కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 12

జెకర్యా చూసినదాన్ని మీరూ చూడండి

జెకర్యా చూసినదాన్ని మీరూ చూడండి

“‘సైన్యాల వల్లో, మనుషుల శక్తి వల్లో కాదుగానీ నా పవిత్రశక్తి వల్లే ఇదంతా జరుగుతుంది’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.”జెక. 4:6.

పాట 73 మాకు ధైర్యాన్నివ్వు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. బబులోనులో బందీలుగా ఉన్న యూదులు ఏ ప్రకటన విని సంతోషించారు?

 యూదులు చాలా సంవత్సరాలు బబులోనులో బందీలుగా ఉన్నారు. అయితే వాళ్లను విడుదల చేయమని యెహోవా దేవుడు పర్షియా రాజైన కోరెషు “మనసును ప్రేరేపించాడు.” అప్పుడు రాజు యూదుల్ని తమ దేశానికి తిరిగి వెళ్లమని, ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరాన్ని తిరిగి కట్టమని’ ఒక ప్రకటన చేశాడు. (ఎజ్రా 1:1, 3) అది విని యూదులు ఎంతో సంతోషించారు. ఎందుకంటే యెహోవా తమకిచ్చిన దేశంలో వాళ్లు మళ్లీ ఆయన్ని ఆరాధించగల్గుతారు.

2. యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదులు వెంటనే ఏం చేశారు?

2 బందీలుగా ఉన్న యూదుల్లో మొదటి గుంపు క్రీ.పూ. 537⁠లో, దక్షిణ రాజ్యమైన యూదాకు రాజధానిగా ఉన్న యెరూషలేముకు వచ్చారు. వాళ్లు వచ్చిన వెంటనే ఆలయాన్ని తిరిగి కట్టడం మొదలుపెట్టి, క్రీ.పూ. 536 కల్లా దాని పునాది వేశారు.

3. యూదులపై ఎవరు వ్యతిరేకత తెచ్చారు? ఎలా తెచ్చారు?

3 యూదులు ఆలయాన్ని తిరిగి కట్టడం మొదలుపెట్టినప్పుడు, చుట్టుపక్కల ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ ప్రజలు “యూదావాళ్ల ధైర్యాన్ని నీరుగారుస్తూ, నిర్మాణ పని విషయంలో వాళ్లను నిరుత్సాహపరుస్తూ వచ్చారు.” (ఎజ్రా 4:4) అది యూదులకు ఒక కష్టమైన పరిస్థితి. అయితే ఆ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. ఎందుకంటే క్రీ.పూ. 522⁠లో అర్తహషస్త పర్షియాకు రాజయ్యాడు. * కొత్త రాజు వచ్చాడు కాబట్టి, “చట్టం పేరుతో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ” నిర్మాణ పనిని ఆపొచ్చని వ్యతిరేకులు అనుకున్నారు. (కీర్త. 94:20) యూదులు రాజు మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్లు ఆయనకు ఉత్తరం రాశారు. (ఎజ్రా 4:11-16) రాజు వాళ్ల అబద్ధాల్ని నమ్మి, ఆలయ నిర్మాణ పనిని ఆపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. (ఎజ్రా 4:17-23) దానివల్ల యూదులు ఆలయ నిర్మాణ పనిని ఆపేశారు.—ఎజ్రా 4:24.

4. వ్యతిరేకులు ఆలయ నిర్మాణ పనిని ఆపుజేయాలని ప్రయత్నించినప్పుడు యెహోవా ఏం చేశాడు? (యెషయా 55:11)

4 యెహోవాను ఆరాధించని చుట్టుపక్కల దేశాలవాళ్లు అలాగే పర్షియా ప్రభుత్వంలో కొంతమంది ఆలయ నిర్మాణ పనిని ఆపుజేయాలని తీర్మానించుకున్నారు. అయితే యూదులు ఆ పనిని పూర్తిచేయాలని యెహోవా కోరుకున్నాడు. అలాగే ఆయన దాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. (యెషయా 55:11 చదవండి.) ఆయన ధైర్యవంతుడైన జెకర్యాను తన ప్రవక్తగా ఎంచుకుని, అతనికి ఉత్తేజకరమైన ఎనిమిది దర్శనాల్ని చూపించాడు. జెకర్యా ఆ దర్శనాల గురించి యూదులకు చెప్పి వాళ్లను ప్రోత్సహించాలి. యూదులు తమ వ్యతిరేకులకు భయపడాల్సిన అవసరంలేదని అర్థంచేసుకోవడానికి, యెహోవా ఇచ్చిన పనిని కొనసాగించేలా కావాల్సిన ప్రోత్సాహాన్ని పొందడానికి ఆ దర్శనాలు వాళ్లకు సహాయం చేశాయి. జెకర్యాకు వచ్చిన ఐదవ దర్శనంలో అతను ఒక దీపస్తంభాన్ని, రెండు ఒలీవ చెట్లను చూశాడు.

5. ఈ ఆర్టికల్‌లో ఏం చర్చిస్తాం?

5 మనందరం ఎప్పుడోకప్పుడు నిరుత్సాహపడతాం. కాబట్టి జెకర్యా చూసిన ఐదవ దర్శనం ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ప్రోత్సాహం గురించి తెలుసుకున్నప్పుడు మనం ప్రయోజనం పొందవచ్చు. ఈ దర్శనాన్ని అర్థంచేసుకున్నప్పుడు మనకు వ్యతిరేకత వచ్చినా, మన పరిస్థితులు మారినా, మనకు వచ్చిన ఒక నిర్దేశం అర్థంకాకపోయినా యెహోవా సేవను నమ్మకంగా చేయగలుగుతాం. వీటి గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

వ్యతిరేకత ఎదురైనప్పుడు

ఏడు దీపాలున్న దీపస్తంభానికి నూనె అందిస్తున్న రెండు ఒలీవ చెట్లు ఉన్న దర్శనం జెకర్యాకు వచ్చింది (6వ పేరా చూడండి)

6. జెకర్యా 4:1-3లో ఉన్న దీపస్తంభం, ఒలీవ చెట్ల దర్శనం యూదులకు ఎలా ధైర్యాన్నిచ్చింది? (ముఖచిత్రం చూడండి.)

6 జెకర్యా 4:1-3 చదవండి. వ్యతిరేకత ఉన్నా తమ పనిని కొనసాగించడానికి దీపస్తంభం, రెండు ఒలీవ చెట్ల దర్శనం యూదులకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎలా? దీపస్తంభానికి ఆగకుండా నూనె అందడం మీరు గమనించారా? రెండు ఒలీవ చెట్ల నుండి నూనె ఒక గిన్నెలోకి పడి, అక్కడనుండి దీపస్తంభానికి ఉన్న ఏడు దీపాలకు వెళ్తుంది. దానివల్లే ఆ దీపాలు ఆరకుండా వెలుగుతూ ఉన్నాయి. ఆ దర్శనాన్ని చూసి జెకర్యా, “ఇవి దేన్ని సూచిస్తున్నాయి?” అని దేవదూతను అడిగాడు. దానికి ఆ దూత యెహోవా ఇచ్చిన ఈ సందేశాన్ని చెప్పాడు: “‘సైన్యాల వల్లో, మనుషుల శక్తి వల్లో కాదుగానీ నా పవిత్రశక్తి వల్లే ఇదంతా జరుగుతుంది’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.” (జెక. 4:4, 6) ఆ చెట్ల నుండి వచ్చే నూనె ఎప్పటికీ తరగని యెహోవా పవిత్రశక్తిని సూచిస్తుంది. పవిత్రశక్తి పారసీక సైన్యం కన్నా ఎంతో శక్తివంతమైనది. యెహోవా వాళ్లవైపు ఉన్నాడు కాబట్టి, ఎలాంటి వ్యతిరేకత ఉన్నా యూదులు ఆలయ నిర్మాణ పనిని పూర్తి చేయగలుగుతారు. అది వాళ్లకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి యూదులు చేయాల్సిందల్లా యెహోవా మీద నమ్మకముంచి, తిరిగి పనిని మొదలుపెట్టడమే. యూదులు అదే చేశారు, ఆ పనిని చేయకూడదని రాజు ఆజ్ఞాపించినా దాన్ని కొనసాగించారు.

7. ఆలయాన్ని కడుతున్న యూదులకు ఏ మార్పు ఊరటనిచ్చింది?

7 ఆలయాన్ని కడుతున్న యూదులకు ఒక మార్పు ఊరటనిచ్చింది. క్రీ.పూ. 520లో దర్యావేషు I పర్షియాకు రాజయ్యాడు. తన పరిపాలన రెండో సంవత్సరంలో ఆలయ నిర్మాణాన్ని ఆపేయడం చట్టవిరుద్ధమని తెలుసుకున్నాడు. తర్వాత దర్యావేషు ఆలయ పనిని పూర్తిచేయమని ఆజ్ఞ ఇచ్చాడు. (ఎజ్రా 6:1-3) రాజు తీసుకున్న నిర్ణయానికి ప్రతీఒక్కరు ఆశ్చర్యపోయారు. ఆయన ఇంకా ఏం చేశాడు? చుట్టుపక్కల ప్రజల్ని ఆలయ నిర్మాణ పనిలో జోక్యం చేసుకోవద్దని, ఆ పనికి కావాల్సిన నిధులతోసహా అన్నిటినీ ఇవ్వమని ఆజ్ఞాపించాడు. (ఎజ్రా 6:7-12) దానివల్ల యూదులు క్రీ.పూ. 515లో అంటే ఐదు సంవత్సరాల్లోపు ఆలయ పనిని పూర్తిచేశారు.—ఎజ్రా 6:15.

వ్యతిరేకత ఎదురైనప్పుడు యెహోవా శక్తి మీద ఆధారపడండి (8వ పేరా చూడండి)

8. వ్యతిరేకత ఎదురైనా మీరెందుకు ధైర్యంగా ఉండవచ్చు?

8 నేడు కూడా చాలామంది యెహోవా ఆరాధకులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు కొంతమంది, మన పనిపై ఆంక్షలున్న దేశాల్లో ఉంటున్నారు. అలాంటి దేశాల్లో మన సహోదరులను అరెస్టుచేసి “అధిపతుల ముందుకు, రాజుల ముందుకు” తీసుకెళ్లొచ్చు. అప్పుడు అది ఒక సాక్ష్యంగా ఉంటుంది. (మత్త. 10:17, 18) అయితే కొన్నిసార్లు, ప్రభుత్వం మారడంవల్ల మన సహోదరసహోదరీలకు మరింత స్వేచ్ఛగా ఆరాధించే అవకాశం దొరకొచ్చు. లేదా ఒక దయగల జడ్జి తీసుకునే నిర్ణయంవల్ల మనం మరింత స్వేచ్ఛ పొందొచ్చు. ఇంకొంతమంది సాక్షులకు వేరే రకమైన వ్యతిరేకత రావొచ్చు. వాళ్లు యెహోవాను ఆరాధించడానికి స్వేచ్ఛ ఉన్న దేశంలో నివసిస్తున్నా, కుటుంబసభ్యులు వాళ్లపై వ్యతిరేకత తీసుకురావొచ్చు. (మత్త. 10:32-36) అలాంటి చాలా సందర్భాల్లో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనల్ని బలవంతం చేయలేరని కుటుంబసభ్యులు తెలుసుకున్నప్పుడు వ్యతిరేకతను ఆపేయవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో ఒకప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నవాళ్లు ఇప్పుడు ఉత్సాహవంతమైన సాక్షులుగా మారారు. అందుకే మీకు వ్యతిరేకత ఎదురైనప్పుడు భయపడకుండా యెహోవాను సేవించండి. ఎందుకంటే యెహోవా తన పవిత్రశక్తి ద్వారా సహాయం చేస్తాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు.

పరిస్థితులు మారినప్పుడు

9. కొత్త ఆలయానికి పునాది వేసినప్పుడు యూదుల్లో కొంతమంది వృద్ధులు ఎందుకు బాధపడ్డారు?

9 కొత్త ఆలయానికి పునాది వేసినప్పుడు యూదుల్లో కొంతమంది వృద్ధులు ఏడ్చారు. (ఎజ్రా 3:12) వాళ్లు అంతకుముందు సొలొమోను కట్టించిన ఆలయ వైభవాన్ని చూశారు. అందుకే “దానికీ దీనికీ అసలు పోలికే లేదని” అనుకున్నారు. (హగ్గ. 2:2, 3) వాళ్లు కొత్త ఆలయాన్ని పాత ఆలయంతో పోల్చుకుని చాలా బాధపడ్డారు. ఆ నిరుత్సాహం నుండి బయటపడడానికి జెకర్యాకు వచ్చిన దర్శనం వాళ్లకు సహాయం చేస్తుంది. ఎలా?

10. యూదులు నిరుత్సాహం నుండి బయటపడడానికి జెకర్యా 4:8-10లో ఉన్న దేవదూత మాటలు ఎలా సహాయం చేశాయి?

10 జెకర్యా 4:8-10 చదవండి. యూదులు “సంతోషిస్తారు, జెరుబ్బాబెలు [యూదుల అధిపతి] చేతిలో లంబసూత్రం చూస్తారు” అని చెప్పిన దేవదూత మాటలకు అర్థమేంటి? ఒక గోడ లేదా ఏదైనా నిలువుగా ఉందో లేదో చూడడానికి లంబసూత్రాన్ని వాడతారు. కొత్త ఆలయం చూడడానికి పాత ఆలయంకన్నా గొప్పగా లేకపోయినా అది పూర్తౌతుందని, యెహోవా కోరుకున్న విధంగా ఉంటుందని దేవదూత మాటల్నిబట్టి దేవుని ప్రజలు అర్థంచేసుకున్నారు. యెహోవా ఆ ఆలయాన్ని చూసి సంతోషిస్తున్నప్పుడు, యూదులు ఎందుకు బాధపడాలి? కొత్త ఆలయంలో తాను కోరుకున్న విధంగా ఆరాధన జరగడాన్ని యెహోవా ప్రాముఖ్యంగా ఎంచాడు. యూదులు యెహోవాకు ఇష్టమైన విధంగా ఆరాధించడం మీద, ఆయన ఆమోదాన్ని పొందడం మీద మనసుపెట్టినప్పుడు తిరిగి సంతోషాన్ని పొందుతారు.

మారిన పరిస్థితుల గురించి సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోండి (11-12 పేరాలు చూడండి) *

11. ఏం జరిగినప్పుడు కొంతమంది యెహోవా ఆరాధకులకు కష్టంగా ఉంటుంది?

11 పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు మనలో చాలామందికి కష్టంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యేక పూర్తికాల సేవచేసిన కొంతమంది నియామకం మారింది. ఇంకొంతమంది తమ వయసు కారణంగా ఎంతో ప్రేమించిన నియామకాన్ని ఆపేయాల్సి వచ్చింది. అలాంటి మార్పులు వచ్చినప్పుడు సాధారణంగానే మనం బాధపడతాం. మొదట్లో మనకు ఆ నిర్ణయం పూర్తిగా అర్థంకాకపోవచ్చు లేదా దాన్ని అంగీకరించకపోవచ్చు. అలాగే అంతకుముందున్న రోజులే బాగున్నాయని అనుకోవచ్చు. దానివల్ల నిరుత్సాహపడి, మారిన పరిస్థితుల్లో యెహోవా సేవ ఎక్కువ చేయలేమని అనుకోవచ్చు. (సామె. 24:10) అలాంటప్పుడు యెహోవా సేవలో మనం చేయగలిగినదంతా చేయడానికి జెకర్యాకు వచ్చిన దర్శనం ఎలా సహాయం చేస్తుంది?

12. మన పరిస్థితులు మారినా సంతోషంగా ఉండడానికి, జెకర్యాకు వచ్చిన దర్శనం ఎలా సహాయం చేస్తుంది?

12 మారిన పరిస్థితులను యెహోవా చూసినట్లే చూసినప్పుడు వాటికి అలవాటుపడడం తేలికౌతుంది. నేడు ఆయన ఎన్నో గొప్ప పనులు చేస్తున్నాడు. అలాగే ఆయన తోటి పనివాళ్లుగా ఉండే ప్రత్యేక అవకాశం మనకుంది. (1 కొరిం. 3:9) మన నియామకాలు మారవచ్చు, కానీ యెహోవాకు మనమీద ఉన్న ప్రేమ ఎప్పటికీ మారదు. కాబట్టి సంస్థలో జరిగిన ఏదైనా మార్పువల్ల మీ పరిస్థితుల్లో మార్పు వస్తే, అలా ఎందుకు జరిగిందని అదేపనిగా ఆలోచించకండి. ‘పాత రోజుల’ గురించే ఆలోచించే బదులు, జరిగిన మార్పుల్లో మంచిని చూడడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. (ప్రసం. 7:10) మీరు చేయలేని వాటిగురించి ఆలోచించే బదులు, చేయగలిగిన వాటన్నిటి గురించి ఆలోచించండి. జెకర్యాకు వచ్చిన దర్శనం నుండి మనం సానుకూలంగా ఆలోచించడం ఎంత ప్రాముఖ్యమో నేర్చుకుంటాం. అలా ఆలోచించినప్పుడు మన పరిస్థితుల్లో మార్పు వచ్చినా సంతోషంగా ఉంటాం, యెహోవాకు నమ్మకంగా ఉంటాం.

నిర్దేశాన్ని పాటించడం కష్టంగా ఉన్నప్పుడు

13. ఆగిపోయిన నిర్మాణ పనిని మళ్లీ ప్రారంభించడం సరైనది కాదని కొంతమంది యూదులు ఎందుకు అనుకొని ఉంటారు?

13 ఆలయాన్ని కట్టడం ఆపేయమనే ఆజ్ఞ ఇంకా అమల్లో ఉండగానే ప్రధానయాజకుడైన యేషూవ (యెహోషువ), అధిపతైన జెరుబ్బాబెలు “దేవుని మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభించారు.” (ఎజ్రా 5:1, 2) వాళ్లు అలా చేయడం సరైనది కాదని కొంతమంది యూదులు అనుకొని ఉంటారు. ఎందుకంటే ఆలయాన్ని కట్టడం శత్రువులకి కనిపిస్తుంది. వాళ్లు దాన్ని ఆపడానికి ఎంతవరకైనా వెళ్తారని యూదులకు తెలుసు. బాధ్యతగల స్థానంలో ఉన్న యెహోషువకు, జెరుబ్బాబెలుకు యెహోవా మద్దతు ఉందనే అభయం అవసరమైంది. అది వాళ్లకు ఎలా దొరికింది?

14. జెకర్యా 4:12, 14 ప్రకారం ప్రధానయాజకుడైన యెహోషువ, అధిపతైన జెరుబ్బాబెలు ఏ అభయాన్ని పొందారు?

14 జెకర్యా 4:12, 14 చదవండి. దర్శనంలోని ఈ భాగంలోవున్న రెండు ఒలీవ చెట్లు, “ఇద్దరు అభిషిక్తుల్ని” అంటే యెహోషువను, జెరుబ్బాబెలును సూచిస్తున్నాయని దేవదూత జెకర్యా ప్రవక్తకు చెప్పాడు. వాళ్లిద్దరూ ‘సర్వలోక ప్రభువు [యెహోవా] పక్కన నిల్చునట్టు’ ఉన్నారు. అదెంత గొప్ప గౌరవమో కదా! వాళ్లమీద యెహోవాకు నమ్మకముంది. కాబట్టి వాళ్లు ఏంచెప్పినా, ఏంచేసినా ఇశ్రాయేలీయులు నమ్మవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి యెహోవా వాళ్లను ఉపయోగించుకుంటున్నాడు.

15. యెహోవా బైబిలు ద్వారా ఇస్తున్న నిర్దేశాలపట్ల మనకు గౌరవం ఉందని ఎలా చూపించవచ్చు?

15 ఇప్పుడు కూడా యెహోవా బైబిలు ద్వారా తన ప్రజలకు కావాల్సిన నిర్దేశాల్ని ఇస్తున్నాడు. మనం తనకిష్టమైన విధంగా ఎలా ఆరాధించాలో అందులో చెప్తున్నాడు. కాబట్టి బైబిలు నుండి వచ్చే నిర్దేశాలపట్ల మనకు గౌరవం ఉందని ఎలా చూపించొచ్చు? సమయం తీసుకుని దాన్ని జాగ్రత్తగా చదవడం ద్వారా, అర్థంచేసుకోవడం ద్వారా గౌరవం ఉందని చూపించొచ్చు. మీరిలా ప్రశ్నించుకోండి: ‘బైబిల్ని లేదా మన ప్రచురణల్లో ఒకదాన్ని చదివినప్పుడు నేను సమయం తీసుకుని ధ్యానిస్తానా? “అర్థంచేసుకోవడానికి కష్టంగా” ఉన్న బైబిలు సత్యాల గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానా? లేదా పైపైన చదువుకుంటూ వెళ్లిపోతానా?’ (2 పేతు. 3:16) యెహోవా బోధిస్తున్న వాటిగురించి సమయం తీసుకుని ధ్యానించినప్పుడు ఆయన నిర్దేశాల్ని పాటిస్తాం; పరిచర్యను బాగా చేస్తాం.—1 తిమో. 4:15, 16.

“నమ్మకమైన బుద్ధిగల దాసుడి” నుండి వచ్చే నిర్దేశాన్ని నమ్మండి (16వ పేరా చూడండి) *

16. “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఇచ్చే నిర్దేశం మనకు పూర్తిగా అర్థంకాకపోయినా దాన్ని పాటించడానికి ఏది సహాయం చేస్తుంది?

16 యెహోవా మనకు “నమ్మకమైన, బుద్ధిగల దాసుడి” ద్వారా కూడా నిర్దేశమిస్తున్నాడు. (మత్త. 24:45) కొన్నిసార్లు ఆ దాసుడిచ్చే నిర్దేశం మనకు పూర్తిగా అర్థంకాకపోవచ్చు. ఉదాహరణకు, ఒక ప్రకృతి విపత్తు నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి దాసుడు కొన్ని నిర్దేశాలు ఇవ్వొచ్చు. కానీ అది మన ప్రాంతంలో రాదులే అని మనం అనుకోవచ్చు. లేదా మహమ్మారి సమయంలో దాసుడు అతి జాగ్రత్తగా ఉంటున్నాడని అనిపించొచ్చు. సంస్థ ఇచ్చే నిర్దేశాలు తెలివైనవి కావని మనకనిపిస్తే ఏం చేయాలి? యెహోషువ, జెరుబ్బాబెలు ఇచ్చిన సలహాను పాటించడంవల్ల ఇశ్రాయేలీయులు ఎలా ప్రయోజనం పొందారో మనం ఆలోచించొచ్చు. మనం చదివిన ఇతర బైబిలు వృత్తాంతాల గురించి కూడా ఆలోచించొచ్చు. కొన్నిసార్లు తాము పొందిన నిర్దేశాలు దేవుని ప్రజలకు సరైనవిగా అనిపించకపోయినా, చివరికి అవి వాళ్ల ప్రాణాల్ని కాపాడాయి.—న్యాయా. 7:7; 8:10.

జెకర్యా చూసినదాన్ని చూడండి

17. జెకర్యా చూసిన ఐదవ దర్శనం యూదుల మీద ఎలాంటి ప్రభావం చూపించింది?

17 జెకర్యా చూసిన ఐదవ దర్శనం చిన్నదే అయినా యూదులు తమ పనిని, ఆరాధనను ఉత్సాహంగా కొనసాగించడానికి అది సహాయం చేసింది. జెకర్యాకు వచ్చిన దర్శనం నుండి నేర్చుకున్నవాటిని యూదులు పాటించినప్పుడు యెహోవా ప్రేమపూర్వక మద్దతును, నడిపింపును చవిచూశారు. యెహోవా తన శక్తివంతమైన పవిత్రశక్తి ద్వారా యూదులు తమ పనిని కొనసాగించడానికి, తిరిగి సంతోషాన్ని పొందడానికి సహాయం చేశాడు.—ఎజ్రా 6:16.

18. జెకర్యాకు వచ్చిన దర్శనం మీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపించగలదు?

18 దీపస్తంభం అలాగే రెండు ఒలీవ చెట్ల గురించి జెకర్యాకు వచ్చిన దర్శనం, మీ జీవితం మీద శక్తివంతమైన ప్రభావం చూపించగలదు. వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కావాల్సిన బలాన్ని పొందడానికి, పరిస్థితులు మారినా సంతోషంగా ఉండడానికి, ఏదైనా నిర్దేశం అర్థంకాకపోయినా దాన్ని నమ్మి పాటించడానికి ఆ దర్శనం మీకు సహాయం చేస్తుంది. మీ జీవితంలో సమస్యలు ఎదురైతే ఏం చేయాలి? ముందుగా జెకర్యా ఏం చూశాడో దాన్ని మీరు కూడా చూడండి. అంటే యెహోవాకు తన ప్రజలమీద శ్రద్ధ ఉందనే రుజువును చూడండి. ఆ తర్వాత యెహోవామీద నమ్మకం ఉంచుతూ మీ నిండు హృదయంతో ఆయన్ని ఆరాధిస్తూ ఉండండి. (మత్త. 22:37) మీరలా చేస్తే తన సేవను ఎల్లప్పుడూ సంతోషంగా చేసేలా యెహోవా సహాయం చేస్తాడు.—కొలొ. 1:10, 11.

పాట 7 యెహోవా, మన బలం

^ పేరా 5 యెహోవా జెకర్యా ప్రవక్తకు ఉత్తేజకరమైన కొన్ని దర్శనాల్ని చూపించాడు. అవి జెకర్యానూ యెహోవా ప్రజలనూ బలపరచి, వ్యతిరేకత ఉన్నా సత్యారాధనను తిరిగి స్థాపించేలా వాళ్లకు సహాయం చేశాయి. ఎన్ని సవాళ్లున్నా యెహోవా సేవను నమ్మకంగా చేయడానికి ఆ దర్శనాలు మనకు కూడా సహాయం చేయగలవు. ఈ ఆర్టికల్‌లో దీపస్తంభం, ఒలీవ చెట్ల గురించి జెకర్యాకు వచ్చిన దర్శనాన్ని చర్చిస్తాం. అలాగే దాన్నుండి మనం నేర్చుకోగల విలువైన పాఠాల్ని తెలుసుకుంటాం.

^ పేరా 3 కొన్ని సంవత్సరాల తర్వాత, అధిపతైన నెహెమ్యా కాలంలో అర్తహషస్త అనే వేరే రాజు పరిపాలించాడు. ఆయన యూదులకు బాగా సహాయం చేశాడు.

^ పేరా 60 చిత్రాల వివరణ: వృద్ధాప్యంవల్ల అలాగే అనారోగ్య సమస్యలవల్ల మారిన పరిస్థితులకు అలవాటుపడాల్సిన అవసరముందని ఒక సహోదరుడు గుర్తిస్తున్నాడు.

^ పేరా 62 చిత్రాల వివరణ: యెహోషువకు, జెరుబ్బాబెలుకు మద్దతిచ్చినట్లే, ‘నమ్మకమైన బుద్ధిగల దాసునికి’ యెహోవా మద్దతిస్తున్నాడని ఒక సహోదరి గుర్తిస్తుంది.