కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 17

తల్లులారా, యునీకే ఆదర్శం నుండి నేర్చుకోండి

తల్లులారా, యునీకే ఆదర్శం నుండి నేర్చుకోండి

‘మీ అమ్మ ఉపదేశాన్ని విడిచిపెట్టకు. అది నీ తలకు అందమైన పూలదండలా, నీ మెడకు సొగసైన హారంలా ఉంటుంది.’సామె. 1:8, 9.

పాట 137 నమ్మకమైన స్త్రీలు, క్రైస్తవ సహోదరీలు

ఈ ఆర్టికల్‌లో. . . a

తిమోతి బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు అతని తల్లి యునీకే, అమ్మమ్మ లోయి గర్వంగా చూస్తున్నారు (1వ పేరా చూడండి)

1-2. (ఎ) యునీకే ఎవరు? తన కొడుకుకి యెహోవాను, యేసును ప్రేమించేలా నేర్పించడం ఎందుకు కష్టమై ఉండొచ్చు? (బి) కవర్‌ పేజీ మీదున్న చిత్రాన్ని వివరించండి.

 తిమోతి బాప్తిస్మం తీసుకున్న రోజు ఏం జరిగిందో బైబిలు చెప్పకపోయినా అతని తల్లి యునీకే ఆ రోజు ఎంత సంతోషించి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. (సామె. 23:25) నీళ్లలో నిలబడి ఉన్న తిమోతిని చూసి ఆమె ఎంతో గర్వపడుతుంది. తిమోతి అమ్మమ్మ లోయి కూడా ఆమె పక్కనే ఉంది. యునీకే ఊపిరి బిగబట్టి చూస్తుండగా తిమోతి నీళ్లలోకి మునిగాడు. నీళ్లలో నుండి పైకి వచ్చాక అతని ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. అది చూసి యునీకే ఆనందం పట్టలేక ఏడ్వడం మొదలుపెట్టింది. కష్టమైన బాధ్యతే అయినా, యునీకే తన కొడుకుకి యెహోవాను, యేసును ప్రేమించేలా నేర్పించింది. అలా నేర్పించడానికి ఆమె ఎలాంటి సవాళ్లను అధిగమించింది?

2 తిమోతి తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవాళ్లు. అతని తండ్రి అన్య దేవుళ్లను ఆరాధించే గ్రీసు దేశస్థుడు. మరోవైపు అతని తల్లి, అమ్మమ్మ యూదులు. (అపొ. 16:1) యునీకే, లోయి క్రైస్తవులుగా మారినప్పుడు బహుశా తిమోతి టీనేజ్‌లో ఉండివుంటాడు. కానీ అతని తండ్రి మాత్రం క్రైస్తవునిగా మారలేదు. తిమోతికి సొంతగా నిర్ణయం తీసుకునే వయసు ఉంది కాబట్టి, అతను ఏ మతాన్ని పాటిస్తాడు? తన తండ్రి మతాన్నా? పోనీ చిన్నప్పటి నుండి నేర్చుకున్న యూదుల ఆచారాల్నా? లేదా అతను ఒక క్రైస్తవునిగా మారతాడా?

3. సామెతలు 1:8, 9 ప్రకారం, పిల్లలు తనకు స్నేహితులు అవ్వడానికి తల్లులు చేసే కృషిని యెహోవా ఎలా చూస్తాడు?

3 అదేవిధంగా, నేడు క్రైస్తవ తల్లులు కూడా తమ కుటుంబాల్ని ఎంతో ప్రేమిస్తారు. తమ పిల్లలు యెహోవాతో దగ్గరి స్నేహాన్ని పెంచుకోవడానికి సహాయం చేయాలని వాళ్లెంతో కోరుకుంటారు. దానికోసం వాళ్లు చేసే ప్రయత్నాలన్నిటినీ యెహోవా ఎంతో విలువైనవిగా చూస్తాడు. (సామెతలు 1:8, 9 చదవండి.) తనను ప్రేమించేలా, సేవించేలా పిల్లలకు నేర్పించడానికి ఎంతోమంది తల్లులకు ఆయన సహాయం చేశాడు.

4. తల్లులు ఈరోజుల్లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు?

4 తిమోతిలాగే తన పిల్లలు కూడా యెహోవాను ఆరాధిస్తారా లేదా అని ఏ తల్లి అయినా ఆలోచిస్తుంది. ఎందుకంటే తమ పిల్లలు సాతాను లోకంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులకు బాగా తెలుసు. (1 పేతు. 5:8) అంతేకాదు, కొంతమంది తల్లులు తమ పిల్లల్ని ఒంటరిగా పెంచుతారు. లేదా ఒకవేళ భర్త ఉన్నా అతను యెహోవాను ఆరాధించని వ్యక్తి అయ్యుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పెంచడం చాలామంది తల్లులకు ఒక సవాలుగా ఉంటుంది. ఉదాహరణకు క్రిస్టీన్‌ b అనే సహోదరి ఇలా చెప్తుంది: “నా భర్త ఒక మంచి తండ్రి అలాగే మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించేవాడు. కానీ పిల్లల్ని యెహోవాసాక్షులు అయ్యేలా పెంచడానికి మాత్రం అస్సలు ఒప్పుకునేవాడు కాదు. సంవత్సరాలు గడుస్తుండగా, పిల్లలు యెహోవాను ఆరాధిస్తారో లేదో అని ఆలోచిస్తూ నేను చాలాసార్లు ఏడ్చాను.”

5. ఈ ఆర్టికల్‌లో మనమేం చర్చిస్తాం?

5 మీరొక క్రైస్తవ తల్లి అయితే, యునీకేలాగే మీ పిల్లలు యెహోవాను ప్రేమించేలా, ఆయన్ని సేవించేలా సహాయం చేయగలరు. మీ మాటల ద్వారా, పనుల ద్వారా యునీకే ఆదర్శాన్ని పాటిస్తూ మీ పిల్లలకు ఎలా నేర్పించవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అలా చేస్తుండగా యెహోవా మీకెలా సహాయం చేస్తాడో కూడా చూస్తాం.

మీ మాటల ద్వారా మీ పిల్లలకు నేర్పించండి

6. రెండో తిమోతి 3:14, 15 ప్రకారం, తిమోతి ఒక క్రైస్తవునిగా ఎలా అయ్యాడు?

6 చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తిమోతికి యునీకే, ‘పవిత్ర లేఖనాల్లో’ ఉన్న విషయాల్ని నేర్పించడానికి బాగా కృషిచేసింది. ఆమెకు యేసుక్రీస్తు గురించి ఏమీ తెలియకపోయినా, ఒక యూదురాలిగా తనకు తెలిసిందంతా తిమోతికి నేర్పించింది. క్రైస్తవునిగా మారడానికి ఆ విషయాలు అతనికి సహాయం చేసుంటాయి. కానీ అలా మారాలా వద్దా అనే చివరి నిర్ణయం మాత్రం అతనే తీసుకోవాలి. అయితే తిమోతికి యేసు గురించిన సత్యాల మీద ‘నమ్మకం కుదరడానికి,’ తన తల్లి చేసిన కృషి కూడా ఒక కారణం. (2 తిమోతి 3:14, 15 చదవండి.) చివరికి అతను క్రైస్తవునిగా మారినప్పుడు యునీకే చాలా సంతోషించి ఉంటుంది. ఎందుకంటే ఆమె కష్టమైన పరిస్థితుల్ని అధిగమించి, తన కొడుకుకు యెహోవా గురించి నేర్పించింది. నిజానికి, యునీకే పేరు “జయించు” అనే అర్థానిచ్చే పదం నుండి తీసుకోబడింది. ఆమె తన పేరుకు తగ్గట్టే, తిమోతి యెహోవాను ప్రేమించేలా అలాగే ఆయన్ని సేవించేలా సహాయం చేయడానికి, కష్టాల్ని అధిగమించింది లేదా జయించింది.

7. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రగతి సాధించేలా యునీకే తన కొడుకుకు ఎలా సహాయం చేయగలదు?

7 తిమోతి బాప్తిస్మం తీసుకున్నప్పుడు తన జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అని యునీకే ఖచ్చితంగా ఆలోచించి ఉంటుంది. తిమోతి తన జీవితంలో ఏం చేస్తాడు? తనపై చెడు ప్రభావం చూపించేవాళ్లతో స్నేహం చేస్తాడా? ఏథెన్సులోని పాఠశాలకు వెళ్లి అక్కడ నేర్పించే లోక జ్ఞానాన్ని నమ్మడం మొదలుపెడతాడా? లేదా డబ్బు సంపాదించడం కోసం తన సమయాన్ని, శక్తిని, వయస్సుని వృథా చేస్తాడా? యునీకే తిమోతి కోసం నిర్ణయాలు తీసుకోలేదు. కానీ తెలివైన నిర్ణయాలు తీసుకునేలా ఆమె అతనికి సహాయం చేయగలదు. ఎలా? తిమోతి హృదయంలో యెహోవాపట్ల లోతైన ప్రేమను అలాగే యేసుపట్ల కృతజ్ఞతను పెంచేలా ఆమె చేయగలిగిందంతా చేయడం ద్వారా సహాయం చేయగలదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒక్కరే యెహోవాసాక్షి అయితే వాళ్లకు ఇలాంటి సవాళ్లు కొత్తేమీ కాదు. ఒకవేళ తల్లిదండ్రులిద్దరూ సత్యంలో ఉన్నా, తమ పిల్లలు యెహోవాను ప్రేమించేలా సహాయం చేయడం కష్టం అవ్వొచ్చు. మరైతే యునీకే ఆదర్శం నుండి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చు?

8. పిల్లలకు యెహోవా గురించి నేర్పించడానికి ఒక తల్లి సత్యంలో ఉన్న తన భర్తకు ఎలా మద్దతివ్వవచ్చు?

8 మీ పిల్లలతో కలిసి బైబిల్ని లోతుగా చదవండి. సహోదరీల్లారా మీ భర్త సత్యంలో ఉంటే, పిల్లలకు యెహోవా గురించి నేర్పించే విషయంలో మీరు ఆయనకు మద్దతివ్వాలి. యెహోవా కూడా అదే కోరుకుంటున్నాడు. దానికొక మార్గం ఏంటంటే, కుటుంబ ఆరాధన ఏర్పాటుకు మీరు సహకరిస్తూ ఉండాలి. ఆ ఏర్పాటు గురించి మంచిగా మాట్లాడండి. అంతేకాదు కుటుంబ ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండేలా, అందరూ సంతోషించేలా మీరేం చేయవచ్చో ఆలోచించండి. బహుశా కుటుంబంగా ఏదైనా బైబిలు స్టడీ ప్రాజెక్ట్‌ను చేయడానికి మీరు మీ భర్తకు సహాయం చేయవచ్చు. అంతేకాదు, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని విషయాల్ని అర్థం చేసుకునేంత వయసు మీ పిల్లలకు ఉందని మీకనిపిస్తే, వాళ్లతో స్టడీ చేయడానికి మీ భర్తకు మద్దతివ్వవచ్చు.

9. సత్యంలో లేని భర్త ఉన్న ఒక సహోదరికి పిల్లల్ని పెంచే విషయంలో సహాయం ఎక్కడ దొరుకుతుంది?

9 కొన్నిసార్లు పిల్లలకు బైబిలు స్టడీ చేసే బాధ్యతను తల్లులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్లు భర్త లేకుండానే ఒంటరిగా తమ పిల్లల్ని పెంచుతుండవచ్చు లేదా ఒకవేళ భర్త ఉన్నా అతను సత్యంలో ఉండకపోవచ్చు. మీ పరిస్థితి కూడా అదే అయితే, యెహోవా మీకు సహాయం చేస్తాడు కాబట్టి మరీ ఎక్కువ కంగారుపడాల్సిన పని లేదు. మీ పిల్లలతో స్టడీ చేస్తున్నప్పుడు యెహోవా సంస్థ ఇచ్చిన చక్కని బోధనా పనిముట్లను వాడండి. అలాగే, అనుభవంగల తల్లిదండ్రులు కుటుంబ ఆరాధన చేస్తున్నప్పుడు ఈ పనిముట్లను ఎలా ఉపయోగించారో అడిగి తెలుసుకోండి. c (సామె. 11:14) ఏదైనా ఒక విషయం గురించి మీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ల అభిప్రాయమేంటో తెలుసుకోవడానికి సరైన ప్రశ్నలు అడిగేలా సహాయం చేయమని మీరు యెహోవాకు ప్రార్థించవచ్చు. (సామె. 20:5) ‘స్కూల్లో నీకు అన్నిటికన్నా ఏది పెద్ద సమస్యగా ఉంది?’ వంటి చిన్న ప్రశ్నలు వేస్తే, పిల్లలు మీతో మనసువిప్పి మాట్లాడే అవకాశం ఉంది.

10. మీ పిల్లలు యెహోవా గురించి నేర్చుకునేలా మీరింకా ఏం చేయవచ్చు?

10 మీ పిల్లలకు యెహోవా గురించి నేర్పించడానికి అవకాశాల కోసం చూడండి. యెహోవా గురించి మాట్లాడండి అలాగే మీ జీవితంలో ఆయన చేసిన మంచి అంతటి గురించి వాళ్లకు చెప్పండి. (ద్వితీ. 6:6, 7; యెష. 63:7) ఇంట్లో పిల్లలకు క్రమంగా స్టడీ చేయడం వీలవ్వకపోతే మీరు అలా మాట్లాడడం ఇంకా ప్రాముఖ్యం. పైన ప్రస్తావించిన క్రిస్టీన్‌​ ఇలా అంటుంది: “పిల్లలతో యెహోవా గురించి మాట్లాడడానికి నాకు చాలా తక్కువ అవకాశాలు దొరికేవి. అందుకే దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేదాన్ని. మేము సరదాగా నడుచుకుంటూ బయటికి వెళ్లినప్పుడు లేదా బోటు షికారుకు వెళ్లినప్పుడు యెహోవా అద్భుతమైన సృష్టి గురించి చెప్పేదాన్ని. అలాగే వాళ్లు యెహోవాకు స్నేహితులు అవ్వడానికి సహాయపడే అనేక ఇతర విషయాల గురించి కూడా మాట్లాడేదాన్ని. మా పిల్లలు కాస్త పెద్దయ్యాక, బైబిల్ని సొంతగా అధ్యయనం చేయమని వాళ్లను ప్రోత్సహించాను.” తల్లులారా, మీరింకా ఏం చేయవచ్చు? మీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు యెహోవా సంస్థ గురించి, సహోదర సహోదరీల గురించి మంచి విషయాలు చెప్పండి. పెద్దల గురించి చెడుగా మాట్లాడకండి. ఒకవేళ అలా మాట్లాడితే ముందుముందు మీ పిల్లలు సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు పెద్దల సహాయాన్ని తీసుకోకపోవచ్చు.

11. యాకోబు 3:18 ప్రకారం, ఇంట్లో ప్రశాంతత ఉండేలా చూసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

11 ఇంట్లో ప్రశాంతత ఉండేలా చూసుకోండి. మీ భర్తపట్ల, పిల్లలపట్ల మీకున్న ప్రేమను చూపిస్తూ ఉండండి. మీ భర్త గురించి ఎప్పుడూ దయగా, గౌరవంగా మాట్లాడండి. మీ పిల్లలు కూడా అలాగే మాట్లాడేలా నేర్పించండి. మీరలా చేసినప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. దానివల్ల యెహోవా గురించి నేర్చుకోవడం మీ పిల్లలకు మరింత తేలికౌతుంది. (యాకోబు 3:18 చదవండి.) రుమేనియాలో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న యోజెఫ్‌​ అనే సహోదరుడి అనుభవం గురించి చూద్దాం. అతని చిన్నప్పుడు తనతోపాటు వాళ్ల అమ్మని, తోబుట్టువుల్ని యెహోవాను ఆరాధించకుండా వాళ్ల నాన్న వ్యతిరేకించేవాడు. యోజెఫ్‌​ ఇలా చెప్తున్నాడు: “ఇంట్లో ప్రశాంతత ఉండేలా మా అమ్మ చాలా ప్రయత్నించేది. మా నాన్న ఎంత కఠినంగా ప్రవర్తిస్తే, అమ్మ ఆయనతో అంత దయగా ఉండేది. మేము నాన్నను గౌరవించట్లేదని లేదా ఆయన మాట వినట్లేదని అమ్మ గమనిస్తే ఎఫెసీయులు 6:1-3 లో ఉన్న విషయాల్ని మాతో మాట్లాడేది. ఆ తర్వాత, నాన్నలో ఉన్న మంచి లక్షణాల గురించి చెప్పి ఆయన్ని ఎందుకు ప్రేమించాలో, గౌరవించాలో అర్థంచేసుకోవడానికి ఆమె సహాయం చేసేది. అలా పెద్దపెద్ద గొడవలు రాకుండా, ఇల్లు ప్రశాంతంగా ఉండేలా చూసుకునేది.”

మీ పనుల ద్వారా మీ పిల్లలకు నేర్పించండి

12. రెండో తిమోతి 1:5 ప్రకారం, యునీకే ఆదర్శం తిమోతిపై ఎలాంటి మంచి ప్రభావం చూపించింది?

12 రెండో తిమోతి 1:5 చదవండి. యునీకే తిమోతికి మంచి ఆదర్శం ఉంచింది. నిజమైన విశ్వాసం ఉంటే అది మన పనుల ద్వారా నిరూపించబడుతుందని ఆమె ఖచ్చితంగా అతనికి నేర్పించివుంటుంది. (యాకో. 2:26) తన తల్లి చేసే పనుల్లో యెహోవా మీద ఆమెకున్న ప్రగాఢమైన ప్రేమను తిమోతి చూడగలిగాడు. అలాగే యెహోవా సేవలో ఆమె సంతోషాన్ని పొందిందని అతను అర్థంచేసుకుని ఉంటాడు. యునీకే ఆదర్శం తిమోతిపై ఎలాంటి మంచి ప్రభావం చూపించింది? అతనికి కూడా తన తల్లిలాంటి బలమైన విశ్వాసమే ఉందని అపొస్తలుడైన పౌలు రాశాడు. అలాంటి విశ్వాసం అతనికి రాత్రికి రాత్రే రాలేదు. బదులుగా తిమోతి తన తల్లి ఆదర్శాన్ని గమనించి, ఆమెలాగే ఉండాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వచ్చింది. యునీకేలాగే నేడు కూడా చాలామంది తల్లులు ఒక్క మాట కూడా చెప్పకుండా తమ కుటుంబసభ్యులు యెహోవాను తెలుసుకునేలా సహాయం చేశారు. (1 పేతు. 3:1, 2) మీరూ వాళ్లలాగే చేయవచ్చు. ఎలా?

13. తల్లులు తమ జీవితంలో యెహోవాకు మొదటిస్థానం ఎందుకు ఇవ్వాలి?

13 మీ జీవితంలో యెహోవాకు మొదటిస్థానం ఇవ్వండి. (ద్వితీ. 6:5, 6) అందరు తల్లుల్లాగే మీరు కూడా ఎన్నో త్యాగాలు చేస్తారు. మీ పిల్లల బాగోగుల్ని చూసుకోవడానికి మీ సమయాన్ని, డబ్బుని, నిద్రని అలాగే మిగతావాటన్నిటినీ త్యాగం చేస్తారు. అయితే యెహోవాతో మీకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి సమయం లేనంతగా ఆ పనుల్లో మునిగిపోకండి. మీరు ఒంటరిగా ప్రార్థించడానికి, బైబిల్ని లోతుగా చదవడానికి, కూటాలకు హాజరవ్వడానికి సమయాన్ని కేటాయించండి. అలా చేసినప్పుడు యెహోవాతో మీ సంబంధాన్ని బలపర్చుకుంటారు. అలాగే మీ కుటుంబానికి, ఇతరులకు మంచి ఆదర్శాన్ని ఉంచుతారు.

14-15. లియాన్‌​, మారియా, జ్వావ్‌​ మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?

14 తమ తల్లుల్ని గమనించి యెహోవా మీద ప్రేమను, నమ్మకాన్ని పెంచుకున్న కొంతమంది యౌవనుల ఉదాహరణల్ని ఇప్పుడు చూద్దాం. క్రిస్టీన్‌​ కూతురు లియాన్‌​ ఇలా చెప్తుంది: “మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు స్వేచ్ఛగా బైబిల్ని అధ్యయనం చేయడం వీలయ్యేదికాదు. కానీ మా అమ్మ క్రమం తప్పకుండా కూటాలకు హాజరయ్యేది. మాకు బైబిలు గురించి ఎక్కువ తెలీకపోయినా, ఆమె చేసిన పనులవల్ల బలమైన విశ్వాసాన్ని పెంచుకోగలిగాం. దానివల్ల యెహోవాసాక్షులు నేర్పించేదే సత్యమని కూటాలకు వెళ్లక ముందే మాకర్థమైంది.”

15 మారియా వాళ్ల నాన్న, మీటింగ్స్‌కు వెళ్తే కొన్నిసార్లు వాళ్లను కొట్టేవాడు, తిట్టేవాడు. ఆమె ఇలా చెప్తుంది: “మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. నా చిన్నతనంలో ఇతరులు ఏమనుకుంటారో అని కొన్ని పనులు చేయడానికి నేను భయపడేదాన్ని. కానీ మా అమ్మ ఎలా ధైర్యం చూపించేదో, తన జీవితంలో యెహోవాకు ఎలా మొదటిస్థానం ఇచ్చేదో చూసినప్పుడు మనుషుల భయాన్ని అధిగమించగలిగాను.” జ్వావ్‌​ వాళ్ల నాన్న, ఇంట్లో యెహోవా గురించీ బైబిలు గురించీ అస్సలు మాట్లాడనిచ్చేవాడు కాదు. అతను ఇలా అంటున్నాడు: “మా నాన్నను సంతోషపెట్టడానికి, మా అమ్మ యెహోవాను తప్ప మిగతా వాటన్నిటినీ వదులుకోవడానికి ఇష్టపడింది. అది నన్ను ఎంతో కదిలించింది.”

16. ఒక తల్లి చూపించే ఆదర్శం ఇతరుల మీద ఎలాంటి మంచి ప్రభావం చూపిస్తుంది?

16 తల్లులారా, మీ ఆదర్శం ఇతరులమీద ప్రభావం చూపిస్తుందని గుర్తుంచుకోండి. ఏవిధంగా? యునీకే ఆదర్శం అపొస్తలుడైన పౌలు మీద చాలా ప్రభావం చూపించింది. అందుకే తిమోతికి ఉన్న వేషధారణలేని విశ్వాసం, “మొదట . . . యునీకేలో ఉంది” అని పౌలు చెప్పాడు. (2 తిమో. 1:5) యునీకేకి ఉన్న విశ్వాసాన్ని పౌలు మొదటిసారి ఎప్పుడు గమనించాడు? బహుశా ఆయన తన మొదటి మిషనరీ యాత్ర చేస్తూ లుస్త్రకు వెళ్లినప్పుడు లోయిని, యునీకేని కలిసి ఉంటాడు. అలాగే వాళ్లు క్రైస్తవులుగా మారడానికి ఆయన సహాయం చేసుంటాడు. (అపొ. 14:4-18) దాదాపు 15 సంవత్సరాల తర్వాత పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ వాళ్ల అమ్మ యునీకే చేసిన నమ్మకమైన పనుల్ని గుర్తుచేశాడు. అలాగే ఆమె ఆదర్శాన్ని పాటించమని ఆయన రాశాడు. నిజంగానే ఆమె ఆదర్శం అపొస్తలుడైన పౌలు మీద అలాగే ఆ కాలంలోని చాలామంది క్రైస్తవుల మీద చెరగని ముద్రవేసింది. ఒకవేళ మీరు కూడా ఒంటరిగా లేదా అవిశ్వాసియైన భర్తతో మీ పిల్లల్ని పెంచుతుంటే, మీ నమ్మకమైన ఆదర్శం ఇతరుల్ని బలపరుస్తుందని, ప్రోత్సహిస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి.

యెహోవాను ప్రేమించేలా పిల్లలకు సహాయం చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి కృషిచేస్తూ ఉండండి (17వ పేరా చూడండి)

17. ఒక తల్లిగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు మీ పిల్లలు స్పందించట్లేదని మీకనిపిస్తే మీరేం చేయాలి?

17 ఒక తల్లిగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు మీ పిల్లలు స్పందించట్లేదని మీకనిపిస్తే అప్పుడేంటి? పిల్లలకు యెహోవా గురించి నేర్పించాలంటే సమయం పడుతుందని గుర్తుంచుకోండి. చిత్రంలో ఉన్నట్టు, ఒక విత్తనం నాటినప్పుడు అది ఎదిగి ఒక చెట్టు అవుతుందా? దాని నుండి ఫలాలు వస్తాయా? అని మీరు ఆలోచించవచ్చు. అయితే ఆ చెట్టు ఫలాల్ని ఇస్తుందో లేదో మీకు ఖచ్చితంగా తెలియకపోయినా, దానికి నీళ్లు పోస్తూ అది ఎదిగేలా చేయగలిగిందంతా చేస్తారు. (మార్కు 4:26-29) అదేవిధంగా, ఒక తల్లిగా మీరు చేస్తున్న ప్రయత్నాలవల్ల మీ పిల్లలు యెహోవాను ప్రేమిస్తారా లేదా అని ఆలోచిస్తుండవచ్చు. మీ పిల్లలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మీ చేతుల్లో లేదు. కానీ యెహోవా గురించి వాళ్లకు నేర్పించడానికి మీరు చేయగలిగిందంతా చేస్తూ ఉంటే, వాళ్లు ఆయనకు స్నేహితులయ్యేలా అన్ని విధాలుగా సహాయం చేసినవాళ్లౌతారు.—సామె. 22:6.

యెహోవా ఇచ్చే సహాయంపై ఆధారపడండి

18. తనకు స్నేహితులు అవ్వడానికి యెహోవా మీ పిల్లలకు ఎలా సహాయం చేయగలడు?

18 తనకు స్నేహితులయ్యేలా యెహోవా బైబిలు కాలాల నుండి ఇప్పటివరకు లెక్కలేనంతమంది యౌవనులకు సహాయం చేశాడు. (కీర్త. 22:9, 10) మీ పిల్లల్లో ఆయనకు దగ్గరవ్వాలనే కోరిక మొదలైతే చాలు, యెహోవా వాళ్లకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. (1 కొరిం. 3:6, 7) ఒకవేళ మీ పిల్లలు ఆయన్ని నిండు హృదయంతో సేవించకపోయినా, ఆయన మాత్రం వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాడు. (కీర్త. 11:4) మీ పిల్లలకు “తగిన హృదయ స్థితి” ఉందని యెహోవాకు కాస్త అనిపించినా, తనకు స్నేహితులయ్యేలా వాళ్లకు వెంటనే సహాయం చేస్తాడు. (అపొ. 13:48; 2 దిన. 16:9) అలాగే మీ పిల్లలకు సరిగ్గా అవసరమైన విషయాలు, సరైన సమయంలో చెప్పేలా ఆయన మీకు సహాయం చేయవచ్చు. (సామె. 15:23) అంతేకాదు, వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించేలా సంఘంలో ఉన్న ఒక ప్రేమగల సహోదరుణ్ణి లేదా సహోదరిని ఆయన కదిలించవచ్చు. వాళ్లు పెద్దయ్యాక కూడా, మీరు చిన్నప్పుడు నేర్పించిన విషయాల్ని తిరిగి గుర్తుచేసుకునేలా యెహోవా వాళ్లకు సహాయం చేయవచ్చు. (యోహా. 14:26) మీరు మీ మాటల ద్వారా, పనుల ద్వారా మీ పిల్లలకు యెహోవా గురించి నేర్పిస్తూ ఉంటే ఆయన మిమ్మల్ని దీవిస్తాడు.

19. తల్లులారా, మీరు యెహోవా దీవెనల్ని పొందుతారని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

19 మీ పిల్లలు తీసుకునే నిర్ణయాల్ని బట్టి యెహోవా మిమ్మల్ని ప్రేమించడు. బదులుగా మీరు ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మీరు ఒంటరిగా పిల్లల్ని పెంచుతుంటే యెహోవా మీ పిల్లలకు తండ్రిగా, మీకు రక్షకునిగా ఉంటానని మాటిస్తున్నాడు. (కీర్త. 68:5) మీ పిల్లలు యెహోవాను సేవిస్తారో లేదో మీరు చెప్పలేరు. కానీ యెహోవా సహాయం మీద ఆధారపడుతూ మీ పిల్లల్ని పెంచడానికి చేయగలిగిందంతా చేస్తే, మీరు ఆయన దీవెనల్ని పొందుతారు.

పాట 134 పిల్లలు యెహోవా ఇచ్చిన బాధ్యత

a తిమోతి తల్లి యునీకే నుండి క్రైస్తవ తల్లులు ఎలా ప్రయోజనం పొందవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే తల్లులు తమ పిల్లలకు యెహోవా గురించి నేర్పించి, ఆయన్ని ప్రేమించేలా ఎలా సహాయం చేయొచ్చో కూడా తెలుసుకుంటాం.

b కొన్ని అసలు పేర్లు కావు.

c ఉదాహరణకు, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 50వ పాఠాన్ని అలాగే 2011 ఆగస్టు 15, కావలికోట పత్రికలోని 6-7 పేజీల్లో ఉన్న “కుటుంబ ఆరాధన, వ్యక్తిగత అధ్యయనం కోసం కొన్ని సలహాలు” అనే ఆర్టికల్‌ చూడండి.