కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 33

యెహోవా కోసం మీరు చేస్తున్నదాన్ని బట్టి ఆనందించండి

యెహోవా కోసం మీరు చేస్తున్నదాన్ని బట్టి ఆనందించండి

“కోరికల వెంట పరుగెత్తే బదులు కళ్లముందు ఉన్నవాటిని ఆస్వాదించడం మేలు.”—ప్రసం. 6:9.

పాట 111 మన సంతోషానికి కారణాలు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. చాలామంది యెహోవా సేవను చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు?

 ఈ వ్యవస్థ ముగింపు దగ్గరపడుతుండగా మనం చేయాల్సిన పని చాలా ఉంది. (మత్త. 24:14; లూకా 10:2; 1 పేతు. 5:2) మనందరం యెహోవా సేవను వీలైనంత ఎక్కువ చేయాలనుకుంటాం. అందుకే చాలామంది తమ పరిచర్యను విస్తృతం చేసుకుంటున్నారు. కొంతమంది పయినీరు సేవ, ఇంకొంతమంది బెతెల్‌ సేవ చేయాలనుకుంటున్నారు. మరికొంతమంది సంస్థ చేపట్టే నిర్మాణ పనుల్లో సహాయపడాలని అనుకుంటున్నారు. చాలామంది సహోదరులు సంఘ పరిచారకులు లేదా సంఘపెద్దలు అవ్వాలనే లక్ష్యం పెట్టుకొని కష్టపడి పనిచేస్తున్నారు. (1 తిమో. 3:1, 8) తన ప్రజలు ఇష్టపూర్వకంగా తన సేవ చేయడానికి ముందుకు రావడం చూసి యెహోవా ఎంతో సంతోషిస్తాడు.—కీర్త. 110:3; యెష. 6:8.

2. యెహోవా సేవలో మనం పెట్టుకున్న ఏదైనా లక్ష్యాన్ని చేరుకోలేకపోతే మనకు ఎలా అనిపిస్తుంది?

2 చాలాకాలం తర్వాత కూడా యెహోవా సేవలో మనం పెట్టుకున్న కొన్ని లక్ష్యాల్ని చేరుకోలేకపోతే నిరుత్సాహపడే అవకాశం ఉంది. లేదా మన వయస్సబట్టి, ఇతర కారణాలను బట్టి కొన్ని సేవావకాశాలను మనం పొందలేకపోతే అప్పుడు కూడా నిరుత్సాహపడే అవకాశం ఉంది. (సామె. 13:12) మెలిసాకు * అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమెకు బెతెల్‌ సేవ చేయడం లేదా రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె ఇలా అంటుంది, “నా వయసు పెద్దది అవ్వడం వల్ల ఆ సేవావకాశాల్ని చేరుకోవడం ఒక కలగా మిగిలిపోయింది. కొన్నిసార్లు నాకు నిరుత్సాహంగా అనిపిస్తుంది.”

3. యెహోవా సేవలో అదనపు బాధ్యతల్ని పొందడానికి అర్హత సాధించాలంటే కొంతమంది ఏం చేయాల్సి రావచ్చు?

3 కొంతమంది యౌవనులు సంఘంలో అదనపు బాధ్యతల్ని పొందడానికి అర్హత సాధించాలంటే కొన్ని లక్షణాల్ని అలవర్చుకోవాలి. ఉదాహరణకు కొంతమందికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు, ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే వాళ్లు ఎక్కువ ఓర్పు చూపించడం, పనిని మరింత జాగ్రత్తగా చేయడం అలాగే ఇతరుల పట్ల ఎక్కువ గౌరవం చూపించడం నేర్చుకోవాల్సి రావచ్చు. అవసరమైన లక్షణాల్ని అలవర్చుకోవడానికి మీరు బాగా కృషి చేస్తే, మీరు ఊహించని సమయంలో ఆ సేవావకాశం మీకు రావచ్చు. నిక్‌ ఉదాహరణ పరిశీలించండి. ఆయనకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన్ని సంఘ పరిచారకుడిగా నియమించలేదని చాలా నిరుత్సహపడ్డాడు. ఆయన ఇలా అంటున్నాడు, “నాలోనే ఏదో లోపం ఉందని నేను అనుకునేవాడిని.” కానీ నిక్‌ తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఆయన సంఘంలో, ప్రకటనాపనిలో తాను చేయగలిగినదంతా చేశాడు. నిక్‌ ఇప్పుడు బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవ చేస్తున్నాడు.

4. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

4 యెహోవా సేవలో మీరు పెట్టుకున్న ఏదైనా లక్ష్యాన్ని చేరుకోన్నందుకు మీరు నిరుత్సాహపడ్డారా? అలాగైతే దాని గురించి యెహోవాకు ప్రార్థించి మీకెలా అనిపిస్తుందో చెప్పండి. (కీర్త. 37:5-7) అంతేకాదు యెహోవా సేవను ఇంకా బాగా ఎలా చేయొచ్చో అనుభవంగల సహోదరులను అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత, వాళ్లిచ్చిన సలహాను పాటించడానికి శాయశక్తులా ప్రయత్నించండి. అలా చేస్తే మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. పైన ప్రస్తావించబడిన మెలిసాలాగే మీరు కోరుకున్న ఏదైనా సేవావకాశం పొందడం సాధ్యం కాకపోతే, అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎలా సంతోషంగా ఉండొచ్చు? దీనికి జవాబు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌లో వీటిని చర్చిస్తాం: (1) మీకు ఏది సంతోషాన్ని ఇస్తుంది? (2) మీ సంతోషాన్ని ఎలా పెంచుకోవచ్చు? (3) మీ సంతోషాన్ని పెంచే ఏ లక్ష్యాల్ని మీరు పెట్టుకోవచ్చు?

మీకు ఏది సంతోషాన్ని ఇస్తుంది?

5. మనం ఆనందంగా ఉండాలంటే దేని మీద దృష్టిపెట్టాలి? (ప్రసంగి 6:9)

5 మనం సంతోషంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుందో ప్రసంగి 6:9 వివరిస్తుంది. (చదవండి.) “కళ్లముందు ఉన్నవాటిని” ఆస్వాదించే వ్యక్తి తనకున్న వాటితో అంటే తన ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి సంతృప్తిగా ఉంటాడు. కానీ కోరికల వెంట పరుగెత్తే వ్యక్తి తాను పొందలేని వాటిని కోరుకుంటూ అసంతృప్తిగా ఉంటాడు. దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం సంతోషంగా ఉండాలంటే మన దగ్గరున్నవాటి మీద, అలాగే మనం చేరుకోగల లక్ష్యాల మీద దృష్టిపెట్టాలి.

6. మనమిప్పుడు ఏ ఉదాహరణ పరిశీలిస్తాం? దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?

6 కొత్తవాటిని నేర్చుకుంటూ ఉండడం మనకు ఇష్టం కాబట్టి మన దగ్గర ఇప్పటికే ఉన్నవాటితో సంతృప్తిగా ఉండడం సాధ్యంకాదని చాలామంది అనుకుంటారు. కానీ, అలా ఉండడం సాధ్యమే. మన దగ్గర ఇప్పటికే ఉన్నవాటిని బట్టి మనం నిజంగా సంతోషంగా ఉండగలం. అదెలాగో తెలుసుకోవడానికి మత్తయి 25:14-30 లో ఉన్న తలాంతుల ఉదాహరణను పరిశీలిద్దాం. మనం సంతోషాన్ని ఎలా పొందవచ్చో, మన దగ్గరున్న వాటిని బట్టి మన సంతోషాన్ని ఎలా పెంచుకోవచ్చో ఆ ఉదాహరణ నుండి నేర్చుకుంటాం.

మీ సంతోషాన్ని ఎలా పెంచుకోవచ్చు?

7. యేసు చెప్పిన తలాంతుల ఉదాహరణను క్లుప్తంగా చెప్పండి.

7 ఆ ఉదాహరణలో ఒకతను దూర దేశానికి వెళ్తూ తన దాసుల్ని పిలిచి, వాళ్లలో ప్రతీఒక్కరికి వ్యాపారం చేయడానికి తలాంతులు ఇచ్చాడు. * అతను వాళ్లవాళ్ల సామర్థ్యానికి తగ్గట్టుగా మొదటి దాసునికి ఐదు తలాంతులు, రెండో దాసునికి రెండు తలాంతులు, మూడో దాసునికి ఒక తలాంతు ఇచ్చాడు. ఇద్దరు దాసులు వాళ్లకు ఇచ్చిన తలాంతులతో ఇంకా ఎక్కువ డబ్బును సంపాదించడానికి కష్టపడి పనిచేశారు. మూడో దాసుడు తనకిచ్చిన తలాంతుతో ఏమీ చేయలేదు కాబట్టి యజమాని అతన్ని పనిలో నుండి తీసేశాడు.

8. ఉదాహరణలోని మొదటి దాసుడు ఎందుకు సంతోషించి ఉండవచ్చు?

8 యజమాని తనకు ఐదు తలాంతులు ఇచ్చినందుకు మొదటి దాసుడు చాలా సంతోషించి ఉంటాడు. అది నిజంగా చాలా ఎక్కువ డబ్బు. అలాగే అతని మీద యజమానికి ఎంత నమ్మకం ఉందో అది చూపిస్తుంది. మరి రెండో దాసుని సంగతేంటి? మొదటి దాసునికి ఇచ్చినన్ని తలాంతులు తనకు ఇవ్వలేదని రెండో దాసుడు నిరుత్సాహపడే అవకాశం ఉంది. ఇంతకీ అతనెలా స్పందించాడు?

యేసు చెప్పిన ఉదాహరణలో రెండో దాసుడి నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? (1) ఒక దాసునికి తన యజమాని రెండు సంచుల డబ్బులు ఇచ్చాడు. (2) ఆ దాసుడు వ్యాపారులకు శ్రేష్ఠమైన బట్టల్ని అమ్ముతున్నాడు. (3) ఆ దాసుడు తన యజమాని దగ్గరికి నాలుగు సంచుల డబ్బు తీసుకొచ్చాడు. (9-11 పేరాలు చూడండి)

9. రెండో దాసుడి గురించి యేసు ఏం చెప్పలేదు? (మత్తయి 25:22, 23)

9 మత్తయి 25:22, 23 చదవండి. యజమాని తనకు రెండు తలాంతులే ఇచ్చినందుకు రెండో దాసుడు నిరుత్సాహపడ్డాడని, కోప్పడ్డాడని యేసు చెప్పలేదు. అంతేకాదు ఆ దాసుడు, ‘నా యజమాని నాకెందుకు తక్కువ తలాంతులు ఇచ్చాడు? ఐదు తలాంతులు పొందిన దాసుడిలాగే నేను కూడా కష్టపడుతున్నాను కదా! నేను మంచి పనివాడినని నా యజమాని అనుకోకపోతే ఈ డబ్బును భూమిలో దాచిపెట్టి, ఆయన కోసం కాకుండా నాకోసం పని చేసుకుంటాను’ అని అతను ఫిర్యాదు చేసినట్టు యేసు చెప్పలేదు.

10. రెండో దాసుడు తనకిచ్చిన తలాంతులతో ఏం చేశాడు?

10 మొదటి దాసునిలాగే రెండో దాసుడు కూడా యజమాని తనకు ఇచ్చిన పనిని ప్రాముఖ్యంగా ఎంచి, ఆయన కోసం కష్టపడి పని చేశాడు. అలా యజమాని ఇచ్చిన రెండు తలాంతులతో మరో రెండు తలాంతుల్ని సంపాదించాడు. తన కష్టానికి యజమాని అతనికి గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు. యజమాని అతన్ని చూసి సంతోషించడంతో పాటు మరిన్ని బాధ్యతల్ని ఇచ్చాడు.

11. మన సంతోషాన్ని ఎలా పెంచుకోవచ్చు?

11 అదేవిధంగా, యెహోవా సేవలో మనకిచ్చే ఏ పనినైనా కష్టపడి చేసినప్పుడు ఎక్కువ సంతోషాన్ని పొందగలం. ప్రకటనాపని ఎక్కువగా చేయండి. అలాగే సంఘ పనుల్ని కష్టపడి చేయండి. (అపొ. 18:5; హెబ్రీ. 10:24, 25) ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలు చేయగలిగేలా కూటాలకు సిద్ధపడి వెళ్లండి. వారం మధ్యలో జరిగే కూటంలో మీకు ఏదైనా విద్యార్థి నియామకం ఇస్తే దాన్ని తేలికగా తీసుకోకండి. ఏదైనా సంఘపనిలో మిమ్మల్ని సహాయం చేయమని అడిగితే దాన్ని నమ్మకంగా, సమయానికి చేయండి. మీకేదైనా పని చేయమని చెప్తే అది ప్రాముఖ్యం కాదని, దాన్ని చేయడం వల్ల మీ సమయం వృథా అవుతుందని అనుకోకండి. మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి కృషి చేయండి. (సామె. 22:29) మీరు యెహోవా కోసం కష్టపడి పని చేస్తే ఆయనకు మంచి స్నేహితులౌతారు అలాగే చాలా సంతోషంగా ఉంటారు. (గల. 6:4) అంతేకాదు మీరు కోరుకున్న సేవావకాశాలు ఇతరులు పొందినా, వాళ్లను చూసి సంతోషించగల్గుతారు.—రోమా. 12:15; గల. 5:26.

12. మరింత సంతోషం పొందడానికి మెలిసాకు, నిక్‌కు ఏది సహాయం చేసింది?

12 బెతెల్‌ లేదా రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనుకున్న మెలిసా మీకు గుర్తుందా? అలా వెళ్లడం ఆమెకు సాధ్యం కాకపోయినా ఆమె ఇలా అంటుంది, “నేను పయినీరు సేవలో చేయగలిగినదంతా చేస్తున్నాను, అలాగే ప్రకటనాపనిని వేర్వేరు పద్ధతుల్లో చేయడానికి ప్రయత్నిస్తాను. అలా చేయడం వల్ల నేను ఎంతో సంతోషాన్ని పొందాను.” తనను సంఘ పరిచారకునిగా నియమించనందుకు వచ్చిన నిరుత్సాహాన్ని అధిగమించడానికి నిక్‌కు ఏది సహాయం చేసింది? ఆయనిలా అంటున్నాడు, “నేను చేయగలిగేవాటి మీద అంటే పరిచర్య మీద, కూటాల్లో ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలు ఇవ్వడం మీద దృష్టిపెట్టాను. అలాగే బెతెల్‌ సేవ కోసం అప్లికేషన్‌ పెట్టాను, ఆ తర్వాతి సంవత్సరమే నన్ను బెతెల్‌కు ఆహ్వానించారు.”

13. మీరు ప్రస్తుత నియామకంలో చేయగలిగినదంతా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? (ప్రసంగి 2:24)

13 మీరు ప్రస్తుత నియామకంలో చేయగలిగినదంతా చేస్తే భవిష్యత్తులో మరిన్ని బాధ్యతల్ని పొందుతారా? నిక్‌లాగే బహుశా మీరు కూడా పొందవచ్చు. ఒకవేళ పొందకపోయినా మెలిసాలాగే మీ సంతోషం ఎక్కువౌతుంది. అలాగే యెహోవా కోసం మీరు చేయగలిగింది చేస్తున్నందుకు మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది. (ప్రసంగి 2:24 చదవండి.) అంతేకాదు, మన యజమాని అయిన యేసుక్రీస్తును సంతోషపెడుతున్నారని మీకు తెలుసు కాబట్టి మీరు మరింత ఆనందాన్ని పొందుతారు.

మీ సంతోషాన్ని పెంచే లక్ష్యాలు

14. యెహోవా సేవలో లక్ష్యాలు పెట్టుకుంటున్నప్పుడు మనమేం గుర్తుంచుకోవాలి?

14 మీరు ఇప్పటికే యెహోవా సేవలో చేయగలిగింది చేస్తుంటే, ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నించకూడదని దానర్థమా? ఏమాత్రం కాదు! మనం మంచి ప్రచారకులుగా, బోధకులుగా తయారవ్వడానికి అలాగే మన సహోదరసహోదరీలకు ఎక్కువ సహాయం చేయడానికి లక్ష్యాలు పెట్టుకోవాలి. మనం తెలివిని, అణకువను చూపిస్తూ మన మీద కాకుండా ఇతరులకు సహాయం చేయడం మీద మనసుపెడితే ఆ లక్ష్యాల్ని చేరుకుంటాం.—సామె. 11:2; అపొ. 20:35.

15. మీ సంతోషాన్ని పెంచుకోవడానికి ఏ లక్ష్యాలు సహాయం చేయగలవు?

15 మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు? మీరు చేరుకోగల లక్ష్యాలను గుర్తించడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. (సామె. 16:3; యాకో. 1:5) ఈ ఆర్టికల్‌  మొదటి పేరాలో ప్రస్తావించిన లక్ష్యాల్లో ఒకదాన్ని చేరుకోవడానికి ప్రయత్నించగలరా? ఉదాహరణకు సహాయ పయినీరు సేవ లేదా క్రమపయినీరు సేవ చేయగలరా? బెతెల్‌ సేవ చేయగలరా లేదా సంస్థ చేసే నిర్మాణ పనుల్లో సహాయం చేయగలరా? మీరు కొత్త భాష నేర్చుకోగలరా లేదా వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజలకు ప్రకటించగలరా? ఈ లక్ష్యాల్లో కొన్నిటి గురించి మరింత తెలుసుకోవడానికి యెహోవా చిత్తం చేస్తున్న సంస్థ పుస్తకంలో 10వ పాఠాన్ని చూడవచ్చు; అలాగే మీ సంఘంలోని పెద్దలతో మాట్లాడవచ్చు. * ఆ లక్ష్యాల్ని సాధించడానికి ప్రయత్నించినప్పుడు మీరు ప్రగతి సాధిస్తున్నారని ఇతరులకు కనబడుతుంది. అలాగే మీ సంతోషం పెరుగుతుంది.

16. మీరొక లక్ష్యాన్ని చేరుకోలేకపోతే అప్పుడేం చేయవచ్చు?

16 ఈ ఆర్టికల్‌లో చర్చించిన లక్ష్యాల్ని ప్రస్తుతం మీరు చేరుకోలేకపోతే అప్పుడేంటి? మీరు చేరుకోగల మరో లక్ష్యాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. దానికోసం వీటిని పరిశీలించండి.

మీరు చేరుకోగల ఒక లక్ష్యం ఏంటి? (17వ పేరా చూడండి) *

17. మొదటి తిమోతి 4:13, 15 ప్రకారం, ఒక సహోదరుడు బోధించే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏం చేయవచ్చు?

17 మొదటి తిమోతి 4:13, 15 చదవండి. మీరు ఒక బాప్తిస్మం తీసుకున్న సహోదరుడైతే మంచి ప్రసంగీకునిగా, బోధకుడిగా అవ్వడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే మీరు బాగా చదివేలా, ప్రసంగించేలా, బోధించేలా కృషి చేస్తే వినేవాళ్లకు మరింత సహాయం చేయగల్గుతారు. చక్కగా చదువుదాం, బోధిద్దాం బ్రోషుర్‌లో చర్చించిన ప్రతీ ప్రసంగ లక్షణాన్ని లోతుగా తెలుసుకొని, దాన్ని పాటించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కో ప్రసంగ లక్షణం గురించి పూర్తిగా తెలుసుకోండి, ఇంటిదగ్గర బాగా ప్రాక్టీస్‌ చేయండి, మీ ప్రసంగంలో దాన్ని పాటించడానికి ప్రయత్నించండి. “మాట్లాడే విషయంలో, బోధించే విషయంలో కష్టపడి” పనిచేస్తున్న సహాయక సలహాదారున్ని లేదా ఇతర పెద్దలను సలహా అడగండి. * (1 తిమో. 5:17) ఒక ప్రసంగ లక్షణాన్ని ఎలా పాటించాలనే దానిమీదే కాకుండా, వేరేవాళ్ల విశ్వాసాన్ని బలపర్చేలా లేదా నేర్చుకున్నవాటి ప్రకారం జీవించేలా ప్రోత్సహించడం మీద కూడా దృష్టిపెట్టాలి. అలా చేయడం వల్ల మీ సంతోషం, వినేవాళ్ల సంతోషం పెరుగుతుంది.

మీరు చేరుకోగల ఒక లక్ష్యం ఏంటి? (18వ పేరా చూడండి) *

18. పరిచర్యకు సంబంధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

18 మనందరికీ ప్రకటించే, శిష్యుల్ని చేసే నియామకం ఉంది. (మత్త. 28:19, 20; రోమా. 10:14) ఈ ప్రాముఖ్యమైన పనిలో మీ నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నారా? బోధిద్దాం బ్రోషుర్‌లో ఉన్నవాటిని లోతుగా తెలుసుకొని, నేర్చుకున్నవాటిని పాటించడానికి సహాయపడగల లక్ష్యాన్ని పెట్టుకోండి. వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో చర్చించే మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్కబుక్‌ నుండి అలాగే అందులో చూపించే “ఇలా మాట్లాడవచ్చు” వీడియోల నుండి ఇంకొన్ని సలహాలు పొందవచ్చు. మీ క్షేత్రంలో ఏది బాగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి నేర్చుకున్న అందింపుల్ని ప్రయత్నించండి. మీరు ఈ సలహాల్ని పాటించినప్పుడు మంచి ప్రచారకులుగా, బోధకులుగా తయారౌతారు అలాగే ఎక్కువ సంతోషాన్ని పొందుతారు.—2 తిమో. 4:5.

మీరు చేరుకోగల ఒక లక్ష్యం ఏంటి? (19వ పేరా చూడండి) *

19. దేవున్ని సంతోషపెట్టే లక్షణాల్ని మీరెలా వృద్ధి చేసుకోవచ్చు?

19 మీరు పెట్టుకోగల లక్ష్యాల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఒక లక్ష్యం, దేవున్ని సంతోషపెట్టే లక్షణాల్ని వృద్ధి చేసుకోవడం. (గల. 5:22, 23; కొలొ. 3:12; 2 పేతు. 1:5-8) ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీరేం చేయవచ్చు? ఉదాహరణకు, మీరు బలమైన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నారు. దాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే సలహాలున్న ఆర్టికల్స్‌ని మన ప్రచురణల్లో చదవొచ్చు. వేర్వేరు పరీక్షల్ని ఎదుర్కొంటున్నప్పుడు, మన సహోదరసహోదరీలు అసాధారణ విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నారో తెలియజేసే JW బ్రాడ్‌కాస్టింగ్‌ వీడియోలను చూడడం ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు. ఆ తర్వాత, వాళ్లలాంటి విశ్వాసాన్ని మీ జీవితంలో ఏయే విధాలుగా చూపించవచ్చో ఆలోచించండి.

20. సంతోషాన్ని పెంచుకోవడానికి, నిరుత్సాహాన్ని తగ్గించుకోవడానికి మనమేం చేయవచ్చు?

20 ప్రస్తుతం చేస్తున్న దానికన్నా, యెహోవా సేవను ఇంకా ఎక్కువ చేయాలని మనందరం ఖచ్చితంగా కోరుకుంటాం. మనం ఆయన సేవను కొత్త లోకంలో పూర్తిస్థాయిలో చేయగలం. అప్పటివరకు మనం చేయగలిగినదంతా చేయడం ద్వారా మన సంతోషాన్ని పెంచుకోవచ్చు, నిరుత్సాహాన్ని తగ్గించుకోవచ్చు. దానికన్నా ముఖ్యంగా మన ‘సంతోషంగల దేవుడైన’ యెహోవాకు ఘనతను, స్తుతిని తీసుకొస్తాం. (1 తిమో. 1:11) కాబట్టి యెహోవా కోసం మనం చేస్తున్న దాన్నిబట్టి ఆనందిద్దాం!

పాట 82 “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”

^ పేరా 5 మనం యెహోవాను ఎంతో ప్రేమిస్తాం. కాబట్టి ఆయన సేవలో చేయగలిగినదంతా చేయాలని కోరుకుంటాం. అందుకే మనలో చాలామంది ప్రకటనాపని చేయాలని కోరుకుంటాం లేదా సంఘంలో మరిన్ని సేవావకాశాల కోసం అర్హతలు సాధించడానికి కృషి చేయాలనుకుంటాం. కానీ, మనం ఎంత ప్రయత్నించినా కొన్ని లక్ష్యాల్ని చేరుకోకపోతే అప్పుడేంటి? యెహోవా సేవలో బిజీగా ఉండడానికి, అలాగే మన ఆనందాన్ని కాపాడుకోవడానికి మనకేది సహాయం చేయగలదు? యేసు చెప్పిన తలాంతుల ఉదాహరణలో దానికి జవాబు తెలుసుకుంటాం.

^ పేరా 2 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 7 పదాల వివరణ: ఒక తలాంతు అంటే దాదాపు 20 ఏళ్లు పనిచేస్తే వచ్చే కూలి.

^ పేరా 15 బాప్తిస్మం తీసుకున్న సహోదరులు, సంఘ పరిచారకులుగా అలాగే పెద్దలుగా అయ్యేందుకు కష్టపడి పనిచేయాలని ప్రోత్సహించబడుతున్నారు. వాళ్లకు ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకోవడానికి యెహోవా చిత్తం చేస్తున్న సంస్థ పుస్తకంలో 5, 6 అధ్యాయాలు చూడండి.

^ పేరా 17 పదాల వివరణ: సాధారణంగా ఒక పెద్దను సహాయక సలహాదారునిగా నియమిస్తారు. సంఘంలో ప్రసంగాలు ఇవ్వడం, కూటాలను నిర్వహించడం, కూటాల్లో పేరాలను చదవడం ఇంకా బాగా ఎలా చేయవచ్చో పెద్దలకు అలాగే సంఘ పరిచారకులకు ఆయన విడిగా సలహా ఇస్తాడు.

^ పేరా 64 చిత్రాల వివరణ: మంచి బోధకుడిగా అవ్వాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక సహోదరుడు మన ప్రచురణలో పరిశోధన చేస్తున్నాడు.

^ పేరా 66 చిత్రాల వివరణ: అనియత సాక్ష్యం ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకున్న ఒక సహోదరి, హోటల్‌లో పని చేస్తున్న ఒకావిడకు కాంటాక్ట్‌ కార్డు ఇస్తుంది.

^ పేరా 68 చిత్రాల వివరణ: దేవున్ని సంతోషపెట్టే లక్షణాల్ని వృద్ధి చేసుకోవాలనే కోరికతో, ఒక సహోదరి మరో సహోదరికి ఆహారం ఇవ్వడం ద్వారా ఉదారతను చూపిస్తుంది.