కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆందోళనను తట్టుకుని ప్రశాంతతను, సంతోషాన్ని ఎలా పొందవచ్చు?

ఆందోళనను తట్టుకుని ప్రశాంతతను, సంతోషాన్ని ఎలా పొందవచ్చు?

ఆందోళన ఒక పెద్ద బరువులాంటిది. (సామె. 12:25) మీరు ఆందోళనల వల్ల ఎప్పుడైనా నలిగిపోయారా? వాటిని అస్సలు భరించలేమని మీకనిపించిందా? అయితే అలా అనిపించేది మీ ఒక్కరికే కాదు. మనలో చాలామందికి వేర్వేరు కారణాల వల్ల అలసిపోయినట్టుగా, కంగారుగా, నిరుత్సాహంగా అనిపించి ఉంటుంది. ఉదాహరణకు, కొంతమంది అనారోగ్యంతో ఉన్న తమ కుటుంబసభ్యుల్ని చూసుకుంటున్నారు. ఇంకొంతమంది తమకు ఇష్టమైనవాళ్లను మరణంలో పోగొట్టుకున్నారు. మరికొంతమంది ప్రకృతి విపత్తులవల్ల నష్టపోయారు. అలాంటప్పుడు ఆందోళనను తట్టుకుని ముందుకు వెళ్లడానికి మనకేది సహాయం చేస్తుంది? a

రాజైన దావీదు ఉదాహరణను పరిశీలించడం ద్వారా ఆందోళనను ఎలా తట్టుకోవచ్చో నేర్చుకోవచ్చు. అతను తన జీవితంలో ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. చివరికి కొన్నిసార్లు తన ప్రాణం పోయే పరిస్థితులు కూడా వచ్చాయి. (1 సమూ. 17:34, 35; 18:10, 11) తన జీవితంలో ఆందోళనల్ని తట్టుకోవడానికి దావీదుకు ఏది సహాయం చేసింది? అతనిలాగే మనమేం చేయవచ్చు?

ఆందోళనల్ని తట్టుకోవడానికి దావీదుకు ఏది సహాయం చేసింది?

దావీదుకు ఒకేసారి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఒక సందర్భంలో తనను చంపడానికి ప్రయత్నిస్తున్న రాజైన సౌలు నుండి దావీదు పారిపోతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దావీదు, అతని మనుషులు యుద్ధం చేసి సిక్లగులో తమ ఇళ్లకు తిరిగొచ్చారు. అప్పుడు వాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. అదేంటంటే, శత్రువులు అప్పటికే వాళ్ల వస్తువుల్ని దొంగిలించారు, ఇళ్లని కాల్చేశారు, వాళ్ల కుటుంబాల్ని బందీలుగా తీసుకెళ్లారు. అప్పుడు “దావీదు, అతనితో ఉన్న మనుషులు పెద్దగా ఏడ్వడం మొదలుపెట్టారు. ఇక ఏడ్వడానికి శక్తిలేనంత వరకు వాళ్లు ఏడ్చారు.” అది చాలదన్నట్టు తాను నమ్మిన మనుషులే తనని “రాళ్లతో కొట్టాలనుకున్నారు.” (1 సమూ. 30:1-6) దావీదుకు ఒకే సమయంలో మూడు పెద్దపెద్ద సమస్యలు వచ్చాయి. అతని కుటుంబం ప్రమాదంలో ఉంది, సొంత మనుష్యులే అతన్ని చంపాలనుకుంటున్నారు అలాగే రాజైన సౌలు ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉన్నాడు. దావీదుకు ఎంత ఆందోళనగా అనిపించివుంటుందో ఊహించండి!

అప్పుడు దావీదు ఏం చేశాడు? అతను “తన దేవుడైన యెహోవా సహాయంతో బలం పొందాడు.” దాన్ని అతనెలా పొందాడు? సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దావీదు సహాయం కోసం యెహోవాకు ప్రార్థించేవాడు అలాగే ఆయన తనకు గతంలో ఎలా సహాయం చేశాడో ఆలోచించేవాడు. (1 సమూ. 17:37; కీర్త. 18:2, 6) ఈ సందర్భంలో కూడా ఏం చేయాలో యెహోవాను అడగాలని దావీదుకు తెలుసు. అందుకే అతను వెంటనే యెహోవాను అడిగాడు. ఆ తర్వాత ఏం చేయాలో యెహోవా చెప్పినప్పుడు, దాన్ని వెంటనే చేశాడు. దానివల్ల యెహోవా అతన్ని, అతని మనుషుల్ని దీవించాడు. అలాగే వాళ్లు తమ కుటుంబాల్ని రక్షించుకున్నారు, తమ వస్తువుల్ని తిరిగి తెచ్చుకున్నారు. (1 సమూ. 30:7-9, 18, 19) దావీదు చేసిన మూడు పనుల్ని మీరు గమనించారా? అతను యెహోవా సహాయం కోసం ప్రార్థించాడు, యెహోవా గతంలో తనకెలా సహాయం చేశాడో ధ్యానించాడు అలాగే యెహోవా నిర్దేశం ప్రకారం చర్య తీసుకున్నాడు. అయితే, దావీదులాగే మనం చేయాల్సిన మూడు పనుల్ని ఇప్పుడు చూద్దాం.

ఆందోళనగా ఉన్నప్పుడు దావీదులాగే చేయండి

1. ప్రార్థించండి. మనకు ఆందోళనగా అనిపించినప్పుడల్లా సహాయం కోసం, తెలివి కోసం యెహోవాకు ప్రార్థించవచ్చు. ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ, హృదయంలో ఉన్నదంతా ఆయన ముందు కుమ్మరిస్తే మన బాధను తగ్గించుకోవచ్చు. లేదా పరిస్థితులు అనుకూలించకపోతే మనసులో చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. మనం సహాయం కోసం యెహోవాకు ప్రార్థించిన ప్రతీసారి దావీదులాగే యెహోవాను ఎంతో నమ్ముతున్నామని చూపిస్తాం. అతనిలా అన్నాడు: “యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించే దేవుడు. నా దేవుడే నా ఆశ్రయదుర్గం, నేను ఆయన్ని ఆశ్రయిస్తాను.” (కీర్త. 18:2) ప్రార్థించడంవల్ల మనకు నిజంగా సహాయం దొరుకుతుందా? కాలియా అనే పయినీరు సహోదరి ఇలా చెప్తుంది: “ప్రార్థించాక నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రార్థించడం వల్ల నేను యెహోవాలా ఆలోచిస్తున్నాను. అలాగే ఆయనమీద నా నమ్మకం మరింత పెరిగింది.” అవును, ఆందోళనను తట్టుకోవడానికి యెహోవా మనకిచ్చిన గొప్ప బహుమానం ప్రార్థన.

2. ధ్యానించండి. మీ జీవితంలో కేవలం యెహోవా సహాయం వల్లే కష్టాల్ని తట్టుకుని ముందుకు వెళ్లిన సందర్భాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? యెహోవా మనకు, గతంలో తన సేవకులకు ఎలా సహాయం చేశాడో ధ్యానించినప్పుడు ఎక్కువ మనశ్శాంతిని పొందుతాం. అలాగే ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటాం. (కీర్త. 18:17-19) జాషువ అనే సంఘపెద్ద ఇలా అంటున్నాడు: “యెహోవా నాకు జవాబిచ్చిన ప్రార్థనలన్నిటినీ ఒక లిస్టు రాసుకున్నాను. దాన్ని చూసినప్పుడల్లా నేను సరిగ్గా వేటి గురించైతే ప్రార్థించానో, వాటికి ఆయన జవాబిచ్చిన సందర్భాలన్నీ నాకు గుర్తొస్తాయి.” ఆ సహోదరునిలాగే మనం కూడా యెహోవా ఇప్పటివరకు మనకెలా సహాయం చేశాడో గుర్తుచేసుకుంటే ఆందోళనల నుండి బయటపడడానికి కావాల్సిన బలాన్ని పొందుతాం.

3. చర్య తీసుకోండి. ఒక పరిస్థితిలో ఏం చేయాలో నిర్ణయించుకునే ముందు నమ్మదగిన సలహాల కోసం దేవుని వాక్యంలో వెదకొచ్చు. (కీర్త. 19:7, 11) చాలామంది ఒక లేఖనం గురించి పరిశోధన చేసినప్పుడు, వాళ్ల జీవితంలో దాన్నెలా అన్వయించుకోవచ్చో ఇంకా బాగా అర్థంచేసుకున్నారు. జెరెడ్‌​ అనే పెద్ద ఇలా అంటున్నాడు: “ఏదైనా ఒక లేఖనం గురించి బాగా పరిశోధన చేసి అందులోవున్న విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు, దాన్నుండి యెహోవా నాకేమి చెప్పాలనుకుంటున్నాడో నేను అర్థం చేసుకోగలుగుతాను. అలా నేను చదువుతున్న దాన్ని నిజంగా నమ్మడానికి, దాని ప్రకారం చర్య తీసుకోవడానికి సహాయం దొరుకుతుంది.” కాబట్టి మనం యెహోవా నిర్దేశం కోసం లేఖనాల్లో వెదికి, దాని ప్రకారం చర్య తీసుకుంటే ఆందోళనను తట్టుకోవడం మరింత తేలికౌతుంది. అలాగే మనశ్శాంతిని, సంతోషాన్ని పొందుతాం.

ఆందోళనల్ని తట్టుకోవడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు

ఆందోళనల్ని విజయవంతంగా తట్టుకోవాలంటే తనకు యెహోవా సహాయం అవసరమని దావీదు గుర్తించాడు. అతను యెహోవా సహాయాన్ని విలువైనదిగా ఎంచుతూ ఇలా అన్నాడు: “దేవుని శక్తితో నేను ప్రాకారం మీదుగా దూకగలను. సత్యదేవుడే నాకు బలాన్నిస్తాడు.” (కీర్త. 18:29, 32) బహుశా మన సమస్యలు మనం అస్సలు ఎక్కలేని పెద్ద ప్రాకారాల్లా అనిపించవచ్చు. వాటిని పరిష్కరించుకోవడం లేదా తట్టుకోవడం అసాధ్యం అనిపించవచ్చు. కానీ యెహోవా సహాయంతో మనం ఎంతటి సమస్యనైనా సహించగలం. కాబట్టి సహాయం కోసం మనం యెహోవాకు ప్రార్థించాలి, ఆయన ఇప్పటికే మన కోసం చేసినవాటన్నిటి గురించి ధ్యానించాలి అలాగే ఆయనిచ్చిన నిర్దేశం ప్రకారం చర్య తీసుకోవాలి. ఇలా చేసినప్పుడు, ఆందోళనల్ని తట్టుకుని ముందుకు వెళ్లడానికి కావాల్సిన బలాన్ని, తెలివిని ఆయన మనకిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

a ఒకవ్యక్తి తీవ్రమైన ఆందోళనతో బాధపడుతుంటే బహుశా డాక్టరు సహాయం తీసుకోవాల్సి రావచ్చు.