కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 7

సంఘంలో శిరస్సత్వ ఏర్పాటును అర్థం చేసుకోండి

సంఘంలో శిరస్సత్వ ఏర్పాటును అర్థం చేసుకోండి

‘సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సుగా, రక్షకుడిగా ఉన్నాడు.’—ఎఫె. 5:23.

పాట 137 నమ్మకమైన స్త్రీలు, క్రైస్తవ సహోదరీలు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా కుటుంబం ఐక్యంగా ఉండడానికి ఒక కారణం ఏంటి?

యెహోవా కుటుంబంలో ఒకరం అయినందుకు మనం చాలా సంతోషిస్తున్నాం. ఈ కుటుంబంలో ఇంత శాంతి, ఐక్యత ఉండడానికి కారణం ఏంటి? ఒక కారణం ఏంటంటే, మనందరం యెహోవా చేసిన శిరస్సత్వ ఏర్పాటును గౌరవించడానికి కృషిచేస్తాం. నిజానికి, మనం ఆ ఏర్పాటును ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే, అంత ఐక్యంగా ఉంటాం.

2. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

2 సంఘంలో ఉండే శిరస్సత్వ ఏర్పాటు గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. దానితో పాటు ఈ ప్రశ్నలకు జవాబులు చూస్తాం: సంఘంలో సహోదరీల స్థానం ఏంటి? ప్రతీ సహోదరుడు ప్రతీ సహోదరికి శిరస్సా? సంఘంలోని వాళ్ల మీద సంఘ పెద్దలకు ఉండే అధికారం, భార్యాపిల్లల మీద కుటుంబ శిరస్సులకు ఉండే అధికారం ఒకటేనా? ముందుగా, మనం సహోదరీల్ని ఎలా చూడాలో పరిశీలిద్దాం.

మనం సహోదరీల్ని ఎలా చూడాలి?

3. మన సహోదరీలు చేస్తున్న పని పట్ల కృతజ్ఞతను ఎలా పెంచుకోవచ్చు?

3 తమ కుటుంబాల్ని చూసుకోవడానికి, మంచివార్త ప్రకటించడానికి, సంఘానికి మద్దతివ్వడానికి కష్టపడి పని చేస్తున్న సహోదరీల్ని మనం విలువైన వాళ్లుగా చూస్తాం. యెహోవా, యేసు వాళ్లను ఎలా చూస్తున్నారో పరిశీలించడం ద్వారా వాళ్ల పట్ల మన కృతజ్ఞతను పెంచుకోవచ్చు. అపొస్తలుడైన పౌలు సహోదరీలతో ఎలా వ్యవహరించాడో పరిశీలించడం ద్వారా కూడా మనం ప్రయోజనం పొందుతాం.

4. యెహోవా స్త్రీలను, పురుషులను ఇద్దర్నీ విలువైన వాళ్లుగా చూస్తాడని బైబిలు ఎలా తెలియజేస్తుంది?

4 యెహోవా స్త్రీలను, పురుషులను ఇద్దర్నీ విలువైన వాళ్లుగా చూస్తాడని బైబిలు తెలియజేస్తుంది. ఉదాహరణకు, మొదటి శతాబ్దంలో యెహోవా పురుషులతో పాటు స్త్రీల మీద కూడా పవిత్రశక్తిని కుమ్మరించాడు. అంతేకాదు, వేర్వేరు భాషల్లో మాట్లాడడం వంటి అద్భుతమైన పనుల్ని చేసేలా వాళ్లకు శక్తిని ఇచ్చాడు. (అపొ. 2:1-4, 15-18) యెహోవా స్త్రీలను, పురుషులను ఇద్దర్నీ పవిత్రశక్తితో అభిషేకించి, క్రీస్తుతో కలిసి పరిపాలించే నిరీక్షణను ఇచ్చాడు. (గల. 3:26-29) పురుషులతో పాటు స్త్రీలు కూడా భూమ్మీద శాశ్వత జీవితమనే బహుమానం పొందుతారు. (ప్రక. 7:9, 10, 13-15) మంచివార్త ప్రకటించే, బోధించే నియామకం స్త్రీలకు, పురుషులకు ఇద్దరికీ ఇవ్వబడింది. (మత్త. 28:19, 20) ప్రిస్కిల్ల అనే సహోదరి చేసిన పని గురించి అపొస్తలుల కార్యాలు పుస్తకం మాట్లాడుతుంది. ఆమె తన భర్త అకులతో కలిసి, బాగా చదువుకున్న అపొల్లో అనే వ్యక్తికి సత్యాన్ని ఇంకా ఖచ్చితంగా వివరించింది.—అపొ. 18:24-26.

5. లూకా 10:38, 39, 42 ప్రకారం యేసు స్త్రీలను గౌరవించాడని ఎలా చెప్పవచ్చు?

5 యేసు స్త్రీలను గౌరవించాడు. యేసు కాలంలో పరిసయ్యులు స్త్రీలను చిన్నచూపు చూసేవాళ్లు, నలుగురిలో ఉన్నప్పుడు వాళ్లతో మాట్లాడేవాళ్లు కాదు, వాళ్లతో లేఖనాల్ని చర్చించేవాళ్లు కాదు. కానీ యేసు అలా చేయలేదు. ఆయన మిగతా శిష్యులతో చర్చించినట్టే స్త్రీలతో కూడా లోతైన ఆధ్యాత్మిక విషయాలు చర్చించాడు. * (లూకా 10:38, 39, 42 చదవండి.) అంతేకాదు ప్రకటనా పనిలో తనతో కలిసి ప్రయాణించే అవకాశాన్ని స్త్రీలకు ఇచ్చాడు. (లూకా 8:1-3) తాను చనిపోయి తిరిగి లేచిన విషయాన్ని అపొస్తలులకు తెలియజేసే గొప్ప అవకాశం ఆయన స్త్రీలకు ఇచ్చాడు.—యోహా. 20:16-18.

6. అపొస్తలుడైన పౌలు స్త్రీలను ఎలా గౌరవించాడు?

6 స్త్రీలను గౌరవించమని అపొస్తలుడైన పౌలు తిమోతికి గుర్తుచేశాడు. ‘వృద్ధ స్త్రీలను తల్లులుగా, యౌవన స్త్రీలను అక్కచెల్లెళ్లుగా’ భావించమని పౌలు చెప్పాడు. (1 తిమో. 5:1, 2) తిమోతి పరిణతిగల క్రైస్తవుడు అవ్వడానికి పౌలు ఎంతో సహాయం చేసినప్పటికీ, ఆయనకు మొదట “పవిత్ర లేఖనాలు” బోధించింది వాళ్ల అమ్మ, అమ్మమ్మ అని పౌలు గుర్తించాడు. (2 తిమో. 1:5; 3:14, 15) పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో సహోదరీల్ని పేరుపేరున పలకరించాడు. పౌలు వాళ్లు చేసిన పనిని గుర్తించడమే కాదు, మెచ్చుకున్నాడు కూడా.—రోమా. 16:1-4, 6, 12; ఫిలి. 4:3.

7. మనం ఇప్పుడు ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?

7 ముందటి పేరాలు చెప్తున్నట్టుగా, సహోదరీలు సహోదరుల కన్నా తక్కువవాళ్లని బైబిల్లో ఎక్కడా లేదు. ప్రేమ, ఉదార స్వభావం గల మన సహోదరీలు సంఘానికి ఎంతో ఉపయోగపడతారు. సంఘాన్ని శాంతిగా, ఐక్యంగా ఉంచడానికి సంఘ పెద్దలు వాళ్ల సహాయం తీసుకుంటారు. అయితే కొన్ని ప్రశ్నలకు మనం జవాబు తెలుసుకోవాలి: ఉదాహరణకు, సహోదరీలు కొన్ని సందర్భాల్లో తల మీద ముసుగు వేసుకోవాలని యెహోవా ఎందుకు చెప్తున్నాడు? సహోదరులు మాత్రమే సంఘ పెద్దలుగా, సంఘ పరిచారకులుగా నియమించబడతారు కాబట్టి ప్రతీ సహోదరుడు ప్రతీ సహోదరికి శిరస్సు అవుతాడా?

ప్రతీ సహోదరుడు ప్రతీ సహోదరికి శిరస్సా?

8. ఎఫెసీయులు 5:23 ప్రకారం, ప్రతీ సహోదరుడు ప్రతీ సహోదరికి శిరస్సా? వివరించండి.

8 ఒక్కమాటలో చెప్పాలంటే, కాదు! ఒక సహోదరుడు సంఘంలో ఉన్న సహోదరీలందరి మీద శిరస్సు అవ్వడు, క్రీస్తే వాళ్లకు శిరస్సు. (ఎఫెసీయులు 5:23 చదవండి.) కుటుంబంలో భర్తకు భార్య మీద అధికారం ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్న కొడుకు తన తల్లికి శిరస్సు అవ్వడు. (ఎఫె. 6:1, 2) సంఘంలో సహోదరీల మీద, సహోదరుల మీద పెద్దలకు కొంత అధికారమే ఉంటుంది. (1 థెస్స. 5:12; హెబ్రీ. 13:17) అమ్మానాన్నలకు దూరంగా ఉంటున్న ఒంటరి సహోదరీల సంగతేంటి? వాళ్లు అమ్మానాన్నల్ని, సంఘ పెద్దల్ని గౌరవిస్తూనే ఉంటారు. అయితే, సంఘంలోని సహోదరులకు ఉన్నట్టే వీళ్లకు కూడా ఒకే శిరస్సు ఉంటాడు, ఆయనే యేసు.

ఒంటరి సహోదర సహోదరీలు అమ్మానాన్నలకు దూరంగా జీవిస్తున్నట్లయితే, వాళ్లు యేసు శిరస్సత్వం కింద ఉంటారు (8వ పేరా చూడండి)

9. కొన్ని సందర్భాల్లో సహోదరీలు తల మీద ముసుగు ఎందుకు వేసుకోవాలి?

9 నిజమే, సంఘంలో నాయకత్వం వహించడానికి యెహోవా పురుషుల్ని నియమించాడు. కానీ ఆయన అలాంటి అధికారాన్ని స్త్రీలకు ఇవ్వలేదు. (1 తిమో. 2:12) ఎందుకు? సంఘంలో ఒక క్రమపద్ధతిని ఉంచడానికే. పురుషునికి శిరస్సుగా యేసును నియమించడానికి కారణం కూడా అదే. కొన్ని పరిస్థితుల్లో, సాధారణంగా ఒక సహోదరుడు చేయాల్సిన పనిని ఒక సహోదరి చేయాల్సి వస్తే, ఆమె తల మీద ముసుగు వేసుకోవాలని యెహోవా చెప్తున్నాడు. * (1 కొరిం. 11:4-7) ఆమె విలువను తగ్గించడానికి కాదుగానీ, తాను చేసిన శిరస్సత్వ ఏర్పాటు పట్ల గౌరవం చూపించే అవకాశం ఇవ్వడానికి యెహోవా అలా చెప్తున్నాడు. ఆ వాస్తవాల్ని మనసులో ఉంచుకుని, ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం: కుటుంబ శిరస్సులకు, సంఘ పెద్దలకు ఎంత అధికారం ఉంది?

కుటుంబ శిరస్సులకు, సంఘ పెద్దలకు ఉన్న అధికారం

10. కొన్నిసార్లు ఒక సంఘ పెద్ద ఏమనుకునే ప్రమాదం ఉంది?

10 సంఘ పెద్దలు క్రీస్తును ప్రేమిస్తారు. సంరక్షించమని యెహోవా, యేసు తమకు అప్పగించిన “గొర్రెల్ని” కూడా వాళ్లు ప్రేమిస్తారు. (యోహా. 21:15-17) మంచి ఉద్దేశాలతోనే, ఒక సంఘ పెద్ద సంఘంలో ఉన్న వాళ్లకు తాను తండ్రిలాంటి వాడినని అనుకుంటుండవచ్చు. కుటుంబాన్ని కాపాడడానికి కుటుంబ శిరస్సు నియమాలు పెట్టినట్టే, దేవుని గొర్రెల్ని కాపాడడానికి తాను కూడా నియమాలు పెట్టవచ్చని ఒక సంఘ పెద్ద అనుకునే ప్రమాదం ఉంది. పైగా కొంతమంది ప్రచారకులు తమకు ఆధ్యాత్మిక శిరస్సుగా ఉండమని, అంటే తమ తరఫున నిర్ణయాలు తీసుకోమని ఆయన్ని అడగవచ్చు. కానీ సంఘ పెద్దలకు ఉండే అధికారం, కుటుంబ శిరస్సులకు ఉండే అధికారం ఒకటేనా?

పెద్దలు సంఘంలోని వాళ్ల ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరాల్ని చూసుకుంటారు. సంఘాన్ని పవిత్రంగా ఉంచే బాధ్యతను యెహోవా వాళ్లకు అప్పగించాడు (11-12 పేరాలు చూడండి)

11. కుటుంబ శిరస్సుకు ఉండే అధికారానికి, సంఘ పెద్దకు ఉండే అధికారానికి కొన్ని పోలికలు ఏంటి?

11 కుటుంబ శిరస్సుకు ఉండే అధికారానికి, సంఘ పెద్దకు ఉండే అధికారానికి కొన్ని పోలికలు ఉన్నాయని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 తిమో. 3:4, 5) ఉదాహరణకు, కుటుంబ సభ్యులు కుటుంబ శిరస్సుకు లోబడాలని యెహోవా కోరుతున్నాడు. (కొలొ. 3:20) సంఘంలో ఉన్నవాళ్లు పెద్దలకు లోబడాలని ఆయన కోరుతున్నాడు. కుటుంబ శిరస్సులు, సంఘ పెద్దలు ఇద్దరూ తమ సంరక్షణ కింద ఉన్నవాళ్ల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చాలని యెహోవా చెప్తున్నాడు. అంతేకాదు, ఇద్దరూ తమ అధికారం కింద ఉన్నవాళ్ల భావోద్వేగ అవసరాలు తీర్చాలి. మంచి కుటుంబ శిరస్సుల్లాగే, సంఘ పెద్దలు కూడా తమ సంరక్షణ కింద ఉన్నవాళ్లకు కష్టాల్లో సహాయం చేస్తారు. (యాకో. 2:15-17) సంఘ పెద్దలు, కుటుంబ శిరస్సులు ఇద్దరూ యెహోవా ప్రమాణాల్ని ప్రోత్సహించాలి, అంతేగానీ ‘లేఖనాల్లో రాసివున్న వాటికి’ అదనపు నియమాల్ని చేర్చకూడదు.—1 కొరిం. 4:6.

కుటుంబ శిరస్సులకు యెహోవా దేవుడు కుటుంబంలో నాయకత్వం వహించే బాధ్యతను ఇచ్చాడు. నిర్ణయాలు తీసుకునే ముందు, ప్రేమగల కుటుంబ శిరస్సు తన భార్య అభిప్రాయం తెలుసుకుంటాడు (13వ పేరా చూడండి)

12-13. రోమీయులు 7:2 ప్రకారం, కుటుంబ శిరస్సులకు ఉన్న అధికారానికి, సంఘ పెద్దలకు ఉన్న అధికారానికి తేడాలు ఏంటి?

12 అయితే సంఘ పెద్దకు ఉండే అధికారానికి, కుటుంబ శిరస్సుకు ఉండే అధికారానికి కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు, సంఘంలో ఉన్నవాళ్లకు తీర్పు తీర్చే అధికారాన్ని యెహోవా పెద్దలకు అప్పగించాడు. అంతేకాదు, పశ్చాత్తాపపడని పాపులను సంఘం నుండి వెలివేసే బాధ్యతను కూడా వాళ్లకు ఇచ్చాడు.—1 కొరిం. 5:11-13.

13 సంఘ పెద్దలకు ఇవ్వని కొంత అధికారాన్ని యెహోవా కుటుంబ శిరస్సులకు ఇచ్చాడు. తమ కుటుంబం కోసం నియమాలు పెట్టి, వాటిని అమలు చేసే అధికారాన్ని యెహోవా కుటుంబ శిరస్సులకు ఇచ్చాడు. (రోమీయులు 7:2 చదవండి.) ఉదాహరణకు, పిల్లలు ఏ సమయం కల్లా ఇంటికి రావాలో నిర్ణయించే హక్కు కుటుంబ శిరస్సుకు ఉంది. ఒకవేళ పిల్లలు ఆ నియమానికి లోబడకపోతే, వాళ్లకు క్రమశిక్షణ ఇచ్చే అధికారం కూడా ఆయనకు ఉంది. (ఎఫె. 6:1) అయితే, ప్రేమగల ఒక కుటుంబ శిరస్సు ఇంట్లోవాళ్లకు నియమాలు పెట్టే ముందు తన భార్యతో మాట్లాడతాడు. ఎంతైనా వాళ్లిద్దరూ “ఒకే శరీరం.” *మత్త. 19:6.

సంఘానికి శిరస్సయిన క్రీస్తును గౌరవించండి

యేసు, యెహోవా శిరస్సత్వానికి లోబడుతూ క్రైస్తవ సంఘానికి నిర్దేశం ఇస్తాడు (14వ పేరా చూడండి)

14. (ఎ) మార్కు 10:45 ప్రకారం, సంఘ శిరస్సుగా ఉండడానికి యేసు ఎందుకు అర్హుడు? (బి) పరిపాలక సభకు ఏ బాధ్యత ఉంది? (“ పరిపాలక సభ బాధ్యత” బాక్సు చూడండి.)

14 విమోచన క్రయధనం ద్వారా యెహోవా సంఘంలో ఉన్న వాళ్లందరి ప్రాణాల్ని కొన్నాడు. (మార్కు 10:45 చదవండి; అపొ. 20:28; 1 కొరిం. 15:21, 22) తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించిన యేసు, సంఘ శిరస్సుగా ఉండడానికి అన్నివిధాలా అర్హుడు. కాబట్టి ప్రతీ ఒక్కరు, ప్రతీ కుటుంబం, ప్రతీ సంఘం ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో నియమాలు పెట్టి, వాటిని అమలు చేసే అధికారం శిరస్సయిన యేసుకు ఉంది. (గల. 6:2) అయితే యేసు కేవలం నియమాలు మాత్రమే పెట్టడు, ఆయన మనలో ప్రతీ ఒక్కర్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు.—ఎఫె. 5:29.

15-16. మార్లీ, బెంజమిన్‌ చెప్పిన మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?

15 తమ సంరక్షణ కోసం క్రీస్తు నియమించిన సహోదరులు ఇచ్చే నిర్దేశాన్ని సహోదరీలు పాటిస్తారు. అలా వాళ్లు క్రీస్తును గౌరవిస్తున్నామని చూపిస్తారు. అమెరికాలో ఉంటున్న మార్లీ అనే సహోదరిలాగే చాలామంది సహోదరీలు భావిస్తున్నారు. ఆమె ఇలా అంటోంది: “భార్యగా, సంఘంలో ఒక సహోదరిగా నాకున్న స్థానాన్ని నేను చాలా విలువైనదిగా ఎంచుతాను. యెహోవా చేసిన శిరస్సత్వ ఏర్పాటును సరైన దృష్టితో చూడడానికి నేను ఎప్పుడూ కృషిచేస్తూ ఉంటాను. నా భర్త, అలాగే సంఘంలో ఉన్న సహోదరులు నన్ను గౌరవిస్తారు, నేను చేసే పనిని మెచ్చుకుంటారు. దానివల్ల వాళ్లకు లోబడడం నాకు తేలిక అవుతుంది.”

16 సహోదరీల్ని గౌరవించడం ద్వారా శిరస్సత్వ ఏర్పాటును అర్థం చేసుకున్నామని సహోదరులు చూపిస్తారు. ఇంగ్లాండ్‌లో ఉంటున్న బెంజమిన్‌ ఇలా అంటున్నాడు: “మీటింగ్స్‌లో సహోదరీలు చెప్పే కామెంట్స్‌ నుండి నేను చాలా నేర్చుకున్నాను. వ్యక్తిగత అధ్యయనం విషయంలో, చక్కగా పరిచర్య చేసే విషయంలో వాళ్లు ఇచ్చిన సలహాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి. వాళ్లు చేసే పని ఎంతో అమూల్యమైనది.”

17. శిరస్సత్వ ఏర్పాటును మనం ఎందుకు గౌరవించాలి?

17 సంఘంలో అందరూ, అంటే స్త్రీలు, పురుషులు, కుటుంబ శిరస్సులు, సంఘ పెద్దలు శిరస్సత్వ ఏర్పాటును అర్థం చేసుకుని గౌరవించినప్పుడు సంఘంలో శాంతి ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా, ప్రేమగల మన పరలోక తండ్రి అయిన యెహోవాకు మనం మహిమ తీసుకొస్తాం.—కీర్త. 150:6.

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

^ పేరా 5 సంఘంలో సహోదరీల స్థానం ఏంటి? ప్రతీ సహోదరుడు ప్రతీ సహోదరికి శిరస్సా? సంఘ పెద్దలకు ఉండే అధికారం, కుటుంబ శిరస్సులకు ఉండే అధికారం రెండూ ఒకటేనా? దేవుని వాక్యంలో ఉన్న ఉదాహరణలు పరిశీలిస్తూ ఆ ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు చూస్తాం.

^ పేరా 5 సెప్టెంబరు 2020, కావలికోట పత్రికలో వచ్చిన “సంఘంలోని సహోదరీలకు మద్దతివ్వండి” అనే ఆర్టికల్‌లో, 6వ పేరా చూడండి.

^ పేరా 13 ఒక కుటుంబం ఏ సంఘానికి వెళ్లాలో ఎవరు నిర్ణయించాలి? అనే ప్రశ్నకు సంబంధించిన సమాచారాన్ని ఆగస్టు 2020, కావలికోట పత్రికలో వచ్చిన “యెహోవా సంఘంలో ప్రతీఒక్కర్ని విలువైన వాళ్లుగా చూడండి” అనే ఆర్టికల్‌లో, 17-19 పేరాలు చూడండి.

^ పేరా 59 మరింత సమాచారం కోసం, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ పుస్తకంలో 239-242 పేజీలు చూడండి.

^ పేరా 64 పరిపాలక సభ బాధ్యత గురించిన పూర్తి సమాచారం కోసం జూలై 15, 2013, కావలికోట పత్రికలో 20-25 పేజీలు చూడండి.