కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 47

మీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుంది?

మీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుంది?

“ఆందోళన పడకండి. . . . విశ్వాసం చూపించండి.”—యోహా. 14:1.

పాట 119 మనకు విశ్వాసం ఉండాలి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మనకెలాంటి ప్రశ్నలు రావచ్చు?

భవిష్యత్తులో జరిగే అబద్ధమత నాశనం, మాగోగువాడైన గోగు దాడి, హార్‌మెగిద్దోను యుద్ధం లాంటి సంఘటనల గురించి ఆలోచించినప్పుడు మీకు కొన్నిసార్లు ఆందోళనగా అనిపిస్తుందా? ‘భయం కలిగించే ఆ సంఘటనలు జరిగినప్పుడు నేను నమ్మకంగా ఉండగలనా’ అని మీరెప్పుడైనా అనుకున్నారా? మీ మనసులో అలాంటి ఆలోచనలు మెదులుతుంటే ఈ ఆర్టికల్‌ ముఖ్యవచనంలో యేసు చెప్పిన మాటలు మీకు సహాయం చేస్తాయి. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఆందోళన పడకండి. . . . విశ్వాసం చూపించండి.” (యోహా. 14:1) మనం భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవడానికి బలమైన విశ్వాసం సహాయం చేస్తుంది.

2. మన విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 భవిష్యత్తులో వచ్చే పెద్దపెద్ద కష్టాల్ని తట్టుకోవాలంటే, నేడు మన విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షల్ని ఎలా తట్టుకుంటామో ఆలోచించాలి. అలా చేసినప్పుడు, ఏ విషయాల్లో మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలో తెలుస్తుంది. ఒక్కో పరీక్షను నమ్మకంగా సహించేకొద్దీ మన విశ్వాసం ఇంకా బలపడుతుంది. అప్పుడు భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని కూడా తట్టుకోగలుగుతాం. అయితే, యేసు శిష్యులకు మరింత విశ్వాసం అవసరమని చూపించిన నాలుగు పరిస్థితుల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మనకూ అలాంటి కష్టాలు ఎదురైతే ఎలా తట్టుకోవచ్చో, అవి మనల్ని భవిష్యత్తులో జరిగే సంఘటనలకు ఎలా సిద్ధం చేస్తాయో కూడా తెలుసుకుంటాం.

దేవుడు మన అవసరాల్ని తీరుస్తాడని విశ్వసించడం

మీకు ఆర్థిక సమస్యలు ఎదురవ్వొచ్చు, కానీ యెహోవా సేవలో కొనసాగేలా విశ్వాసం సహాయం చేస్తుంది (3-6 పేరాలు చూడండి)

3. మత్తయి 6:30, 33 లో, విశ్వాసం గురించి ఏ విషయాన్ని యేసు చెప్పాడు?

3 సాధారణంగా ఒక కుటుంబ పెద్ద తన భార్యాపిల్లల కోసం ఆహారాన్ని, బట్టల్ని, ఇంటిని ఇవ్వాలని అనుకుంటాడు. ఈ కష్టమైన పరిస్థితుల్లో అలా చేయడం అంత తేలికేమీ కాదు. కొంతమంది సహోదర సహోదరీలు ఉద్యోగాల్ని కోల్పోయారు అలాగే వాళ్లెంత ప్రయత్నించినా ఇంకో ఉద్యోగం దొరకట్లేదు. ఇంకొందరు, తమ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగాల్ని నిరాకరించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మన కుటుంబ అవసరాల్ని యెహోవా ఖచ్చితంగా తీరుస్తాడనే బలమైన విశ్వాసం మనకుండాలి. యేసు కొండమీది ప్రసంగంలో ఈ విషయాన్నే తన శిష్యులకు స్పష్టంగా చెప్పాడు. (మత్తయి 6:30, 33 చదవండి.) యెహోవా మనల్ని విడిచిపెట్టడనే పూర్తి నమ్మకం ఉంటే ఆయనను సేవించడం మీదే మనసుపెడతాం. యెహోవా మన అవసరాల్ని ఎలా తీరుస్తున్నాడో చూసినప్పుడు ఆయనకు మరింత దగ్గరౌతాం అలాగే మన విశ్వాసం బలపడుతుంది.

4-5. తమ అవసరాలు ఎలా తీరతాయని ఆందోళన పడుతున్న ఒక కుటుంబానికి సహాయం ఎలా అందింది?

4 వెనిజ్యులాలో ఉంటున్న మిగ్వేల్‌ కాస్ట్రో కుటుంబం గురించి ఆలోచించండి. వాళ్లు తమ అవసరాలు ఎలా తీరతాయని ఆందోళన పడుతున్నప్పుడు యెహోవా సహాయం చేశాడు. వాళ్లు తమ సొంత పొలంలో వ్యవసాయం చేసి, జీవించడానికి సరిపడా డబ్బుల్ని సంపాదించుకునేవాళ్లు. అయితే ఒక రౌడీ ముఠా వచ్చి వాళ్ల పొలాన్ని కబ్జా చేశారు. ఆ తర్వాత వాళ్ల పరిస్థితి గురించి మిగ్వేల్‌ ఇలా చెప్తున్నాడు: “ఇప్పుడు మేము కౌలుకు తీసుకున్న చిన్న పొలంలో వ్యవసాయం చేస్తూ, దానిమీద వచ్చే ఆదాయంతో బ్రతుకుతున్నాం. నేను ప్రతీరోజు ఉదయం ప్రార్థనలో, ఆ రోజు మా అవసరాలు తీర్చమని అడుగుతాను.” కాస్ట్రో కుటుంబం కష్టాల్లో ఉన్నా ప్రేమగల తండ్రి తమ అవసరాల్ని తీరుస్తాడనే పూర్తి విశ్వాసంతో క్రమంగా కూటాలకు వెళ్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. అలా వాళ్లు యెహోవా సేవకు మొదటిస్థానం ఇవ్వడం వల్ల ఆయన వాళ్ల అవసరాల్ని తీరుస్తున్నాడు.

5 ఆ కష్ట సమయమంతటిలో యెహోవా తమమీద ఎలా శ్రద్ధ చూపించాడో మిగ్వేల్‌, ఆయన భార్య యూరై ఆలోచించారు. కొన్నిసార్లు తోటి సహోదర సహోదరుల్ని ఉపయోగించుకుని యెహోవా వాళ్లకు అవసరమైన వస్తువుల్ని ఇచ్చాడు లేదా మిగ్వేల్‌కు ఉద్యోగం దొరికేలా సహాయం చేశాడు. ఇంకొన్నిసార్లు బ్రాంచి కార్యాలయం చేపట్టే సహాయక చర్యల ద్వారా యెహోవా వాళ్ల అవసరాలు తీరేలా చూశాడు. యెహోవా వాళ్లను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దానివల్ల తమ కుటుంబ సభ్యుల విశ్వాసం మరింత బలపడడాన్ని వాళ్లు చూశారు. ఒకానొక సందర్భంలో యెహోవా వాళ్లకెలా సహాయం చేశాడో గుర్తుచేసుకుంటూ వాళ్ల పెద్దమ్మాయి హోసలీన్‌ ఇలా అంటుంది: “యెహోవా సహాయాన్ని చూసినప్పుడు నాకు ప్రోత్సాహంగా అనిపించింది. ఆయన ఒక స్నేహితునిలా ఎప్పుడూ సహాయం చేస్తాడనే నమ్మకం నాకుంది. మేము కుటుంబంగా తట్టుకున్న సమస్యలు, భవిష్యత్తులో రాగల మరింత పెద్ద సమస్యలకు మమ్మల్ని సిద్ధం చేశాయి.”

6. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు మీ విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

6 మీరు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారా? అలాగైతే ఇది మీకు కష్టమైన సమయం. అయినా మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించవచ్చు. యెహోవాకు ప్రార్థించండి. మత్తయి 6:25-34 లో యేసు చెప్పిన మాటల్ని చదివి, ధ్యానించండి. ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉండేవాళ్ల అవసరాల్ని యెహోవా ఎలా తీరుస్తాడో చూపించే ఆధునికకాల అనుభవాల గురించి ఆలోచించండి. (1 కొరిం. 15:58) అలా చేసినప్పుడు మీలాంటి సమస్యల్ని ఎదుర్కొన్న ఇతరులకు సహాయం చేసినట్టే, యెహోవా మీకూ సహాయం చేస్తాడనే నమ్మకం బలపడుతుంది. మీకు కావాల్సింది ఏంటో, దాన్ని మీకెలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. యెహోవా సహాయాన్ని మీరు చూసినప్పుడు భవిష్యత్తులో ఎదురయ్యే మరింత కష్టమైన పరిస్థితుల్ని తట్టుకునేలా మీ విశ్వాసం ఇంకా బలపడుతుంది.—హబ. 3:17, 18.

“పెద్ద తుఫాను” లాంటి సమస్యల్ని తట్టుకోవడానికి విశ్వాసం అవసరం

నిజంగానే పెద్ద తుఫానులో చిక్కుకున్నా లేదా తుఫానులాంటి సమస్యలు ఎదురైనా, వాటిని తట్టుకోవడానికి బలమైన విశ్వాసం సహాయం చేస్తుంది (7-11 పేరాలు చూడండి)

7. మత్తయి 8:23-26 ప్రకారం, “ఒక పెద్ద తుఫాను” యేసు శిష్యుల విశ్వాసాన్ని ఎలా పరీక్షించింది?

7 యేసు, ఆయన శిష్యులు పడవలో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక తుఫాను వచ్చింది. తమకు బలమైన విశ్వాసం అవసరమని శిష్యులు అర్థంచేసుకునేలా యేసు ఆ సంఘటన ద్వారా వాళ్లకు సహాయం చేశాడు. (మత్తయి 8:23-26 చదవండి.) ఆ తుఫాను పెద్దదై, నీళ్లన్నీ పడవలోకి వస్తున్నప్పుడు యేసు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దాంతో శిష్యులు బెదిరిపోయి, ఆయన్ని లేపి రక్షించమని వేడుకున్నారు. అందుకు ప్రభువు వాళ్లను మృదువుగా మందలిస్తూ ఇలా అన్నాడు: “అల్పవిశ్వాసులారా, మీరెందుకు ఇంత భయపడుతున్నారు?” యేసుతో పాటు తమను కూడా, యెహోవా తేలిగ్గా కాపాడగలడని శిష్యులు గుర్తించాల్సింది. దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? ‘పెద్ద తుఫానులో’ చిక్కుకున్నా లేదా తుఫానులాంటి సమస్యలు ఎదురైనా, వాటిని తట్టుకోవడానికి బలమైన విశ్వాసం మనకు సహాయం చేస్తుంది.

8-9. ఆనెల్‌ విశ్వాసానికి ఏ పరీక్ష ఎదురైంది? దాన్ని తట్టుకోవడానికి ఆమెకేది సహాయం చేసింది?

8 ఆనెల్‌ అనే సహోదరి ప్యూర్టోరికోలో ఉంటుంది. ఒక కష్టమైన పరీక్షను తట్టుకున్నప్పుడు ఆమె విశ్వాసం ఎలా బలపడిందో గమనించండి. 2017లో హరికేన్‌ మారియా అనే “పెద్ద తుఫాను” వచ్చినప్పుడు ఆనెల్‌ ఉంటున్న ఇళ్లు కూలిపోయింది అలాగే ఆమె ఉద్యోగం పోయింది. ఆమె ఇలా చెప్తుంది: “ఆ కష్టమైన పరిస్థితిలో నేను ఆందోళనపడ్డాను. అయితే ప్రార్థించడం ద్వారా యెహోవా మీద నమ్మకం ఉంచడం నేర్చుకున్నాను. అలాగే ఆయన సేవ చేశాను.”

9 తన సమస్యల్ని తట్టుకోవడానికి విధేయత చూపించడం కూడా సహాయం చేసిందని ఆనెల్‌ చెప్తుంది. ఆమె ఇంకా ఇలా అంటోంది: “యెహోవా తన సంస్థ ద్వారా ఇచ్చిన నిర్దేశాల్ని పాటించడం వల్ల నేను ప్రశాంతంగా ఉండగలిగాను. సహోదర సహోదరీలను ఉపయోగించుకొని యెహోవా నాకు సహాయం చేశాడు. వాళ్లు నన్ను ప్రోత్సహించారు అలాగే నేను బ్రతకడానికి కావాల్సినవి ఇచ్చారు. అంతేకాదు నేను అడిగిన దానికన్నా యెహోవా ఎంతో ఎక్కువ ఇచ్చాడు. దీనంతటి వల్ల నా విశ్వాసం మరింత బలపడింది.”

10. మీ జీవితంలో ఏదైనా “ఒక పెద్ద తుఫాను” ఎదురైతే మీరేం చేయాలి?

10 మీ జీవితంలో ఏదైనా “ఒక పెద్ద తుఫాను” ఎదుర్కొంటున్నారా? బహుశా మీరు ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయి ఉండొచ్చు; లేదా తుఫాను లాంటి తీవ్రమైన అనారోగ్యం వల్ల బాగా కృంగిపోయి, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటి పరిస్థితిల్లో మీకు ఆందోళనగా అనిపించవచ్చు, అయినా యెహోవా మీదున్న నమ్మకాన్ని కోల్పోకండి. పట్టుదలగా ప్రార్థిస్తూ ఆయనకు దగ్గరవ్వండి. గతంలో యెహోవా మీకు సహాయం చేసిన సందర్భాల్ని గుర్తుచేసుకోవడం ద్వారా విశ్వాసాన్ని బలపర్చుకోండి. (కీర్త. 77:11, 12) అలా చేయడం ద్వారా యెహోవా మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడనే నమ్మకంతో ఉండొచ్చు.

11. నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత చూపించాలని మనమెందుకు తీర్మానించుకోవాలి?

11 కష్టాల్ని తట్టుకోవడానికి మీకింకా ఏది సహాయం చేయగలదు? ఆనెల్‌ చెప్పినట్టు విధేయత చూపించడం సహాయం చేస్తుంది. యెహోవా, యేసు మనపై నాయకత్వం వహిస్తున్నవాళ్లను నమ్ముతున్నట్లే, మీరూ వాళ్లను నమ్మండి. కొన్నిసార్లు వాళ్లిచ్చే నిర్దేశాలు మనకు సరైనవిగా అనిపించకపోయినా విధేయత చూపిస్తే యెహోవా ఆశీర్వదిస్తాడు. విధేయత చూపించడం ప్రాణాన్ని కాపాడుతుందని దేవుని వాక్యం ద్వారా, నమ్మకమైన సేవకుల ఉదాహరణల ద్వారా తెలుస్తుంది. (నిర్గ. 14:1-4; 2 దిన. 20:17) అలాంటి ఉదాహరణల గురించి ధ్యానించడం వల్ల యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని ఇప్పుడు అలాగే భవిష్యత్తులో పాటించాలనే మీ కోరిక బలపడుతుంది. (హెబ్రీ. 13:17) అలా చేస్తే, త్వరలో రాబోయే మహాశ్రమకు కూడా మీరు భయపడరు.—సామె. 3:25.

అన్యాయాన్ని సహించడానికి విశ్వాసం అవసరం

పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసం బలపడుతుంది (12వ పేరా చూడండి)

12. లూకా 18:1-8 ప్రకారం, అన్యాయాన్ని సహించడానికి విశ్వాసం ఎలా సహాయం చేస్తుంది?

12 అన్యాయం వల్ల తన శిష్యుల విశ్వాసానికి పరీక్ష ఎదురౌతుందని యేసుకు తెలుసు. అన్యాయాన్ని సహించేలా వాళ్లకు సహాయం చేయడానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. అది లూకా పుస్తకంలో ఉంది. ఆ ఉదాహరణలో ఒక విధవరాలు, తనకు న్యాయం జరిగేలా చూడమని అన్యాయస్థుడైన న్యాయమూర్తిని పదేపదే వేడుకుంది. అలా వేడుకుంటే అతను చివరికి సహాయం చేస్తాడని ఆమె నమ్మింది. న్యాయమూర్తి ఆఖరికి సహాయం చేశాడు. దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? యెహోవా, అన్యాయస్థుడైన ఆ న్యాయమూర్తి లాంటివాడు కాదు. కాబట్టి యేసు ఇలా అన్నాడు, “తాను ఎంచుకున్నవాళ్లు రాత్రింబగళ్లు తనను వేడుకుంటూ ఉంటే, దేవుడు తప్పకుండా వాళ్లకు న్యాయం జరిగేలా చేయడా?” (లూకా 18:1-8 చదవండి.) ఆయనింకా ఇలా అన్నాడు: “మానవ కుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమ్మీద నిజంగా ఇలాంటి విశ్వాసం కనిపిస్తుందా?” ఒకవేళ మనకు అన్యాయం ఎదురైతే ఓర్పు, పట్టుదల చూపిస్తూ ఆ విధవరాలికి ఉన్నలాంటి బలమైన విశ్వాసమే మనకూ ఉందని చూపించాలి. అలాంటి విశ్వాసం ఉంటే యెహోవా మనకు తప్పకుండా సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండొచ్చు. ప్రార్థన ఎంతో శక్తివంతమైనదని కూడా మనం నమ్మాలి. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని విధంగా మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది.

13. అన్యాయాన్ని ఎదుర్కొన్న ఒక కుటుంబానికి ప్రార్థన ఎలా సహాయం చేసింది?

13 డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఉంటున్న వెరోనికా అనే సహోదరి గురించి ఆలోచించండి. కొంతమంది సైనికులు వాళ్ల ఊరిమీద దాడి చేసినప్పుడు, సత్యంలోలేని తన భర్త, 15 ఏళ్ల తన కూతురుతో పాటు ఆమె అక్కడి నుండి పారిపోవాల్సి వచ్చింది. అలా పారిపోతున్నప్పుడు దారిలో సైనికులు వాళ్లను ఆపి, చంపేస్తామని బెదిరించారు. వెరోనికా ఏడ్వడం మొదలుపెట్టినప్పుడు, ఆమె కూతురు యెహోవా పేరును పదేపదే ఉపయోగిస్తూ గట్టిగా ప్రార్థించి ఆమెను శాంతపర్చడానికి ప్రయత్నించింది. ఆ అమ్మాయి ప్రార్థించిన తర్వాత సైనికాధికారి ఇలా అడిగాడు: “నీకు ప్రార్థించడం ఎవరు నేర్పించారు?” దానికి ఆ అమ్మాయి, ‘బైబిల్లో ఉన్న మాదిరి ప్రార్థనను ఉపయోగించి మా అమ్మ నేర్పించింది’ అని చెప్పింది. (మత్తయి 6:9-13) అప్పుడు ఆ అధికారి, “నువ్వు మీ అమ్మానాన్నలతో ధైర్యంగా వెళ్లు, మీ దేవుడైన యెహోవాయే మిమ్మల్ని కాపాడతాడు” అని అన్నాడు.

14. మన విశ్వాసానికి ఎప్పుడు పరీక్ష ఎదురవ్వొచ్చు? ఆ సమయంలో మనమేం చేయాలి?

14 ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మర్చిపోకుండా ఉండడానికి అలాంటి అనుభవాలు మనకు సహాయం చేస్తాయి. మన ప్రార్థనలకు వెంటనే లేదా అద్భుతరీతిలో జవాబు రాకపోతే అప్పుడేంటి? యేసు చెప్పిన ఉదాహరణలోని విధవరాలిలా ప్రార్థిస్తూ ఉండండి. అలాగే యెహోవా మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడని, మీ ప్రార్థనలకు సరైన సమయంలో ఏదోక విధంగా జవాబిస్తాడనే నమ్మకంతో ఉండండి. యెహోవా ఇచ్చే పవిత్రశక్తి కోసం ఆయన్ని వేడుకుంటూ ఉండండి. (ఫిలి. 4:13) మీరిప్పుడు ఎదుర్కొంటున్న కష్టాల్ని మర్చిపోయేంతగా యెహోవా మిమ్మల్ని త్వరలోనే ఆశీర్వదిస్తాడని గుర్తుంచుకోండి. యెహోవా సహాయంతో కష్టాల్ని సహిస్తూ ఉంటే మీ విశ్వాసం బలపడుతుంది అలాగే భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని సహించగలుగుతారు.—1 పేతు. 1:6, 7.

అడ్డంకుల్ని అధిగమించడానికి విశ్వాసం అవసరం

15. మత్తయి 17:19, 20 ప్రకారం, యేసు శిష్యులు ఏ సవాలు ఎదుర్కొన్నారు?

15 మనకు ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించడానికి విశ్వాసం సహాయం చేస్తుందని యేసు తన శిష్యులకు నేర్పించాడు. (మత్తయి 17:19, 20 చదవండి.) యేసు శిష్యులు చాలాసార్లు చెడ్డదూతల్ని వెళ్లగొట్టినా, ఒక సందర్భంలో అలా చేయలేకపోయారు. వాళ్లు ఎందుకలా చేయలేకపోయారు? వాళ్లకు ఇంకా ఎక్కువ విశ్వాసం అవసరమని యేసు వివరించాడు. కావాల్సినంత విశ్వాసం ఉంటే వాళ్లు కొండలాంటి పెద్ద అడ్డంకుల్ని కూడా అధిగమించగలరని ఆయన చెప్పాడు. ఈరోజుల్లో మనకు కూడా, అసలు ఏమాత్రం అధిగమించలేమని అనిపించే కష్టాలు ఎదురవ్వొచ్చు.

మనం చాలా బాధలో ఉండొచ్చు, కానీ యెహోవా సేవలో బిజీగా ఉండేలా విశ్వాసం సహాయం చేస్తుంది (16వ పేరా చూడండి)

16. తనకు ఎదురైన గుండెకోతను తట్టుకోవడానికి గేడీకి విశ్వాసం ఎలా సహాయం చేసింది?

16 గ్వాటిమాలాలో ఉంటున్న గేడీ అనే సహోదరి అనుభవాన్ని చూడండి. తన భర్తతో పాటు ఆమె మీటింగ్‌ నుండి వస్తుండగా దుండగులు ఆయన్ని హత్య చేశారు. ఆ గుండెకోతను తట్టుకోవడానికి గేడీకి విశ్వాసం ఎలా సహాయం చేసింది? ఆమె ఇలా అంటుంది: “ప్రార్థనలో నా భారాన్ని యెహోవా మీద వేసినప్పుడు ప్రశాంతంగా అనిపించింది. కుటుంబ సభ్యుల ద్వారా, సంఘంలోని స్నేహితుల ద్వారా నేను యెహోవా శ్రద్ధను చూశాను. యెహోవా సేవలో బిజీగా ఉండడం వల్ల నా బాధ తగ్గింది అలాగే రేపటి గురించి ఎక్కువ ఆందోళనపడకుండా ఉండగలిగాను. భవిష్యత్తులో ఎలాంటి పరీక్ష ఎదురైనా యెహోవా, యేసు, ఆయన సంస్థ సహాయంతో దానిని తట్టుకోగలనని నా అనుభవం నుండి నేర్చుకున్నాను.”

17. కొండలాంటి పెద్ద సమస్యని మనం ఎదుర్కొంటుంటే ఏం చేయాలి?

17 మీకు ఇష్టమైనవాళ్లు చనిపోవడం వల్ల బాధలో ఉన్నారా? అలాగైతే, చనిపోయి బ్రతికించబడిన వాళ్ల గురించి బైబిల్లో ఉన్న వృత్తాంతాల్ని చదివి, పునరుత్థాన నిరీక్షణ మీద మీకున్న విశ్వాసాన్ని బలపర్చుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సంఘం నుండి బహిష్కరించబడడం వల్ల మీరు బాధపడుతున్నారా? దేవుడిచ్చే క్రమశిక్షణ ఎప్పుడూ సరైనదే అని నమ్మకం కుదిరేలా అధ్యయనం చేయండి. మీరెలాంటి సమస్యను ఎదుర్కొంటున్నా, మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి అదొక అవకాశంగా చూడండి. మీకెలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. మీరు ఒంటరిగా ఉండకుండా సహోదర సహోదరీలకు దగ్గరగా ఉండండి. (సామె. 18:1) మీకెదురైన చేదు అనుభవాలు గుర్తొచ్చి బాధ కలిగితే, దాన్ని తట్టుకోవడానికి సహాయపడే పనులు చేయండి. (కీర్త. 126:5, 6) మీరు కూటాలకు వెళ్లడం, పరిచర్యకు వెళ్లడం, బైబిలు చదవడం అస్సలు ఆపకండి. అలాగే భవిష్యత్తులో యెహోవా ఇస్తానని మాటిచ్చిన అద్భుతమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండండి. యెహోవా మీకెలా సహాయం చేస్తున్నాడో చూసినప్పుడు, ఆయన మీద మీ విశ్వాసం ఇంకా బలపడుతుంది.

“ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా మాకు సాయం చేయి”

18. మీకు ఉండాల్సినంత విశ్వాసం లేదని గుర్తిస్తే మీరేం చేయవచ్చు?

18 గతంలో లేదా ఇప్పుడు మీకెదురైన పరీక్షల వల్ల మీకు ఉండాల్సినంత విశ్వాసం లేదని గుర్తిస్తే నిరుత్సాహపడకండి. మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి వాటిని ఒక అవకాశంగా చూడండి. “ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా మాకు సాయం చేయి” అని అపొస్తలులు అడిగినట్టే మీరూ అడగండి. (లూకా 17:5) అలాగే ఈ ఆర్టికల్‌లో చర్చించిన అనుభవాల గురించి ఆలోచించండి. మిగ్వేల్‌-యూరై గుర్తుచేసుకున్నట్టే, యెహోవా మీ అవసరాన్ని తీర్చిన ప్రతీ సందర్భాన్ని గుర్తుచేసుకోండి. ముఖ్యంగా పెద్ద సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు, వెరోనికా కూతురు అలాగే ఆనెల్‌లాగే పట్టుదలగా ప్రార్థించండి. గేడీకి సహాయం చేసినట్టే, యెహోవా మనకు కూడా కుటుంబ సభ్యుల ద్వారా, స్నేహితుల ద్వారా కావాల్సిన సహాయం చేస్తాడని గుర్తుంచుకోండి. మీరిప్పుడు పరీక్షల్ని తట్టుకోవడానికి యెహోవా సహాయాన్ని తీసుకుంటే, భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి పరీక్షలనైనా తట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడనే నమ్మకం మీకింకా బలపడుతుంది.

19. యేసు ఏం నమ్మాడు? మనం ఏ నమ్మకంతో ఉండొచ్చు?

19 తమకు ఏ విషయాల్లో మరింత విశ్వాసం అవసరమో శిష్యులు అర్థం చేసుకునేలా యేసు సహాయం చేశాడు. అయితే భవిష్యత్తులో ఎదురయ్యే పరీక్షల్ని వాళ్లు యెహోవా సహాయంతో తట్టుకుని, విజయం సాధిస్తారని ఆయన నమ్మాడు. (యోహా. 14:1; 16:33) బలమైన విశ్వాసం వల్ల ఒక గొప్పసమూహం మహాశ్రమను దాటి వస్తుందని కూడా ఆయన నమ్మాడు. (ప్రక. 7:9, 14) ఆ గొప్పసమూహంలో మీరూ ఉంటారా? మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుని బలపర్చుకోవడానికి ఇప్పుడు చేయగలిగినదంతా చేస్తే, యెహోవా అపారదయ వల్ల ఆ గొప్పసమూహంలో ఒక్కరిగా ఉంటారనే నమ్మకంతో ఉండవచ్చు.—హెబ్రీ. 10:39.

పాట 118 ‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’

^ పేరా 5 ఈ దుష్టలోకం అంతమవ్వాలని మనందరం కోరుకుంటాం. అయితే అంతం వరకు సహించడానికి కావాల్సిన బలమైన విశ్వాసం మనకుందా అని కొన్నిసార్లు ఆలోచిస్తుండవచ్చు. అందుకే మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి సహాయం చేసే అనుభవాల్ని, పాఠాల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.