కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అంతా ఒక చిరునవ్వుతో మొదలైంది!

అంతా ఒక చిరునవ్వుతో మొదలైంది!

ఫిలిప్పీన్స్‌లోని బాగీయో నగరంలో ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా నడుస్తున్నప్పుడు వాళ్లు బహిరంగ సాక్ష్యంలో ఉపయోగించే ఒక కార్ట్‌ను చూశారు, కానీ ఆ కార్ట్‌ దగ్గరికి వెళ్లలేదు. కార్ట్‌ దగ్గర నిల్చున్న హెలెన్‌ అనే సహోదరి వాళ్లను చూసి ఆప్యాయంగా నవ్వింది. వాళ్లు తమ దారిన వెళ్లిపోయారు కానీ, ఆ సహోదరి చిరునవ్వు వాళ్లకు గుర్తుండిపోయింది.

తర్వాత వాళ్లు బస్సులో ఇంటికి వెళ్తున్నప్పుడు, రాజ్యమందిరం గోడ మీద jw.org అనే పెద్ద సైన్‌ బోర్డు చూశారు. కార్ట్‌ మీద ఉన్న అక్షరాలు, ఆ సైన్‌ బోర్డు మీద ఉన్న అక్షరాలు ఒకటే అని వాళ్లు గుర్తుపట్టారు. దాంతో వాళ్లిద్దరూ బస్సు దిగి రాజ్యమందిరం గేటు దగ్గరికి వచ్చారు. వాళ్లు అక్కడ వేర్వేరు సంఘాలకు సంబంధించిన మీటింగ్స్‌ షెడ్యూల్‌ చూశారు.

ఆ ఇద్దరు అమ్మాయిలు తర్వాతి మీటింగ్‌కి హాజరయ్యారు. రాజ్యమందిరంలోకి అడుగుపెట్టగానే వాళ్లు ఎవర్ని చూశారో తెలుసా? హెలెన్‌ను! తమను చూసి ఆప్యాయంగా నవ్వింది ఆమే అని వాళ్లు వెంటనే గుర్తుపట్టారు. హెలెన్‌ ఇలా చెప్తుంది: “వాళ్లు నా దగ్గరికి వస్తున్నప్పుడు నాకు కాస్త కంగారుగా అనిపించింది. బహుశా నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచించాను.” కానీ వాళ్లు సహోదరిని కార్ట్‌ దగ్గర చూశామని, అందుకే ఆమె దగ్గరికి వచ్చామని వివరించారు.

వాళ్లకు మీటింగ్‌, సహోదర సహోదరీలతో కలిసివుండడం చాలా నచ్చాయి. మీటింగ్‌ తర్వాత సహోదర సహోదరీలు క్లీనింగ్‌ చేయడం చూసి, ‘మేము కూడా క్లీనింగ్‌ చేయవచ్చా?’ అని వాళ్లు అడిగారు. ఆ ఇద్దరిలో ఒకామె వేరే దేశానికి వెళ్లిపోయింది. ఇంకొకామె మాత్రం మీటింగ్స్‌కి వస్తోంది, బైబిలు స్టడీ తీసుకుంటోంది. ఇదంతా ఒక చిరునవ్వుతో మొదలైంది!