కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 50

మంచి కాపరియైన యేసు స్వరాన్ని వినండి

మంచి కాపరియైన యేసు స్వరాన్ని వినండి

“అవి నా స్వరాన్ని వింటాయి.”—యోహా. 10:16.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యేసు తన అనుచరుల్ని గొర్రెలతో పోల్చడానికి ఒక కారణం ఏంటి?

 యేసుక్రీస్తు తన అనుచరులతో తనకున్న బంధాన్ని, గొర్రెలతో గొర్రెల కాపరికున్న బంధంతో పోల్చాడు. (యోహా. 10:14) ఆ పోలిక సరైనదే. గొర్రెలకు తమ కాపరి ఎవరో తెలుసు అలాగే అవి ఆయన మాట వింటాయి. దాన్ని స్వయంగా చూసిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “మేము కొన్ని గొర్రెల్ని ఫోటో తీయాలనుకున్నాం. కానీ మేము ఎంత ప్రయత్నించినా అవి మా దగ్గరికి రాలేదు. వాటికి మా స్వరం తెలీదు కాబట్టి అవి మా దగ్గరికి రాలేదు. ఇంతలో గొర్రెల కాపరియైన ఒక పిల్లవాడు వాటిని పిలవగానే అవి అతని వెనకే వెళ్లాయి.”

2-3. (ఎ) యేసు అనుచరులు ఆయన స్వరాన్ని వింటున్నారని ఎలా చూపిస్తారు? (బి) ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మనమేం పరిశీలిస్తాం?

2 పై పేరాలో చూసిన వ్యక్తి అనుభవం, గొర్రెలతో పోల్చబడిన తన శిష్యుల గురించి యేసు చెప్పిన మాటల్ని గుర్తుచేస్తుంది. ఆయన ఇలా అన్నాడు: “అవి నా స్వరాన్ని వింటాయి.” (యోహా. 10:16) కానీ, యేసు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఆయన స్వరాన్ని వింటున్నామని ఎలా చెప్పొచ్చు? ఆయన బోధించిన విషయాల్ని పాటించినప్పుడు ఆయన స్వరాన్ని వింటున్నామని చూపిస్తాం.—మత్త. 7:24, 25.

3 యేసు బోధించేటప్పుడు కొన్నిటిని చేయకూడదని, కొన్నిటిని చేయమని చెప్పాడు. వాటిని ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. ఆయన చేయకూడదని చెప్పిన రెండు విషయాల గురించి ఇప్పుడు చూస్తాం.

“అతిగా చింతించడం ఆపండి”

4. లూకా 12:29 ప్రకారం, మనం వేటి గురించి ‘అతిగా చింతిస్తాం’?

4 లూకా 12:29 చదవండి. జీవించడానికి అవసరమయ్యే వాటిగురించి “అతిగా చింతించడం ఆపండి” అని యేసు తన అనుచరులకు చెప్పాడు. ఆయన ఇచ్చిన సలహా ఎప్పుడూ సరైనదిగా, తెలివైనదిగా ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి మనం దాన్ని పాటించాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు అది కష్టంగా ఉండొచ్చు. ఎందుకు?

5. కొంతమంది తమ కనీస అవసరాల గురించి ఎందుకు చింతిస్తారు?

 5 కొంతమంది ఆహారం, బట్టలు, ఇల్లు వంటి కనీస అవసరాల గురించి చింతిస్తారు. బహుశా పేదరికం ఎక్కువగా ఉన్న, ఉద్యోగం దొరకడం కష్టంగా ఉన్న దేశంలో వాళ్లు జీవిస్తుండవచ్చు. దానివల్ల తమ కుటుంబ అవసరాల్ని తీర్చడానికి సరిపడా డబ్బుల్ని సంపాదించడం వాళ్లకు కష్టంగా ఉండొచ్చు. లేదా కుటుంబంలో సంపాదించే వ్యక్తే చనిపోయి ఉండొచ్చు. అలాగే కోవిడ్‌-19 రావడం వల్ల చాలామంది తమ ఉద్యోగాల్ని కోల్పోయి ఉండొచ్చు. (ప్రసం. 9:11) ఇలాంటి పరిస్థితుల్ని లేదా ఇతర ఇబ్బందుల్ని మనం ఎదుర్కొంటుంటే “అతిగా చింతించడం ఆపండి” అని యేసు ఇచ్చిన సలహాను ఎలా పాటించవచ్చు?

మీ అవసరాల గురించి అతిగా చింతించే బదులు, యెహోవా మీద నమ్మకాన్ని పెంచుకోండి (6-8 పేరాలు చూడండి) *

6. అపొస్తలుడైన పేతురుకు ఏం జరిగిందో వివరించండి.

6 పేతురు, ఇతర అపొస్తలులు ఒకసారి పడవ మీద గలిలయ సముద్రంలో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా ఒక తుఫాను వచ్చింది. అదే సమయంలో యేసు నీళ్లమీద నడుచుకుంటూ రావడం వాళ్లు చూశారు. అప్పుడు పేతురు యేసుతో: “ప్రభువా, నువ్వే అయితే, నన్ను నీళ్లమీద నడుచుకుంటూ నీ దగ్గరికి రానివ్వు” అన్నాడు. యేసు ఆయన్ని “రా!” అని పిలిచాడు. అప్పుడు పేతురు పడవ దిగి “నీళ్లమీద నడుచుకుంటూ యేసు వైపుకు వెళ్లాడు.” కానీ ఆ తర్వాత, “తుఫానును చూసినప్పుడు అతను భయపడిపోయాడు. అతను నీళ్లలో మునిగిపోతున్నప్పుడు, ‘ప్రభువా, రక్షించు!’ అని కేకలు వేశాడు.” యేసు వెంటనే చేయి చాపి పేతురును కాపాడాడు. యేసు వైపు చూస్తున్నంతసేపూ పేతురు నీళ్లమీద నడవగలిగాడని గమనించండి. కానీ అతను తుఫానును చూసినప్పుడు భయపడి, మునిగిపోబోయాడు.—మత్త. 14:24-31.

7. పేతురుకు జరిగిన దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?

7 పేతురుకు జరిగిన దాన్నుండి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. పేతురు పడవ దిగి సముద్రంమీద నడుస్తున్నప్పుడు తుఫానును చూసి, భయపడి మునిగిపోతాడని అనుకోలేదు. అతను నీళ్లమీద నడుస్తూ యేసు దగ్గరికి వెళ్లాలని కోరుకున్నాడు. కానీ యేసును చూస్తూ ఉండకుండా తుఫానును చూడడంవల్ల కంగారుపడ్డాడు. నీళ్లమీద నడవడానికి పేతురుకు విశ్వాసం అవసరమైనట్టే, నేడు కష్టాల్ని తట్టుకోవడానికి మనకు కూడా విశ్వాసం అవసరం. మనం యెహోవా మీద, ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచకపోతే మన విశ్వాసం బలహీనపడవచ్చు, సమస్యల్లో కూరుకుపోవచ్చు. కాబట్టి మన జీవితంలో తుఫానులాంటి పెద్దపెద్ద సమస్యలు వచ్చినా యెహోవా మీద, మనల్ని కాపాడగల ఆయన సామర్థ్యం మీద నమ్మకముంచాలి. దానికోసం మనమేం చేయాలి?

8. మన అవసరాల గురించి అతిగా చింతించకుండా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

8 మన సమస్యల గురించి చింతించే బదులు యెహోవా మీద నమ్మకం పెట్టుకోవాలి. మన జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు మొదటిస్థానం ఇస్తే మన అవసరాల్ని తీరుస్తానని యెహోవా ఇస్తున్న మాటను గుర్తుంచుకోండి. (మత్త. 6:32, 33) ఆయన మాటిస్తే దాన్నెప్పుడూ తప్పడు. (ద్వితీ. 8:4, 15, 16; కీర్త. 37:25) ఆయన పక్షుల్ని, పువ్వుల్ని పట్టించుకుంటున్నాడంటే, మనకు కావాల్సిన ఆహారాన్ని, బట్టల్ని కూడా తప్పకుండా ఇస్తాడు. (మత్త. 6:26-30; ఫిలి. 4:6, 7) పిల్లలకు అవసరమయ్యేవన్నీ ఇవ్వడానికి తల్లిదండ్రుల్ని ప్రేమ పురికొల్పినట్టే, తన ప్రజల అవసరాల్ని తీర్చడానికి యెహోవాను ప్రేమ పురికొల్పుతుంది. కాబట్టి ఆయన మన అవసరాల్ని తీరుస్తాడని ఎప్పుడూ నమ్మకంతో ఉండవచ్చు.

9. ఒక పయినీరు జంట అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

9 యెహోవా మన అవసరాల్ని ఎలా తీరుస్తాడో అర్థంచేసుకోవడానికి ఒక పయినీరు జంట అనుభవాన్ని చూడండి. శరణార్థ శిబిరంలో ఉన్న కొంతమంది సహోదరీలను మీటింగ్‌కు తీసుకురావడానికి, ఆ జంట తమ పాత కారులో గంటసేపు ప్రయాణం చేసి వెళ్లారు. ఆ సహోదరుడు ఇలా అంటున్నాడు: “మీటింగ్‌ అయ్యాక ఆ సహోదరీల్ని భోజనానికి పిలిచాం. కానీ వాళ్లకు పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదనీ మాకు వెంటనే గుర్తొచ్చింది.” ఆ తర్వాత ఏం జరిగిందో ఆ సహోదరుడు ఇంకా ఇలా చెప్తున్నాడు: “మేము ఇంటికొచ్చేసరికి రెండు పెద్ద సంచుల్లో ఆహారం మా తలుపు దగ్గర పెట్టుంది. వాటిని అక్కడ ఎవరు పెట్టారో మాకు తెలీదుగానీ, యెహోవా మా అవసరాల్ని తీర్చాడని మాకర్థమైంది.” కొంతకాలం తర్వాత వాళ్ల కారు పాడైంది. పరిచర్యకు వెళ్లడానికి వాళ్లకు ఆ కారు అవసరం. కానీ దాన్ని రిపేరు చేయించడానికి వాళ్ల దగ్గర డబ్బులు లేవు. రిపేరుకు ఎంత అవుతుందో కనుక్కోవడానికి, ఆ సహోదరుడు కారుని మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు ఒకతను వచ్చి: “ఈ కారు ఎవరిది?” అని అడిగాడు. ఆ కారు తనదేనని, రిపేరు చేయించడానికి తీసుకొచ్చానని ఆ సహోదరుడు చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి: “ఏం ఫర్వాలేదు, మా ఆవిడకు ఇదే మోడల్‌, ఇదే కలర్‌ కారు కావాలి. దీనిని నాకు ఎంతకు అమ్ముతారు?” అని అడిగాడు. సహోదరుడు ఆ కారు అమ్మేయడం వల్ల వేరే కారు కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు దొరికాయి. ఆయన చివరికి ఇలా అన్నాడు: “ఆరోజు మేమెంత సంతోషించామో నేను మాటల్లో చెప్పలేను. అదేదో అనుకోకుండా జరిగింది కాదుగానీ, యెహోవాయే మాకు సహాయం చేశాడు.”

10. మన అవసరాల గురించి అతిగా చింతించకుండా ఉండడానికి, కీర్తన 37:5 ఎలా సహాయం చేస్తుంది?

10 మంచి కాపరియైన యేసు మాటల్ని విని, మన అవసరాల గురించి అతిగా చింతించడం ఆపేసినప్పుడు, యెహోవా మనకు అవసరమైనవి ఇస్తాడనే నమ్మకంతో ఉండొచ్చు. (కీర్తన 37:5 చదవండి; 1 పేతు. 5:7)  5వ పేరాలో ప్రస్తావించిన పరిస్థితుల గురించి ఆలోచించండి. యెహోవా ఇప్పటిదాకా కుటుంబ పెద్ద ద్వారా లేదా ఉద్యోగం ద్వారా మన అవసరాల్ని తీర్చి ఉండొచ్చు. ఒకవేళ పరిస్థితులు మారి మీ కుటుంబ పెద్ద మీ అవసరాలు తీర్చలేకపోతే లేదా మీ ఉద్యోగం పోతే, అప్పుడేంటి? యెహోవా మరో విధంగానైనా మీ బాగోగులు చూసుకుంటాడు, ఖచ్చితంగా మీ అవసరాల్ని తీరుస్తాడు. అయితే, యేసు చేయొద్దని చెప్పిన మరో విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

“తీర్పు తీర్చడం ఆపేయండి”

ఇతరుల్లో ఉన్న మంచి మీద దృష్టిపెడితే తీర్పుతీర్చడం ఆపేస్తాం (11, 14-16 పేరాలు చూడండి) *

11. మత్తయి 7:1, 2 ప్రకారం ఏం చేయొద్దని యేసు చెప్పాడు? అది మనకెందుకు కష్టంగా ఉండొచ్చు?

11 మత్తయి 7:1, 2 చదవండి. మనుషులు అపరిపూర్ణులని, ఇతరుల లోపాల మీద మనసుపెడతారని యేసుకు తెలుసు. అందుకే ఆయనిలా అన్నాడు: “తీర్పు తీర్చడం ఆపేయండి.” తోటి సహోదర సహోదరీలకు తీర్పుతీర్చకుండా ఉండడానికి మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు తప్పిపోతాం. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? యేసు స్వరం వింటూ ఇతరులకు తీర్పుతీర్చడం ఆపేయడానికి మనం కృషిచేయాలి.

12-13. యెహోవా దావీదుతో వ్యవహరించిన విధానాన్ని ధ్యానించడం, ఇతరులకు తీర్పుతీర్చకుండా ఉండడానికి మనకెలా సహాయం చేస్తుంది?

12 ఇతరుల లోపాల మీద మనసుపెట్టకుండా ఉండడానికి యెహోవా ఆదర్శం మనకు సహాయం చేస్తుంది. ఆయన మనుషుల్లో ఉన్న మంచినే చూస్తాడు. ఉదాహరణకు, రాజైన దావీదు గంభీరమైన తప్పులు చేసినప్పుడు యెహోవా అతనితో ఎలా వ్యవహరించాడో ఆలోచించండి. అతను బత్షెబతో వ్యభిచారం చేశాడు. అలాగే ఆమె భర్తను చంపించాడు. (2 సమూ. 11:2-4, 14, 15, 24) దానివల్ల దావీదే కాదు, అతని భార్యలతో సహా మిగతా కుటుంబమంతా కష్టాలపాలయ్యారు. (2 సమూ. 12:10, 11) మరో సందర్భంలో, యెహోవా ఆజ్ఞాపించకపోయినా దావీదు ఇశ్రాయేలు సైన్యంలో పురుషుల్ని లెక్కించాడు. బహుశా గర్వంతో అతను అలా చేసుండొచ్చు. యెహోవా మీద పూర్తి నమ్మకముంచే బదులు, అతను తన సైన్యం మీద నమ్మకముంచాడు. దానివల్ల ఏం జరిగింది? యెహోవా తెగులు రప్పించడం వల్ల 70,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.—2 సమూ. 24:1-4, 10-15.

13 మీరు ఆ సమయంలో జీవించివుంటే దావీదును ఎలా చూసుండేవాళ్లు? యెహోవా అతన్ని క్షమించకూడదని అనుకునేవాళ్లా? కానీ యెహోవా అలా అనుకోలేదు. ఆయన అప్పటివరకు దావీదు చూపించిన నమ్మకాన్ని, నిజమైన పశ్చాత్తాపాన్ని చూశాడు. కాబట్టి దావీదు చేసిన ఘోరమైన తప్పుల్ని ఆయన క్షమించాడు. దావీదు తనను ఎంతో ప్రేమిస్తున్నాడని, సరైంది చేయాలని కోరుకుంటున్నాడని యెహోవాకు తెలుసు. ఆయన మనలో మంచిని చూస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!—1 రాజు. 9:4; 1 దిన. 29:10, 17.

14. ఇతరులకు తీర్పుతీర్చకుండా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

14 యెహోవా మనుషుల నుండి పరిపూర్ణతను ఆశించట్లేదు. కాబట్టి మనం కూడా ఇతరుల నుండి పరిపూర్ణతను ఆశించకుండా వాళ్లలో మంచిని చూడాలి. ఇతరుల్లో ఉన్న లోపాల్ని చూసి, వాళ్లను విమర్శించడం చాలా తేలిక. అయితే యెహోవాను అనుకరించే ఒకవ్యక్తి ఇతరుల్లో లోపాలున్నా, వాటిని పట్టించుకోకుండా వాళ్లతో కలిసి పనిచేస్తాడు. ఒక వజ్రం పాలిష్‌ చేయకముందు చూడ్డానికి అంత అందంగా ఉండదు. కానీ దాన్ని పాలిష్‌ చేసిన తర్వాత చాలా అందంగా, విలువైనదిగా ఉంటుందని ఒక తెలివైన వ్యక్తి అర్థంచేసుకుంటాడు. మనం కూడా యెహోవాలా, యేసులా మనుషుల లోపాల మీద కాకుండా వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీద దృష్టిపెట్టాలి.

15. ఇతరుల పరిస్థితుల గురించి ఆలోచించడం, వాళ్లను తప్పుపట్టకుండా ఉండడానికి మనకెలా సహాయం చేస్తుంది?

15 ఇతరుల్లో మంచి లక్షణాల్ని చూడడంతో పాటు, వాళ్లను తప్పుపట్టకుండా ఉండడానికి మనకింకా ఏది సహాయం చేస్తుంది? మనం వాళ్ల పరిస్థితుల గురించి ఆలోచించొచ్చు. ఉదాహరణకు ఒకసారి దేవాలయంలో, ఒక పేద విధవరాలు చాలా తక్కువ విలువగల రెండు చిన్న నాణేల్ని కానుకపెట్టెలో వేయడం యేసు చూశాడు. “ఆమె ఎక్కువ ఎందుకు వెయ్యలేదు?” అని ఆయన అడగలేదు. ఆ విధవరాలు ఎంత ఇచ్చిందనే దానిమీద దృష్టిపెట్టే బదులు, ఆమె ఉద్దేశాల పరిస్థితుల గురించి యేసు ఆలోచించి, ఆమె ఇవ్వగలిగినదంతా ఇచ్చినందుకు ఆమెను మెచ్చుకున్నాడు.—లూకా 21:1-4.

16. వెరోనికా అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

16 ఇతరుల పరిస్థితి గురించి ఆలోచించడం ఎంత ప్రాముఖ్యమో సహోదరి వెరోనికా అనుభవం ద్వారా మనం అర్థంచేసుకోవచ్చు. ఆమె వెళ్లే సంఘంలో ఒక ఒంటరి తల్లీకొడుకు ఉన్నారు. వెరోనికా ఇలా చెప్తుంది: “ఆ తల్లీకొడుకు క్రమంగా కూటాలకు, పరిచర్యకు రావట్లేదని నాకనిపించింది. దాన్నిబట్టి వాళ్ల గురించి నేను తప్పుగా అనుకునేదాన్ని. అయితే ఒకసారి ఆ తల్లితో కలిసి నేను పరిచర్యకు వెళ్లాను. తన కొడుకు మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని అప్పుడు నాకు చెప్పింది. తమను తాము పోషించుకోవడానికి అలాగే యెహోవాతో తమ సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి ఆమె చేయగలిగినదంతా చేస్తుందని చెప్పింది. కొన్నిసార్లు తన కొడుకు ఆరోగ్య పరిస్థితి బట్టి వేరే సంఘంలో కూటాలకు వెళ్లేదని నాకు చెప్పింది.” వెరోనికా చివరికి ఇలా అంటుంది: “ఆ ఒంటరి తల్లి తన జీవితంలో ఇన్ని కష్టాలు పడుతుందని నాకు నిజంగా తెలీదు. యెహోవాను సేవించడానికి ఆమె చేస్తున్న కృషంతటిని బట్టి నేనిప్పుడు ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను.”

17. యాకోబు 2:8 ప్రకారం, మనమేం చేయాలి? దాన్నెలా చేయవచ్చు?

17 తోటి సహోదరుడు లేదా సహోదరి గురించి మనం తప్పుగా ఆలోచించామని గుర్తిస్తే ఏం చేయాలి? మన సహోదర సహోదరీలను ప్రేమించాలని గుర్తుంచుకోవాలి. (యాకోబు 2:8 చదవండి.) దానితోపాటు, యెహోవాకు పట్టుదలగా ప్రార్థిస్తూ తీర్పుతీర్చడం ఆపేయడానికి సహాయం చేయమని అడగాలి. తర్వాత మన ప్రార్థనలకు అనుగుణంగా పనిచేస్తూ, ఎవరి గురించైతే తప్పుగా అనుకున్నామో వాళ్లతో సమయం గడపాలి. దానికోసం మనం వాళ్లతో కలిసి పరిచర్య చేయవచ్చు లేదా వాళ్లను మన ఇంటికి భోజనానికి ఆహ్వానించవచ్చు. అలా చేసినప్పుడు వాళ్ల గురించి తెలుసుకోగలుగుతాం. వాళ్ల గురించి ఎక్కువ తెలుసుకునేకొద్దీ యెహోవాలా, యేసులా వాళ్లలో మంచిని చూడగలుగుతాం. అప్పుడు, “తీర్పు తీర్చడం ఆపేయండి” అని చెప్పిన మంచి కాపరియైన యేసు స్వరాన్ని వింటున్నామని చూపిస్తాం.

18. మంచి కాపరియైన యేసు స్వరాన్ని వింటున్నామని మనమెలా చూపిస్తాం?

18 గొర్రెలు ఎలాగైతే తమ కాపరి స్వరాన్ని వింటాయో, యేసు అనుచరులు ఆయన స్వరాన్ని వింటారు. మన అవసరాల గురించి అతిగా చింతించకుండా ఉండడానికి, ఇతరులకు తీర్పుతీర్చకుండా ఉండడానికి తీవ్రంగా కృషి చేసినప్పుడు యెహోవా, యేసు దాన్ని ఆశీర్వదిస్తారు. మనం ‘చిన్నమందకు’ చెందినవాళ్లమైనా లేదా ‘వేరే గొర్రెలకు’ చెందినవాళ్లమైనా మంచి కాపరియైన యేసు స్వరాన్ని వింటూ లోబడుతూ ఉందాం. (లూకా 12:32; యోహా. 10:11, 14, 16) తర్వాతి ఆర్టికల్‌లో యేసు తన అనుచరులకు చేయమని చెప్పిన రెండు విషయాల గురించి చూస్తాం.

పాట 101 ఐకమత్యంతో పనిచేద్దాం

^ తన గొర్రెలు తన స్వరాన్ని వింటాయని యేసు చెప్పినప్పుడు, తన శిష్యులు తన బోధల్ని విని పాటిస్తారని దానర్థం. ఈ ఆర్టికల్‌లో మనం యేసు చెప్పిన రెండు బోధల్ని అంటే, మన అవసరాల గురించి ఆందోళన పడకూడదని, ఇతరులకు తీర్పు తీర్చకూడదని చూస్తాం. అలాగే ఆయన చెప్పిన ఆ విషయాల్ని మనమెలా పాటించవచ్చో కూడా చర్చిస్తాం.

^ చిత్రాల వివరణ: ఒక సహోదరుడు ఉద్యోగాన్ని కోల్పోయాడు; కుటుంబానికి అవసరమైనవి కొనివ్వడానికి అతని దగ్గర సరిపడా డబ్బులు లేవు; అలాగే అతను ఉంటున్న ఇంటినుండి వేరే ఇంటికి మారాల్సి వస్తుంది. అతను జాగ్రత్తగా లేకపోతే ఆందోళనల్లో మునిగిపోయి, యెహోవా ఆరాధనకు మొదటిస్థానం ఇవ్వలేడు.

^ చిత్రాల వివరణ: ఒక సహోదరుడు కూటానికి ఆలస్యంగా వచ్చాడు. కానీ ఆయన అనియత సాక్ష్యం ఇవ్వడం, వయసుపైబడిన వ్యక్తికి సహాయం చేయడం, రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడం లాంటి మంచిపనులు చేస్తున్నాడు.