కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 9

ఇతరులకు సహాయం చేస్తూ యేసును అనుకరించండి

ఇతరులకు సహాయం చేస్తూ యేసును అనుకరించండి

“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొ. 20:35.

పాట 17 “నాకు ఇష్టమే”

ఈ ఆర్టికల్‌లో. . . *

1. యెహోవా సేవకుల్లో ఎలాంటి మంచి స్ఫూర్తి ఉంది?

 యేసుక్రీస్తు ఇచ్చిన నిర్దేశాన్ని పాటిస్తూ, యెహోవాను సేవించడానికి ఆయన ప్రజలు “ఇష్టపూర్వకంగా ముందుకొస్తారు” అని బైబిలు ముందే చెప్పింది. (కీర్త. 110:3) ఆ ప్రవచనం ఈ రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతోంది. ప్రతీ సంవత్సరం ఉత్సాహంగల యెహోవా సేవకులు, లక్షల గంటల్ని ప్రకటనా పనిలో వెచ్చిస్తారు. వాళ్లు ఆ పనిని స్వచ్ఛందంగా, సొంత ఖర్చులతో చేస్తున్నారు. అంతేకాదు తోటి సహోదరసహోదరీల అవసరాల్ని పట్టించుకోవడానికి, వాళ్లను ప్రోత్సహించడానికి, వాళ్లు విశ్వాసంలో బలపడేలా సహాయం చేయడానికి సమయం వెచ్చిస్తారు. అలాగే సంఘంలోని పెద్దలు, సంఘ పరిచారకులు కూటాలకు సిద్ధపడడానికి, తోటి సహోదరసహోదరీల్ని కలిసి ప్రోత్సహించడానికి ఎన్నో గంటల్ని వెచ్చిస్తారు. ఈ పనులన్నీ చేసేలా యెహోవా సేవకుల్ని ఏది పురికొల్పుతుంది? యెహోవా మీద, సాటిమనిషి మీద ఉన్న ప్రేమే వాళ్లను పురికొల్పుతుంది.—మత్త. 22:37-39.

2. రోమీయులు 15:1-3 ప్రకారం, యేసు ఏ విషయంలో మనకు ఆదర్శం ఉంచాడు?

2 తన అవసరాలకన్నా ఇతరుల అవసరాల్ని ఎక్కువగా పట్టించుకునే విషయంలో యేసు మంచి ఆదర్శం ఉంచాడు. మనం ఆయన అడుగుజాడల్లో నడవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. (రోమీయులు 15:1-3 చదవండి.) అలా యేసును అనుకరించేవాళ్లు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఆయన ఇలా చెప్పాడు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొ. 20:35.

3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 ఈ ఆర్టికల్‌లో, ఇతరులకు సహాయం చేయడానికి యేసు చేసిన కొన్ని త్యాగాల గురించి, ఆయన ఆదర్శాన్ని మనమెలా అనుకరించవచ్చు అనే దానిగురించి చూస్తాం. అలాగే ఇతరులకు సహాయం చేయాలనే మన కోరికను ఎలా పెంచుకోవచ్చో కూడా చర్చిస్తాం.

యేసు ఆదర్శాన్ని అనుకరించండి

యేసు అలసిపోయినా, చాలామంది ప్రజలు తన దగ్గరికి రావడం చూసినప్పుడు ఏం చేశాడు? (4వ పేరా చూడండి)

4. యేసు తన అవసరాలకన్నా ఇతరుల అవసరాల్ని ఎక్కువగా ఎలా పట్టించుకున్నాడు?

4 యేసు అలసిపోయినా ఇతరులకు సహాయం చేశాడు. బహుశా కపెర్నహూముకు దగ్గర్లోవున్న కొండమీద యేసు ఒకరోజు రాత్రంతా ప్రార్థిస్తూ గడిపాడు. కాబట్టి ఆయన బాగా అలసిపోయి ఉంటాడు. ఆ తర్వాతి రోజే యేసును కలవడానికి చాలామంది వచ్చారు. వాళ్లను చూసినప్పుడు ఆయనకెలా అనిపించింది? వాళ్లలో పేదవాళ్లను, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను చూసి యేసు జాలిపడ్డాడు. ఆయన వాళ్లను బాగు చేయడమే కాదు, ఎంతో ప్రోత్సాహకరమైన ప్రసంగాన్ని కూడా ఇచ్చాడు. ఆ తర్వాత అది కొండమీది ప్రసంగంగా పేరుగాంచింది.—లూకా 6:12-20.

మనం యేసులా ఏయే విధాలుగా స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించవచ్చు? (5వ పేరా చూడండి)

5. కుటుంబ పెద్దలు అలసిపోయినా, యేసులా స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా చూపిస్తున్నారు?

5 కుటుంబ పెద్దలు యేసును ఎలా అనుకరిస్తున్నారు? ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: ఒక తండ్రి రోజంతా కష్టపడి పనిచేసి, అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆ రోజు సాయంత్రం కుటుంబ ఆరాధన ఆపేద్దామని అనిపించినా, దాన్ని చేయడానికి శక్తినివ్వమని అతను యెహోవాను వేడుకుంటాడు. యెహోవా ఆ ప్రార్థనకు జవాబివ్వడంతో ఎప్పటిలాగే అతను కుటుంబ ఆరాధన చేస్తాడు. దానినుండి అతని పిల్లలు ఒక విలువైన పాఠం నేర్చుకుంటారు. తమ తల్లిదండ్రులకు యెహోవాను ఆరాధించడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని తెలుసుకుంటారు.

6. ఇతరులకు సహాయం చేయడానికి యేసు తన సమయాన్ని ఎలా త్యాగం చేశాడో ఒక ఉదాహరణ చెప్పండి.

6 యేసుకు ఒంటరిగా ఉండాలని అనిపించినా, ఇతరుల కోసం సమయం వెచ్చించాడు. తన స్నేహితుడైన బాప్తిస్మమిచ్చు యోహానును చంపేశారని విన్నప్పుడు, యేసుకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి. ఆయన చాలా బాధపడివుంటాడు. బైబిలు ఇలా చెప్తుంది: “యేసు [యోహాను చనిపోయాడని] విన్నప్పుడు, ఒంటరిగా ఉండడానికి అక్కడి నుండి పడవలో ఏకాంత ప్రదేశానికి బయల్దేరాడు.” (మత్త. 14:10-13) ఆయన ఎందుకలా వెళ్లుంటాడో మనం అర్థంచేసుకోగలం. కొంతమంది బాధ కలిగినప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ యేసుకు అలాంటి అవకాశం దొరకలేదు. ఎందుకంటే చాలామంది ఆయనకన్నా ముందే ఆ ఏకాంత ప్రదేశానికి చేరుకున్నారు. వాళ్లను చూసినప్పుడు యేసు ఎలా స్పందించాడు? ఆయన వాళ్ల అవసరాల గురించి ఆలోచించి, వాళ్లమీద “జాలిపడ్డాడు.” అలాగే వాళ్లకు దేవుడిచ్చే సహాయం, ఓదార్పు అవసరమని గుర్తించి వెంటనే సహాయం చేశాడు. ఆయన నిజానికి “వాళ్లకు చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.”—మార్కు 6:31-34; లూకా 9:10, 11.

7-8. సంఘంలో ఎవరికైనా సహాయం అవసరమైతే, ప్రేమగల పెద్దలు యేసును ఎలా అనుకరిస్తారో ఒక ఉదాహరణ చెప్పండి.

7 ప్రేమగల పెద్దలు యేసును ఎలా అనుకరిస్తున్నారు? పెద్దలు మనకోసం నిస్వార్థంగా చేస్తున్న పనికి మనమెంతో కృతజ్ఞులమై ఉన్నాం. వాళ్లు చేస్తున్న పనులన్నిటి గురించి సంఘంలోవున్న చాలామంది సహోదరసహోదరీలకు తెలీదు. ఉదాహరణకు సంఘంలో ఎవరికైనా బాగోక అత్యవసర పరిస్థితి వస్తే, వాళ్లకు సహాయం చేయడానికి ఆసుపత్రి అనుసంధాన కమిటీలోని సహోదరులు వెంటనే వస్తారు. అలాంటి పరిస్థితులు ఎక్కువగా మధ్యరాత్రి సమయంలో రావచ్చు. అయినా ప్రియమైన పెద్దలు బాధలో ఉన్న సహోదరుడు లేదా సహోదరి మీద కనికరం చూపిస్తారు. వాళ్లూ, వాళ్ల కుటుంబాలు తమ అవసరాలకన్నా, తోటి సహోదరసహోదరీల అవసరాల్నే ఎక్కువగా పట్టించుకుంటారు.

8 పెద్దలు రాజ్యమందిరాన్ని కట్టడంలో, ఇతర నిర్మాణ పనుల్లో, విపత్తు సహాయక పనుల్లో కూడా సహాయం చేస్తారు. అలాగే సంఘంలో బోధించడానికి, ఇతరుల్ని ప్రోత్సహించడానికి వాళ్లు లెక్కలేనన్ని గంటలు వెచ్చిస్తారు. మనం ఆ సహోదరుల్ని, వాళ్ల కుటుంబాల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. వాళ్లు చూపించే స్వయంత్యాగ స్ఫూర్తిని బట్టి యెహోవా వాళ్లను ఆశీర్వదించాలని కోరుకుందాం. అయితే అందరిలాగే పెద్దలు కూడా సమతుల్యంగా ఉండాలి. తమ కుటుంబ అవసరాల్ని పట్టించుకోవడానికి సమయం లేనంతగా వాళ్లు సంఘ పనుల్లో మునిగిపోకూడదు.

స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా వృద్ధి చేసుకోవచ్చు?

9. ఫిలిప్పీయులు 2:4, 5 ప్రకారం, క్రైస్తవులందరూ ఎలాంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి?

9 ఫిలిప్పీయులు 2:4, 5 చదవండి. మనందరం సంఘపెద్దలం కాకపోయినా, యేసులా స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించడం నేర్చుకోవచ్చు. ఆయన ‘దాసునిలా మారాడు’ అని బైబిలు చెప్తుంది. (ఫిలి. 2:7) ఆ మాటల నుండి ఏం నేర్చుకోవచ్చో ఆలోచించండి. యజమానికి ఇష్టమైన దాసుడు, తన యజమానిని సంతోషపెట్టడానికి అవకాశాల కోసం చూస్తాడు. మనం యెహోవాకు దాసులం అలాగే మన సహోదరులకు సేవకులం. కాబట్టి యెహోవాకు, సహోదరులకు ఎక్కువగా ఉపయోగపడాలని కోరుకుంటాం. ఆ కోరికను పెంచుకోవడానికి సహాయపడే ఈ సలహాల్ని చూడండి.

10. మనం ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?

10 మీకెలాంటి మనస్తత్వం ఉందో ఆలోచించుకోండి. మీరిలా ప్రశ్నించుకోండి: ‘ఇతరులకు సహాయం చేయడం కోసం నా సమయాన్ని, శక్తిని త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నానా? ఉదాహరణకు, ఒక వృద్ధ సహోదరుని ఇంటికెళ్లి ఆయనతో సమయం గడపమని చెప్తే, నేనేం చేస్తాను? లేదా ఒక వృద్ధ సహోదరిని మీటింగ్స్‌కు తీసుకురమ్మని చెప్తే, నేనేం చేస్తాను? సమావేశ స్థలాన్ని శుభ్రం చేయడానికి లేదా రాజ్యమందిరాన్ని మంచిస్థితిలో ఉంచడానికి స్వచ్ఛంద సేవకులు అవసరమని తెలిస్తే, నేను సహాయం చేయడానికి వెంటనే ముందుకొస్తానా?’ మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మన సమయాన్ని, శక్తిని, వనరుల్ని ఆయన సేవకు ఉపయోగిస్తామని మాటిచ్చాం. మనం వాటిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం నిస్వార్థంగా అలా చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఒకవేళ మన మనస్తత్వానికి సంబంధించి ఏవైనా మార్పులు చేసుకోవాలని అనిపిస్తే ఏం చేయవచ్చు?

11. స్వయంత్యాగ స్ఫూర్తిని వృద్ధి చేసుకోవడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

11 యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నాక, మరింత స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించాల్సిన అవసరం ఉందని గుర్తించారు అనుకోండి. కానీ ఆ స్ఫూర్తిని వృద్ధి చేసుకోవాలనే కోరిక మీకు లేకపోతే, అప్పుడేంటి? మనస్ఫూర్తిగా యెహోవాకు ప్రార్థించండి. మీకెలా అనిపిస్తుందో నిజాయితీగా ఆయనకు చెప్పండి. అలాగే స్వయంత్యాగ స్ఫూర్తిని వృద్ధి చేసుకోవాలనే “కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని” ఇవ్వమని ఆయనను అడగండి.—ఫిలి. 2:13.

12. బాప్తిస్మం తీసుకున్న యౌవన సహోదరులు సంఘానికి ఎలా సహాయం చేయవచ్చు?

12 మీరు బాప్తిస్మం తీసుకున్న యౌవన సహోదరుడైతే, సంఘానికి ఎక్కువ సేవచేయాలనే కోరికను వృద్ధి చేసుకునేలా సహాయం చేయమని ప్రార్థించండి. కొన్నిదేశాల్లో సంఘ పరిచారకుల కన్నా పెద్దలే ఎక్కువమంది ఉన్నారు. ఆ సంఘ పరిచారకుల్లో కూడా చాలామంది మధ్యవయసువాళ్లు, వృద్ధులే ఉన్నారు. సంఘాల సంఖ్య పెరిగేకొద్దీ, వాటిలోని సహోదరసహోదరీల్ని చూసుకోవడంలో పెద్దలకు యౌవన సహోదరుల సహాయం ఎక్కువ కావాలి. అలా సేవచేయడానికి మీరు ముందుకొస్తే సంతోషాన్ని పొందుతారు. ఎందుకంటే దానివల్ల మీరు యెహోవాను సంతోషపెడతారు, మంచిపేరు సంపాదించుకుంటారు; అలాగే ఇతరులకు సహాయం చేయడంవల్ల వచ్చే సంతృప్తిని పొందుతారు.

క్రైస్తవులు యూదయ నుండి పారిపోయి, యొర్దాను నది దాటి పెల్లా నగరానికి వచ్చారు. ఆ నగరానికి ముందే వచ్చినవాళ్లు, ఆ తర్వాత వచ్చిన క్రైస్తవులకు ఆహారం పంచి పెడుతున్నారు (13వ పేరా చూడండి)

13-14. మనం సహోదరసహోదరీలకు ఎలా సహాయం చేయవచ్చు? (ముఖచిత్రం చూడండి.)

13 ఇతరుల అవసరాల్ని గుర్తించండి. యూదయలోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మంచి చేయడం, మీకున్న వాటిని ఇతరులతో పంచుకోవడం మర్చిపోకండి. అలాంటి బలులు దేవునికి చాలా ఇష్టం.” (హెబ్రీ. 13:16) అది నిజంగా మంచి సలహా! ఆయన ఆ మాటల్ని చెప్పిన కొంతకాలానికి, యూదయలోని క్రైస్తవులు తమ ఇళ్లను, వ్యాపారాలను, సత్యంలోలేని బంధువుల్ని విడిచిపెట్టి “కొండలకు పారిపోవడం” మొదలుపెట్టాల్సి వచ్చింది. (మత్త. 24:16) ఆ సమయంలో వాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా అవసరమైంది. వాళ్లు కొండలకు పారిపోవడానికి ముందునుండే పౌలు ఇచ్చిన సలహాను పాటిస్తూ ఉంటే, కొత్త ప్రాంతానికి వెళ్లాక కొన్ని వస్తువులతో జీవించడం వాళ్లకు తేలికయ్యేది.

14 మన సహోదరసహోదరీలకు ఏం అవసరమో వాళ్లు అన్నిసార్లూ చెప్పకపోవచ్చు. ఉదాహరణకు, ఒక సహోదరుడు తన భార్యను కోల్పోయి బాధపడుతుండొచ్చు. ఆయనకు వంట చేసుకోవడంలో, బయటికి వెళ్లి రావడంలో లేదా ఇంటిపనుల్లో సహాయం అవసరమా? మనల్ని ఇబ్బంది పెట్టకూడదని ఆయన మనల్ని సహాయం అడగకపోవచ్చు. కానీ ఆయన అడగకముందే మనం సహాయం చేస్తే ఆయనెంతో కృతజ్ఞత కలిగివుంటాడు. అయితే మనం కాకపోతే ఇంకెవరైనా సహాయం చేస్తారులే అని, లేదా సహాయం అవసరమైతే ఆయనే అడుగుతాడులే అని మనం అనుకోకూడదు. బదులుగా మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉంటే ఎలాంటి సహాయం కోరుకుంటాను?’

15. ఇతరులకు సహాయం చేయాలనుకుంటే మనమెలా ఉండాలి?

15 ఇతరులు మిమ్మల్ని సహాయం అడిగేలా స్నేహపూర్వకంగా ఉండండి. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే సహోదరసహోదరీలు మీ సంఘంలో ఉండేవుంటారు. వాళ్లు అలా సహాయం చేయడానికి ఇబ్బందిపడరు; దాన్ని ఇష్టంగా చేస్తారు. వాళ్లను చూసినప్పుడు మనకు కూడా అలాగే ఉండాలనిపిస్తుంది. ఆలెన్‌​ అనే 45 ఏళ్ల సంఘపెద్ద అనుభవాన్ని గమనించండి. ఇతరులు తనను సహాయం అడిగేలా ఉండాలని కోరుకున్నాడు. యేసు ఉంచిన ఆదర్శం గురించి ఆలోచిస్తూ ఆలెన్‌​ ఇలా అంటున్నాడు: “యేసు బిజీగా ఉన్నా అన్ని వయసులవాళ్లు ఆయన్ని ఇష్టపడేవాళ్లు. అలాగే ఆయన్ని సహాయం అడగడానికి భయపడేవాళ్లు కాదు. ఆయన నిజంగా శ్రద్ధ చూపించే వ్యక్తని వాళ్లు అర్థంచేసుకున్నారు. నేను యేసులా ఇతరులతో స్నేహపూర్వకంగా, ప్రేమగా, శ్రద్ధ చూపించే వ్యక్తిలా ఉండాలని అనుకుంటున్నాను.”

16. కీర్తన 119:59, 60 ప్రకారం చేస్తే, మనం యేసు ఆదర్శాన్ని వీలైనంత ఎక్కువగా ఎలా పాటించగలుగుతాం?

16 మనం పూర్తిస్థాయిలో యేసును అనుకరించలేకపోతే నిరుత్సాహపడకూడదు. (యాకో. 3:2) ఉదాహరణకు, ఒక విద్యార్థి తన టీచర్‌ నుండి పెయింటింగ్‌ నేర్చుకుంటున్నాడు. అతని టీచర్‌ చాలా బాగా పెయింటింగ్‌ వేస్తాడు. అయితే ఆ టీచర్‌ అంత బాగా ఆ విద్యార్థి పెయింటింగ్‌ వేయలేకపోవచ్చు. కానీ ఆ విద్యార్థి తన తప్పుల నుండి నేర్చుకుంటూ, తన టీచర్‌ ఆదర్శాన్ని వీలైనంత ఎక్కువగా పాటిస్తే, చాలావరకు తన టీచర్‌లా పెయింటింగ్‌ వేయగలుగుతాడు. అదేవిధంగా మనం యేసులా అవ్వలేం. కానీ మన వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి నేర్చుకున్నవాటిని పాటిస్తూ, మన తప్పుల్ని సరిచేసుకుంటూ ఉంటే యేసు ఆదర్శాన్ని వీలైనంత ఎక్కువగా పాటించగలుగుతాం.—కీర్తన 119:59, 60 చదవండి.

స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించడంవల్ల వచ్చే ప్రయోజనాలు

పెద్దలు యేసులా స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించడం ద్వారా యౌవనులకు మంచి ఆదర్శం ఉంచుతున్నారు (17వ పేరా చూడండి) *

17-18. మనం యేసులా స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించినప్పుడు, ఎలాంటి ప్రయోజనాల్ని పొందుతాం?

17 మనం స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించినప్పుడు, ఇతరులు కూడా అలాంటి స్ఫూర్తిని చూపించాలని అనుకోవచ్చు. టిమ్‌ అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “కొంతమంది యౌవన సహోదరులు చాలా చిన్నవయసులోనే సంఘ పరిచారకులుగా నియమించబడ్డారు. దానికొక కారణమేంటంటే ఇతరులు చూపించిన స్వయంత్యాగ స్ఫూర్తిని వాళ్లు అనుకరించారు. ఆ యౌవన సహోదరులు సంఘానికి సహాయం చేస్తూ పెద్దలకు ఎంతో మద్దతిస్తున్నారు.”

18 నేడు ఈ లోకంలో జీవిస్తున్న చాలామంది స్వార్థం చూపిస్తున్నారు. కానీ యెహోవా ప్రజలు మాత్రం అలా ఉండరు. యేసు చూపించిన స్వయంత్యాగ స్ఫూర్తి మన హృదయాల్ని తాకింది. అందుకే ఆయన ఆదర్శాన్ని పాటించాలని మనం నిశ్చయించుకున్నాం. నిజమే మనం పూర్తిస్థాయిలో యేసు అడుగుజాడల్లో నడవలేం. కానీ ‘నమ్మకంగా ఆయన అడుగుజాడల్లో నడవగలం.’ (1 పేతు. 2:21) మనం యేసులా స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించడానికి శాయశక్తులా ప్రయత్నించినప్పుడు, యెహోవా ఆమోదాన్ని పొందామన్న సంతోషాన్ని అనుభవిస్తాం.

పాట 13 క్రీస్తు మన ఆదర్శం

^ యేసు ఎప్పుడూ తన అవసరాలకన్నా ఇతరుల అవసరాల్నే ఎక్కువ పట్టించుకున్నాడు. ఆయన ఉంచిన ఆదర్శాన్ని మనం ఏయే విధాలుగా అనుకరించవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అలాగే ఆయన చూపించిన స్వయంత్యాగ స్ఫూర్తిని అనుకరించడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుంటాం.

^ చిత్రాల వివరణ: యౌవన సహోదరుడైన డ్యాన్‌ వాళ్ల నాన్న హాస్పిటల్‌లో ఉన్నాడు. అతన్ని కలవడానికి ఇద్దరు పెద్దలు రావడం డ్యాన్‌ చూస్తున్నాడు. వాళ్ల ప్రేమను చూసిన డ్యాన్‌ కదిలించబడి, సంఘంలో ఇతరుల అవసరాల్ని గమనించి, వాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. డ్యాన్‌​ చూపిస్తున్న శ్రద్ధను బెన్‌​ అనే ఇంకో యౌవన సహోదరుడు గమనిస్తున్నాడు. డ్యాన్‌​ని చూసి ప్రోత్సాహం పొందిన బెన్‌, రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడంలో సహాయం చేస్తున్నాడు.