కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 15

మీరు ‘మాట్లాడే విషయంలో ఆదర్శంగా’ ఉన్నారా?

మీరు ‘మాట్లాడే విషయంలో ఆదర్శంగా’ ఉన్నారా?

“మాట్లాడే విషయంలో . . . నమ్మకమైన సేవకులకు ఆదర్శంగా ఉండు.”1 తిమో. 4:12.

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

ఈ ఆర్టికల్‌లో. . . a

1. మనకు మాట్లాడే సామర్థ్యాన్ని ఎవరిచ్చారు?

 యెహోవా మనకు మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చాడు. మొదటి మనిషైన ఆదాము సృష్టించబడినప్పటి నుండే తన పరలోక తండ్రితో మాట్లాడగలిగాడు. అలాగే అతను కొత్త పదాల్ని కూడా కనిపెట్టగలిగాడు. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించే అతను జంతువులకు పేర్లు పెట్టాడు. (ఆది. 2:19) అతను మరో మనిషితో అంటే తన ప్రియమైన భార్య హవ్వతో, మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు నిజంగా ఎంతో సంతోషించివుంటాడు.—ఆది. 2:22, 23.

2. (ఎ) గతంలో కొంతమంది మాట్లాడే సామర్థ్యాన్ని ఎలా తప్పుగా ఉపయోగించారు? (బి) ఇప్పుడు ప్రజలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు?

2 కొంతకాలానికే మాట్లాడే సామర్థ్యం తప్పుగా ఉపయోగించబడింది. అపవాదైన సాతాను హవ్వకు అబద్ధం చెప్పాడు. అది మనుషులు పాపం చేయడానికి, అపరిపూర్ణులు అవ్వడానికి దారితీసింది. (ఆది. 3:1-4) ఆదాము తన సొంత తప్పులకు హవ్వను, చివరికి యెహోవాను కూడా నిందించి, తనకున్న మాట్లాడే సామర్థ్యాన్ని తప్పుగా ఉపయోగించాడు. (ఆది. 3:12) కయీను తన తమ్ముడైన హేబెలును చంపిన తర్వాత యెహోవాతో అబద్ధమాడాడు. (ఆది. 4:9) తర్వాత మరో సందర్భంలో కయీను వంశస్థుడైన లెమెకు ఒక కవిత రాశాడు. అందులో ఉన్న మాటల్నిబట్టి ఆ కాలంలో ప్రజలు చాలా క్రూరంగా ఉండేవాళ్లని తెలుస్తుంది. (ఆది. 4:23, 24) ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఏ మొహమాటం లేకుండా బూతులు తిడుతుంటారు. అలాగే దాదాపు అన్ని సినిమాల్లో అసభ్యకరమైన భాషను వాడుతున్నారు. పిల్లలు స్కూల్లో అలాగే పెద్దవాళ్లు పనిస్థలంలో అలాంటి మాటల్నే వింటూ ఉంటారు. విచారకరంగా, ఈ రోజుల్లో అసభ్యకరమైన భాష సర్వసాధారణం అయిపోవడం చూసినప్పుడు లోకం ఎంత చెడుగా తయారైందో తెలుస్తుంది.

3. మనం జాగ్రత్తగా లేకపోతే ఏం జరిగే అవకాశముంది? ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే, అసభ్యకరమైన భాషను వినీవినీ మనం కూడా అలానే మాట్లాడే అవకాశముంది. నిజమే, క్రైస్తవులుగా మనం యెహోవాను సంతోషపెట్టాలని కోరుకుంటాం. కానీ కేవలం అసభ్యకరంగా మాట్లాడకుండా ఉంటేనే సరిపోదు. దాంతోపాటు మాట్లాడే సామర్థ్యాన్ని సరైన విధంగా అంటే మన దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగించాలి. అందుకే (1) పరిచర్య చేస్తున్నప్పుడు, (2) మీటింగ్స్‌కి హాజరైనప్పుడు, (3) ప్రతిరోజు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆ సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించవచ్చో ఈ ఆర్టికల్‌​లో చూస్తాం. అయితే మనమెలా మాట్లాడతాం అనేది యెహోవా ఎందుకు పట్టించుకుంటాడో ముందుగా చూద్దాం.

మనమెలా మాట్లాడుతున్నామో యెహోవా పట్టించుకుంటాడు

మీ మాటలు మీ హృదయంలో ఏముందో చూపిస్తాయి (4-5 పేరాలు చూడండి) d

4. మలాకీ 3:16 ప్రకారం, మనమెలా మాట్లాడతాం అనేది యెహోవా ఎందుకు పట్టించుకుంటాడు?

4 మలాకీ 3:16 చదవండి. యెహోవాకు భయపడుతూ, ఆయన పేరు గురించి ధ్యానిస్తున్నవాళ్లు ఒకరితోఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆయన శ్రద్ధగా విని, వాళ్ల పేర్లను ఒక ‘జ్ఞాపకార్థ గ్రంథంలో’ రాస్తాడని ఈ లేఖనం చెప్తుంది. ఆయన వాళ్ల మాటల్ని ఎందుకు శ్రద్ధగా వింటాడు? ఎందుకంటే వాళ్ల మాటలు వాళ్ల హృదయంలో ఏముందో చూపిస్తాయి. అందుకే యేసు ఇలా అన్నాడు: “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.” (మత్త. 12:34) యెహోవా మీద మనకెంత ప్రేముందో మన మాటల్నిబట్టి తెలుస్తుంది. అలాగే తనను ప్రేమించేవాళ్లు కొత్తలోకంలో శాశ్వత జీవితాన్ని ఆనందించాలని యెహోవా కోరుకుంటాడు.

5. (ఎ) మన ఆరాధనకు, మనం మాట్లాడే మాటలకు ఎలాంటి సంబంధం ఉంది? (బి) చిత్రంలో చూపిస్తున్నట్టు, మన మాటల ద్వారా యెహోవాను సంతోషపెట్టాలంటే మనమేం చేయకుండా జాగ్రత్తపడాలి?

5 మన ఆరాధనను యెహోవా అంగీకరిస్తాడా లేదా అనేది మనమెలా మాట్లాడతామనే దానిమీద ఆధారపడి ఉంటుంది. (యాకో. 1:26) దేవుణ్ణి ప్రేమించని కొంతమంది కోపంగా, కఠినంగా, పొగరుగా మాట్లాడతారు. (2 తిమో. 3:1-5) మనం వాళ్లలా ఉండాలని అస్సలు అనుకోం. మన మాటల ద్వారా యెహోవాను సంతోషపెట్టాలని ఎంతో కోరుకుంటాం. అయితే మనం ఒకవైపు మీటింగ్స్‌లో లేదా పరిచర్యలో మర్యాదగా దయగా మాట్లాడుతూ, మరోవైపు ఎవ్వరూ లేనప్పుడు ఇంట్లోవాళ్లతో కఠినంగా, ప్రేమ లేకుండా మాట్లాడితే యెహోవా సంతోషిస్తాడా?—1 పేతు. 3:7.

6. కిం​బర్లీ మాట్లాడే సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించడం వల్ల ఏం జరిగింది?

6 మాట్లాడే సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మనం యెహోవాను ఆరాధిస్తున్నామని ఇతరులకు చూపిస్తాం. ఆ విధంగా “దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తికి, సేవించని వ్యక్తికి మధ్య” తేడాను మన చుట్టూ ఉన్నవాళ్లు స్పష్టంగా చూడగలిగేలా సహాయం చేస్తాం. (మలా. 3:18) టీనేజ్‌లో ఉన్న కిం​బర్లీ అనే సహోదరి విషయంలో ఇదెలా నిజమైందో ఇప్పుడు చూద్దాం. b ఒకసారి స్కూల్లో ఆమె ఇంకో అమ్మాయితో కలిసి ఒక ప్రాజెక్టు చేసింది. అప్పుడు కిం​బర్లీ వేరే క్లాస్‌మేట్స్‌లా లేదని అంటే ఆమె ఇతరుల గురించి చెడుగా మాట్లాడట్లేదని, బూతులు మాట్లాడట్లేదని అలాగే ఎప్పుడూ దయగా ఉంటుందని ఆ అమ్మాయి గమనించింది. కింబర్లీ ప్రవర్తన ఆ అమ్మాయికి బాగా నచ్చి, బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. మనం మాట్లాడే విధానాన్నిబట్టి ప్రజలు సత్యంవైపు ఆకర్షించబడితే యెహోవా ఎంతో సంతోషిస్తాడు.

7. మీరు మాట్లాడే సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించాలని కోరుకుంటారు?

7 మన మాటలవల్ల యెహోవాను ఘనపర్చాలని, మన సహోదర సహోదరీలకు దగ్గరవ్వాలని మనందరం కోరుకుంటాం. కాబట్టి ‘మాట్లాడే విషయంలో ఆదర్శంగా ఉండడానికి’ సహాయపడే కొన్ని మంచి సలహాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

పరిచర్య చేస్తున్నప్పుడు . . .

పరిచర్య చేస్తున్నప్పుడు ఇంటివాళ్లతో దయగా మాట్లాడితే యెహోవా సంతోషిస్తాడు (8-9 పేరాలు చూడండి)

8. పరిచర్య చేస్తున్నప్పుడు మాట్లాడే విషయంలో యేసు మనకెలాంటి ఆదర్శం ఉంచాడు?

8 ఎవరైనా రెచ్చగొడితే దయగా, గౌరవంగా మాట్లాడండి. యేసు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన తాగుబోతని, తిండిబోతని, సాతాను కోసం పని చేసేవాడని, విశ్రాంతి రోజును పాటించనివాడని, చివరికి దేవుణ్ణి దూషించే వాడని కూడా ప్రజలు ఆయన మీద తప్పుగా నిందలు వేశారు. (మత్త. 11:19; 26:65; లూకా 11:15; యోహా. 9:16) అయినా యేసు తిరిగి కోప్పడుతూ మాట్లాడలేదు. మనతో ఎవరైనా దురుసుగా మాట్లాడితే యేసులాగే మనం కూడా ఎప్పుడూ కఠినంగా మాట్లాడకూడదు. (1 పేతు. 2:21-23) కానీ నిజం చెప్పాలంటే, అలా మాట్లాడకుండా ఉండడం అంత తేలికేం కాదు. (యాకో. 3:2) అయితే అలా చేయడానికి మనకేది సహాయం చేస్తుంది?

9. పరిచర్య చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడడానికి మనకేది సహాయం చేస్తుంది?

9 పరిచర్య చేస్తున్నప్పుడు ఇంటివ్యక్తి మనతో దురుసుగా మాట్లాడితే తిరిగి మనం కూడా వాళ్లతో అలాగే మాట్లాడకుండా జాగ్రత్తపడాలి. శామ్‌​ అనే సహోదరుడు ఇలా అంటున్నాడు: “ఇంటివ్యక్తి సత్యం తెలుసుకోవడం ప్రాముఖ్యమని అలాగే తన జీవితంలో మార్పులు చేసుకోగలడని గుర్తుపెట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తాను.” కొన్నిసార్లు ఇంటివ్యక్తికి అనుకూలంగా లేని సమయంలో వాళ్లను కలుస్తాం కాబట్టి వాళ్లు మనతో కోపంగా మాట్లాడవచ్చు. లూసియ అనే సహోదరికి పరిచర్యలో అలాంటివాళ్లు ఎదురైతే, దురుసుగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేయమని, యెహోవాకు చిన్న ప్రార్థన చేస్తుంది. మనకు కూడా అలాంటివాళ్లు ఎదురైతే లూసియ చేసినట్టే చేయొచ్చు.

10. మొదటి తిమోతి 4:13 ప్రకారం, మనం ఏం చేస్తూ ఉండాలి?

10 మరింత నైపుణ్యంగల బోధకులుగా తయారవ్వండి. తిమోతి చాలా నైపుణ్యంగా ప్రకటించాడు. అయినా ఆయన బోధించే సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటూ ఉన్నాడు. (1 తిమోతి 4:13 చదవండి.) పరిచర్యలో మనం కూడా మరింత నైపుణ్యంగల బోధకులుగా ఎలా తయారవ్వొచ్చు? దానికోసం చక్కగా సిద్ధపడాలి. మంచి బోధకులుగా తయారవ్వడానికి సహాయపడే ఎన్నో పనిముట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఉపయోగపడే సమాచారం కోసం చక్కగా చదువుదాం, బోధిద్దాం బ్రోషురును చూడండి. అలాగే మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌​లో “చక్కగా సువార్త ప్రకటిద్దాం” అనే భాగం నుండి కూడా చక్కని శిక్షణ పొందొచ్చు. ఈ ప్రచురణల్ని మీరు పూర్తిగా ఉపయోగిస్తున్నారా? మనం బాగా సిద్ధపడినప్పుడు కంగారుపడకుండా మరింత ధైర్యంగా మాట్లాడగలుగుతాం.

11. కొంతమంది సహోదర సహోదరీలు మంచి బోధకులుగా ఎలా తయారయ్యారు?

11 సంఘంలోని తోటి సహోదరసహోదరీలను చూసి నేర్చుకోవడం ద్వారా కూడా మనం మంచి బోధకులుగా తయారవ్వగలం. పైన ప్రస్తావించిన శామ్‌, తన సంఘంలోని కొంతమంది మంచి బోధకులుగా ఎలా తయారయ్యారని ఆలోచించేవాడు. వాళ్లెలా బోధిస్తున్నారో జాగ్రత్తగా గమనించి ఆ తర్వాత వాళ్లలాగే బోధించడానికి ప్రయత్నించేవాడు. టాలియా అనే సహోదరి, అనుభవం ఉన్న సహోదరులు బహిరంగ ప్రసంగాల్ని ఎలా చేస్తున్నారో జాగ్రత్తగా వినేది. దాంతో ప్రజలు పరిచర్యలో తరచూ అడిగే విషయాల్ని ఎలా వివరించాలో ఆమె నేర్చుకుంది.

మీటింగ్స్‌కి హాజరైనప్పుడు . . .

మీటింగ్స్‌లో మనస్ఫూర్తిగా పాడినప్పుడు యెహోవాను స్తుతిస్తాం (12-13 పేరాలు చూడండి)

12. కొంతమందికి ఏం చేయడం కష్టంగా ఉండొచ్చు?

12 గొంతెత్తి పాటలు పాడడం ద్వారా, బాగా సిద్ధపడి కామెంట్స్‌ చెప్పడం ద్వారా మనందరం సంఘకూటాల్లో పాల్గొంటాం. (కీర్త. 22:22) అయితే కొంతమందికి నలుగురిలో పాటలు పాడడం, కామెంట్స్‌ చెప్పడం కష్టంగా ఉండొచ్చు. మీకూ అలానే అనిపిస్తుందా? అలాగైతే భయపడకుండా పాటలు పాడడానికి, కామెంట్స్‌ చెప్పడానికి కొంతమందికి ఏది సహాయం చేసిందో తెలుసుకోవడం ద్వారా మీరు కూడా ప్రయోజనం పొందొచ్చు.

13. మీటింగ్స్‌లో మనస్ఫూర్తిగా పాడడానికి మీకేది సహాయం చేస్తుంది?

13 మనస్ఫూర్తిగా పాడండి. మీటింగ్స్‌లో పాటలు పాడడానికి అన్నిటికన్నా ముఖ్య కారణం యెహోవాను స్తుతించడం. సారా అనే సహోదరి పాటలు బాగా పాడలేనని అనుకునేది. అయినా పాడడం ద్వారా ఆమె యెహోవాను స్తుతించాలని కోరుకుంది. దానికోసం ఇంటి దగ్గర మీటింగ్‌కు సిద్ధపడుతున్నప్పుడు, ఆమె ఇతర భాగాలకు సిద్ధపడినట్టే పాటల్ని కూడా సిద్ధపడుతుంది. ఆమె పాటల్ని ప్రాక్టీసు చేస్తూ, పాటలోని పదాలకు మీటింగ్‌లో చర్చించే అంశాలకు ఎలాంటి సంబంధం ఉందో ఆలోచిస్తుంది. ఆమె ఇలా చెప్తుంది: “అలా చేయడం ద్వారా నేను బాగా పాడుతున్నానా లేదా అని కంగారుపడకుండా అక్కడున్న పదాల మీద మనసు పెడుతున్నాను.”

14. మీటింగ్‌లో కామెంట్స్‌ చెప్పడానికి భయమేస్తే మీకేది సహాయం చేస్తుంది?

14 ప్రతీ మీటింగ్‌లో కామెంట్స్‌ చెప్పండి. నిజానికి కొంతమందికి ఇది చాలా కష్టంగా ఉండొచ్చు. పైన ప్రస్తావించిన టాలియా ఇలా చెప్తుంది: “నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడాలంటే నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది. నేను కామెంట్స్‌ చెప్తున్నప్పుడు బాగా కంగారుపడతానని ఇతరులు అనుకోరు. కానీ అలా చెప్పడం నిజానికి నాకు చాలా కష్టం.” అయినా టాలియా కామెంట్స్‌ చెప్పడానికి వెనకాడట్లేదు. తను మీటింగ్‌కి సిద్ధపడుతున్నప్పుడు అడిగిన ప్రశ్నకు మొదటి కామెంట్‌​ సూటిగా, క్లుప్తంగా చెప్పాలని గుర్తుపెట్టుకుంటుంది. ఆమె ఇంకా ఇలా అంటుంది: “కేవలం ముఖ్యాంశం గురించి వివరిస్తూ, చిన్న కామెంట్‌​ చెప్పినా ఫర్వాలేదు. ఎందుకంటే మీటింగ్‌లో ఆ భాగం చేసే సహోదరుడు కూడా అలాంటి జవాబు కోసమే ఎదురుచూస్తాడని నేను గుర్తుంచుకుంటాను.”

15. కామెంట్స్‌ చెప్తున్నప్పుడు మనమేం గుర్తుంచుకోవాలి?

15 కొంతమంది క్రైస్తవులు బిడియస్థులు కాకపోయినా కొన్నిసార్లు కామెంట్స్‌ చెప్పడానికి ఎందుకు వెనకాడతారు? జూలియెట్‌ అనే సహోదరి ఇలా చెప్తుంది: “నా కామెంట్‌ చాలా చిన్నగా ఉందని, అంత బాలేదని అనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు నేను కామెంట్‌ చెప్పడానికి వెనకాడతాను.” అయితే, మన సామర్థ్యానికి తగ్గట్టు మంచి కామెంట్స్‌ ఇవ్వాలనే యెహోవా కోరుకుంటాడని గుర్తుంచుకోవాలి. c మనం భయపడినా కామెంట్స్‌ చెప్పడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు.

ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు . . .

16. మనమెలా మాట్లాడకుండా జాగ్రత్తపడాలి?

16 ఇతరులను అవమానించడం, తిట్టడం, బాధపెట్టేలా మాట్లాడడం వంటివి చేయకండి. (ఎఫె. 4:31) ఇంతకుముందు చెప్పినట్లు క్రైస్తవులు బూతులు అస్సలు మాట్లాడకూడదు. అయితే మనం అంతగా పట్టించుకోని ఇంకొన్ని రకాల మాటల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు ఇతర సంస్కృతుల, తెగల లేదా దేశాల ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్లను తక్కువచేసి మాట్లాడకుండా జాగ్రత్తపడాలి. అంతేకాదు, ఇతరులను అవమానించినట్లు మాట్లాడి, వాళ్లను బాధపెట్టకూడదు. ఒక సహోదరుడు ఇలా ఒప్పుకుంటున్నాడు: “కొన్నిసార్లు, సరదాగా నవ్వు తెప్పించాలని నేను మాట్లాడిన కొన్ని మాటలు ఇతరులను ఎంతో బాధపెట్టాయి. ఈ విషయంలో నా భార్య నాకు చాలా సహాయం చేసింది. నేను ఆమెను గానీ ఇతరులను గానీ బాధపెట్టేలా, అమర్యాదగా మాట్లాడిన ప్రతీసారి ఎవరూ లేనప్పుడు దానిగురించి నాకు చెప్తుంది. దానివల్ల గడిచిన సంవత్సరాల్లో నేను మార్పులు చేసుకున్నాను.”

17. ఎఫెసీయులు 4:29 ప్రకారం, ఇతరుల్ని మనమెలా బలపర్చవచ్చు?

17 ఇతరులను బలపర్చేలా మాట్లాడండి. ఎదుటివాళ్లలో తప్పులు వెదుకుతూ, ఫిర్యాదు చేసే బదులు వాళ్లను మెచ్చుకోవడానికి ముందుండండి. (ఎఫెసీయులు 4:29 చదవండి.) ఇశ్రాయేలీయులకు యెహోవా మీద కృతజ్ఞత చూపించడానికి ఎన్నో కారణాలున్నాయి. అయినా వాళ్లెప్పుడూ సణుగుతూ, ఫిర్యాదు చేస్తూ ఉండేవాళ్లు. ఒక సందర్భంలో, పదిమంది వేగులవాళ్లు తెచ్చిన చెడ్డ నివేదికవల్ల ‘ఇశ్రాయేలీయులందరూ మోషే మీద సణిగారు.’ మనం కూడా అదేపనిగా ఫిర్యాదులు చేస్తూ ఉంటే వేరేవాళ్లు దాన్ని చూసి నేర్చుకోవచ్చు. (సంఖ్యా. 13:31–14:4) మరోవైపు, మెచ్చుకోవడం వల్ల మనం ఇతరుల్ని బలపర్చవచ్చు. యెఫ్తా కూతుర్ని మెచ్చుకోవడానికి ఆమె స్నేహితురాళ్లు వెళ్తూ ఉండేవాళ్లు. దానివల్ల తన నియామకంలో కొనసాగడానికి ఆమె ఎంతో ప్రోత్సాహం పొందిందని చెప్పొచ్చు. (న్యాయా. 11:40) ఇంతకుముందు ప్రస్తావించిన సారా ఇలా అంటుంది: “మనం ఇతరులను మెచ్చుకున్నప్పుడు యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడని, ఆయన సంస్థలో వాళ్లకు విలువైన స్థానం ఉందని గుర్తించడానికి సహాయం చేస్తాం.” కాబట్టి ఇతరుల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడానికి అవకాశాల కోసం వెతకండి.

18. కీర్తన 15:1, 2 ప్రకారం, మనం నిజమే ఎందుకు మాట్లాడాలి? దానిలో భాగంగా మనం ఏమేమి కూడా చేయం?

18 నిజమే మాట్లాడండి. మనం అబద్ధాలాడితే యెహోవాను సంతోషపెట్టలేం. ఆయన అన్నిరకాల అబద్ధాల్ని ద్వేషిస్తాడు. (సామె. 6:16, 17) నేడు లోకంలోని ప్రజలకు అబద్ధాలాడడం సర్వసాధారణం అయిపోయింది. కానీ మనం యెహోవాలా ఆలోచిస్తూ అలా చేయకుండా ఉంటాం. (కీర్తన 15:1, 2 చదవండి.) నిజమే మనం పచ్చి అబద్ధాలు చెప్పం. అలాగని వేరేవాళ్లు దేన్నైనా తప్పుగా అర్థంచేసుకునేలా సగం నిజాలు కూడా చెప్పం.

మనం చాడీలు చెప్పే బదులు బలపర్చేలా మాట్లాడితే యెహోవా సంతోషిస్తాడు (19వ పేరా చూడండి)

19. మనం ఇంకా ఏం చేయకుండా జాగ్రత్తపడాలి?

19 ఇతరుల గురించి చాడీలు చెప్పకుండా ఉండండి. (సామె. 25:23; 2 థెస్స. 3:11) అంతకుముందు ప్రస్తావించిన జూలియెట్‌, చాడీలు విన్నప్పుడు తనకు ఎలా అనిపిస్తుందో వివరిస్తూ ఇలా అంటుంది: “ఎవరైనా నాకు చాడీలు చెప్తే నిరుత్సాహంగా అనిపిస్తుంది. అంతేకాదు చెప్తున్న వ్యక్తి మీద నాకు నమ్మకం తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్లు ఈ రోజు వేరేవాళ్ల గురించి నా దగ్గర చెప్తున్నారు. కానీ మళ్లీ వాళ్లే, రేపు నా గురించి వేరేవాళ్ల దగ్గర చెప్పే అవకాశముందని గుర్తుపెట్టుకుంటాను.” మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చాడీలు చెప్తున్నారని అనిపిస్తే, వెంటనే బలపర్చేలా మాట్లాడడానికి మనం ప్రయత్నించాలి.—కొలొ. 4:6.

20. మీరేం చేయాలని నిశ్చయించుకున్నారు?

20 మన చుట్టూ ఉన్న లోకంలో చాలామంది ప్రజలు మాట్లాడే సామర్థ్యాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. అందుకే మన మాటల ద్వారా యెహోవాను సంతోషపెట్టాలంటే మనం కృషిచేస్తూ ఉండాలి. మాట్లాడే సామర్థ్యం యెహోవా ఇచ్చిన బహుమతని, దాన్ని మనమెలా ఉపయోగిస్తున్నామో ఆయన పట్టించుకుంటాడని గుర్తుంచుకోవాలి. మనం పరిచర్య చేస్తున్నప్పుడు, మీటింగ్స్‌కి హాజరైనప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే సామర్థ్యాన్ని యెహోవాకు ఇష్టమైన విధంగా ఉపయోగించాలి. అలా మనం మనస్ఫూర్తిగా ప్రయత్నించినప్పుడు ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. అయితే, దైవభక్తిలేని ప్రజలతో నిండిన ఈ లోకం నాశనమైనప్పుడు మన మాటల ద్వారా యెహోవాను ఘనపర్చడం ఇంకా తేలికౌతుంది. (యూదా 15) అప్పటివరకు యెహోవాను మీ మాటల ద్వారా సంతోషపెట్టాలని నిశ్చయించుకోండి.—కీర్త. 19:14.

పాట 121 మనకు ఆత్మనిగ్రహం అవసరం

a మాట్లాడే సామర్థ్యం యెహోవా మనకిచ్చిన గొప్ప వరం. విచారకరంగా చాలామంది ఈ బహుమతిని యెహోవా కోరుకుంటున్నట్లు ఉపయోగించట్లేదు. అయితే ఈ చెడ్డ లోకంలో మన మాటలు ప్రోత్సాహకరంగా, యెహోవాకు ఇష్టమైనవిగా ఉండాలంటే మనకేది సహాయం చేస్తుంది? పరిచర్య చేస్తున్నప్పుడు, మీటింగ్స్‌కి హాజరైనప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన మాటల ద్వారా యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చు? ఈ ప్రశ్నల గురించి మనం ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

b కొన్ని అసలు పేర్లు కావు.

c కామెంట్స్‌ చెప్పే విషయంలో మరింత సమాచారం కోసం 2019, జనవరి కావలికోటలో ఉన్న “సంఘంలో యెహోవాను స్తుతించండి” అనే ఆర్టికల్‌ చూడండి.

d చిత్రాల వివరణ: ఇంటివ్యక్తి దురుసుగా ప్రవర్తించినందుకు సహోదరుడు కూడా తిరిగి కోపంగా మాట్లాడుతున్నాడు; సంఘంలో ఒక సహోదరుడు మనస్ఫూర్తిగా పాడట్లేదు; అలాగే ఒక సహోదరి చాడీలు చెప్తుంది.