కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 14

క్రీస్తు అడుగుజాడల్లో నమ్మకంగా నడవండి

క్రీస్తు అడుగుజాడల్లో నమ్మకంగా నడవండి

“క్రీస్తు . . . మీ కోసం బాధలు అనుభవించి, మీరు నమ్మకంగా తన అడుగుజాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచాడు.”—1 పేతు. 2:21.

పాట 13 క్రీస్తు మన ఆదర్శం

ఈ ఆర్టికల్‌లో . . . *

మనం నమ్మకంగా అనుసరించడానికి యేసు తన అడుగుజాడల్ని విడిచిపెట్టాడు (1-2 పేరాలు చూడండి)

1-2. మొదటి పేతురు 2:21 లోని మాటల్ని అర్థం చేసుకోవడానికి ఏ ఉదాహరణ సహాయం చేస్తుంది?

ఉదాహరణకు మీరు, ఇంకొంతమంది కలిసి ప్రమాదకరమైన మంచుకొండల్లో ప్రయాణిస్తున్నట్లు ఊహించుకోండి. అనుభవంగల ఒక గైడు మీకు ముందు నడుస్తూ దారి చూపిస్తున్నాడు. ఆ మెత్తటి మంచు మీద ఆయన అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాసేపటికి మీకు ఆ గైడు కనిపించలేదు. కానీ మీరు భయపడరు. ఎందుకంటే మీరు, మీతోపాటు ఉన్నవాళ్లు ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన వెనకాలే వెళ్లవచ్చు!

2 ఒకవిధంగా చెప్పాలంటే, నిజ క్రైస్తవులమైన మనం ప్రమాదకరమైన చెడ్డ లోకంలో ప్రయాణిస్తున్నాం. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే, యెహోవా మనకు ఒక పరిపూర్ణ గైడును, అంటే తన కుమారుడైన యేసుక్రీస్తును ఇచ్చాడు. ఆయన అడుగుజాడల్లో మనం నమ్మకంగా నడవవచ్చు. (1 పేతు. 2:21) ఒక బైబిలు రెఫరెన్సు పుస్తకం చెప్తున్నట్లు, పేతురు ఇక్కడ యేసును ఒక గైడుతో పోల్చాడు. గైడు ఎలాగైతే తన అడుగుజాడల్ని విడిచిపెడతాడో, యేసు కూడా మనం నడవడం కోసం తన అడుగుజాడల్ని విడిచిపెట్టాడు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి సంబంధించి మూడు ప్రశ్నల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. యేసు అడుగుజాడల్లో నడవడం అంటే ఏంటి? అలా ఎందుకు నడవాలి? ఎలా నడవాలి?

యేసు అడుగుజాడల్లో నడవడం అంటే ఏంటి?

3. ఒకరి అడుగుజాడల్లో నడవడం అంటే ఏంటి?

3 ఒకరి అడుగుజాడల్లో నడవడం అంటే ఏంటి? బైబిల్లో కొన్నిసార్లు “నడవడం,” “పాదాలు” అనే మాటలు ఒక వ్యక్తి జీవన విధానాన్ని సూచిస్తాయి. (ఆది. 6:9; కీర్త. 119:59) ఒక వ్యక్తి ఉంచే ఆదర్శాన్ని, ఆయన నడుస్తున్నప్పుడు పడే అడుగుజాడలతో పోల్చవచ్చు. కాబట్టి ఒకరి అడుగుజాడల్లో నడవడం అంటే, ఆయన ఆదర్శాన్ని అనుసరించడం లేదా ఆయన్ని అనుకరించడం.

4. యేసు అడుగుజాడల్లో నడవడం అంటే ఏంటి?

4 మరి యేసు అడుగుజాడల్లో నడవడం అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన ఆదర్శాన్ని అనుసరించడం. ఈ ఆర్టికల్‌ ముఖ్య లేఖనంలో, ప్రత్యేకంగా కష్టాల్ని సహించడంలో యేసు ఉంచిన గొప్ప ఆదర్శాన్ని అపొస్తలుడైన పేతురు నొక్కి చెప్తున్నాడు. అయితే మనం ఆ ఒక్క విషయంలోనే కాదు, ఇంకా ఎన్నో విషయాల్లో యేసును అనుకరించవచ్చు. (1 పేతు. 2:18-25) నిజంగా యేసు జీవితమంతా అంటే ఆయన చెప్పిన, చేసిన ప్రతీదీ మనకు ఆదర్శంగా ఉంది.

5. అపరిపూర్ణ మనుషులు నిజంగా యేసు పరిపూర్ణ ఆదర్శాన్ని అనుసరించగలరా? వివరించండి.

5 అపరిపూర్ణ మనుషులమైన మనం నిజంగా యేసు ఆదర్శాన్ని అనుసరించగలమా? అనుసరించగలం. పేతురు మనల్ని యేసు అడుగుజాడల్లో పరిపూర్ణంగా నడవమని చెప్పలేదు గానీ, “నమ్మకంగా” నడవమని ప్రోత్సహించాడు. మనం అపరిపూర్ణులం అయినప్పటికీ, చేయగలిగింది చేస్తూ యేసు అడుగుజాడల్లో జాగ్రత్తగా నడిస్తే, అపొస్తలుడైన యోహాను ఇచ్చిన ఈ సలహాను పాటించిన వాళ్లమౌతాం: ‘ఆయనలాగే [యేసులాగే] నడుచుకుంటూ ఉండండి.’—1 యోహా. 2:6.

మనం యేసు అడుగుజాడల్లో ఎందుకు నడవాలి?

6-7. యేసు అడుగుజాడల్లో నడిస్తే మనం యెహోవాకు దగ్గరౌతామని ఎందుకు చెప్పవచ్చు?

6 యేసు అడుగుజాడల్లో నడవడం వల్ల మనం యెహోవాకు ఇంకా దగ్గరౌతాం. అలాగని ఎందుకు చెప్పవచ్చు? మొదటిగా, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఎలా జీవించాలో యేసు చాలా చక్కగా చూపించాడు. (యోహా. 8:29) కాబట్టి, యేసు అడుగుజాడల్లో నడిస్తే మనం యెహోవాను సంతోషపెడతాం. అలా మన పరలోక తండ్రికి దగ్గరవ్వడానికి కృషిచేస్తే, ఆయన కూడా మనకు దగ్గరౌతాడనే నమ్మకంతో ఉండవచ్చు.—యాకో. 4:8.

7 రెండవదిగా, యేసు తన తండ్రిని పరిపూర్ణంగా అనుకరించాడు. అందుకే ఆయన ఇలా అనగలిగాడు: “నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు.” (యోహా. 14:9) మనం యేసు లక్షణాల్ని, ఇతరులతో ఆయన ప్రవర్తించిన విధానాన్ని అనుకరించవచ్చు. ఉదాహరణకు, ఆయన ఒక కుష్ఠురోగి మీద జాలిపడ్డాడు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ఒక స్త్రీ మీద సహానుభూతి చూపించాడు, ప్రియమైన వాళ్లను పోగొట్టుకున్న వాళ్లమీద కనికరపడ్డాడు. మనం ఆయన్ని అనుకరిస్తే, యెహోవాను కూడా అనుకరిస్తున్నట్టే. (మార్కు 1:40, 41; 5:25-34; యోహా. 11:33-35) మనం యెహోవాను ఎంత ఎక్కువగా అనుకరిస్తే, అంత ఎక్కువగా ఆయనకు దగ్గరౌతాం.

8. యేసు అడుగుజాడల్లో నడవడం వల్ల మనం లోకాన్ని ‘జయించగలం’ అని ఎందుకు చెప్పవచ్చు?

8 యేసు అడుగుజాడల్లో నడిస్తే, ఈ చెడ్డ లోకం వల్ల పక్కదారి పట్టకుండా ఉంటాం. చనిపోవడానికి ముందు రోజు రాత్రి యేసు ఇలా అనగలిగాడు: “నేను లోకాన్ని జయించాను.” (యోహా. 16:33) ఈ లోక ఆలోచనల, లక్ష్యాల, పనుల ప్రభావం తనమీద పడకుండా చూసుకోవడం ద్వారా ఆయన దాన్ని జయించాడు. అంతేకాదు, తను భూమ్మీదికి రావడానికి గల ముఖ్య కారణం యెహోవా పేరును పవిత్రపర్చడమే అని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. మరి మన సంగతేంటి? ఈ లోకంలో మనల్ని పక్కదారి పట్టించే విషయాలు చాలా ఉన్నాయి. కానీ యేసులాగే యెహోవా ఇష్టం చేయడం మీదే మనసుపెడితే, మనం కూడా లోకాన్ని ‘జయించగలం.’—1 యోహా. 5:5.

9. శాశ్వత జీవితానికి నడిపించే దారిలోనే కొనసాగాలంటే మనం ఏం చేయాలి?

9 యేసు అడుగుజాడల్లో నడవడం వల్ల మనం శాశ్వత జీవితం పొందవచ్చు. ధనవంతుడైన ఒక యువకుడు శాశ్వత జీవితం పొందాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు, యేసు ఇలా అన్నాడు: “నువ్వు వచ్చి నన్ను అనుసరించు.” (మత్త. 19:16-21) తనను క్రీస్తుగా అంగీకరించని కొంతమంది యూదులతో యేసు ఇలా అన్నాడు: “నా గొర్రెలు . . . నన్ను అనుసరిస్తాయి. వాటికి నేను శాశ్వత జీవితం ఇస్తాను.” (యోహా. 10:24-29) మహాసభ సభ్యుడైన నీకొదేము యేసు బోధలు వినడానికి వచ్చాడు. అప్పుడు యేసు, ‘తనమీద విశ్వాసం ఉంచేవాళ్లు శాశ్వత జీవితం పొందుతారని’ ఆయనతో అన్నాడు. (యోహా. 3:16) తన మాటల ద్వారా, పనుల ద్వారా యేసు నేర్పించిన విషయాల్ని పాటిస్తే మనం ఆయన మీద విశ్వాసం ఉంచినట్లు అవుతుంది. అలాచేస్తే, శాశ్వత జీవితానికి నడిపించే దారిలోనే మనం కొనసాగుతాం.—మత్త. 7:14.

మనం యేసు అడుగుజాడల్లో నమ్మకంగా ఎలా నడవవచ్చు?

10. యేసును ‘తెలుసుకోవడం’ అంటే ఏంటి? (యోహాను 17:3)

10 మనం యేసు అడుగుజాడల్లో నమ్మకంగా నడవాలంటే, ముందుగా ఆయన్ని తెలుసుకోవాలి. (యోహాను 17:3 చదవండి.) యేసును ‘తెలుసుకోవడం’ అనేది ఒక్కసారితో అయిపోయేది కాదు. మనం ఆయన గురించి, అంటే ఆయన లక్షణాలు, ఆలోచనలు, ప్రమాణాల గురించి నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఎంతకాలం నుండి సత్యంలో ఉన్నా యెహోవాను, ఆయన కుమారుణ్ణి తెలుసుకోవడానికి కృషి చేస్తూనే ఉండాలి.

11. నాలుగు సువార్త పుస్తకాల్లో ఏమున్నాయి?

11 మనం తన కుమారుడైన యేసు గురించి తెలుసుకోవడం కోసం యెహోవా ప్రేమతో నాలుగు సువార్త పుస్తకాల్ని బైబిల్లో రాయించాడు. వాటిలో యేసు జీవితం, పరిచర్య గురించిన వివరాలు ఉన్నాయి. యేసు చెప్పినవాటి గురించి, చేసినవాటి గురించి, ఆయన భావాల గురించి ఆ పుస్తకాలు తెలియజేస్తాయి. యేసు ఆదర్శాన్ని ‘శ్రద్ధగా గమనించడానికి’ ఆ నాలుగు పుస్తకాలు మనకు సహాయం చేస్తాయి. (హెబ్రీ. 12:3) ఒకవిధంగా చెప్పాలంటే, ఆ పుస్తకాల్లో యేసు అడుగుజాడలు ఉన్నాయి. కాబట్టి సువార్త పుస్తకాల్ని పరిశీలించడం ద్వారా మనం యేసును ఇంకా బాగా తెలుసుకోగలుగుతాం. దానివల్ల, ఆయన అడుగుజాడల్లో నమ్మకంగా నడవగలుగుతాం.

12. సువార్త పుస్తకాల నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?

12 సువార్త పుస్తకాల నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే, వాటిని కేవలం చదివితే సరిపోదు. మనం సమయం తీసుకొని వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, లోతుగా ధ్యానించాలి. (యెహోషువ 1:8 తో పోల్చండి.) సువార్త పుస్తకాల్ని ధ్యానించడానికి, వాటిలోని విషయాల్ని పాటించడానికి సహాయం చేసే రెండు పనులను ఇప్పుడు పరిశీలిద్దాం.

13. సువార్త పుస్తకాల్ని మీరెలా ఊహించుకుంటూ చదవవచ్చు?

13 మొదటిగా, సువార్త పుస్తకాల్ని ఊహించుకుంటూ చదవండి. మీ ఊహాశక్తిని ఉపయోగించి ఆ సన్నివేశాన్ని చూడండి, వినండి, అందులోని వాళ్ల భావాల్ని అర్థంచేసుకోండి. దానికోసం యెహోవా సంస్థ ఇచ్చిన ప్రచురణల్లో మీరు కొంత పరిశోధన చేయవచ్చు. సందర్భాన్ని పరిశీలించండి, అంటే మీరు చదువుతున్న లేఖనాలకు ముందు, ఆ తర్వాత ఉన్న సంఘటనల్ని పరిశీలించండి. ఆ సన్నివేశంలో ఉన్న ప్రజల గురించి, ప్రాంతాల గురించి మరింత సమాచారం వెతకండి. మీరు ఒక సువార్త పుస్తకంలో ఉన్న విషయాన్ని చదువుతుంటే, దాన్ని ఇంకో సువార్త పుస్తకంలో ఎలా రాశారో పరిశీలించండి. ఒక సువార్త రచయిత రాయని ఆసక్తికరమైన విషయాన్ని ఇంకో సువార్త రచయిత రాసి ఉండవచ్చు.

14-15. సువార్త పుస్తకాల్లో నేర్చుకున్న వాటిని మన జీవితంలో పాటించాలంటే ఏం చేయాలి?

14 రెండవదిగా, సువార్త పుస్తకాల్లో చదివిన వాటిని పాటించండి. (యోహా. 13:17) సువార్త పుస్తకంలో ఏదైనా సంఘటన గురించి జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత, ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘ఇందులో ఏ విషయాన్ని నా జీవితంలో పాటించవచ్చు? దీన్ని ఉపయోగించి వేరేవాళ్లకు నేనెలా సహాయం చేయవచ్చు?’ ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. తర్వాత సరైన సమయంలో మీరు నేర్చుకున్న పాఠాన్ని ప్రేమగా, నేర్పుగా అతనితో పంచుకోండి.

15 ఆ రెండు పనులను ఎలా చేయవచ్చో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఆలయంలో విరాళం వేసిన పేద విధవరాలిని యేసు గమనించాడు. దానికి సంబంధించిన లేఖనాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆలయంలో పేద విధవరాలు

16. మార్కు 12:41 లో ఉన్న సన్నివేశాన్ని వర్ణించండి.

16 లేఖనాల్ని ఊహించుకుంటూ చదవండి. (మార్కు 12:41 చదవండి.) సన్నివేశాన్ని ఊహించుకోండి. అది క్రీ.శ. 33, నీసాను 11. యేసు చనిపోవడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. యేసు దాదాపు ఆ రోజంతా ఆలయంలో బోధిస్తూ గడిపాడు. మతనాయకులు ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాసేపటి క్రితం, కొంతమంది మతనాయకులు ఆయన ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నాడని ప్రశ్నించారు. ఇంకొంతమంది రకరకాల ప్రశ్నలతో ఆయన్ని చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నించారు. (మార్కు 11:27-33; 12:13-34) ఇప్పుడు యేసు ఆలయంలో ఇంకో చోటుకు వెళ్లాడు. ఇక్కడ, అంటే బహుశా స్త్రీల ఆవరణలో ఆయనకు కానుక పెట్టెలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన అక్కడ కూర్చొని, కానుక పెట్టెల్లో డబ్బులు వేస్తున్న వాళ్లను గమనించడం మొదలుపెట్టాడు. చాలామంది ధనవంతులు ఎన్నో నాణేలు అందులో వేయడం ఆయన చూశాడు. బహుశా, కానుక పెట్టెల్లో వాళ్లు వేస్తున్న నాణేల శబ్దం వినిపించేంత దగ్గర్లో యేసు కూర్చొని ఉంటాడు.

17. మార్కు 12:42 లో ఉన్న పేద విధవరాలు ఏం చేసింది?

17 మార్కు 12:42 చదవండి. కాసేపటికి, యేసు దృష్టి ఒకామె మీద పడింది. ఆమె “పేద విధవరాలు.” (లూకా 21:2) ఆమెకు జీవితం చాలా కష్టంగా ఉంది, బహుశా కనీస అవసరాలకు సరిపడా డబ్బు కూడా ఆమె దగ్గర లేకపోవచ్చు. అయినప్పటికీ, ఆమె ఒక కానుక పెట్టె దగ్గరికి వెళ్లి, మెల్లగా రెండు చిన్న నాణేలు వేసింది. బహుశా అవి పెట్టెలో పడుతున్నప్పుడు ఎలాంటి శబ్దం వచ్చి ఉండకపోవచ్చు. ఆమె ఏం వేసిందో యేసుకు తెలుసు. అవి రెండు లెప్టాన్‌లు, అప్పట్లో చెలామణి అవుతున్న నాణేల్లో అన్నిటికన్నా తక్కువ విలువగలవి అవే. వాటితో, బాగా చవకగా దొరికే ఆహారమైన ఒక్క పిచ్చుక కూడా వచ్చేది కాదు.

18. మార్కు 12:43, 44 ప్రకారం, విధవరాలు వేసిన విరాళం గురించి యేసు ఏమన్నాడు?

18 మార్కు 12:43, 44 చదవండి. ఆ విధవరాలు చేసిన పని యేసును ఎంతో ఆకట్టుకుంది. అందుకే ఆయన శిష్యుల్ని పిలిచి, ఆ విధవరాలిని చూపిస్తూ ఇలా అన్నాడు: “కానుక పెట్టెల్లో డబ్బులు వేసిన వాళ్లందరి కన్నా ఈ పేద విధవరాలే ఎక్కువ వేసింది.” తర్వాత ఆయన ఇలా వివరించాడు: “వాళ్లందరూ [ముఖ్యంగా, ధనవంతులు] తమ సంపదల్లో నుండి కొంచెం వేశారు, కానీ ఈమె ఎంతో అవసరంలో ఉన్నా, తన దగ్గర ఉన్నదంతా వేసేసింది.” ఆ విధవరాలు తన దగ్గరున్న ఆఖరి నాణేన్ని కూడా విరాళంగా ఇచ్చేయడం ద్వారా, యెహోవా తనను చూసుకుంటాడనే నమ్మకం ఉంచింది.—కీర్త. 26:3.

యెహోవాకు తాము ఇవ్వగలిగింది ఇస్తున్న వాళ్లను యేసులాగే మెచ్చుకోండి (19-20 పేరాలు చూడండి) *

19. పేద విధవరాలి గురించి యేసు అన్న మాటల్లో ఏ ముఖ్యమైన పాఠం ఉంది?

19 నేర్చుకున్న వాటిని మీ జీవితంలో పాటించండి. ఈ ప్రశ్న వేసుకోండి: ‘పేద విధవరాలి గురించి యేసు అన్న మాటల నుండి నేను ఏ పాఠం నేర్చుకోవచ్చు?’ ఒకసారి ఆ విధవరాలి గురించి ఆలోచించండి. యెహోవాకు ఎక్కువ ఇవ్వాలని ఆమె తప్పకుండా కోరుకొని ఉంటుంది. అయినప్పటికీ, ఆమె ఎంత ఇవ్వగలదో అంత ఇచ్చింది. చెప్పాలంటే, ఆమె యెహోవాకు శ్రేష్ఠమైనది ఇచ్చింది. ఆమె ఇచ్చిన విరాళం తన తండ్రికి ఎంతో విలువైనదని యేసుకు తెలుసు. ఇందులో మనకున్న ముఖ్యమైన పాఠం ఏంటంటే, మనం యెహోవాకు శ్రేష్ఠమైనది ఇచ్చినప్పుడు అంటే నిండు హృదయంతో, నిండు ప్రాణంతో ఆయన్ని సేవించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. (మత్త. 22:37; కొలొ. 3:23) మనం చేయగలిగినదంతా చేసినప్పుడు, తన ఆరాధనకు అంటే పరిచర్య, మీటింగ్స్‌ వంటివాటికి మన సమయాన్ని, శక్తిని ఇవ్వగలిగినంత ఇచ్చినప్పుడు యెహోవా ఆనందిస్తాడు!

20. పేద విధవరాలి నుండి మీరు నేర్చుకున్న విషయాన్ని ఎలా పాటించవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

20 విధవరాలి ఉదాహరణ నుండి మీరు నేర్చుకున్న విషయాన్ని ఎలా పాటించవచ్చు? మనం చేయగలిగింది చేస్తే యెహోవా సంతోషిస్తాడు అనే విషయం, మీ సంఘంలో ఎవరికి ప్రోత్సాహకరంగా అనిపించవచ్చో ఆలోచించండి. ఉదాహరణకు, మీ సంఘంలో ఎవరైనా వృద్ధులు ఇంతకుముందులా పరిచర్య చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? దీర్ఘకాలిక వ్యాధి వల్ల మీటింగ్స్‌కి క్రమంగా రాలేకపోతున్నామని ఎవరైనా నిరుత్సాహపడుతున్నారా? ‘బలపర్చే మంచి మాటలతో’ వాళ్లను ఓదార్చండి. (ఎఫె. 4:29) పేద విధవరాలి ఉదాహరణలో మీరు నేర్చుకున్న చక్కని పాఠాన్ని వాళ్లతో పంచుకోండి. ఇవ్వగలిగింది ఇచ్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడు అనే విషయాన్ని, మీ ప్రోత్సాహకరమైన మాటలు వాళ్లకు గుర్తుచేయవచ్చు. (సామె. 15:23; 1 థెస్స. 5:11) చేయగలిగింది చేస్తున్నందుకు మీరు వాళ్లను మెచ్చుకోవడం చిన్న విషయంలా అనిపించినా, అలా మెచ్చుకోవడం ద్వారా మీరు యేసు అడుగుజాడల్లో నమ్మకంగా నడుస్తున్నారు.

21. మీరేం చేయాలని నిర్ణయించుకున్నారు?

21 సువార్త పుస్తకాల్లో యేసు జీవితం గురించి ఎన్నో వివరాలు రాయించినందుకు మనం యెహోవాకు ఎంత కృతజ్ఞులమో కదా! మనం యేసును అనుకరించడానికి, ఆయన అడుగుజాడల్లో నమ్మకంగా నడవడానికి అవి సహాయం చేస్తాయి. సువార్త పుస్తకాల మీద వ్యక్తిగత అధ్యయనం లేదా కుటుంబ ఆరాధన చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నించకూడదు? సువార్త పుస్తకాల నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే వాటిలోని సంఘటనల్ని ఊహించుకుంటూ చదవాలని, నేర్చుకున్న వాటిని మన జీవితంలో పాటించాలని గుర్తుంచుకుందాం. మనం యేసు చేసినవాటిని అనుకరించడమే కాదు, ఆయన చెప్పినవాటిని పాటించాలి కూడా. యేసు చివరి క్షణాల్లో చెప్పిన మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

పాట 15 యెహోవా మొదటి కుమారుణ్ణి కీర్తించండి!

^ పేరా 5 నిజ క్రైస్తవులమైన మనం ‘[యేసు] అడుగుజాడల్లో నమ్మకంగా నడవాలి.’ యేసు అడుగుజాడల్లో నడవడం అంటే ఏంటో, మనం ఆయన అడుగుజాడల్లో ఎందుకు నమ్మకంగా నడవాలో, దాన్ని ఎలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 60 చిత్రాల వివరణ: పేద విధవరాలి గురించి యేసు అన్న మాటల్ని ఒక సహోదరి ధ్యానిస్తోంది. తర్వాత, నిండు ప్రాణంతో యెహోవాను సేవిస్తున్న ఒక వృద్ధ సహోదరిని ఆమె మెచ్చుకుంటోంది.