కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 22

మీ బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి

మీ బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి

“మీలో ప్రతీ ఒక్కరు . . . బాప్తిస్మం తీసుకోండి.”—అపొ. 2:38.

పాట 72 రాజ్య సత్యాన్ని వెల్లడి చేద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యేసు శిష్యులు, వేర్వేరు దేశాల నుండి వచ్చిన ప్రజల్ని ఏం చేయమని చెప్పారు?

వేర్వేరు దేశాలకు, భాషలకు చెందిన స్త్రీపురుషులు పెద్ద సంఖ్యలో యెరూషలేముకు వచ్చారు. ఆ రోజు గుర్తుండిపోయే ఒక సంఘటన జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది యూదులు, వేర్వేరు దేశాల నుండి యెరూషలేముకు వచ్చిన ప్రజల భాషల్లో మాట్లాడారు. అలా తమ భాషల్లో మాట్లాడడం ఆ ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. అయితే యూదులు, ఆ తర్వాత పేతురు మాట్లాడిన విషయాలు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించాయి. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతామని ఆ ప్రజలు అర్థం చేసుకున్నారు. అది వాళ్లను ఎంతో కదిలించింది. ఎంతగా అంటే వాళ్లు ఇలా అడిగారు, “ఇప్పుడు మేము ఏంచేయాలి?” దానికి పేతురు, ‘మీలో ప్రతీ ఒక్కరు బాప్తిస్మం తీసుకోండి’ అని చెప్పాడు.—అపొ. 2:37, 38.

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకం నుండి ఒక సహోదరుడు తన భార్యతో కలిసి ఒక యువకుడికి స్టడీ చేస్తున్నాడు. (2వ పేరా చూడండి)

2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం? (ముఖచిత్రం చూడండి.)

2 ఆ తర్వాత ఊహించని విధంగా దాదాపు 3,000 మంది అదే రోజు బాప్తిస్మం తీసుకొని క్రీస్తు శిష్యులు అయ్యారు. యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించిన శిష్యుల్ని చేసే గొప్ప పని ఆ రోజే ప్రారంభమైంది. ఆ పని ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. నేడు మనం కేవలం కొన్ని గంటలు మాట్లాడి ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకునేలా చేయలేము. ఒక బైబిలు విద్యార్థి ఆ లక్ష్యం చేరుకోవాలంటే బహుశా కొన్ని నెలలు, ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. ఒక వ్యక్తి క్రీస్తు శిష్యుడు అయ్యేలా సహాయం చేయాలంటే ఎంతో కృషి అవసరం. మీరు ఇప్పటికే ఎవరికైనా బైబిలు స్టడీ ఇస్తుంటే అది మీకు తెలిసే ఉంటుంది. మీ బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకొని క్రీస్తు శిష్యుడు అయ్యేలా మీరు ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

నేర్చుకుంటున్న విషయాల్ని పాటించేలా మీ బైబిలు విద్యార్థికి సహాయం చేయండి

3. మత్తయి 28:19, 20 ప్రకారం, బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించాలంటే విద్యార్థి ఏం చేయాలి?

3 బాప్తిస్మం తీసుకోవడానికి ముందు విద్యార్థి బైబిలు నుండి నేర్చుకున్న విషయాల్ని పాటించాలి. (మత్తయి 28:19, 20 చదవండి.) విద్యార్థి అలా పాటించినప్పుడు, యేసు చెప్పిన ఉదాహరణలోని బండ మీద ఇల్లు కట్టడానికి లోతుగా తవ్విన ‘బుద్ధిగల వ్యక్తిలా’ ఉంటాడు. (మత్త. 7:24, 25; లూకా 6:47, 48) విద్యార్థి నేర్చుకున్నవాటిని పాటించేలా మనం ఎలా సహాయం చేయవచ్చో మూడు సలహాల్ని చూద్దాం.

4. విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా కృషి చేస్తూ ఉండడానికి మనం ఏం చేయవచ్చు? (“ లక్ష్యాల్ని పెట్టుకుని వాటిని చేరుకునేలా మీ విద్యార్థికి సహాయం చేయండి” అనే బాక్సు కూడా చూడండి.)

4 లక్ష్యాలు పెట్టుకునేలా మీ విద్యార్థికి సహాయం చేయండి. అలా ఎందుకు సహాయం చేయాలి? ఈ ఉదాహరణ పరిశీలించండి. ఒకవేళ మీరు, కారులో చాలా దూరం ప్రయాణిస్తుంటే మధ్యమధ్యలో అందమైన ప్రదేశాల దగ్గర ఆగాలనుకుంటారు. అప్పుడు అంత దూరం ప్రయాణం చేయడం మీకు కష్టంగా అనిపించదు. అదేవిధంగా, ఒక బైబిలు విద్యార్థి చిన్నచిన్న లక్ష్యాల్ని పెట్టుకొని వాటిని చేరుకుంటే బాప్తిస్మం అనే పెద్ద లక్ష్యాన్ని కూడా చేరుకోగలడని గ్రహిస్తాడు. విద్యార్థి ప్రగతి సాధించేలా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో ఉన్న “ఇలా చేసి చూడండి” అనే బాక్సును ఉపయోగించండి. ప్రతీ పాఠం చివర్లో, ఆ బాక్సులో ఉన్న లక్ష్యం విద్యార్థి అప్పుడే నేర్చుకున్న విషయాన్ని పాటించడానికి ఎలా సహాయం చేస్తుందో చర్చించండి. ఒకవేళ మీ విద్యార్థి కోసం మీ మనసులో వేరే లక్ష్యం ఏదైనా ఉంటే, “ఇంకా” అనే దాని కిందున్న ఖాళీలో రాయండి. పాఠంలోని ఈ భాగాన్ని ఉపయోగించి మీ విద్యార్థి తక్కువ సమయంలో చేరుకోగల లక్ష్యాల గురించి, ఎక్కువ సమయం పట్టే లక్ష్యాల గురించి గుర్తుచేస్తూ ఉండండి.

5. మార్కు 10:17-22 ప్రకారం, యేసు ఒక డబ్బున్న వ్యక్తిని ఏం చేయమన్నాడు? ఎందుకు?

5 తన జీవితంలో మార్పులు చేసుకునేలా మీ విద్యార్థికి సహాయం చేయండి. (మార్కు 10:17-22 చదవండి.) ఒక డబ్బున్న వ్యక్తికి తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసుకోవడం కష్టమని యేసుకు తెలుసు. (మార్కు 10:23) అయినా, యేసు ఆ డబ్బున్న వ్యక్తితో తన జీవితంలో పెద్ద మార్పు చేసుకోమని చెప్పాడు. ఆయనకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంది కాబట్టే అలా చెప్పాడు. కొన్నిసార్లు తాను నేర్చుకుంటున్న వాటిని పాటించమని విద్యార్థిని మనం ప్రోత్సహించకపోవచ్చు. ఎందుకంటే ఆ మార్పు చేసుకోవడానికి అతను సిద్ధంగా లేడని మనకు అనిపించవచ్చు. ప్రజలు తమ జీవితాల్లో మార్పులు చేసుకుని కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవడానికి సమయం పట్టొచ్చు. (కొలొ. 3:9, 10) అయితే మీ విద్యార్థి మార్పు చేసుకోవాల్సిన విషయం గురించి ఎంత త్వరగా అతనితో మాట్లాడితే, అంత త్వరగా ఆ మార్పు చేసుకోవడం మొదలుపెడతాడు. అలా మాట్లాడడం వల్ల అతని మీద మీకు శ్రద్ధ ఉందని చూపిస్తారు.—కీర్త. 141:5; సామె. 27:17.

6. విద్యార్థి అభిప్రాయం తెలుసుకునేలా ప్రశ్నలు ఎందుకు వేయాలి?

6 ఒక విషయం గురించి విద్యార్థి అభిప్రాయం తెలుసుకునేలా ప్రశ్నలు వేయడం చాలా ప్రాముఖ్యం. అలాంటి ప్రశ్నలు అడగడం వల్ల మీ విద్యార్థి ఏం అర్థం చేసుకున్నాడో, ఏం నమ్ముతున్నాడో మీకు తెలుస్తుంది. అలా తరచూ ప్రశ్నలు అడగడం వల్ల, ముందుముందు విద్యార్థి అంగీకరించడానికి కష్టంగా ఉండే అంశాలను మాట్లాడడం మీకు తేలిక అవుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో అభిప్రాయాన్ని రాబట్టే ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు 4వ పాఠంలో, “మీరు యెహోవా పేరును ఉపయోగించినప్పుడు ఆయనకు ఎలా అనిపిస్తుంది?” అలాగే 9వ పాఠంలో, “మీరు ఏయే విషయాల గురించి ప్రార్థించాలని అనుకుంటున్నారు?” అనే ప్రశ్నలు ఉన్నాయి. మొదట్లో వాటికి జవాబు చెప్పడానికి విద్యార్థికి సమయం పట్టొచ్చు. ఆ పుస్తకంలోని లేఖనాల గురించి అలాగే చిత్రాల గురించి ఆలోచించేలా మీ విద్యార్థికి నేర్పించవచ్చు.

7. నిజ జీవిత అనుభవాలను ఉపయోగించి విద్యార్థులకు ఏం నేర్పించవచ్చు?

7 తాను ఏం చేయాలో విద్యార్థి అర్థంచేసుకున్న తర్వాత అతన్ని ప్రోత్సహించడానికి నిజ జీవిత అనుభవాల్ని ఉపయోగించండి. ఉదాహరణకు మీ విద్యార్థి కూటాలకు క్రమంగా రాలేకపోతుంటే, 14వ పాఠంలో “ఇవి కూడా చూడండి” సెక్షన్‌ కిందున్న యెహోవా నా మీద శ్రద్ధ చూపించాడు అనే వీడియోని అతనికి చూపించవచ్చు. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని చాలా పాఠాల్లో, “ఎక్కువ తెలుసుకోండి” లేదా “ఇవి కూడా చూడండి” సెక్షన్లలో అలాంటి అనుభవాల్ని చూస్తారు. * మీ విద్యార్థితో, “అతను చేయగలిగాడంటే నువ్వూ చేయగలవు” అని అంటూ ఇతరులతో పోల్చకుండా జాగ్రత్తపడండి. విద్యార్థినే ఆ ముగింపుకి రానివ్వండి. అలాగే, ఆ వీడియోలోని వ్యక్తులకు బైబిలు బోధలు పాటించడానికి ఏ విషయాలు సహాయం చేశాయో మీ విద్యార్థులకు చెప్పండి. బహుశా ఒక ముఖ్యమైన లేఖనాన్ని గానీ, పాటించదగ్గ ఒక విషయాన్ని గానీ చెప్పవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా వీడియోలోని వ్యక్తులకు యెహోవా ఎలా సహాయం చేశాడో నొక్కిచెప్పండి.

8. యెహోవాను ప్రేమించేలా మీ విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చు?

8 యెహోవాను ప్రేమించేలా మీ విద్యార్థికి సహాయం చేయండి. ఎలా? యెహోవా లక్షణాల గురించి మీ విద్యార్థికి ఎక్కువ నేర్పించే అవకాశాల కోసం చూడండి. యెహోవా సంతోషంగల దేవుడని, తనను ప్రేమించేవాళ్లకు ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడని మీ విద్యార్థి అర్థంచేసుకునేలా సహాయం చేయండి. (1 తిమో. 1:11; హెబ్రీ. 11:6) మీ విద్యార్థి నేర్చుకున్నవాటిని పాటించడం వల్ల ప్రయోజనం పొందుతాడని, అలా యెహోవా అతని మీద ప్రేమ చూపిస్తున్నాడని చెప్పండి. (యెష. 48:17, 18) మీ విద్యార్థికి యెహోవా మీద ప్రేమ పెరిగే కొద్దీ వీలైనంత త్వరగా మార్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు.—1 యోహా. 5:3.

మీ విద్యార్థిని తోటి సహోదరసహోదరీలకు పరిచయం చేయండి

9. మార్కు 10:29, 30 ప్రకారం, ఒక వ్యక్తి యేసు శిష్యుడు అయ్యేలా త్యాగాలు చేయడానికి ఏది సహాయం చేస్తుంది?

9 ఒక బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించాలంటే త్యాగాలు చేయాల్సివస్తుంది. పై పేరాల్లో ప్రస్తావించిన డబ్బున్న వ్యక్తిలా కొందరు విద్యార్థులు వస్తుపరమైన త్యాగాలు చేయాల్సిరావచ్చు. వాళ్లు చేసే ఉద్యోగం బైబిలు సూత్రాలకు అనుగుణంగా లేకపోతే వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సి రావచ్చు. చాలామంది యెహోవాను ప్రేమించని స్నేహితుల్ని వదులుకోవాల్సి రావచ్చు. యెహోవాసాక్షులు అయినందుకు ఇంకొంతమందిని వాళ్ల కుటుంబ సభ్యులు దూరం పెట్టొచ్చు. అలాంటి త్యాగాలు చేయడం కొంతమందికి కష్టమని యేసు చెప్పాడు. అయితే తనను అనుసరించేవాళ్లు ఎప్పుడూ నిరుత్సాహపడరని ఆయన మాటిచ్చాడు. ఎందుకంటే, యెహోవా వాళ్లకు ఒక ప్రేమగల ఆధ్యాత్మిక కుటుంబాన్ని బహుమతిగా ఇస్తాడు. (మార్కు 10:29, 30 చదవండి.) ఈ బహుమతి నుండి ప్రయోజనం పొందేలా మీ బైబిలు విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చు?

10. మాన్వేల్‌ అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

10 మీ విద్యార్థితో స్నేహాన్ని పెంచుకోండి. మీ విద్యార్థి పట్ల మీకు శ్రద్ధ ఉందని చూపించడం ప్రాముఖ్యం. ఎందుకు? మాన్వేల్‌ అనే సహోదరుడు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి. అతను బైబిలు విద్యార్థిగా ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అన్నాడు, “నాకు స్టడీ ఇచ్చే వ్యక్తి, ప్రతీసారి స్టడీ చేసే ముందు నేను ఎలా ఉన్నానో అడిగేవాడు. నేను ప్రశాంతంగా ఆయనతో ఏ విషయాన్నైనా చెప్పుకునేలా నాకు సహాయం చేశాడు. దానివల్ల, ఆయనకు నామీద నిజంగా శ్రద్ధ ఉందని అనిపించింది.”

11. విద్యార్థులు మనతో సమయం గడిపినప్పుడు ఎలా ప్రయోజనం పొందుతారు?

11 యేసు తన శిష్యులతో సమయం గడిపినట్టే మీరూ మీ విద్యార్థులతో సమయం గడపండి. (యోహా. 3:22) మీ బైబిలు విద్యార్థి మార్పులు చేసుకుని ప్రగతి సాధిస్తున్నట్లయితే వాళ్లను కాఫీ తాగడానికి గానీ, భోజనం చేయడానికి గానీ లేదా నెలవారీ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్యక్రమాన్ని చూడడానికి గానీ మీ ఇంటికి పిలవవచ్చు. సత్యంలోలేని మీ విద్యార్థి స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులు పండుగల్ని ఆచరిస్తుంటే అతనికి ఒంటరిగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో మీ ఇంటికి ఆహ్వానిస్తే అతను ఎక్కువ సంతోషించవచ్చు. ఉగాండాలో ఉంటున్న కాజీబ్వే ఇలా అంటున్నాడు, “నేను స్టడీ తీసుకున్నప్పుడే కాదు, నాకు స్టడీ ఇచ్చిన వ్యక్తితో సమయం గడిపినప్పుడు కూడా యెహోవా గురించి ఎక్కువ తెలుసుకున్నాను. యెహోవా తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తాడో దానివల్ల వాళ్లు ఎంత సంతోషంగా ఉంటారో నేను చూశాను. నా జీవితంలో కూడా అదే కావాలని కోరుకున్నాను.”

మీ స్టడీకి వేర్వేరు ప్రచారకుల్ని తీసుకెళ్లినప్పుడు మీ విద్యార్థి కూటాలకు రావడం తేలికౌతుంది (12 పేరా చూడండి) *

12. బైబిలు స్టడీకి వేర్వేరు ప్రచారకుల్ని మనమెందుకు తీసుకెళ్లాలి?

12 స్టడీకి వేర్వేరు ప్రచారకులను తీసుకెళ్లండి. కొన్నిసార్లు మీ స్టడీకి మీరొక్కరే వెళ్లడం లేదా ఎప్పుడూ తీసుకెళ్లే ప్రచారకుల్నే తీసుకువెళ్లడం మీకు తేలిగ్గా అనిపించవచ్చు. అలా చేయడం మీకు తేలికే అయినా అప్పుడప్పుడు వేర్వేరు ప్రచారకుల్ని తీసుకెళ్లడం ద్వారా మన బైబిలు విద్యార్థి ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. మాల్డోవాలో ఉంటున్న డెమీట్రీ ఇలా చెప్పాడు, “నా స్టడీకి వచ్చిన ప్రతి ప్రచారకుడు విషయాన్ని కొత్త కోణంలో వివరించేవాడు. దానివల్ల నేర్చుకుంటున్న విషయాల్ని ఇంకా ఏయే విధాలుగా పాటించవచ్చో తెలుసుకోగలిగాను. చాలామంది సహోదరసహోదరీలతో ముందే పరిచయం ఉండడం వల్ల నేను మొదటిసారి మీటింగ్‌కి వెళ్లినప్పుడు అంత కంగారుపడలేదు.”

13. విద్యార్థి కూటాలకు హాజరయ్యేలా మనమెందుకు సహాయం చేయాలి?

13 సంఘ కూటాలకు హాజరయ్యేలా మీ విద్యార్థులకు సహాయం చేయండి. ఎందుకు? ఎందుకంటే తన ఆరాధకులు సమకూడాలని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. అలా చేయడం మన ఆరాధనలో భాగం. (హెబ్రీ. 10:24, 25) కూటాలకు వెళ్లడం వల్ల సంఘంలోని సహోదరసహోదరీలు మన ఆధ్యాత్మిక కుటుంబం అవుతారు. వాళ్లతో కలిసి కూటాల్లో ఉండడం, ఇంట్లో అందరూ కలిసి రుచికరమైన భోజనం తింటున్నట్టు ఉంటుంది. మీ బైబిలు విద్యార్థి సంఘ కూటాలకు హాజరయ్యేలా మీరు సహాయం చేస్తుంటే, వాళ్లు బాప్తిస్మం తీసుకోవడానికి ముఖ్యమైన అడుగు వేసేలా మీరు సహాయం చేసినట్టే. కానీ కూటాలకు రావడం మొదట్లో అతనికి కష్టంగా అనిపించవచ్చు. మీ విద్యార్థి, కూటాలకు రాకుండా అడ్డుపడే ఏ సమస్యనైనా అధిగమించడానికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం ఎలా సహాయం చేస్తుంది?

14. కూటాలకు హాజరయ్యేలా విద్యార్థిని ఎలా ప్రోత్సహించవచ్చు?

14 మీ విద్యార్థిని ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 10వ పాఠాన్ని ఉపయోగించండి. ఈ పుస్తకాన్ని విడుదల చేయడానికి ముందు, కొంతమంది ప్రచారకులను తమ విద్యార్థులతో ఈ పాఠాన్ని చర్చించమన్నారు. అలా చర్చించినప్పుడు కూటాలకు హాజరయ్యేలా విద్యార్థులకు సహాయం చేయడానికి ఆ పాఠం బాగా ఉపయోగపడిందని వాళ్లు అన్నారు. అయితే మీ విద్యార్థిని కూటాలకు ఆహ్వానించడానికి 10వ పాఠం వరకు ఆగకండి. కూటాలకు వీలైనంత త్వరగా ఆహ్వానించండి, అలా రమ్మని పిలుస్తూనే ఉండండి. ఒక్కో విద్యార్థి ఒక్కో రకమైన సమస్యను ఎదుర్కొంటాడు. కాబట్టి మీ విద్యార్థికి ఏ విషయంలో సహాయం అవసరమో గుర్తించి కావలసిన సహాయం చేయడానికి ప్రయత్నించండి. కూటాలకు రావడానికి మీ విద్యార్థికి సమయం పడుతుంటే నిరుత్సాహపడకండి. ఓపిక చూపించండి, ఆహ్వానించడం మానకండి.

తన భయాలను అధిగమించడానికి మీ విద్యార్థికి సహాయం చేయండి

15. మన విద్యార్థికి ఏ భయాలు ఉండవచ్చు?

15 మీరొక యెహోవాసాక్షి అవ్వడానికి కాస్త భయపడడం మీకు గుర్తుందా? బహుశా ఇంటింటి పరిచర్య ఎప్పటికీ చేయలేనేమో అని మీరు అనుకొని ఉండవచ్చు. లేదా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మిమ్మల్ని వ్యతిరేకిస్తారని మీరు భయపడి ఉండవచ్చు. అలాగైతే మీ బైబిలు విద్యార్థికి ఎలా అనిపిస్తుందో మీరు అర్థంచేసుకోవచ్చు. అలాంటి భయాలు కొంతమందికి ఉండొచ్చని యేసు చెప్పాడు. అయినా యెహోవాను సేవించడానికి అలాంటి భయాలు అడ్డుపడకుండా చూసుకోమని తన అనుచరులకు చెప్పాడు. (మత్త. 10:16, 17, 27, 28) తన అనుచరులు వాళ్లకున్న భయాల్ని అధిగమించడానికి యేసు ఎలా సహాయం చేశాడు? ఆయన్ని మనం ఎలా అనుకరించవచ్చు?

16. తన నమ్మకాల్ని ఇతరులతో పంచుకునేలా మీ విద్యార్థికి ఎలా నేర్పించవచ్చు?

16 తన నమ్మకాల్ని ఇతరులతో పంచుకునేలా మీ విద్యార్థికి క్రమక్రమంగా నేర్పించండి. యేసు తన శిష్యులను పరిచర్యకు పంపించినప్పుడు వాళ్లకు భయంగా అనిపించి ఉంటుంది. అయితే వాళ్లు ఎవరికి ప్రకటించాలో, ఏం ప్రకటించాలో చెప్పడం ద్వారా యేసు వాళ్లకు సహాయం చేశాడు. (మత్త. 10:5-7) మీరు ఆయన్ని ఎలా అనుకరించవచ్చు? మీ విద్యార్థి కూడా ఎవరికి ప్రకటించాలో ఆలోచించేలా సహాయం చేయండి. ఉదాహరణకు, ఏదైనా బైబిలు సత్యం తెలుసుకోవడం వల్ల ప్రయోజనం పొందేవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని అతన్ని అడగండి. వాళ్లతో ఆ సత్యాన్ని సులువుగా చెప్పేలా మీ విద్యార్థి సిద్ధపడడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని “కొంతమంది ఇలా అంటారు” అనే బాక్సు కింద ఉన్న విషయాన్ని వీలైనప్పుడల్లా ఉపయోగించి మీ విద్యార్థులతో ప్రాక్టీసు చేయండి. అలా చేస్తున్నప్పుడు బైబిల్ని ఉపయోగించి సులువైన, తెలివైన జవాబు ఎలా చెప్పాలో మీ విద్యార్థికి నేర్పించండి.

17. మత్తయి 10:19, 20, 29-31 వచనాలను ఉపయోగించి, మన విద్యార్థి యెహోవా మీద నమ్మకం ఉంచేలా ఎలా సహాయం చేయవచ్చు?

17 యెహోవా మీద నమ్మకం ఉంచేలా మీ విద్యార్థికి సహాయం చేయండి. తన శిష్యులను యెహోవా ప్రేమిస్తున్నాడని, ఆయన వాళ్లకు సహాయం చేస్తాడని యేసు చెప్పాడు. (మత్తయి 10:19, 20, 29-31 చదవండి.) యెహోవా తనకు కూడా సహాయం చేస్తాడని మీ విద్యార్థికి గుర్తుచేయండి. మీ విద్యార్థి యెహోవా మీద ఆధారపడేలా సహాయం చేయడానికి, అతనితో కలిసి అతని లక్ష్యాల గురించి ప్రార్థించండి. పోలండ్‌లో నివసిస్తున్న ఫ్రాన్చీసెక్‌ ఇలా అంటున్నాడు, “నాకు స్టడీ ఇచ్చిన వ్యక్తి నేను పెట్టుకున్న లక్ష్యాల గురించి తరచూ ప్రార్థనలో చెప్పేవాడు. ఆ ప్రార్థనలకు యెహోవా జవాబు ఇవ్వడం చూసినప్పుడు నేనూ ప్రార్థించడం మొదలుపెట్టాను. కొత్త ఉద్యోగంలో చేరాక కూటాలకు అలాగే సమావేశానికి హాజరవడానికి అనుమతి అడగాల్సి వచ్చినప్పుడు నేను యెహోవా సహాయాన్ని చూశాను.”

18. బోధకులుగా మనం చేసే పని గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడు?

18 మన బైబిలు విద్యార్థుల పట్ల యెహోవాకు చాలా శ్రద్ధ ఉంది. ప్రజలను ఆయనకు దగ్గర చేయడానికి ప్రచారకులు ఎంత కష్టపడుతున్నారో యెహోవాకు తెలుసు. అందుకే ఆయన వాళ్లను ప్రేమిస్తున్నాడు. (యెష. 52:7) మీకు ప్రస్తుతం ఒక్క బైబిలు అధ్యయనం కూడా లేకపోతే వేరే ప్రచారకుల బైబిలు అధ్యయనాలకు వెళ్తూ, ఆ విద్యార్థులు ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా మీరు కూడా సహాయం చేయవచ్చు.

పాట 60 జీవాన్నిచ్చే సందేశం

^ పేరా 5 ప్రజలు తన శిష్యులు అయ్యేలా యేసు ఎలా సహాయం చేశాడో, ఆయనను మనం ఎలా అనుకరించవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే కొత్త పుస్తకానికి సంబంధించిన కొన్ని విషయాల్ని కూడా ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. మన బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించడానికి ఈ పుస్తకం తయారు చేయబడింది.

^ పేరా 7 మీరు నిజ జీవిత అనుభవాలను: (1) యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో, “బైబిలు” అనే అంశంలోని “ఆచరణాత్మక విలువ” కిందున్న “‘బైబిలు జీవితాలను మారుస్తుంది’ (కావలికోట ఆర్టికల్స్‌)” లేదా (2) JW లైబ్రరీ మీడియాలోని “ఇంటర్వ్యూలు, అనుభవాలు” అనే సెక్షన్‌లో కూడా చూడొచ్చు.

^ పేరా 62 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు తన భార్యతో కలిసి ఒక యువకుడికి స్టడీ చేస్తున్నాడు. తర్వాత వేర్వేరు సహోదరులను తన స్టడీకి తీసుకెళ్లాడు.