కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 24

మీరు సాతాను ఉచ్చుల నుండి తప్పించుకోవచ్చు!

మీరు సాతాను ఉచ్చుల నుండి తప్పించుకోవచ్చు!

“అపవాది . . . ఉచ్చులో నుండి తప్పించుకోవచ్చు.”—2 తిమో. 2:26.

పాట 36 మన హృదయాల్ని కాపాడుకుందాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. సాతాన్ని ఒక వేటగాడితో ఎందుకు పోల్చవచ్చు?

ఒక వేటగాడి లక్ష్యం జంతువుని పట్టుకోవడం లేదా దాన్ని చంపడం. దానికోసం అతను రకరకాల ఉచ్చుల్ని ఉపయోగించవచ్చని బైబిల్లో కూడా చెప్పబడింది. (యోబు 18:8-10) జంతువు తన ఉచ్చులో పడేలా ఒక వేటగాడు ఏం చేయవచ్చు? అతను ఆ జంతువుని బాగా గమనిస్తాడు, అది ఎక్కడికి వెళ్తుంది, దానికి ఏం ఇష్టం, ఎలాంటి ఎర వేస్తే ఉచ్చులో పడుతుంది అని ఆలోచిస్తాడు. సాతాను అలాంటి వేటగాడిలా ఉన్నాడు. అతను మన గురించి బాగా తెలుసుకుంటాడు, మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనకేది ఇష్టమో గమనిస్తాడు. ఆ తర్వాత ఉచ్చు వేస్తాడు, తెలీకుండా మనం దానిలో పడాలని అతను ఎదురుచూస్తాడు. ఒకవేళ మనం అతని ఉచ్చులో పడినా, దాన్నుండి తప్పించుకోవచ్చని బైబిలు హామీ ఇస్తుంది. అంతేకాదు అలాంటి ఉచ్చులో పడకుండా ఎలా ఉండవచ్చో కూడా బైబిలు నేర్పిస్తుంది.

గర్వం, అత్యాశ అనే ఉచ్చుల్ని ఉపయోగించడంలో సాతాను విజయం సాధించాడు (2వ పేరా చూడండి) *

2. సాతాను చాలా నైపుణ్యంగా ఉపయోగించే ఉచ్చుల్లో రెండు ఏంటి?

2 సాతాను చాలా నైపుణ్యంగా ఉపయోగించే ఉచ్చుల్లో రెండు: గర్వం, అత్యాశ. * వేల సంవత్సరాలుగా ఈ చెడ్డ లక్షణాల్ని ఉపయోగించడంలో సాతాను విజయం సాధించాడు. అతను ఒక జంతువుని ఉచ్చులోకి లేదా వలలోకి లాగే ఒక వేటగాడిలా ఉన్నాడు. (కీర్త. 91:3) అయితే మనం సాతాను ఉచ్చులో పడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే, సాతాను పన్నాగాలను యెహోవా మనకు ముందే తెలియజేశాడు.—2 కొరిం. 2:11.

మనకు హెచ్చరికగా ఉన్న బైబిలు ఉదాహరణల నుండి సాతాను ఉచ్చుల్లో ఎలా పడకుండా ఉండవచ్చో లేదా ఆ ఉచ్చుల్ని ఎలా తప్పించుకోవచ్చో నేర్చుకుంటాం (3వ పేరా చూడండి) *

3. గర్వం, అత్యాశ అనే ఉచ్చుల్లో చిక్కుకున్న వాళ్ల ఉదాహరణలను యెహోవా ఎందుకు రాయించాడు?

3 తన సేవకుల్లో కొంతమందికి ఏం జరిగిందో చెప్పడం ద్వారా గర్వం, అత్యాశ ఎంత ప్రమాదకరమైనవో యెహోవా మనకు తెలియజేస్తున్నాడు. దాన్ని తెలుసుకోవడం వల్ల మనం కూడా అవే తప్పులు చేయకుండా ఉండవచ్చు. ఇప్పుడు మనం పరిశీలించబోతున్న ఉదాహరణల్లో, ఎంతోకాలంగా యెహోవా సేవ చేసిన కొంతమందిని సాతాను తన ఉచ్చులో ఎలా పడేయగలిగాడో చూస్తాం. దానర్థం సాతాను ఉచ్చుల్ని మనం ఎప్పటికీ తప్పించుకోలేమనా? కానేకాదు. యెహోవా ఈ ఉదాహరణలను “మనకు హెచ్చరికగా ఉండడానికే” లేఖనాల్లో రాయించాడు. (1 కొరిం. 10:11) ఆ ఉదాహరణల నుండి అపవాది ఉచ్చుల్లో ఎలా పడకుండా ఉండవచ్చో లేదా అతని ఉచ్చుల్ని ఎలా తప్పించుకోవచ్చో నేర్చుకుంటామని యెహోవాకు తెలుసు.

గర్వం అనే ఉచ్చు

4వ పేరా చూడండి

4. గర్విష్ఠులుగా మారితే మనకేం జరగవచ్చు?

4 మనం గర్విష్ఠులుగా తయారవ్వాలని సాతాను కోరుకుంటున్నాడు. మనం గర్విష్ఠులుగా మారితే అతనిలాగే తయారై, శాశ్వత జీవితాన్ని పోగొట్టుకుంటామని అతనికి తెలుసు. (సామె. 16:18) అందుకే ఒక వ్యక్తి “గర్వంతో ఉప్పొంగిపోయి అపవాది పొందిన తీర్పునే పొందే అవకాశం ఉంది” అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (1 తిమో. 3:6, 7) మనం సత్యంలోకి ఈ మధ్యే వచ్చినా లేదా యెహోవాను ఎన్నో సంవత్సరాలుగా సేవిస్తున్నా అలా జరిగే ప్రమాదం ఉంది.

5. ప్రసంగి 7:16, 20 ప్రకారం, ఒక వ్యక్తి ఎలా గర్వాన్ని చూపించవచ్చు?

5 గర్విష్ఠులు స్వార్థాన్ని చూపిస్తారు. మనకు ముఖ్యంగా ఏదైనా సమస్య వస్తే, యెహోవాకన్నా మన గురించే ఎక్కువ ఆలోచించేలా చేయడానికి సాతాను ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు, మీరు చేయని పని గురించి ఎవరైనా మిమ్మల్ని నిందించారా? లేదా ఎవరైనా మీతో అన్యాయంగా ప్రవర్తించారా? అలా జరిగితే, మీరు యెహోవా మీద లేదా మీ సహోదరులు మీద కోపం పెంచుకోవాలని సాతాను చాలా కోరుకుంటాడు. అంతేకాదు ఆ సమస్యను పరిష్కరించడానికి, యెహోవా వాక్యంలోని నిర్దేశం మీద కాకుండా సొంత తెలివి మీద ఆధారపడడమే ఏకైక మార్గమని మనం అనుకోవాలని సాతాను కోరుకుంటాడు.ప్రసంగి 7:16, 20 చదవండి.

6. నెదర్లాండ్స్‌లో ఉంటున్న ఒక సహోదరి అనుభవం నుండి మీరేం నేర్చుకోవచ్చు?

6 నెదర్లాండ్స్‌లో ఉంటున్న ఒక సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. సహోదరసహోదరీల లోపాల్ని చూసినప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చేది. అలాంటివాళ్లతో సమయం గడపకూడదని నిర్ణయించుకుంది. ఆమె ఇలా అంటుంది: “నాకు చాలా ఒంటరిగా అనిపించింది. అదే సమయంలో నా ఆలోచనా తీరును మార్చుకోలేకపోయాను. వేరే సంఘానికి మారిపోదామని నా భర్తతో అన్నాను.” ఆ తర్వాత ఆమె 2016, మార్చి నెల బ్రాడ్‌కాస్టింగ్‌ కార్యక్రమాన్ని చూసింది. ఇతరుల్లో లోపాలున్నా వాళ్లతో ఎలా వ్యవహరించాలో ఆ కార్యక్రమంలో కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సహోదరి ఇంకా ఇలా అంటుంది: “సంఘంలోని సహోదరసహోదరీలను మార్చడానికి ప్రయత్నించే బదులు నాలో ఉన్న లోపాల్ని వినయంగా, నిజాయితీగా పరిశీలించుకోవాలని నాకర్థమైంది. ఆ కార్యక్రమం ద్వారా యెహోవా మీద, ఆయన సర్వాధిపత్యం మీద మనసుపెట్టాలని నేర్చుకున్నాను.” దాన్నుండి మీరేం నేర్చుకోవచ్చు? మీకేదైనా సమస్య వస్తే యెహోవా మీదే మనసుపెట్టండి. ఇతరుల్ని ఆయన చూసినట్లే చూడడానికి సహాయం చేయమని ఆయన్ని వేడుకోండి. మీ పరలోక తండ్రి ఇతరుల తప్పుల్ని చూస్తున్నా, వాళ్లను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా అలానే చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.—1 యోహా. 4:20.

7వ పేరా చూడండి

7. రాజైన ఉజ్జియాకు ఏం జరిగింది?

7 యూదా రాజైన ఉజ్జియా గర్విష్ఠిగా మారడం వల్ల ఇతరులు ఇచ్చిన సలహాను తీసుకోలేదు. అలాగే, దేవుడు ఆజ్ఞాపించని పనిని చేశాడు. ఉజ్జియా ఎంతో సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఆయన ఎన్నో యుద్ధాల్లో గెలిచాడు, చాలా నగరాల్ని కట్టాడు, వ్యవసాయ రంగంలో కూడా ఎంతో అభివృద్ధి సాధించాడు. “సత్యదేవుడు అతన్ని ఆశీర్వదించాడు.” (2 దిన. 26:3-7, 10) “అయితే అతను శక్తిమంతుడు అవ్వగానే అతని హృదయం గర్వించింది, అది అతని నాశనానికి దారితీసింది” అని బైబిలు చెప్తుంది. ఆలయంలో యాజకులు మాత్రమే ధూపం వేయాలని యెహోవా ఆజ్ఞాపించాడు. కానీ రాజైన ఉజ్జియా తనకు అర్హత లేకపోయినా ధూపం వేయడానికి ఆలయం లోపలికి వెళ్లాడు. అతను చేసిన పని యెహోవాకు నచ్చలేదు, దాంతో గర్విష్ఠుడైన ఉజ్జియాకు కుష్ఠు వ్యాధి వచ్చేలా చేశాడు. ఆ తర్వాత, ఉజ్జియా చనిపోయేవరకు కుష్ఠురోగిగానే ఉన్నాడు.—2 దిన. 26:16-21.

8. మొదటి కొరింథీయులు 4:6, 7 లో ఉన్న మాటల్ని పాటించడం వల్ల మనం గర్వం చూపించకుండా ఎలా ఉండవచ్చు?

8 మనం కూడా ఉజ్జియాలాగే గర్వం చూపించి, పాపం చేసే ప్రమాదం ఉందా? హోసే అనే సహోదరుడి అనుభవాన్ని పరిశీలించండి. ఆయన వ్యాపారంలో బాగా లాభాలు సాధించేవాడు, మంచి సంఘపెద్దగా కూడా సేవ చేశాడు. ఆయన సమావేశాల్లో ప్రసంగాలు ఇచ్చేవాడు, అలాగే ప్రాంతీయ పర్యవేక్షకులు కొన్ని విషయాల్లో ఆయన్ని సలహా అడిగేవాళ్లు. అయితే ఆయన ఇలా ఒప్పుకుంటున్నాడు: “నేను యెహోవా మీద ఆధారపడకుండా నా సొంత సామర్థ్యం మీద, అనుభవం మీద ఆధారపడ్డాను. నేను ఆధ్యాత్మికంగా బాగానే ఉన్నానని అనుకున్నాను. అందుకే యెహోవా ఇచ్చిన హెచ్చరికల్ని, సలహాని వినలేదు.” హోసే ఘోరమైన పాపం చేసి సంఘం నుండి బహిష్కరించబడ్డాడు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన్ని మళ్లీ సంఘంలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఇలా అంటున్నాడు: “ఒక స్థానాన్ని కలిగివుండడం కాదుగానీ, మన నుండి తాను ఏం కోరుతున్నాడో అది చేయడం ప్రాముఖ్యమని యెహోవా నాకు నేర్పించాడు.” మనకెలాంటి సామర్థ్యాలు ఉన్నా, సంఘంలో మనమెలాంటి సేవావకాశాలు పొందినా, అవి యెహోవా ఇచ్చినవే అని గుర్తుంచుకుందాం. (1 కొరింథీయులు 4:6, 7 చదవండి.) ఒకవేళ మనం గర్వం చూపిస్తే యెహోవా మనల్ని తన సేవలో ఉపయోగించుకోడు.

అత్యాశ అనే ఉచ్చు

9వ పేరా చూడండి

9. అత్యాశ వల్ల సాతాను, హవ్వ ఏం చేశారు?

9 అత్యాశ అనే పదం వినగానే మనకు అపవాది అయిన సాతాను గుర్తొస్తాడు. యెహోవా దూతల్లో ఒకడైన సాతానుకు ఎన్నో మంచి సేవావకాశాలు ఉండివుంటాయి. కానీ అతను ఇంకా ఎక్కువ కావాలని కోరుకున్నాడు. యెహోవాకు మాత్రమే చెందాల్సిన ఆరాధనను అతను పొందాలనుకున్నాడు. మనం కూడా తనలాగే తయారవ్వాలన్నది అతని కోరిక. కాబట్టి మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ కోరుకునేలా చేయడానికి సాతాను ప్రయత్నిస్తాడు. అతను మొదటిసారి హవ్వ విషయంలో అలా చేశాడు. తోటలోని ఒక్క చెట్టు పండు తప్ప “ప్రతీ చెట్టు పండ్లను” హవ్వ, ఆమె భర్త సంతృప్తిగా తినేలా యెహోవా ప్రేమతో వాళ్లకు కావాల్సినంత ఆహారాన్ని ఇచ్చాడు. (ఆది. 2:16) అయినా యెహోవా తినొద్దన్న ఆ ఒక్క చెట్టు పండు తినాలని హవ్వ అనుకునేలా సాతాను ఆమెను మోసం చేశాడు. హవ్వ ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. హవ్వ పాపం చేయడంతో కొంతకాలానికి చనిపోయింది.—ఆది. 3:6, 19.

10వ పేరా చూడండి

10. అత్యాశ దావీదుకు ఎలా ఒక ఉచ్చులా తయారైంది?

10 యెహోవా దావీదుకు సంపదను, అధికారాన్ని, ఎన్నోసార్లు శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు. దేవుడు తనకిచ్చిన బహుమానాలు ‘లెక్కించలేనన్ని ఉన్నాయని’ దావీదు కృతజ్ఞతతో అన్నాడు. (కీర్త. 40:5) కానీ ఆ తర్వాత అతను అత్యాశ వల్ల యెహోవా ఇచ్చిన వాటికన్నా ఇంకా ఎక్కువ కావాలని కోరుకున్నాడు. దావీదుకు చాలామంది భార్యలు ఉన్నా, వేరే వ్యక్తి భార్య మీద తన హృదయంలో తప్పుడు కోరికను పెంచుకున్నాడు. ఆ స్త్రీ పేరు బత్షెబ, ఆమె భర్త హిత్తీయుడైన ఊరియా. స్వార్థంతో దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు, దానివల్ల ఆమె గర్భవతి అయ్యింది. ఆ తర్వాత, ఊరియాను చంపించి దావీదు తప్పు మీద తప్పు చేశాడు. (2 సమూ. 11:2-15) దావీదు అసలు ఏమనుకున్నాడు? అతను చేసిన పనిని యెహోవా చూడలేడనుకున్నాడా? దావీదు ఎంతోకాలంగా యెహోవాకు సేవ చేసినప్పటికీ అత్యాశ చూపించడం వల్ల చాలా బాధపడాల్సి వచ్చింది. సంతోషకరమైన విషయం ఏంటంటే, తర్వాత అతను తన తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపపడ్డాడు. యెహోవా దావీదును క్షమించినందుకు అతను ఎంత కృతజ్ఞత చూపించి ఉంటాడో కదా!—2 సమూ. 12:7-13.

11. ఎఫెసీయులు 5:3, 4 ప్రకారం, మనం అత్యాశతో పోరాడడానికి ఏది సహాయం చేస్తుంది?

11 దావీదు ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు? యెహోవా మనకిచ్చిన వాటన్నిటిపట్ల కృతజ్ఞత కలిగివుంటే మనం అత్యాశతో పోరాడవచ్చు. (ఎఫెసీయులు 5:3, 4 చదవండి.) మనకున్న వాటితో మనం తృప్తిపడాలి. మనం ఎవరికైనా బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పుడు, వాళ్లకు యెహోవా ఇచ్చిన ఒక ఆశీర్వాదాన్ని గుర్తుచేసుకోమని, దాని విషయంలో ఆయనకు కృతజ్ఞత చెప్పమని వాళ్లను ప్రోత్సహించవచ్చు. ఒక వ్యక్తి వారం పాటు ప్రతీరోజు అలాచేస్తే అతను ఏడు వేర్వేరు అంశాల గురించి ప్రార్థించినట్టే. (1 థెస్స. 5:18) మీరూ అలాగే చేస్తారా? యెహోవా మీకు చేసిన వాటన్నిటి గురించి ధ్యానించినప్పుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పేలా అది సహాయం చేస్తుంది. అలా మీరు కృతజ్ఞత చూపించినప్పుడు ఉన్నవాటితో తృప్తిపడతారు, అప్పుడు అత్యాశ చూపించరు.

12వ పేరా చూడండి

12. అత్యాశ చూపించడం వల్ల ఇస్కరియోతు యూదా ఏం చేశాడు?

12 అత్యాశ వల్ల ఇస్కరియోతు యూదా చాలా చెడ్డపని చేసి, యేసుకు నమ్మకద్రోహం చేశాడు. కానీ యూదా ముందునుండి అలాంటివాడు కాదు. (లూకా 6:13, 16) యేసు అతన్ని అపొస్తలుడిగా ఎంచుకున్నాడు. అతని మీద నమ్మకం ఉంచాడు కాబట్టే డబ్బు పెట్టెను చూసుకునే పనిని అప్పగించాడు. యేసు, అలాగే అపొస్తలులు ఆ డబ్బును పరిచర్యలో వాళ్లకు అయ్యే ఖర్చుల కోసం ఉపయోగించేవాళ్లు. అవి ఒక విధంగా నేడు ప్రపంచవ్యాప్త పనికోసం ఇస్తున్న విరాళాలు లాంటివి. అయితే కొంతకాలానికి యూదా దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అత్యాశ చూపించవద్దని యేసు చాలాసార్లు ప్రజల్ని హెచ్చరించడం యూదా వినినప్పటికీ అలా చేశాడు. (మార్కు 7:22, 23; లూకా 11:39; 12:15) అవును, యూదా ఆ హెచ్చరికల్ని లక్ష్యపెట్టలేదు.

13. యూదాకున్న అత్యాశ ఎప్పుడు బయటపడింది?

13 యేసును చంపడానికి కొంతకాలం ముందు, ఒక సందర్భంలో యూదాకున్న అత్యాశ బయటపడింది. సీమోను అనే కుష్ఠురోగి, మరియ మార్తలతోపాటు యేసును, ఆయన శిష్యులను తన ఇంటికి ఆహ్వానించాడు. వాళ్లు భోజనం చేస్తున్నప్పుడు మరియ లేచి ఎంతో ఖరీదైన పరిమళ తైలాన్ని యేసు తలమీద పోసింది. అది చూసి యూదాకు, ఇతర శిష్యులకు చాలా కోపం వచ్చింది. ఇతర శిష్యులు ఆ డబ్బును అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడం కోసం ఉపయోగించవచ్చని అనుకొనివుంటారు. కానీ యూదా ఉద్దేశం వేరు. అతను “ఒక దొంగ,” డబ్బు పెట్టె నుండి డబ్బులు దొంగిలించాలని అనుకున్నాడు. ఆ తర్వాత యూదా అత్యాశ వల్ల యేసును ఒక దాసుని ఖరీదుకు అమ్మి, ఆయనకు నమ్మకద్రోహం చేశాడు.—యోహా. 12:2-6; మత్త. 26:6-16; లూకా 22:3-6.

14. లూకా 16:13 లో ఉన్న మాటల్ని ఒక జంట ఎలా పాటించింది?

14 “మీరు ఒకే సమయంలో దేవునికీ సంపదలకూ దాసులుగా ఉండలేరు” అనే సత్యాన్ని యేసు తన అనుచరులకు గుర్తుచేశాడు. (లూకా 16:13 చదవండి.) అది ఇప్పటికీ నిజం. ఉదాహరణకు, రుమేనియాలోని ఒక జంట యేసు మాటల్ని ఎలా పాటించారో పరిశీలిద్దాం. వాళ్లకు ఒక ధనిక దేశంలో కొంతకాలం పాటు ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. వాళ్లు ఇలా అంటున్నారు: “మేము పెద్ద మొత్తంలో బ్యాంకు లోన్‌ తీర్చాలి, కాబట్టి ఈ ఉద్యోగం యెహోవా ఇచ్చిన ఆశీర్వాదమని మొదట్లో అనుకున్నాం.” అయితే ఒక సమస్య ఉంది, వాళ్లు ఆ ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటే, యెహోవా సేవచేయడానికి ఎక్కువ సమయం ఉండదు. 2008 ఆగస్టు 15, కావలికోట సంచికలో “పూర్ణహృదయంతో యథార్థతను కనబరుస్తూ ఉండండి” అనే ఆర్టికల్‌ చదివాక వాళ్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లింకా ఇలా అంటున్నారు: “కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం మేము వేరే దేశానికి వెళ్తే, యెహోవాతో మాకున్న సంబంధాన్ని రెండో స్థానంలో పెట్టినట్టే. అప్పుడు యెహోవాతో మాకున్న సంబంధం ఖచ్చితంగా పాడవుతుందని మాకు అర్థమైంది.” అందుకే, వాళ్లు ఆ ఉద్యోగ అవకాశాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్లుంటున్న దేశంలోనే వాళ్ల అవసరాల్ని తీర్చే ఉద్యోగం ఆ భర్తకు దొరికింది. అతని భార్య ఇలా అంటుంది: “యెహోవా తన సేవకులకు ఎప్పుడూ సహాయం చేస్తాడు.” ఆ జంట డబ్బును కాకుండా యెహోవాను తమ యజమానిగా చేసుకున్నందుకు సంతోషించారు.

సాతాను ఉచ్చుల్లో పడిపోకుండా ఉండండి

15. సాతాను ఉచ్చుల నుండి తప్పించుకోవడం సాధ్యమేనని ఎలా చెప్పవచ్చు?

15 మనలో గర్వం, అత్యాశ ఉన్నాయని గమనిస్తే మనమేం చేయాలి? ఆ ఉచ్చుల నుండి మనం బయటపడవచ్చు! అపవాది ఎవరినైనా ‘సజీవంగా పట్టుకున్నా,’ అతని ఉచ్చు నుండి వాళ్లు తప్పించుకోవచ్చని పౌలు చెప్పాడు. (2 తిమో. 2:26) దావీదు విషయంలో అదే జరిగింది. అతను నాతాను ఇచ్చిన గద్దింపును తీసుకున్నాడు, అత్యాశ చూపించినందుకు పశ్చాత్తాపపడ్డాడు, అలాగే యెహోవాతో మళ్లీ మంచి సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. సాతాను కన్నా యెహోవా శక్తిమంతుడని ఎన్నడూ మర్చిపోకండి. కాబట్టి మనం యెహోవా సహాయాన్ని తీసుకుంటే అపవాది వేసే ఎలాంటి ఉచ్చు నుండైనా తప్పించుకోవచ్చు.

16. సాతాను ఉచ్చుల్లో మనం పడిపోకుండా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

16 సాతాను వేసే గర్వం, అత్యాశ అనే ఉచ్చుల నుండి తప్పించుకోవడం కన్నా మనం ఆ ఉచ్చుల్లో పడకుండా చూసుకోవాలి. దేవుని సహాయంతో మాత్రమే మనమలా చేయగలం. అయితే మనం ఆ ఉచ్చుల్లో అస్సలు పడమని అనుకోకూడదు! ఎందుకంటే, ఎంతోకాలంగా యెహోవా సేవలో ఉన్నవాళ్లు కూడా గర్వం, అత్యాశ చూపించారు. కాబట్టి ఈ చెడ్డ లక్షణాలు మీ ఆలోచనలపై, పనులపై ప్రభావం చూపిస్తున్నాయేమో పరిశీలించుకోవడానికి సహాయం చేయమని ప్రతీరోజు యెహోవాను వేడుకోండి. (కీర్త. 139:23, 24) మీరు గర్వం, అత్యాశ చూపించకుండా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించండి!

17. మన శత్రువైన అపవాదికి ఏం జరుగుతుంది?

17 వేల సంవత్సరాల నుండి సాతాను వేటాడుతూనే ఉన్నాడు. కానీ త్వరలోనే అతను బంధించబడి, నాశనం చేయబడతాడు. (ప్రక. 20:1-3, 10) మనం ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. అయితే అప్పటివరకు సాతాను ఉచ్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. గర్వం, అత్యాశ చూపించకుండా ఉండడానికి తీవ్రంగా కృషి చేయండి. ‘అపవాదిని ఎదిరించాలని’ నిశ్చయించుకోండి, “అప్పుడు అతను మీ దగ్గర నుండి పారిపోతాడు.”—యాకో. 4:7.

పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి

^ పేరా 5 సాతాను నైపుణ్యంగల ఒక వేటగాడిలా ఉన్నాడు. మనం ఎంతకాలంగా యెహోవాను సేవిస్తున్నప్పటికీ సాతాను మనల్ని తన ఉచ్చులో పడేయాలని ప్రయత్నిస్తున్నాడు. యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేయడానికి అతను గర్వాన్ని, అత్యాశని ఎలా ఉపయోగిస్తాడో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం. గర్వం, అత్యాశ అనే ఉచ్చుల్లో చిక్కుకున్న కొంతమంది ఉదాహరణల్ని పరిశీలించి వాళ్ల నుండి ఏం నేర్చుకోవచ్చో, అలాగే ఆ ఉచ్చుల నుండి మనమెలా తప్పించుకోవచ్చో కూడా ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.

^ పేరా 2 పదాల వివరణ: ఈ ఆర్టికల్‌లో, గర్వం అంటే ఇతరులకన్నా తానే గొప్పని అనుకోవడం. అత్యాశ అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బుని, అధికారాన్ని, ఇతర విషయాల్ని కోరుకోవడం, అలాగే ఎక్కువ లైంగిక కోరికల్ని కలిగివుండడం.

^ పేరా 53 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు గర్వంతో తనకిచ్చిన తెలివైన సలహాను నిరాకరిస్తున్నాడు. ఒక సహోదరి తన దగ్గర చాలా వస్తువులున్నా ఇంకా కావాలని కోరుకుంటుంది.

^ పేరా 55 చిత్రాల వివరణ: దేవుని ఆత్మ కుమారుల్లో ఒకరు అలాగే రాజైన ఉజ్జియా గర్విష్ఠులుగా మారారు. అత్యాశ వల్ల హవ్వ తినొద్దన్న చెట్టు పండును తినింది, దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు, అలాగే యూదా డబ్బును దొంగతనం చేశాడు.