కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 17

యెహోవా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు!

యెహోవా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు!

“యెహోవా తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడు.”—కీర్త. 149:4.

పాట 108 దేవుని విశ్వసనీయ ప్రేమ

ఈ ఆర్టికల్‌లో . . . *

మన పరలోక తండ్రి మనలో ప్రతీఒక్కర్ని బట్టి “సంతోషిస్తాడు” (1వ పేరా చూడండి)

1. యెహోవా తన ప్రజల్లో ఏం చూస్తాడు?

యెహోవా “తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడు.” (కీర్త. 149:4) ఆ మాట మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది! యెహోవా మన మంచి లక్షణాల్ని, సామర్థ్యాన్ని చూస్తాడు, మనల్ని తనవైపుకు ఆకర్షించుకుంటాడు. మనం తనకు నమ్మకంగా ఉంటే ఆయన ఎప్పుడూ మనకు దగ్గరగా ఉంటాడు!—యోహా. 6:44.

2. యెహోవా తమను ప్రేమిస్తున్నాడని నమ్మడం కొంతమందికి ఎందుకు కష్టంగా ఉంటుంది?

2 కొంతమంది ఇలా అనవచ్చు: ‘యెహోవా తన ప్రజల్ని ఒక గుంపుగా ప్రేమిస్తాడని నాకు తెలుసు, కానీ యెహోవా వ్యక్తిగతంగా నన్ను ప్రేమిస్తాడా?’ వాళ్లకు ఆ సందేహం ఎందుకు రావచ్చు? ఒక్సాన * అనే సహోదరి, చిన్నప్పుడు ఎన్నో బాధలు పడింది. ఆమె ఇలా అంటోంది: “బాప్తిస్మం తీసుకున్నప్పుడు, పయినీరు సేవ మొదలుపెట్టినప్పుడు నేనెంతో ఆనందంగా ఉన్నాను. కానీ 15 ఏళ్ల తర్వాత, చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. నేను యెహోవా అనుగ్రహం కోల్పోయానని, ఆయన ప్రేమ పొందే అర్హత నాకు లేదని అనుకోవడం మొదలుపెట్టాను.” చిన్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న రేచల్‌ అనే పయినీరు సహోదరి కూడా ఇలా అంటోంది: “యెహోవాను సంతోషపెట్టాలనే కోరికతో నేను ఆయనకు సమర్పించుకున్నాను. కానీ ఆయన ఎప్పటికీ నన్ను ప్రేమించడని నేను అనుకునేదాన్ని.”

3. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 పైన చెప్పిన ఇద్దరు సహోదరీల్లాగే మీరు యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో అనే సందేహం మీకు ఉండవచ్చు. ఆయనకు నిజంగా మీమీద శ్రద్ధ ఉందని మీరు నమ్మడం ఎందుకు ప్రాముఖ్యం? యెహోవా మిమ్మల్ని ప్రేమించట్లేదనే ఆలోచన నుండి బయటపడడానికి మీకు ఏది సహాయం చేస్తుంది? ఆ ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు చూద్దాం.

యెహోవా ప్రేమను సందేహించడం ప్రమాదకరం

4. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడో లేదో అని సందేహించడం ఎందుకు ప్రమాదకరం?

4 ప్రేమ చాలా శక్తివంతమైనది. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు అని నమ్మితే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిండు హృదయంతో ఆయన్ని సేవించాలని కోరుకుంటాం. కానీ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో లేదో అని సందేహిస్తే మన “శక్తి తగ్గిపోతుంది.” (సామె. 24:10) అంతేకాదు, మనం నిరుత్సాహపడి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మడం మానేస్తే, సాతాను దాడుల్ని ఎదిరించలేం.—ఎఫె. 6:16.

5. యెహోవా ప్రేమను సందేహిస్తే ఏం జరుగుతుందని కొందరి అనుభవాలు చూపిస్తున్నాయి?

5 మన కాలంలోని కొంతమంది నమ్మకమైన క్రైస్తవులు సందేహాల వల్ల ఆధ్యాత్మికంగా బలహీనపడ్డారు. జేమ్స్‌ అనే సంఘ పెద్ద ఇలా అంటున్నాడు: “నేను బెతెల్‌లో సేవ చేస్తున్నా, వేరే భాషా సంఘంతో కలిసి ప్రీచింగ్‌ని ఆనందిస్తున్నా, యెహోవా నా సేవను ఇష్టపడుతున్నాడా అనే సందేహం నాలో ఉండేది. చివరికి, యెహోవా నా ప్రార్థనను వింటున్నాడా అని కూడా సందేహించడం మొదలుపెట్టాను.” పూర్తికాల సేవలో ఉన్న ఈవా అనే సహోదరి కూడా ఇలా అంటోంది: “యెహోవా ప్రేమను సందేహించడం ప్రమాదకరమని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే, అది మనల్ని ఆయన సేవలో వెనక్కి లాగేస్తుంది. అంతేకాదు, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి, యెహోవా సేవలో ఆనందం కూడా తగ్గిపోతాయి.” పయినీరుగా, సంఘ పెద్దగా సేవ చేస్తున్న మైఖేల్‌ ఇలా అంటున్నాడు: “దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మకపోతే, మనం మెల్లమెల్లగా ఆయనకు దూరమౌతాం.”

6. దేవుడు మనల్ని ప్రేమించట్లేదనే ఆలోచన మన మనసులో మొదలైతే ఏం చేయాలి?

6 యెహోవా మనల్ని ప్రేమించట్లేదనే ఆలోచన మన విశ్వాసాన్ని ఎంతగా బలహీనపర్చగలదో ఆ అనుభవాలు చూపిస్తున్నాయి. మరి, మన మనసులో అలాంటి ఆలోచనలు మొదలైతే ఏం చేయాలి? మనం వాటిని వెంటనే తీసేసుకోవాలి! “కలవరపెడుతున్న ఆలోచనల్ని” తీసేసుకోవడానికి సహాయం చేయమని, ‘మీ హృదయానికి, మనసుకు కాపలా ఉండే దేవుని శాంతిని’ ఇవ్వమని యెహోవాను అడగండి. (కీర్త. 139:23; ఫిలి. 4:6, 7) మీరే కాదు నమ్మకమైన ఇతర సహోదర సహోదరీలు కూడా అలాంటి ఆలోచనలతో పోరాడుతున్నారని గుర్తుంచుకోండి. పూర్వం కూడా యెహోవా సేవకులు అలాంటి ఆలోచనలతో పోరాడాల్సి వచ్చింది. అపొస్తలుడైన పౌలు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

పౌలు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

7. పౌలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు?

7 ఎన్నో బాధ్యతల మధ్య నలిగిపోతూ, వాటన్నిటిని చేయలేకపోతున్నామని మీకెప్పుడైనా అనిపించిందా? అలాగైతే, మీరు పౌలు పరిస్థితిని అర్థం చేసుకోగలరు. కేవలం ఒక్క సంఘం గురించే కాదు, “సంఘాలన్నిటి గురించిన చింత” ఆయన్ని కలచివేసింది. (2 కొరిం. 11:23-28) అనారోగ్య సమస్యల వల్ల తరచూ మీ ఆనందాన్ని కోల్పోతున్నారా? ‘శరీరంలో ముల్లు,’ అంటే బహుశా అనారోగ్య సమస్య పౌలును చాలా బాధపెట్టింది, అది పోవాలని ఆయన ఎంతో కోరుకున్నాడు. (2 కొరిం. 12:7-10) మీరు మీ బలహీనతలతో పదేపదే పోరాడాల్సి వస్తుందా? కొన్నిసార్లు పౌలు కూడా అలా పోరాడాడు. సరైనది చేయడానికి పదేపదే పోరాడాల్సి వస్తున్నందుకు ఆయన, “నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి” అన్నాడు.—రోమా. 7:21-24.

8. తన సమస్యల్ని తట్టుకోవడానికి పౌలుకు ఏది సహాయం చేసింది?

8 ఆ సమస్యలన్నిటినీ సహించాల్సి వచ్చినా పౌలు యెహోవాను నమ్మకంగా సేవిస్తూనే ఉన్నాడు. మరి ఆయనకు ఏది సహాయం చేసింది? తన బలహీనతల గురించి ఆయనకు బాగా తెలుసు. అయినా పౌలు, విమోచన క్రయధనం మీద బలమైన విశ్వాసం ఉంచాడు. యేసు ఇచ్చిన ఈ మాట కూడా పౌలుకు తెలుసు: ‘ఆయన [యేసు] మీద విశ్వాసం ఉంచే ప్రతీఒక్కరు శాశ్వత జీవితం పొందుతారు.’ (యోహా. 3:16; రోమా. 6:23) అలా విశ్వాసం ఉంచిన వాళ్లలో పౌలు కూడా ఉన్నాడు. పశ్చాత్తాపం చూపిస్తే, ఘోరమైన పాపాలు చేసినవాళ్లను కూడా క్షమించడానికి యెహోవా సిద్ధంగా ఉంటాడని పౌలు నమ్మాడు.—కీర్త. 86:5.

9. గలతీయులు 2:20 లో ఉన్న పౌలు మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

9 అంతేకాదు దేవునికి తనమీద ఎంతో ప్రేమ ఉందని, అందుకే తన కోసం చనిపోయేలా యేసును పంపించాడని పౌలు నమ్మాడు. (గలతీయులు 2:20 చదవండి.) ఆ వచనం చివర్లో పౌలు అన్న ఈ ప్రోత్సాహకరమైన మాటల్ని పరిశీలించండి: “క్రీస్తు . . . నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అప్పగించుకున్నాడు.” పౌలు దేవుని ప్రేమకు హద్దులు పెట్టలేదు, అంటే ‘యెహోవా నా తోటి సహోదరుల్ని ప్రేమిస్తున్నాడు కానీ నన్ను ప్రేమిస్తున్నాడో లేదో’ అని అనుకోలేదు. బదులుగా, పౌలు రోమీయులకు ఇలా గుర్తుచేశాడు: “మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు.” (రోమా. 5:8) అవును, దేవుని ప్రేమకు ఎలాంటి హద్దులూ లేవు!

10. రోమీయులు 8:38, 39 నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

10 రోమీయులు 8:38, 39 చదవండి. దేవుని ప్రేమ ఎంత బలమైనదో పౌలుకు తెలుసు. ‘దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరుచేయలేదు’ అని ఆయన రాశాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా ఎంత ఓపిగ్గా ఉన్నాడో పౌలుకు తెలుసు. అంతేకాదు, తనమీద యెహోవా ఎంత కరుణ చూపించాడో ఆయనకు తెలుసు. ఇంకోమాటలో చెప్పాలంటే, పౌలు ఇలా అన్నాడు: ‘నా కోసం చనిపోవడానికి తన కుమారుణ్ణి పంపించాడు కాబట్టి, యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని నేను సందేహించకూడదు.’—రోమా. 8:32.

మనం గతంలో ఏ తప్పులు చేశాం అన్నది కాదుగానీ ఇప్పుడు, భవిష్యత్తులో ఏం చేస్తాం అన్నదే దేవునికి ముఖ్యం (11వ పేరా చూడండి) *

11. మొదటి తిమోతి 1:12-15 చెప్తున్నట్లు, గతంలో తప్పులు చేసినా దేవుడు తనను ప్రేమిస్తున్నాడని పౌలు ఎందుకు నమ్మాడు?

11 మొదటి తిమోతి 1:12-15 చదవండి. కొన్నిసార్లు పౌలు గతంలో చేసినవాటిని తలచుకుని బాధపడి ఉంటాడు. ఆయన, “నేనే పెద్ద పాపిని” అన్నాడు. అలా అనడంలో ఆశ్చర్యం లేదు! సత్యం తెలుసుకోక ముందు, పౌలు ఒక నగరం తర్వాత ఇంకో నగరంలో క్రైస్తవుల్ని హింసిస్తూ కొంతమందిని చెరసాలలో వేయించాడు, ఇంకొంతమందిని చంపడానికి మద్దతు తెలిపాడు. (అపొ. 26:10, 11) అలా తన మద్దతు వల్ల చంపబడిన క్రైస్తవుల పిల్లల్ని కలిసినప్పుడు పౌలుకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి! చేసిన తప్పులకు పౌలు బాధపడ్డాడు, కానీ జరిగిపోయిన దాన్ని మార్చలేనని ఆయనకు తెలుసు. క్రీస్తు తనకోసం చనిపోయాడని పౌలు నమ్మాడు. ఆయన ఇలా రాశాడు: “దేవుని అపారదయ వల్లే నేను అపొస్తలుణ్ణి అయ్యాను.” (1 కొరిం. 15:3, 10) దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? క్రీస్తు మీ కోసం చనిపోయాడని, మీరు యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉండేలా మార్గం తెరిచాడని నమ్మండి. (అపొ. 3:19) గతంలో అంటే మనం యెహోవాసాక్షి అవ్వడానికి ముందు లేదా అయిన తర్వాత ఏ తప్పులు చేశాం అన్నది కాదుగానీ ఇప్పుడు, భవిష్యత్తులో ఏం చేస్తాం అన్నదే దేవునికి ముఖ్యం.—యెష. 1:18.

12. మనం పనికిరాని వాళ్లమని, దేవుని ప్రేమ పొందే అర్హత లేదని అనిపించినప్పుడు 1 యోహాను 3:19, 20 లోని మాటలు ఎలా సహాయం చేస్తాయి?

12 యేసు మీ పాపాల కోసం చనిపోవడం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు ఇలా అనిపించవచ్చు: ‘ఈ గొప్ప బహుమతిని పొందే అర్హత నాకు లేదు.’ ఎందుకలా అనిపించవచ్చు? మనం పనికిరాని వాళ్లమని, దేవుని ప్రేమ పొందే అర్హత లేదని అనుకునేలా మన అపరిపూర్ణ హృదయం మోసం చేయవచ్చు. (1 యోహాను 3:19, 20 చదవండి.) కానీ అలా అనిపించినప్పుడు, “దేవుడు మన హృదయాల కన్నా గొప్పవాడని” గుర్తుంచుకోవాలి. యెహోవా మనల్ని ప్రేమించడు, క్షమించడు అని మన హృదయం చెప్పినా మన పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని మనం నమ్మకం కుదుర్చుకోవాలి. అందుకోసం, మనం ప్రతీరోజు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, తరచూ ప్రార్థించాలి, నమ్మకమైన దేవుని సేవకులతో క్రమంగా సహవసించాలి. ఈ మూడు పనులు చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

బైబిలు అధ్యయనం, ప్రార్థన, నమ్మకమైన స్నేహితుల సహవాసం సహాయం చేస్తాయి

13. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మనకు ఎలా సహాయం చేస్తుంది? (“ దేవుని వాక్యం వాళ్లకు ఎలా సహాయం చేసింది?” అనే బాక్సు కూడా చూడండి.)

13 దేవుని వాక్యాన్ని ప్రతీరోజు అధ్యయనం చేయండి, అప్పుడు యెహోవాకున్న ఎన్నో అద్భుతమైన లక్షణాల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు, ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తిస్తారు. ప్రతీరోజు బైబిలు చదివి ధ్యానిస్తే మీ మనసులోని, హృదయంలోని ఆలోచనల్ని ‘సరిదిద్దుకుని’ మరింత స్పష్టంగా ఆలోచించగలుగుతారు. (2 తిమో. 3:16) తాను ఎందుకూ పనికిరానివాణ్ణి అనే భావాలతో నలిగిపోయిన కెవిన్‌ అనే సంఘ పెద్ద ఇలా అంటున్నాడు: “103 వ కీర్తన చదివి ధ్యానించాక నా ఆలోచనల్ని సరిదిద్దుకున్నాను, యెహోవా నా గురించి నిజంగా ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకోగలిగాను.” పై పేరాల్లో చూసిన ఈవా ఇలా అంటోంది: “ప్రతీరోజు రాత్రి నేను ప్రశాంతంగా కూర్చుని యెహోవా ఆలోచనల్ని ధ్యానిస్తాను. అది నాకు మనశ్శాంతిని ఇస్తుంది, నా విశ్వాసాన్ని బలపరుస్తుంది.”

14. ప్రార్థన మనకు ఎలా సహాయం చేస్తుంది?

14 తరచూ ప్రార్థించండి. (1 థెస్స. 5:17) మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే వాళ్లతో తరచూ మాట్లాడతారు, మీ మనసులో ఉన్నదంతా వాళ్లకు చెప్తారు. యెహోవాతో ఉన్న స్నేహం విషయంలో కూడా అంతే. ప్రార్థనలో మన భావాల్ని, ఆలోచనల్ని, ఆందోళనల్ని చెప్పినప్పుడు ఆయన మీద మనకు విశ్వాసం ఉందని, దేవుని ప్రేమను నమ్ముతున్నామని చూపిస్తాం. (కీర్త. 94:17-19; 1 యోహా. 5:14, 15) పై పేరాల్లో చెప్పిన రేచల్‌ ఇలా అంటోంది: “నా ప్రార్థనలో కేవలం రోజంతా జరిగిన వాటి గురించే చెప్పే బదులు, నాకు నిజంగా ఏమనిపిస్తుందో నా మనసువిప్పి యెహోవాకు చెప్తాను. మెల్లమెల్లగా, నేను యెహోవాను ఒక పెద్ద కంపెనీకి మేనేజర్‌లా కాకుండా తన పిల్లల్ని నిజంగా ప్రేమించే ఒక తండ్రిలా చూడగలిగాను.”—“ మీరు దాన్ని చదివారా?” అనే బాక్సు చూడండి.

15. యెహోవా మనలో ప్రతీఒక్కరి మీద ఎలా శ్రద్ధ చూపిస్తున్నాడు?

15 నమ్మకమైన స్నేహితులతో సహవసించండి; వాళ్లు యెహోవా ఇచ్చిన వరం. (యాకో. 1:17) ‘ఎల్లప్పుడూ ప్రేమించే’ సహోదర సహోదరీల్ని ఇవ్వడం ద్వారా మన పరలోక తండ్రి మనలో ప్రతీఒక్కరి మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. (సామె. 17:17) పౌలు కొలొస్సయులకు రాసిన ఉత్తరంలో తనకు సహాయం చేసిన కొంతమంది క్రైస్తవుల గురించి చెప్తూ, “వీళ్లు నాకు ఎంతో ఊరటను ఇచ్చారు” అన్నాడు. (కొలొ. 4:10, 11) యేసుక్రీస్తుకు కూడా స్నేహితుల సహాయం అవసరమైంది. వాళ్ల సహాయాన్ని అంటే దేవదూతల, మనుషుల సహాయాన్ని ఆయన విలువైనదిగా ఎంచాడు.—లూకా 22:28, 43.

16. యెహోవాకు దగ్గరయ్యేలా నమ్మకమైన స్నేహితులు మనకు ఎలా సహాయం చేయవచ్చు?

16 యెహోవా ఇచ్చిన వరం నుండి, అంటే నమ్మకమైన స్నేహితుల నుండి మీరు పూర్తి ప్రయోజనం పొందుతున్నారా? మన ఆందోళనల్ని పరిణతిగల స్నేహితులతో పంచుకోవడం ఒక బలహీనత కాదు; నిజానికి అది మనల్ని కాపాడగలదు. పై పేరాల్లో చెప్పిన జేమ్స్‌ ఇలా అంటున్నాడు: “పరిణతిగల క్రైస్తవులతో స్నేహం చేయడం నాకు ఎంతో సహాయం చేసింది. సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ప్రియమైన ఆ స్నేహితులు నేను చెప్పేది ఓపిగ్గా వినేవాళ్లు, నన్ను ప్రేమిస్తున్నారని భరోసా ఇచ్చేవాళ్లు. వాళ్ల ద్వారా యెహోవాకు నా మీద ప్రేమ, శ్రద్ధ ఉన్నాయని అర్థం చేసుకోగలిగాను.” మనం మన సహోదర సహోదరీలకు దగ్గరి స్నేహితులమవ్వడం ఎంత ప్రాముఖ్యమో కదా!

యెహోవా ప్రేమలో నిలిచి ఉండండి

17-18. మనం ఎవరి మాట వినాలి, ఎందుకు?

17 సరైనది చేయాలనే పోరాటాన్ని మనం ఆపేయాలని సాతాను కోరుకుంటున్నాడు. యెహోవా మనల్ని ప్రేమించట్లేదని, ఆయన ఇచ్చే రక్షణను పొందే అర్హత మనకు లేదని మనం అనుకోవాలన్నది సాతాను కోరిక. కానీ ఇప్పటివరకు చర్చించుకున్నట్టుగా, అవేవీ నిజాలు కావు.

18 యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకు మీరు చాలా విలువైనవాళ్లు. మీరు యెహోవాకు లోబడితే, యేసులాగే ఆయన ప్రేమలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. (యోహా. 15:10) కాబట్టి సాతాను మాటల్ని గానీ, నిందించే మీ హృదయం మాటల్ని గానీ వినకండి. బదులుగా, మనందరిలో మంచిని చూసే యెహోవా మాట వినండి. ‘యెహోవా తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడని,’ అందులో మీరూ ఉన్నారని నమ్మకంతో ఉండండి!

పాట 141 జీవం ఒక అద్భుతం

^ పేరా 5 యెహోవా తమను ప్రేమిస్తున్నాడని నమ్మడం కొంతమంది సహోదర సహోదరీలకు కష్టంగా ఉంటుంది. యెహోవా మనలో ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడో లేదో అనే సందేహాలు ఏమైనా ఉంటే, వాటిని ఎలా తీసేసుకోవచ్చో కూడా తెలుసుకుంటాం.

^ పేరా 2 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 67 చిత్రాల వివరణ: గతంలో పౌలు ఎంతోమంది క్రైస్తవుల్ని చెరసాలలో వేయించాడు. కానీ, యేసు తనకోసం చేసినదాన్ని అంగీకరించాక ఆయన మారి, క్రైస్తవ సహోదరుల్ని ప్రోత్సహించాడు. అందులో ఆయన ఒకప్పుడు హింసించినవాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఉండి ఉంటారు.