కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 11

బాప్తిస్మం తర్వాత కూడా “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకుంటూ ఉండండి

బాప్తిస్మం తర్వాత కూడా “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకుంటూ ఉండండి

“కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి.”కొలొ. 3:10.

పాట 49 యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. ముఖ్యంగా దేన్నిబట్టి మన వ్యక్తిత్వం ఏర్పడుతుంది?

 మనం బాప్తిస్మం తీసుకుని కొన్నిరోజులే అయినా లేదా ఎన్నో సంవత్సరాలు అయినా మనందరం యెహోవా ఇష్టపడే వ్యక్తిత్వాన్ని కలిగివుండాలని అనుకుంటాం. దానికోసం మన ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనల్ని బట్టే మన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. మనల్ని మనం సంతోషపెట్టుకోవడం గురించి తరచూ ఆలోచిస్తే మన మాటలు, పనులు చెడుగా ఉంటాయి. (ఎఫె. 4:17-19) దానికి బదులు మనం మంచి విషయాల గురించి ఆలోచిస్తే మన తండ్రైన యెహోవా ఇష్టపడేలా మాట్లాడతాం, ప్రవర్తిస్తాం.—గల. 5:16.

2. ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?

2 ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు, మన మనసులోకి అస్సలు చెడు ఆలోచనలు రాకుండా ఆపలేం. కానీ అలాంటి ఆలోచనలు వస్తే వాటి ప్రకారం ప్రవర్తించకుండా ఉండగలం. మనం బాప్తిస్మం తీసుకోవడానికి ముందే యెహోవా అసహ్యించుకునే విధంగా మాట్లాడడం, ప్రవర్తించడం మానేయాలి. మన పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేయడానికి మనం చేసే మొట్టమొదటి అలాగే అత్యంత ప్రాముఖ్యమైన పని అది. అయితే యెహోవాను పూర్తిగా సంతోషపెట్టాలంటే “కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి” అనే ఆజ్ఞకు కూడా లోబడాలి. (కొలొ. 3:10) అందుకే, ఈ ఆర్టికల్‌లో మనం ఈ ప్రశ్నలకు జవాబులు చూస్తాం: “కొత్త వ్యక్తిత్వం” అంటే ఏంటి? కొత్త వ్యక్తిత్వాన్ని ఎలా ధరించుకోవచ్చు? దాన్ని ఎప్పటికీ ధరించుకుని ఉండాలంటే ఏం చేయవచ్చు?

“కొత్త వ్యక్తిత్వం” అంటే ఏంటి?

3. గలతీయులు 5:22, 23 ప్రకారం, “కొత్త వ్యక్తిత్వం” అంటే ఏంటి? ఒకవ్యక్తి దాన్నెలా ధరించుకుంటాడు?

3 “కొత్త వ్యక్తిత్వం” అంటే యెహోవాలా ఆలోచించడం, ప్రవర్తించడం అని అర్థం. కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకునే వ్యక్తి పవిత్రశక్తి తన ఆలోచనలమీద, భావాలమీద, పనులమీద పనిచేసేలా అనుమతిస్తాడు. అలాగే పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు చూపిస్తాడు. (గలతీయులు 5:22, 23 చదవండి.) ఉదాహరణకు అతను యెహోవాను, ఆయన ప్రజల్ని ప్రేమిస్తాడు. (మత్త. 22:36-39) అలాంటివ్యక్తి పరీక్షల్ని ఎదుర్కొంటున్నా సంతోషంగా ఉంటాడు. (యాకో. 1:2-4) అతను శాంతిని నెలకొల్పే వ్యక్తిగా ఉంటాడు. (మత్త. 5:9) ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు సహనం, దయ చూపిస్తాడు. (కొలొ. 3:13) అతను మంచిని ప్రేమిస్తాడు, ఇతరులకు మంచి చేస్తాడు. (లూకా 6:35) తన పరలోక తండ్రిమీద అతనికి బలమైన విశ్వాసం ఉందని తన పనుల ద్వారా చూపిస్తాడు. (యాకో. 2:18) ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు అతను సౌమ్యంగా ఉంటాడు. అలాగే శోధన ఎదురైనప్పుడు ఆత్మనిగ్రహాన్ని చూపిస్తాడు.—1 కొరిం. 9:25, 27; తీతు 3:2.

4. కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలంటే, మనం గలతీయులు 5:22, 23లో అలాగే బైబిల్లోని ఇతర వచనాల్లో ఉన్న అన్ని లక్షణాలను ఎందుకు వృద్ధిచేసుకోవాలి?

4 కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలంటే మనం గలతీయులు 5:22, 23 అలాగే బైబిల్లోని ఇతర వచనాల్లో ఉన్న అన్ని లక్షణాలను వృద్ధిచేసుకోవాలి. * ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మనం అన్ని లక్షణాలను చూపించాలి. ఎందుకంటే గలతీయుల్లో చెప్పబడిన లక్షణాలకు అలాగే బైబిల్లోని ఇతర వచనాల్లోని లక్షణాలకు సంబంధం ఉంది. ఉదాహరణకు, మీ పొరుగువాళ్లను మీరు నిజంగా ప్రేమిస్తే వాళ్లతో ఓపిగ్గా, దయగా ఉంటారు. మీరు మంచివాళ్లుగా ఉండాలంటే, ఇతరులతో సౌమ్యంగా వ్యవహరించాలి అలాగే ఆత్మనిగ్రహం చూపించాలి.

కొత్త వ్యక్తిత్వాన్ని ఎలా ధరించుకోవచ్చు?

మనం యేసులా ఎంతెక్కువ ఆలోచిస్తే, ఆయనలాంటి వ్యక్తిత్వాన్ని అంతెక్కువ చూపిస్తాం (5, 8, 10, 12, 14 పేరాలు చూడండి)

5. మనం “క్రీస్తు మనసు” కలిగివుండడం అంటే ఏంటి? అలాగే యేసు గురించి మనమెందుకు అధ్యయనం చేయాలి? (1 కొరింథీయులు 2:16)

5 మొదటి కొరింథీయులు 2:16 చదవండి. కొత్త వ్యక్తిత్వాన్ని ధరించాలంటే మనకు “క్రీస్తు మనసు” ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే యేసులా ఆలోచించడం నేర్చుకుని, ఆయన్ని అనుకరించాలి. పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని యేసు పరిపూర్ణంగా చూపించాడు. అంటే యెహోవాకున్న లక్షణాల్ని ఆయన అచ్చం అలాగే చూపించాడు. (హెబ్రీ. 1:3) మనం ఎంతెక్కువ యేసులా ఆలోచిస్తే అంతెక్కువ ఆయనలా ప్రవర్తిస్తాం. అలాగే ఆయనలాంటి వ్యక్తిత్వాన్ని అంత బాగా చూపిస్తాం.—ఫిలి. 2:5.

6. కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఏ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి?

6 యేసును అనుకరించడం నిజంగా సాధ్యమేనా? మనమిలా అనుకోవచ్చు: ‘యేసు పరిపూర్ణుడు. కాబట్టి నేనెప్పటికీ ఆయనలా ఉండలేను.’ మీకలా అనిపిస్తే ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి. మొదటిగా మీరు యెహోవా, యేసు స్వరూపంలో సృష్టించబడ్డారు. కాబట్టి వాళ్లను అనుకరించడానికి మీరు ప్రయత్నించినప్పుడు కొంతవరకైనా వాళ్లలా ఉండగలుగుతారు. (ఆది. 1:26) రెండవదిగా, దేవుని పవిత్రశక్తి ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది. దాని సహాయంతో, మీ సొంత శక్తితో ఎప్పటికీ చేయలేని వాటిని చేయగలుగుతారు. మూడవదిగా, పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని మీరిప్పుడే పూర్తిస్థాయిలో చూపించాలని యెహోవా కోరుకోవట్లేదు. నిజానికి భూనిరీక్షణగల వాళ్లు పరిపూర్ణులు అవ్వడానికి మన ప్రేమగల తండ్రి 1,000 సంవత్సరాల్ని నిర్ణయించాడు. (ప్రక. 20:1-3) అయితే ఇప్పుడు మనం చేయగలిగినదంతా చేస్తూ సహాయం కోసం తనపై ఆధారపడాలని యెహోవా కోరుకుంటున్నాడు.

7. మనం ఇప్పుడు ఏ విషయాల గురించి పరిశీలిస్తాం?

7 మనం యేసును ఎంత బాగా అనుకరించగలం? పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో నాల్గింటిని ఇప్పుడు కాసేపు పరిశీలిద్దాం. అలా ఒక్కోదాన్ని పరిశీలిస్తుండగా, యేసు ఆ లక్షణాల్ని చూపించిన విధానం నుండి మనమేం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. అంతేకాదు కొన్ని ప్రశ్నలు వేసుకోవడం ద్వారా కొత్త వ్యక్తిత్వాన్ని మనం ఎంతవరకు ధరించుకున్నామో అర్థంచేసుకుందాం.

8. యేసు ప్రేమను ఎలా చూపించాడు?

8 యేసు యెహోవాను చాలా ప్రేమించాడు. అందుకే తన తండ్రి కోసం, మనకోసం ఆయన త్యాగాలు చేశాడు. (యోహా. 14:31; 15:13) యేసు ఈ భూమ్మీద జీవించిన విధానాన్నిబట్టి తనకు మనుషుల పట్ల ఎంత ప్రేముందో చూపించాడు. కొంతమంది ఆయన్ని వ్యతిరేకించినా ప్రతిరోజు ప్రజలపట్ల ప్రేమను, కనికరాన్ని చూపించాడు. మరిముఖ్యంగా దేవుని రాజ్యం గురించి ప్రజలకు బోధించడం ద్వారా ఆయన ప్రేమ చూపించాడు. (లూకా 4:43, 44) అంతేకాదు, పాపుల చేతుల్లో వేదనకరమైన మరణాన్ని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా ముందుకొచ్చాడు. అలా దేవునిపట్ల, మనుషులపట్ల తనకు నిస్వార్థమైన ప్రేమ ఉందని చూపించాడు. అలాగే మనందరం శాశ్వత జీవితాన్ని పొందే మార్గాన్ని తెరిచాడు.

9. యేసులా ప్రజలపట్ల మనమెలా ప్రేమ చూపించవచ్చు?

9 మనం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాం. అందుకే ప్రజలతో వ్యవహరిస్తున్నప్పుడు, యేసులాగే మనకు యెహోవా మీద ప్రేమ ఉందని చూపించాలి. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “తాను చూసే సహోదరుణ్ణి ప్రేమించని వ్యక్తి, తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు.” (1 యోహా. 4:20) మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ప్రజల్ని ఎక్కువ ప్రేమిస్తానా? ఇతరులు నాతో కఠినంగా వ్యవహరించినా నేను కనికరం చూపిస్తానా? యెహోవా గురించి ఇతరులకు నేర్పించడానికి నా సమయాన్ని, వనరుల్ని ఉపయోగించేలా ప్రేమ నన్ను పురికొల్పుతుందా? నేను చేసే పనిని చాలామంది పట్టించుకోకపోయినా లేదా వ్యతిరేకించినా దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నానా? శిష్యుల్ని చేసే పనిలో ఇంకా ఎక్కువ సమయం గడపడానికి నేను కృషి చేయగలనా?’—ఎఫె. 5:15, 16.

10. యేసు శాంతిని నెలకొల్పే వ్యక్తిగా ఎలా ఉన్నాడు?

10 యేసు శాంతిని నెలకొల్పే వ్యక్తిగా ఉన్నాడు. ప్రజలు ఆయనకు చెడు చేసినా, ఆయన తిరిగి వాళ్లకు చెడు చేయలేదు. బదులుగా వాళ్లతో సమాధానపడడానికి ఆయన చొరవ తీసుకున్నాడు. అలాగే గొడవల్ని పరిష్కరించుకోమని ఆయన ఇతరుల్ని ప్రోత్సహించాడు. ఉదాహరణకు ఒకవ్యక్తి ఆరాధనను యెహోవా అంగీకరించాలంటే, అతను తన సహోదరునితో సమాధానపడాలని యేసు నేర్పించాడు. (మత్త. 5:9, 23, 24) అలాగే తన శిష్యులు ఎవరు గొప్పని గొడవపడకుండా ఉండేలా ఆయన వాళ్లకు చాలాసార్లు సహాయం చేశాడు.—లూకా 9:46-48; 22:24-27.

11. మనం శాంతిని నెలకొల్పే వ్యక్తులుగా ఎలా ఉండవచ్చు?

11 మనం శాంతిని నెలకొల్పే వ్యక్తులుగా ఉండాలంటే, మనవల్ల గొడవలు రాకుండా చూసుకుంటే సరిపోదు. మనం ఇతరులతో సమాధానపడడానికి చొరవ తీసుకోవాలి. అలాగే మన సహోదరసహోదరీలకు ఎవరితోనైనా గొడవలుంటే వాటిని పరిష్కరించుకోమని ప్రోత్సహించాలి. (ఫిలి. 4:2, 3; యాకో. 3:17, 18) మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఇతరులతో సమాధానపడడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానా? ఒక సహోదరుడు లేదా సహోదరి నన్ను బాధపెడితే నేను వాళ్లమీద పగపెట్టుకుంటానా? తప్పు నాది కాకపోయినా నేనే చొరవ తీసుకుని సమాధానపడతానా లేదా అవతలి వ్యక్తే వచ్చి నాతో సమాధానపడే వరకు ఆగుతానా? అవసరమైతే, గొడవల్ని పరిష్కరించుకోమని నేను ఇతరుల్ని ప్రోత్సహిస్తానా?’

12. యేసు ఏయే విధాలుగా దయ చూపించాడు?

12 యేసు దయ చూపించాడు. (మత్త. 11:28-30) కష్టమైన పరిస్థితుల్లో కూడా మృదువుగా ఉండడం ద్వారా, ఇతరుల్ని అర్థంచేసుకోవడం ద్వారా ఆయన దయ చూపించాడు. ఉదాహరణకు, చెడ్డదూత పట్టిన తన కూతుర్ని బాగుచేయమని ఒక ఫేనీకే స్త్రీ అడిగినప్పుడు మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత, ఆమె గొప్ప విశ్వాసం చూపించినప్పుడు యేసు దయతో ఆమె కూతుర్ని బాగుచేశాడు. (మత్త. 15:22-28) యేసు దయ చూపించినా, ఇతరులకు సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన దాన్ని ఇచ్చాడు. కొన్నిసార్లు తాను ప్రేమించినవాళ్లను సరిదిద్దడం ద్వారా దయ చూపించాడు. ఉదాహరణకు, యెహోవా ఇష్టాన్ని చేయకుండా యేసును నిరుత్సాహపర్చడానికి పేతురు ప్రయత్నించినప్పుడు, ఇతర శిష్యుల ముందే యేసు అతన్ని గద్దించాడు. (మార్కు 8:32, 33) పేతురును అవమానించాలని కాదుగానీ, అతనికి శిక్షణ ఇవ్వాలని యేసు అలా చేశాడు. దేవుని ఇష్టాన్ని చేసే విషయంలో తనకు మద్దతుగా ఉండాలేగాని అడ్డుపడకూడదని, మిగతా శిష్యుల్ని హెచ్చరించడానికి కూడా ఆయన అలా చేశాడు. ఆ సమయంలో పేతురుకు కాస్త అవమానంగా అనిపించినా, యేసు ఇచ్చిన క్రమశిక్షణ నుండి అతను ప్రయోజనం పొందాడు.

13. నిజమైన దయ ఎలా చూపించవచ్చు?

13 మనం ప్రేమించేవాళ్ల పట్ల నిజమైన దయ చూపించాలంటే, కొన్నిసార్లు వాళ్లకు సలహా ఇవ్వాల్సి రావచ్చు. అలా ఇస్తున్నప్పుడు యేసును అనుకరిస్తూ మీ సలహా బైబిలు సూత్రాలపై ఆధారపడి ఉండేలా చూసుకోండి; అలాగే మృదువుగా మాట్లాడండి. మీరు ఎవరికైతే సలహా ఇస్తారో వాళ్లు మిమ్మల్నీ యెహోవానూ ప్రేమిస్తే, ఆ సలహాకు చక్కగా స్పందిస్తారని అలాగే సరైనదే చేస్తారని నమ్మండి. మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ప్రేమించే ఎవరైనా తప్పుచేయడం నేను చూస్తే, వాళ్లతో మాట్లాడేంత ధైర్యం నాకుందా? ఒకవేళ నేను సలహా ఇవ్వాల్సివస్తే దయగా మాట్లాడతానా లేదా దురుసుగా మాట్లాడతానా? నేను ఏ ఉద్దేశంతో సలహా ఇస్తున్నాను? వాళ్లంటే విసిగిపోయి నేను సలహా ఇస్తున్నానా లేదా వాళ్లకు సహాయం చేయడానికి ఇస్తున్నానా?’

14. యేసు ఎలా మంచి చేస్తాడు?

14 యేసుకు ఏది మంచో తెలియడమే కాదు, దాన్ని చేస్తాడు కూడా. యేసు తన తండ్రిని ప్రేమిస్తాడు కాబట్టి ఎప్పుడూ సరైనదాన్ని, సరైన ఉద్దేశంతో చేస్తాడు. ఆ విధంగా యేసు మంచి చేస్తాడు. ఒక మంచివ్యక్తి ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి మార్గాలు వెతుకుతాడు అలాగే వాళ్లకు మంచి చేస్తాడు. మనకు ఏది సరైనదో తెలిస్తే సరిపోదు, దాన్ని సరైన ఉద్దేశంతో చేయాలి. కొంతమంది ఇలా అనుకోవచ్చు: ‘సరైనదాన్ని తప్పుడు ఉద్దేశంతో చేయడం సాధ్యమా?’ ఒక ఉదాహరణ గమనించండి. పేదవాళ్లకు దానధర్మాలు చేస్తున్నప్పుడు ఇతరులు తమను చూసి మెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాటిని చేసినవాళ్ల గురించి యేసు చెప్పాడు. అవి మంచిపనులే అయినా యెహోవా వాటిని చూసి సంతోషించలేదు.—మత్త. 6:1-4.

15. మనమేం చేస్తే మంచి చేసినట్లు అవుతుంది?

15 మనం నిస్వార్థంగా సరైనది చేసినప్పుడు మాత్రమే, మంచి చేసినట్లు అవుతుంది. కాబట్టి మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఏది సరైనదో తెలుసుకోవడంతో పాటు నేను దాన్ని చేస్తానా? నేను ఏ ఉద్దేశంతో మంచి పనుల్ని చేస్తాను?’

మన కొత్త వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

16. మనం ప్రతిరోజు ఏం చేయాలి? ఎందుకు?

16 మనం బాప్తిస్మం తీసుకున్నామంటే కొత్త వ్యక్తిత్వాన్ని పూర్తిగా ధరించుకున్నామని అలాగే దాని విషయంలో ఇక కృషి చేయాల్సిన అవసరంలేదని అనుకోకూడదు. కొత్త వ్యక్తిత్వాన్ని కొత్త బట్టలతో పోల్చవచ్చు. కొత్త బట్టల్ని ఎలాగైతే పాడవకుండా చూసుకుంటామో, కొత్త వ్యక్తిత్వాన్ని కూడా మనం కాపాడుకోవాలి. దానికోసం మనం పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని ప్రతిరోజు చూపించాలి. ఎందుకంటే ఆ లక్షణాల్ని చూపించడానికి మనం ఎంతెక్కువ ప్రయత్నిస్తే, యెహోవా పవిత్రశక్తి మనకు అంతెక్కువ సహాయం చేస్తుంది. పవిత్రశక్తి ఒక చురుకైన శక్తి, యెహోవా దాన్ని ఉపయోగించే మనం చర్య తీసుకునేలా సహాయం చేస్తాడు. (ఆది. 1:2) కాబట్టి క్రియలు ప్రాముఖ్యం. ఉదాహరణకు శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: ‘చేతలు లేని విశ్వాసం నిర్జీవమైనది.’ (యాకో. 2:26) పవిత్రశక్తి పుట్టించే మిగతా లక్షణాల విషయంలో కూడా అది నిజం. మనం ఆ లక్షణాల్ని చూపించిన ప్రతీసారి యెహోవా పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుందని నిరూపిస్తాం.

17. పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపించడంలో మనం తప్పిపోతే ఏం చేయాలి?

17 బాప్తిస్మం తీసుకుని ఎంతో కాలమైనా, క్రైస్తవులు పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపించడంలో కొన్నిసార్లు తప్పిపోతారు. అయితే ఈ లక్షణాల్ని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉండడం ప్రాముఖ్యం. ఉదాహరణకు, మీకిష్టమైన బట్టల్లో ఏదైనా చినిగిపోతే మీరు దాన్ని వెంటనే పడేస్తారా? అలా పడేయరు కదా! వీలైతే దాన్ని కుట్టించుకుని భవిష్యత్తులో ఇంకా జాగ్రత్తగా వాడతారు. అదేవిధంగా కొన్నిసార్లు మీరు ఇతరులపట్ల దయను, ఓర్పును, ప్రేమను చూపించలేకపోతే నిరుత్సాహపడకండి. మీరు వాళ్లను మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే, తిరిగి మంచి సంబంధాన్ని కలిగివుండవచ్చు. తర్వాత మళ్లీ ఆ తప్పు చేయకుండా చూసుకోండి.

18. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

18 యేసు మనకు మంచి ఆదర్శాన్ని ఉంచినందుకు మనమెంతో కృతజ్ఞులం. మనం ఎంతెక్కువ యేసులా ఆలోచిస్తే, అంతెక్కువ ఆయనలా ప్రవర్తించగలుగుతాం. అప్పుడు కొత్త వ్యక్తిత్వాన్ని ఇంకా ఎక్కువ ధరించుకోగల్గుతాం. ఈ ఆర్టికల్‌లో, పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో కేవలం నాల్గింటి గురించే చూశాం. కాబట్టి సమయం తీసుకొని మిగతా లక్షణాల గురించి కూడా అధ్యయనం చేసి, వాటిని ఎంత బాగా చూపిస్తున్నామో ఆలోచించవచ్చు. వాటికి సంబంధించిన ఆర్టికల్స్‌ని యెహోవాసాక్షుల పరిశోధన పుస్తకంలో “క్రైస్తవ జీవితం” అనే అంశం కింద, “పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు” కింద చూడండి. కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి మనవంతు మనం ప్రయత్నించినప్పుడు, యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండొచ్చు.

పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి

^ పేరా 5 గతంలో మనమెలా జీవించినా “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకోవచ్చు. అలా చేయాలంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటూ, యేసులా ఉండడానికి ప్రయత్నించాలి. యేసు ఎలా ఆలోచించేవాడో, ప్రవర్తించేవాడో కొన్ని ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన్ని ఎలా అనుకరిస్తూ ఉండవచ్చో కూడా తెలుసుకుంటాం.

^ పేరా 4 పవిత్రశక్తి సహాయంతో మనం వృద్ధిచేసుకోగల కొన్ని లక్షణాల గురించి మాత్రమే గలతీయులు 5:22, 23లో ఉంది. దానిగురించి ఇంకా తెలుసుకోవడానికి 2020, జూన్‌ కావలికోట పత్రికలోని “పాఠకుల ప్రశ్న” చూడండి.