కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 43

పట్టుదలగా పరిచర్య చేస్తూ ఉండండి!

పట్టుదలగా పరిచర్య చేస్తూ ఉండండి!

“మనం మానకుండా మంచిపనులు చేద్దాం.”—గల. 6:9.

పాట 68 రాజ్య విత్తనాలు చల్లుదాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవాసాక్షులమైన మనం ఎందుకు సంతోషిస్తాం, గర్వపడతాం?

 యెహోవాసాక్షులుగా ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తాం, గర్వపడతాం! ఎందుకంటే మనం యెహోవా పేరును ధరిస్తాం; ప్రకటించడంలో, శిష్యుల్ని చేయడంలో పాల్గొనడం ద్వారా మన పేరుకు తగ్గట్టు జీవిస్తాం. “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి ఉన్నవాళ్లు” విశ్వాసులయ్యేలా సహాయం చేయగలిగినప్పుడు మనం సంతోషిస్తాం. (అపొ. 13:48) యేసు కూడా అలాగే సంతోషించాడు. ఒక సందర్భంలో, శిష్యులు పరిచర్య నుండి తిరిగొచ్చి తమకు ఎదురైన మంచి అనుభవాలు చెప్పినప్పుడు, యేసు ‘పవిత్రశక్తితో నిండిపోయి ఎంతో సంతోషించాడు.’—లూకా 10:1, 17, 21.

2. మనం పరిచర్యను చాలా ముఖ్యమైనదిగా ఎంచుతున్నాం అని ఎలా చూపిస్తాం?

2 మనం పరిచర్యను చాలా ముఖ్యమైనదిగా ఎంచుతాం. అపొస్తలుడైన పౌలు తిమోతిని ఇలా ప్రోత్సహించాడు: “నీ మీద, నీ బోధ మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టు . . . అలాచేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ వినేవాళ్లను కూడా రక్షిస్తావు.” (1 తిమో. 4:16) మన పరిచర్య ప్రాణాల్ని కాపాడుతుంది. కాబట్టి దేవుని రాజ్య పౌరులుగా, మనం యెహోవాకు మహిమ తెచ్చేలా నడుచుకోవడం ద్వారా, మంచివార్తకు తగ్గట్టు ప్రవర్తించడం ద్వారా ‘మన మీద’ మనం ఎప్పుడూ శ్రద్ధ పెట్టుకుంటాం. (ఫిలి. 1:27) అలాగే, పరిచర్యకు బాగా సిద్ధపడడం ద్వారా, ఇతరులకు సాక్ష్యం ఇచ్చే ముందు యెహోవా ఆశీర్వాదం కోసం ప్రార్థించడం ద్వారా ‘మన బోధ మీద’ శ్రద్ధ చూపిస్తాం.

3. రాజ్య సందేశానికి అందరూ స్పందిస్తారా? ఒక ఉదాహరణ చెప్పండి.

3 మనం శాయశక్తులా కృషిచేసినా, మన ప్రాంతంలో రాజ్య సందేశానికి కొంతమందే స్పందించవచ్చు లేదా ఎవరూ స్పందించకపోవచ్చు. సహోదరుడు జార్జ్‌ లిండల్‌ అనుభవం పరిశీలించండి. ఆయన 1929 నుండి 1947 వరకు ఐస్‌లాండ్‌ అంతటా ఒక్కడే పరిచర్య చేశాడు. ఆయన వేల సంఖ్యలో ప్రచురణలు పంచిపెట్టాడు, అయినా ఒక్కరు కూడా సత్యంలోకి రాలేదు. ఆయన ఇలా చెప్పాడు: “కొంతమంది సత్యాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రవర్తించారు, ఎక్కువశాతం మంది అస్సలు ఏం పట్టించుకోలేదు.” చివరికి, గిలియడ్‌ పాఠశాలలో శిక్షణ పొందిన మిషనరీలు వచ్చి విస్తృతంగా పరిచర్య చేసిన తొమ్మిది సంవత్సరాల తర్వాత, ఆ దేశంలో కొంతమంది యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్నారు. *

4. ప్రజలు మంచివార్తకు స్పందించకపోతే మనకు ఎలా అనిపించవచ్చు?

4 ప్రజలు మంచివార్తకు స్పందించకపోతే మనం బాధపడతాం. పౌలుకు కూడా అలాగే అనిపించింది. యూదుల్లో ఎక్కువమంది యేసును మెస్సీయగా అంగీకరించలేదని పౌలుకు “ఎంతో దుఃఖం, తీరని వేదన” కలిగాయి. (రోమా. 9:1-3) మీరు ఎంత కృషి చేస్తున్నా, విద్యార్థి కోసం ఎంత ప్రార్థిస్తున్నా అతను ప్రగతి సాధించట్లేదా? దానివల్ల మీరు స్టడీ ఆపేయాల్సి వచ్చిందా? లేదా మీ విద్యార్థుల్లో ఇప్పటివరకు ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోలేదా? అంతమాత్రాన మీరు పరిచర్య సరిగ్గా చేయలేదని, యెహోవా మీ పరిచర్యను ఆశీర్వదించలేదని అనుకోవాలా? ఈ ఆర్టికల్‌లో మనం రెండు ప్రశ్నలకు జవాబులు చూస్తాం: (1) పరిచర్యలో విజయం సాధించడం అంటే ఏంటి? (2) మనం ఏ వాస్తవాల్ని మనసులో ఉంచుకోవాలి?

పరిచర్యలో విజయం సాధించడం అంటే ఏంటి?

5. యెహోవా సేవలో మనం చేసే ప్రతీది మనం అనుకున్నట్టు ఎందుకు జరగకపోవచ్చు?

5 దేవుని ఇష్టం చేసే వ్యక్తి గురించి బైబిలు ఇలా చెప్తుంది: “అతను చేసే ప్రతీది సఫలమౌతుంది.” (కీర్త. 1:3) అయితే, యెహోవా సేవలో మనం చేసే ప్రతీది మనం అనుకున్నట్టు జరుగుతుందని దానర్థం కాదు. ఎందుకంటే మనం అపరిపూర్ణులం, అపరిపూర్ణ లోకంలో జీవిస్తున్నాం. దానివల్ల ఊహించని సమస్యలు ఎదురౌతుంటాయి, మన జీవితం “కష్టాలూ కన్నీళ్లతో” నిండి ఉంటుంది. (యోబు 14:1) అంతేకాదు, మనం ఇంతకుముందులా పరిచర్య చేయకుండా వ్యతిరేకులు అడ్డుపడవచ్చు. (1 కొరిం. 16:9; 1 థెస్స. 2:18) మరి మన పరిచర్య ఎప్పుడు యెహోవా దృష్టిలో విజయం సాధించినట్టు అవుతుంది? ఆ ప్రశ్నకు జవాబిచ్చే కొన్ని బైబిలు సూత్రాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

మనం ఇంటింటికి వెళ్లి ప్రకటించినా, ఉత్తరాలు రాసినా, ఫోన్‌లో సాక్ష్యమిచ్చినా యెహోవా మన కృషిని విలువైనదిగా చూస్తాడు (6వ పేరా చూడండి)

6. మన పరిచర్య ఎప్పుడు యెహోవా దృష్టిలో విజయం సాధించినట్టు అవుతుంది?

6 మనం పట్టుదలగా చేసే కృషిని యెహోవా చూస్తాడు. ప్రజలు స్పందించినా స్పందించకపోయినా, మనం దేవుని మీద ప్రేమతో పట్టుదలగా కృషిచేస్తే, మన పరిచర్య యెహోవా దృష్టిలో విజయం సాధించినట్టే. పౌలు ఇలా రాశాడు: “మీరు పవిత్రులకు సేవచేశారు, ఇంకా సేవ చేస్తున్నారు; ఈ విధంగా మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీ. 6:10) ఫలితాలు వచ్చినా రాకపోయినా మన కృషిని, ప్రేమను యెహోవా గుర్తుంచుకుంటాడు. కాబట్టి, పౌలు కొరింథీయులతో అన్న ఈ మాటలు మీ విషయంలో కూడా నిజమే: “ప్రభువు సేవలో మీరు పడే కష్టం వృథా కాదు.” మనం ఊహించిన ఫలితాలు వచ్చినా, రాకపోయినా మన కష్టం వృథా కాదు.—1 కొరిం. 15:58.

7. పౌలు అన్న మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

7 పౌలు సమర్థవంతంగా మిషనరీ సేవ చేశాడు. ఆయన చేసిన కృషి వల్ల చాలా నగరాల్లో కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. ఒకసారి, క్రీస్తు పరిచారకుడిగా పౌలుకు ఉన్న అర్హతల్ని కొంతమంది ప్రశ్నించారు. అప్పుడు పౌలు, తాను ఎంతమందిని సత్యంలోకి తీసుకొచ్చాడో చెప్పలేదు కానీ ఇలా అన్నాడు: “నేను . . . ఎక్కువ పని చేశాను.” (2 కొరిం. 11:23) యెహోవా ఫలితాల్ని కాదుగానీ, మనం పట్టుదలగా చేసే కృషిని ఎక్కువ విలువైనదిగా చూస్తాడని పౌలు గుర్తుంచుకున్నాడు. మీరూ దాన్ని గుర్తుంచుకోండి.

8. మన పరిచర్య గురించి మనం ఏం గుర్తుంచుకోవాలి?

8 మన పరిచర్య యెహోవాను సంతోషపెడుతుంది. యేసు 70 మంది శిష్యుల్ని రాజ్య సందేశం ప్రకటించడానికి పంపించాడు. వాళ్లు పరిచర్య అయిపోయాక, ‘ఆనందంగా తిరిగొచ్చారు.’ వాళ్ల ఆనందానికి కారణం ఏంటి? వాళ్లు ఇలా అన్నారు: “నీ పేరున ఆజ్ఞాపిస్తే చెడ్డదూతలు కూడా మాకు లోబడుతున్నారు.” అయితే, యేసు వాళ్ల ఆలోచనను సరిదిద్దుతూ ఇలా అన్నాడు: “చెడ్డదూతలు మీకు లోబడుతున్నారని సంతోషించకండి. బదులుగా, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి.” (లూకా 10:17-20) పరిచర్యలో వాళ్లకు ఎప్పుడూ అలాంటి మంచి అనుభవాలే ఎదురవ్వవు అని యేసుకు తెలుసు. నిజానికి, అప్పుడు శిష్యులు చెప్పింది విన్నవాళ్లలో ఎంతమంది విశ్వాసులయ్యారో మనకు తెలీదు. శిష్యులు పరిచర్యలో తాము సాధించిన ఫలితాల్ని బట్టి మాత్రమే కాదుగానీ, వాళ్ల కృషిని చూసి యెహోవా సంతోషించాడని తెలుసుకొని ఆనందించాలి.

9. గలతీయులు 6:7-9 ప్రకారం, మానకుండా పరిచర్య చేస్తే ఏం పొందుతాం?

9 మానకుండా పరిచర్య చేస్తే శాశ్వత జీవితం పొందుతాం. మనం ప్రకటించడంలో, బోధించడంలో పట్టుదలగా కృషిచేయడం ద్వారా “పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం” విత్తుతాం. అంటే, పవిత్రశక్తి మన జీవితంలో పనిచేసేందుకు అనుమతిస్తాం. మనం “మానకుండా” లేదా “అలసిపోకుండా” పరిచర్య చేస్తే, శాశ్వత జీవితం అనే పంట కోస్తామని యెహోవా మాటిస్తున్నాడు. బాప్తిస్మం తీసుకునేలా ఒక వ్యక్తికి సహాయం చేసినా, చేయలేకపోయినా మనం ఆ బహుమానాన్ని పొందుతాం.—గలతీయులు 6:7-9 చదవండి.

మనం ఏ వాస్తవాల్ని మనసులో ఉంచుకోవాలి?

10. పరిచర్యలో ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది దేనిమీద ఆధారపడి ఉంటుంది?

10 ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది, ఎక్కువగా వాళ్ల హృదయ స్థితి మీదే ఆధారపడి ఉంటుంది. యేసు ఆ విషయాన్నే ఒక ఉదాహరణలో చెప్పాడు. ఆ ఉదాహరణలో విత్తేవాడు రకరకాల నేలల్లో విత్తనాలు నాటాడు. కానీ, వాటిలో ఒక నేలలోనే పంట సమృద్ధిగా పండింది. (లూకా 8:5-8) ఆ ఉదాహరణలోని వేర్వేరు నేలలు, ‘దేవుని వాక్యానికి’ వేర్వేరుగా స్పందించే ప్రజల హృదయాల్ని సూచిస్తున్నాయి అని యేసు చెప్పాడు. (లూకా 8:11-15) ఆ విత్తేవాడి లాగే, మన పనికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే, అది ప్రజల హృదయ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. రాజ్య సందేశం అనే మంచి విత్తనాలు విత్తుకుంటూ వెళ్లడమే మన బాధ్యత. పౌలు చెప్పినట్టు, “ప్రతీ వ్యక్తి తన పనిని బట్టి తగిన ప్రతిఫలం పొందుతాడు,” అంతేగానీ ఫలితాల్ని బట్టి కాదు.—1 కొరిం. 3:8.

నోవహు ఎన్నో సంవత్సరాలు పట్టుదలగా ప్రకటించినా, ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరూ ఓడలోకి రాలేదు. అయినా, నోవహు దేవుని దృష్టిలో విజయం సాధించాడు, ఎందుకంటే ఆయన యెహోవా చెప్పింది చెప్పినట్టు చేశాడు! (11వ పేరా చూడండి)

11. నీతిని ప్రకటించడంలో నోవహు విజయం సాధించాడని ఎందుకు చెప్పవచ్చు? (ముఖచిత్రం చూడండి.)

11 ప్రాచీనకాలంలోని యెహోవా సేవకులు ప్రకటించినప్పుడు కూడా ప్రజలు స్పందించలేదు. ఉదాహరణకు, నోవహు బహుశా 40-50 సంవత్సరాల పాటు ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతు. 2:5) ప్రజలు తన సందేశాన్ని వినాలని నోవహు కోరుకొని ఉండవచ్చు. కానీ వాళ్లు వింటారు అనైతే యెహోవా చెప్పలేదు. ఓడ కట్టమని చెప్తున్నప్పుడు, ఆయన నోవహుతో అన్న ఈ మాటల్ని గమనించండి: “నువ్వు, నీతోపాటు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు ఓడలోకి వెళ్లాలి.” (ఆది. 6:18) దేవుడు తనను కట్టమన్న ఓడ కొలతల్ని బట్టి కూడా, తన సందేశాన్ని ఎక్కువమంది వినకపోవచ్చు అని నోవహు గ్రహించి ఉంటాడు. (ఆది. 6:15) ఆ కాలంలో ఒక్కరు కూడా నోవహు చెప్పింది వినలేదని మనకు తెలుసు. (ఆది. 7:7) అంటే, నోవహు సరిగ్గా ప్రకటించలేదని యెహోవా అనుకున్నాడా? కానే కాదు. నిజానికి దేవుని దృష్టిలో ఆయన విజయం సాధించాడు, ఎందుకంటే ఆయన యెహోవా చెప్పింది చెప్పినట్టు చేశాడు.—ఆది. 6:22.

12. ప్రజలు వినకపోయినా, తనను వ్యతిరేకించినా యిర్మీయా ఆనందాన్ని ఎలా కాపాడుకున్నాడు?

12 యిర్మీయా ప్రవక్త కూడా అంతే. ప్రజలు తాను చెప్పేది వినకపోయినా, వ్యతిరేకించినా ఆయన 40 కన్నా ఎక్కువ సంవత్సరాలు ప్రకటించాడు. వ్యతిరేకులు తనను ‘అవమానించినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు’ ఆయన ఎంతగా నిరుత్సాహపడ్డాడంటే, ఇంక ప్రకటించడం ఆపేద్దాం అనుకున్నాడు. (యిర్మీ. 20:8, 9) కానీ ఆయన ప్రకటించడం ఆపలేదు! మానకుండా ప్రకటించడానికి, పరిచర్యలో ఆనందాన్ని కాపాడుకోవడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? ఆయన రెండు ముఖ్యమైన వాస్తవాల్ని మనసులో ఉంచుకున్నాడు. మొదటిది, యిర్మీయా ప్రకటించిన సందేశం “మంచి భవిష్యత్తు, నిరీక్షణ” కలిగి ఉండేలా ప్రజలకు సహాయం చేస్తుంది. (యిర్మీ. 29:11) రెండవదిగా, యిర్మీయా యెహోవా పేరున ప్రకటించాడు. (యిర్మీ. 15:16) మనం ప్రకటించే సందేశం కూడా ప్రజలకు నిరీక్షణను ఇస్తుంది. అంతేకాదు మనం కూడా దేవుని పేరుతో పిలవబడుతూ, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ఈ రెండు ముఖ్యమైన వాస్తవాల్ని మనసులో ఉంచుకుంటే, ప్రజలు ఎలా స్పందించినా పరిచర్యలో మన ఆనందాన్ని కాపాడుకోవచ్చు.

13. మార్కు 4:26-29 లో యేసు చెప్పిన ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకుంటాం?

13 ఆధ్యాత్మిక ఎదుగుదల క్రమక్రమంగా జరుగుతుంది. యేసు ఆ విషయాన్ని ఒక ఉదాహరణలో చెప్పాడు. (మార్కు 4:26-29 చదవండి.) ఆ ఉదాహరణలో ఒక వ్యక్తి పొలంలో విత్తనాలు చల్లుతాడు. రోజులు గడిచేకొద్దీ, పంట క్రమక్రమంగా ఎదుగుతుంది. అదంతా ఎలా జరుగుతుందో అతనికి తెలీదు. మనకు కూడా, శిష్యుల్ని చేసే పనిలో ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఎదుగుదల క్రమక్రమంగా, దశలవారీగా జరుగుతుంది. రైతు తాను కోరుకున్నంత వేగంగా పంటను ఎదిగేలా చేయలేడు. అలాగే మనం కూడా, బైబిలు విద్యార్థుల్ని మనం కోరుకున్నంత వేగంగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా చేయలేం. కాబట్టి మీ విద్యార్థులు మీరు అనుకున్నదాని కన్నా నిదానంగా ప్రగతి సాధిస్తుంటే, నిరుత్సాహపడకండి లేదా మీ ప్రయత్నాలు ఆపకండి. రైతుకు ఓర్పు అవసరమైనట్టే, శిష్యుల్ని చేసే పనిలో మనకు కూడా ఓర్పు అవసరం.—యాకో. 5:7, 8.

14. మన పరిచర్యకు ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు అని ఏ ఉదాహరణ చూపిస్తుంది?

14 కొన్ని ప్రాంతాల్లో మన పరిచర్యకు సంవత్సరాల పాటు ఫలితాలు కనిపించకపోవచ్చు. గ్లాడిస్‌ ఆల్లెన్‌, రూబి ఆల్లెన్‌ అనే అక్కాచెల్లెళ్ల అనుభవం పరిశీలించండి. * వాళ్లు 1959లో, కెనడాకు చెందిన క్విబెక్‌లోని ఒక పట్టణంలో క్రమ పయినీర్లుగా నియమించబడ్డారు. ఇరుగుపొరుగు వాళ్లు ఏమనుకుంటారో, క్యాథలిక్‌ చర్చి పాస్టర్లు ఏమంటారో అనే భయంతో అక్కడి ప్రజలు రాజ్య సందేశాన్ని వినడానికి ఇష్టపడేవాళ్లు కాదు. గ్లాడిస్‌ ఇలా గుర్తుచేసుకుంటుంది: ‘మేము రోజుకు ఎనిమిది గంటల పాటు ఇంటింటికి వెళ్లేవాళ్లం. అలా రెండు సంవత్సరాలు వెళ్లినా ఒక్కరు కూడా వినలేదు. వాళ్లు తలుపు దగ్గరికి వచ్చేవాళ్లు కానీ, మమ్మల్ని చూడగానే వెనక్కి వెళ్లిపోయే వాళ్లు. అయినా మేము మా ప్రయత్నాలు ఆపలేదు.’ మెల్లమెల్లగా ప్రజల మనసు మారింది, కొందరు రాజ్య సందేశాన్ని వినడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ పట్టణంలో మూడు సంఘాలు ఉన్నాయి.—యెష. 60:22.

15. శిష్యుల్ని చేసే పని గురించి 1 కొరింథీయులు 3:6, 7 ఏం చెప్తుంది?

15 శిష్యుల్ని చేయడం అనేది ఒక్కరి కృషితో జరిగేది కాదు. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలంటే, సంఘంలో ఉన్న అందరి సహాయం అవసరం. (1 కొరింథీయులు 3:6, 7 చదవండి.) ఒక ప్రచారకుడు ఆసక్తి చూపించిన వ్యక్తికి కరపత్రం గానీ, పత్రిక గానీ ఇస్తాడు. కానీ ఆయనకు వీలు కుదరక, ఆ రిటన్‌ విజిట్‌ని వేరే సహోదరునికి అప్పగిస్తాడు. ఈ సహోదరుడు బైబిలు స్టడీ మొదలుపెడతాడు. అంతేకాదు ఆ స్టడీకి వేర్వేరు సహోదరుల్ని, సహోదరీల్ని తీసుకెళ్తాడు. వాళ్లలో ప్రతీ ఒక్కరు ఏదోక విధంగా విద్యార్థిని ప్రోత్సహిస్తారు. విద్యార్థిని కలిసే ప్రతీ సహోదరుడు లేదా సహోదరి, సత్యపు విత్తనానికి నీళ్లు పోయడంలో సహాయం చేస్తారు. ఆ విధంగా యేసు చెప్పినట్టు ఆధ్యాత్మిక కోత పనిలో విత్తేవాడు, కోసేవాడు ఇద్దరూ కలిసి సంతోషించవచ్చు.—యోహా 4:35-38.

16. ఆరోగ్యం పాడైనా లేదా బలం తగ్గిపోయినా మీరు ఎలా పరిచర్యలో ఆనందించవచ్చు?

16 ఒకవేళ మీ ఆరోగ్యం పాడవ్వడం వల్ల లేదా బలం తగ్గిపోవడం వల్ల ప్రకటించడంలో, బోధించడంలో అంతగా పాల్గొనలేకపోతుంటే అప్పుడేంటి? అప్పుడు కూడా మీరు చేయగలిగింది చేస్తున్నందుకు సంతోషించవచ్చు. దావీదు రాజు అనుభవం పరిశీలించండి. అమాలేకీయులు దోచుకెళ్లిన తమ ఆస్తుల్ని, కుటుంబ సభ్యుల్ని తిరిగి తీసుకురావడానికి దావీదు, ఆయన మనుషులు వెళ్లారు. అయితే దావీదు మనుషుల్లో 200 మంది బాగా అలసిపోయి, పోరాడే ఓపికలేక సామాను దగ్గరే ఉండిపోయారు. యుద్ధం నుండి తిరిగొచ్చిన తర్వాత, సామాను దగ్గర ఉన్నవాళ్లకు, యుద్ధానికి వచ్చినవాళ్లకు సమానంగా దోపుడుసొమ్మును పంచాలని దావీదు ఆజ్ఞాపించాడు. (1 సమూ. 30:21-25) శిష్యుల్ని చేసే పనిలో కూడా అంతే. బహుశా మీరు అనుకున్నంత ఎక్కువగా ప్రకటించడంలో, బోధించడంలో మీరు పాల్గొనలేకపోవచ్చు. అయినప్పటికీ మీరు చేయగలిగింది చేస్తే, ఒక కొత్త వ్యక్తి యెహోవాను తెలుసుకొని బాప్తిస్మం తీసుకున్న ప్రతీసారి, ఆ సంతోషంలో మీరూ పాలుపంచుకోవచ్చు.

17. మనం ఎందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాలి?

17 మన సేవను విలువైనదిగా చూస్తున్నందుకు మనం యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాలి. ప్రజలు రాజ్య సందేశాన్ని వినడం, యెహోవాను ఆరాధించడం మన చేతుల్లో ఉండవని యెహోవాకు తెలుసు. అయినప్పటికీ తన మీద ప్రేమతో మనం పట్టుదలగా చేసే కృషిని ఆయన గమనిస్తాడు, మనకు బహుమానం ఇస్తాడు. అంతేకాదు, పరిచర్యలో మనం చేయగలిగింది చేస్తూ అందులో సంతోషం పొందేలా ఆయన సహాయం చేస్తాడు. (యోహా. 14:12) మనం మానకుండా కృషిచేస్తే, ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

పాట 67 ‘వాక్యాన్ని ప్రకటించండి’

^ పేరా 5 ప్రజలు మంచివార్తకు స్పందించినప్పుడు మనం సంతోషిస్తాం, వాళ్లు స్పందించకపోతే బాధపడతాం. మీరు స్టడీ ఇస్తున్న విద్యార్థి ప్రగతి సాధించట్లేదా? లేక మీ విద్యార్థుల్లో ఇప్పటివరకు ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోలేదా? అంతమాత్రాన మీరు పరిచర్య సరిగ్గా చేయలేదని, యెహోవా దాన్ని ఆశీర్వదించలేదని అనుకోవాలా? మనం పరిచర్యలో ఎలా విజయం సాధించవచ్చో, మన కృషికి ఫలితాలు రాకపోయినా మన ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

^ పేరా 14 గ్లాడిస్‌ ఆల్లెన్‌ జీవిత కథ చదవడానికి కావలికోట, సెప్టెంబరు 1, 2002 పత్రికలో “నేను దేన్నీ మార్చను!” అనే ఆర్టికల్‌ చూడండి.