కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 24

యెహోవా అందరికంటే గొప్పగా క్షమిస్తాడు

యెహోవా అందరికంటే గొప్పగా క్షమిస్తాడు

“యెహోవా, నువ్వు మంచివాడివి, క్షమించడానికి సిద్ధంగా ఉంటావు; నీకు మొరపెట్టే వాళ్లందరి మీద అపారమైన విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.”కీర్త. 86:5.

పాట 42 దేవుని సేవకుల ప్రార్థన

ఈ ఆర్టికల్‌లో. . . *

1. ప్రసంగి 7:20 లో ఉన్న రాజైన సొలొమోను మాటల్నిబట్టి మనకేం అర్థమౌతుంది?

 రాజైన సొలొమోను ఇలా రాశాడు: “అస్సలు పాపం చేయకుండా ఎప్పుడూ మంచి చేసే నీతిమంతుడు భూమ్మీద ఒక్కడూ లేడు.” (ప్రసం. 7:20) ఆ మాటలెంత నిజమో కదా! ఎందుకంటే మనందరం పాపులమే. (1 యోహా. 1:8) కాబట్టి, దేవుడు అలాగే తోటి మనుషులు మనల్ని క్షమించాలని కోరుకుంటాం.

2. మీ దగ్గరి స్నేహితుడ్ని మీరు బాధపెట్టినప్పుడు, అతను మిమ్మల్ని క్షమిస్తే మీకెలా అనిపిస్తుంది?

2 మీరు ఏదోక సమయంలో మీ దగ్గరి స్నేహితుల్ని నొప్పించి ఉంటారు. అలాంటప్పుడు జరిగిన తప్పును సరిచేసుకొని, వాళ్లకు మళ్లీ దగ్గరవ్వడానికి క్షమించమని మనస్ఫూర్తిగా అడిగి ఉంటారు. ఆ తర్వాత మీ స్నేహితుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు మీకెలా అనిపించింది? ఖచ్చితంగా మీకు ప్రశాంతంగా, సంతోషంగా అనిపించి ఉంటుంది.

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 యెహోవా మనకు అందరికంటే దగ్గరి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు మన మాటల ద్వారా, పనుల ద్వారా ఆయన్ని బాధపెడతాం. అయినాసరే, యెహోవా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని ఎందుకు నమ్మొచ్చు? యెహోవా క్షమించడానికీ మనం క్షమించడానికీ తేడా ఏంటి? అంతేకాదు, ఆయన ఎవర్ని క్షమిస్తాడు? ఈ ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.

యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు

4. యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని మనమెందుకు నమ్మకంతో ఉండొచ్చు?

4 యెహోవా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని బైబిలు మాటిస్తోంది. సీనాయి పర్వతం దగ్గర ఒక దూత ద్వారా యెహోవా మోషేకు తన గురించి చెప్తున్నప్పుడు ఇలా అన్నాడు: “యెహోవా, యెహోవా, ఆయన కరుణ, కనికరం గల దేవుడు; ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు; ఆయన వేలమంది పట్ల విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు; తప్పుల్ని, అపరాధాల్ని, పాపాల్ని మన్నిస్తాడు.” (నిర్గ. 34:6, 7) యెహోవా నిజంగా ఒక దయగల, కరుణగల దేవుడు. ఆయన పశ్చాత్తాపపడే పాపుల్ని అన్ని సమయాల్లో క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు.—నెహె. 9:17; కీర్త. 86:15.

మన జీవితంలో జరిగిన వాటన్నిటి గురించి అలాగే వాటివల్ల ఎలాంటి వ్యక్తులుగా తయారయ్యామనే దానిగురించి యెహోవాకు పూర్తిగా తెలుసు (5వ పేరా చూడండి)

5. కీర్తన 103:13, 14 ప్రకారం, మనుషుల గురించిన వివరాలన్నీ తెలిసి ఉండడంవల్ల యెహోవా ఏం చేయడానికి కదిలించబడతాడు?

5 యెహోవా మన సృష్టికర్త కాబట్టి ఆయనకు మన గురించి పూర్తిగా తెలుసు. మన గురించే కాదు భూమ్మీదున్న ప్రతీవ్యక్తి గురించి ఆయనకు అన్ని వివరాలు తెలుసు. (కీర్త. 139:15-17) దానివల్ల మన తల్లిదండ్రుల నుండి వచ్చిన అపరిపూర్ణతల గురించి, మన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల ఎలాంటి వ్యక్తులుగా అయ్యామనే దానిగురించి ఆయనకు తెలుసు. మన గురించి ఈ వివరాలన్నీ తెలిసి ఉండడంవల్ల, యెహోవా మనమీద కరుణ చూపించడానికి కదిలించబడతాడు.—కీర్త. 78:39; కీర్తన 103:13, 14 చదవండి.

6. మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని యెహోవా ఎలా చూపించాడు?

6 మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని యెహోవా చూపించాడు. ఆదాము చేసిన పనులవల్లే మనందరం పాపులం అయ్యి, చివరికి చనిపోతున్నామని ఆయనకు తెలుసు. (రోమా. 5:12) వాటి నుండి మనంగానీ, ఇతరులుగానీ తప్పించుకోవడానికి ఏ దారిలేదు. (కీర్త. 49:7-9) అయితే మన ప్రేమగల దేవుడు మనల్ని విడిపించడానికి కరుణతో ఒక ఏర్పాటు చేశాడు. యోహాను 3:16 ప్రకారం, యెహోవా తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మనందరి కోసం చనిపోవడానికి భూమ్మీదికి పంపించాడు. (మత్త. 20:28; రోమా. 5:19) అలా యేసు మనల్ని పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి చనిపోయాడు. కాబట్టి మనం ఆయనమీద విశ్వాసం ఉంచాలి. (హెబ్రీ. 2:9) తనకెంతో ఇష్టమైన కుమారుడు వేదనపడుతూ, అవమానకరంగా చనిపోవడాన్ని యెహోవా చూసినప్పుడు ఎంతో బాధపడి ఉంటాడు. ఒకవేళ మనల్ని క్షమించాలనే కోరిక యెహోవాకు లేకపోయుంటే, ఆయన తన కుమారుణ్ణి అలా చనిపోనిచ్చేవాడు కాదు.

7. యెహోవా మనస్ఫూర్తిగా క్షమించిన కొంతమంది గురించి చెప్పండి.

7 యెహోవా మనస్ఫూర్తిగా క్షమించిన ఎంతోమంది గురించి బైబిల్లో ఉంది. (ఎఫె. 4:32) వాళ్లలో మీకెవరు గుర్తొస్తారు? బహుశా మీకు రాజైన మనష్షే గుర్తురావొచ్చు. అతను యెహోవాకు ఇష్టంలేని ఎన్నో చెడ్డపనులు చేశాడు. అతను అబద్ధ దేవుళ్లను ఆరాధించడమే కాదు, ఇతరుల్ని కూడా అలా చేయమని ప్రోత్సహించాడు. అలాగే తన సొంత పిల్లల్ని అబద్ధ దేవుళ్లకు బలులుగా అర్పించాడు. చివరికి, ఒక అబద్ధ దేవుడి విగ్రహాన్ని యెహోవా పవిత్ర మందిరంలో పెట్టించాడు. మనష్షే గురించి బైబిలు ఇలా చెప్తుంది: “అతను యెహోవా దృష్టిలో విపరీతంగా చెడ్డపనులు చేసి ఆయనకు కోపం తెప్పించాడు.” (2 దిన. 33:2-7) అయినా మనష్షే నిజంగా పశ్చాత్తాపం చూపించినప్పుడు, యెహోవా అతన్ని మనస్ఫూర్తిగా క్షమించడంతో పాటు తిరిగి రాజుగా చేశాడు. (2 దిన. 33:12, 13) బహుశా మీకు రాజైన దావీదు కూడా గుర్తురావొచ్చు. అతను వ్యభిచారం, హత్య లాంటి ఘోరమైన తప్పులు చేసి యెహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అయినా తన తప్పును ఒప్పుకొని నిజంగా పశ్చాత్తాపం చూపించినప్పుడు యెహోవా అతన్ని కూడా క్షమించాడు. (2 సమూ. 12:9, 10, 13, 14) ఈ ఉదాహరణల్ని బట్టి, యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని అర్థంచేసుకోవచ్చు. అయితే యెహోవా క్షమించడానికీ మనం క్షమించడానికీ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్షమించే విషయంలో యెహోవాకు ఎవ్వరూ సాటిరారు

8. ఒక న్యాయమూర్తిగా యెహోవాకున్న ప్రత్యేకమైన స్థానాన్ని బట్టి ఆయనెలా క్షమిస్తాడు?

8 యెహోవా ఈ ‘భూమంతటికీ న్యాయం తీరుస్తాడు.’ (ఆది. 18:25) సాధారణంగా ఒక మంచి న్యాయమూర్తికి చట్టం గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. ఈ మాటలు యెహోవాకు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే ఆయనకు చట్టం గురించి పూర్తిగా తెలియడమే కాదు, వాటిని ఆయనే మనకిచ్చాడు. (యెష. 33:22) యెహోవాకన్నా మంచేదో చెడేదో ఇంకెవ్వరికీ ఎక్కువ తెలీదు. ఒక మంచి న్యాయమూర్తికి ఇంకా ఏ విషయాలు తెలిసుండాలి? అతను ఒక నిర్ణయం తీసుకునే ముందు, దానికి సంబంధించిన వాస్తవాలన్నిటినీ తెలుసుకోవాలి. ఈ కారణాన్నిబట్టి యెహోవా అందరికన్నా గొప్ప న్యాయమూర్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ఎప్పుడూ అన్ని వాస్తవాలూ తెలుసు.

9. ఒక వ్యక్తిని క్షమించాలా వద్దా అని నిర్ణయిస్తున్నప్పుడు యెహోవా ఏ విషయాల్ని చూస్తాడు?

9 ఏదైనా ఒక విషయంలో న్యాయం తీరుస్తున్నప్పుడు మనుషుల్లా కాకుండా యెహోవాకు వాస్తవాలన్నీ తెలుసు. (ఆది. 18:20, 21; కీర్త. 90:8) ఆయన మనుషుల్లా చూసినదాన్నిబట్టి, విన్నదాన్నిబట్టి ఒక ముగింపుకి రాడు. ఒకవ్యక్తి ఏదైనా పనిచేస్తే అతను ఎందుకలా చేశాడో అర్థంచేసుకోవడానికి యెహోవా ఆ వ్యక్తికి తన అమ్మానాన్నల నుండి వచ్చిన లక్షణాల్ని, అలవాట్లని, పుట్టి పెరిగిన పరిస్థితుల్ని, వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని చూస్తాడు. అంతేకాదు, యెహోవా హృదయాల్ని కూడా చదవగలడు. దానర్థం ప్రతీ వ్యక్తి ఉద్దేశాలు, ఆలోచనలు, కోరికలు ఏంటో ఆయనకు పూర్తిగా తెలుసు. అసలు ఆయనకు కనిపించందంటూ ఏదీలేదు. (హెబ్రీ. 4:13) ఒక వ్యక్తికి సంబంధించిన వాస్తవాలన్నీ యెహోవాకు పూర్తిగా తెలుసు కాబట్టే ఆయన క్షమిస్తాడని మనకు అర్థమౌతుంది.

యెహోవా న్యాయంగా ఉంటాడు. ఆయనకు పక్షపాతం లేదు అలాగే ఆయనకు ఎవ్వరూ లంచం ఇవ్వలేరు (10వ పేరా చూడండి)

10. యెహోవా అన్ని సమయాల్లో న్యాయంగా తీర్పుతీరుస్తాడని మనమెలా చెప్పవచ్చు? (ద్వితీయోపదేశకాండం 32:4)

10 యెహోవా ఎప్పుడూ పక్షపాతం చూపించడు కాబట్టి ఆయన అన్ని సమయాల్లో న్యాయంగా తీర్పుతీరుస్తాడు. ఒకవ్యక్తి చూడడానికి అందంగా ఉన్నాడనో, డబ్బు-పలుకుబడి ఉన్నాయనో లేదా చాలా నైపుణ్యాలు ఉన్నాయనో యెహోవా అతన్ని క్షమించడు. (1 సమూ. 16:7; యాకో. 2:1-4) యెహోవాని ఏదైనా ఒక పని చేయమని ఎవ్వరూ బలవంతం చేయలేరు లేదా ఆయనకు లంచం ఇవ్వలేరు. (2 దిన. 19:7) ఆయన చిరాకుతోనో, భావోద్వేగంతోనో నిర్ణయాలు తీసుకోడు. (నిర్గ. 34:7) దీన్నంతటిని బట్టి యెహోవాకు మన గురించి, మన పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసని అర్థమౌతుంది. అందుకే ఆయన సాటిలేని గొప్ప న్యాయమూర్తి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.—ద్వితీయోపదేశకాండం 32:4 చదవండి.

11. యెహోవా క్షమించే విధానం, మనుషులు క్షమించే విధానానికి ఎలా వేరుగా ఉంటుంది?

11 యెహోవా క్షమించే విధానం చాలా ప్రత్యేకమైనదని హీబ్రూ లేఖనాలు రాసిన రచయితలు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఉపయోగించిన ఓ హీబ్రూ పదం గురించి ఒక రెఫరెన్సు ఇలా చెప్తుంది: “యెహోవా పాపుల్ని క్షమించడం గురించి వివరించడానికి మాత్రమే ఆ పదం ఉపయోగించబడింది. అంతేగానీ ఒక మనిషి ఇంకో మనిషిని క్షమించడం గురించి చెప్పడానికి దానిని ఎప్పుడూ ఉపయోగించలేదు.” కాబట్టి ఒక పాపి నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే అతన్ని పూర్తిగా క్షమించే శక్తి కేవలం యెహోవాకు మాత్రమే ఉంది. మరైతే యెహోవా ఒకవ్యక్తిని క్షమించినప్పుడు అతనికెలా అనిపిస్తుంది?

12-13. (ఎ) యెహోవా ఒకవ్యక్తిని క్షమించినప్పుడు ఆ వ్యక్తికి ఎలా అనిపిస్తుంది? (బి) యెహోవా మనల్ని ఎంతలా క్షమిస్తాడు?

12 యెహోవా మనల్ని క్షమించాడని అర్థంచేసుకున్నప్పుడు “సేదదీర్పును” పొందుతాం. అలాగే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది, స్వచ్ఛమైన మనస్సాక్షి ఉంటుంది. యెహోవా క్షమించినప్పుడు మాత్రమే మనకు అలా అనిపిస్తుంది. (అపొ. 3:19) యెహోవా మనల్ని క్షమించినప్పుడు ఆయనతో మన సంబంధం తప్పు చేయకముందు ఉన్నట్టుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే, మనం అసలు ఆ పాపమే చేయలేదు అన్నట్లు ఆయన చూస్తాడు.

13 యెహోవా ఒక్కసారి క్షమించాడంటే మళ్లీ ఆ తప్పు గురించి మనల్ని ఎప్పుడూ నిందించడు లేదా శిక్షించడు. (యెష. 43:25; యిర్మీ. 31:34) ‘సూర్యాస్తమయానికి సూర్యోదయానికి’ ఎంత దూరం ఉంటుందో ఆయన మన తప్పుల్ని కూడా అంతే దూరంలో ఉంచుతాడు. * (కీర్త. 103:12, అధస్సూచి) యెహోవా ఎంత గొప్పగా క్షమిస్తాడో ఆలోచించినప్పుడు మనం ఆశ్చర్యపోతాం అలాగే మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోతాయి. (కీర్త. 130:4) అయితే యెహోవా ఎవర్ని క్షమిస్తాడు?

యెహోవా ఎవర్ని క్షమిస్తాడు?

14. మనం ఇప్పటివరకు ఏయే విషయాల గురించి నేర్చుకున్నాం?

14 మనం ఇప్పటివరకు ఏం చూశాం? చేసిన తప్పు చిన్నదా పెద్దదా అనే దాన్నిబట్టి యెహోవా క్షమించడని చూశాం. అంతేకాదు క్షమించాలా వద్దా అని నిర్ణయిస్తున్నప్పుడు సృష్టికర్తగా, శాసనకర్తగా, న్యాయమూర్తిగా యెహోవా తనకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తాడని నేర్చుకున్నాం. అయితే క్షమిస్తున్నప్పుడు యెహోవా ఇంకా ఏ విషయాల గురించి ఆలోచిస్తాడు?

15. లూకా 12:47, 48 ప్రకారం, యెహోవా ఒకవ్యక్తిని క్షమించాలా వద్దా అని నిర్ణయించే ముందు ఏ విషయం గురించి ఆలోచిస్తాడు?

15 ఒక విషయం ఏంటంటే, తప్పు చేసిన వ్యక్తి అది తప్పని తెలిసే చేశాడా లేదా తెలియక చేశాడా అని యెహోవా ఆలోచిస్తాడు. ఈ విషయం గురించి యేసు లూకా 12:47, 48 లో స్పష్టంగా చెప్పాడు. (చదవండి.) ఒకవ్యక్తి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది దేవునికి అస్సలు ఇష్టంలేని చెడ్డ పనని తెలిసినా చేస్తే, అతను గంభీరమైన తప్పు చేసినట్టే. అలాంటి వ్యక్తిని క్షమించకూడదని యెహోవా నిర్ణయించవచ్చు. (మార్కు 3:29; యోహా. 9:41) కానీ కొన్నిసార్లు మనం చేస్తున్న పని తప్పని తెలిసినా చేస్తాం. మరి అలాంటప్పుడు యెహోవా మనల్ని క్షమిస్తాడా? అవును క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన నిర్ణయించేటప్పుడు ఇంకో విషయం గురించి కూడా ఆలోచిస్తాడు.

మనం నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే, యెహోవా మనల్ని క్షమిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు (16-17 పేరాలు చూడండి)

16. పశ్చాత్తాపపడడం అంటే ఏంటి? యెహోవా మనల్ని క్షమించాలంటే మనమెందుకు పశ్చాత్తాపపడాలి?

16 రెండో విషయం ఏంటంటే, ఒకవ్యక్తి నిజంగా పశ్చాత్తాపం చూపిస్తున్నాడా లేదా అని యెహోవా గమనిస్తాడు. పశ్చాత్తాపపడడం అంటే “ఒకవ్యక్తి తన మనసుని, ఆలోచనల్ని, ప్రవర్తనని మార్చుకోవడం” అని అర్థం. పశ్చాత్తాపపడే వ్యక్తి తప్పెందుకు చేశానా అని లేదా సరైనదని ఎందుకు చేయలేకపోయానా అని చాలా బాధపడతాడు. అంతేకాదు యెహోవాతో తన సంబంధం బలహీనమైపోవడం వల్లే తప్పు జరిగిందని గుర్తించి బాధపడతాడు. ఒకసారి మనష్షేను, దావీదును మళ్లీ గుర్తుచేసుకోండి. వాళ్లిద్దరూ గంభీరమైన తప్పులు చేసినా, నిజమైన పశ్చాత్తాపం చూపించారు కాబట్టి యెహోవా వాళ్లను క్షమించాడు. (1 రాజు. 14:8) అదేవిధంగా, మనం కూడా నిజమైన పశ్చాత్తాపం చూపిస్తున్నామని యెహోవా గమనిస్తేనే మనల్ని క్షమిస్తాడు. అయితే మనం చేసిన తప్పుల గురించి బాధపడితే సరిపోదు. మన ప్రవర్తనను మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. * అందుకే క్షమించే ముందు యెహోవా ఆలోచించే మరో విషయం గురించి ఇప్పుడు చూద్దాం.

17. ఒకవ్యక్తి తనను తాను మార్చుకోవడం అంటే ఏంటి? గతంలో చేసిన తప్పుల్ని మళ్లీ చేయకుండా ఉండాలంటే అలా మార్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (యెషయా 55:7)

17 ఒకవ్యక్తిలో నిజంగా మార్పు వచ్చిందా లేదా అని కూడా యెహోవా చూస్తాడు. ఇంకోమాటలో చెప్పాలంటే, ఆ వ్యక్తి చెడ్డపనులు చేయడం మానేసి తనకు ఇష్టమైన విధంగా జీవిస్తున్నాడా లేదా అని యెహోవా గమనిస్తాడు. (యెషయా 55:7 చదవండి.) ఆ వ్యక్తి తన ఆలోచనా విధానాన్ని మార్చుకుని యెహోవాలా ఆలోచించాలి. (రోమా. 12:2; ఎఫె. 4:23) గతంలో తనకున్న చెడు ఆలోచనల్ని, చేసిన పనుల్ని మానుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. (కొలొ. 3:7-10) నిజానికి క్రీస్తు బలిమీద మనకు విశ్వాసం ఉంటేనే యెహోవా మన పాపాల్ని క్షమించి, మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి, మనం నిజంగా మారడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన గమనించినప్పుడు మాత్రమే ఆ బలి ఆధారంగా క్షమాపణ పొందుతాం.—1 యోహా. 1:7.

యెహోవా క్షమిస్తాడని నమ్మండి

18. యెహోవా అందరికన్నా గొప్పగా క్షమిస్తాడని ఏ కారణాల్నిబట్టి చెప్పొచ్చు?

18 మనం ఇప్పటివరకు చూసిన ప్రాముఖ్యమైన విషయాల్ని ఇంకోసారి గుర్తుచేసుకుందాం. యెహోవా విశ్వంలోనే అందరికన్నా గొప్పగా క్షమిస్తాడని నేర్చుకున్నాం. అలా చెప్పడానికి మూడు కారణాలున్నాయి. మొదటిగా, ఆయన మనల్ని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. రెండోదిగా, ఆయనకు మన గురించి పూర్తిగా తెలుసు. మనం నిజంగా పశ్చాత్తాపం చూపిస్తున్నామా లేదా అని ఆయనే నిర్ణయించగలడు. మూడోదిగా, ఆయన మనల్ని ఒకసారి క్షమించాడంటే అసలు మనం పాపం చేయనట్టే చూస్తాడు. దానివల్ల మనకు మంచి మనస్సాక్షి ఉంటుంది అలాగే ఆయన ఆమోదాన్ని పొందుతాం.

19. అపరిపూర్ణతవల్ల తప్పులు చేస్తూనే ఉన్నా మనమెందుకు సంతోషంగా ఉండవచ్చు?

19 మనం అపరిపూర్ణులుగా ఉన్నంతవరకు పాపం చేస్తూనే ఉంటాం. అయితే లేఖనాలపై అంతర్దృష్టి పుస్తకం (ఇంగ్లీష్‌) 2వ సంపుటిలోని 771వ పేజీలోవున్న ఈ మాటల నుండి మనం ఓదార్పును పొందవచ్చు: “యెహోవా కరుణగల దేవుడు అలాగే తన సేవకులకు బలహీనతలు ఉన్నాయని ఆయనకు తెలుసు. కాబట్టి అపరిపూర్ణతవల్ల తప్పులు చేస్తామని అదేపనిగా బాధపడుతూ ఉండాల్సిన పనిలేదు. (కీర్త. 103:8-14; 130:3) బదులుగా దేవుడు కోరినట్టు జీవించడానికి వాళ్లు శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటే సంతోషంగా ఉండవచ్చు. (ఫిలి. 4:4-6; 1 యోహా. 3:19-22).” ఆ మాటలెంత ప్రోత్సాహకరంగా ఉన్నాయో కదా!

20. తర్వాతి ఆర్టికల్‌లో మనమేం చర్చిస్తాం?

20 పాపం చేసినందుకు నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే, యెహోవా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని తెలుసుకోవడం ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. అయితే మనం కూడా ఇతరుల్ని యెహోవాలా ఎలా క్షమించవచ్చు? యెహోవా క్షమించడానికీ మనం క్షమించడానికీ ఉన్న పోలికలు, తేడాలు ఏంటి? ఈ విషయాన్ని అర్థంచేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? ఈ ప్రశ్నలకు తర్వాతి ఆర్టికల్‌లో జవాబులు చూస్తాం.

పాట 45 నా హృదయ ధ్యానం

^ పశ్చాత్తాపపడే పాపుల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటానని యెహోవా బైబిల్లో మాటిచ్చాడు. అయినా కొన్నిసార్లు తన క్షమాపణ పొందడానికి మనకు అర్హతలేదని అనిపించవచ్చు. మన పాపాలకు నిజంగా పశ్చాత్తాపపడితే, దేవుడు ఎప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

^ యెహోవాకు సన్నిహితమవండి అనే పుస్తకంలో 26వ అధ్యాయం, 9వ పేరా చూడండి.

^ పదాల వివరణ: “పశ్చాత్తాపపడడం” అంటే మనసు మార్చుకోవడం. అంతేకాదు ఇంతకుముందు జీవించిన విధానాన్ని బట్టి, చేసిన తప్పుల్ని బట్టి లేదా సరైనది చేయలేకపోవడాన్ని బట్టి మనస్ఫూర్తిగా బాధపడడం అని కూడా అర్థం. నిజమైన పశ్చాత్తాపం ఒకవ్యక్తి పనుల్లో కనిపిస్తుంది అలాగే తన ప్రవర్తనని మార్చుకునేలా చేస్తుంది.