కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 8

మీరిచ్చే సలహా ఇతరుల ‘హృదయాన్ని సంతోషపెడుతుందా?’

మీరిచ్చే సలహా ఇతరుల ‘హృదయాన్ని సంతోషపెడుతుందా?’

“నూనె, ధూపం హృదయాన్ని సంతోషపెట్టినట్టే నిజాయితీతో ఇచ్చిన సలహా నుండి చిగురించే తియ్యని స్నేహం హృదయాన్ని సంతోషపెడుతుంది.”—సామె. 27:9.

పాట 102 ‘బలహీనులకు సహాయం చేయండి’

ఈ ఆర్టికల్‌లో. . . *

1-2. సలహా ఇవ్వడం గురించి ఒక సహోదరుడు ఏం నేర్చుకున్నాడు?

 ఇద్దరు సంఘపెద్దలు చాలా సంవత్సరాల క్రితం, కూటాలకు క్రమంగా హాజరుకాని ఒక సహోదరిని కలిశారు. ఆ ఇద్దరిలో ఒక పెద్ద కూటాలకు రావడం గురించి వివరించే ఎన్నో లేఖనాల్ని ఆమెకు చూపించాడు. ఆ సహోదరిని చక్కగా ప్రోత్సహించామని అనుకున్నాడు. కానీ వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు ఆమె ఇలా అంది: “నా పరిస్థితి గురించి మీకు అస్సలు అర్థంకాలేదు.” ఆ సహోదరి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటుందో తెలుసుకోకుండానే వాళ్లు సలహా ఇచ్చారు. దానివల్ల వాళ్లిచ్చిన సలహా ఆమెకు ప్రయోజనకరంగా అనిపించలేదు.

2 ఆ సహోదరికి లేఖనాలు చూపించిన సంఘపెద్ద ఇలా అంటున్నాడు: “ఆమె మాటలు విన్న వెంటనే, ఆమెకు మామీద గౌరవంలేదని అనిపించింది. అయితే నేను ముందు ఆమె పరిస్థితి గురించి ఆలోచించకుండా, ఏ లేఖనాలు చూపించాలనే దానిగురించే ఆలోచించానని నాకర్థమైంది. ఆమె ఎదుర్కొంటున్న సమస్య గురించి తెలుసుకుని, నేను ఎలా సహాయం చేయగలనో అడిగి ఉండాల్సింది.” ఆ అనుభవం నుండి ఆ పెద్ద ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడు. ఇప్పుడతను ఇతరుల్ని ఇంకా బాగా అర్థంచేసుకుంటూ, వాళ్లకు సహాయం చేస్తున్నాడు.

3. సంఘంలో ఎవరెవరు సలహా ఇవ్వొచ్చు?

 3 అవసరమైనప్పుడు సలహా ఇవ్వాల్సిన బాధ్యత కాపరులుగా పెద్దలకు ఉంది. అయితే కొన్నిసార్లు సంఘంలో ఉన్న ఇతరులు కూడా సలహా ఇవ్వాల్సి రావొచ్చు. ఉదాహరణకు, ఒక సహోదరుడు లేదా సహోదరి సంఘంలోని స్నేహితునికి బైబిలు ఆధారంగా సలహా ఇవ్వొచ్చు. (కీర్త. 141:5; సామె. 25:12) లేదా ఒక వృద్ధ సహోదరి తీతు 2:3-5లో ఉన్న విషయాల గురించి “చిన్నవయసు స్త్రీలకు” సలహా ఇవ్వొచ్చు. అలాగే తల్లిదండ్రులు ఏది సరైనదో తమ పిల్లలకు తరచూ నేర్పించాల్సి రావొచ్చు. ఈ ఆర్టికల్‌ ముఖ్యంగా పెద్దల కోసమే అయినా, దీనిలోని విషయాల్ని పరిశీలించడంవల్ల మనందరం ప్రయోజనం పొందొచ్చు. అలా చేసినప్పుడు ఇతరులకు ఉపయోగపడే, వాళ్లను పురికొల్పే సలహా ఇవ్వగలుగుతాం. అది వాళ్ల “హృదయాన్ని సంతోషపెడుతుంది.”—సామె. 27:9.

4. ఈ ఆర్టికల్‌లో ఏం తెలుసుకుంటాం?

4 సలహా ఇవ్వడం గురించి ఈ ఆర్టికల్‌లో మనం నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: (1) ఏ ఉద్దేశంతో సలహా ఇవ్వాలి? (2) సలహా ఇవ్వడం నిజంగా అవసరమా? (3) ఎవరు సలహా ఇవ్వాలి? (4) ఉపయోగపడే సలహా ఎలా ఇవ్వొచ్చు?

ఏ ఉద్దేశంతో సలహా ఇవ్వాలి?

5. ఇతరులు మరింత తేలిగ్గా అంగీకరించేలా సలహా ఇవ్వాలంటే ఒక పెద్ద ఏం చేయాలి? (1 కొరింథీయులు 13:4, 7)

5 పెద్దలు తోటి సహోదరసహోదరీల్ని ప్రేమిస్తారు. కొన్నిసార్లు సంఘంలో ఎవరైనా తప్పు చేసే ప్రమాదంలో ఉన్నారని వాళ్లు గమనిస్తే, సలహా ఇవ్వడం ద్వారా ప్రేమ చూపిస్తారు. (గల. 6:1) అయితే ఆ వ్యక్తితో మాట్లాడేముందు, అపొస్తలుడైన పౌలు ప్రేమ గురించి చెప్పిన కొన్ని విషయాల్ని ఒక పెద్ద పరిశీలిస్తాడు. “ప్రేమ ఓర్పు, దయ చూపిస్తుంది. . . . అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది.” (1 కొరింథీయులు 13:4, 7 చదవండి.) ఈ వచనాల గురించి ఆ పెద్ద లోతుగా ఆలోచించడం వల్ల, తన ఉద్దేశాల్ని పరిశీలించుకుంటాడు. అప్పుడు ప్రేమతో సలహా ఇవ్వగలుగుతాడు. సలహా పొందే వ్యక్తి ఆ పెద్ద తనమీద శ్రద్ధ చూపిస్తున్నాడని భావించినప్పుడు, సలహాను మరింత తేలిగ్గా అంగీకరించవచ్చు.—రోమా. 12:10.

6. ఒక పెద్దగా అపొస్తలుడైన పౌలు ఎలా మంచి ఆదర్శం ఉంచాడు?

6 అపొస్తలుడైన పౌలు సంఘపెద్దగా మంచి ఆదర్శం ఉంచాడు. ఉదాహరణకు, థెస్సలొనీక సంఘంలోని సహోదరులకు సలహా అవసరమైనప్పుడు దాన్ని ఇవ్వడానికి ఆయన వెనకాడలేదు. ఆయన వాళ్లకు రాసిన ఉత్తరాల్లో వాళ్లు విశ్వాసంతో చేస్తున్న పనిని, ప్రేమతో చేస్తున్న కృషిని, చూపిస్తున్న సహనాన్ని బట్టి ముందు వాళ్లను మెచ్చుకున్నాడు. ఆయన వాళ్ల పరిస్థితుల గురించి కూడా ఆలోచించాడు. వాళ్ల జీవితం సాఫీగా సాగట్లేదని, వాళ్లు హింసను నమ్మకంగా సహిస్తున్నారని తనకు తెలుసని చెప్పాడు. (1 థెస్స. 1:3; 2 థెస్స. 1:4) అంతేకాదు, ఇతర క్రైస్తవులకు వాళ్లు మంచి ఆదర్శంగా ఉన్నారని కూడా చెప్పాడు. (1 థెస్స. 1:8, 9) పౌలు వాళ్లను హృదయపూర్వకంగా మెచ్చుకున్నందుకు, వాళ్లు చాలా సంతోషించి ఉంటారు. దీన్నంతటిని బట్టి పౌలు తన సహోదరుల్ని ఎంతో ప్రేమించాడని తెలుస్తుంది. అందుకే థెస్సలొనీకయులకు రాసిన రెండు ఉత్తరాల్లో ఆయన ఉపయోగపడే సలహాలు ఇవ్వగలిగాడు.—1 థెస్స. 4:1, 3-5, 11; 2 థెస్స. 3:11, 12.

7. కొంతమంది సలహాను ఎందుకు ఇష్టపడకపోవచ్చు?

7 మనం సరైన విధంగా సలహా ఇవ్వకపోతే ఏం జరగొచ్చు? ఒక అనుభవంగల పెద్ద ఇలా చెప్తున్నాడు: “మనమిచ్చిన సలహాలో తప్పేమీ లేకపోయినా, దాన్ని ప్రేమపూర్వకంగా ఇవ్వకపోతే కొంతమంది ఇష్టపడరు.” దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఇతరులమీద చిరాకుతో కాకుండా ప్రేమతో సలహా ఇస్తే, దాన్ని మరింత తేలిగ్గా అంగీకరిస్తారు.

సలహా ఇవ్వడం నిజంగా అవసరమా?

8. సలహా ఇచ్చేముందు ఒక పెద్ద ఏ విషయాల గురించి ఆలోచించాలి?

8 పెద్దలు సలహా ఇవ్వడానికి తొందరపడకూడదు. సలహా ఇచ్చేముందు ఒక పెద్ద ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: ‘నేను నిజంగా సలహా ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడని నాకు ఖచ్చితంగా తెలుసా? అతను ఏదైనా బైబిలు ఆజ్ఞను మీరాడా? లేదా అతను చేసిన పని కేవలం నాకు నచ్చలేదా?’ పెద్దలు ‘తొందరపడి మాట్లాడకుండా’ ఉండడం ద్వారా తెలివిని చూపిస్తారు. (సామె. 29:20) సలహా ఇవ్వాలా వద్దా అని ఒక పెద్ద ఆలోచిస్తుంటే, అతను మరో పెద్దను అభిప్రాయం అడగవచ్చు. ఎదుటివ్యక్తి తప్పుచేశాడని ఆ పెద్దకు కూడా అనిపిస్తుందో లేదో, సలహా ఇవ్వడం నిజంగా అవసరమో లేదో అడగవచ్చు.—2 తిమో. 3:16, 17.

9. బట్టలు, కనబడేతీరు గురించి సలహా ఇచ్చే విషయంలో పౌలు నుండి మనమేం నేర్చుకోవచ్చు? (1 తిమోతి 2:9, 10)

9 ఈ ఉదాహరణ చూడండి. సంఘంలోని ఒకవ్యక్తి వేసుకునే బట్టలు, కనబడేతీరు గురించి ఒక పెద్ద ఆలోచిస్తున్నాడని అనుకోండి. అతను ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను సలహా ఇవ్వడానికి లేఖనాధారంగా ఏదైనా కారణం ఉందా?’ అతను సొంత అభిప్రాయాన్ని చెప్పకూడదు కాబట్టి, వేరే పెద్ద లేదా అనుభవంగల ప్రచారకుడి సహాయం తీసుకోవచ్చు. వాళ్లిద్దరు కలిసి బట్టలు, కనబడేతీరు గురించి పౌలు ఇచ్చిన సలహాను జాగ్రత్తగా పరిశీలించవచ్చు. (1 తిమోతి 2:9, 10 చదవండి.) క్రైస్తవులు గౌరవప్రదంగా, అణకువగా ఉండే బట్టలు వేసుకోవాలని పౌలు చెప్పాడు. అంతేగానీ ఇలాంటి బట్టలే వేసుకోవాలి, అలాంటి బట్టలు వేసుకోకూడదు అనే నియమాల్ని పెట్టలేదు. బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా లేనంతవరకు, సహోదరసహోదరీలు తమకు ఇష్టమైన బట్టలు వేసుకోవచ్చని పౌలుకు తెలుసు. కాబట్టి పెద్దలు సలహా ఇవ్వాలో లేదో నిర్ణయించుకునే ముందు, ఒకవ్యక్తి తన బట్టల విషయంలో అణకువను, మంచి వివేచనను చూపిస్తున్నాడో లేదో ఆలోచించాలి.

10. ఇతరులు తీసుకునే నిర్ణయాల విషయంలో మనమేం గుర్తుంచుకోవాలి?

10 ఇద్దరు సహోదరులు వేర్వేరు నిర్ణయాలు తీసుకోవచ్చు. అయినా వాళ్లిద్దరి నిర్ణయాలు సరైనవే అవ్వొచ్చని మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనకేది సరైనదిగా అనిపిస్తుందో దాన్నే చేయమని తోటి సహోదరసహోదరీల్ని మనం బలవంతపెట్టకూడదు.—రోమా. 14:10.

ఎవరు సలహా ఇవ్వాలి?

11-12. సలహా ఇవ్వడం అవసరమైనప్పుడు, ఒక పెద్ద ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి? ఎందుకు?

11 సలహా ఇవ్వడం అవసరమని మనకు స్పష్టంగా తెలిసిన తర్వాత, దాన్ని ఎవరు ఇవ్వాలి అనే ప్రశ్న రావచ్చు. పెళ్లయిన సహోదరికి లేదా మైనరు పిల్లలకు సలహా ఇచ్చేముందు, ఒక సంఘపెద్ద వాళ్ల కుటుంబ యజమానితో మాట్లాడాలి. అప్పుడు ఆ కుటుంబ యజమానే సలహా ఇవ్వాలని అనుకోవచ్చు. * లేదా సంఘపెద్ద సలహా ఇస్తున్నప్పుడు అతన్ని కూడా అక్కడ ఉండమని చెప్పొచ్చు. అయితే  3వ పేరాలో చూసినట్లు, కొన్నిసార్లు ఒక యౌవన సహోదరికి ఒక వృద్ధ సహోదరి సలహా ఇవ్వడం మంచిది కావచ్చు.

12 సలహా ఇచ్చేముందు ఇంకో విషయం గురించి కూడా ఆలోచించాలి. ఒక పెద్ద ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఈ సలహా ఇవ్వడానికి నేనే సరైన వ్యక్తినా? లేదా వేరే పెద్ద ఇస్తే బాగుంటుందా?’ ఉదాహరణకు, ఎందుకూ పనికిరానివాణ్ణి అనే భావాలతో సతమతమౌతున్న ఒకవ్యక్తికి, అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న సంఘపెద్ద సలహా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే, అతను ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకోగలుగుతాడు. అలాగే ఆ వ్యక్తి మరింత తేలిగ్గా అంగీకరించేలా సలహా ఇవ్వగలుగుతాడు. అయితే, లేఖనాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేలా సహోదరసహోదరీల్ని ప్రోత్సహించే బాధ్యత పెద్దలందరికీ ఉంది. కాబట్టి వేరేవాళ్లకు ఎదురైనలాంటి అనుభవం ఒక పెద్దకు ఉన్నా, లేకపోయినా సలహా ఇవ్వడమే అన్నిటికన్నా ప్రాముఖ్యం.

ఉపయోగపడే సలహా ఎలా ఇవ్వొచ్చు?

సంఘపెద్దలు ఎందుకు “వినడానికి త్వరపడాలి”? (13-14 పేరాలు చూడండి)

13-14. ఇతరులు చెప్పేది పెద్దలు వినడం ఎందుకు ప్రాముఖ్యం?

13 వినడానికి సిద్ధంగా ఉండండి. సలహా ఇవ్వడానికి సిద్ధపడుతున్న ఒక పెద్ద ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: ‘నా సహోదరుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో నాకు తెలుసా? ఆయన జీవితంలో ఏం జరుగుతుంది? నాకు తెలియని సమస్యలు ఏమైనా ఆయనకు ఉన్నాయా? ఆయనకు ప్రస్తుతం ఎలాంటి సహాయం చాలా అవసరం?’

14 సలహా ఇచ్చేవాళ్లకు యాకోబు 1:19లో ఉన్న సూత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. యాకోబు ఇలా రాశాడు: “ప్రతీ ఒక్కరు వినడానికి త్వరపడాలి, మాట్లాడడానికి తొందరపడకూడదు, త్వరగా కోపం తెచ్చుకోకూడదు.” ఒక సంఘపెద్ద తనకు వాస్తవాలన్నీ తెలుసని అనుకోవచ్చు. కానీ అతనికి నిజంగా తెలుసా? సామెతలు 18:13 మనకిలా గుర్తుచేస్తుంది: “వాస్తవాలు వినకముందే ఒక విషయం గురించి మాట్లాడడం తెలివితక్కువతనం, దానివల్ల అవమానాలపాలు అవుతారు.” కాబట్టి ఎవరికైతే సలహా ఇస్తామో, ఆ వ్యక్తి నుండే వాస్తవాలు తెలుసుకోవడం మంచిది. అందుకే ఒక సంఘపెద్ద మాట్లాడేముందు వినాలి. ఈ ఆర్టికల్‌ మొదట్లో ప్రస్తావించబడిన పెద్ద ఏ పాఠాన్ని నేర్చుకున్నాడో గుర్తుచేసుకోండి. అతను ఆ సహోదరిని కలవడానికి వెళ్లినప్పుడు, తాను సిద్ధపడిన సమాచారాన్ని ముందు చెప్పకుండా, “అంతా బాగానే ఉందా లేదా మీకేదైనా సమస్య ఉందా?” “నేను మీకెలా సహాయం చేయగలను?” వంటి ప్రశ్నల్ని అడగాల్సిందని నేర్చుకున్నాడు. పెద్దలు సమయం తీసుకుని వాస్తవాల్ని తెలుసుకుంటే, సహోదరసహోదరీలకు ఎక్కువ సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి వీలౌతుంది.

15. సామెతలు 27:23 లో ఉన్న సూత్రాన్ని పెద్దలు ఎలా పాటించవచ్చు?

15 సహోదరసహోదరీల గురించి తెలుసుకోండి. ఈ ఆర్టికల్‌ మొదట్లో చూసినట్లు, ఉపయోగపడే సలహా ఇవ్వడమంటే కొన్ని లేఖనాల్ని చదవడం లేదా ఒకట్రెండు సలహాలు ఇవ్వడం మాత్రమేకాదు; దానిలో అంతకన్నా ఎక్కువే ఇమిడివుంది. సహోదరసహోదరీల పట్ల మనకు శ్రద్ధ ఉందని, వాళ్లను అర్థం చేసుకుంటామని, వాళ్లకు సహాయం చేయాలని కోరుకుంటున్నామని వాళ్లు గ్రహించాలి. (సామెతలు 27:23 చదవండి.) కాబట్టి పెద్దలు తోటి సహోదరసహోదరీలతో దగ్గరి స్నేహాన్ని వృద్ధిచేసుకోవడానికి శాయశక్తులా కృషి చేయాలి.

సలహాను తేలిగ్గా ఇవ్వడానికి సంఘపెద్దలకు ఏది సహాయం చేస్తుంది? (16వ పేరా చూడండి)

16. ఉపయోగపడే సలహా ఇవ్వడానికి పెద్దలకు ఏది సహాయం చేస్తుంది?

16 సంఘంలో ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు మాత్రమే పెద్దలు వాళ్లతో మాట్లాడతారు అనే అభిప్రాయం, ఇతరులకు కలగకుండా పెద్దలు చూసుకుంటారు. వాళ్లు సంఘంలోని సహోదరసహోదరీలతో క్రమంగా మాట్లాడతారు. అలాగే సమస్యలు వచ్చినప్పుడు వాళ్లమీద వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తారు. ఒక అనుభవంగల పెద్ద ఇలా అన్నాడు: “మీరలా చేస్తే వాళ్లకు స్నేహితులౌతారు. తర్వాత సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు దాన్ని మరింత తేలిగ్గా ఇవ్వగలుగుతారు.” సలహా పొందే వ్యక్తి కూడా దాన్ని మరింత తేలిగ్గా అంగీకరిస్తాడు.

సలహా ఇస్తున్నప్పుడు ఒక పెద్ద ఓపిగ్గా, దయగా ఎందుకు ఉండాలి? (17వ పేరా చూడండి)

17. ఒక పెద్ద ఏ పరిస్థితిలో ఓపిగ్గా, దయగా ఉండాలి?

17 ఓపిగ్గా, దయగా ఉండండి. బైబిలు ఆధారంగా ఇచ్చిన సలహాను ఎవరైనా మొదట్లో తీసుకోకపోతే లేదా పాటించకపోతే ఒక పెద్ద ఓపిగ్గా, దయగా ఉండాలి. అంతేకానీ కోపం తెచ్చుకోకూడదు. యేసు గురించి బైబిలు ఇలా చెప్తుంది: “ఈయన నలిగిన రెల్లును విరవడు. ఆరిపోబోతున్న వత్తిని ఆర్పడు.” (మత్త. 12:20) కాబట్టి ఆ పెద్ద ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు, సలహా అవసరమైన వ్యక్తి కోసం ప్రార్థించవచ్చు. తనకు సలహా ఎందుకు ఇచ్చారో ఆ వ్యక్తి అర్థంచేసుకుని, దాన్ని పాటించేలా అతనికి సహాయం చేయమని ఆ పెద్ద అడగొచ్చు. ఎందుకంటే, ఇచ్చిన సలహా గురించి ఆలోచించడానికి ఆ వ్యక్తికి సమయం పట్టొచ్చు. ఒకవేళ పెద్ద అతనితో ఓపిగ్గా, దయగా మాట్లాడితే ఆ వ్యక్తికి సలహా వినడం తేలికౌతుంది. అయితే సలహా ఎప్పుడూ దేవుని వాక్యంమీద ఆధారపడి ఉండాలి.

18. (ఎ) సలహా ఇస్తున్నప్పుడు మనమేం గుర్తుంచుకోవాలి? (బి) బాక్స్‌కు సంబంధించిన చిత్రంలో తల్లిదండ్రులు ఏం చర్చించుకుంటున్నారు?

18 మీ పొరపాట్ల నుండి నేర్చుకోండి. మనం అపరిపూర్ణులం కాబట్టి ఈ ఆర్టికల్‌లో తెలుసుకున్న విషయాలన్నిటినీ పూర్తిగా పాటించలేం. (యాకో. 3:2) మనం తప్పులు చేసినా వాటినుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సహోదరసహోదరీలను మనం ప్రేమిస్తున్నామని వాళ్లు అర్థం చేసుకున్నప్పుడు, మనం నొప్పించేలా మాట్లాడినా లేదా ప్రవర్తించినా వాళ్లు మనల్ని తేలిగ్గా క్షమించగల్గుతారు.—“ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం” అనే బాక్సు కూడా చూడండి.

మనమేం నేర్చుకున్నాం?

19. మన సహోదరసహోదరీల్ని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి?

19 మనం ఇప్పటివరకు చూసినట్లు, ఉపయోగపడే సలహా ఇవ్వడం అంత తేలిక కాదు. సలహా ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లు అపరిపూర్ణులే కాబట్టి ఈ ఆర్టికల్‌లో చర్చించిన సూత్రాల్ని గుర్తుంచుకుందాం. సలహా ఇచ్చేటప్పుడు సరైన ఉద్దేశంతో ఇవ్వాలి; నిజంగా అవసరమైతేనే ఇవ్వాలి; అలాగే సరైన వ్యక్తి దాన్ని ఇవ్వాలి. సలహా ఇచ్చేముందు ఎదుటివ్యక్తి పరిస్థితిని అర్థంచేసుకోవడానికి ప్రశ్నలు అడిగి, జాగ్రత్తగా వినాలి. అంతేకాదు విషయాలను ఎదుటివ్యక్తి వైపునుండి చూడడానికి ప్రయత్నించాలి. దయగా ఉంటూ, తోటి సహోదరసహోదరీలతో దగ్గరి స్నేహాల్ని వృద్ధిచేసుకోవాలి. మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి: మనమిచ్చే సలహా ఉపయోగపడే విధంగానే కాదు, ఇతరుల ‘హృదయాన్ని సంతోషపెట్టేలా’ కూడా ఉండాలి.—సామె. 27:9.

పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు

^ సలహా ఇవ్వడం అన్నిసార్లూ తేలిక కాదు. కానీ అలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అది వినేవాళ్లకు సహాయకరంగా, ప్రోత్సాహకరంగా ఉండేలా ఎలా ఇవ్వవచ్చు? ముఖ్యంగా పెద్దలు సలహా ఇచ్చేటప్పుడు, ఇతరులు విని పాటించేలా ఎలా ఇవ్వవచ్చో ఈ ఆర్టికల్‌ తెలియజేస్తుంది.

^ 2021, ఫిబ్రవరి కావలికోట పత్రికలోని “సంఘంలో శిరస్సత్వ ఏర్పాటును అర్థం చేసుకోండి” అనే ఆర్టికల్‌ చూడండి.