కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 36

సంఘంలో ఉన్న యౌవనులను విలువైనవాళ్లుగా ఎంచండి

సంఘంలో ఉన్న యౌవనులను విలువైనవాళ్లుగా ఎంచండి

“యౌవనుల బలమే వాళ్లకు అలంకారం.”—సామె. 20:29.

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. వయసు పైబడేకొద్దీ మనం ఏ మంచి లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు?

మన వయసు పైబడుతున్నప్పుడు యెహోవా సేవలో ఒకప్పుడు ఉపయోగపడినంత ఇప్పుడు ఉపయోగపడలేమేమో అని భయపడుతుండవచ్చు. నిజమే వృద్ధులమైన మనకు శక్తి తగ్గి ఉండవచ్చు. కానీ, మనం సంపాదించుకున్న తెలివిని అనుభవాన్ని ఉపయోగించి, యౌవనులు యెహోవా సంస్థకు ఉపయోగపడేలా అలాగే కొత్త బాధ్యతలు చేపట్టేలా వాళ్లకు సహాయం చేయవచ్చు. ఎంతోకాలంగా పెద్దగా సేవచేస్తున్న ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “వృద్ధాప్యం వల్ల ఇంతకుముందు చేసినంత ఇప్పుడు చేయలేకపోతున్నానని నాకు అనిపించినప్పుడు, అ పని చేయడానికి అర్హులైన యౌవన సహోదరులు ఉన్నందుకు సంతోషంగా అనిపించింది.”

2. ఈ ఆర్టికల్‌లో మనమేం చూస్తాం?

2 వృద్ధులతో స్నేహం చేయడం వల్ల యౌవనులు ఎలా ప్రయోజనం పొందుతారో ముందటి ఆర్టికల్‌లో చూశాం. యౌవనులతో కలిసి పనిచేసేలా వృద్ధులకు వినయం, అణకువ, కృతజ్ఞత, ఉదారత వంటి లక్షణాలు ఎలా సహాయం చేస్తాయో, దానివల్ల సంఘమంతా ఎలా ప్రయోజనం పొందుతుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

వినయం చూపించండి

3. ఫిలిప్పీయులు 2:3, 4 ప్రకారం, వినయం అంటే ఏంటి? ఆ లక్షణం ఒక క్రైస్తవునికి ఎలా సహాయం చేస్తుంది?

3 యౌవనులకు సహాయం చేయాలంటే వృద్ధులకు వినయం ఉండాలి. వినయం ఉన్న వ్యక్తి ఇతరులను తనకన్నా గొప్పవాళ్లుగా చూస్తాడు. (ఫిలిప్పీయులు 2:3, 4 చదవండి.) ఒక పనిని ఎన్నో విధాలుగా చేయొచ్చని వినయం ఉన్న వృద్ధులు అర్థంచేసుకుంటారు. అందుకే ఒక పనిని వాళ్లు ఒకప్పుడు చేసినట్టే ఇప్పుడు ఇతరులు చేయాలని అనుకోరు. (ప్రసం. 7:10) వృద్ధులు తాము నేర్చుకున్న విషయాల్ని చెప్పినప్పుడు యౌవనులు ప్రయోజనం పొందుతారు. అయినా “లోకం తీరుతెన్నులు మారుతున్నాయి” కాబట్టి, కొత్త విధానాల్లో పనులు చేయడానికి అలవాటు పడాల్సిన అవసరం ఉందని వృద్ధులు అర్థంచేసుకుంటారు.—1 కొరిం. 7:31.

తమ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా వృద్ధులు ఉదారత చూపిస్తారు (4, 5 పేరాలు చూడండి) *

4. లేవీయులు చూపించిన వైఖరినే ప్రాంతీయ పర్యవేక్షకులు ఎలా చూపిస్తారు?

4 వినయం ఉన్న వృద్ధులు తమ వయసు పైబడేకొద్దీ ఒకప్పుడు చేసినంత ఇప్పుడు చేయలేమని అర్థంచేసుకుంటారు. ఒకసారి ప్రాంతీయ పర్యవేక్షకుల గురించి ఆలోచించండి. వాళ్లకు 70 ఏళ్లు వచ్చినప్పుడు వేరే నియామకం ఇస్తారు. అది వాళ్లకు కష్టంగా ఉండవచ్చు, ఎందుకంటే వాళ్లు ఆ నియామకం ద్వారా సహోదరసహోదరీలకు సహాయం చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందారు. అ నియామకాన్ని ప్రేమించారు కాబట్టి ఆ పనిలో ఇంకా కొనసాగాలని వాళ్లెంతో కోరుకుంటారు. కానీ, యౌవన సహోదరులు ఆ పనిని చేయడం మంచిదని వాళ్లు అర్థంచేసుకుంటారు. ఆ విధంగా ఇశ్రాయేలు కాలంలోని లేవీయులు చూపించిన వైఖరిని వీళ్లు చూపిస్తున్నారు. లేవీయులకు 50 ఏళ్లు వచ్చేసరికి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడం ఆపేయాల్సి ఉంటుంది. ఆ లేవీయులు ఏ నియామకంలో ఉన్నా సంతోషించారు. వాళ్లు చేయగలిగిన పనిని ఉత్సాహంగా చేస్తూ యౌవనులకు సహాయం చేశారు. (సంఖ్యా. 8:25, 26) నేడు ప్రాంతీయ పర్యవేక్షకులకు 70 ఏళ్లు వచ్చాక సంఘాల్ని సందర్శించే పనిని ఆపేస్తారు. అయినా వాళ్లు ఏ సంఘానికైతే నియమించబడతారో, అక్కడున్నవాళ్లకు ఎంతో సహాయం చేస్తారు, ప్రోత్సాహం ఇస్తారు.

5. డ్యాన్‌, కేటీ నుండి మీరేం నేర్చుకోవచ్చు?

5 ప్రాంతీయ పర్యవేక్షకునిగా 23 ఏళ్లు సేవ చేసిన డ్యాన్‌ ఉదాహరణను గమనించండి. డ్యాన్‌కు 70 ఏళ్లు వచ్చాక ఆయన్ని, ఆయన భార్య కేటీని ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. వాళ్లిద్దరూ తమ కొత్త నియామకాన్ని ఎలా ఆనందిస్తున్నారు? ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని డ్యాన్‌ అంటున్నాడు. ఆయన సంఘ బాధ్యతల్ని చూసుకుంటూ సహోదరులు సంఘ పరిచారకులు అయ్యేలా సహాయం చేస్తున్నాడు. అలాగే రద్దీగా ఉండే పెద్దపెద్ద పట్టణాల్లో, జైళ్లలో ప్రకటించేలా ఇతరులకు శిక్షణ ఇస్తున్నాడు. వృద్ధులారా మీరు పూర్తికాల సేవలో ఉన్నా, లేకపోయినా ఇతరులకు చాలా సహాయం చేయవచ్చు. ఎలా? కొత్త పరిస్థితులకు అలవాటుపడండి, కొత్త లక్ష్యాలు పెట్టుకోండి అలాగే మీరు చేయలేని వాటిమీద కాకుండా, చేయగలిగే వాటిమీద మనసుపెట్టండి.

అణకువ చూపించండి

6. అణకువతో ఉండడం ఎందుకు తెలివైన పనో ఒక ఉదాహరణతో చెప్పండి.

6 అణకువగల వ్యక్తి తన పరిమితుల్ని అర్థంచేసుకుంటాడు. (సామె. 11:2) ఆయన తన సామర్థ్యానికి మించి చేయాలనుకోడు. దానివల్ల సంతోషంగా ఉంటాడు, కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. అణకువగల వ్యక్తిని కొండపైకి సైకిల్‌ తొక్కుతూ వెళ్తున్న ఒకతనితో పోల్చవచ్చు. అతను ఒకే వేగంతో తొక్కడు, బహుశా నెమ్మదిగా తొక్కొచ్చు. అయినా ముందుకు మాత్రం వెళ్తూ ఉంటాడు. అలాగే అణకువగల వ్యక్తికి తాను యెహోవా సేవలో కొనసాగుతూ ఇతరులకు సహాయం చేసేలా, ఎప్పుడు మార్పులు చేసుకోవాలో లేదా ఎప్పుడు వేగాన్ని తగ్గించుకోవాలో తెలుసు.—ఫిలి. 4:5.

7. బర్జిల్లయి అణకువను ఎలా చూపించాడు?

7 రాజైన దావీదు సలహాదారుల్లో ఒకనిగా ఉండడానికి ఆహ్వానించబడిన 80 ఏళ్ల బర్జిల్లయి గురించి ఆలోచించండి. బర్జిల్లయి అణకువతో రాజు ఆహ్వానాన్ని నిరాకరించాడు. తన వయసుపైబడడం వల్ల ఎక్కువ సహాయపడలేనని బర్జిల్లయికి తెలుసు కాబట్టి తనకు బదులు యువకుడైన కింహాముకు అవకాశం ఇవ్వమని అడిగాడు. (2 సమూ. 19:35-37) బర్జిల్లయిలాగే, వృద్ధ సహోదరులు తమ బదులు యౌవన సహోదరులకు సేవచేసే అవకాశం ఇవ్వడం ద్వారా సంతోషిస్తారు.

తన కొడుకైన సొలొమోను ఆలయాన్ని కడతాడని యెహోవా చెప్పినప్పుడు రాజైన దావీదు దానికి అంగీకరించాడు (8వ పేరా చూడండి)

8. ఆలయాన్ని కట్టే విషయంలో దావీదు అణకువను ఎలా చూపించాడు?

8 అణకువ చూపించడంలో రాజైన దావీదు కూడా మంచి ఆదర్శం ఉంచాడు. అతను యెహోవా కోసం ఒక ఆలయాన్ని కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. కానీ ఆ పనిని యువకుడైన సొలొమోను చేస్తాడని యెహోవా చెప్పినప్పుడు, దావీదు దానికి ఒప్పుకొని ఆ నిర్మాణ పనికి పూర్తి మద్దతిచ్చాడు. (1 దిన. 17:4; 22:5) సొలొమోను “చిన్నవాడు, అనుభవం లేనివాడు” కాబట్టి ఆలయం కట్టే పనిని తానే బాగా చేయగలనని దావీదు అనుకోలేదు. (1 దిన. 29:1) ఈ నిర్మాణ పనిని ముందుండి నడిపించే వ్యక్తి వయసు లేదా అనుభవం వల్ల కాదుగానీ, యెహోవా ఆశీర్వాదం వల్ల మాత్రమే ఇది పూర్తౌతుందని దావీదుకు తెలుసు. నేడు వృద్ధులు కూడా దావీదును అనుకరిస్తూ, తమ నియామకం మారినా యెహోవా సేవ చేస్తూనే ఉంటారు. అలాగే, తాము ఒకప్పుడు చేసిన పనిని ఇప్పుడు యౌవనులు చేస్తుంటే యెహోవా ఆశీర్వదిస్తాడని వృద్ధులకు తెలుసు.

9. ఒక బ్రాంచి కమిటీ సభ్యుడు అణకువను ఎలా చూపించాడు?

9 మనకాలంలో కూడా షీగ్యో అనే సహోదరుడు అణకువ చూపించాడు. 1976లో ఆయనకు 30 ఏళ్లు ఉన్నప్పుడు బ్రాంచి కమిటీ సభ్యునిగా నియమించబడ్డాడు. 2004లో ఆయన బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా పని చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆయన ఇంతకుముందులా బలంగా లేనని, తన పనిని త్వరగా చేయలేకపోతున్నానని గ్రహించాడు. ఆయన దాని గురించి ప్రార్థించి, ఒక యౌవన సహోదరుడు సమన్వయకర్తగా పని చేస్తే వచ్చే ప్రయోజనాల గురించి ఆలోచించాడు. ప్రస్తుతం బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా పని చేయకపోయినా షీగ్యో అందులో ఒక సభ్యునిగానే పనిచేస్తున్నాడు. బర్జిల్లయి, రాజైన దావీదు అలాగే షీగ్యో ఉదాహరణల్లో చూసినట్లే వినయం, అణకువ ఉన్న వ్యక్తి యౌవనులు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాల మీద కాకుండా వాళ్లకు ఇప్పటికే తెలిసిన వాటిమీద మనసుపెడతాడు. అలాంటి వ్యక్తి యౌవనుల్ని తనతో పోటిపడేవాళ్లలా కాకుండా తోటి పనివాళ్లుగా చూస్తాడు.—సామె. 20:29.

కృతజ్ఞత చూపించండి

10. సంఘంలోని యౌవనుల గురించి వృద్ధులు ఎలా భావిస్తారు?

10 యౌవనుల్ని యెహోవా ఇచ్చిన బహుమానంలా వృద్ధులు చూస్తారు. అలాగే వాళ్లు చేసేదాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటారు. రానురాను తమ బలం తగ్గుతున్నప్పుడు, యౌవనులు వాళ్ల బలాన్ని ఉపయోగించి సంఘంలో సేవచేయడం చూసి వృద్ధులు ఎంతో సంతోషిస్తారు.

11. యౌవన సహోదరసహోదరీల సహాయాన్ని వృద్ధులు తీసుకున్నప్పుడు ప్రయోజనం పొందుతారని రూతు 4:13-16 వచనాలు ఎలా చూపిస్తున్నాయి?

11 యౌవనులు వృద్ధులకు సహాయం చేయాలనుకున్నప్పుడు, వృద్ధులు కృతజ్ఞత చూపిస్తూ వాళ్ల సహాయం తీసుకోవాలి. ఈ విషయంలో నయోమి మంచి ఆదర్శం ఉంచింది. తన కొడుకు చనిపోయాక ఆమె తన కోడలు రూతును పుట్టింటికి వెళ్లిపోమని చెప్పింది. కానీ రూతు దానికి ఒప్పుకోకుండా ఆమెతో బేత్లెహేముకు వెళ్లినప్పుడు నయోమి రూతు సహాయం తీసుకుంది. (రూతు 1:7, 8, 18) దానివల్ల వాళ్లిద్దరూ ఆశీర్వాదం పొందారు. (రూతు 4:13-16 చదవండి.) నయోమిలాగే వినయం ఉన్న వృద్ధులు యౌవన సహోదరసహోదరీల సహాయం తీసుకుంటారు.

12. అపొస్తలుడైన పౌలు కృతజ్ఞతను ఎలా చూపించాడు?

12 సహోదరులు తనకు సహాయం చేసినందుకు అపొస్తలుడైన పౌలు కృతజ్ఞత చూపించాడు. ఉదాహరణకు, ఫిలిప్పీలోని క్రైస్తవులు తనకు వస్తుపరంగా సహాయం చేసినందుకు పౌలు కృతజ్ఞత చెప్పాడు. (ఫిలి. 4:16) తిమోతి చేసిన సహాయానికి కూడా ఆయన కృతజ్ఞత చెప్పాడు. (ఫిలి. 2:19-22) ఆయన్ని ఒక ఖైదీగా రోముకు తీసుకెళ్తున్నప్పుడు తనను ప్రోత్సహించడానికి వచ్చినవాళ్లను చూసి ఆయన దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. (అపొ. 28:15) పౌలు ఉత్సాహంగా వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రకటించాడు, సంఘాలను బలపర్చాడు. అయినా తోటి సహోదరసహోదరీలు సహాయం చేసినప్పుడు దాన్ని వినయంగా అంగీకరించాడు.

13. యౌవనుల పట్ల వృద్ధులు కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

13 వృద్ధులారా సంఘంలోని యౌవన సహోదరసహోదరీల పట్ల మీ కృతజ్ఞతను ఎన్నో విధాలుగా చూపించవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్లి రావడానికి, ఏదైనా కొనడానికి లేదా ఇంకేదైనా పనిలో యౌవనులు మీకు సహాయం చేయడానికి ముందుకొస్తే దాన్ని అంగీకరించండి, కృతజ్ఞత చూపించండి. ఒక విధంగా వాళ్ల ద్వారా యెహోవా మీమీద ప్రేమ చూపిస్తున్నాడని గుర్తుంచుకోండి. వాళ్లు మీకు దగ్గరి స్నేహితులు అవ్వగలరు. వాళ్లు యెహోవాకు దగ్గరయ్యేలా కూడా సహాయం చేయండి. సంఘానికి వాళ్లు చేస్తున్న సహాయాన్ని చూసి మీరెంత సంతోషిస్తున్నారో చెప్పండి. వాళ్లతో సమయం గడపడానికి చూడండి అలాగే మీ జీవితంలో ఎదురైన ఒక అనుభవాన్ని చెప్పండి. ఇలా చేయడం ద్వారా, యౌవనుల్ని సంఘంలోకి ఆకర్షించిన యెహోవా పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారని మీరు చూపిస్తారు.—కొలొ. 3:15; యోహా. 6:44; 1 థెస్స. 5:18.

ఉదారత చూపించండి

14. రాజైన దావీదు ఉదారతను ఎలా చూపించాడు?

14 వృద్ధులు చూపించాల్సిన ఇంకో ప్రాముఖ్యమైన లక్షణాన్ని రాజైన దావీదులో చూడొచ్చు. అదే ఉదారత. అతను ఆలయ నిర్మాణం కోసం ఎంతో డబ్బును, విలువైన వస్తువులను సొంత ఆస్తిలో నుండి ఇచ్చాడు. (1 దిన. 22:11-16; 29:3, 4) తర్వాత, ప్రజలు దానిని సొలొమోను కట్టించిన ఆలయం అంటారని తెలిసినా అతను దానికి మద్దతిచ్చాడు. నేడు, సంస్థ చేసే నిర్మాణ ప్రాజెక్టుల్లో పాల్గొనే శక్తి వృద్ధులకు లేకపోయినా, పరిస్థితులు అనుమతించినంత వరకు విరాళాలు ఇవ్వడం ద్వారా వాటికి మద్దతిస్తూ ఉండవచ్చు. అలాగే, ఎంతోకాలంగా వాళ్లు సంపాదించిన అనుభవం నుండి ప్రయోజనం పొందేలా యౌవనులకు సహాయం చేయవచ్చు.

15. పౌలు ఎలా ఉదారతను చూపించాడు?

15 అపొస్తలుడైన పౌలు కూడా ఉదారత చూపించాడు. ఆయన యువకుడైన తిమోతిని తనతోపాటు మిషనరీ యాత్రకు తీసుకెళ్లాడు. పౌలు సమయం తీసుకొని తిమోతికి ప్రకటించే, బోధించే పద్ధతుల్ని నేర్పించడం ద్వారా ఉదారత చూపించాడు. (అపొ. 16:1-3) దానివల్ల తిమోతి మంచి ప్రచారకుడిగా, బోధకుడిగా తయారయ్యాడు. (1 కొరిం. 4:17) పౌలు నుండి నేర్చుకున్న విషయాల్ని తిమోతి ఇతరులకు తిరిగి నేర్పించాడు.

16. సహోదరుడు షీగ్యో యౌవన సహోదరులకు ఎందుకు శిక్షణ ఇచ్చాడు?

16 నేడు వృద్ధులు కూడా సంఘ పనుల్లో యౌవనులకు శిక్షణ ఇస్తే, తమకు ఇక పని ఉండదేమో అని భయపడరు. ఉదాహరణకు, పైన ప్రస్తావించిన షీగ్యో అనే సహోదరుడు బ్రాంచి కమిటిలో తనకన్నా చిన్న వయసు సహోదరులకు శిక్షణ ఇస్తూ వచ్చాడు. తాను సేవ చేస్తున్న దేశంలో రాజ్యపనికి మద్దతివ్వడానికే ఆయన అలా చేశాడు. దానివల్ల ఆయన సమన్వయకర్తగా పని చేయలేని సమయం వచ్చినప్పుడు, బాగా శిక్షణ పొందిన మరో సహోదరుడు అ పని చేయడానికి వీలైంది. షీగ్యో 45 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తూ, తాను నేర్చుకున్న విషయాల్ని యౌవన సహోదరులకు నేర్పిస్తూ వాళ్లకు సహాయం చేస్తున్నాడు. నిజంగా అలాంటి సహోదరులు మన మధ్య ఉండడం ఎంత ఆశీర్వాదమో కదా!

17. లూకా 6:38 లోని సూత్రాన్ని బట్టి వృద్ధులు యౌవనులకు ఏం ఇవ్వవచ్చు?

17 నమ్మకంగా, యథార్థంగా యెహోవా సేవ చేయడం కన్నా మించింది లేదని వృద్ధ సహోదరసహోదరీలైన మీరు నిరూపించారు. మీ ఆదర్శం ద్వారా, బైబిలు సూత్రాలు నేర్చుకొని వాటిని పాటించడమే మంచిదని నిరూపిస్తున్నారు. మీకున్న అనుభవాన్ని బట్టి గతంలో పనులు ఎలా చేసేవాళ్లో మీకు తెలిసినా, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు కొత్త విధానాల్లో పనులు చేయడం నేర్చుకున్నారు. ఈమధ్యే బాప్తిస్మం తీసుకున్న వృద్ధులు కూడా ఎన్నో విధాలుగా ఇతరులకు సహాయం చేయవచ్చు. మీరు ఈ వయస్సులో యెహోవాను తెలుసుకోవడం వల్ల ఎలా ఆనందం పొందారో ఇతరులకు చెప్పవచ్చు. మీకున్న అనుభవాల్ని, మీ జీవితంలో నేర్చుకున్న పాఠాల్ని యౌవనులు విన్నప్పుడు ఆనందిస్తారు. మీ అనుభవాన్నంతా ఉపయోగించి ఇతరులకు శిక్షణ “ఇవ్వడం అలవాటు” చేసుకుంటే యెహోవా మిమ్మల్ని మెండుగా దీవిస్తాడు.—లూకా 6:38 చదవండి.

18. యౌవనులు, వృద్ధులు స్నేహితులుగా కలిసి పని చేసినప్పుడు ఏం జరుగుతుంది?

18 వృద్ధులైన మీరు యౌవనులకు దగ్గరైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతారు. (రోమా. 1:12) ప్రతీఒక్కరికి ఏదోక ప్రత్యేకత ఉంటుంది. వృద్ధుల దగ్గర తెలివి అనుభవం ఉన్నాయి, యౌవనుల దగ్గర బలం ఉంది. యౌవనులు వృద్ధులు స్నేహితుల్లా కలిసి పని చేసినప్పుడు మన ప్రేమగల పరలోక తండ్రికి మహిమ తెస్తారు అలాగే సంఘానికి ఆశీర్వాదంగా ఉంటారు.

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

^ పేరా 5 యెహోవా సంస్థకు మద్దతివ్వడానికి చేయగలిగిందంతా చేస్తున్న చాలామంది యౌవనులు మన సంఘాల్లో ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తాం. తమ సంస్కృతితో, నేపథ్యంతో సంబంధం లేకుండా సంఘంలో ఉన్న వృద్ధ సహోదరసహోదరీలు, యెహోవా సేవ పూర్తి శక్తితో చేసేలా యౌవనులకు సహాయం చేయవచ్చు.

^ పేరా 55 చిత్రాల వివరణ: ఒక ప్రాంతీయ పర్యవేక్షకునికి 70 ఏళ్లు వచ్చినప్పుడు ఆయనకు, ఆయన భార్యకు కొత్త నియామకం ఇచ్చారు. వాళ్లు ప్రస్తుతం సేవ చేస్తున్న సంఘంలో తమ అనుభవాన్నంతా ఉపయోగించి ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు.