కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 15

యేసు చివరి మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు?

యేసు చివరి మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు?

“ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈయన మాట వినండి.”—మత్త. 17:5.

పాట 17 “నాకు ఇష్టమే”

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. యేసు చివరి మాటలు చెప్పిన సందర్భాన్ని వివరించండి.

అది క్రీ.శ. 33, నీసాను 14, మధ్యాహ్నం. యేసు మీద అబద్ధ ఆరోపణలు వేసి, చేయని నేరానికి ఆయన్ని దోషిగా తీర్పు తీర్చారు. ఆ తర్వాత ఆయన్ని ఎగతాళి చేశారు, క్రూరంగా హింసించారు, ఆయన చేతులకు-కాళ్లకు మేకులు దిగగొట్టి కొయ్యకు వేలాడదీశారు. ఆయన ఎంత వేదన అనుభవిస్తున్నాడంటే ఊపిరి తీసుకోవడం, మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉంది. కానీ ఆయన మాట్లాడాలి, ఎందుకంటే ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి.

2 హింసాకొయ్య మీద చనిపోతున్నప్పుడు యేసు ఏం చెప్పాడో, వాటినుండి మనమేం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇంకో విధంగా చెప్పాలంటే, ‘ఆయన మాట విందాం.’—మత్త. 17:5.

“తండ్రీ, వీళ్లను క్షమించు”

3. “తండ్రీ, వీళ్లను క్షమించు” అన్నప్పుడు యేసు ఎవరి గురించి మాట్లాడుతుండవచ్చు?

3 యేసు ఏమన్నాడు? కొయ్య మీద వేలాడుతున్నప్పుడు యేసు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, వీళ్లను క్షమించు.” ఎవర్ని క్షమించాలి? వాళ్లు ఎవరో యేసు అన్న తర్వాతి మాటల్లో తెలుసుకోవచ్చు: “వీళ్లు ఏంచేస్తున్నారో వీళ్లకు తెలీదు.” (లూకా 23:33, 34) బహుశా తన చేతులకు-కాళ్లకు మేకులు దిగగొట్టిన రోమా సైనికుల గురించి యేసు మాట్లాడుతుండవచ్చు. నిజానికి ఆయనెవరో వాళ్లకు తెలీదు. అంతేకాదు, తనకు మరణశిక్ష వేయాలని అరిచిన గుంపులోని కొంతమంది గురించి కూడా యేసు మాట్లాడుతుండవచ్చు. వాళ్లు ఆ తర్వాత ఆయన మీద విశ్వాసం ఉంచారు. (అపొ. 2:36-38) తనకు అన్యాయం చేసినవాళ్ల మీద యేసు కోపం పెంచుకోలేదు, పగపెట్టుకోలేదు. (1 పేతు. 2:23) బదులుగా, తనను చంపుతున్న వాళ్లను క్షమించమని యేసు యెహోవాను అడిగాడు.

4. “తండ్రీ, వీళ్లను క్షమించు” అని యేసు అన్న మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

4 యేసు మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు? యేసులాగే మనం ఇతరుల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. (కొలొ. 3:13) మన నమ్మకాలు, జీవన విధానం అర్థంకాక కొంతమంది బంధువులు, ఇతరులు మనల్ని వ్యతిరేకించవచ్చు. వాళ్లు మన గురించి అబద్ధాలు చెప్పవచ్చు, ఇతరుల ముందు మనల్ని ఎగతాళి చేయవచ్చు, మన ప్రచురణల్ని చింపేయవచ్చు, చివరికి మనల్ని కొడతామని కూడా బెదిరించవచ్చు. మనం వాళ్లమీద కోపం పెంచుకునే బదులు, ఏదోక రోజు వాళ్లు కూడా సత్యం తెలుసుకునేలా సహాయం చేయమని యెహోవాను అడగవచ్చు. (మత్త. 5:44, 45) కొన్నిసార్లు క్షమించడం మనకు కష్టంగా ఉండవచ్చు, ముఖ్యంగా మనకు అన్యాయం చేసినవాళ్లను క్షమించడం కష్టంగా ఉండవచ్చు. కానీ మన మనసులో వాళ్లమీద కోపం, పగ పెంచుకుంటే మనకే నష్టం. ఒక సహోదరి ఇలా అంటోంది: “క్షమించడమంటే తప్పును చూసీచూడనట్టు వదిలేయడం కాదు, లేదా నన్ను అలుసుగా తీసుకోమని చెప్తున్నట్టు కాదు. బదులుగా, క్షమించడమంటే కోపాన్ని మనసులో నుండి తీసేసుకోవడమే అని నేను గుర్తించాను.” (కీర్త. 37:8) మనం క్షమించాలని నిర్ణయించుకుంటే మనకు జరిగిన అన్యాయాన్ని బట్టి కృంగిపోకుండా, కోపం పెంచుకోకుండా ఉంటాం.—ఎఫె. 4:31, 32.

“నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు”

5. తనతోపాటు వేలాడుతున్న ఒక నేరస్తునికి యేసు ఏమని మాటిచ్చాడు? ఎందుకు?

5 యేసు ఏమన్నాడు? యేసుతో పాటు ఇద్దరు నేరస్తులు కూడా కొయ్యకు వేలాడదీయబడ్డారు. మొదట్లో మిగతావాళ్ల లాగే వీళ్లిద్దరు కూడా యేసును నిందించారు. (మత్త. 27:44) అయితే కాసేపటికి వాళ్లలో ఒకతను ఆయన్ని నిందించడం ఆపేశాడు. యేసు “ఏ తప్పూ చేయలేదు” అని అతను గుర్తించాడు. (లూకా 23:40, 41) అంతకంటే ముఖ్యంగా, యేసు పునరుత్థానమై భవిష్యత్తులో రాజుగా పరిపాలిస్తాడనే నమ్మకాన్ని అతను చూపించాడు. అతను యేసుతో ఇలా అన్నాడు: “యేసూ, నువ్వు రాజ్యాధికారం పొందినప్పుడు నన్ను గుర్తుచేసుకో.” (లూకా 23:42) ఎంత విశ్వాసం! దానికి జవాబుగా యేసు ఇలా అన్నాడు: “ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు [రాజ్యంలో కాదు, కానీ] పరదైసులో ఉంటావు.” (లూకా 23:43) “నేను,” “నువ్వు,” “నాతో” అనే పదాలను ఉపయోగించడం ద్వారా యేసు అతనికి వ్యక్తిగతంగా మాటిస్తున్నాడని గమనించండి. తన తండ్రి కరుణ గలవాడని తెలుసు కాబట్టి, చనిపోబోతున్న నేరస్తునికి యేసు ఆ మాట ఇవ్వగలిగాడు.—కీర్త. 103:8.

6. నేరస్తునితో యేసు అన్న మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

6 యేసు మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు? యేసు తన తండ్రికి పరిపూర్ణ ప్రతిబింబం. (హెబ్రీ. 1:3) మనల్ని క్షమించాలని, మనమీద కరుణ చూపించాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే ఆయన క్షమాపణ పొందాలంటే, మనం గతంలో చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపపడి, యేసు బలి మీద విశ్వాసం చూపించాలి. (1 యోహా. 1:7) గతంలో తాము చేసిన తప్పుల్ని యెహోవా ఎప్పటికైనా క్షమిస్తాడా అని కొంతమంది అనుకోవచ్చు. మీకెప్పుడైనా అలా అనిపిస్తే, దీని గురించి ఆలోచించండి: యేసు చనిపోవడానికి కాస్త ముందు, అప్పుడప్పుడే విశ్వాసం చూపిస్తున్న నేరస్తుని మీద కరుణ చూపించాడు. మరి అలాంటిది, తన ఆజ్ఞలకు లోబడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్న నమ్మకమైన తన ఆరాధకుల మీద యెహోవా ఇంకెంత కరుణ చూపిస్తాడో కదా!—కీర్త. 51:1; 1 యోహా. 2:1, 2.

“ఇదిగో! నీ కుమారుడు! . . . ఇదిగో! మీ అమ్మ!”

7. యోహాను 19:26, 27 చెప్తున్నట్టు మరియతో, యోహానుతో యేసు ఏమన్నాడు? ఎందుకు?

7 యేసు ఏమన్నాడు? (యోహాను 19:26, 27 చదవండి.) బహుశా అప్పటికే విధవరాలైన తన తల్లి గురించి యేసు ఆలోచిస్తున్నాడు. ఆయన తోబుట్టువులు మరియ భౌతిక అవసరాల్ని చూసుకోవచ్చు. మరి ఆధ్యాత్మిక అవసరాల సంగతేంటి? యేసు తమ్ముళ్లు అప్పటికింకా శిష్యులు అవ్వలేదని తెలుస్తోంది. కానీ యోహాను నమ్మకమైన అపొస్తలుడు, యేసుకు చాలా దగ్గరి స్నేహితుడు. తనతో పాటు యెహోవాను ఆరాధిస్తున్న వాళ్లను యేసు తన ఆధ్యాత్మిక కుటుంబంగా చూశాడు. (మత్త. 12:46-50) కాబట్టి మరియ మీదున్న ప్రేమతో, శ్రద్ధతో ఆమె బాగోగులు చూసుకునే బాధ్యతను యేసు యోహానుకు అప్పగించాడు. ఆమె ఆధ్యాత్మిక అవసరాల్ని యోహాను చక్కగా చూసుకుంటాడని యేసుకు తెలుసు. యేసు తన తల్లితో, “ఇదిగో! నీ కుమారుడు!” అన్నాడు. తర్వాత యోహానుతో, “ఇదిగో! మీ అమ్మ!” అన్నాడు. ఆ రోజు నుంచి యోహాను మరియకు కుమారుడై, సొంత తల్లిని చూసుకున్నట్టు ఆమె బాగోగులు చూసుకున్నాడు. పుట్టినప్పుడు తనను ఎంతో అపురూపంగా చూసుకున్న, ఇప్పుడు చనిపోతున్నప్పుడు కూడా తన పక్కనే ఉన్న ఆ విలువైన స్త్రీ పట్ల యేసు ఎంతటి ప్రేమ చూపించాడో కదా!

8. మరియతో, యోహానుతో యేసు అన్న మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

8 యేసు మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు? మన కుటుంబ సభ్యులతో ఉన్న బంధంకన్నా తోటి సహోదర సహోదరీలతో ఉన్న బంధం ఇంకా బలంగా ఉండవచ్చు. మన కుటుంబ సభ్యులు మనల్ని వ్యతిరేకించవచ్చు, చివరికి విడిచి పెట్టేయవచ్చు. కానీ మనం యెహోవాకు, ఆయన సంస్థకు అంటిపెట్టుకొని ఉంటే యేసు మాటిచ్చినట్టు, మనం వదులుకున్న దానికంటే “100 రెట్లు ఎక్కువ” పొందుతాం. మనల్ని ప్రేమించే కొడుకులు, కూతుళ్లు, తల్లులు, తండ్రులు ఎంతోమంది దొరుకుతారు. (మార్కు 10:29, 30) విశ్వాసం వల్ల; అలాగే యెహోవా మీద, తోటివాళ్ల మీద ఉన్న ప్రేమ వల్ల ఐక్యమైన ఆధ్యాత్మిక కుటుంబంలో ఒకరిగా ఉన్నందుకు మీకెలా అనిపిస్తుంది?—కొలొ. 3:14; 1 పేతు. 2:17.

“నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?”

9. మత్తయి 27:46 లోని యేసు మాటలు ఏం తెలియజేస్తున్నాయి?

9 యేసు ఏమన్నాడు? యేసు చనిపోవడానికి కాస్త ముందు “నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” అని బిగ్గరగా అన్నాడు. (మత్త. 27:46) యేసు ఆ మాటలు ఎందుకు అన్నాడో బైబిలు చెప్పట్లేదు. అయితే ఆ మాటలు కొన్ని విషయాల్ని తెలియజేస్తున్నాయి. ఒకటేంటంటే, ఆ మాటలు అనడం ద్వారా కీర్తన 22:1 లో ఉన్న ప్రవచనాన్ని యేసు నెరవేరుస్తున్నాడు. * అంతేకాదు, యెహోవా తన కుమారుణ్ణి రక్షించడానికి ఆయన చుట్టూ “కంచె” వేయట్లేదని ఆ మాటలు స్పష్టం చేస్తున్నాయి. (యోబు 1:10) ఇంతవరకు ఏ మనిషీ పరీక్షించబడనంతగా పరీక్షించబడేందుకు, యెహోవా తనను శత్రువుల చేతిలో పూర్తిగా విడిచిపెట్టాడని యేసు అర్థంచేసుకున్నాడు. అలాగే, మరణశిక్ష పడేంత నేరం ఆయనేమీ చేయలేదని ఆ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

10. యేసు తన తండ్రితో అన్న మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

10 యేసు మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, మన విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు యెహోవా మనల్ని కాపాడాలని ఎదురుచూడకూడదు. యేసులాగే మన యథార్థత కూడా పూర్తిస్థాయిలో పరీక్షించబడడానికి, అవసరమైతే చనిపోవడానికైనా సిద్ధంగా ఉండాలి. (మత్త. 16:24, 25) అయితే, మనం తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువగా దేవుడు మనల్ని పరీక్షకు గురికానివ్వడు అనే నమ్మకంతో ఉండవచ్చు. (1 కొరిం. 10:13) ఇంకో పాఠం ఏంటంటే, యేసులాగే మనం కూడా అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. (1 పేతు. 2:19, 20) మనం ఏదో తప్పు చేసినందుకు కాదుగానీ లోకానికి వేరుగా ఉన్నందుకు, సత్యం గురించి సాక్ష్యమిస్తున్నందుకు ఇతరులు మనల్ని వ్యతిరేకించవచ్చు. (యోహా. 17:14; 1 పేతు. 4:15, 16) తను బాధలు పడేలా యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడో యేసు అర్థం చేసుకున్నాడు. కానీ, కష్టాల్ని ఎదుర్కొన్న కొంతమంది నమ్మకమైన ఆరాధకులు యెహోవా వాటిని ఎందుకు అనుమతిస్తున్నాడో కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోయారు. (హబ. 1:3) కరుణ, ఓర్పు గల దేవుడు వాళ్ల విశ్వాసం తగ్గిపోయిందని అనుకోలేదు గానీ, తాను మాత్రమే ఇవ్వగల ఊరట వాళ్లకు అవసరమని గుర్తించాడు.—2 కొరిం. 1:3, 4.   

“నాకు దాహంగా ఉంది”

11. యోహాను 19:28 లోని మాటల్ని యేసు ఎందుకు అన్నాడు?

11 యేసు ఏమన్నాడు? (యోహాను 19:28 చదవండి.) “నాకు దాహంగా ఉంది” అని యేసు ఎందుకు అన్నాడు? కీర్తన 22:15 లోని “లేఖనం నెరవేర్చడం కోసం” ఆయన అలా అన్నాడు. అక్కడ ఇలా ఉంది: “నాలో ఇక శక్తి లేదు, నేను మట్టి పెంకులా ఉన్నాను; నా నాలుక నా అంగిలికి అంటుకుపోతోంది.” అంతేకాదు యేసు చాలా బాధను అనుభవించి, హింసాకొయ్య మీద తీవ్రమైన నొప్పిని భరించాడు కాబట్టి ఆయనకు బాగా దాహం వేసి ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి ఆయనకు వేరేవాళ్ల సహాయం అవసరమైంది.

12. “నాకు దాహంగా ఉంది” అని యేసు అన్న మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

12 యేసు మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు? తనకు ఏమనిపిస్తుందో చెప్పడాన్ని యేసు ఒక బలహీనతలా చూడలేదు, మనం కూడా అలాగే ఉండాలి. మనకు ఏం కావాలో ఇతరుల్ని అడగడానికి ఇప్పటివరకు మనం వెనకడుగు వేసివుండవచ్చు. కానీ, అవసరమైనప్పుడు వేరేవాళ్ల సహాయాన్ని అడగడానికి మొహమాటపడకూడదు. ఉదాహరణకు, మనకు వయసైపోయి ఉండవచ్చు లేదా ఆరోగ్యం పాడై ఉండవచ్చు. అలాంటి సమయంలో, సరుకులు తెచ్చుకోవడానికి లేదా డాక్టర్‌ని కలవడానికి మనం వేరేవాళ్ల సహాయాన్ని అడగాల్సి రావచ్చు. మనం కృంగిపోయినప్పుడు లేదా నిరుత్సాహపడినప్పుడు, సంఘ పెద్దను గానీ సంఘంలోని పరిణతిగల స్నేహితుణ్ణి గానీ సహాయం అడగాల్సి రావచ్చు. వాళ్లు మనం చెప్పేది వింటారు లేదా ‘మంచి మాటతో’ మనల్ని సంతోషపెడతారు. (సామె. 12:25) మన సహోదర సహోదరీలు మనల్ని ప్రేమిస్తారని, “కష్టకాలంలో” మనకు సహాయం చేయాలని కోరుకుంటారని గుర్తుంచుకుందాం. (సామె. 17:17) అయితే వాళ్లు మన మనసుల్ని చదవలేరు. మనం అడిగేంతవరకు మనకు సహాయం అవసరమని వాళ్లకు తెలియకపోవచ్చు.

“అంతా పూర్తయింది!”

13. చనిపోయేంత వరకు యథార్థంగా ఉండడం ద్వారా యేసు ఏమేం సాధించాడు?

13 యేసు ఏమన్నాడు? నీసాను 14, మధ్యాహ్నం దాదాపు మూడు గంటలకు, “అంతా పూర్తయింది!” అని యేసు బిగ్గరగా అన్నాడు. (యోహా. 19:30) ఇంకాసేపట్లో చనిపోతాడనగా, యెహోవా తన నుండి కోరినదంతా యేసు పూర్తిచేశాడు. చనిపోయేంత వరకు యథార్థంగా ఉండడం ద్వారా యేసు చాలా విషయాల్ని నెరవేర్చాడు. మొదటిగా, సాతాను అబద్ధికుడని నిరూపించాడు. సాతాను ఏం చేసినా, ఒక పరిపూర్ణ మనిషి పూర్తిస్థాయిలో యథార్థతను కాపాడుకోగలడని ఆయన రుజువుచేశాడు. రెండవదిగా, యేసు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించాడు. ఆయన ప్రాణం అర్పించబట్టే అపరిపూర్ణ మనుషులు దేవునితో సంబంధం కలిగివుండడం, శాశ్వత జీవితమనే నిరీక్షణ పొందడం సాధ్యమైంది. మూడవదిగా, ఆయన యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించాడు, తన తండ్రి పేరు మీద పడిన నిందను తీసేశాడు.

14. మనం ప్రతీరోజూ ఎలా జీవించాలని నిశ్చయించుకోవాలి? వివరించండి.

14 యేసు మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు? ప్రతీరోజూ మన యథార్థతను కాపాడుకోవాలని మనం నిశ్చయించుకోవాలి. గిలియడ్‌ పాఠశాల ఉపదేశకుడిగా సేవచేసిన సహోదరుడు మాక్స్‌వెల్‌ ఫ్రెండ్‌ ఏం చెప్పాడో గమనించండి. ఒక అంతర్జాతీయ సమావేశంలో యథార్థత గురించి ప్రసంగమిస్తూ, ఆయన ఇలా అన్నాడు: “ఈ రోజు మీరు చేయగలిగినవి లేదా చెప్పగలిగినవి రేపటికి వాయిదా వేయకండి. రేపు అనే రోజు ఉంటుందని మీకు ఖచ్చితంగా తెలుసా? శాశ్వత జీవితం పొందే అర్హత మీకుందని నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి రోజు అన్నట్టు ప్రతీరోజూ జీవించండి.” మన యథార్థతను కాపాడుకోవడానికి ఇదే ఆఖరి రోజు అన్నట్టు ప్రతీరోజూ జీవిద్దాం! అప్పుడు ఒకవేళ మనం చనిపోయినా, “యెహోవా, నా యథార్థతను కాపాడుకోవడానికి, సాతాను అబద్ధికుడని నిరూపించడానికి, నీ పేరును పవిత్రపర్చడానికి, నీ సర్వాధిపత్యాన్ని సమర్థించడానికి నేను చేయగలిగినదంతా చేశాను!” అని చెప్పగలుగుతాం.

“నా ప్రాణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను”

15. లూకా 23:46 ప్రకారం, యేసు ఏ నమ్మకంతో ఉన్నాడు?

15 యేసు ఏమన్నాడు? (లూకా 23:46 చదవండి.) పూర్తి నమ్మకంతో యేసు ఇలా అన్నాడు: “తండ్రీ, నా ప్రాణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను.” తన భవిష్యత్తు యెహోవా మీద ఆధారపడివుందని, తన తండ్రి తనను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాడని యేసుకు తెలుసు.

16. పదిహేను ఏళ్ల జాషువ అనుభవం నుంచి మీరేం నేర్చుకున్నారు?

16 యేసు మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు? మీ జీవితాన్ని యెహోవా చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉండండి. అలా చేయాలంటే, మీరు ‘నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచాలి.’ (సామె. 3:5) ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడిన 15 ఏళ్ల జాషువ అనుభవాన్ని పరిశీలించండి. దేవుని నియమానికి విరుద్ధంగా ఉన్న వైద్య చికిత్సల్ని తీసుకోవడానికి అతను ఒప్పుకోలేదు. చనిపోయే కాసేపటి ముందు, అతను వాళ్ల అమ్మతో ఇలా అన్నాడు: “అమ్మా, నేను యెహోవా చేతిలో ఉన్నాను. . . . ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను, యెహోవా నన్ను తప్పకుండా తిరిగి లేపుతాడు. నేనేంటో ఆయనకు తెలుసు, నేను ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నాను.” * మనలో ప్రతీ ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ప్రాణం పోయే పరిస్థితి వచ్చి, నా విశ్వాసం పరీక్షించబడితే, నా జీవితాన్ని యెహోవా చేతిలో పెట్టి ఆయన నన్ను గుర్తుచేసుకుంటాడని నేను నమ్ముతానా?’

17-18. మనం ఏ పాఠాలు నేర్చుకున్నాం? (“ యేసు చివరి మాటల నుండి నేర్చుకునే పాఠాలు” అనే బాక్సు కూడా చూడండి.)

17 యేసు చివరి మాటల నుండి మనం ఎన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నామో కదా! మనం ఇతరుల్ని క్షమించాలని, అలాగే యెహోవా మనల్ని క్షమిస్తాడనే నమ్మకంతో ఉండాలని ఆ మాటలు మనకు గుర్తుచేశాయి. సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే సహోదర సహోదరీల ఆధ్యాత్మిక కుటుంబం మనకు ఉన్నందుకు ఎంతో కృతజ్ఞులం. అయితే, అవసరమైనప్పుడు సహాయం అడగడానికి మనం అస్సలు వెనకాడకూడదు. మనకు వచ్చే ఎలాంటి సమస్యనైనా సహించడానికి యెహోవా సహాయం చేస్తాడని మనకు తెలుసు. మన యథార్థతను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి రోజు అన్నట్టుగా ప్రతీరోజూ జీవించడం ఎంత ప్రాముఖ్యమో మనం చూశాం. యెహోవా చేతిలో మన జీవితం సురక్షితంగా ఉంటుందని మనం నమ్మకంతో ఉండవచ్చు.

18 అవును, హింసాకొయ్య మీద చనిపోతున్నప్పుడు యేసు అన్న మాటలు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. మనం నేర్చుకున్న విషయాల్ని పాటిస్తే, తన కుమారుని గురించి యెహోవా స్వయంగా అన్న ఈ మాటలకు లోబడిన వాళ్లమౌతాం: “ఈయన మాట వినండి.”—మత్త. 17:5.

పాట 126 మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి

^ పేరా 5 మత్తయి 17:5 చెప్తున్నట్లు, మనం తన కుమారుని మాట వినాలని యెహోవా కోరుకుంటున్నాడు. హింసాకొయ్య మీద చనిపోతున్నప్పుడు యేసు చెప్పిన చివరి మాటల నుండి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. వాటి గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

^ పేరా 9 కీర్తన 22:1 లోని మాటల్ని బహుశా యేసు ఎందుకు అనివుంటాడో తెలుసుకోవడానికి, ఈ పత్రికలోని “పాఠకుల ప్రశ్న” చూడండి.

^ పేరా 16 జనవరి 22, 1995 తేజరిల్లు! (ఇంగ్లీషు) పత్రికలో వచ్చిన “జాషువాస్‌ ఫెయిత్‌—ఎ విక్టరీ ఫర్‌ చిల్డ్రన్స్‌ రైట్స్‌” అనే ఆర్టికల్‌ చూడండి.