కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

బైబిలు కాలాల్లో పడవల్ని నిర్మించడానికి పపైరస్‌ను ఉపయోగించేవాళ్లా?

పపైరస్‌ చెట్టు

ప్రాచీన ఐగుప్తులో ఎక్కువగా పపైరస్‌ నుండి తయారుచేయబడిన పేపరు మీద రాసేవాళ్లని అందరికీ తెలుసు. గ్రీసు దేశస్థులు అలాగే రోమన్లు కూడా ఆ పేపరు మీద రాసేవాళ్లు. * అయితే పడవల్ని నిర్మించడానికి కూడా పపైరస్‌ను ఉపయోగించేవాళ్లని ఎక్కువమందికి తెలీదు.

ఒక ఐగుప్తీయుడి సమాధిలో కనుగొన్న రెండు పపైరస్‌ పడవల నమూనాలు

ఇతియోపియా నదుల ప్రాంతంలోని ప్రజలు వాళ్ల ప్రతినిధుల్ని ‘సముద్రం మీద, నీళ్ల మీద జమ్ము పడవల్లో పంపారు’ అని 2,500 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త రాశాడు. ఆ తర్వాత ప్రవక్త అయిన యిర్మీయా, మాదీయ పారసీకులు బబులోను నగరాన్ని చుట్టుముట్టినప్పుడు, బబులోనీయులు తప్పించుకోకుండా వాళ్ల ‘జమ్ము పడవల్ని అగ్నితో’ కాల్చేస్తారని ప్రవచించాడు.—యెష. 18:1, 2; యిర్మీ. 51:32.

బైబిలు కాలాల్లో పడవల్ని నిర్మించడానికి పపైరస్‌ను వాడేవాళ్లని రుజువు చేసే దేన్నైనా, పురాతన వస్తువుల్ని పరిశోధించేవాళ్లు కనుగొన్నప్పుడు, బైబిలు విద్యార్థులు ఆశ్చర్యపోరు. ఎందుకంటే బైబిల్ని దేవుడే ప్రేరేపించాడు. (2 తిమో. 3:16) ఇంతకీ ఆ పరిశోధకులు ఏం కనుగొన్నారు? ఐగుప్తులో పపైరస్‌తో పడవల్ని ఎలా నిర్మించేవాళ్లో పూర్తి ఆధారాల్ని వాళ్లు కనుగొన్నారు.

పపైరస్‌తో పడవల్ని ఎలా నిర్మించేవాళ్లు?

ఐగుప్తు సమాధుల్లో ఉన్న పెయింటింగ్‌లు, గోడల మీద చెక్కిన చిత్రాలు ప్రజలు పపైరస్‌ను సమకూర్చి, పడవల్ని ఎలా తయారుచేసేవాళ్లో వివరిస్తాయి. వాళ్లు పపైరస్‌ కొమ్మల్ని కోసి చిన్న, చిన్న కట్టలుగా కట్టేవాళ్లు. తిరిగి ఈ కట్టలన్నిటినీ పెద్ద కట్టగా కట్టేవాళ్లు. పపైరస్‌ కొమ్మలు త్రికోణాకారంలో (Triangle) ఉంటాయి. దానివల్ల వాటిని గట్టిగా కట్టినప్పుడు దృఢంగా ఉంటాయి. పపైరస్‌తో తయారుచేసిన పడవలు 55 అడుగుల (లేదా 17 మీటర్ల) కన్నా ఎక్కువ పొడవు ఉండవచ్చని, ఒక్కోవైపు 10 నుండి 12 తెడ్లతో నడపవచ్చని ఎ కంపానియన్‌ టు ఏన్షియంట్‌ ఈజిప్టు చెప్తుంది.

పపైరస్‌తో పడవల్ని ఎలా తయారుచేసేవాళ్లో చూపించే ఐగుప్తీయుల గోడ మీదున్న చిత్రాలు

పపైరస్‌తో పడవల్ని ఎందుకు నిర్మించేవాళ్లు?

నైలు నది ప్రవహించే ప్రాంతంలో పపైరస్‌ చెట్లు ఎక్కువగా పెరిగేవి. దానికి తోడు పపైరస్‌తో పడవల్ని నిర్మించడం చాలా తేలిక. ప్రజలు పెద్ద పడవల్ని చెక్కతో నిర్మించినా, జాలర్లు వేటగాళ్లు పపైరస్‌తో చేసిన తెప్పల్ని, చిన్న పడవల్ని ఉపయోగించేవాళ్లు.

ప్రజలు చాలాకాలం వరకు పపైరస్‌తో చేసిన పడవల్ని ఉపయోగించారు. అపొస్తలుల కాలంలో జీవించిన గ్రీకు రచయిత ప్లూటార్క్‌ ఆ కాలంలో కూడా ప్రజలు పపైరస్‌తో చేసిన పడవల్ని వాడేవాళ్లని చెప్పాడు.

^ పేరా 3 పపైరస్‌ లేదా జమ్ము, చిత్తడి నేలలో అలాగే అంతగా ప్రవాహం లేని నదుల్లో పెరుగుతుంది. పపైరస్‌ చెట్టు 16 అడుగులు లేదా 5 మీటర్లు ఎత్తు పెరగగలదు. ఆ చెట్టు మొదళ్లో దాని కాండం మధ్యకొలత 6 అంగుళాలు లేదా 15 సెంటీమీటర్లు ఉండవచ్చు.