కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 13

యెహోవా మిమ్మల్ని ఎలా కాపాడతాడు?

యెహోవా మిమ్మల్ని ఎలా కాపాడతాడు?

“ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, దుష్టుని నుండి కాపాడతాడు.”—2 థెస్స. 3:3.

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. తన శిష్యుల్ని కాపాడమని యేసు యెహోవాకు ఎందుకు ప్రార్థించాడు?

చనిపోబోయే ముందు రోజు రాత్రి, యేసు తన శిష్యులకు ఎదురయ్యే కష్టాల గురించి ఆలోచించాడు. శిష్యుల మీద ప్రేమతో యేసు తన తండ్రికి ఇలా ప్రార్థించాడు: ‘దుష్టుని నుండి వాళ్లను కాపాడు.’ (యోహా. 17:14, 15) తాను పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత, యెహోవాను సేవించాలని కోరుకునే ప్రతీఒక్కరి మీద అపవాది అయిన సాతాను దాడి చేస్తూనే ఉంటాడని యేసుకు తెలుసు. అందుకే మనకు యెహోవా సంరక్షణ అవసరం.

2. యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తాడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?

2 యెహోవాకు తన కుమారుడైన యేసు మీద ప్రేమ ఉంది కాబట్టే ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడు. మనం యెహోవాను సంతోషపెట్టడానికి చేయగలిగినదంతా చేస్తే ఆయన మనల్ని కూడా ప్రేమిస్తాడు; సహాయం చేయమని, కాపాడమని మనం చేసే ప్రార్థనలకు జవాబిస్తాడు. ఒక మంచి కుటుంబ పెద్దగా యెహోవా తన పిల్లల మీద ప్రేమ, శ్రద్ధ చూపిస్తూనే ఉంటాడు. అలా చేయకపోతే ఆయనకే చెడ్డపేరు వస్తుంది!

3. మనకు ఇప్పుడు యెహోవా సంరక్షణ ఎందుకు అవసరం?

3 మనకు యెహోవా సంరక్షణ ఇంతకుముందు కన్నా ఇప్పుడే ఎక్కువ అవసరం. పరలోకం నుండి పడేయబడిన సాతాను ఇప్పుడు “చాలా కోపంతో” ఉన్నాడు. (ప్రక. 12:12) మనల్ని హింసిస్తున్న వాళ్లు ‘దేవునికి పవిత్రసేవ చేస్తున్నామని’ అనుకునేలా సాతాను కొంతమందిని మోసం చేశాడు. (యోహా. 16:2) దేవుణ్ణి నమ్మని వాళ్లేమో, మనం ఈ లోకంలో ఉన్నవాళ్లకు వేరుగా ఉన్నందుకు మనల్ని హింసిస్తారు. ఏదేమైనా మనం ధైర్యంగా ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే దేవుని వాక్యం ఇలా చెప్తోంది: “ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, దుష్టుని నుండి కాపాడతాడు.” (2 థెస్స. 3:3) యెహోవా మనల్ని ఎలా కాపాడతాడు? రెండు విధానాల్ని ఇప్పుడు చూద్దాం.

యెహోవా మనకు యుద్ధ కవచాన్ని ఇచ్చాడు

4. ఎఫెసీయులు 6:13-17 ప్రకారం, మనల్ని కాపాడడానికి యెహోవా ఏం ఇచ్చాడు?

4 సాతాను దాడుల నుండి మనల్ని కాపాడడానికి యెహోవా మనకు యుద్ధ కవచాన్ని ఇచ్చాడు. (ఎఫెసీయులు 6:13-17 చదవండి.) ఈ ఆధ్యాత్మిక కవచం బలమైనది, అది చాలా బాగా పనిచేస్తుంది! అయితే ఆ కవచం మనల్ని కాపాడాలంటే, దానిలో ఏ ఒక్కటీ విడిచిపెట్టకుండా ప్రతీది వేసుకోవాలి; వాటిని ఎప్పుడూ వేసుకునే ఉండాలి. ఆ కవచంలోని ప్రతీది దేన్ని సూచిస్తుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

5. సత్యం అనే దట్టీ అంటే ఏంటి? దాన్ని మనం ఎందుకు కట్టుకోవాలి?

5 సత్యం అనే దట్టీ, దేవుని వాక్యంలో ఉన్న సత్యాల్ని సూచిస్తుంది. మనం ఈ దట్టీ ఎందుకు కట్టుకోవాలి? ఎందుకంటే సాతాను “అబద్ధానికి తండ్రి.” (యోహా. 8:44) అబద్ధాలు ఆడడంలో సాతానుకు వేల సంవత్సరాల అనుభవం ఉంది. అతను “లోకమంతటినీ” మోసం చేశాడు! (ప్రక. 12:9) కానీ మనం మోసపోకుండా బైబిల్లో ఉన్న సత్యాలు కాపాడతాయి. మనం ఈ దట్టీని ఎలా కట్టుకోవచ్చు? యెహోవా గురించిన సత్యం నేర్చుకోవడం ద్వారా, “పవిత్రశక్తితో, సత్యంతో” ఆయన్ని ఆరాధించడం ద్వారా, అన్ని విషయాల్లో నిజాయితీగా నడుచుకోవడం ద్వారా దాన్ని కట్టుకోవచ్చు.—యోహా. 4:24; ఎఫె. 4:25; హెబ్రీ. 13:18.

దట్టీ: దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు

6. నీతి అనే ఛాతి కవచం అంటే ఏంటి? మనం దాన్ని ఎందుకు వేసుకోవాలి?

6 నీతి అనే ఛాతి కవచం, యెహోవా నీతి ప్రమాణాల్ని సూచిస్తుంది. మనం ఆ కవచాన్ని ఎందుకు వేసుకోవాలి? ఒక ఛాతి కవచం సైనికుని గుండెను కాపాడినట్టే, నీతి అనే ఛాతి కవచం మన సూచనార్థక హృదయాన్ని ఈ లోకంలోని చెడు ప్రభావాల నుండి కాపాడుతుంది. (సామె. 4:23) మనం తనను నిండు హృదయంతో ప్రేమించాలని, సేవించాలని యెహోవా కోరుతున్నాడు. (మత్త. 22:36, 37) మనం యెహోవాను నిండు హృదయంతో సేవించకుండా ఈ లోకంలో ఉన్నవాటిని, అంటే యెహోవా ద్వేషించే వాటిని ప్రేమించేలా చేయడానికి సాతాను ప్రయత్నిస్తాడు. (యాకో. 4:4; 1 యోహా. 2:15, 16) ఒకవేళ ఆ పన్నాగం పనిచేయకపోతే, హింసను ఉపయోగించి మనతో యెహోవాకు ఇష్టంలేని పనులు చేయించాలని చూస్తాడు.

ఛాతి కవచం: యెహోవా నీతి ప్రమాణాలు

7. మనం నీతి అనే ఛాతి కవచాన్ని ఎలా వేసుకుంటాం?

7 తప్పొప్పుల విషయంలో యెహోవా ప్రమాణాలకు లోబడడం ద్వారా, వాటి ప్రకారం జీవించడం ద్వారా మనం నీతి అనే ఛాతి కవచాన్ని వేసుకుంటాం. (కీర్త. 97:10) యెహోవా ప్రమాణాలు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయని కొంతమంది అనుకోవచ్చు. కానీ మనం బైబిలు సూత్రాల్ని పాటించడం ఆపేస్తే, చాలా బరువు ఉందని యుద్ధం మధ్యలో తన ఛాతి కవచాన్ని తీసేసే సైనికుడిలా ఉంటాం. అది ఎంత మూర్ఖత్వమో కదా! యెహోవాను ప్రేమించేవాళ్ల దృష్టిలో ఆయన ఆజ్ఞలు “భారమైనవి కావు,” కానీ ప్రాణాల్ని కాపాడేవి.—1 యోహా. 5:3.

8. సువార్త ప్రకటించడం కోసం సంసిద్ధత అనే చెప్పులు వేసుకోవడం అంటే ఏంటి?

8 శాంతి సువార్త ప్రకటించడం కోసం సంసిద్ధత అనే చెప్పులు వేసుకోండి అని కూడా పౌలు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. అంటే మనం రాజ్యసువార్త ప్రకటించడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. బైబిల్లో ఉన్న మంచివార్తను ఇతరులకు చెప్పినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా యెహోవా ప్రజలు మంచివార్త ప్రకటించే అవకాశాల కోసం చూస్తున్నారు. వాళ్లు ఉద్యోగం చేసే చోట, స్కూల్లో, వ్యాపార ప్రాంతాల్లో, ఇంటింటి పరిచర్యలో, షాపింగ్‌ చేస్తున్నప్పుడు, బంధువుల్ని కలుస్తున్నప్పుడు, పరిచయమున్న వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, ఆఖరికి ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పుడు కూడా మంచివార్తను ప్రకటిస్తున్నారు. అది చూసినప్పుడు మనకు ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. ఒకవేళ మనం భయపడిపోయి ప్రకటించడం ఆపేస్తే, యుద్ధం జరుగుతున్నప్పుడు తన చెప్పులు తీసేసే సైనికుడిలా ఉంటాం. అలా చేస్తే ఆయన పాదాలకు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఆయన తనను తాను కాపాడుకోలేడు, సైనికాధికారి ఇచ్చే ఆదేశాల్ని పాటించలేడు.

చెప్పులు: సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండడం

9. మనం విశ్వాసం అనే పెద్ద డాలును ఎందుకు పట్టుకోవాలి?

9 పెద్ద డాలు, యెహోవా మీద మనకున్న విశ్వాసాన్ని సూచిస్తుంది. తాను ఇచ్చిన ప్రతీ మాటను యెహోవా నిలబెట్టుకుంటాడని మనం నమ్ముతాం. ‘దుష్టుడి అగ్ని బాణాలన్నీ ఆర్పేయడానికి’ ఆ విశ్వాసం సహాయం చేస్తుంది. విశ్వాసం అనే పెద్ద డాలును ఎందుకు పట్టుకోవాలి? ఎందుకంటే మతభ్రష్టుల బోధల వల్ల మోసపోకుండా, ఇతరుల విమర్శల వల్ల నిరుత్సాహపడకుండా అది మనల్ని కాపాడుతుంది. ఒకవేళ విశ్వాసం లేకపోతే, యెహోవాకు ఇష్టంలేని పని చేయమని వేరేవాళ్లు ఒత్తిడి చేసినప్పుడు మనం దాన్ని ఎదిరించలేం. కానీ, ఉద్యోగ స్థలంలో లేదా స్కూల్లో మన విశ్వాసం కోసం ధైర్యంగా నిలబడిన ప్రతీసారి మనం ఆ డాలును పట్టుకున్నట్టే. (1 పేతు. 3:15) ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం దొరికినా, మన ఆరాధనకు ఆటంకంగా మారుతుందని దాన్ని వదులుకున్న ప్రతీసారి మనం ఆ డాలును పట్టుకున్నట్టే. (హెబ్రీ. 13:5, 6) వ్యతిరేకత ఎదురైనా యెహోవాను సేవిస్తూనే ఉన్నామంటే, విశ్వాసం అనే డాలు మనల్ని కాపాడుతోందని అర్థం.—1 థెస్స. 2:2.

డాలు: యెహోవా మీద, ఆయన వాగ్దానాల మీద మనకున్న విశ్వాసం

10. రక్షణ అనే శిరస్త్రాణం అంటే ఏంటి? మనం దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?

10 రక్షణ అనే శిరస్త్రాణం, యెహోవా ఇచ్చే నిరీక్షణను సూచిస్తుంది. తన ఇష్టం చేసే వాళ్లందరికీ యెహోవా ప్రతిఫలం ఇస్తాడు, ఆఖరికి వాళ్లు చనిపోయినా పునరుత్థానం చేస్తాడు అనేదే ఆ నిరీక్షణ. (1 థెస్స. 5:8; 1 తిమో. 4:10; తీతు 1:1, 2) శిరస్త్రాణం ఒక సైనికుని తలను కాపాడినట్టే, రక్షించబడతామనే నిరీక్షణ మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుతుంది. ఎలా? దేవుని వాగ్దానాల మీద మనసుపెట్టడానికి, కష్టాల్ని సరైన దృష్టితో చూడడానికి ఆ నిరీక్షణ మనకు సహాయం చేస్తుంది. మనం ఆ శిరస్త్రాణాన్ని ఎలా పెట్టుకుంటాం? మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు తగ్గట్టు ఉండేలా చూసుకోవడం ద్వారా దాన్ని పెట్టుకుంటాం. ఉదాహరణకు, మనం నశించిపోయే సిరిసంపదల మీద కాకుండా దేవుని మీద నిరీక్షణ ఉంచుతాం.—కీర్త. 26:2; 104:34; 1 తిమో. 6:17.

శిరస్త్రాణం: శాశ్వత జీవితం అనే నిరీక్షణ

11. పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన ఖడ్గం అంటే ఏంటి? మనం దాన్ని ఎందుకు ఉపయోగించాలి?

11 పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన ఖడ్గం, దేవుని వాక్యాన్ని అంటే బైబిల్ని సూచిస్తుంది. అబద్ధాలన్నిటినీ బయటపెట్టే శక్తి, తప్పుడు బోధల నుండి, హానికరమైన అలవాట్ల నుండి ప్రజల్ని విడిపించే శక్తి ఆ ఖడ్గానికి ఉంది. (2 కొరిం. 10:4, 5; 2 తిమో. 3:16, 17; హెబ్రీ. 4:12) మనం దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం ద్వారా, దేవుని సంస్థ ఇచ్చే శిక్షణను తీసుకోవడం ద్వారా ఆ ఖడ్గాన్ని చక్కగా ఉపయోగించడం నేర్చుకుంటాం. (2 తిమో. 2:15) యుద్ధ కవచాన్ని ఇవ్వడంతో పాటు, యెహోవా ఇంకో విధంగా కూడా మనల్ని కాపాడతాడు. ఎలా?

ఖడ్గం: దేవుని వాక్యమైన బైబిలు

మనం ఒంటరిగా పోరాడాల్సినఅవసరం లేదు

12. మనకు ఇంకా ఏం అవసరం? ఎందుకు?

12 అనుభవం గల సైనికుడికి, తాను ఒక్కడినే పెద్ద సైన్యాన్ని ఓడించలేనని తెలుసు; ఆయనకు తోటి సైనికుల సహాయం అవసరం. అదేవిధంగా మనం సాతానును, అతని అనుచరుల్ని ఒంటరిగా ఓడించలేం; మనకు సహోదర సహోదరీల సహాయం కావాలి. యెహోవా మనకు సహాయం చేయడానికి ప్రపంచవ్యాప్త “సహోదర బృందాన్ని” ఇచ్చాడు.—1 పేతు. 2:17.

13. హెబ్రీయులు 10:24, 25 ప్రకారం, మీటింగ్స్‌కి వెళ్లడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

13 మనం మీటింగ్స్‌కి వెళ్లడం ద్వారా సహోదర సహోదరీల సహాయం పొందుతాం. (హెబ్రీయులు 10:24, 25 చదవండి.) మనలో ప్రతీ ఒక్కరం కొన్నిసార్లు నిరుత్సాహపడతాం, అలాంటప్పుడు మీటింగ్స్‌ మనకు బలాన్నిస్తాయి. మన సహోదర సహోదరీలు మనస్ఫూర్తిగా చెప్పే కామెంట్స్‌ ద్వారా మనం ప్రోత్సాహం పొందుతాం. బైబిలు ఆధారంగా ఇచ్చే ప్రసంగాలు, ప్రదర్శనలు యెహోవాను సేవించాలనే మన కోరికను బలపరుస్తాయి. అంతేకాదు మీటింగ్స్‌కి ముందు, తర్వాత సహోదర సహోదరీలు చెప్పే మాటలు మనకు ఊరటను ఇస్తాయి. (1 థెస్స. 5:14) వాటికి తోడు, వేరేవాళ్లకు సహాయం చేసే అవకాశాలు మీటింగ్స్‌లో దొరుకుతాయి, దానివల్ల మనం సంతోషం పొందుతాం. (అపొ. 20:35; రోమా. 1:11, 12) మీటింగ్స్‌ మనకు వేరే విధాలుగా కూడా సహాయం చేస్తాయి. అవి మన యుద్ధ నైపుణ్యాల్ని అంటే పరిచర్య చేయడంలో మన నైపుణ్యాల్ని మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు, బోధనా పనిముట్లను చక్కగా ఎలా ఉపయోగించాలో మీటింగ్స్‌లో నేర్చుకుంటాం. కాబట్టి మీటింగ్స్‌కి చక్కగా సిద్ధపడండి. మీటింగ్‌ జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి, తర్వాత మీరు నేర్చుకున్న విషయాల్ని పాటించండి. అలా చేస్తే, మీరు “క్రీస్తుయేసుకు మంచి సైనికుడిగా” ఉంటారు.—2 తిమో. 2:3.

14. మనకు సహాయం చేయడానికి ఇంకా ఎవరు ఉన్నారు?

14 మనకు శక్తిమంతులైన కోటానుకోట్ల దేవదూతల సహాయం కూడా ఉంది. ఒక్క దేవదూత ఏం చేయగలడో ఆలోచించండి! (యెష. 37:36) మరి అలాంటిది ఒక పెద్ద దేవదూతల సైన్యం ఏమేం చేయగలదో ఊహించండి. యెహోవాకున్న శక్తివంతమైన సైన్యం ముందు ఏ మనిషి లేదా చెడ్డదూత నిలవలేడు. యెహోవా అందరికన్నా శక్తిమంతుడు, కాబట్టి ఆయన మనతో ఉంటే మనకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నా వాళ్లందరి కన్నా మనమే బలవంతులం. (న్యాయా. 6:16) అందులో ఎలాంటి సందేహం లేదు! ఆ విషయాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోండి. మీ తోటి ఉద్యోగి గానీ, తోటి విద్యార్థి గానీ, సత్యంలోలేని బంధువు గానీ ఏమైనా అన్నా లేక చేసినా కృంగిపోకండి. ఈ పోరాటంలో మీరు ఒంటరివాళ్లు కాదని గుర్తుంచుకోండి. యెహోవాయే మిమ్మల్ని నడిపిస్తున్నాడు.

యెహోవా మనల్ని కాపాడుతూనే ఉంటాడు

15. యెషయా 54:15, 17 ప్రకారం, మన ప్రకటనా పనిని ఎవ్వరూ ఆపలేరని ఎందుకు చెప్పవచ్చు?

15 సాతాను గుప్పిట్లో ఉన్న ఈ లోకం మనల్ని ద్వేషించడానికి చాలా కారణాలున్నాయి. మనం రాజకీయాల్లో అస్సలు తలదూర్చం, యుద్ధాలు చేయం. మనం దేవుని పేరును ప్రకటిస్తాం, ఆయన రాజ్యం మాత్రమే శాంతిని తీసుకొస్తుందని చెప్తాం, ఆయన నీతి ప్రమాణాల్ని పాటిస్తాం. ఈ లోకాన్ని పరిపాలిస్తున్న సాతాను అబద్ధికుడని, హంతకుడని నిరూపిస్తాం. (యోహా. 8:44) అంతేకాదు, సాతాను లోకం త్వరలోనే నాశనం అవుతుందని ప్రకటిస్తాం. కానీ సాతాను, అతని అనుచరులు మన ప్రకటనా పనిని ఎన్నడూ ఆపలేరు. మనం దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని యెహోవాను స్తుతిస్తూ ఉంటాం! సాతాను ఎంత శక్తిమంతుడైనా, రాజ్యసువార్త భూవ్యాప్తంగా ఉన్న ప్రజలకు చేరకుండా ఆపలేకపోయాడు. యెహోవా మనల్ని కాపాడుతున్నాడు కాబట్టే అది సాధ్యమైంది.—యెషయా 54:15, 17 చదవండి.

16. మహాశ్రమ కాలంలో యెహోవా తన ప్రజల్ని ఎలా కాపాడతాడు?

16 త్వరలో ఏం జరగబోతోంది? మహాశ్రమ కాలంలో యెహోవా మనల్ని అద్భుత రీతిలో కాపాడతాడు. ముందుగా, భూరాజులు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనును నాశనం చేసినప్పుడు, యెహోవా తన నమ్మకమైన సేవకుల్ని కాపాడతాడు. (ప్రక. 17:16-18; 18:2, 4) తర్వాత, సాతాను లోకంలోని మిగతా భాగాల్ని హార్‌మెగిద్దోనులో నాశనం చేస్తున్నప్పుడు కూడా యెహోవా తన ప్రజల్ని కాపాడతాడు.—ప్రక. 7:9, 10; 16:14, 16.

17. యెహోవాకు దగ్గరగా ఉండడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

17 యెహోవాకు దగ్గరగా ఉన్నంతకాలం సాతాను మనకు శాశ్వత హాని చేయలేడు. నిజానికి, శాశ్వతంగా నాశనం అయ్యేది సాతానే. (రోమా. 16:20) కాబట్టి సంపూర్ణ యుద్ధ కవచాన్ని వేసుకోండి, దాన్ని ఎప్పుడూ తీయకండి! యుద్ధంలో మీరు సొంతగా పోరాడాలని చూడకండి. మీ సహోదర సహోదరీలకు సహాయం చేయండి. యెహోవా ఇచ్చే నిర్దేశాల్ని పాటించండి. అలా చేస్తే మీ ప్రేమగల పరలోక తండ్రి మిమ్మల్ని బలపరుస్తాడనే, కాపాడతాడనే నమ్మకంతో ఉండవచ్చు.—యెష. 41:10.

పాట 149 విజయగీతం

^ పేరా 5 యెహోవా మనల్ని బలపరుస్తాడని, కాపాడతాడని బైబిలు మాటిస్తోంది. ఈ ఆర్టికల్‌లో మనం వీటికి జవాబులు చూస్తాం: మనకు యెహోవా సంరక్షణ ఎందుకు అవసరం? యెహోవా మనల్ని ఎలా కాపాడతాడు? ఆయనిచ్చే సహాయం నుండి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?