కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 34

యెహోవా మంచితనాన్ని మీరెలా రుచి చూడవచ్చు?

యెహోవా మంచితనాన్ని మీరెలా రుచి చూడవచ్చు?

“యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి; ఆయన్ని ఆశ్రయించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”—కీర్త. 34:8.

పాట 117 మంచితనం అనే లక్షణం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. కీర్తన 34:8 ప్రకారం, యెహోవా మంచివాడని మనం ఎలా తెలుసుకోవచ్చు?

మీరెప్పుడూ రుచిచూడని ఒక వంటకాన్ని మీకెవరైనా పెట్టారనుకోండి. మీరు దాన్ని చూడడం ద్వారా, వాసన పీల్చడం ద్వారా లేదా అది ఎలా తయారు చేస్తారో, అది ఇతరులకు నచ్చిందో లేదో అడగడం ద్వారా ఆ వంటకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అయితే మీకు అది నచ్చుతుందో లేదో తెలియాలంటే మీరు దాన్ని రుచి చూడాల్సిందే.

2 బైబిల్ని, మన ప్రచురణల్ని చదవడం ద్వారా, యెహోవా నుండి తాము పొందిన ఆశీర్వాదాల గురించి ఇతరులు చెప్పినప్పుడు వినడం ద్వారా యెహోవా మంచివాడని మనం తెలుసుకోవచ్చు. మనమే స్వయంగా యెహోవా మంచితనాన్ని ‘రుచిచూస్తే,’ ఆయన ఎంత మంచివాడో నిజంగా అర్థంచేసుకుంటాం. (కీర్తన 34:8 చదవండి.) ఈ ఉదాహరణ పరిశీలించండి. బహుశా మనకు పూర్తికాల సేవ చేయాలనే కోరిక ఉండొచ్చు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మన జీవితాన్ని సరళం చేసుకోవాలి. దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇస్తే, యెహోవా మన అవసరాలను తీరుస్తాడని యేసు చేసిన వాగ్దానాన్ని చాలాసార్లు చదివుంటాం. కానీ మనం ఎప్పుడూ దాన్ని స్వయంగా అనుభవించి ఉండకపోవచ్చు. (మత్త. 6:33) అయినప్పటికీ యేసు చేసిన వాగ్దానం మీద విశ్వాసంతో మనం ఖర్చుల్ని తగ్గించుకుంటాం, మన ఉద్యోగంలో సర్దుబాట్లు చేసుకుంటాం, అలాగే పరిచర్యలో చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నిస్తాం. అలా చేసినప్పుడు యెహోవా నిజంగా మన అవసరాల్ని తీర్చడం స్వయంగా చూస్తాం. అప్పుడు యెహోవా మంచివాడని మనం “రుచిచూసి” తెలుసుకుంటాం.

3. కీర్తన 16:1, 2 ప్రకారం, యెహోవా ఇచ్చే మంచివాటిని ఎవరు పొందుతారు?

3 యెహోవా తన గురించి తెలియనివాళ్లతో సహా “అందరికీ మంచి చేస్తాడు.” (కీర్త. 145:9; మత్త. 5:45) కానీ ముఖ్యంగా యెహోవాను ప్రేమించి, ఆయన సేవలో చేయగలిగినదంతా చేసేవాళ్లు ఆయనిచ్చే ఎన్నో ఆశీర్వాదాల్ని పొందుతారు. (కీర్తన 16:1, 2 చదవండి.) మన కోసం యెహోవా చేసిన మంచివాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

4. తనకు దగ్గరవ్వడానికి ప్రయత్నించేవాళ్లు యెహోవా ఇచ్చే మంచివాటిని ఎలా పొందుతారు?

4 యెహోవా నుండి మనం నేర్చుకున్నవాటిని పాటించిన ప్రతీసారి, అవి మన జీవితంలో మనకెలా సహాయం చేస్తాయో చూస్తాం. ఉదాహరణకు, మనం యెహోవా గురించి బాగా తెలుసుకుని ఆయనను ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు, ఆయనకు నచ్చనివాటిని ఆలోచించకుండా, చేయకుండా ఉండడానికి మనకు సహాయం చేశాడు. (కొలొ. 1:21) అలాగే మనం యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఇంకా మంచివాటిని అంటే మంచి మనస్సాక్షిని, ఆయనతో దగ్గరి సంబంధాన్ని ఇచ్చాడు.—1 పేతు. 3:21.

5. మనం పరిచర్య చేస్తున్నప్పుడు యెహోవా మంచితనాన్ని ఏయే విధాలుగా చూస్తాం?

5 మనం పరిచర్య చేస్తున్నప్పుడు కూడా యెహోవా మంచితనాన్ని చూస్తాం. మీకు ఇతరులతో మాట్లాడడమంటే భయమా? యెహోవాసాక్షుల్లో చాలామందికి అలా అనిపిస్తుంది. బహుశా మీరొక యెహోవాసాక్షి అవ్వకముందు, మీకు అస్సలు తెలియనివాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లతో బైబిలు గురించి మాట్లాడతారని మీరెప్పుడూ అనుకొని ఉండరు. అయినా ఇప్పుడు దాన్ని తరచుగా చేస్తున్నారు. అలాగే ప్రకటనాపనిలో ఆనందించేలా కూడా యెహోవా మీకు సహాయం చేశాడు. అంతేకాదు ఇంకా ఎన్నో విధాలుగా ఆయన మీకు సహాయం చేశాడు. పరిచర్యలో మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు, మీరు ప్రశాంతంగా ఉండడానికి ఆయన సహాయం చేశాడు. ఇంటివ్యక్తి ఆసక్తి చూపిస్తే, వాళ్లకు సరిపోయే లేఖనాన్ని చూపించడానికి కూడా ఆయన మీకు సహాయం చేశాడు. అలాగే ప్రజలు మనం చెప్పేది వినకపోయినా పరిచర్యలో కొనసాగేలా ఆయన మీకు బలాన్ని ఇచ్చాడు.—యిర్మీ. 20:7-9.

6. పరిచర్యకు సంబంధించి యెహోవా మనకిస్తున్న శిక్షణ ఆయన మంచితనాన్ని ఎలా రుజువు చేస్తుంది?

6 పరిచర్య చేయడానికి మనకు శిక్షణ ఇవ్వడం ద్వారా కూడా యెహోవా తన మంచితనాన్ని చూపిస్తున్నాడు. (యోహా. 6:45) వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో “ఇలా మాట్లాడవచ్చు” వీడియోలు చూస్తాం. వాటిలో నేర్చుకున్నవాటిని మన పరిచర్యలో ఉపయోగించవచ్చు. పరిచర్యలో వేర్వేరు విధాలుగా మాట్లాడడం మొదట్లో కాస్త కంగారుగా అనిపించినా, అలా చేస్తే మంచి ఫలితాలు రావడాన్ని మనం చూస్తాం. మనం ఇంతకుముందు ఎప్పుడూ ప్రయత్నించని పద్ధతుల్లో పరిచర్య చేయమని, కూటాల్లో సమావేశాల్లో ప్రోత్సహించబడుతున్నాం. అలా చేయడం కూడా మనకు కంగారుగా అనిపించొచ్చు. కానీ వీటిని చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నా, యెహోవా మీద నమ్మకంతో కొత్త పద్ధతుల్లో ప్రకటించడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల్ని పొందుతాం. వాటిలో కొన్నిటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అయితే మన పరిచర్యను ఇంకా ఎక్కువ ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.

తనపై నమ్మకం ఉంచేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు

7. పరిచర్యను ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏ ఆశీర్వాదాన్ని పొందుతాం?

7 మనం యెహోవాకు మరింత దగ్గరౌతాం. తన భార్యతోపాటు కొలంబియాలో సేవ చేస్తున్న సామ్యూల్‌ * అనే సంఘపెద్ద ఉదాహరణ పరిశీలించండి. ఈ జంట తమ సంఘంలో పయినీరుసేవ చేస్తూ ఆనందించేవాళ్లు. కానీ అవసరం ఎక్కువున్న మరో సంఘానికి వెళ్లి పరిచర్యను ఎక్కువగా చేయాలని కోరుకున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్లు కొన్ని త్యాగాలు చేయాల్సివచ్చింది. సామ్యూల్‌ ఇలా చెప్తున్నాడు, “మేము మత్తయి 6:33 లోని మాటల్ని పాటిస్తూ, మాకు అవసరంలేని వాటిని కొనడం ఆపేశాం. కానీ మా అపార్ట్‌మెంట్‌ని వదిలి వెళ్లడం అన్నిటికన్నా కష్టమైంది. దాన్ని మా ఇష్టానికి తగ్గట్టు కట్టారు. అలాగే దానిమీద లోన్‌ కూడా తీరిపోయింది.” వాళ్లు కొత్త సంఘానికి వెళ్లినప్పుడు చాలా తక్కువ డబ్బుతో జీవించగలిగారు. సామ్యూల్‌ ఇంకా ఇలా చెప్తున్నాడు, “యెహోవా మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడో, మా ప్రార్థనలకు ఎలా జవాబిస్తున్నాడో మేము చూశాం. ఆయన అంగీకారాన్ని, ప్రేమను ముందెన్నడూ చూడని విధానాల్లో మేము రుచిచూశాం.” వేర్వేరు విధానాల్లో మీ పరిచర్యను ఎక్కువగా చేయగలరా? అలా చేస్తే మీరు యెహోవాకు దగ్గరౌతారనే, ఆయన మీకు కావాల్సినవి ఇస్తాడనే నమ్మకంతో ఉండొచ్చు.—కీర్త. 18:25.

8. ఇవాన్‌, విక్టోరియా అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

8 మన సేవలో ఆనందాన్ని పొందుతాం. కిర్గిజ్‌స్థాన్‌లో పయినీర్లుగా సేవచేస్తున్న ఇవాన్‌, విక్టోరియా అనే జంట అనుభవాన్ని గమనించండి. నిర్మాణ ప్రాజెక్ట్‌లతో సహా ఏ నియామకంలోనైనా సేవ చేయడానికి అనుకూలంగా వాళ్ల జీవితాన్ని సరళం చేసుకున్నారు. ఇవాన్‌ ఇలా చెప్తున్నాడు, “మాకిచ్చిన ప్రతీ నియామకంలో మేము కష్టపడి పనిచేశాం. ప్రతీరోజు పని పూర్తయ్యేసరికి బాగా అలసిపోయినా, యెహోవా కోసం మా శక్తిని ఉపయోగించినందుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా అనిపిస్తుంది. కొత్త స్నేహితుల్ని, తీపి జ్ఞాపకాల్ని సంపాదించుకున్నందుకు కూడా సంతోషంగా అనిపించింది.”—మార్కు 10:29, 30.

9. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఒక సహోదరి ఎక్కువ పరిచర్య ఎలా చేయగలిగింది? దాని ఫలితమేంటి?

9 మన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా యెహోవా సేవలో ఆనందాన్ని పొందవచ్చు. పశ్చిమ ఆఫ్రికాలో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మీరే అనే వయసుపైబడిన సహోదరి అనుభవాన్ని గమనించండి. ఆమె డాక్టర్‌గా పనిచేసి, రిటైరైన తర్వాత పయినీరు సేవ మొదలుపెట్టింది. ఆమెకు తీవ్రమైన కీళ్ల సమస్య (ఆర్థరైటిస్‌) ఉండడం వల్ల నడవడం కూడా కష్టమయ్యేది. అందుకే ఇంటింటి పరిచర్యలో ఆమె ఒక గంటకన్నా ఎక్కువ చేయలేకపోయేది. కానీ ఆమె కార్ట్‌ లేదా టేబుల్‌ ద్వారా ఎక్కువసేపు సాక్ష్యం ఇవ్వగలిగేది. ఆమెకు చాలా పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఆమె ఫోన్‌ ద్వారా చేస్తుంది. సహోదరి మీరేకు యెహోవా సేవ ఎందుకు ఎక్కువ చేయాలనిపించింది? ఆమె ఇలా చెప్తుంది, “యెహోవాపై, యేసుపై ప్రేమతో నా హృదయం నిండిపోయింది. అలాగే ఆయన సేవను వీలైనంత ఎక్కువ చేయడానికి సహాయం చేయమని యెహోవాకు తరచూ ప్రార్థిస్తాను.”—మత్త. 22:36, 37.

10. మొదటి పేతురు 5:10 చెప్తున్నట్లు, ఎక్కువ సేవ చేసేవాళ్లు దేన్ని పొందుతారు?

10 యెహోవా నుండి ఇంకా ఎక్కువ శిక్షణ పొందుతాం. మారిషస్‌లో పయినీరుగా సేవ చేస్తున్న కెన్నీ విషయంలో ఇది నిజమైంది. ఆయన సత్యం నేర్చుకున్నాక యూనివర్సిటీ విద్యను వదిలిపెట్టి, బాప్తిస్మం తీసుకొని, ఆ తర్వాత పూర్తికాల సేవలోకి అడుగుపెట్టాడు. “‘నేనున్నాను! నన్ను పంపు!’ అని చెప్పిన యెషయా ప్రవక్త మాటల ప్రకారం జీవించడానికి నేను ప్రయత్నిస్తున్నాను” అని ఆయన అన్నాడు. (యెష. 6:8) కెన్నీ చాలా నిర్మాణ ప్రాజెక్టుల్లో పని చేశాడు. అలాగే తన సొంత భాషలో మన ప్రచురణల్ని అనువదించడానికి సహాయం చేశాడు. కెన్నీ ఇలా అంటున్నాడు, “నా నియామకాల్ని చేయడానికి అవసరమయ్యే నైపుణ్యాల్ని నాకిచ్చిన శిక్షణలో నేర్చుకున్నాను.” అయితే ఆయన కేవలం పని గురించే కాకుండా ఇంకా ఎక్కువ నేర్చుకున్నాడు. ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు, “నేను నా పరిమితుల గురించి నేర్చుకున్నాను. అలాగే ఒక మంచి యెహోవా సేవకునిగా అవ్వడానికి వృద్ధి చేసుకోవాల్సిన లక్షణాల గురించి నేర్చుకున్నాను.” (1 పేతురు 5:10 చదవండి.) బహుశా మీరు కూడా సర్దుబాట్లు చేసుకుంటే యెహోవా వేర్వేరు విధాలుగా ఇచ్చే శిక్షణ పొందవచ్చు.

ఒక జంట అవసరం ఎక్కువున్న ప్రాంతంలో ప్రకటిస్తున్నారు; ఒక యౌవన సహోదరి రాజ్యమందిరాన్ని నిర్మించే పనిలో సహాయం చేస్తుంది; ఒక వృద్ధ జంట టెలిఫోన్‌ సాక్ష్యం చేస్తున్నారు. వాళ్లందరూ తాము చేస్తున్న సేవను బట్టి ఆనందిస్తున్నారు (11వ పేరా చూడండి)

11. దక్షిణ కొరియాలోని ముగ్గురు సహోదరీలు పరిచర్యలో పాల్గొనడానికి ఎలాంటి కృషి చేశారు? దానివల్ల వచ్చిన ఫలితమేంటి? (ముఖచిత్రం చూడండి.)

11 ఎన్నో సంవత్సరాలుగా దేవున్ని సేవిస్తున్నవాళ్లకు కూడా కొత్త పద్ధతిలో సేవ చేయాలంటే శిక్షణ అవసరం. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో దక్షిణ కొరియాలోని ఒక సంఘంలో ఉన్న పెద్దలు ఇలా రాశారు, “ఒకప్పుడు ఆనారోగ్యం కారణంగా పరిచర్య చేయలేమని అనుకున్న కొందరు, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా దాన్ని చేస్తున్నారు. 80 కన్నా ఎక్కువ సంవత్సరాలున్న ముగ్గురు సహోదరీలు కంప్యూటర్‌ని ఎలా వాడాలో నేర్చుకొని ఇప్పుడు దాదాపు ప్రతీరోజు పరిచర్య చేస్తున్నారు.” (కీర్త. 92:14, 15) మీ పరిచర్యను విస్తృతం చేసుకుంటూ యెహోవా మంచివాడని ఇంకా ఎక్కువగా రుచి చూడాలనుకుంటున్నారా? అలా చేయడానికి మీకు సహాయపడే కొన్ని విషయాల్ని ఇప్పుడు చూద్దాం.

మీరేమి చేయవచ్చు?

12. తన మీద నమ్మకం ఉంచేవాళ్లకు యెహోవా ఏమని మాటిస్తున్నాడు?

12 యెహోవా మీద ఆధారపడడం నేర్చుకోండి. మనం ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన కోసం చేయగలిగినదంతా చేసినప్పుడు ఎన్నో ఆశీర్వాదాల్ని ఇస్తానని మనకు మాటిస్తున్నాడు. (మలా. 3:10) కొలంబియాలో ఉంటున్న ఫ్యాబీయోల అనే సహోదరి జీవితంలో యెహోవా మాటిచ్చినట్లే జరిగింది. ఆమె బాప్తిస్మం తీసుకున్న వెంటనే క్రమపయినీరు సేవ మొదలు పెట్టాలనుకుంది. అయితే తన భర్తని, ముగ్గురు పిల్లల్ని పోషించడానికి ఆమె ఉద్యోగం చేయాల్సివచ్చింది. ఆమె రిటైర్‌ అయ్యే సమయం వచ్చినప్పుడు సహాయం కోసం యెహోవాకు పట్టుదలగా ప్రార్థించింది. ఆమె ఇలా అంటుంది, “సాధారణంగా పెన్షన్‌ రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ నాకు మాత్రం ఒక నెల తర్వాతనుండే అది రావడం మొదలైంది. అదొక అద్భుతంలా అనిపించింది.” ఆ తర్వాత రెండు నెలలకే ఆమె పయినీరు సేవ మొదలుపెట్టింది. ఆమెకిప్పుడు 70 ఏళ్లు దాటాయి. అలాగే 20 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా పయినీరు సేవ చేస్తుంది. ఆ సమయంతటిలో ఎనిమిదిమంది బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేసింది. ఆమె ఇంకా ఇలా అంటుంది, “నాకు కొన్నిసార్లు నీరసంగా అనిపించినా పయినీరు సేవ చేస్తూ ఉండేలా ప్రతీరోజు యెహోవా నాకు సహాయం చేస్తున్నాడు.”

అబ్రాహాము, శారా, యాకోబు అలాగే యొర్దాను నది దాటిన యాజకులు యెహోవా మీద నమ్మకాన్ని ఎలా చూపించారు? (13వ పేరా చూడండి)

13-14. యెహోవా మీద నమ్మకం ఉంచి, మన సేవను విస్తృతం చేసుకోవడానికి ఎవరి అనుభవాలు సహాయం చేయగలవు?

13 యెహోవా మీద నమ్మకం ఉంచినవాళ్ల ఉదాహరణల నుండి నేర్చుకోండి. యెహోవా సేవలో కష్టపడి పనిచేసిన ఎంతోమంది ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. చాలా సందర్భాల్లో తన సేవకులు తనమీద నమ్మకం చూపించిన తర్వాతే యెహోవా వాళ్లను ఆశీర్వదించాడు. ఉదాహరణకు, “తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా” అబ్రాహాము తన ఇల్లు వదిలివెళ్లాకే యెహోవా ఆయన్ని ఆశీర్వదించాడు. (హెబ్రీ. 11:8) యాకోబు దేవదూతతో కుస్తీపడిన తర్వాతే ఆశీర్వాదాన్ని పొందాడు. (ఆది. 32:24-30) ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తారు అనగా, ఉధృతంగా ప్రవహిస్తున్న యొర్దాను నదిలోకి యాజకులు తమ పాదాల్ని పెట్టిన తర్వాతే ఆ జనాంగం నదిని దాటగలిగింది.—యెహో. 3:14-16.

14 యెహోవా మీద నమ్మకం ఉంచుతూ తమ సేవను విస్తృతం చేసుకున్న ఆధునికకాల సాక్షుల అనుభవాల నుండి కూడా మీరు ప్రయోజనం పొందవచ్చు. సహోదరుడు పేటన్‌, ఆయన భార్య డయానా ఉదాహరణ గమనించండి. “తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు” * అనే ఆర్టికల్స్‌లో తమ సేవను విస్తృతం చేసుకున్న సహోదరసహోదరీల గురించి వాళ్లు ఆసక్తిగా చదివేవాళ్లు. పేటన్‌ ఇలా అంటున్నాడు, “ఆ అనుభవాల్ని చదువుతున్నప్పుడు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించేవాళ్లను చూస్తున్నట్లు మాకు అనిపించేది. వాళ్లను చూసేకొద్దీ, ‘యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోవాలని’ ఇంకా ఎక్కువగా అనిపించింది.” కొంతకాలానికి పేటన్‌, డయానా అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్లారు. jw.orgలో వచ్చిన మారుమూల ప్రాంతంలో సువార్త ప్రకటించడం—ఆస్ట్రేలియా (ఇంగ్లీష్‌), అవసరం ఎక్కువ ఉన్న చోటకు వెళ్లండి వీడియోలు చూశారా? మీ పరిచర్యను విస్తృతం చేసుకోవడానికి ఇందులోని సమాచారం మీకు సహాయపడుతుంది.

15. దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చేవాళ్లతో సహవసించడం వల్ల మనం ఎలాంటి ప్రయోజనం పొందుతాం?

15 దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చేవాళ్లతో సహవసించండి. మనం ఎప్పుడూ రుచిచూడని ఒక వంటకాన్ని, ఇతరులు తింటూ ఆస్వాదిస్తున్నప్పుడు మనం వాళ్ల పక్కనుంటే, మనక్కూడా దానిని తినాలనిపిస్తుంది. అదేవిధంగా, యెహోవా సేవకు తమ జీవితంలో మొదటిస్థానం ఇస్తున్నవాళ్లతో సహవసిస్తే మనక్కూడా మన సేవను విస్తృతం చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. కెంట్‌, వెరానికా దంపతులు అది నిజమని గుర్తించారు. కెంట్‌ ఇలా చెప్తున్నాడు, “మా కుటుంబ సభ్యులు, స్నేహితులు వేర్వేరు పద్ధతుల్లో పరిచర్య చేయమని మమ్మల్ని ప్రోత్సహించారు. దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చేవాళ్లతో సహవసించడం ద్వారా కొత్త పద్ధతుల్లో ప్రకటించడానికి కావాల్సిన ధైర్యాన్ని పొందామని మాకర్థమైంది.” ఇప్పుడు కెంట్‌, వెరానికా సెర్బియాలో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్నారు.

16. లూకా 12:16-21 లో యేసు చెప్పిన ఉదాహరణను బట్టి, మనం ఎందుకు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి?

16 యెహోవా కోసం త్యాగాలు చేయండి. యెహోవాను సంతోషపెట్టాలంటే మనం ఆనందించే వాటన్నిటినీ వదులుకోవాల్సిన అవసరం లేదు. (ప్రసం. 5:19, 20) మనమెక్కడ త్యాగాలు చేయాల్సివస్తుందో అని, దేవుని సేవ ఎక్కువ చేయడానికి వెనకాడుతుంటే యేసు చెప్పిన ఉదాహరణలోని వ్యక్తి చేసిన తప్పునే మనం చేసే అవకాశముంది. ఆ వ్యక్తి తనకోసం ఎన్నో మంచివాటిని సమకూర్చుకోవడానికి కష్టపడ్డాడు, కానీ దేవున్ని మాత్రం పట్టించుకోలేదు. (లూకా 12:16-21 చదవండి.) ఫ్రాన్స్‌లో ఉంటున్న క్రిస్టియాన్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “నేను యెహోవా కోసం, నా కుటుంబం కోసం ఇవ్వాల్సినంత సమయాన్ని, శక్తిని ఇవ్వలేదు.” క్రిస్టియాన్‌, ఆయన భార్య పయినీరు సేవ చేయాలనుకున్నారు. అయితే వాళ్లు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తమ ఉద్యోగాల్ని వదిలేయాల్సి వచ్చింది. తమను తాము పోషించుకోవడానికి, ఇళ్లను ఆఫీసులను శుభ్రం చేసే పనిని వాళ్లు మొదలుపెట్టారు. అలా చేయడం వల్ల వచ్చిన తక్కువ డబ్బుతోనే సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నారు. వాళ్లు చేసిన త్యాగాల వల్ల ప్రయోజనం పొందారా? క్రిస్టియాన్‌ ఇలా చెప్తున్నాడు, “మేమిప్పుడు పరిచర్యను ఇంకా ఎక్కువ అందిస్తున్నాం. అలాగే మా స్టడీవాళ్లు, రిటన్‌ విజిట్‌వాళ్లు యెహోవా గురించి నేర్చుకోవడం చూసి ఆనందిస్తున్నాం.”

17. కొత్త పద్ధతిలో పరిచర్య చేసేలా ఒక సహోదరికి ఏది సహాయం చేసింది?

17 వేర్వేరు పద్ధతుల్లో పరిచర్య చేయడానికి ప్రయత్నించండి. (అపొ. 17:16, 17; 20:20, 21) అమెరికాలో పయినీరుగా సేవ చేస్తున్న షర్లీ గురించి ఆలోచించండి. ఆమె కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో పరిచర్య చేసే పద్ధతిలో మార్పు చేసుకోవాల్సి వచ్చింది. ఆమె టెలిఫోన్‌ సాక్ష్యం చేయడానికి మొదట్లో కాస్త వెనకాడింది. ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనంలో టెలిఫోన్‌ సాక్ష్యం ఎలా చేయాలో ఆమె శిక్షణ పొందాక, ఆ పద్ధతిలో క్రమంగా పరిచర్య చేయడం మొదలుపెట్టింది. ఆమె ఇలా అంటుంది, “మొదట్లో నాకు భయంగా అనిపించింది. కానీ ఇప్పుడు అలా చేయడాన్ని చాలా ఆనందిస్తున్నాను. ఇంటింటి పరిచర్యలో కంటే ఈ పద్ధతిలోనే ఎక్కువమంది ప్రజల్ని కలవగల్గుతున్నాం.”

18. పరిచర్యను ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తుండగా మనకు ఎదురయ్యే సమస్యల్ని తట్టుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

18 ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. మనకు సమస్యలు వచ్చినప్పుడు సహాయం కోసం ప్రార్థిస్తాం, వాటి విషయంలో ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచిస్తాం. (సామె. 3:21) యూరోప్‌లో రోమానీ భాష గుంపుతో కలిసి క్రమపయినీరుగా సేవ చేస్తున్న సోనియా ఇలా అంటుంది, “నేను నా లక్ష్యాల్ని పేపర్‌ మీద రాసుకుని, దాన్ని కనపడేలా పెట్టుకుంటాను. నా టేబుల్‌ మీద వేర్వేరు దిక్కులకు వెళ్లే రెండు రోడ్డుల డ్రాయింగ్‌ ఉంటుంది. నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ డ్రాయింగ్‌ వైపు చూసి, నేను తీసుకునే నిర్ణయం నా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తుందో లేదోనని ఆలోచిస్తాను.” సోనియా తనకు ఎదురయ్యే సమస్యల గురించి సరైన విధంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఇలా అంటుంది, “నాకు ఎదురయ్యే ప్రతీ పరిస్థితి, నా ఆలోచనా విధానాన్ని బట్టి, నన్ను అడ్డుకునే ఒక గోడలా ఉండొచ్చు లేదా నాకు సహాయం చేసే ఒక బ్రిడ్జిలా ఉండొచ్చు.”

19. యెహోవా మనకు ఇచ్చిన ఆశీర్వాదాల పట్ల కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?

19 యెహోవా మనల్ని ఎన్నో రకాలుగా ఆశీర్వదిస్తాడు. యెహోవాకు స్తుతి తీసుకురావడానికి మనం చేయగలిగినదంతా చేయడం ద్వారా ఆయనిచ్చే ఆశీర్వాదాల పట్ల మనకెంత కృతజ్ఞత ఉందో చూపించవచ్చు. (హెబ్రీ. 13:15) మనం ఎన్నో విధాలుగా యెహోవా సేవ చేయడానికి ప్రయత్నించవచ్చు. అప్పుడు ఆయన మనల్ని ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడు. ‘యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోవడానికి’ ప్రతీరోజు అవకాశాల కోసం చూద్దాం. అలా చేస్తే, “నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని నెరవేర్చడం, ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడమే నా ఆహారం” అని చెప్పిన యేసులా మనం ఉంటాం.—యోహా. 4:34.

పాట 80 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి

^ పేరా 5 మంచివన్నీ యెహోవా నుండే వస్తాయి. ఆయన చెడ్డవాళ్లతోసహా అందరికీ మంచివాటిని ఇస్తాడు. అయితే తనను నమ్మకంగా ఆరాధించేవాళ్లకు మంచి చేయడమంటే ఆయనకు చాలా ఇష్టం. యెహోవా తన సేవకులకు మంచివాటిని ఎలా ఇస్తాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు, తన సేవను ఎక్కువ చేసేవాళ్లకు ఆయన మంచివాటిని ఎలా ఇస్తాడో కూడా నేర్చుకుంటాం.

^ పేరా 7 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 14 కావలికోటల్లో వచ్చిన ఈ ఆర్టికల్స్‌ ఇప్పుడు jw.orgలో ఉన్నాయి. అందులో మా గురించి > యెహోవాసాక్షుల అనుభవాలు > దేవుని సేవలో పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కింద చూడవచ్చు.