కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 20

మీ పరిచర్య పట్ల సానుకూలంగా ఉండండి

మీ పరిచర్య పట్ల సానుకూలంగా ఉండండి

“విత్తనాలు విత్తు, . . . నీ చేతికి విశ్రాంతినివ్వకు.”—ప్రసం. 11:6.

పాట 70 అర్హుల్ని వెదకండి

ఈ ఆర్టికల్‌లో . . . *

యేసు ఆకాశానికి ఎత్తబడిన తర్వాత, ఆయన శిష్యులు యెరూషలేములో అలాగే ఇతర ప్రాంతాల్లో ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు (1వ పేరా చూడండి)

1. యేసు తన అనుచరులకు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచాడు? దానికి వాళ్లు ఎలా స్పందించారు? (ముఖచిత్రం చూడండి.)

యేసుక్రీస్తు ఈ భూమ్మీద ఉన్నప్పుడు, ప్రజలు తన సందేశాన్ని వింటారని ఆశిస్తూ ప్రకటిస్తూనే ఉన్నాడు. తన శిష్యులు కూడా అలాగే చేయాలని ఆయన కోరుకున్నాడు. (యోహా. 4:35, 36) యేసు తన శిష్యులతో ఉన్నంతకాలం, వాళ్లు ఉత్సాహంగా ప్రకటనా పనిని చేశారు. (లూకా 10:1, 5-11, 17) యేసు బంధించబడి, చంపబడిన తర్వాత శిష్యులకు కొంతకాలం ప్రకటనా పని మీద ఆసక్తి తగ్గింది. (యోహా. 16:32) యేసు పునరుత్థానం అయ్యాక, తన శిష్యుల్ని పరిచర్య మీద మనసుపెట్టమని ప్రోత్సహించాడు. ఆయన పరలోకానికి ఎత్తబడిన తర్వాత, ఆయన శిష్యులు ఎంత ఉత్సాహంగా ప్రకటించారంటే వాళ్ల శత్రువులు, “మీరు మీ బోధతో యెరూషలేమును నింపేశారు” అని అన్నారు.—అపొ. 5:28.

2. మొదటి శతాబ్దంలో ప్రకటనా పనిని యెహోవా ఎలా ఆశీర్వదించాడు?

2 మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల ప్రకటనా పనిని యేసు నిర్దేశించాడు. అలాగే వాళ్ల సందేశాన్ని విని ఎక్కువమంది శిష్యులు అయ్యేలా యెహోవా దీవించాడు. ఉదాహరణకు, క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున దాదాపు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. (అపొ. 2:41) ఆ తర్వాత శిష్యుల సంఖ్య అంతకంతకూ పెరిగింది. (అపొ. 6:7) అయితే, చివరి రోజుల్లో మంచివార్తను ఇంకా ఎక్కువమందే అంగీకరిస్తారని యేసు ముందే చెప్పాడు.—యోహా. 14:12; అపొ. 1:8.

3-4. కొంతమందికి ప్రకటన పని చేయడం ఎందుకు కష్టంగా ఉండొచ్చు? ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 మనందరం పరిచర్య పట్ల సానుకూలంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. కొన్ని ప్రాంతాల్లో అలా ఉండడం అంత కష్టమేమీ కాదు. ఎందుకు? ఆ ప్రాంతాల్లో చాలామంది బైబిలు అధ్యయనాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు, ఎంతగా అంటే వాళ్లందరికీ బైబిలు అధ్యయనాలు చేయడానికి ప్రచారకులకు సమయం సరిపోదు. అయితే ఇంకొన్ని చోట్ల ప్రచారకులకు ప్రకటించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే, ప్రజలు ఎక్కువమంది ఇళ్ల దగ్గర ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా బైబిలు మీద అంత ఆసక్తి చూపించట్లేదు.

4 ప్రకటనా పని చేయడం కష్టంగా ఉండే ప్రాంతాల్లో మీరు జీవిస్తుంటే ఈ ఆర్టికల్‌లో ఉన్న సలహాలు మీకు సహాయపడవచ్చు. పరిచర్యలో ఎక్కువమంది ప్రజల్ని కలవడానికి కొంతమంది ఏం చేస్తున్నారో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మనం చెప్పే సందేశాన్ని ప్రజలు విన్నా, వినకపోయినా మనం ఎందుకు పరిచర్య పట్ల సానుకూలంగా ఉండవచ్చో కూడా చూస్తాం.

ప్రజల్ని కలవడం కష్టంగా ఉన్నా సానుకూలంగా ఉండండి

5. చాలామంది ప్రచారకులు పరిచర్యలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు?

5 ఎక్కువమంది ప్రచారకులకు ప్రజల్ని ఇళ్ల దగ్గర కలవడం కష్టమైపోతుంది. ఎందుకంటే, కొంతమంది ప్రచారకులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఎక్కువ సెక్యూరిటీ ఉండే అపార్ట్‌మెంట్లు చాలా ఉన్నాయి. అలాంటి అపార్ట్‌మెంట్ల దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డులు అక్కడ ఉండేవాళ్ల అనుమతి లేకుండా బయట వ్యక్తుల్ని లోపలికి రానివ్వరు. వేరే ప్రాంతాల్లో ప్రచారకులు ఏ ఆటంకం లేకుండా ఇంటింటికి వెళ్లగల్గుతున్నారు. కానీ కొద్దిమందిని మాత్రమే ఇళ్ల దగ్గర కలవగల్గుతున్నారు. ఇంకొంతమందైతే, కొద్దిమందే జీవించే గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాల్లో ప్రకటిస్తున్నారు. ఆ ప్రాంతంలో కేవలం ఒక్క వ్యక్తిని కలవడానికే ప్రచారకులు బహుశా చాలా సమయం ప్రయాణించి వెళ్లినా ఇంట్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. మనం ప్రకటిస్తున్న ప్రాంతంలో కూడా ఇలాంటి సవాళ్లు ఎదురైతే మానకుండా పరిచర్య చేద్దాం. ఆ సవాళ్లను అధిగమించి ఎక్కువమందికి ప్రకటించడానికి మనం ఏం చేయవచ్చు?

6. ప్రచారకుల పనికి, జాలర్ల పనికి ఎలాంటి పోలిక ఉంది?

6 యేసు ప్రకటన పనిని చేపలు పట్టే పనితో పోల్చాడు. (మార్కు 1:17) కొంతమంది జాలర్లు రోజులు తరబడి ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరక్కపోవచ్చు. అయినా వాళ్లు ఆ పనిని ఆపరు. బదులుగా, చేపలు పట్టే విధానాన్ని మార్చుకుంటారు. వాళ్లు చేపలు పట్టే సమయాన్ని, ప్రదేశాన్ని లేదా పద్ధతిని మార్చుకుంటారు. మనం కూడా పరిచర్య విషయంలో అలాంటి మార్పులే చేసుకోవచ్చు. దానికి ఉపయోగపడే కొన్ని సలహాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

ఎక్కువమంది ఇళ్ల దగ్గర దొరకని ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు చోట్ల, వేర్వేరు పద్ధతుల్లో ప్రకటించడానికి ప్రయత్నించండి (7-10 పేరాలు చూడండి) *

7. వేర్వేరు సమయాల్లో మనం ప్రకటిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి?

7 ప్రజల్ని వేర్వేరు సమయాల్లో కలవడానికి ప్రయత్నించండి. ప్రజలు ఇళ్ల దగ్గర ఉండే సమయాల్లో ప్రకటించడానికి వెళ్తే ఎక్కువమందిని కలవగలం. ఎంతకాదన్నా ప్రజలు చివరికి ఇంటికే వస్తారు కదా! చాలామంది సహోదరసహోదరీలు మధ్యాహ్నాలు లేదా సాయంత్రాలు పరిచర్య చేస్తున్నారు. ఎందుకంటే, ఆ సమయాల్లో చాలామంది ఇళ్ల దగ్గర ఉంటున్నారు. దానికితోడు వాళ్లు తీరికగా ఉండి వినడానికి ఎక్కువ ఇష్టపడొచ్చు. డేవిడ్‌ అనే సంఘపెద్ద ఇచ్చిన సలహాను పాటించడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆయనా, ఆయనతోపాటు ఉన్న సహోదరుడు పరిచర్యకు వెళ్లినప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేకపోతే ఆ ఇంటిని వదిలేసి, ఇంకొంచెంసేపు పరిచర్య చేశాక తిరిగి ఆ ఇంటికి వెళ్లేవాళ్లమని చెప్పాడు. ఆయనిలా అంటున్నాడు, “మేం తిరిగి వెళ్లినప్పుడు చాలామంది ఇంటి వ్యక్తులు ఇళ్లలో ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను.” *

ఎక్కువమంది ఇళ్ల దగ్గర దొరకని ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు వేర్వేరు సమయాల్లో ప్రకటించడానికి ప్రయత్నించండి  (7-8 పేరాలు చూడండి)

8. ప్రసంగి 11:6 లోని విషయాన్ని మన పరిచర్యకు ఎలా అన్వయించవచ్చు?

8 ప్రజలను ఇళ్ల దగ్గర కలవడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ ఆర్టికల్‌ ముఖ్యవచనం, మనం ఎలాంటి ఆలోచనా విధానాన్ని కలిగి ఉండాలో గుర్తుచేస్తుంది. (ప్రసంగి 11:6 చదవండి.) పై పేరాలో చూసిన డేవిడ్‌ పట్టువిడువలేదు. ఆయన ఒక ఇంటికి ఎన్నోసార్లు వెళ్లిన తర్వాత చివరికి ఆ ఇంటి వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి బైబిలు విషయాల్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపించి ఇలా అన్నాడు, “నేను ఈ ఇంట్లో దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి ఉంటున్నా, ఒక్క యెహోవాసాక్షిని కూడా కలవలేకపోయాను.” డేవిడ్‌ ఇలా అంటున్నాడు, “మనం చివరికి ప్రజల్ని వాళ్ల ఇళ్ల దగ్గర కలిసినప్పుడు, వాళ్లు తరచూ మన సందేశాన్ని వినడానికి ఇష్టపడతారని నేను తెలుసుకున్నాను.”

ఎక్కువమంది ఇళ్ల దగ్గర దొరకని ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు వేర్వేరు చోట్ల ప్రకటించడానికి ప్రయత్నించండి (9వ పేరా చూడండి)

9. ఇళ్ల దగ్గర దొరకని ప్రజలను కలవడానికి కొంతమంది ప్రచారకులు ఏం చేశారు?

9 వేర్వేరు చోట్ల ప్రకటించడానికి ప్రయత్నించండి. ఇళ్ల దగ్గర దొరకని ప్రజలను కలవడానికి కొంతమంది ప్రచారకులు వేరే చోట్ల ప్రకటించారు. ఉదాహరణకు పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లలో ఉండే ప్రజలకు మనం వెళ్లి సాక్ష్యం ఇచ్చే అవకాశం లేనప్పుడు, వాళ్లను కలవడానికి వీధి సాక్ష్యం, కార్టు విట్నెసింగ్‌ బాగా ఉపయోగపడుతున్నాయని రుజువైంది. ఈ విధంగా అలాంటి ప్రజలను కలిసి మాట్లాడడం వీలౌతుంది. అంతేకాదు ప్రజలు పార్కుల్లో, మార్కెట్లలో, వ్యాపార స్థలాల్లో ఎక్కువ మాట్లాడడానికి అలాగే ప్రచురణలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని చాలామంది ప్రచారకులు గుర్తించారు. బొలీవియాలో ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేస్తున్న ఫ్లోరాన్‌ ఇలా అంటున్నాడు, “మేము మార్కెట్లకు, వ్యాపార స్థలాలకు మధ్యాహ్నం 1 నుండి 3 గంటలు మధ్యలో వెళ్తాం. ఆ సమయంలో వ్యాపారస్థులు కాస్త తీరికగా ఉంటారు. దానివల్ల వాళ్లతో సంభాషించగల్గుతున్నాం, బైబిలు అధ్యయనాలు కూడా మొదలుపెట్టగల్గుతున్నాం.”

ఎక్కువమంది ఇళ్ల దగ్గర దొరకని ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు వేర్వేరు పద్ధతుల్లో ప్రకటించడానికి ప్రయత్నించండి (10వ పేరా చూడండి)

10. మీరు ప్రజల్ని కలవడానికి ఏయే పద్ధతుల్ని ఉపయోగించవచ్చు?

10 వేర్వేరు పద్ధతుల్లో ప్రకటించడానికి ప్రయత్నించండి. మీరు పరిచర్యలో ఒక వ్యక్తిని చాలాసార్లు కలవడానికి ప్రయత్నించారు అనుకోండి. వేర్వేరు సమయాల్లో అతని ఇంటికి వెళ్లినా మీరు అతన్ని కలవలేకపోయారు. ఆ వ్యక్తిని కలవడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? కాటారీనా ఇలా చెప్తుంది, “ఇళ్ల దగ్గర అస్సలు కలవలేని వ్యక్తులకు నేను ఉత్తరాలు రాస్తాను. వాళ్లను నేరుగా కలిస్తే నేను ఏం మాట్లాడతానో దాన్నే వాటిలో రాస్తాను.” ఆమె అనుభవం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మీరు పరిచర్య చేస్తుండగా మీ క్షేత్రంలోని ప్రతీ ఒక్కరిని కలవడానికి వేర్వేరు పద్ధతుల్ని ప్రయత్నించండి.

ప్రజలు ఆసక్తి చూపించకపోయినా సానుకూలంగా ఉండండి

11. మనం చెప్పే సందేశం పట్ల కొంతమంది ఎందుకు ఆసక్తి చూపించట్లేదు?

11 మనం చెప్పే సందేశం పట్ల కొంతమంది ఆసక్తి చూపించరు. వాళ్లు దేవుని గురించి, బైబిలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటారు. లోకంలో ఎన్నో బాధలు ఉండడం చూసి వాళ్లు దేవుణ్ణి నమ్మరు. బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఎన్నో తప్పుడు పనులు చేస్తున్న మతనాయకుల్ని చూసి, ప్రజలు బైబిలు మీద ఆసక్తి చూపించరు. మరికొంతమంది వాళ్ల ఉద్యోగాలు, కుటుంబాలు, వ్యక్తిగత సమస్యల గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ బైబిలు వాళ్లకు ఎలా సహాయం చేయగలదో గ్రహించలేకపోతున్నారు. మనం ప్రకటించే సందేశాన్ని ప్రజలు ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోయినా పరిచర్యలో మన సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

12. ఫిలిప్పీయులు 2:4 లోని మాటల్ని పాటించడం పరిచర్యలో మనకు ఎలా సహాయం చేయగలదు?

12 ఇతరుల మీద మీకు శ్రద్ధ ఉందని చూపించండి. మనం చెప్పే సందేశం పట్ల మొదట్లో ఆసక్తి చూపించని చాలామంది వాళ్ల మీద శ్రద్ధ చూపిస్తున్నామని గ్రహించినప్పుడు, దాన్ని విన్నారు. (ఫిలిప్పీయులు 2:4 చదవండి.) ఉదాహరణకు, పైన ప్రస్తావించిన డేవిడ్‌ ఇలా అంటున్నాడు, “ఎవరైనా ఆసక్తి లేదని అంటే మేం వెంటనే బైబిళ్లను, ప్రచురణలను మా బ్యాగుల్లో పెట్టేసి, ‘మీరు ఎందుకలా అనుకుంటున్నారో కాస్త చెప్తారా’ అని అడుగుతాను.” మనం చూపించే శ్రద్ధను ప్రజలు గ్రహించగలరు. మనం మాట్లాడిన విషయాల్ని వాళ్లు మర్చిపోవచ్చు గానీ, మనం చూపించిన శ్రద్ధను మాత్రం వాళ్లు గుర్తుపెట్టుకుంటారు. మంచివార్త చెప్పడానికి ఇంటి వ్యక్తులు మనల్ని అనుమతించకపోయినా మన ప్రవర్తన ద్వారా, ముఖకవళికల ద్వారా వాళ్ల మీద శ్రద్ధ ఉందని చూపించవచ్చు.

13. ఇంటి వ్యక్తి అవసరాలకు తగ్గట్టు మన సందేశాన్ని మార్చుకోవడానికి మనం ఏం చేయవచ్చు?

13 ఇంటి వ్యక్తి అవసరాలకు, ఆసక్తికి తగ్గట్టు మన సందేశాన్ని మార్చుకుంటే వాళ్ల మీద మనం వ్యక్తిగత శ్రద్ధ చూపించవచ్చు. ఉదాహరణకు, ఇంటి వ్యక్తికి పిల్లలున్నారని తెలిపే విషయాలేమైనా ఆ ఇంట్లో ఉండడం చూశారా? అలాగైతే పిల్లల్ని పెంచడం గురించి, సంతోషకరమైన కుటుంబ జీవితం గురించి బైబిలు ఇచ్చే సలహాల్ని తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపించవచ్చు. ఏదైనా ఇంటికి సీసీటీవీ కెమెరాలు ఉండడం చూశారా? అలాగైతే, ప్రపంచంలో జరుగుతున్న నేరాల గురించి, దానివల్ల ప్రజలు ఎలా భయపడుతున్నారనే దాని గురించి మాట్లాడవచ్చు. ఆ తర్వాత, ఇంటి వ్యక్తి నేరాలన్నీ అంతమౌతాయని తెలుసుకోవడానికి సంతోషిస్తాడు. ఏదేమైనా ఇంటి వ్యక్తులు ఆసక్తి చూపిస్తే, బైబిలు సలహాలు వాళ్లకెలా ఉపయోగపడతాయో అర్థమయ్యేలా చెప్పండి. పైన ప్రస్తావించబడిన కాటారీనా ఇలా అంటుంది, “నా జీవితాన్ని మెరుగుపర్చుకోవడానికి బైబిలు సత్యాలు ఎంతగా సహాయపడ్డాయో నేను గుర్తుచేసుకుంటాను.” దానివల్ల కాటారీనా పరిచర్యలో నమ్మకంతో మాట్లాడగల్గుతుంది. దాన్ని ఇంటి వ్యక్తులు కూడా గమనించగల్గుతున్నారు.

14. సామెతలు 27:17 ప్రకారం, ప్రకటిస్తున్నప్పుడు ప్రచారకులు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవచ్చు?

14 పరిచర్యలో ఇతరుల సహాయాన్ని తీసుకోండి. పౌలు తిమోతికి ఎలా ప్రకటించాలో, ఎలా బోధించాలో నేర్పించాడు. ఇతరులకు కూడా అదేవిధంగా నేర్పించమని ఆయన్ని ప్రోత్సహించాడు. (1 కొరిం. 4:17) మనం తిమోతిలాగే సంఘంలోని సహోదరసహోదరీల నుండి నేర్చుకోవచ్చు. (సామెతలు 27:17 చదవండి.) షాన్‌ అనే సహోదరుని ఉదాహరణ పరిశీలించండి. ఆయన కొంతకాలం ఒక పల్లె ప్రాంతంలో పయినీరు సేవ చేశాడు. అక్కడున్న చాలామంది తమ మతంతో సంతృప్తి కలిగి ఉన్నవాళ్లే. మరి ఆయన తన ఆనందాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఆయన ఇలా చెప్తున్నాడు, “వీలైనప్పుడల్లా ఒక సహోదరునితో పరిచర్య చేసేవాడిని. ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వెళ్లే మధ్యలో మేము మా బోధనా నైపుణ్యాల్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చో మాట్లాడుకునేవాళ్లం. ఉదాహరణకు, అంతకుముందు ఇంట్లో మేము ఏం మాట్లాడామో చర్చించుకొని, అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురైతే ఇంకా బాగా ఎలా మాట్లాడవచ్చో ఆలోచించుకునేవాళ్లం.”

15. పరిచర్యకు వెళ్లే ముందు ప్రార్థన చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

15 సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. మీరు పరిచర్య చేసే ప్రతీసారి యెహోవాను సహాయం చేయమని అడగండి. పవిత్రశక్తి సహాయం లేనిదే మనలో ఎవ్వరం పరిచర్యలో విజయం సాధించలేం. (కీర్తన 127:1; లూకా 11:13) యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు ఏ విషయంలో సహాయం కావాలో దాని గురించి ముఖ్యంగా అడగండి. ఉదాహరణకు, ఆయన గురించి నేర్చుకోవడానికి ఇష్టపడి, వినడానికి సిద్ధంగా ఉండేవాళ్లను కనుగొనేలా సహాయం చేయమని అడగండి. ఆ తర్వాత, మీ ప్రార్థనలకు అనుగుణంగా మీరు కలిసే ప్రతీ ఒక్కరికీ ప్రకటించండి.

16. పరిచర్యను మరింత బాగా చేయడానికి వ్యక్తిగత అధ్యయనం ఎందుకు అవసరం?

16 వ్యక్తిగత అధ్యయనం చేయడానికి సమయం తీసుకోండి. ‘మీరు మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోండి’ అని దేవుని వాక్యం చెప్తుంది. (రోమా. 12:2) మనం వ్యక్తిగత అధ్యయనం చేసినప్పుడు దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం. దానివల్ల పరిచర్యలో మరింత నమ్మకంతో మాట్లాడగల్గుతాం. కాటారీనా ఇలా చెప్తుంది, “కొంతకాలం క్రితం కొన్ని ప్రాథమిక బైబిలు బోధల విషయంలో నా విశ్వాసాన్ని మరింత బలపర్చుకోవాలని నాకర్థమైంది. కాబట్టి సృష్టికర్త ఉన్నాడని, బైబిలు నిజంగా దేవుని వాక్యమని, దేవునికి ప్రాతినిధ్యం వహించే సంస్థ నేడు ఒకటుందని తెలిపే రుజువుల్ని నేను జాగ్రత్తగా పరిశీలించాను.” వ్యక్తిగత అధ్యయనం చేయడం వల్ల తన విశ్వాసం మరింత బలపడిందని, పరిచర్యలో ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నానని కూడా కాటారీనా చెప్తుంది.

మనం పరిచర్య పట్ల ఎందుకు సానుకూలంగా ఉండాలి?

17. పరిచర్య పట్ల యేసు ఎందుకు సానుకూలంగా ఉన్నాడు?

17 యేసు చెప్పిన సందేశాన్ని కొంతమంది వినకపోయినా ఆయన సానుకూలంగా ఉంటూ పరిచర్య కొనసాగించాడు. ఎందుకు? ఎందుకంటే, ప్రజలు సత్యం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయనకు తెలుసు. దానితోపాటు వీలైనంత ఎక్కువమంది రాజ్య సందేశాన్ని అంగీకరించేలా సహాయం చేయాలని ఆయన కోరుకున్నాడు. అంతేకాదు మొదట్లో ఆసక్తి చూపించని కొందరు ఆ తర్వాత వింటారని కూడా ఆయనకు తెలుసు. తన సొంత కుటుంబంలోనే ఏం జరిగిందో ఒకసారి గుర్తుచేసుకోండి. యేసు పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాల్లో తన తోబుట్టువులు ఎవ్వరూ శిష్యులు అవ్వలేదు. (యోహా. 7:5) కానీ ఆయన పునరుత్థానం అయ్యాక వాళ్లు క్రైస్తవులుగా మారారు.—అపొ. 1:14.

18. మనం ఎందుకు ప్రకటిస్తూనే ఉండాలి?

18 మనం బోధించే బైబిలు సత్యాల్ని ఎవరు అంగీకరిస్తారో మనకు తెలీదు. కొంతమందికి సత్యం నేర్చుకోవడానికి ఇతరులకన్నా ఎక్కువ సమయం పడుతుంది. మనం చెప్పే సందేశాన్ని వినడానికి ఇష్టపడనివాళ్లు కూడా మన మంచి ప్రవర్తనను, సానుకూల వైఖరిని చూసి దేవున్ని ‘మహిమపర్చడం’ మొదలుపెట్టొచ్చు.—1 పేతు. 2:12.

19. మొదటి కొరింథీయులు 3:6, 7 మనకు ఏం గుర్తుచేస్తుంది?

19 మనం ప్రకటించినా, బోధించినా వృద్ధి కలుగజేసేది దేవుడే అని గుర్తుంచుకోవాలి. (1 కొరింథీయులు 3:6, 7 చదవండి.) ఇతియోపియాలో సేవ చేస్తున్న గెటాహన్‌ ఇలా చెప్తున్నాడు, “నేను ఉంటున్న ప్రాంతంలో 20 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా నేనొక్కడినే యెహోవాసాక్షిని, కానీ ఇప్పుడిక్కడ 14 మంది ప్రచారకులు ఉన్నారు. వాళ్లలో నా భార్య, మా ముగ్గురు పిల్లలతోసహా 13 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఇక్కడ కూటాలకు సగటున 32 మంది హాజరవుతున్నారు.” యథార్థ హృదయంగల వాళ్లను యెహోవా తన సంస్థలోకి ఆకర్షించేంత వరకు ఓపిగ్గా ఎదురుచూస్తూ పరిచర్యను కొనసాగించినందుకు గెటాహన్‌ సంతోషిస్తున్నాడు.—యోహా. 6:44.

20. మనం ఎలా రక్షక సిబ్బందిలా ఉన్నాం?

20 యెహోవా మనుషులందరి ప్రాణాల్ని విలువైనవిగా చూస్తున్నాడు. ఈ వ్యవస్థ అంతమయ్యే లోపు అన్నిదేశాల ప్రజల్ని సమకూర్చడంలో తన కుమారుడితో పాటు పనిచేసే గొప్ప అవకాశాన్ని ఆయన మనకు ఇచ్చాడు. (హగ్గ. 2:7) మన ప్రకటనా పనిని ప్రాణాలు కాపాడే పనితో పోల్చవచ్చు. గనిలో చిక్కుకున్న వాళ్లను కాపాడడానికి వెళ్లే రక్షక సిబ్బందిలా మనం ఉన్నాం. ఆ సిబ్బంది సహాయంతో కొంతమందే ప్రాణాలతో బయటపడినా, ఆ సిబ్బందిలోని వాళ్లందరూ చేసే పని ఎంతో ప్రాముఖ్యమైనది. మన పరిచర్య కూడా అలాంటిదే. ఈ సాతాను లోకంలో ఇంకా ఎంతమంది రక్షించబడతారో మనకు తెలీదు. అయితే వాళ్లకు సహాయం చేయడానికి యెహోవా మనలో ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. బొలీవియాలో నివసిస్తున్న ఆంధ్రీయాస్‌ ఇలా అంటున్నాడు, “ఎంతోమంది కృషి వల్లే ఒక వ్యక్తి సత్యం తెలుసుకొని, బాప్తిస్మం తీసుకుంటాడని నాకు తెలుసు.” పరిచర్య పట్ల అలాంటి సానుకూల వైఖరినే మనం కలిగివుందాం. అలా చేస్తే యెహోవా ఆశీర్వాదాన్ని పొందుతాం, అంతేకాదు పరిచర్య ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతాం.

పాట 66 మంచివార్త చాటండి

^ పేరా 5 చాలామంది ప్రజలు ఇళ్ల దగ్గర లేకపోయినా, మనం చెప్పే సందేశాన్ని వినకపోయినా పరిచర్యలో కొనసాగుతూ మన ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు? దానికి ఉపయోగపడే సలహాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 7 ఈ ఆర్టికల్‌లో చర్చించినట్లు ప్రచారకులు వేర్వేరు పద్ధతుల్లో, స్థానిక డేటా చట్టాలకు అనుగుణంగా పరిచర్య చేయాలి.

^ పేరా 60 చిత్రాల వివరణ: (పైనుండి కిందికి): ప్రజలు ఇంటిదగ్గర దొరకడం కష్టంగా ఉండే ప్రాంతంలో ఒక జంట ప్రకటిస్తున్నారు. మొదటి ఇంట్లోని వ్యక్తి ఉద్యోగానికి వెళ్లాడు. రెండో ఇంట్లోని స్త్రీ హాస్పిటల్‌కి వెళ్లింది. మూడో ఇంట్లోని స్త్రీ షాపింగ్‌కి వెళ్లింది. అయితే ఆ జంట అదే రోజు వేరే సమయంలో వెళ్లినప్పుడు మొదటి ఇంట్లోని వ్యక్తిని కలిశారు. హాస్పిటల్‌ దగ్గర వీధి సాక్ష్యం చేస్తున్నప్పుడు రెండో ఇంట్లోని స్త్రీని కలిశారు. ఫోన్‌ ద్వారా సాక్ష్యమిస్తున్నప్పుడు మూడో ఇంట్లోని స్త్రీతో మాట్లాడారు.