కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 10

మీరు ‘పాత వ్యక్తిత్వాన్ని తీసి పారేయగలరు’

మీరు ‘పాత వ్యక్తిత్వాన్ని తీసి పారేయగలరు’

“మీ పాత వ్యక్తిత్వాన్ని దాని అలవాట్లతో సహా తీసిపారేయండి.”​—కొలొ. 3:9.

పాట 29 మన పేరుకు తగ్గట్టుగా జీవిద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. బైబిలు స్టడీ తీసుకోకముందు మీ జీవితం ఎలా ఉండేది?

 యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకోకముందు మీ జీవితం ఎలా ఉండేది? మనలో చాలామంది దానిగురించి ఆలోచించడానికి ఇష్టపడం. ఎందుకంటే తప్పొప్పుల విషయంలో మనం లోక ప్రజల్లా ఆలోచించేవాళ్లం, ప్రవర్తించేవాళ్లం. అప్పట్లో మనం ‘ఈ లోకంలో ఏ నిరీక్షణా లేకుండా జీవించాం, మనకు దేవుడు తెలీదు.’ (ఎఫె. 2:12) కానీ బైబిలు స్టడీ మొదలుపెట్టిన తర్వాత మన జీవితమే మారిపోయింది!

2. మీరు బైబిలు స్టడీ మొదలుపెట్టిన తర్వాత ఏ విషయాలు తెలుసుకున్నారు?

2 మీరు బైబిలు స్టడీ మొదలుపెట్టిన తర్వాత, మిమ్మల్ని ఎంతో ప్రేమించే పరలోక తండ్రి ఉన్నాడని తెలుసుకున్నారు. మీరు యెహోవాను సంతోషపెట్టాలన్నా, ఆయన ఆరాధకుల కుటుంబంలో ఒకరు అవ్వాలన్నా మీ జీవన విధానంలో, ఆలోచనా విధానంలో పెద్దపెద్ద మార్పులు చేసుకోవాలని గుర్తించారు. అంతేకాదు, యెహోవా ఉన్నత ప్రమాణాల ప్రకారం జీవించడం మీరు నేర్చుకోవాలి.—ఎఫె. 5:3-5.

3. కొలొస్సయులు 3:9, 10 ప్రకారం, మనమేం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు? ఈ ఆర్టికల్‌లో మనమేం చర్చిస్తాం?

3 యెహోవా మన సృష్టికర్త, పరలోక తండ్రి కాబట్టి తన ఆరాధకుల కుటుంబంలో ఉండేవాళ్లు ఎలా ప్రవర్తించాలో నిర్ణయించే హక్కు ఆయనకు ఉంది. అలాగే మనం బాప్తిస్మం తీసుకోకముందే మన ‘పాత వ్యక్తిత్వాన్ని దాని అలవాట్లతో సహా తీసిపారేయడానికి’ కృషిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. * (కొలొస్సయులు 3:9, 10 చదవండి.) బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లు, మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకునేలా ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. అవేంటంటే: (1) “పాత వ్యక్తిత్వం” అంటే ఏంటి? (2) మనం దాన్ని తీసిపారేయాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు? (3) దాన్ని ఎలా చేయొచ్చు? అయితే ఇప్పటికే బాప్తిస్మం తీసుకున్నవాళ్లు, మళ్లీ తమ పాత వ్యక్తిత్వం ప్రకారం ప్రవర్తించకుండా, ఆలోచించకుండా ఉండడానికి కూడా ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

“పాత వ్యక్తిత్వం” అంటే ఏంటి?

4. “పాత వ్యక్తిత్వం” ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు?

4 సాధారణంగా “పాత వ్యక్తిత్వం” ఉన్న వ్యక్తి పాపపూరితంగా ఆలోచిస్తాడు, ప్రవర్తిస్తాడు. బహుశా అతను స్వార్థపరునిగా, త్వరగా కోప్పడేవానిగా, కృతజ్ఞత లేనివానిగా, గర్వంగా ఉండొచ్చు. అలాగే అశ్లీల చిత్రాలను, అనైతికత లేదా హింస ఉన్న సినిమాలను చూడడాన్ని ఆనందించవచ్చు. అయితే అతనిలో ఖచ్చితంగా కొన్ని మంచి లక్షణాలు ఉండివుంటాయి. అలాగే అతను చెడ్డపనులు చేస్తున్నందుకు, చెడుగా మాట్లాడుతున్నందుకు బాధపడుతుండవచ్చు. కానీ తన ఆలోచనల్ని, ప్రవర్తనను మార్చుకోవాలనే బలమైన కోరిక అతనిలో ఉండదు.—గల. 5:19-21; 2 తిమో. 3:2-5.

“పాత వ్యక్తిత్వాన్ని” తీసిపారేసినప్పుడు మనం ఇక పాపపూరితంగా ఆలోచించం, ప్రవర్తించం (5వ పేరా చూడండి) *

5. మన పాత వ్యక్తిత్వాన్ని పూర్తిగా తీసిపారేయగలమా? వివరించండి. (అపొస్తలుల కార్యాలు 3:19)

5 మనం అపరిపూర్ణులం కాబట్టి మనలో ఎవ్వరం చెడు ఆలోచనల్ని, కోరికల్ని పూర్తిగా తీసేసుకోలేం. అందుకే కొన్నిసార్లు మనం పొరపాటుగా ఏదోకటి మాట్లాడేసి లేదా చేసేసి, ఆ తర్వాత బాధపడతాం. (యిర్మీ. 17:9; యాకో. 3:2) కానీ మన పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేసినప్పుడు మనం ఇక పాపపూరితంగా ఆలోచించం, ప్రవర్తించం. అలాగే మన వ్యక్తిత్వం మారిపోతుంది.—యెష. 55:7; అపొస్తలుల కార్యాలు 3:19 చదవండి.

6. పాత వ్యక్తిత్వంలోని తప్పుడు ఆలోచనల్ని, చెడు అలవాట్లను తీసిపారేయమని యెహోవా మనల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు?

6 యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అలాగే మనం మన జీవితాన్ని ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే తప్పుడు ఆలోచనల్ని, చెడు అలవాట్లను తీసిపారేయమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (యెష. 48:17, 18) తప్పుడు కోరికలకు లొంగిపోయేవాళ్లు తమకు తాము హాని చేసుకుంటారని, అలాగే తమ చుట్టూ ఉన్నవాళ్లకు హాని చేస్తారని ఆయనకు తెలుసు. అలా జరగడం చూసినప్పుడు ఆయన బాధపడతాడు.

7. రోమీయులు 12:1, 2 ప్రకారం, మనం ఏ నిర్ణయం తీసుకోవాలి?

7 మన వ్యక్తిత్వంలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మొదట్లో మన స్నేహితుల్లో, కుటుంబ సభ్యుల్లో కొంతమంది మనల్ని ఎగతాళి చేయవచ్చు. (1 పేతు. 4:3, 4) మనకు నచ్చింది చేసే హక్కు మనకుందని, మనమేం చేయాలో ఇతరులు చెప్పాల్సిన అవసరంలేదని వాళ్లు మనతో అనొచ్చు. అయితే, యెహోవా ప్రమాణాల్ని పాటించనివాళ్లు నిజానికి స్వేచ్చను అనుభవించట్లేదు; కానీ ఈ సాతాను లోకం వాళ్లను మలిచేలా అనుమతిస్తున్నారు. (రోమీయులు 12:1, 2 చదవండి.) మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పాపం అలాగే సాతాను లోకం మలుస్తున్న పాత వ్యక్తిత్వాన్ని ఉంచుకుంటామా లేదా మనల్ని మంచి వ్యక్తిగా మార్చడానికి యెహోవాను అనుమతిస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది.—యెష. 64:8.

పాత వ్యక్తిత్వాన్ని మనమెలా ‘తీసిపారేయవచ్చు’?

8. తప్పుడు ఆలోచనల్ని, చెడు అలవాట్లను తీసేసుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

8 తప్పుడు ఆలోచనల్ని, చెడు అలవాట్లను తీసేసుకోవడానికి మనకు సమయం పడుతుందని అలాగే కృషి అవసరమని యెహోవాకు తెలుసు. (కీర్త. 103:13, 14) అయితే యెహోవా తన వాక్యం ద్వారా, పవిత్రశక్తి ద్వారా అలాగే తన సంస్థ ద్వారా మనం మార్పులు చేసుకోవడానికి కావాల్సిన తెలివిని, బలాన్ని, మద్దతును ఇస్తాడు. ఆయన మీకిప్పటికే ఖచ్చితంగా సహాయం చేసుంటాడు. పాత వ్యక్తిత్వాన్ని ఇంకా ఎక్కువగా తీసిపారేయడానికి అలాగే బాప్తిస్మం కోసం అర్హత సంపాదించడానికి మీరు చేయగల కొన్ని పనుల గురించి ఇప్పుడు చూద్దాం.

9. మీరేం చేసేలా దేవుని వాక్యం సహాయం చేస్తుంది?

9 బైబిల్ని ఉపయోగించి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. దేవుని వాక్యం అద్దం లాంటిది కాబట్టి మీ ఆలోచనలు, మాటలు, పనులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అది సహాయం చేస్తుంది. (యాకో. 1:22-25) స్టడీ ఇస్తున్నవాళ్లు అలాగే పరిణతిగల క్రైస్తవులు మీకు సలహా ఇవ్వగలరు. ఉదాహరణకు మీ సామర్థ్యాల్ని, బలహీనతల్ని గుర్తించడానికి లేఖనాల ద్వారా వాళ్లు సహాయం చేస్తారు. చెడు అలవాట్లను అధిగమించడానికి ఉపయోగపడే బైబిలు ఆధారిత సమాచారాన్ని ఎలా వెదకవచ్చో వాళ్లు మీకు నేర్పిస్తారు. అంతేకాదు మీకు సహాయం చేయడానికి యెహోవా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు కాబట్టి, ఆయనే మీకు సరైన విధంగా సహాయం చేయగలడు. (సామె. 14:10; 15:11) అందుకే ప్రతీరోజు ప్రార్థించడం, బైబిల్ని అధ్యయనం చేయడం అలవాటుగా చేసుకోండి.

10. ఈలీ అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

10 యెహోవా ప్రమాణాలు మంచివని నమ్మండి. యెహోవా చెప్పినవన్నీ చేస్తే మనం ప్రయోజనం పొందుతాం. ఎవరైతే ఆయన ప్రమాణాల ప్రకారం జీవిస్తారో వాళ్లకు ఆత్మగౌరవం ఉంటుంది, వాళ్ల జీవితానికి ఒక అర్థం ఉంటుంది, నిజమైన సంతోషాన్ని పొందుతారు. (కీర్త. 19:7-11) దానికి భిన్నంగా, ఆయన ప్రమాణాల ప్రకారం జీవించనివాళ్లు, శరీర కార్యాల్ని చేయడంవల్ల వచ్చే చెడు ఫలితాల్ని అనుభవిస్తారు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఈలీ అనే వ్యక్తి అనుభవాన్ని గమనించండి. అతని తల్లిదండ్రులు యెహోవాసాక్షులు. వాళ్లు చిన్నప్పటి నుండే యెహోవాను ప్రేమించడం అతనికి నేర్పించారు. కానీ, ఈలీ టీనేజ్‌లో ఉన్నప్పుడు చెడ్డవాళ్లతో స్నేహం చేశాడు. ఆ తర్వాత డ్రగ్స్‌ తీసుకోవడం, అనైతికంగా జీవించడం అలాగే దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు అతను కోపిష్ఠిగా తయారయ్యాడు, దౌర్జన్యం చేశాడు. అతనిలా ఒప్పుకుంటున్నాడు: “ఒక క్రైస్తవుడు ఏమేం చేయకూడదని నేను నేర్చుకున్నానో అవన్నీ చేశాను.” అయితే అతను తన చిన్నతనంలో నేర్చుకున్నవాటిని మర్చిపోలేదు. కొంతకాలానికి అతను మళ్లీ బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. తన చెడు అలవాట్లను మానుకోవడానికి ఎంతో కృషిచేసి, చివరికి 2000 సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాడు. యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించడం వల్ల అతనెలా ప్రయోజనం పొందాడు? ఈలీ ఇలా చెప్తున్నాడు: “నేనిప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అలాగే మంచి మనస్సాక్షితో ఉన్నాను.” * ఈ అనుభవాన్ని బట్టి యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించనివాళ్లు తమకు తాము హాని చేసుకుంటారని అర్థమౌతుంది. అయినాసరే వాళ్లు మారేలా సహాయం చేయడానికి యెహోవా సిద్ధంగా ఉంటాడు.

11. యెహోవా వేటిని అసహ్యించుకుంటాడు?

11 యెహోవా అసహ్యించుకునే వాటిని అసహ్యించుకోవడం నేర్చుకోండి. (కీర్త. 97:10) “అహంకారంతో నిండిన కళ్లు, అబద్ధాలాడే నాలుక, అమాయకుల రక్తం చిందించే చేతులు” యెహోవాకు అసహ్యమని బైబిలు చెప్తుంది. (సామె. 6:16, 17) ఆయన “దౌర్జన్యపరుల్ని, వంచకుల్ని” కూడా అసహ్యించుకుంటాడు. (కీర్త. 5:6) యెహోవా అలాంటి ఆలోచనా విధానాన్ని, పనుల్ని చాలా అసహ్యించుకుంటాడు. అందుకే నోవహు కాలంలో భూమంతా దౌర్జన్యంతో నింపిన చెడ్డవాళ్లందర్నీ ఆయన నాశనం చేశాడు. (ఆది. 6:13) ఇంకొక ఉదాహరణ గమనించండి. ఏ తప్పూ చేయని వివాహజతకు మోసపూరితంగా విడాకులిచ్చే వాళ్లను అసహ్యించుకుంటానని మలాకీ ప్రవక్త ద్వారా యెహోవా చెప్పాడు. ఆయన వాళ్ల ఆరాధనను తిరస్కరిస్తాడు అలాగే వాళ్ల ప్రవర్తననుబట్టి వాళ్లకు తీర్పుతీరుస్తాడు.—మలా. 2:13-16; హెబ్రీ. 13:4.

పాడైపోయి, వాసనొస్తున్న ఆహారాన్ని తినడానికి మనం ఎలాగైతే అస్సలు ఇష్టపడమో, అదేవిధంగా యెహోవా దృష్టిలో చెడ్డదైన పనిని అసహ్యించుకోవాలి (11-12 పేరాలు చూడండి)

12. ‘చెడ్డదాన్ని అసహ్యించుకోవడం’ అంటే ఏంటి?

12 మనం ‘చెడ్డదాన్ని అసహ్యించుకోవాలని’ యెహోవా కోరుకుంటున్నాడు. (రోమా. 12:9) మనం దేన్నైనా అసహ్యించుకున్నప్పుడు దాన్ని చూడడానికి గానీ, దాని దగ్గరికి వెళ్లడానికి గానీ ఇష్టపడం. ఒకసారి ఇలా ఊహించుకుందాం: ఎవరైనా మీకు పాడైపోయి, వాసనొస్తున్న ఆహారాన్ని తినమని ఇస్తే మీకెలా అనిపిస్తుంది? దాన్ని చూడగానే మీకు కడుపులో తిప్పినట్టు అనిపించొచ్చు. అదేవిధంగా యెహోవా దృష్టిలో చెడ్డదైన పనిని మనం అసహ్యించుకోవాలి. దాన్ని చేయాలనే ఆలోచనను కూడా రానివ్వకూడదు.

13. చెడ్డ విషయాల గురించి మనమెందుకు ఆలోచించకూడదు?

13 చెడ్డ విషయాల గురించి ఆలోచించకండి. సాధారణంగా మనమేం ఆలోచిస్తామో అదే చేస్తాం. అందుకే, గంభీరమైన పాపం చేయడానికి దారితీసే విషయాల గురించి ఆలోచించవద్దని యేసు మనకు చెప్పాడు. (మత్త. 5:21, 22, 28, 29) మనం ఖచ్చితంగా మన పరలోక తండ్రిని సంతోషపెట్టాలని కోరుకుంటాం. కాబట్టి చెడు ఆలోచనలు మన మనసులోకి వచ్చినప్పుడు వాటిని వెంటనే తీసేసుకోవడం చాలా ప్రాముఖ్యం.

14. మన మాటల్నిబట్టి ఏం తెలుస్తుంది? మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

14 మీ నోటిని అదుపులో పెట్టుకోండి. యేసు ఇలా చెప్పాడు: “నోటి నుండి వచ్చే ప్రతీది హృదయంలో నుండి వస్తుంది.” (మత్త. 15:18) కాబట్టి మన మాటల్నిబట్టి మనమెలాంటి వాళ్లమో చాలావరకు తెలుస్తుంది. అందుకే మీరిలా ప్రశ్నించుకోండి: ‘ఒకవేళ నిజం మాట్లాడితే ఇబ్బందిలో పడతానని తెలిసినా నేను నిజమే చెప్తానా? ఒక పెళ్లయిన వ్యక్తిగా నేను వేరేలింగ వ్యక్తులతో సరసాలాడకుండా ఉంటున్నానా? నేను అస్సలు అసభ్యకరంగా మాట్లాడకుండా ఉంటానా? ఎవరైనా నాకు చిరాకు తెప్పిస్తే నేను సౌమ్యంగా జవాబిస్తానా?’ ఈ ప్రశ్నల గురించి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మీరు ప్రయోజనం పొందుతారు. మీ మాటల్ని కోట్‌కు ఉండే బటన్స్‌తో పోల్చవచ్చు. బటన్స్‌ని తీసేసినప్పుడు కోట్‌ను విప్పడం తేలికౌతుంది. అదేవిధంగా మీరు తిట్టడం, అబద్ధాలాడడం, అసభ్యకరంగా మాట్లాడడం మానేసినప్పుడు మీ పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేయడం తేలికౌతుంది.

15. పాత వ్యక్తిత్వాన్ని “కొయ్యకు” దిగగొట్టడం అంటే అర్థమేంటి?

15 అవసరమైన మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం చాలా ప్రాముఖ్యమని చెప్పడానికి అపొస్తలుడైన పౌలు ఒక ఉదాహరణను ఉపయోగించాడు. మన పాత వ్యక్తిత్వాన్ని “కొయ్యకు” దిగగొట్టాలని ఆయన చెప్పాడు. (రోమా. 6:6) దానర్థం ఏంటి? యెహోవాను సంతోషపెట్టడం కోసం యేసు కొయ్యకు దిగగొట్టబడి చనిపోవడానికి ముందుకొచ్చాడు. అదేవిధంగా మనం యెహోవాను సంతోషపెట్టాలంటే ఆయన అసహ్యించుకునే ఆలోచనా విధానాన్ని, అలవాట్లను చంపేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే మంచి మనస్సాక్షిని అలాగే శాశ్వతకాలం జీవించే నిరీక్షణను మనం కలిగివుంటాం. (యోహా. 17:3; 1 పేతు. 3:21) అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనల్ని సంతోషపెట్టడానికి యెహోవా తన ప్రమాణాల్ని మార్చుకోడు. బదులుగా మనమే మార్పులు చేసుకుని ఆయన ప్రమాణాల్ని పాటించాలి.—యెష. 1:16-18; 55:9.

16. తప్పుడు కోరికలతో పోరాడుతూ ఉండాలని మీరెందుకు నిర్ణయించుకోవాలి?

16 తప్పుడు కోరికలతో పోరాడుతూ ఉండండి. మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా తప్పుడు కోరికలతో పోరాడుతూ ఉండాలి. మారీస్యూ అనే ఒకతని అనుభవాన్ని గమనించండి. అతను యువకునిగా ఉన్నప్పుడు స్వలింగ సంపర్కం మొదలుపెట్టాడు. కొంతకాలానికి యెహోవాసాక్షులు అతన్ని కలిసినప్పుడు బైబిలు స్టడీ తీసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత తన జీవితంలో మార్పులు చేసుకుని, 2002లో బాప్తిస్మం తీసుకున్నాడు. అతను ఇప్పటికే యెహోవాను చాలా సంవత్సరాలుగా సేవిస్తున్నా ఇలా అంటున్నాడు: “నేను కొన్నిసార్లు తప్పుడు కోరికలతో పోరాడాల్సి వచ్చిందని ఒప్పుకుంటాను.” అయితే దానివల్ల అతను నిరుత్సాహపడలేదు. బదులుగా అతను ఇలా చెప్తున్నాడు: “అలాంటి కోరికలకు లొంగిపోకుండా ఉన్నప్పుడు నేను యెహోవాను సంతోషపెట్టగలనని తెలుసుకోవడం నాకు ధైర్యాన్నిస్తుంది.” *

17. నబిహా అనుభవం నుండి మీరు ఏ ప్రోత్సాహాన్ని పొందారు?

17 యెహోవా సహాయం కోసం ప్రార్థించండి. అలాగే మీ సొంత శక్తి మీద కాకుండా ఆయన పవిత్రశక్తి మీద ఆధారపడండి. (గల. 5:22; ఫిలి. 4:6) మనం పాత వ్యక్తిత్వాన్ని తీసి పారేయాలనుకుంటే గట్టిగా కృషిచేయాలి. నబిహా అనుభవాన్ని గమనించండి. తనకు ఆరేళ్లున్నప్పుడు ఆమె నాన్న తనను విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు, “నేను లోలోపల చాలా బాధను అనుభవించాను” అని ఆమె చెప్తుంది. ఆమె పెద్దయ్యాక కోపిష్ఠిగా తయారైంది అలాగే ఎవరైనా ఒక మాటంటే వెంటనే గొడవపడేది. ఆమె డ్రగ్స్‌ అమ్మడం మొదలుపెట్టి, అరెస్ట్‌ అయ్యి కొన్ని సంవత్సరాలు జైల్లో గడిపింది. జైల్లో యెహోవాసాక్షులు తనను కలిసినప్పుడు బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. నబిహా తన జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకుంది. ఆమె ఇలా చెప్తుంది: “కొన్ని చెడ్డ అలవాట్లను నేను తేలిగ్గా మానుకోగలిగాను. కానీ సిగరెట్‌ తాగడం మానేయాలంటే చాలా కష్టమైంది.” నబిహా సంవత్సరం కన్నా ఎక్కువకాలం కృషి చేశాక చివరికి సిగరెట్‌ తాగడం మానేసింది. అదెలా సాధ్యమైంది? ఆమె ఇలా చెప్తుంది: “అన్నిటికన్నా ముఖ్యంగా నేను క్రమంగా యెహోవాకు ప్రార్థించడం వల్ల దాన్ని మానగలిగాను.” ఆమె ఇప్పుడు ఇతరులకు ఇలా చెప్తుంది: “యెహోవాను సంతోషపెట్టడానికి నేను మార్పులు చేసుకోగలిగానంటే ఎవరైనా చేసుకోగలరు.” *

మీరు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత సంపాదించవచ్చు

18. మొదటి కొరింథీయులు 6:9-11 ప్రకారం, చాలామంది దేవుని సేవకులు ఏం చేయగలిగారు?

18 క్రీస్తుతో పరిపాలించడానికి మొదటి శతాబ్దంలో యెహోవా ఎన్నుకున్న కొంతమంది ఒకప్పుడు చాలా చెడ్డపనులు చేశారు. ఉదాహరణకు వాళ్లు వ్యభిచారం, స్వలింగ సంపర్కం, దొంగతనం చేశారు. అయితే యెహోవా పవిత్రశక్తి సహాయంతో వాళ్లు తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోగలిగారు. (1 కొరింథీయులు 6:9-11 చదవండి.) అదేవిధంగా, నేడు బైబిలు సహాయంతో లక్షలమంది తమ జీవితాల్ని మార్చుకున్నారు. * మానుకోవడానికి చాలా కష్టంగా ఉన్న చెడు అలవాట్ల నుండి వాళ్లు బయటపడ్డారు. మీరు కూడా మీ వ్యక్తిత్వంలో మార్పులు చేసుకుని, చెడు అలవాట్ల నుండి బయటపడి, బాప్తిస్మానికి అర్హత సంపాదించగలరని వాళ్ల ఆదర్శం చూపిస్తుంది.

19. తర్వాతి ఆర్టికల్‌లో మనమేం చర్చిస్తాం?

19 బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లు పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేయడానికి కృషి చేయడమే కాదు, కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవడానికి కూడా కృషి చేయాలి. దాన్ని మనమెలా చేయవచ్చో, ఇతరులు మనకెలా సహాయం చేస్తారో తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.

పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు

^ పేరా 5 బాప్తిస్మం తీసుకోవాలంటే, మన వ్యక్తిత్వంలో మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే పాత వ్యక్తిత్వం అంటే ఏంటో, దాన్ని ఎందుకు తీసిపారేయాలో, అదెలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకుంటూ ఉండాలంటే ఏం చేయవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

^ పేరా 3 పదాల వివరణ: ‘పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేయడం’ అంటే యెహోవాకు ఇష్టంలేని ఆలోచనల్ని, కోరికల్ని తీసేసుకోవడం అని అర్థం. మనం బాప్తిస్మం తీసుకోకముందే అలాచేయడం మొదలుపెట్టాలి.—ఎఫె. 4:22.

^ పేరా 10 మరింత సమాచారం కోసం 2012, జూలై-సెప్టెంబరు కావలికోట పత్రికలోని “బైబిలు జీవితాన్ని మారుస్తుంది—‘నేను మళ్లీ యెహోవాకు దగ్గరవ్వాలి’” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 16 మరింత సమాచారం కోసం 2012, మే 1 కావలికోట (ఇంగ్లీష్‌) పత్రికలోని, “బైబిలు జీవితాన్ని మారుస్తుంది—‘వాళ్లు నాతో చాలా దయగా వ్యవహరించారు’” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 17 మరింత సమాచారం కోసం 2012, అక్టోబరు 1 కావలికోట (ఇంగ్లీష్‌) పత్రికలోని, “బైబిలు జీవితాల్ని మారుస్తుంది—‘నేను కోపిష్ఠిగా తయారయ్యాను’” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 64 చిత్రాల వివరణ: తప్పుడు ఆలోచనల్ని తీసేసుకోవడాన్ని, చెడు అలవాట్లను మానేయడాన్ని పాత కోట్‌ని విప్పి పారేయడంతో పోల్చొచ్చు.