసు అంత సరళంగా, స్పష్టంగా బోధించాడంటే ఆయనకు ఎన్ని తెలివితేటలు ఉండాలి! (యోహా. 7:45, 46) యేసుకున్న సామర్థ్యాన్ని యెహోవా ఎంతగా గౌరవించాడంటే, సృష్టిని చేస్తున్నప్పుడు తనతో కలిసి పనిచేసే అవకాశాన్ని ఆయనకు ఇచ్చాడు. (సామె. 8:30; హెబ్రీ. 1:2-4) యేసు పునరుత్థానమైన తర్వాత యెహోవా ఆయనకు ‘పరలోకంలో, భూమ్మీద పూర్తి అధికారం’ ఇచ్చాడు. (మత్త. 28:18) యేసుకు ఎన్ని సామర్థ్యాలు ఉన్నా నిర్దేశం కోసం యెహోవా వైపే చూస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఆయనకు తన తండ్రి మీద ప్రేమ ఉంది.—యోహా. 14:31.

14. (ఎ) యెహోవా స్త్రీలను చూసే విధానం నుండి భర్తలు ఏం నేర్చుకోవచ్చు? (బి) సామెతలు 31 వ అధ్యాయంలో ఉన్న మాటల నుండి భర్తలు ఏం నేర్చుకోవచ్చు?

14 భర్తలు ఏం నేర్చుకోవచ్చు? భార్య భర్తకు లోబడాలని యెహోవా చెప్తున్నాడంటే, ఆయన దృష్టిలో స్త్రీలు పురుషుల కన్నా తక్కువని కాదు. యేసుతో కలిసి పరిపాలించే అవకాశాన్ని యెహోవా పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఇచ్చాడు, కాబట్టి ఆయన దృష్టిలో వాళ్లు తక్కువ కాదని స్పష్టమౌతుంది. (గల. 3:26-29) యెహోవా తన కుమారునికి అధికారం ఇవ్వడం ద్వారా ఆయన మీద ఎంత నమ్మకం ఉందో చూపించాడు. అదేవిధంగా తెలివైన భర్త తన భార్యకు కొంత అధికారం ఇస్తాడు. సమర్థురాలైన భార్య ఎలాంటి పనులు చేయగలదో బైబిలు వర్ణిస్తుంది. ఉదాహరణకు, ఆమె ఇంటి మొత్తాన్ని చూసుకుంటుంది, పొలాన్ని అమ్ముతుంది-కొంటుంది, వ్యాపారం చేస్తుంది. (సామెతలు 31:15, 16, 18 చదవండి.) తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండడానికి ఆమె బానిసేమీ కాదు. భర్త ఆమెను నమ్ముతాడు, ఆమె అభిప్రాయాల్ని వింటాడు. (సామెతలు 31:11, 26, 27 చదవండి.) భర్త భార్య పట్ల అలాంటి గౌరవాన్ని చూపించినప్పుడు, ఆమె ఆయనకు సంతోషంగా లోబడుతుంది.

యెహోవాకు లోబడే యేసు నుండి సమర్థురాలైన భార్య ఏం నేర్చుకోవచ్చు? (15వ పేరా చూడండి)

15. భార్యలు యేసు నుండి ఏం నేర్చుకోవచ్చు?

15 భార్యలు ఏం నేర్చుకోవచ్చు? యేసు ఎన్ని గొప్ప పనులు సాధించినా, యెహోవా శిరస్సత్వానికి లోబడడాన్ని అవమానంలా భావించలేదు. (1 కొరిం. 15:28; ఫిలి. 2:5, 6) అదేవిధంగా యేసును అనుకరించే సమర్థురాలైన భార్య, తన భర్తకు లోబడడాన్ని అవమానంలా భావించదు. ఆమె కేవలం భర్త మీద ఉన్న ప్రేమతోనే కాకుండా, ముఖ్యంగా యెహోవా మీద ఉన్న ప్రేమ, గౌరవం వల్ల ఆయనకు మద్దతిస్తుంది.

దావీదుకు, ఆయన మనుషులకు ఆహారం పంపించిన తర్వాత అబీగయీలు దావీదు దగ్గరికి వచ్చింది. ఆమె ఆయనకు వంగి నమస్కారం చేసి, పగతీర్చుకోవడం ద్వారా రక్తాపరాధం తెచ్చుకోవద్దని ఆయన్ని బ్రతిమాలింది (16వ పేరా చూడండి)

16. మొదటి సమూయేలు 25:3, 23-28 ప్రకారం అబీగయీలుకు ఏ సవాళ్లు ఎదురయ్యాయి? (ముఖచిత్రం చూడండి.)

16 అబీగయీలు భర్త పేరు నాబాలు. ఆయన స్వార్థపరుడు, గర్విష్ఠి, కృతజ్ఞత లేనివాడు. అయినప్పటికీ అబీగయీలు ఆయన్ని వదిలించుకునే అవకాశాల కోసం చూడలేదు. దావీదు, ఆయన మనుషులు నాబాలును చంపడానికి వస్తున్నప్పుడు కావాలనుకుంటే ఆమె మౌనంగా ఉండవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. ఆమె తన భర్త నాబాలును, తన ఇంట్లో ఉన్న చాలామందిని కాపాడుకోవడానికి వెంటనే చర్య తీసుకుంది. ఆయుధాలు ధరించిన 400 మంది మనుషుల ముందు, దావీదుతో గౌరవపూర్వకంగా మాట్లాడడానికి అబీగయీలుకు ఎంత ధైర్యం కావాలో కదా! తన భర్త చేసిన తప్పుల్ని తన మీద వేసుకోవడానికి కూడా ఆమె సిద్ధపడింది. (1 సమూయేలు 25:3, 23-28 చదవండి.) ఘోరమైన పాపం చేయకుండా తనను కాపాడడానికి, ధైర్యవంతురాలైన ఈ స్త్రీ ద్వారా యెహోవా తనకు సలహా ఇచ్చాడని దావీదు వెంటనే గుర్తించాడు.

17. దావీదు-అబీగయీలు ఉదాహరణ నుండి భర్తలు ఏం నేర్చుకోవచ్చు?

17 భర్తలు ఏం నేర్చుకోవచ్చు? అబీగయీలు వివేచనగల స్త్రీ. దావీదు తెలివిగా ప్రవర్తించి, ఆమె ఇచ్చిన సలహాను విన్నాడు. దానివల్ల, రక్తాపరాధం తెచ్చే పని చేయకుండా ఆయన జాగ్రత్తపడ్డాడు. అదేవిధంగా తెలివైన భర్త, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్య అభిప్రాయాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. బహుశా ఆమె అభిప్రాయం, తెలివితక్కువ నిర్ణయం తీసుకోకుండా ఆయన్ని కాపాడవచ్చు.

18. అబీగయీలు నుండి భార్యలు ఏం నేర్చుకోవచ్చు?

18 భార్యలు ఏం నేర్చుకోవచ్చు? యెహోవాను ప్రేమించి, గౌరవించే భార్య కుటుంబం మీద మంచి ప్రభావం చూపిస్తుంది. తన భర్త యెహోవాను సేవించకపోయినా, ఆయన ప్రమాణాల ప్రకారం జీవించకపోయినా ఆమె అలా చేస్తుంది. తన భర్తను వదిలించుకోవడానికి ఆమె లేఖన విరుద్ధమైన మార్గం వెతకదు. బదులుగా ఆయన్ని గౌరవిస్తూ, ఆయనకు లోబడడం ద్వారా యెహోవా గురించి తెలుసుకోవాలనే కోరికను ఆయనలో కలిగేలా చేస్తుంది. (1 పేతు. 3:1, 2) ఆమె మంచి ప్రవర్తన వల్ల ఆయన మారకపోయినా ఆమె భర్తకు లోబడుతున్నందుకు, తనకు విశ్వసనీయంగా ఉన్నందుకు యెహోవా సంతోషిస్తాడు.

19. ఎలాంటి పరిస్థితుల్లో భార్య తన భర్తకు లోబడదు?

19 ఒక క్రైస్తవ భార్య తన భర్తకు ఎప్పుడూ లోబడుతుంది, కానీ బైబిలు నియమాలకు లేదా సూత్రాలకు విరుద్ధమైన పని చేయమని చెప్పినప్పుడు మాత్రం ఆమె ఆయనకు లోబడదు. ఉదాహరణకు సత్యంలోలేని భర్త అబద్ధం చెప్పమని, దొంగతనం చేయమని, లేదా లేఖన విరుద్ధమైన పనేదైనా చేయమని ఆమెకు చెప్పవచ్చు. కానీ పెళ్లయిన సహోదరీలతో సహా, క్రైస్తవులందరూ మొట్టమొదటిగా లోబడాల్సింది యెహోవా దేవునికే. బైబిలు సూత్రాలకు విరుద్ధమైన పని చేయమన్నప్పుడు ఒక సహోదరి దాన్ని చేయకూడదు, ఆమె దాన్ని ఎందుకు చేయట్లేదో దయగా, స్థిరంగా వివరించాలి.—అపొ. 5:29.

20వ పేరా చూడండి *

20. మరియకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉందని మనకెలా తెలుసు?

20 మరియకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉంది. ఆమెకు లేఖనాలు బాగా తెలుసు. ఒక సందర్భంలో, బాప్తిస్మమిచ్చే యోహాను తల్లి అయిన ఎలీసబెతుతో మాట్లాడుతున్నప్పుడు, మరియ 20 కన్నా ఎక్కువ హీబ్రూ లేఖనాల్ని ప్రస్తావించింది. (లూకా 1:46-55) ఒకసారి దీని గురించి ఆలోచించండి: మరియకు యోసేపుతో పెళ్లి నిశ్చయమైనప్పటికీ, యెహోవా దూత మొదట కనిపించింది యోసేపుకు కాదు. ఆ దేవదూత నేరుగా మరియతో మాట్లాడి, ఆమె దేవుని కుమారుణ్ణి కంటుందని చెప్పాడు. (లూకా 1:26-33) యెహోవాకు మరియ గురించి బాగా తెలుసు. ఆమె తన కుమారుణ్ణి ప్రేమిస్తుందని, బాగా చూసుకుంటుందని యెహోవాకు నమ్మకం ఉంది. యేసు చనిపోయి, పరలోకానికి వెళ్లిన తర్వాత కూడా మరియ యెహోవాతో మంచి సంబంధాన్ని కాపాడుకుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.—అపొ. 1:14.

21. మరియ గురించి బైబిలు చెప్తున్న విషయాల నుండి భర్తలు ఏం నేర్చుకోవచ్చు?

21 భర్తలు ఏం నేర్చుకోవచ్చు? భార్యకు లేఖనాలు బాగా తెలిసినప్పుడు తెలివైన భర్త సంతోషిస్తాడు. ఆమెకు తన కన్నా ఎక్కువ తెలుసని కంగారుపడడు, ఆమె తన శిరస్సత్వాన్ని లాగేసుకుంటుందేమో అని భయపడడు. బైబిలు గురించి, బైబిలు సూత్రాల గురించి మంచి అవగాహన ఉన్న భార్య తన కుటుంబానికి బాగా ఉపయోగపడుతుందని ఆయన గుర్తిస్తాడు. భర్త కన్నా భార్య ఎక్కువ చదువుకున్నప్పటికీ కుటుంబ ఆరాధనలో, ఇతర ఆధ్యాత్మిక పనుల్లో నాయకత్వం వహించే బాధ్యత భర్తదే.—ఎఫె. 6:4.

అధ్యయనం చేసే విషయంలో, ధ్యానించే విషయంలో యేసు తల్లి అయిన మరియ నుండి భార్యలు ఏం నేర్చుకోవచ్చు? (22వ పేరా చూడండి) *

22. మరియ నుండి భార్యలు ఏం నేర్చుకోవచ్చు?

22 భార్యలు ఏం నేర్చుకోవచ్చు? భార్య భర్తకు లోబడివుండాలి, అయితే తన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆమెదే. (గల. 6:5) అందుకోసం ఆమె వ్యక్తిగత అధ్యయనానికి, చదివిన వాటిని ధ్యానించడానికి సమయం వెచ్చించాలి. అలాచేస్తే యెహోవా మీద ఆమెకున్న ప్రేమ, గౌరవం పెరుగుతాయి. అంతేకాదు ఆమె తన భర్తకు సంతోషంగా లోబడుతుంది.

23. లోబడివుండే భార్యలు తమకు, తమ కుటుంబానికి, సంఘానికి ఎలా మేలు చేస్తారు?

23 యెహోవా మీద ప్రేమతో తమ భర్తలకు లోబడివుండే భార్యలు, శిరస్సత్వ ఏర్పాటును గౌరవించని వాళ్లకన్నా ఎక్కువ సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. వాళ్లు యువతీ యువకులకు మంచి ఆదర్శం ఉంచుతారు. వాళ్లు కుటుంబంలోనే కాదు, సంఘంలో కూడా ప్రేమపూర్వక వాతావరణం ఉండేలా సహాయం చేస్తారు. (తీతు 2:3-5) నేడు యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న వాళ్లలో ఎక్కువశాతం మంది స్త్రీలే ఉన్నారు. (కీర్త. 68:11) పురుషులమైనా, స్త్రీలమైనా మనందరికీ సంఘంలో ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉంది. మనలో ప్రతీఒక్కరం సంఘంలో మన బాధ్యతను ఎలా నెరవేర్చవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 131 “దేవుడు ఒకటి చేసినవాళ్లు”

^ పేరా 5 భార్య భర్తకు లోబడి ఉండాలని యెహోవా నిర్ణయించాడు. దానర్థం ఏంటి? లోబడే విషయంలో యేసు, బైబిల్లోని కొంతమంది స్త్రీలు ఉంచిన ఆదర్శం నుండి క్రైస్తవ భర్తలు, భార్యలు ఎంతో నేర్చుకోవచ్చు.

^ పేరా 68 చిత్రాల వివరణ: బాప్తిస్మమిచ్చే యోహాను తల్లి అయిన ఎలీసబెతుతో మాట్లాడుతున్నప్పుడు, మరియ హీబ్రూ లేఖనాల్లో ఉన్న మాటల్ని చూడకుండా చెప్పింది.

^ పేరా 70 చిత్రాల వివరణ: తన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడం కోసం ఒక క్రైస్తవ భార్య బైబిలు చదవడానికి సమయం తీసుకుంటుంది.