కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 28

పోటీతత్వాన్ని కలిగించకుండా శాంతిని పెంపొందించండి

పోటీతత్వాన్ని కలిగించకుండా శాంతిని పెంపొందించండి

“అహంకారంతో ఎదుటివాళ్లలో పోటీతత్వాన్ని కలిగించకుండా, ఒకరి మీద ఒకరం ఈర్ష్య పడకుండా ఉందాం.” —గల. 5:26.

పాట 101 ఐకమత్యంతో పనిచేద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. పోటీతత్వం వల్ల ప్రజలు ఎలా ప్రవర్తించే అవకాశం ఉంది?

నేడు లోకంలో చాలామంది పోటీతత్వాన్ని చూపిస్తూ, స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యాపారవేత్త వేరే వ్యాపారవేత్తల కన్నా ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇతరులకు హాని చేయవచ్చు. ఒక క్రీడాకారుడు ఆటలో గెలవడానికి వేరే జట్టులోని వ్యక్తిని కావాలనే గాయపర్చవచ్చు. ఒక విద్యార్థి మంచి పేరున్న కాలేజీలో సీటు సంపాదించడం కోసం పరీక్షల్లో కాపీ కొట్టవచ్చు. క్రైస్తవులమైన మనకు అలాంటి పనులు తప్పని, అవి ‘శరీర కార్యాల్లో’ భాగమని తెలుసు. (గల. 5:19-21) అయితే యెహోవా సేవకుల్లో కొందరు తెలీకుండానే సంఘంలో పోటీతత్వం చూపిస్తూ, ఇతరులు కూడా అలా ప్రవర్తించేలా చేసే అవకాశం ఉందా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే పోటీతత్వం మన సహోదరసహోదరీల మధ్య ఐక్యతను పాడుచేయగలదు.

2. ఈ ఆర్టికల్‌లో ఏం చర్చిస్తాం?

2 మన సహోదరులతో మనం పోటీపడేలా చేసే చెడు లక్షణాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అలాగే బైబిలు కాలాల్లో పోటీతత్వం చూపించకుండా ఉన్న నమ్మకమైన స్త్రీపురుషుల ఉదాహరణల్ని కూడా పరిశీలిస్తాం. ముందుగా, మనమలా ఎందుకు ప్రవర్తించే అవకాశం ఉందో తెలుసుకుందాం.

మీ ఉద్దేశాల్ని పరిశీలించుకోండి

3. మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

3 ఎప్పటికప్పుడు మన ఉద్దేశాల్ని పరిశీలించుకోవడం మంచిది. మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఇతరులకన్నా గొప్ప అనుకున్నప్పుడే సంతోషంగా ఉంటున్నానా? నేను సంఘంలో అందరికన్నా మంచి పేరు సంపాదించడం కోసమో, ఒక సహోదరుడు లేదా సహోదరి కన్నా గొప్ప అనిపించుకోవడం కోసమో కష్టపడుతున్నానా? లేదా యెహోవాను సంతోషపెట్టడం కోసం కష్టపడుతున్నానా?’ మనం ఈ ప్రశ్నల గురించి ఎందుకు ఆలోచించాలి?

4. గలతీయులు 6:3, 4 లో చెప్తున్నట్లు, మనం ఎందుకు ఇతరులతో పోల్చుకోకూడదు?

4 మనం ఇతరులతో పోల్చుకోకూడదని బైబిలు చెప్తుంది. (గలతీయులు 6:3, 4 చదవండి.) ఎందుకు? ఒక కారణం ఏంటంటే, తోటి సహోదరులకన్నా మెరుగ్గా ఉన్నామని అనుకుంటే మనలో గర్వం పెరగొచ్చు. మరోవైపు మనకన్నా మన సహోదరులే మెరుగ్గా ఉన్నారని అనుకుంటే మనం నిరుత్సాహపడే అవకాశం ఉంది. ఆ రెండు విధానాల్లో ఆలోచించడం తెలివైన పని కాదు. (రోమా. 12:3) గ్రీసులో ఉంటున్న క్యాటరీనా * అనే సహోదరి ఇలా అంటుంది: “నేను నా కన్నా అందంగా ఉండేవాళ్లతో, పరిచర్యను మరింత నైపుణ్యంగా చేసేవాళ్లతో, త్వరగా స్నేహితుల్ని చేసుకునే వాళ్లతో పోల్చుకునేదాన్ని. దానివల్ల నేను పనికిరానిదాన్నని నాకు అనిపించింది.” మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి: మనం అందంగా ఉన్నామనో, బాగా మాట్లాడతామనో, ఎక్కువమంది మనల్ని ఇష్టపడుతున్నారనో యెహోవా మనల్ని ఆకర్షించలేదు. కానీ, తనను ప్రేమించడానికి, తన కుమారుని మాట వినడానికి మనం ఇష్టపడుతున్నాం కాబట్టే ఆయన మనల్ని ఆకర్షించాడు.—యోహా. 6:44; 1 కొరిం. 1:26-31.

5. హ్యూన్‌ అనే సహోదరుని అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

5 మనం ఈ ప్రశ్న కూడా వేసుకోవచ్చు: ‘నాకు ఎలాంటి పేరు ఉంది? శాంతిని నెలకొల్పే వ్యక్తి అనా? లేదా తరచూ ఇతరులతో గొడవపడే వ్యక్తి అనా?’ దక్షిణ కొరియాలో నివసిస్తున్న హ్యూన్‌ అనే సహోదరుడు జీవితంలో ఏం జరిగిందో గమనించండి. ఆయన అప్పటికే సంఘపెద్దగా సేవ చేస్తున్నాడు. అయినా ఒకానొక సమయంలో, సంఘంలో సేవావకాశాలు ఉన్న కొంతమంది తనకన్నా గొప్పగా కనబడడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆయన అనుకునేవాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను ఆ సహోదరుల్లో తప్పులు వెతికేవాడ్ని, అలాగే ఎక్కువశాతం వాళ్లు చెప్పేవాటితో అంగీకరించేవాడ్ని కాదు.” దానివల్ల ఏం జరిగింది? “నా ప్రవర్తన వల్ల సంఘంలో ఐక్యత దెబ్బతినింది” అని ఆయన ఒప్పుకుంటున్నాడు. తన సమస్యను గుర్తించడానికి హ్యూన్‌కు కొంతమంది స్నేహితులు సహాయం చేశారు. ఆయన అవసరమైన మార్పులు చేసుకొని నేడు ఒక మంచి సంఘపెద్దగా కొనసాగుతున్నాడు. శాంతికి బదులు పోటీతత్వాన్ని పెంచుతున్నామని మనకు అనిపిస్తే, వెంటనే మార్పులు చేసుకోవాలి.

అహంకారం, ఈర్ష్య విషయంలో జాగ్రత్తగా ఉండండి

6. గలతీయులు 5:26 ప్రకారం, ఏ చెడు లక్షణాలు పోటీతత్వానికి దారితీస్తాయి?

6 గలతీయులు 5:26 చదవండి. ఎలాంటి చెడు లక్షణాలు పోటీతత్వానికి దారితీస్తాయి? ఒకటి అహంకారం. అహంకారం ఉన్న వ్యక్తి గర్వాన్ని, స్వార్థాన్ని చూపిస్తాడు. మరొక చెడు లక్షణం ఈర్ష్య. ఈర్ష్య పడే వ్యక్తి వేరేవాళ్ల దగ్గర ఉన్నవి కావాలనుకోవడంతో పాటు, వాటిని లాగేసుకోవాలని అనుకుంటాడు. నిజానికి ఇతరులను చూసి ఈర్ష్య పడే వ్యక్తి వాళ్లను ద్వేషిస్తాడు. అలాంటి చెడు లక్షణాలకు మనం వీలైనంత దూరంగా ఉండాలి.

7. అహంకారం, ఈర్ష్య వల్ల ఎలాంటి నష్టం జరగవచ్చో ఒక ఉదాహరణ చెప్పండి.

7 చెడు లక్షణాలైన అహంకారాన్ని, ఈర్ష్యని విమానం నడపడానికి వాడే ఇంధనంలో చేరే మలినాలతో పోల్చవచ్చు. మొదట్లో విమానం బానే వెళ్లినా మలినాలు ఇంధనం పైపుల్లో అడ్డుపడడం వల్ల ఇంజన్‌ చెడిపోయి, కొంత సమయానికి విమానం కూలిపోవచ్చు. అదేవిధంగా యెహోవా సేవను మొదలుపెట్టిన ఒక వ్యక్తి అహంకారాన్ని, ఈర్ష్యని పెంచుకుంటే అతను పడిపోవచ్చు. (సామె. 16:18) ఆ వ్యక్తి యెహోవాను సేవించడం ఆపేస్తాడు. అలాగే తనకి హాని చేసుకోవడంతో పాటు ఇతరులకు హాని చేస్తాడు. మరి అహంకారాన్ని, ఈర్ష్యని పెంచుకోకుండా మనం ఎలా జాగ్రత్తపడవచ్చు?

8. మనం అహంకారాన్ని చూపించకుండా ఎలా ఉండవచ్చు?

8 అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు ఇచ్చిన సలహాను మనం పాటిస్తే అహంకారాన్ని చూపించకుండా ఉండవచ్చు. “గొడవలకు దిగే మనస్తత్వాన్ని, అహాన్ని చూపించకండి; బదులుగా వినయంతో ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి.” (ఫిలి. 2:3) ఇతరుల్ని మనకన్నా గొప్పవాళ్లుగా చూస్తే, మనకన్నా ఎక్కువ తెలివితేటలు, సామర్థ్యాలు ఉన్నవాళ్లతో పోటీపడం. బదులుగా వాళ్లను చూసి సంతోషిస్తాం. ముఖ్యంగా వాళ్లు తమ సామర్థ్యాల్ని, యెహోవా సేవలో ఆయన్ని స్తుతించడానికి ఉపయోగిస్తున్నప్పుడు మనమలా సంతోషిస్తాం. మరోవైపు, ఎన్నో సామర్థ్యాలున్న సహోదరసహోదరీలు పౌలు ఇచ్చిన సలహాను పాటిస్తే, వాళ్లు మనలో ఉన్న మంచి లక్షణాల్ని చూడగలుగుతారు. అలా అందరం సంఘంలో శాంతి, ఐక్యత ఉండడానికి సహాయపడతాం.

9. ఎదుటివాళ్లను చూసి ఈర్ష్య పడకుండా ఉండడానికి మనమేం చేయవచ్చు?

9 మనం అణకువను వృద్ధి చేసుకోవడం ద్వారా, అంటే మన పరిమితుల్ని గుర్తించడం ద్వారా ఈర్ష్య పడకుండా ఉండవచ్చు. మనకు అణకువ ఉంటే అందరికన్నా మనకే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని లేదా ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయని చూపించుకోవడానికి ప్రయత్నించం. బదులుగా, మనకన్నా ఎక్కువ సామర్థ్యాలున్న వాళ్ల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణకు, సంఘంలో ఒక సహోదరుడు చాలా బాగా బహిరంగ ప్రసంగాలు ఇస్తాడనుకోండి. అతను ప్రసంగాలకు ఎలా సిద్ధపడతాడో మనం అడిగి తెలుసుకోవచ్చు. ఒక సహోదరి వంటలు బాగా చేస్తుందని మీకు తెలిస్తే, మీరు కూడా ఇంకా బాగా వంటలు చేయడానికి ఆమెను సహాయం అడగవచ్చు. ఒక యౌవన సహోదరునికి ఇతరుల్ని త్వరగా స్నేహితుల్ని చేసుకోవడం తెలియకపోతే, అలా స్నేహితుల్ని చేసుకుంటున్న వాళ్లను సలహా అడగవచ్చు. ఈ విధంగా మనం ఈర్ష్య పడకుండా ఉండవచ్చు, మన నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవచ్చు.

బైబిల్లోని ఉదాహరణల నుండి నేర్చుకోండి

వినయం ఉండడంవల్ల గిద్యోను ఎఫ్రాయిమువాళ్లతో శాంతిని కాపాడుకోగలిగాడు (10-12 పేరాలు చూడండి)

10. గిద్యోను ఏ సమస్యను ఎదుర్కొన్నాడు?

10 మనష్షే గోత్రానికి చెందిన గిద్యోను, ఎఫ్రాయిమువాళ్ల మధ్య ఏం జరిగిందో ఒకసారి గుర్తుచేసుకోండి. యెహోవా సహాయంతో గిద్యోను, అతనితోపాటు ఉన్న 300 మంది ఒక యుద్ధంలో గర్వించదగ్గ విజయాన్ని సాధించారు. ఆ తర్వాత, ఎఫ్రాయిమువాళ్లు గిద్యోనును మెచ్చుకునే బదులు అతనితో గొడవ పడడానికి వచ్చారు. దేవుని శత్రువుల మీద యుద్ధానికి వెళ్లేటప్పుడు గిద్యోను తమను ముందే పిలవలేదని వాళ్లకు కోపం వచ్చింది. ప్రజలు తమ గోత్రాన్ని గౌరవించడం గురించి వాళ్లు ఎక్కువగా ఆలోచించారు. కానీ గిద్యోను యెహోవా పేరును ఘనపర్చి, ఆయన ప్రజలను కాపాడాడనే మరింత ప్రాముఖ్యమైన విషయాన్ని ఎఫ్రాయిమువాళ్లు మర్చిపోయారు.—న్యాయా. 8:1.

11. గిద్యోను ఎఫ్రాయిమువాళ్లకు ఏం చెప్పాడు?

11 గిద్యోను ఎఫ్రాయిమువాళ్లతో వినయంగా, “మీతో పోలిస్తే నేను చేసింది ఎంత?” అని అన్నాడు. తర్వాత, గొప్ప పనులు చేసేలా అప్పటికే యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడో గిద్యోను గుర్తుచేశాడు. దాంతో “వాళ్లు శాంతించారు.” (న్యాయా. 8:2, 3) దేవుని ప్రజల మధ్య శాంతి ఉండేలా గిద్యోను గర్వాన్ని చూపించలేదు.

12. ఎఫ్రాయిమువాళ్ల నుండి, గిద్యోను నుండి మనమేం నేర్చుకోవచ్చు?

12 ఈ వృత్తాంతం నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం ఘనత పొందడం కన్నా యెహోవాకు ఘనత తేవడం మీదే ఎక్కువ మనసుపెట్టాలని ఎఫ్రాయిమువాళ్ల నుండి నేర్చుకోవచ్చు. కుటుంబ పెద్దలు, సంఘపెద్దలు గిద్యోను నుండి పాఠం నేర్చుకోవచ్చు. మనవల్ల ఎవరైనా నొచ్చుకుంటే, విషయాన్ని అతని వైపు నుండి చూడడానికి ప్రయత్నించాలి. అతను ఏదైనా పనిని బాగా చేస్తే దాన్ని మెచ్చుకోవచ్చు కూడా. తప్పు ఎదుటివ్యక్తిదే అయినా వాళ్లను మెచ్చుకోవాలంటే మనకు వినయం అవసరం. కానీ తప్పు మనది కాదని నిరూపించుకోవడం కన్నా ఎదుటివ్యక్తితో శాంతిగా ఉండడమే చాలా ప్రాముఖ్యం.

యెహోవాయే తనకు సహాయం చేస్తాడని నమ్మడం వల్ల హన్నా మనశ్శాంతిని తిరిగి పొందింది (13-14 పేరాలు చూడండి)

13. హన్నాకు ఎలాంటి కష్టం వచ్చింది? ఆమె దాన్నెలా అధిగమించింది?

13 హన్నా గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఆమె లేవీయుడైన ఎల్కానా భార్య. ఆయన ఆమెను ఎంతో ప్రేమించాడు. అయితే ఎల్కానాకు మరో భార్య కూడా ఉంది, ఆమె పేరు పెనిన్నా. ఎల్కానా, పెనిన్నా కంటే హన్నాను ఎక్కువ ప్రేమించాడు. అయితే “పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు లేరు.” ఆ కారణం వల్ల, “పెనిన్నా హన్నాను బాధపెట్టాలని ఆమెను ఎప్పుడూ దెప్పిపొడిచేది.” అప్పుడు హన్నాకు ఎలా అనిపించింది? ఆమె చాలా బాధపడింది. హన్నా “ఏడ్చేది, భోజనం కూడా చేసేది కాదు.” (1 సమూ. 1:2, 6, 7) అయినా హన్నా, పెనిన్నా మీద ఏదో విధంగా పగతీర్చుకోవడానికి ప్రయత్నించిందని బైబిల్లో ఎక్కడా లేదు. బదులుగా, హన్నా తన బాధనంతా యెహోవాకు చెప్పుకొని ఆయనే సహాయం చేస్తాడని నమ్మింది. పెనిన్నా ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? దాని గురించి బైబిలు చెప్పట్లేదు. కానీ హన్నా ప్రార్థించడం వల్ల తిరిగి మనశ్శాంతిని పొందిందని మనకు తెలుసు. ఆ తర్వాత, “ఇంకెప్పుడూ ఆమె ముఖం బాధగా కనిపించలేదు.”—1 సమూ. 1:10, 18.

14. హన్నా ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు?

14 హన్నా ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఎదుటివాళ్లు ఏదో రకంగా మీతో పోటీపడాలని ప్రయత్నిస్తే, ఆ పరిస్థితిలో ఏం చేస్తారనేది మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. వాళ్లకంటే మీరే ఎక్కువని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చెడు చేసే వ్యక్తికి తిరిగి చెడు చేయకుండా శాంతిగా మెలగడానికి ప్రయత్నించండి. (రోమా. 12:17-21) ఒకవేళ అతను మారకపోయినా మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు.

తమ పనిని యెహోవాయే ఆశీర్వదిస్తున్నాడని గుర్తించడం వల్ల అపొల్లో, పౌలు ఒకరి మీద ఒకరు ఈర్ష్య పడలేదు (15-18 పేరాలు చూడండి)

15. అపొల్లో, పౌలు ఏ విషయాల్లో ఒకేలా ఉన్నారు?

15 చివరిగా అపొల్లో నుండి, అపొస్తలుడైన పౌలు నుండి మనమేం నేర్చుకోవచ్చో గమనిద్దాం. ఇద్దరికీ లేఖనాల మీద మంచి పట్టు ఉంది. వాళ్లిద్దరూ పేరుగాంచిన నైపుణ్యంగల బోధకులు. అంతేకాదు, అనేకమంది క్రీస్తు శిష్యులయ్యేలా వాళ్లు సహాయం చేశారు. అయినా వాళ్లిద్దరూ ఒకరి మీద ఒకరు ఈర్ష్య పడలేదు.

16. అపొల్లో ఎలాంటి వ్యక్తి?

16 అపొల్లో “సొంతూరు అలెక్సంద్రియ.” మొదటి శతాబ్దంలో ఆ ప్రాంతం ఉన్నత విద్య నేర్చుకోవడానికి ప్రసిద్ధి చెందింది. అతను మంచి ప్రసంగీకుడు అలాగే “లేఖనాల మీద అతనికి మంచి పట్టు ఉంది.” (అపొ. 18:24) అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు సంఘంలో కొంతమంది పౌలుకన్నా, ఇతరులకన్నా అపొల్లోనే ఎక్కువ ఇష్టపడ్డారు. (1 కొరిం. 1:12, 13) అపొల్లో ఆ విడదీసే వైఖరిని ప్రోత్సహించాడా? ఆయనలా చేసుంటాడని మనం ఊహించలేం. నిజానికి అపొల్లో కొరింథుని విడిచి వెళ్లిన కొంతకాలానికి పౌలు ఆయన్ని తిరిగి రమ్మని బ్రతిమాలాడు. (1 కొరిం. 16:12) అపొల్లో సంఘాన్ని విడదీస్తున్నాడని పౌలుకు అనిపించి ఉంటే, అతన్ని కొరింథుకు తిరిగి రమ్మని అడిగేవాడు కాదు. అపొల్లో తనకున్న సామర్థ్యాలను మంచివార్త ప్రకటించడానికి, సహోదరుల్ని బలపరచడానికి సరైన విధంగా ఉపయోగించాడని స్పష్టమౌతుంది. అపొల్లో వినయం గలవాడని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఉదాహరణకు, అకుల ప్రిస్కిల్ల అపొల్లోకి “దేవుని మార్గం గురించి ఇంకా ఖచ్చితంగా అతనికి” వివరించినప్పుడు ఆయన నొచ్చుకున్నాడని బైబిలు చెప్పట్లేదు.—అపొ. 18:24-28.

17. సంఘంలో శాంతి ఉండడానికి పౌలు ఏం చేశాడు?

17 అపొల్లో చేసిన మంచి పనుల గురించి పౌలుకు తెలుసు. కానీ తనకన్నా అపొల్లోనే గొప్ప అని ఇతరులు అనుకుంటారేమో అని పౌలు భయపడలేదు. కొరింథు సంఘానికి పౌలు ఇచ్చిన సలహా చదివినప్పుడు, ఆయన వినయం గలవాడనీ పరిస్థితులకు తగినట్టు వ్యవహరించేవాడనీ అర్థమౌతుంది. “నేను పౌలు శిష్యుణ్ణి” అని ఎవరైనా అంటే దానికి పౌలు పొంగిపోకుండా వాళ్ల అవధానాన్ని యెహోవా దేవునివైపు, యేసుక్రీస్తు వైపు మళ్లించాడు.—1 కొరిం. 3:3-6.

18. మొదటి కొరింథీయులు 4:6, 7 ప్రకారం అపొల్లో, పౌలు ఉదాహరణల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

18 అపొల్లో, పౌలు ఉదాహరణల నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం యెహోవా సేవలో ఎంతో కష్టపడి ఉండొచ్చు. ఎంతోమంది బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేసి ఉండొచ్చు. అయితే అవన్నీ కేవలం యెహోవా సహాయం వల్లే సాధ్యమయ్యాయని అర్థంచేసుకుంటాం. అపొల్లో, పౌలు ఉదాహరణల నుండి మనం ఇంకో పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు. మనకు ఎన్ని ఎక్కువ సేవావకాశాలు ఉంటే, సంఘంలో శాంతి ఉండేలా మనం అంత ఎక్కువ సహాయపడవచ్చు. పెద్దలు, సంఘ పరిచారకులు దేవుని వాక్యం ఆధారంగా సలహా ఇస్తారు. వాళ్లే గొప్పని భావించకుండా మనకు ఆదర్శమైన యేసుక్రీస్తుకు లోబడేలా సహాయం చేస్తారు. వాళ్లకు మనం ఎంత కృతజ్ఞులమో కదా!—1 కొరింథీయులు 4:6, 7 చదవండి.

19. మనలో ప్రతీ ఒక్కరం ఏం చేయవచ్చు? (“ ఎదుటివాళ్లలో పోటీతత్వాన్ని కలిగించకండి” అనే బాక్సు కూడా చూడండి.)

19 దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని మనం “ఒకరికొకరు పరిచారం చేసుకోవడానికి” ఉపయోగించవచ్చు. (1 పేతు. 4:10) మనం చేసేది అంత ప్రాముఖ్యమైంది కాదని మనకు అనిపించవచ్చు. కానీ ఆలోచించండి, ఎన్నో చిన్నచిన్న కుట్లు వేస్తేనే ఒక అందమైన వస్త్రం తయారవుతుంది. అలాగే, మనం చేసే చిన్నచిన్న పనులు సంఘం ఐక్యంగా ఉండడానికి సహాయం చేస్తాయి. మనలో ఎలాంటి పోటీతత్వపు ఛాయలు కనబడకుండా అందరం గట్టిగా కృషిచేద్దాం. సంఘంలో శాంతిని, ఐక్యతను పెంపొందించడానికి మనం చేయగలిగినదంతా చేయాలని నిశ్చయించుకుందాం.—ఎఫె. 4:3.

పాట 80 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి

^ పేరా 5 మట్టి కుండకు పగుళ్లు ఉంటే అది పగిలిపోవచ్చు. అదేవిధంగా, పోటీతత్వం చూపిస్తే సంఘంలో విభజనలు రావచ్చు. సంఘం బలంగా, ఐక్యంగా లేకపోతే అక్కడ దేవున్ని ప్రశాంతంగా ఆరాధించలేం. మనలో పోటీతత్వాన్ని ఎందుకు పెంచుకోకూడదో, సంఘంలో శాంతిని పెంపొందించడానికి ఏం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

^ పేరా 4 అసలు పేర్లు కావు.