కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 35

వృద్ధ సహోదరసహోదరీలను విలువైనవాళ్లుగా చూడండి

వృద్ధ సహోదరసహోదరీలను విలువైనవాళ్లుగా చూడండి

“తలనెరపు . . . అందమైన కిరీటం.”—సామె. 16:31.

పాట 138 తలనెరుపులో ఉన్న సొగసు

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) సామెతలు 16:31 ప్రకారం, వృద్ధ సహోదరసహోదరీలను మనమెలా చూడాలి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

వజ్రాలను పాలిష్‌ చేయకపోతే అవి మెరవవు, కంటికి ఆకర్షణీయంగా కనబడవు. కాబట్టి ఒక వ్యక్తి వాటిని అలా చూసినప్పుడు, అవి వజ్రాలని గుర్తించకపోవచ్చు. అలాగే ఆ సంపదను పట్టించుకోకుండా వెళ్లిపోవచ్చు.

2 ఆ వజ్రాల్లాగే మన వృద్ధ సహోదరసహోదరీలు కూడా విలువైన సంపదలా ఉన్నారు. బైబిలు వాళ్ల నెరసిన వెంట్రుకలను కిరీటంతో పోలుస్తుంది. (సామెతలు 16:31 చదవండి; 20:29) విలువైన ఈ వృద్ధ సహోదరసహోదరీలను మనం అంతగా పట్టించుకోకపోవచ్చు. వృద్ధులు విలువైనవాళ్లని యౌవనులు అర్థం చేసుకున్నప్పుడు, వస్తుసంపదలకన్నా మరింత విలువైనదాన్ని వాళ్లు పొందుతారు. ఈ ఆర్టికల్‌లో మనం మూడు ప్రశ్నలకు జవాబులు చూస్తాం. నమ్మకమైన వృద్ధులను యెహోవా ఎందుకు విలువైనవాళ్లుగా చూస్తాడు? వృద్ధులు యెహోవా సంస్థకు ఎందుకు విలువైనవాళ్లు? వాళ్ల ఆదర్శం నుండి మనమెలా పూర్తి ప్రయోజనం పొందవచ్చు?

నమ్మకమైన వృద్ధులను యెహోవా ఎందుకు విలువైనవాళ్లుగా చూస్తాడు?

నమ్మకమైన వృద్ధ సహోదరసహోదరీలు యెహోవాకు, ఆయన ప్రజలకు విలువైనవాళ్లు (3వ పేరా చూడండి)

3. కీర్తన 92:12-15 ప్రకారం, నమ్మకమైన వృద్ధులు యెహోవాకు ఎందుకు విలువైనవాళ్లు?

3 నమ్మకమైన వృద్ధులు యెహోవాకు విలువైనవాళ్లు. వాళ్లు ఎలాంటివాళ్లో ఆయనకు తెలుసు, వాళ్లకున్న మంచి లక్షణాల్ని ఆయన అమూల్యంగా ఎంచుతాడు. వాళ్లు ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా చేసిన సేవ నుండి సంపాదించిన జ్ఞానాన్ని యౌవనులకు పంచినప్పుడు యెహోవా ఆనందిస్తాడు. (యోబు 12:12; సామె. 1:1-4) వాళ్లు చూపించిన సహనాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. (మలా. 3:16) వాళ్లు సమస్యల్ని ఎదుర్కొన్నా, బలమైన విశ్వాసం చూపించారు. వాళ్లు సత్యం నేర్చుకున్నప్పుడు కన్నా, భవిష్యత్తు గురించి వాళ్లకున్న నిరీక్షణ ఇప్పుడు మరింత బలంగా ఉంది. అలాగే “ముసలితనంలో కూడా” యెహోవా పేరును ప్రకటిస్తున్నందుకు ఆయన వాళ్లను ప్రేమిస్తున్నాడు.కీర్తన 92:12-15 చదవండి.

4. వృద్ధ సహోదరసహోదరీలకు ఏ మాటలు ప్రోత్సాహాన్నిస్తాయి?

4 మీరు వృద్ధులు అవుతుంటే గతంలో మీరు చేసిన సేవను యెహోవా మర్చిపోడనే నమ్మకంతో ఉండండి. (హెబ్రీ. 6:10) మీరు ప్రకటనాపనిలో ఉత్సాహంగా మద్దతిచ్చినందుకు మన పరలోక తండ్రి సంతోషిస్తున్నాడు. మీరు పెద్దపెద్ద సమస్యలతో సహా ఎన్నో కష్టాల్ని సహించారు, బైబిల్లోని నీతి ప్రమాణాల ప్రకారం జీవించారు, వాటిని సమర్థించారు. యెహోవా సంస్థలో మీకిచ్చిన పనులను నమ్మకంగా చేశారు, అలాగే ఇతరులకు శిక్షణ ఇచ్చారు. యెహోవా సంస్థ చేసిన ఎన్నో మార్పులకు అలవాటుపడడానికి మీరు చేయగలిగిందంతా చేశారు. పూర్తికాల సేవలో ఉన్నవాళ్లను ప్రోత్సహించారు. మీరు నమ్మకంగా కొనసాగుతున్నందుకు యెహోవా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. తన సేవకుల్ని విడిచిపెట్టనని ఆయన మాటిస్తున్నాడు. (కీర్త. 37:28) “మీ తల నెరిసే వరకు నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను” అని ఆయన అభయమిస్తున్నాడు. (యెష. 46:4) మీ వయసుపైబడింది కాబట్టి, యెహోవా సంస్థలో మీకిక విలువలేదని అనుకోకండి. మీరు ఇప్పటికీ విలువైనవాళ్లే!

వృద్ధులు యెహోవా సంస్థకు విలువైనవాళ్లు

5. వృద్ధులు ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి?

5 యెహోవా సంస్థకు వృద్ధులు ఎన్నో రకాలుగా ఉపయోగపడతారు. వాళ్లకు ఒకప్పుడు ఉన్నంత బలం లేకపోయినా, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. యెహోవా ఇప్పటికీ వాళ్లను ఎన్నో విధాలుగా ఉపయోగించుకోగలడని బైబిలు కాలాల్లో, అలాగే మన కాలంలో ఉన్న ఉదాహరణల్ని చూస్తే అర్థమౌతుంది.

6-7. తనను నమ్మకంగా సేవించిన వృద్ధులను యెహోవా ఎలా ఆశీర్వదించాడో కొన్ని బైబిలు ఉదాహరణలు చెప్పండి.

6 వృద్ధాప్యంలో కూడా ఎంతో నమ్మకంగా సేవ చేసినవాళ్ల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. మోషేకు దాదాపు 80 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవా ప్రవక్తగా, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే నాయకుడిగా సేవ చేయడం మొదలుపెట్టాడు. బహుశా 90 ఏళ్లు దాటాక కూడా యెహోవా దానియేలును ప్రవక్తగా ఉపయోగించుకున్నాడు. అలాగే యెహోవా, యోహానుతో ప్రకటన గ్రంథాన్ని రాయించే సమయానికి ఆయనకు 90 కన్నా ఎక్కువ సంవత్సరాలు ఉండివుంటాయి.

7 చాలామంది ఇతర నమ్మకమైన సేవకులు అందరికీ పెద్దగా తెలీకపోవచ్చు, అలాగే ప్రజలు వాళ్లను పట్టించుకొని ఉండకపోవచ్చు. అయినా యెహోవా వాళ్లను గుర్తించి, వాళ్లు నమ్మకంగా ఉన్నందుకు ప్రతిఫలం ఇచ్చాడు. ఉదాహరణకు, “నీతిమంతుడు, దైవభక్తి గలవాడు” అయిన సుమెయోను గురించి బైబిలు ఎక్కువ చెప్పట్లేదు. అయినప్పటికీ యెహోవాకు అతను తెలుసు. పసివాడైన యేసును చూసి ఆ బిడ్డ గురించి, తల్లి గురించి ప్రవచించే అవకాశాన్ని యెహోవా అతనికిచ్చాడు. (లూకా 2:22, 25-35) విధవరాలైన అన్న ప్రవక్త్రిని గురించి కూడా ఆలోచించండి. ఆమెకు 84 ఏళ్లు ఉన్నప్పటికీ “మానకుండా ఆలయానికి వెళ్తూ” ఉండేది. ఆమె క్రమంగా ఆలయానికి వెళ్లడంవల్ల యెహోవా ఆమెను దీవించాడు, పసివాడైన యేసును చూసే అవకాశాన్ని ఇచ్చాడు. సుమెయోను, అన్న ఇద్దరూ యెహోవాకు విలువైనవాళ్లు.—లూకా 2:36-38.

ఇప్పుడు 81 ఏళ్లు ఉన్న సహోదరి డీడర్‌ యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతుంది (8వ పేరా చూడండి)

8-9. విధవరాలైన ఒక సహోదరి యెహోవా సంస్థలో ఏం చేస్తూ ఉంది?

8 మనకాలంలో నమ్మకమైన చాలామంది వృద్ధులు యౌవనులకు మంచి ఆదర్శంగా ఉన్నారు. లోయస్‌ డీడర్‌ అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమెకు కేవలం 21 ఏళ్లు ఉన్నప్పుడు, కెనడాలో ప్రత్యేక పయినీరుగా సేవ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తన భర్త జాన్‌తో పాటు ఎన్నో సంవత్సరాలు ప్రయాణపనిలో గడిపింది. కెనడా బెతెల్‌లో వాళ్లు 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు సేవ చేశారు. లోయస్‌కి 58 ఏళ్లు ఉన్నప్పుడు తనని, తన భర్త జాన్‌ని యుక్రెయిన్‌లో సేవ చేయడానికి ఆహ్వానించారు. అప్పుడు వాళ్లేం చేశారు? ఆ వయసులో వేరే దేశానికి వెళ్లి సేవ చేయలేమని అనుకున్నారా? లేదు, వాళ్లు ఆ నియామకాన్ని అంగీకరించారు. జాన్‌ని అక్కడ బ్రాంచి కమిటీ సభ్యునిగా నియమించారు. ఏడు సంవత్సరాల తర్వాత జాన్‌ చనిపోయినా లోయస్‌ యుక్రెయిన్‌లోనే ఉండి సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు లోయస్‌కి 81 ఏళ్లు. ఆమె ఇప్పటికీ యుక్రెయిన్‌ బెతెల్‌లో యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తుంది. అక్కడున్న వాళ్లందరూ ఆమెను ఎంతో ప్రేమిస్తున్నారు.

9 లోయస్‌ లాంటి విధవరాళ్లను, వాళ్ల భర్తలు బ్రతికున్నప్పుడు పట్టించుకున్నంత ఎక్కువగా ఇతరులు పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పటికీ వాళ్లెంతో విలువైనవాళ్లు. ఎన్నో సంవత్సరాలపాటు తమ భర్తలకు మద్దతిచ్చి, నేడు తన సేవలో నమ్మకంగా కొనసాగుతున్న సహోదరీలను యెహోవా ఎంతో విలువైనవాళ్లుగా ఎంచుతాడు. (1 తిమో. 5:3) అలాంటి సహోదరీలు యౌవనులకు నిజమైన ప్రోత్సాహాన్ని ఇస్తారు.

10. టోనీ ఎలా మంచి ఆదర్శం ఉంచాడు?

10 చాలామంది వృద్ధులు ఒంటరిగా ఉంటారు లేదా వాళ్ల బాగోగులు చూసుకునే సెంటర్‌లలో ఉంటారు. నమ్మకమైన అలాంటి వృద్ధులు కూడా విలువైనవాళ్లే. ఉదాహరణకు, టోనీ అనే సహోదరుడు వృద్ధుల బాగోగుల్ని చూసుకునే సెంటర్‌లో ఉంటున్నాడు. ఆయనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు 1942 ఆగస్టులో అమెరికాలోని పెన్సిల్వేనియాలో బాప్తిస్మం తీసుకున్నాడు. వెంటనే ఆయన్ని సైన్యంలో చేరమని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన దానికి అంగీకరించలేదని రెండున్నర సంవత్సరాలు జైల్లో పెట్టారు. తర్వాత ఆయన, ఆయన భార్య హిల్డా తమ ఇద్దరు పిల్లల్ని సత్యంలో పెంచారు. గడిచిన సంవత్సరాల్లో టోనీ మూడు సంఘాల్లో సంఘ పైవిచారణకర్తగా (ఇప్పుడు పెద్దల సభ సమన్వయకర్త అని పిలుస్తారు), అలాగే ప్రాంతీయ సమావేశ పర్యవేక్షకునిగా సేవ చేశాడు. అంతేకాదు ఆయన ఒక జైల్లో కూటాలను, బైబిలు అధ్యయనాలను చేసేవాడు. టోనీ 98 ఏళ్ల వయసులో కూడా యెహోవా సేవను ఆపాలనుకోవడం లేదు. ఆయన యెహోవా సేవచేసే విషయంలో, తోటి సహోదరసహోదరీలతో కలిసి పనిచేసే విషయంలో చేయగలిగిందంతా చేస్తూ ఉన్నాడు.

11. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లేదా వృద్ధుల బాగోగుల్ని చూసుకునే సెంటర్‌లో ఉంటున్న వృద్ధులు విలువైనవాళ్లని మనమెలా చూపించవచ్చు?

11 ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లేదా వృద్ధుల బాగోగుల్ని చూసుకునే సెంటర్‌లో ఉంటున్న వృద్ధ సహోదరసహోదరీలు విలువైనవాళ్లని మనమెలా చూపించవచ్చు? వాళ్లకు వీలైనప్పుడల్లా సంఘ కూటాలకు హాజరయ్యేలా లేదా వాటిని వినేలా, పరిచర్య చేసేలా సంఘ పెద్దలు ఏర్పాట్లు చేయవచ్చు. వాళ్లను కలవడానికి వెళ్లడం ద్వారా లేదా వీడియో కాల్‌లో మాట్లాడడం ద్వారా వాళ్ల మీద వ్యక్తిగత శ్రద్ధ ఉందని చూపించవచ్చు. ఆ వృద్ధుల బాగోగుల్ని చూసుకునే సెంటర్‌ సంఘానికి దూరంగా ఉంటే, మర్చిపోకుండా వాళ్లమీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వృద్ధ సహోదరసహోదరీలకు వాళ్ల భావాల్ని చెప్పడం కష్టంగా అనిపించవచ్చు లేదా చెప్పాలని అనిపించకపోవచ్చు. కానీ మనం సమయం తీసుకొని వాళ్లను ప్రశ్నలు అడిగి, యెహోవా సంస్థలో వాళ్లకు ఎదురైన సంతోషకరమైన అనుభవాల్ని చెప్తున్నప్పుడు మనం వింటే, ఎంతో ప్రోత్సాహం పొందుతాం.

12. మన సంఘంలో ఎలాంటి సహోదరసహోదరీలను మనం కనుగొనవచ్చు?

12 ఎంతో చక్కని ఆదర్శం ఉంచిన నమ్మకమైన వృద్ధ సహోదరసహోదరీలు మన సంఘంలోనే ఉన్నారని తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. హ్యార్యేట్‌ అనే సహోదరి అమెరికాలోని న్యూ జెర్సీలో ఉన్న తన సంఘంలో, ఎన్నో సంవత్సరాల పాటు యెహోవాకు నమ్మకంగా సేవచేసింది. ఆ తర్వాత, తన కూతురు దగ్గర ఉండడానికి ఆమె వేరే ప్రాంతానికి వెళ్లింది. కొత్తగా వెళ్లిన సంఘంలోనివాళ్లు, సమయం తీసుకొని ఆమె గురించి తెలుసుకోవడం వల్ల తను చాలా విలువైందని గ్రహించారు. దాదాపు 1925లో ఆమె మొదటిసారి సత్యం తెలుసుకున్నప్పుడు, ప్రకటనాపనిలో తనకు ఎదురైన అనుభవాల్ని చెప్పి వాళ్లను ప్రోత్సహించింది. అప్పట్లో పరిచర్య చేస్తే అరెస్టు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమె పరిచర్యకు వెళ్లినప్పుడల్లా తనతోపాటు పళ్లు తోముకునే బ్రష్‌ తీసుకొని వెళ్లేది. నిజానికి 1933లో రెండుసార్లు ఆమె ఒక వారం పాటు జైల్లో ఉంది. ఆమె భర్త యెహోవాసాక్షి కాకపోయినా ఆమెకు మద్దతిచ్చాడు. ఆమె జైల్లో ఉన్నప్పుడు వాళ్ల ముగ్గురు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఖచ్చితంగా హ్యార్యేట్‌ లాంటి నమ్మకమైన వృద్ధులు మన గౌరవానికి అర్హులు!

13. యెహోవా సంస్థలో వృద్ధులకున్న విలువ గురించి మనమేం నేర్చుకున్నాం?

13 యెహోవాకు, ఆయన సంస్థకు వృద్ధ సహోదరసహోదరీలు చాలా ముఖ్యమైనవాళ్లు. యెహోవా తన సంస్థను అలాగే తమను ఎన్నో విధాలుగా ఆశీర్వదించడాన్ని వృద్ధులు చూశారు. తాము చేసిన పొరపాట్ల నుండి వాళ్లు విలువైన పాఠాలు నేర్చుకున్నారు. వాళ్లను ‘తెలివి అనే ఊటలా’ చూస్తూ, వాళ్ల అనుభవం నుండి నేర్చుకోండి. (సామె. 18:4) మీరు సమయం తీసుకుని వాళ్ల గురించి తెలుసుకుంటే, మీ విశ్వాసం బలపడుతుంది అలాగే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు.

వృద్ధుల ఆదర్శం నుండి పూర్తి ప్రయోజనం పొందండి

ఏలీయాతో ఉండడంవల్ల ఎలీషా ప్రయోజనం పొందినట్టే, ఎంతోకాలంగా యెహోవా సేవ చేస్తున్న వాళ్లు చెప్పే అనుభవాల నుండి సహోదరసహోదరీలు ప్రయోజనం పొందవచ్చు (14-15 పేరాలు చూడండి)

14. ద్వితీయోపదేశకాండం 32:7, యౌవనులను ఏం చేయమని ప్రోత్సహిస్తుంది?

14 వృద్ధ సహోదరసహోదరీలతో మాట్లాడడానికి చొరవ తీసుకోండి. (ద్వితీయోపదేశకాండం 32:7 చదవండి.) నిజానికి వాళ్ల చూపు తగ్గివుండొచ్చు, నిదానంగా నడుస్తుండొచ్చు, స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు అయినప్పటికీ చురుగ్గా ఉండాలనుకుంటున్నారు. వాళ్లు యెహోవా దగ్గర “మంచిపేరు” సంపాదించుకున్నారు. (ప్రసం. 7:1) యెహోవా వృద్ధులను ఎందుకు విలువైనవాళ్లుగా చూస్తున్నాడో గుర్తుపెట్టుకొని వాళ్లను గౌరవిస్తూ ఉండండి. మీరు ఎలీషాలా ఉండండి. అతను ఏలీయాతో ఉన్న చివరిరోజు ఆయనతోనే ఉంటానని అడిగాడు. ఎలీషా మూడుసార్లు “నేను నిన్ను విడిచిపెట్టను” అని అన్నాడు.—2 రాజు. 2:2, 4, 6.

15. వృద్ధ సహోదరసహోదరీలను మనమేం ప్రశ్నలు అడగవచ్చు?

15 వృద్ధులను ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్లమీద నిజమైన శ్రద్ధ ఉందని చూపించండి. (సామె. 1:5; 20:5; 1 తిమో. 5:1, 2) “ఇదే సత్యమని మీకెలా నమ్మకం కుదిరింది?” “మీకెదురైన అనుభవాలు మిమ్మల్ని ఎలా యెహోవాకు ఇంకా దగ్గర చేశాయి?” “యెహోవా సేవలో సంతోషాన్ని కాపాడుకోవడానికి మీకేది సహాయం చేసింది?” వంటి ప్రశ్నలు అడగండి. (1 తిమో. 6:6-8) ఆ తర్వాత వాళ్ల అనుభవాల్ని వినండి.

16. వృద్ధులు, యౌవనులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల ఎలా ప్రయోజనం పొందుతారు?

16 వృద్ధులు, యౌవనులు ఒకరితోఒకరు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు. (రోమా. 1:12) తన నమ్మకమైన సేవకుల్ని యెహోవా పట్టించుకుంటాడని యౌవనులకు ఇంకా నమ్మకం కలుగుతుంది; వృద్ధులు తాము ప్రేమించబడుతున్నామని అర్థం చేసుకుంటారు. అలాగే, వృద్ధులు తమకు యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాల గురించి చెప్తున్నప్పుడు ఆనందిస్తారు.

17. సంవత్సరాలు గడుస్తుండగా వృద్ధ సహోదరసహోదరీలు మరింత అందంగా తయారౌతున్నారని ఎలా చెప్పవచ్చు?

17 సాధారణంగా వయసు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ ఉంటుంది. కానీ యెహోవాకు నమ్మకంగా ఉండేవాళ్లు సంవత్సరాలు గడిచేకొద్దీ ఆయనకు మరింత అందంగా కనిపిస్తారు. (1 థెస్స. 1:2, 3) అదెందుకు నిజం? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పవిత్రశక్తి తమకు శిక్షణ ఇచ్చేలా, మంచి లక్షణాల్ని వృద్ధిచేసుకోవడానికి సహాయం చేసేలా వాళ్లు అనుమతించారు. మనమెంత ఎక్కువగా వృద్ధ సహోదరసహోదరీల గురించి తెలుసుకొని, వాళ్లను గౌరవించి, వాళ్ల నుండి నేర్చుకుంటే, అంత ఎక్కువగా వాళ్లను వెలకట్టలేని సంపదలా చూస్తాం.

18. తర్వాతి ఆర్టికల్‌లో ఏం చర్చిస్తాం?

18 యౌవనులు వృద్ధులకు విలువివ్వడమే కాదు, వృద్ధులు కూడా యౌవనులకు విలువిచ్చినప్పుడు సంఘం ఐక్యంగా, బలంగా ఉంటుంది. తర్వాతి ఆర్టికల్‌లో, సంఘంలోని యౌవనులను విలువైనవాళ్లుగా పరిగణిస్తున్నారని వృద్ధులు ఎలా చూపించవచ్చో చర్చిస్తాం.

పాట 144 మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!

^ పేరా 5 మన వృద్ధ సహోదరసహోదరీలు చాలా విలువైనవాళ్లు. వాళ్లను ఇంకా ఎక్కువ ప్రేమించడానికి, గౌరవించడానికి ఈ ఆర్టికల్‌ మనకు సహాయం చేస్తుంది. అలాగే వాళ్లకున్న తెలివి, అనుభవం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చో ఇది చర్చిస్తుంది. వృద్ధులు దేవుని సంస్థలో ఒక ముఖ్యమైన భాగమని కూడా ఈ ఆర్టికల్‌ అభయమిస్తుంది.