కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 18

ఆధ్యాత్మిక లక్ష్యాల్ని పెట్టుకుని, వాటిని ఎలా చేరుకోవచ్చు?

ఆధ్యాత్మిక లక్ష్యాల్ని పెట్టుకుని, వాటిని ఎలా చేరుకోవచ్చు?

“వీటి గురించి ధ్యానించు; వీటిలో నిమగ్నమవ్వు, అప్పుడు నీ ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.”1 తిమో. 4:15.

పాట 84 ముందుండి సేవచేద్దాం

ఈ ఆర్టికల్‌లో. . . a

1. మనం ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాల్ని పెట్టుకోవచ్చు?

 నిజక్రైస్తవులుగా మనం యెహోవాను ఎంతో ప్రేమిస్తాం. కాబట్టి వీలైనంత మంచిగా ఆయన్ని సేవించాలని కోరుకుంటాం. అయితే యెహోవా కోసం చేయగలిగినదంతా చేయాలంటే మనం ఆధ్యాత్మిక లక్ష్యాల్ని పెట్టుకోవాలి. ఉదాహరణకు, మనం క్రైస్తవ లక్షణాల్ని వృద్ధిచేసుకోవాలి, ఉపయోగపడే నైపుణ్యాల్ని నేర్చుకోవాలి అలాగే ఇతరులకు సహాయం చేయడం కోసం మార్గాల్ని వెతకాలి. b

2. ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకోవడానికి మనమెందుకు ప్రయత్నించాలి?

2 ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకోవడానికి మనమెందుకు ప్రయత్నించాలి? ఒక ముఖ్య కారణం ఏంటంటే, మన ప్రేమగల పరలోక తండ్రిని సంతోషపెట్టాలని మనం కోరుకుంటాం. ఆయన సేవలో మన సామర్థ్యాల్ని పూర్తిగా ఉపయోగించినప్పుడు, యెహోవా మనల్ని చూసి సంతోషిస్తాడు. ఇంకొక కారణం ఏంటంటే, మనం ఎప్పుడైతే యెహోవా సేవ ఎక్కువగా చేస్తామో అప్పుడు మన సహోదర సహోదరీలకు మరింత బాగా సహాయం చేయగల్గుతాం. (1 థెస్స. 4:9, 10) యెహోవా సేవను ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా, మనందరం లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోవడానికి ప్రయత్నించాలి. దాన్నెలా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

3. మొదటి తిమోతి 4:12-16 ప్రకారం, అపొస్తలుడైన పౌలు తిమోతిని ఏం చేయమని ప్రోత్సహించాడు?

3 అపొస్తలుడైన పౌలు తిమోతికి మొదటి ఉత్తరం రాసే సమయానికే అతను కొంతకాలంగా సంఘపెద్దగా సేవచేస్తున్నాడు. అయినా అతన్ని లక్ష్యాలు పెట్టుకోమని, వాటిని చేరుకుంటూ ఉండమని పౌలు ప్రోత్సహించాడు. (1 తిమోతి 4:12-16 చదవండి.) పౌలు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తే, ఆయన తిమోతిని రెండు విధాలుగా ప్రగతి సాధించమని చెప్పాడని అర్థమౌతుంది. మొదటిగా ప్రేమ, విశ్వాసం, పవిత్రత లాంటి క్రైస్తవ లక్షణాల్ని పెంచుకోమని చెప్పాడు. రెండోదిగా చదవడం, ప్రోత్సహించడం, బోధించడం వంటి నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోమని చెప్పాడు. తిమోతిలాగే మనం కూడా లక్ష్యాల్ని పెట్టుకుని, వాటిని చేరుకోవడంవల్ల యెహోవా సేవను ఇంకా ఎక్కువగా ఎలా చేయగలమో ఇప్పుడు చూద్దాం. అలాగే, పరిచర్యను మనమింకా బాగా ఎలా చేయగలమో కూడా తెలుసుకుందాం.

క్రైస్తవ లక్షణాల్ని పెంచుకోండి

4. ఫిలిప్పీయులు 2:19-22 ప్రకారం, తిమోతి యెహోవా సేవలో బాగా ఉపయోగపడడానికి కారణమేంటి?

4 తిమోతికున్న ఎన్నో మంచి క్రైస్తవ లక్షణాల్ని బట్టి అతను యెహోవా సేవలో బాగా ఉపయోగపడ్డాడు. (ఫిలిప్పీయులు 2:19-22 చదవండి.) తిమోతి గురించి పౌలు చెప్పిన మాటల్నిబట్టి అతను వినయంగలవాడని, విశ్వసనీయుడని, కష్టపడి పనిచేసేవాడని, నమ్మదగినవాడని మనకు అర్థమౌతుంది. అతను ఎంతో ప్రేమగలవాడు అలాగే తోటి సహోదర సహోదరీల పట్ల చాలా శ్రద్ధ చూపించేవాడు. దానివల్ల పౌలు తిమోతిని ప్రేమించడంతోపాటు అతనికి కష్టమైన నియామకాన్ని ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. (1 కొరిం. 4:17) అదేవిధంగా, యెహోవా ఇష్టపడే క్రైస్తవ లక్షణాల్ని మనం పెంచుకున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అంతేకాదు, మనం సహోదర సహోదరీలకు మరింత బాగా సహాయం చేయగల్గుతాం.—కీర్త. 25:9; 138:6.

మీరు మరింత పెంచుకోవాలని అనుకుంటున్న ఒక క్రైస్తవ లక్షణాన్ని ఎంచుకోండి (5-6 పేరాలు చూడండి)

5. (ఎ) మీరు ఏ క్రైస్తవ లక్షణాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారో ఎలా నిర్ణయించుకోవచ్చు? (బి) చిత్రంలో చూపించినట్టు, ఇతరులపట్ల సహానుభూతిని ఎక్కువగా చూపించాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక యౌవన సహోదరి ఏం చేస్తుంది?

5 ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. మీ వ్యక్తిత్వంలో ఎక్కడ మెరుగుపర్చుకోవాలో తెలుసుకోవడానికి ప్రార్థించండి, ఆలోచించండి. తర్వాత మీరు పెంచుకోవాలని అనుకుంటున్న ఏదైనా ఒక లక్షణాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు, మీరు సహానుభూతిని ఎక్కువగా చూపించాలని అనుకుంటున్నారా? లేదా సహోదర సహోదరీలకు సహాయం చేయాలనే కోరికను పెంచుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఇతరుల్ని క్షమిస్తూ, ఎక్కువ శాంతిగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే వీటిని ఎలా మెరుగుపర్చుకోవచ్చో తెలుసుకోవడానికి మీ దగ్గరి స్నేహితుల్ని అడగండి.—సామె. 27:6.

6. మీరు ఏదైనా ఒక లక్షణాన్ని ఎలా పెంచుకోవచ్చు?

6 మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషిచేయండి. దాన్ని చేయడానికి ఒక మార్గం, మీరు పెంచుకోవాలని అనుకుంటున్న లక్షణం గురించి లోతుగా అధ్యయనం చేయడం. ఉదాహరణకు, మీరు క్షమించే గుణాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారు. ముందుగా మీరు, ఇతరుల్ని మనస్ఫూర్తిగా క్షమించినవాళ్ల గురించి, క్షమించనివాళ్ల గురించి బైబిల్లో చదివి, లోతుగా ఆలోచించవచ్చు. ఒకసారి యేసు గురించి ఆలోచించండి! ఆయన ఇతరుల్ని మనస్ఫూర్తిగా క్షమించాడు. (లూకా 7:47, 48) అంతేకాదు, ఆయన వాళ్ల తప్పుల మీద కాకుండా వాళ్లేమి సాధించగలరో దానిమీద మనసుపెట్టాడు. దానికి పూర్తి భిన్నంగా యేసు కాలంలోని పరిసయ్యులు, ‘ఇతరుల్ని చిన్నచూపు చూసేవాళ్లు.’ (లూకా 18:9) ఆ ఉదాహరణల గురించి లోతుగా ఆలోచించిన తర్వాత ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఇతరుల్లో మంచిని చూస్తానా? వాళ్లలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయి?’ ఒకవేళ ఎవరినైనా క్షమించడం మీకు కష్టంగా అనిపిస్తే, ఆ వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలన్నిటినీ ఒక లిస్టు రాయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఇలా ప్రశ్నించుకోండి: ‘ఆ వ్యక్తిని యేసు ఎలా చూస్తాడు? ఆయనైతే అతన్ని క్షమించేవాడా?’ ఇలాచేస్తే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోగల్గుతాం. మొదట్లో ఎవరినైనా క్షమించాలంటే మీకు కష్టంగా ఉండొచ్చు. కానీ ప్రయత్నిస్తూ ఉంటే, సమయం గడిచేకొద్దీ వాళ్లను క్షమించడం తేలికౌతుంది.

ఉపయోగపడే నైపుణ్యాల్ని నేర్చుకోండి

రాజ్యమందిరంలో మెయింటెనెన్స్‌ పనులు ఎలా చేయాలో నేర్చుకోండి (7వ పేరా చూడండి) e

7. నైపుణ్యంగల సహోదర సహోదరీల్ని నేడు యెహోవా ఏయే విధాలుగా ఉపయోగిస్తున్నాడు? (సామెతలు 22:29)

7 ఉపయోగపడే ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవాలనే లక్ష్యాన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. బెతెల్‌ భవనాల్ని, సమావేశ హాళ్లని, రాజ్యమందిరాల్ని కట్టాలంటే ఎంతమంది అవసరమో ఒకసారి ఆలోచించండి. వాళ్లలో చాలామంది అనుభవంగల సహోదర సహోదరీలతో కలిసి పనిచేయడంవల్ల తమ నైపుణ్యాల్ని పెంచుకున్నారు. చిత్రంలో చూపించినట్లు సమావేశ హాళ్లను, రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచడానికి అవసరమయ్యే నైపుణ్యాల్ని సహోదరులే కాదు సహోదరీలు కూడా నేర్చుకుంటున్నారు. ఈ విధంగా అలాగే మరెన్నో విధాలుగా ‘యుగయుగాలకు రాజైన’ యెహోవా దేవుడు, “రాజులకు రాజు” అయిన యేసుక్రీస్తు, నైపుణ్యంగల పనివాళ్ల ద్వారా ఎన్నో గొప్ప విషయాల్ని సాధిస్తున్నారు. (1 తిమో. 1:17; 6:15; సామెతలు 22:29 చదవండి.) మనం కష్టపడి పనిచేస్తూ, నైపుణ్యాల్ని ఉపయోగించేది మన పేరు కోసం కాదుగాని యెహోవాను మహిమపర్చడానికే.—యోహా. 8:54.

8. మీరు ఏ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలో ఎలా తెలుసుకోవచ్చు?

8 ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. మీరు ఏ నైపుణ్యాన్ని పెంచుకుంటే బాగుంటుందో మీ సంఘ పెద్దల్ని అడగండి. వీలైతే మీ ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి కూడా అడిగి తెలుసుకోండి. ఒకవేళ ప్రసంగించే, బోధించే కళను మెరుగుపర్చుకోమని వాళ్లు మీకు చెప్తే, ఏ ప్రసంగ లక్షణాన్ని మెరుగుపర్చుకోవాలో తిరిగి వాళ్లనే అడగండి. ఆ తర్వాత మెరుగుపర్చుకోవడానికి కష్టపడి పనిచేయండి. దీన్ని మీరెలా చేయొచ్చు?

9. ఏదైనా ఒక నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలనే లక్ష్యాన్ని మీరెలా చేరుకోవచ్చు?

9 మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషిచేయండి. మీరు ప్రసంగించే లేదా బోధించే నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని అనుకుంటుంటే చక్కగా చదువుదాం, బోధిద్దాం బ్రోషురుని జాగ్రత్తగా అధ్యయనం చేయొచ్చు. వారం మధ్యలోని మీటింగ్‌లో మీకేదైనా ప్రసంగం ఉంటే, ఆ ప్రసంగాన్ని ఒక అనుభవంగల సహోదరుడికి ముందే చూపించండి. ఆ తర్వాత ఎక్కడ మెరుగుపర్చుకోవాలో తెలుసుకోవడానికి సలహాలు అడగండి. అలాగే మీకిచ్చిన నియామకానికి ముందే సిద్ధపడడం ద్వారా మీరు కష్టపడి పనిచేసే వాళ్లని, నమ్మదగిన వాళ్లని ఇతరుల దగ్గర పేరు సంపాదించుకుంటారు.—సామె. 21:5; 2 కొరిం. 8:22.

10. ఏదైనా ఒక నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం కష్టంగా ఉంటే ఏం చేయాలో ఒక అనుభవం ద్వారా చెప్పండి.

10 ఏదైనా ఒక నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం మీకు కష్టంగా ఉంటే ఏం చేయాలి? దాన్ని మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండండి. గ్యారీ అనే సహోదరుడు చక్కగా చదవగలిగేవాడు కాదు. సంఘకూటాల్లో అందరిముందు చదవడానికి ప్రయత్నించినప్పుడు, తనకు చాలా ఇబ్బందిగా అనిపించేదని గుర్తుచేసుకుంటున్నాడు. కానీ అతను ఆ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి మానకుండా కృషిచేశాడు. అనుభవంగల సహోదరులు ఇచ్చిన శిక్షణవల్ల, ప్రచురణల్లో చదివిన సలహాలవల్ల ఇప్పుడతను రాజ్యమందిరాల్లో, ప్రాంతీయ సమావేశాల్లో, ప్రాదేశిక సమావేశాల్లో ప్రసంగాలు ఇవ్వగల్గుతున్నానని చెప్తున్నాడు.

11. తిమోతిలాగే, యెహోవా సేవను ఇంకా ఎక్కువగా చేయాలంటే మనకేది సహాయం చేస్తుంది?

11 తిమోతి ఆకట్టుకునే ప్రసంగికునిగా, మంచి బోధకునిగా తయారయ్యాడా? దానిగురించి బైబిలు చెప్పట్లేదు. కానీ పౌలు ఇచ్చిన సలహాను తిమోతి పాటించాడు కాబట్టి తన నియామకాన్ని ఇంకా బాగా చేశాడు అనడంలో ఏ సందేహం లేదు. (2 తిమో. 3:10) తిమోతిలాగే మనం కూడా నైపుణ్యాల్ని మెరుగుపర్చుకుంటే, యెహోవా సేవను ఇంకా ఎక్కువగా చేయగల్గుతాం.

ఇతరులకు సహాయం చేయడం కోసం మార్గాల్ని వెతకండి

12. సహోదర సహోదరీలు మీకెలా సహాయం చేశారు?

12 సహోదర సహోదరీలు మనకు సహాయం చేయడానికి ఎన్నో పనులు చేస్తుంటారు. ఉదాహరణకు, మనం హాస్పిటల్లో ఉంటే ఆసుపత్రి అనుసంధాన కమిటీలో లేదా రోగి సందర్శనా గుంపులో సేవచేసే పెద్దల్లో ఎవరైనా మనల్ని కలవడానికి వస్తే సంతోషంగా అనిపిస్తుంది. మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఎంతో శ్రద్ధతో, సమయం తీసుకుని మనం చెప్పేది విని, మనల్ని ఓదారిస్తే ఆయన చేసినదాన్ని ఎప్పటికీ మర్చిపోం. బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు మనకు సహాయం అవసరమైతే, అనుభవంగల ఒక పయినీరు మనతో స్టడీకి వచ్చి, సలహాలు ఇస్తే మనమెంతో ప్రయోజనం పొందుతాం. ఈ సహోదర సహోదరీలు మనకు సహాయం చేయడంవల్ల ఎంతో సంతోషాన్ని పొందుతారు. మనం కూడా సహోదర సహోదరీలకు సహాయం చేయడానికి ముందుంటే, అలాంటి సంతోషాన్నే పొందుతాం. అందుకే యేసు, “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది” అని అన్నాడు. (అపొ. 20:35) వాళ్లలాగే మీరు కూడా యెహోవా సేవను ఎక్కువగా చేయాలనుకుంటే, మీ లక్ష్యాల్ని చేరుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

13. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటున్నప్పుడు ఏ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి?

13 మీ లక్ష్యం స్పష్టంగా లేకపోతే దాన్ని చేరుకోలేకపోవచ్చు. ఉదాహరణకు, సంఘంలో ఇంకా ఎక్కువగా సేవచేయాలనే లక్ష్యాన్ని మీరు పెట్టుకుని ఉండొచ్చు. అయితే అలాంటి లక్ష్యాన్ని పెట్టుకుంటే, దాన్ని చేరుకోవడానికి ఏమేం చేయాలో మీకు తెలీకపోవచ్చు. దానికి బదులు, సహోదర సహోదరీలకు ఫలానా విధంగా సహాయం చేయాలనే ఒక సూటైన లక్ష్యాన్ని మీరు పెట్టుకోండి. తర్వాత మీరు చేరుకోవాలనుకుంటున్న లక్ష్యాన్ని, దానికోసం చేయాలనుకుంటున్న పనుల్ని ఒక దగ్గర రాసుకోవచ్చు.

14. లక్ష్యాన్ని మార్చుకోవడానికి మనమెందుకు సిద్ధంగా ఉండాలి?

14 చాలా సందర్భాల్లో మన పరిస్థితులు మారిపోతుంటాయి. అందుకే మన లక్ష్యాల్ని కూడా వాటికి తగ్గట్టుగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని అర్థంచేసుకోవడానికి పౌలు ఉదాహరణను పరిశీలిద్దాం. ఆయన థెస్సలొనీక పట్టణంలో ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేశాడు. ఆయన అక్కడే ఉండి, ఆ కొత్త సంఘంలో ఉన్నవాళ్లకు సహాయం చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటాడు. కానీ వ్యతిరేకుల వల్ల పౌలు ఆ పట్టణాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. (అపొ. 17:1-5, 10) ఒకవేళ పౌలు అక్కడేవుండి ఉంటే, ఆయనవల్ల సహోదరులు ప్రమాదంలో పడి ఉండేవాళ్లు. అందుకే అక్కడినుండి వెళ్లిపోయాడు. కానీ ఆయన వాళ్లకు సహాయం చేయడం మాత్రం ఆపలేదు. తన పరిస్థితులు మారిపోయినా, థెస్సలొనీకలోని క్రైస్తవులు బలమైన విశ్వాసాన్ని పెంచుకునేలా సహాయం చేయడానికి తిమోతిని పంపించాడు. (1 థెస్స. 3:1-3) అవసరం ఎక్కడుంటే అక్కడ సేవచేయడానికి సిద్ధంగావున్న తిమోతిని చూసి థెస్సలొనీకయులు ఎంతో సంతోషించివుంటారు.

15. పరిస్థితులు మారడంవల్ల మన లక్ష్యాల్ని ఎందుకు మార్చుకోవాల్సి రావచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

15 థెస్సలొనీకలో పౌలు చేసినదాన్ని నుండి మనమెంతో నేర్చుకోవచ్చు. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఉండొచ్చు. కానీ పరిస్థితులు మారిపోవడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. (ప్రసం. 9:11) మీకే అలాంటి పరిస్థితి ఎదురైతే, చేరుకోగల మరో లక్ష్యాన్ని మీరు పెట్టుకోగలరా? భార్యాభర్తలైన టెడ్‌, హైడీ అదే చేశారు. వాళ్లలో ఒకరికి అనారోగ్య సమస్య రావడంవల్ల, బెతెల్‌ సేవను విడిచిపెట్టాల్సి వచ్చింది. కానీ వాళ్లు యెహోవాను ఎంతో ప్రేమించారు కాబట్టి పరిచర్యను ఎక్కువగా చేయడానికి మార్గాల్ని వెదికారు. ముందుగా, వాళ్లు క్రమ పయినీరు సేవను మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రత్యేక పయినీర్లుగా నియామకాన్ని పొందారు. అలాగే సహోదరుడు టెడ్‌కు సబ్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ పర్యవేక్షకునిగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత, ప్రాంతీయ పర్యవేక్షకులు ఒక వయసు వరకే ఆ సేవచేయాలని నిర్దేశం వచ్చినప్పుడు టెడ్‌, హైడీ ఇక ఆ సేవలో కొనసాగలేమని అర్థంచేసుకున్నారు. మొదట్లో నిరాశపడినా యెహోవా సేవను వేరే మార్గాల్లో కూడా చేయవచ్చని వాళ్లు గుర్తించారు. టెడ్‌ ఇలా అంటున్నాడు: “యెహోవా సేవను ఒకే మార్గంలో కాకుండా వేర్వేరు మార్గాల్లో చేయవచ్చని మేం అర్థంచేసుకున్నాం.”

16. గలతీయులు 6:4 నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

16 మన జీవితంలో జరిగే చాలా విషయాలు మన చేతుల్లో ఉండవు. అందుకే, మనం చేసే నియామకాల్ని బట్టే యెహోవా మనల్ని విలువైన వాళ్లుగా ఎంచుతాడని అనుకోకుండా ఉండాలి. అలాగే మనం చేస్తున్న నియామకాల్ని వేరేవాళ్లు చేస్తున్న నియామకాలతో పోల్చుకోకూడదు. హైడీ ఇలా చెప్తుంది: “మీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకుంటే మీరు ప్రశాంతతను పోగొట్టుకుంటారు.” (గలతీయులు 6:4 చదవండి.) అందుకే, ఇతరులకు సహాయం చేయడం కోసం అలాగే యెహోవా సేవ చేయడం కోసం మార్గాల్ని వెతకడం చాలా ప్రాముఖ్యం. c

17. మరిన్ని సేవావకాశాల్ని చేపట్టాలంటే మీరేం చేయవచ్చు?

17 మీరు సాదాసీదాగా జీవిస్తూ, అనవసరమైన అప్పులు చేయకుండా ఉంటే యెహోవా సేవను ఇంకా ఎక్కువగా చేయడం సాధ్యమౌతుంది. అలాగే, మీరు చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకుంటే పెద్దపెద్ద లక్ష్యాల్ని చేరుకోగలుగుతారు. ఉదాహరణకు, క్రమ పయినీరుగా సేవచేయాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటే, ఇప్పుడు మీరు ప్రతీనెల సహాయ పయినీరు సేవచేసే చిన్న లక్ష్యాన్ని పెట్టుకోగలరా? లేదా సంఘ పరిచారకుడిగా అవ్వాలనే లక్ష్యం మీకుంటే, పరిచర్యలో ఎక్కువ సమయం గడుపుతూ మీ సంఘంలో ఉన్న వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు సహాయం చేయగలరా? ఇలాంటి పనులు చేయడం ద్వారా మీరు పొందిన అనుభవం, ముందుముందు మరిన్ని సేవావకాశాలు చేపట్టేలా మీకు సహాయం చేస్తుంది. అందుకే, మీకిచ్చిన ఏ నియామకాన్నైనా శాయశక్తులా చేయాలని నిర్ణయించుకోండి.—రోమా. 12:11.

మీరు చేరుకోగల ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి (18వ పేరా చూడండి) f

18. బెవర్లీ ఉదాహరణ నుండి మీరేం నేర్చుకోవచ్చు? (18వ పేరాకు సంబంధించిన చిత్రం చూడండి.)

18 మనం ఏ వయస్సు వాళ్లమైనా ఆధ్యాత్మిక లక్ష్యాల్ని పెట్టుకుని వాటిని చేరుకోవచ్చు. 75 ఏళ్ల వయసున్న బెవర్లీ అనే సహోదరి అనుభవాన్ని చూడండి. ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యవల్ల, ఆమెకు నడవడం చాలా కష్టం. అయినా జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనాలని నిర్ణయించుకుంది. అలా చేయడం కోసం ఆమె కొన్ని లక్ష్యాల్ని పెట్టుకుంది. ప్రచార కార్యక్రమం కోసం తాను పెట్టుకున్న లక్ష్యాల్ని చేరుకున్నప్పుడు, బెవర్లీ ఎంతో సంతోషించింది. ఆమె చేసిన ప్రయత్నాల్ని చూసి సంఘంలోని మిగతావాళ్లు కూడా పరిచర్యలో కష్టపడి పనిచేయాలనే ప్రోత్సాహం పొందారు. వృద్ధ సహోదర సహోదరీలు తమ పరిస్థితులు అనుకూలించకపోయినా చేయగలిగింది చేస్తున్నందుకు యెహోవా వాళ్ల సేవను విలువైనదిగా ఎంచుతాడు.—కీర్త. 71:17, 18.

19. మనం పెట్టుకోగల కొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏంటి?

19 మీరు చేరుకోగల లక్ష్యాల్ని పెట్టుకోండి. యెహోవాను సంతోషపెట్టే లక్షణాల్ని పెంచుకోండి. మీరు యెహోవాకు, ఆయన సంస్థకు మరింత ఉపయోగపడేలా నైపుణ్యాల్ని నేర్చుకోండి. మీ సహోదర సహోదరీలకు ఎక్కువగా సహాయం చేయడానికి మార్గాల్ని వెతకండి. d అప్పుడు యెహోవా దీవెనలతో తిమోతిలాగే, మీ “ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.”—1 తిమో. 4:15.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

a తిమోతి చాలా నైపుణ్యంగా మంచివార్తను ప్రకటించేవాడు. అయినా అతన్ని ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ ఉండమని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. ఆ సలహాను పాటించడంవల్ల తిమోతి యెహోవా సేవలో మరింత ఎక్కువగా ఉపయోగపడ్డాడు. అలాగే తోటి సహోదర సహోదరీలకు ఎక్కువ సహాయం చేయగలిగాడు. మీరు కూడా తిమోతిలాగే యెహోవా సేవ ఎక్కువగా చేయాలని, తోటి సహోదర సహోదరీలకు మరింత సహాయం చేయాలని ఎంతో కోరుకుంటారు. అలా చేయడానికి ఏ లక్ష్యాలు మీకు సహాయం చేస్తాయి? ఆ లక్ష్యాల్ని పెట్టుకుని, వాటిని చేరుకోవాలంటే ఏమేం చేయాలి?

b పదాల వివరణ: ఆధ్యాత్మిక లక్ష్యాల్లో యెహోవా సేవ ఎక్కువగా చేయడానికి అలాగే ఆయన్ని సంతోషపెట్టడానికి మనం కష్టపడి చేసే ఏ పనైనా వస్తుంది.

c యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ అనే పుస్తకంలోని 10వ అధ్యాయంలో, “అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవ చేయడం” అనే అంశం కింద 6-9 పేరాలు చూడండి.

d ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకంలో “ప్రగతి సాధిస్తూ ఉండండి” అనే 60వ పాఠం చూడండి.

e చిత్రాల వివరణ: మెయింటెనెన్స్‌ పనుల్ని ఎలా చేయాలో ఒక సహోదరుడు ఇద్దరు సహోదరీలకు నేర్పిస్తున్నాడు. కొత్తగా నేర్చుకున్న ఆ పనిని వాళ్లు చక్కగా చేస్తున్నారు.

f చిత్రాల వివరణ: ఇంటికే పరిమితమైన ఒక సహోదరి, టెలిఫోన్‌ సాక్ష్యం చేస్తూ జ్ఞాపకార్థ ఆచరణకు ప్రజల్ని ఆహ్వానిస్తుంది.