కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 37

“నేను అన్నిదేశాల్ని కంపింపజేస్తాను”

“నేను అన్నిదేశాల్ని కంపింపజేస్తాను”

“నేను అన్నిదేశాల్ని కంపింపజేస్తాను, అప్పుడు అన్నిదేశాల విలువైన వస్తువులు ఈ మందిరంలోకి వస్తాయి.”—హగ్గ. 2:7.

పాట 24 యెహోవా పర్వతానికి రండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. మన కాలంలో జరిగే ఏ కంపన గురించి ప్రవక్తయైన హగ్గయి చెప్పాడు?

“కొన్ని నిమిషాల్లోనే షాపులు, పాత బిల్డింగ్‌లు పేక మేడల్లా కూలిపోవడం మొదలయ్యాయి.” “అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. రెండు నిమిషాలపాటు భూమి కంపించిందని చాలామంది అన్నారు. కానీ నాకు మాత్రం అది ఎక్కువసేపులా అనిపించింది.” 2015లో నేపాల్‌లో వచ్చిన భూకంపం నుండి బయటపడిన కొంతమంది చెప్పిన మాటలు ఇవి. అలాంటి భయంకరమైన పరిస్థితే మీకు ఎదురైతే బహుశా దాన్ని మీరెప్పటికీ మర్చిపోరు.

2 మనం ఇప్పుడు మరో రకమైన కంపనకు గురౌతున్నాం. అది ఒక దేశాన్నో, పట్టణాన్నో కాదు మొత్తం ప్రపంచాన్నే ఊపేస్తోంది. అది చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. ఈ కంపన గురించి ప్రవక్తయైన హగ్గయి ముందే చెప్పాడు. ఆయన ఇలా రాశాడు: “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘త్వరలోనే నేను ఇంకొకసారి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, ఆరిన నేలను కంపింపజేస్తాను.’”—హగ్గ. 2:6.

3. హగ్గయి చెప్పిన కంపన నిజంగా వచ్చే భూకంపం లాంటిది కాదని ఎలా చెప్పొచ్చు?

3 హగ్గయి చెప్పిన కంపన నాశనాన్ని మాత్రమే తీసుకొచ్చే భూకంపం లాంటిది కాదు. బదులుగా ఈ కంపన వల్ల మంచి ఫలితాలు వస్తాయి. యెహోవాయే స్వయంగా ఇలా అంటున్నాడు: “నేను అన్నిదేశాల్ని కంపింపజేస్తాను, అప్పుడు అన్నిదేశాల విలువైన వస్తువులు ఈ మందిరంలోకి వస్తాయి; నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను.” (హగ్గ. 2:7) హగ్గయి కాలంలో జీవించినవాళ్ల విషయంలో ఈ ప్రవచనం ఎలా నెరవేరింది? ఆ మాటలు ఈ రోజుల్లో ఎలా నెరవేరుతున్నాయి? మనం ఆ ప్రశ్నలకు జవాబుల్ని తెలుసుకోవడంతో పాటు, దేశాల్ని కంపింపజేసే పనిలో మనమెలా పాల్గొనవచ్చో నేర్చుకుంటాం.

హగ్గయి రోజుల్లో ఒక ప్రోత్సాహకరమైన సందేశం

4. ప్రవక్తయైన హగ్గయిని తన ప్రజల దగ్గరికి యెహోవా ఎందుకు పంపించాడు?

4 హగ్గయి ప్రవక్తను యెహోవా ఒక ప్రాముఖ్యమైన పని చేయమన్నాడు. క్రీ.పూ. 537లో బబులోను నుండి యెరూషలేముకు తిరిగొచ్చిన యూదుల్లో హగ్గయి ఉండివుంటాడు. వాళ్లు యెరూషలేముకు తిరిగొచ్చిన వెంటనే ఆ నమ్మకమైన ఆరాధకులు యెహోవా ఆలయ పునాదిని వేశారు. (ఎజ్రా 3:8, 10) కానీ చుట్టుపక్కలవాళ్ల వ్యతిరేకత వల్ల కొంతకాలానికే వాళ్లు నిరుత్సాహపడి, ఆలయం కట్టడం ఆపేశారు. (ఎజ్రా 4:4; హగ్గ. 1:1, 2) కాబట్టి యూదుల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపి, ఆలయ పనిని పూర్తి చేయడానికి సహాయం చేయమని క్రీ.పూ. 520లో యెహోవా హగ్గయికి చెప్పాడు. *ఎజ్రా 6:14, 15.

5. హగ్గయి సందేశం దేవుని ప్రజలకు ఎందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చివుంటుంది?

5 హగ్గయి తన సందేశం ద్వారా యూదుల్లో యెహోవాపై విశ్వాసం పెంచాలి. ఆయన నిరుత్సాహపడిన యూదులతో ధైర్యంగా ఈ మాటలు చెప్పాడు: “‘దేశంలోని ప్రజలారా, మీరంతా ధైర్యంగా ఉండి, పని చేయండి!’ అని యెహోవా అంటున్నాడు. ‘ఎందుకంటే, నేను మీకు తోడుగా ఉన్నాను’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.” (హగ్గ. 2:4) “సైన్యాలకు అధిపతైన యెహోవా” అనే మాట యూదులకు ప్రోత్సాహాన్ని ఇచ్చివుంటుంది. యెహోవా దగ్గర దేవదూతల పెద్ద సైన్యమే ఉంది, కాబట్టి యూదులు విజయం సాధించాలంటే యెహోవా మీద నమ్మకం పెట్టుకోవాలి.

6. యెహోవా ప్రపంచశక్తి అయిన పర్షియాని కంపింపజేసినప్పుడు ఏం జరుగుతుంది?

6 యెహోవా హగ్గయిని యూదుల దగ్గరికి పంపించి, తాను అన్నిదేశాల్ని కంపింపజేస్తానని వాళ్లకు చెప్పమన్నాడు. నిరుత్సాహపడి ఆలయాన్ని కట్టడం ఆపేసిన యూదులు, అప్పట్లో ప్రపంచశక్తిగా ఉన్న పర్షియాని యెహోవా కంపింపజేస్తాడనే సందేశం వినడం వల్ల ప్రోత్సాహం పొందారు. అలా కంపింపజేయడం వల్ల ఏం జరుగుతుంది? ముందుగా, దేవుని ప్రజలు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత, యూదులుకాని వాళ్లు కూడా దేవుని ప్రజలతో కలిసి ఆలయంలో యెహోవాను ఆరాధించడం మొదలుపెడతారు. ఆ సందేశం దేవుని ప్రజలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చివుంటుంది.—జెక. 8:9.

నేడు భూమిని కంపింపజేసే ఒక పని

నేడు భూమిని కంపింపజేస్తున్న పనిలో మీరు పూర్తిగా పాల్గొంటున్నారా? (7, 8 పేరాలు చూడండి) *

7. అన్నిదేశాల్ని కంపింపజేసే ఏ పనిలో మనం సహాయం చేయవచ్చు? వివరించండి.

7 మనకాలంలో హగ్గయి ప్రవచనం ఎలా నెరవేరుతుంది? యెహోవా మళ్లీ అన్నిదేశాల్ని కంపింపజేస్తాడు. ఈసారి ఆ పనిలో మనం కూడా సహాయం చేస్తాం. అలాగని ఎలా చెప్పొచ్చు? 1914లో యెహోవా తన పరలోక రాజ్యానికి రాజుగా యేసును నియమించాడు. (కీర్త. 2:6) ఆ రాజ్యం పరిపాలిస్తుందనే వార్త ప్రపంచ నాయకులకు నిజంగా చేదువార్తే. ఎందుకంటే, “అన్యజనులకు నిర్ణయించిన కాలాలు” లేదా యెహోవా ఎన్నుకున్న రాజులు కాకుండా వేరేవాళ్లు పరిపాలించే కాలం ముగిసిందని అది తెలియజేసింది. (లూకా 21:24) ఆ కారణాన్ని బట్టి ముఖ్యంగా 1919 నుండి యెహోవా ప్రజలు, దేవుని రాజ్యమే మనుషులందరికీ ఒకేఒక్క నిరీక్షణ అని ప్రకటిస్తున్నారు. ‘ఈ రాజ్య సువార్తను’ ప్రకటించే పని ప్రపంచాన్నంతటినీ కంపింపజేస్తుంది.—మత్త. 24:14.

8. కీర్తన 2:1-3 ప్రకారం, చాలా దేశాలు మనం ప్రకటించిన సందేశానికి ఎలా స్పందించాయి?

8 ఈ సందేశానికి ప్రజలు ఎలా స్పందించారు? ఎక్కువమంది దానిని వ్యతిరేకించారు. (కీర్తన 2:1-3 చదవండి.) చాలా దేశాలకు కోపమొచ్చింది. యెహోవా నియమించిన పరిపాలకుడ్ని వాళ్లు అంగీకరించట్లేదు. మనం ప్రకటించే రాజ్య సందేశాన్ని వాళ్లు ‘మంచివార్తగా’ అనుకోవట్లేదు. నిజానికి, కొన్ని ప్రభుత్వాలు మన ప్రకటనాపనిని నిషేధించాయి. చాలామంది నాయకులు దేవున్ని సేవిస్తున్నామని చెప్పుకుంటున్నా, తమ అధికారాన్ని వదులుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదు. మొదటి శతాబ్దంలోని పరిపాలకుల్లాగే నేడున్న పరిపాలకులు కూడా, యేసు అనుచరుల మీద దాడి చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు.—అపొ. 4:25-28.

9. రాజ్య సందేశానికి దేశాలు స్పందించకపోయినా వాళ్లేం చేయడానికి యెహోవా సమయం ఇస్తున్నాడు?

9 దేశాలు చూపించిన ఈ వైఖరికి యెహోవా ఎలా స్పందించాడు? కీర్తన 2:10-12 లో ఇలా ఉంది: “కాబట్టి రాజులారా, లోతైన అవగాహన చూపించండి; భూమ్మీది న్యాయమూర్తులారా, దిద్దుబాటును స్వీకరించండి. భయపడుతూ యెహోవాను సేవించండి, వణుకుతూ సంతోషించండి. కుమారుణ్ణి ఘనపర్చండి, లేకపోతే దేవునికి కోపం వస్తుంది, అప్పుడు మీరు నాశనం చేయబడి నీతి మార్గం నుండి తొలగించబడతారు, ఎందుకంటే ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. ఆయన్ని ఆశ్రయించే వాళ్లందరూ సంతోషంగా ఉంటారు.” యెహోవా ఈ వ్యతిరేకుల మీద దయ చూపిస్తూ, వాళ్లు సరైన నిర్ణయం తీసుకోవడానికి సమయం ఇస్తున్నాడు. వాళ్లు ఇప్పటికైనా మనసు మార్చుకుని, దేవుని రాజ్యాన్ని అంగీకరించవచ్చు. అయితే సమయం ఎక్కువ లేదు. ఎందుకంటే మనం ఈ వ్యవస్థ “చివరి రోజుల్లో” జీవిస్తున్నాం. (2 తిమో. 3:1; యెష. 61:2) ప్రజలు సత్యాన్ని తెలుసుకుని యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకోవడం ముందెప్పటికన్నా ఇప్పుడు చాలా అవసరం.

ఈ పనికి వచ్చిన మంచి స్పందన

10. కంపింపజేసే పనికి కొంతమంది ఎలా స్పందిస్తారని హగ్గయి 2:7-9 చెప్తుంది?

10 హగ్గయి చెప్పిన కంపింపజేసే పనికి లేదా ప్రకటనాపనికి కొంతమంది చక్కగా స్పందిస్తున్నారు. దానివల్ల, “అన్నిదేశాల విలువైన వస్తువులు [యథార్థ హృదయంగల ప్రజలు]” యెహోవాను ఆరాధించడానికి వస్తారని హగ్గయి చెప్పాడు. * (హగ్గయి 2:7-9 చదవండి.) “చివరి రోజుల్లో” ఇలా జరుగుతుందని యెషయా అలాగే మీకా ప్రవక్తలు చెప్పారు.—యెష. 2:2-4 అధస్సూచి; మీకా 4:1, 2, అధస్సూచి.

11. రాజ్య సందేశాన్ని మొదటిసారి విన్నప్పుడు ఒక సహోదరుడు ఏం చేశాడు?

11 కెన్‌ అనే సహోదరుడు ప్రస్తుతం ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవ చేస్తున్నాడు. రాజ్య సందేశాన్ని విన్నప్పుడు అది ఆయన మీద ఎలా ప్రభావం చూపించిందో గమనించండి. దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగినదాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఇలా అంటున్నాడు: “నేను మొదటిసారి సత్యం విన్నప్పుడు మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని తెలుసుకుని ఆనందించాను. దేవుని ఆమోదాన్ని, శాశ్వత జీవితాన్ని పొందాలంటే ఏమాత్రం నమ్మకం పెట్టుకోలేని ఈ లోకంతో తెగతెంపులు చేసుకుని, యెహోవా వైపు స్థిరంగా నిలబడాలని నాకర్థమైంది. నేను దాని గురించి ప్రార్థించి వెంటనే లోకానికి మద్దతివ్వడం ఆపేశాను. ఆ తర్వాత, ఎప్పటికీ కదల్చబడని దేవుని రాజ్యానికి మద్దతిచ్చాను.”

12. ఈ చివరి రోజుల్లో యెహోవా ఆధ్యాత్మిక ఆలయం ఎలా మహిమతో నింపబడుతుంది?

12 మన ప్రకటనాపనిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. ఈ చివరి రోజుల్లో చాలామంది యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టారు. 1914లో దేవుని ఆరాధకులు 5,000 కన్నా కాస్త ఎక్కువ ఉన్నారు. ఇప్పుడైతే 80 లక్షలకన్నా ఎక్కువమంది ఉన్నారు, అలాగే ప్రతీ సంవత్సరం లక్షలాదిమంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతున్నారు. ఈ విధంగా యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలోని భూఆవరణ, ‘అన్నిదేశాల విలువైన వస్తువులతో’ నింపబడింది. ఈ ఆధ్యాత్మిక ఆలయం స్వచ్ఛారాధన కోసం చేసే ఏర్పాటును సూచిస్తుంది. యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టినవాళ్లు మార్పులు చేసుకుని, కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నప్పుడు ఆయన పేరు కూడా మహిమపర్చబడింది.—ఎఫె. 4:22-24.

దేవుని రాజ్యం గురించి ఆయన ప్రజలు సంతోషంతో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించారు (13వ పేరా చూడండి)

13. ఈ రోజుల్లో ఇంకా ఏ ప్రవచనాలు నెరవేరుతున్నాయి? (ముఖచిత్రం చూడండి.)

13 హగ్గయిలోని ప్రవచనం నెరవేరడం వల్ల ఇతర ప్రవచనాలు కూడా నెరవేరుతున్నాయి. వాటిలో ఒకటి యెషయా 60:22 లో ఉంది. అక్కడిలా చదువుతాం: “మీలో అల్పుడు వెయ్యిమంది అవుతాడు, అందరికన్నా తక్కువవాడు బలమైన జనం అవుతాడు. యెహోవానైన నేనే తగిన సమయంలో ఈ పనిని త్వరపెడతాను.” ఎక్కువమంది ప్రజలు యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టడం వల్ల మరో ప్రవచనం కూడా నెరవేరుతుంది. ఈ ‘విలువైన వస్తువులకు’ లేదా కొత్తగా యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టిన ప్రజలకు, “రాజ్య సువార్త” ప్రకటించాలనే కోరికతో పాటు వేర్వేరు నైపుణ్యాలు ఉంటాయి. ఆ నైపుణ్యాలనే యెషయా “దేశాల పాలు” అని వర్ణించాడు, వాటిని యెహోవా ప్రజలు ఉపయోగించుకుంటారు. (యెష. 60:5, 16) నైపుణ్యంగల ఇలాంటి ప్రజల సహాయంతో 240 దేశాల్లో ప్రకటనాపని చేయడం, 1000 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురణల్ని తయారుచేయడం వీలౌతోంది.

నిర్ణయం తీసుకోవాల్సిన సమయం

14. ప్రజలందరూ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి?

14 ఈ చివరి రోజుల్లో దేశాల్ని కంపింపజేయడం వల్ల ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లు దేవుని రాజ్యానికి మద్దతిస్తారా? లేదా ఈ లోక ప్రభుత్వాల మీద నమ్మకం పెడతారా? ఇది ప్రతీఒక్కరు తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన నిర్ణయం. దేవుని ప్రజలు ప్రభుత్వ చట్టాలకు లోబడతారు, కానీ రాజకీయ విషయాల్లో అస్సలు తలదూర్చరు. (రోమా. 13:1-7) దేవుని రాజ్యం మాత్రమే మనుషుల సమస్యలన్నిటికీ పరిష్కారమని వాళ్లకు తెలుసు. అంతేకాదు ఆ రాజ్యానికి ఈ లోకంతో ఏ సంబంధం లేదు.—యోహా. 18:36, 37.

15. యెహోవా ప్రజల విశ్వసనీయత పరీక్షించబడుతుందని ప్రకటన పుస్తకం ఎలా వర్ణిస్తుంది?

15 చివరి రోజుల్లో దేవుని ప్రజల విశ్వసనీయతకు పరీక్ష వస్తుందని ప్రకటన పుస్తకం చెప్తుంది. ఆ పరీక్ష ఎదురైనప్పుడు మనమీదకు తీవ్రమైన హింస, వ్యతిరేకత వస్తాయి. దేవునికి చెందాల్సిన ఆరాధనను తమకు ఇవ్వమని ఈ ప్రభుత్వాలు మనల్ని అడుగుతాయి. మనం దానికి మద్దతు ఇవ్వనప్పుడు వాళ్లు మనల్ని హింసిస్తారు. (ప్రక. 13:12, 15) ఆ ప్రభుత్వాలు, ‘సామాన్యులు-గొప్పవాళ్లు, ధనవంతులు-పేదవాళ్లు, స్వతంత్రులు-దాసులు అందరూ తమ కుడిచేతి మీద గానీ నొసటి మీద గానీ గుర్తు వేయించుకోవాలని ప్రజలందర్నీ బలవంతం’ చేస్తాయి. (ప్రక. 13:16) పూర్వకాలంలో దాసులు ఎవరి కింద పనిచేసేవాళ్లో తెలియడానికి వాళ్లకు ఒక గుర్తు వేసేవాళ్లు. అదేవిధంగా నేడు ప్రజలందరూ తమ చేతిమీద గానీ, నొసటి మీద గానీ ఒక సూచనార్థక గుర్తు వేయించుకోవాలని లోక ప్రభుత్వాలు కోరతాయి; అంటే ప్రజలు తమ ఆలోచనల ద్వారా, పనుల ద్వారా వాటికి మద్దతివ్వాలని కోరతాయి.

16. యెహోవా పట్ల మన విశ్వసనీయతను బలంగా ఉంచుకోవడం ఇప్పుడు ఎందుకు చాలా అవసరం?

16 మనం ఈ సూచనార్థక గుర్తు వేసుకుని లోక ప్రభుత్వాలకు మద్దతిస్తామా? ఎవరైతే ఆ గుర్తు వేసుకోరో వాళ్లు కష్టాల్ని ఎదుర్కొంటారు, అపాయంలో పడతారు. ప్రకటన పుస్తకం ఇలా వివరిస్తుంది, ‘ఎవరికైనా ఆ గుర్తు లేకపోతే వాళ్లు కొనలేరు, అమ్మలేరు.’ (ప్రక. 13:17) అయితే ప్రకటన 14:9, 10 లో చెప్పబడిన గుర్తు వేయించుకున్న వాళ్లను యెహోవా ఏం చేస్తాడో దేవుని ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్లు ఆ గుర్తుని వేయించుకునే బదులు, తమ చేతిమీద “యెహోవాకు చెందినవాణ్ణి” అని సూచనార్థక భావంలో రాసుకుంటారు. (యెష. 44:5) యెహోవా పట్ల మన విశ్వసనీయత బలంగా ఉండేలా చూసుకోవడానికి ఇదే సమయం. అలా చేస్తే మనం తనకు చెందినవాళ్లమని చెప్పడానికి యెహోవా సంతోషిస్తాడు.

చివరి కంపన

17. యెహోవా ఓపిక నశించినప్పుడు ఏం జరుగుతుంది?

17 ఈ చివరి రోజుల్లో యెహోవా ఎంతో ఓపిక చూపిస్తున్నాడు. ఎవ్వరూ నాశనం అవ్వకూడదని ఆయన కోరుకుంటున్నాడు. (2 పేతు. 3:9) ప్రతిఒక్కరూ పశ్చాత్తాపపడి, సరైన నిర్ణయం తీసుకునేలా ఆయన అవకాశం ఇస్తున్నాడు. అయితే యెహోవా ఓర్పుకు ఒక హద్దు ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనివాళ్లు, ఫరోకు ఎదురైనలాంటి పర్యవసానాన్నే ఎదుర్కొంటారు. యెహోవా ఫరోతో ఇలా చెప్పాడు: “ఇప్పటికల్లా నేను నా చెయ్యి చాపి నీ మీదికి, నీ ప్రజల మీదికి భయంకరమైన తెగులు రప్పించి భూమ్మీద లేకుండా నిన్ను తుడిచిపెట్టి ఉండేవాణ్ణి. అయితే నీకు నా బలాన్ని చూపించాలి, భూమంతటా నా పేరు ప్రకటించబడాలి అనే ఒక్క కారణంతోనే నిన్ను ఇంకా ప్రాణాలతో ఉండనిచ్చాను.” (నిర్గ. 9:15, 16) కాబట్టి యెహోవాయే ఒకేఒక్క సత్యదేవుడని దేశాలన్నీ చివరికి తెలుసుకుంటాయి. (యెహె. 38:23) ఇదెలా జరుగుతుంది?

18. (ఎ) హగ్గయి 2:6, 20-22 లో ఏ రకమైన కంపన గురించి ఉంది? (బి) హగ్గయి మాటలు భవిష్యత్తులో నెరవేరుతాయని మనకెలా తెలుసు?

18 హగ్గయి చనిపోయిన ఎన్నో సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు హగ్గయి 2:6, 20-22 వచనాలు భవిష్యత్తులో నెరవేరతాయని చెప్పాడు. (చదవండి.) దానిగురించి పౌలు హెబ్రీ క్రైస్తవులకు రాస్తూ ఇలా అన్నాడు: “ఇప్పుడు ఆయన, ‘ఇంకొకసారి నేను భూమినే కాదు, ఆకాశాన్ని కూడా కంపింపజేస్తాను’ అని మాటిస్తున్నాడు. ఇక్కడ ‘ఇంకొకసారి’ అనే మాట, కంపించిపోయేవి అంటే దేవుడు చేయనివి నాశనమౌతాయని సూచిస్తోంది. కంపించిపోనివి నిలిచివుండడానికే అలా జరుగుతుంది.” (హెబ్రీ. 12:26, 27) ఇక్కడ చెప్పబడిన కంపన అలాగే హగ్గయి 2:7 లో ఉన్న కంపన ఒకటి కాదు. ఈ కంపన, ఫరోలా యెహోవా పరిపాలనా హక్కును నిరాకరించేవాళ్లను శాశ్వతంగా నాశనం చేయడాన్ని సూచిస్తుంది.

19. ఏది కంపించబడదు? అది మనకెలా తెలుసు?

19 ఏది కంపించబడదు లేదా తీసివేయబడదు? పౌలు ఇంకా ఇలా అంటున్నాడు: “మనం కంపింపజేయబడలేని రాజ్యాన్ని పొందబోతున్నాం కాబట్టి దేవుని అపారదయను పొందుతూనే ఉందాం. దాని ద్వారానే మనం దైవభయంతో, సంభ్రమాశ్చర్యాలతో దేవుడు అంగీకరించే పవిత్రసేవ చేయగలుగుతాం.” (హెబ్రీ. 12:28) ఈ చివరి కంపన పూర్తైన తర్వాత దేవుని రాజ్యం మాత్రమే ఉనికిలో ఉంటుంది. అది ఎప్పటికీ నిలుస్తుంది.—కీర్త. 110:5, 6; దాని. 2:44.

20. ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలి? వాళ్లు అలా నిర్ణయించుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు?

20 ఇప్పుడిక ఎక్కువ సమయం లేదు. ఈ లోకానికి మద్దతిస్తూ నాశనమౌతారా లేదా దేవుని ఇష్టానికి తగ్గట్టు జీనిస్తూ శాశ్వతజీవితం పొందుతారా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. (హెబ్రీ. 12:25) ప్రకటనాపని ద్వారా ప్రజలు ఈ ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేలా మనం సహాయం చేయవచ్చు. మరింత ఎక్కువమంది దేవుని రాజ్యానికి మద్దతిచ్చేలా నిర్ణయించుకోవడానికి మనం సహాయపడదాం. అలాగే యేసు చెప్పిన ఈ మాటల్ని ఎప్పుడు గుర్తుంచుకుందాం: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”—మత్త. 24:14.

పాట 40 మనం ఎవరి పక్షం?

^ పేరా 5 హగ్గయి 2:7 కు సంబంధించి మన అవగాహనలో వచ్చిన మార్పును ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అలాగే దేశాలన్నిటినీ కంపింపజేసే ఆసక్తికరమైన పనిలో మనమెలా పాల్గొనవచ్చో నేర్చుకుంటాం. ఈ కంపింపజేసే పనికి కొంతమంది చక్కగా స్పందిస్తారు, ఇంకొంతమంది దానిని వ్యతిరేకిస్తారని కూడా నేర్చుకుంటాం.

^ పేరా 4 యెహోవా చెప్పిన పనిని హగ్గయి పూర్తి చేశాడని మనకు తెలుసు. ఎందుకంటే క్రీ.పూ. 515లో ఆలయం కట్టడం పూర్తైంది.

^ పేరా 10 ఇది మన అవగాహనలో వచ్చిన మార్పు. అన్నిదేశాల్ని కంపింపజేయడం వల్ల యథార్థ హృదయంగల ప్రజలు యెహోవా వైపు ఆకర్షించబడలేదని ఇంతకుముందు అనుకునేవాళ్లం. దీని గురించి 2006, మే 15 కావలికోటలో “పాఠకుల ప్రశ్నలు” చూడండి.

^ పేరా 63 చిత్రాల వివరణ: దేవుని ప్రజలు ఉత్సాహంగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని హగ్గయి ప్రోత్స​హించాడు. మనకాలంలో దేవుని ప్రజలు ఆయన సందేశాన్ని ఉత్సాహంగా ప్రకటించారు. అతిత్వరలో దేవుడు ఈ లోకాన్ని నాశనం చేస్తాడని ఒక జంట ప్రకటిస్తుంది.