కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 25

క్షమించేవాళ్లను యెహోవా దీవిస్తాడు

క్షమించేవాళ్లను యెహోవా దీవిస్తాడు

“యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.”కొలొ. 3:13.

పాట 130 క్షమిస్తూ ఉండండి

ఈ ఆర్టికల్‌లో. . . *

1. పశ్చాత్తాపం చూపించే పాపులకు యెహోవా ఏమని మాటిస్తున్నాడు?

 యెహోవా మన సృష్టికర్త, శాసనకర్త, న్యాయమూర్తే కాదు ఆయన మన ప్రియమైన పరలోక తండ్రి కూడా. (కీర్త. 100:3; యెష. 33:22) మనలో ఎవరమైనా ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసి, నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే మనల్ని క్షమించే అధికారం, కోరిక రెండూ ఆయనకు ఉన్నాయి. (కీర్త. 86:5) అందుకే ప్రవక్తయిన యెషయా ద్వారా యెహోవా ప్రేమపూర్వకంగా ఇలా మాటిచ్చాడు: “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, మంచు అంత తెల్లగా అవుతాయి.”—యెష. 1:18.

2. ఇతరులతో మంచి సంబంధాన్ని కలిగివుండాలంటే మనమేం చేయాలి?

2 మనం అపరిపూర్ణులం కాబట్టి మన మాటల ద్వారా, పనుల ద్వారా ఇతరుల్ని బాధపెడతాం. (యాకో. 3:2) దానర్థం మనం ఒకరితో ఒకరం మంచి స్నేహితులుగా ఉండలేమని కాదు. బదులుగా మనం క్షమించడం నేర్చుకుంటే అలా ఉండగలం. (సామె. 17:9; 19:11; మత్త. 18:21, 22) మనం చిన్నచిన్న విషయాల్లో ఒకరినొకరం బాధ పెట్టుకుంటే, క్షమించుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కొలొ. 3:13) ఎంతైనా యెహోవాయే మనల్ని ‘అధికంగా క్షమిస్తున్నాడు’ కాబట్టి మనం కూడా అలానే చేయాలి.—యెష. 55:7.

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?

3 అపరిపూర్ణులమైన మనం యెహోవాను అనుకరిస్తూ ఇతరుల్ని ఎలా క్షమించవచ్చు? మనం ఏ పాపాల గురించి పెద్దలకు చెప్పాలి? మనం ఇతరుల్ని క్షమించాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు? ఎదుటివాళ్ల పాపాలవల్ల తీవ్రమైన వేదనను అనుభవించిన కొంతమంది సహోదర సహోదరీల నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.

ఒక క్రైస్తవుడు గంభీరమైన పాపం చేస్తే . . .

4. (ఎ) ఒక క్రైస్తవుడు గంభీరమైన పాపం చేస్తే అతనేం చేయాలి? (బి) తప్పుచేసిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు పెద్దలు ఏం చేయాలి?

4 సంఘంలో ఎవరైనా గంభీరమైన పాపం చేశారని మనకు తెలిస్తే ఆ విషయాన్ని పెద్దలకు చెప్పాలి. ఎందుకంటే గంభీరమైన పాపాలు దేవుని ఆజ్ఞలకు పూర్తి విరుద్ధమైనవి. అలాంటి కొన్ని పాపాల గురించి 1 కొరింథీయులు 6:9, 10 లో చూస్తాం. సంఘంలో ఎవరైనా అలాంటి పాపం చేస్తే, వాళ్లు క్షమాపణ కోసం యెహోవాకు ప్రార్థించాలి అలాగే పెద్దలతో ఖచ్చితంగా మాట్లాడాలి. (కీర్త. 32:5; యాకో. 5:14) మరైతే పెద్దలు అలాంటి వ్యక్తిని క్షమించగలరా? ఒక వ్యక్తిని పూర్తిగా క్షమించాలా లేదా అన్నది కేవలం యెహోవా చేతుల్లోనే ఉంది. ఆయన దానిని విమోచన క్రయధనం ఆధారంగా చేస్తాడు. * అయితే పాపం చేసిన వ్యక్తి సంఘంలో ఉండాలా లేదా అని నిర్ణయించే బాధ్యత యెహోవా పెద్దలకు ఇచ్చాడు. వాళ్లు దాన్ని లేఖనాల ఆధారంగా నిర్ణయిస్తారు. (1 కొరిం. 5:12) పెద్దలు ఆ నిర్ణయానికి వచ్చేముందు, ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తారు: ఆ వ్యక్తి కావాలనే ఆ పాపాన్ని చేశాడా? ఆ వ్యక్తి ప్లాన్‌ చేసి తప్పు చేశాడా? ఆ తప్పుని చాలాకాలంగా చేస్తున్నాడా? అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అతను నిజంగా పశ్చాత్తాపం చూపిస్తున్నాడని చెప్పడానికి ఏదైనా ఆధారం ఉందా? యెహోవా అతన్ని క్షమించాడు అనడానికి స్పష్టమైన రుజువులు ఏమైనా ఉన్నాయా?—అపొ. 3:19.

5. తప్పుచేసిన వ్యక్తికి పెద్దలు సహాయం చేసినప్పుడు సంఘమంతా ఎలా ప్రయోజనం పొందుతుంది?

5 సంఘపెద్దలు తప్పుచేసిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అప్పటికే యెహోవా పరలోకంలో ఆ వ్యక్తి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వాళ్లూ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. (మత్త. 18:18) సంఘపెద్దలు తీసుకున్న నిర్ణయంవల్ల సంఘానికి ఏం ప్రయోజనం ఉంటుంది? పశ్చాత్తాపపడని వ్యక్తుల్ని బహిష్కరించినప్పుడు యెహోవా అమూల్యమైన గొర్రెలకు హాని జరగకుండా ఉంటుంది. (1 కొరిం. 5:6, 7, 11-13; తీతు 3:10, 11) తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాపపడడానికి, యెహోవా క్షమాగుణం నుండి ప్రయోజనం పొందడానికి కూడా సహాయపడుతుంది. (లూకా 5:32) అంతేకాదు, పశ్చాత్తాపం చూపించిన వ్యక్తి తరఫున సంఘపెద్దలు ప్రార్థించి, అతను ఆధ్యాత్మికంగా కోలుకోవడానికి సహాయం చేయమని యెహోవాను వేడుకుంటారు.—యాకో. 5:15.

6. ఒక వ్యక్తి సంఘం నుండి బహిష్కరించబడిన తర్వాత కూడా యెహోవా అతన్ని క్షమిస్తాడా? వివరించండి.

6 తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాపం చూపించట్లేదని సంఘపెద్దలు గమనిస్తే అతన్ని సంఘం నుండి బహిష్కరిస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి దేశచట్టాన్ని కూడా మీరితే సంఘపెద్దలు అతన్ని కాపాడడానికి ప్రయత్నించరు. ఎవరైనాసరే చట్టాన్ని మీరితే, పశ్చాత్తాపం చూపించినా చూపించకపోయినా ప్రభుత్వ అధికారులు అతనికి తీర్పుతీర్చి, శిక్షించేలా యెహోవా అనుమతిస్తాడు. (రోమా. 13:4) తర్వాత, ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని తన ఆలోచనల్ని, పనుల్ని మార్చుకుంటే యెహోవా అతన్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. (లూకా 15:17-24) చివరికి అతని తప్పులు ఎంత గంభీరమైనవైనా యెహోవా అతన్ని క్షమిస్తాడు.—2 దిన. 33:9, 12, 13; 1 తిమో. 1:15.

7. మనకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే మనమేం చేయవచ్చు?

7 తప్పుచేసిన వ్యక్తిని యెహోవా క్షమిస్తాడా లేదా అని మనం నిర్ణయించాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం మనకెంతో ఊరటనిస్తుంది. అయినా మనం నిర్ణయించాల్సిన మరో విషయం ఉంది. అదేంటంటే కొన్నిసార్లు ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా గంభీరమైన పాపం చేసి, క్షమించమని మనల్ని అడిగి ఉండవచ్చు. ఇంకొన్నిసార్లు అలా అడగకపోవచ్చు. ఏదేమైనా ఆ వ్యక్తిని క్షమించి మనసులో కోపం పెట్టుకోవద్దని మనం అనుకోవచ్చు. కానీ ఆ సమయంలో మనమెంతో బాధపడుతూ ఉంటాం కాబట్టి అలా చేయడానికి సమయం, కృషి అవసరం. ఈ విషయం గురించి 1994 సెప్టెంబరు 15, కావలికోట ఇలా చెప్తుంది: “మీరు పాపంచేసిన వ్యక్తిని క్షమిస్తున్నారంటే ఆ పాపాన్ని సమర్థిస్తున్నారని కాదు. క్షమించడం అంటే విషయాన్ని మన చేతుల్లోకి తీసుకోకుండా యెహోవా చూసుకుంటాడనే నమ్మకంతో ఆయనకు వదిలేయడమని అర్థం. ఆయన విశ్వమంతటికీ న్యాయమూర్తి కాబట్టి సరైన సమయంలో నీతిగా న్యాయం తీరుస్తాడు.” అయితే మనమలా క్షమించాక, న్యాయం తీర్చడాన్ని తనకు విడిచిపెట్టమని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు?

మనం ఇతరుల్ని క్షమించాలని యెహోవా ఎందుకు కోరుతున్నాడు?

8. మనం ఇతరుల్ని క్షమిస్తే యెహోవా చూపించిన కరుణపట్ల కృతజ్ఞత ఉందని ఎలా చూపిస్తాం?

8 మనం ఇతరుల్ని క్షమిస్తే యెహోవా చూపించిన కరుణపట్ల కృతజ్ఞత ఉందని చూపిస్తాం. దీన్ని అర్థంచేసుకోవడానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణలో ఒక దాసుడు తన యజమాని దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని దాన్ని తీర్చలేకపోయాడు. అయినా ఆ యజమాని దాన్ని రద్దు చేశాడు. అయితే అదే దాసుడి దగ్గర మరో దాసుడు తక్కువ మొత్తంలో అప్పు తీసుకుని తీర్చలేకపోయినప్పుడు మాత్రం అతను అస్సలు కరుణ చూపించలేదు. (మత్త. 18:23-35) ఈ ఉదాహరణ నుండి యేసు ఏం చెప్పాలనుకుంటున్నాడు? యెహోవా కూడా పెద్ద మొత్తంలో అప్పును రద్దు చేసిన ఆ యజమాని లాంటివాడు. యెహోవా మనమీద చూపించిన గొప్ప కరుణపట్ల కృతజ్ఞత ఉంటే, మనం కూడా ఇతరుల్ని క్షమించడానికి కదిలించబడతాం. (కీర్త. 103:9) ఈ విషయం గురించి చాలా సంవత్సరాల క్రితం వచ్చిన కావలికోట ఇలా చెప్పింది: “మనం తోటివాళ్లను ఎన్నిసార్లు క్షమించినా సరే, అది క్రీస్తు ద్వారా యెహోవా చూపించిన క్షమాగుణానికి, కరుణకి ఎప్పటికీ సమానం అవ్వదు.”

9. యెహోవా ఎవరిపట్ల కరుణ చూపిస్తాడు? (మత్తయి 6:14, 15)

9 మనం ఇతరుల్ని క్షమిస్తే యెహోవా మనల్ని క్షమిస్తాడు. కరుణ చూపించేవాళ్ల మీద యెహోవా కరుణ చూపిస్తాడు. (మత్త. 5:7; యాకో. 2:13) ఈ విషయం గురించి యేసు, ఎలా ప్రార్థించాలో తన శిష్యులకు నేర్పిస్తున్నప్పుడు స్పష్టంగా చెప్పాడు. (మత్తయి 6:14, 15 చదవండి.) అంతకుముందు కాలంలో యెహోవా తన సేవకుడైన యోబుకు చెప్పిన మాటల్నిబట్టి కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. యోబు ముగ్గురు స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరు కఠినంగా మాట్లాడుతూ అతన్ని బాధపెట్టారు. ఆ తర్వాత వాళ్ల తరఫున ప్రార్థించమని యెహోవా అతనికి చెప్పాడు. యోబు అలా ప్రార్థించినప్పుడు యెహోవా అతన్ని దీవించాడు.—యోబు 42:8-10.

10. ఎదుటివాళ్ల మీద కోపాన్ని పెట్టుకుంటే మనమెలా నష్టపోతాం? (ఎఫెసీయులు 4:31, 32)

10 ఇతరులమీద కోపాన్ని పెంచుకుంటే మనమే నష్టపోతాం. కోపం ఒక బరువులాంటిది. మనం దాన్ని దింపేసుకుని ప్రశాంతంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (ఎఫెసీయులు 4:31, 32 చదవండి.) అందుకే ‘కోపం మానుకోమని, ఆగ్రహం విడిచిపెట్టమని’ ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (కీర్త. 37:8) ఈ తెలివైన సలహాను పాటిస్తే మనమే ప్రయోజనం పొందుతాం. ఎందుకంటే మనం ఇతరులమీద కోపాన్ని పెంచుకుంటే విషం తాగినట్టే. (సామె. 14:30) దానివల్ల ఇతరులకు నష్టం జరగదు గానీ మనకే నష్టం జరుగుతుంది. అంటే శారీరకంగా, మానసికంగా మన ఆరోగ్యమే పాడౌతుంది. అలా కాకుండా, మనం ఇతరుల్ని క్షమిస్తే మనకే మంచి జరుగుతుంది. (సామె. 11:17) దానివల్ల మనం ప్రశాంతంగా ఉంటాం, సంతోషంగా యెహోవా సేవలో ముందుకు కొనసాగుతాం.

11. పగతీర్చుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది? (రోమీయులు 12:19-21)

11 పగతీర్చుకోవడం యెహోవా పని. ఎవరైనా మనకు వ్యతిరేకంగా పాపం చేస్తే వాళ్లమీద పగతీర్చుకునే అధికారం యెహోవా మనకు ఇవ్వలేదు. (రోమీయులు 12:19-21 చదవండి.) మనం అపరిపూర్ణులం కాబట్టి అన్ని విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారం మన దగ్గర ఉండదు. అందుకే మనం దేవునిలా న్యాయం తీర్చలేం. (హెబ్రీ. 4:13) అలాగే కొన్ని సందర్భాల్లో మనం కోపంలో, బాధలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. ఈ కారణాన్నిబట్టి యెహోవా యాకోబుతో ఇలా రాయించాడు: “కోపంగా ఉన్న వ్యక్తి దేవుని దృష్టిలో సరైనది చేయడు.” (యాకో. 1:20) కాబట్టి యెహోవా సరైనది చేస్తాడని, పరిపూర్ణంగా న్యాయం తీరుస్తాడని మనం ఎప్పుడూ నమ్మకంతో ఉండవచ్చు.

కోపాన్ని మనసులో నుండి తీసేసుకోండి. యెహోవానే న్యాయం తీర్చనివ్వండి. ఆయనే పాపంవల్ల కలిగిన నష్టాన్ని సరిచేస్తాడు (12వ పేరా చూడండి)

12. యెహోవా తీర్చే న్యాయం మీద నమ్మకముందని మనమెలా చూపించవచ్చు?

12 మనం ఇతరుల్ని క్షమిస్తే యెహోవా తీర్చే న్యాయం మీద నమ్మకముందని చూపిస్తాం. మనం విషయాల్ని యెహోవాకు వదిలేస్తే, పాపంవల్ల వచ్చిన నష్టాన్ని ఆయన సరిచేస్తాడనే నమ్మకం చూపించినట్లు అవుతుంది. ఆయన తీసుకొచ్చే కొత్తలోకంలో చేదు జ్ఞాపకాలేవీ “గుర్తుకురావు, అవి హృదయంలో కూడా ఉండవు.” (యెష. 65:17) అయితే మనల్ని ఎవరైనా బాగా బాధపెడితే వాళ్లమీద మన మనసులో కోపం పెంచుకోకుండా ఉండడం సాధ్యమేనా? అలా చేసిన కొంతమంది గురించి ఇప్పుడు చూద్దాం.

ఇతరుల్ని క్షమిస్తే మనం దీవెనల్ని పొందుతాం

13-14. క్షమించడం గురించి టోని నుండి మీరేం నేర్చుకున్నారు?

13 మన సహోదర సహోదరీల్లో చాలామంది ఇతరులు చేసిన పనులవల్ల ఎంతో బాధని, వేదనని అనుభవించారు. అయినాసరే క్షమించాలనే నిర్ణయించుకున్నారు. అలా క్షమించడంవల్ల వాళ్లు ఎలాంటి దీవెనలు పొందారు?

14 ఫిలిప్పీన్స్‌లో ఉంటున్న టోని గురించి చూద్దాం. * అతను సత్యం తెలుసుకోవడానికి చాలా సంవత్సరాల ముందు తన అన్నని హోషే అనే ఒక వ్యక్తి చంపాడు. ఆ సమయంలో కోపిష్ఠిగా ఉన్న టోని పగతీర్చుకోవాలని అనుకున్నాడు. అయితే ఈలోపు, చేసిన నేరానికి హోషేను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కొంతకాలం తర్వాత హోషే జైలు నుండి విడుదలైనప్పుడు, అతన్ని ఎలాగైనా వెతికి చంపాలని టోని అనుకున్నాడు. దానికోసం అతను ఒక గన్‌​ కూడా కొన్నాడు. ఈలోపు టోని యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. అతనిలా అంటున్నాడు: “నేను నా వ్యక్తిత్వాన్ని, పనుల్ని మార్చుకోవాలని బైబిలు స్టడీ ద్వారా నేర్చుకున్నాను. అంటే కోపాన్ని తీసేసుకోవాలని అర్థంచేసుకున్నాను.” స్టడీ పూర్తయ్యాక టోని బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి సంఘపెద్ద అయ్యాడు. అయితే హోషే కూడా బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాడని తెలుసుకున్నప్పుడు టోని ఆశ్చర్యపోయాడు. వాళ్లిద్దరు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అలాగే తనను క్షమించానని హోషేకు టోని చెప్పాడు. హోషేని క్షమించడంవల్ల మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని పొందానని టోని చెప్తున్నాడు. అలా క్షమించినందుకు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు.

మనసులో నుండి కోపాన్ని తీసేసుకోవచ్చని పీటర్‌, సూ అనుభవం నుండి మనం నేర్చుకోవచ్చు (15-16 పేరాలు చూడండి)

15-16. క్షమించడం గురించి పీటర్‌, సూ నుండి మీరేం నేర్చుకున్నారు?

15 పీటర్‌,​ సూ గురించి ఒకసారి ఆలోచించండి. 1985 లో వాళ్లు మీటింగ్‌కు వెళ్లినప్పుడు రాజ్యమందిరంలో ఒక బాంబు పేలుడు జరిగింది. ఆ బాంబుని యెహోవాసాక్షికాని ఒక వ్యక్తి అక్కడ పెట్టాడు. ఆ పేలుడు వల్ల సహోదరి సూకి తీవ్రగాయాలై చూపును, వినే సామర్థ్యాన్ని అలాగే వాసన చూసే శక్తిని కోల్పోయింది. * ‘ఇంత దారుణమైన పనిని ఆ వ్యక్తి ఎలా చేసుంటాడు?’ అని పీటర్‌, సూ ఆలోచించేవాళ్లు. ఆ సంఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత బాంబు పెట్టిన వ్యక్తిని అరెస్టుచేసి జీవిత ఖైదు వేశారు. ఆ వ్యక్తిని క్షమించారా అని పీటర్‌, సూలను అడిగినప్పుడు వాళ్లిలా అన్నారు: “మన మనసులో అలానే కోపాన్ని పెట్టుకుంటే ఆందోళనగా ఉంటుందని, సంతోషాన్ని కోల్పోతామని, ఆరోగ్యం పాడౌతుందని యెహోవా చెప్తున్నాడు. కాబట్టి ఆ సంఘటన జరిగిన వెంటనే కోపాన్ని పెంచుకోకుండా జీవితంలో ముందుకెళ్లడానికి సహాయం చేయమని యెహోవాను అడిగాం.”

16 ఆ బాంబు పెట్టిన వ్యక్తిని క్షమించడం వాళ్లకు తేలికైందా? అన్నిసార్లు కాలేదు. వాళ్లింకా ఇలా అంటున్నారు: “కొన్ని సందర్భాల్లో గాయాలవల్ల సూ బాధపడుతున్నప్పుడు మాకు కోపమొస్తూ ఉండేది. కానీ ఆ విషయం గురించి మేం అదే పనిగా ఆలోచించేవాళ్లం కాదు. కాబట్టి మా కోపం వెంటనే తగ్గిపోయేది. ఒకవేళ ఆ బాంబు పెట్టిన వ్యక్తి భవిష్యత్తులో మన సహోదరుడైతే, అతన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామని మేము నిజాయితీగా చెప్పగలం. బైబిలు సూత్రాల్ని పాటించడంవల్ల గతంలో జరిగిన చేదు సంఘటనల్ని మర్చిపోయి, సంతోషంగా ఉండగలమని ఈ అనుభవం నుండి నేర్చుకున్నాం. అలాగే జరిగిన నష్టాన్నంతటినీ యెహోవా సరిచేస్తాడని గుర్తుచేసుకోవడం మాకెంతో ఓదార్పునిస్తుంది.”

17. క్షమించడం గురించి మైరా నుండి మీరేం నేర్చుకున్నారు?

17 మైరా అనే సహోదరి గురించి ఇప్పుడు చూద్దాం. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు సత్యం నేర్చుకుంది. కానీ ఆమె భర్త సత్యం నేర్చుకోలేదు. కొంత సమయం తర్వాత అతను వ్యభిచారం చేసి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దానిగురించి మైరా ఇలా అంటుంది: “అతను నన్ను, నా పిల్లల్ని వదిలేసి వెళ్లినప్పుడు నేను షాక్‌​కు గురయ్యాను. నాకు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. కొన్నిసార్లు నాకు చాలా కోపం వచ్చేది. అలాగే నన్ను నేను నిందించుకునేదాన్ని. నేనెంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను.” ఆ బంధం ముగిసిపోయినా ఆమె మాత్రం చాలా బాధపడింది. మైరా ఇంకా ఇలా అంటుంది: “కొన్ని నెలల వరకు నాకది గుర్తొచ్చి కోపం వచ్చేది. దానివల్ల యెహోవాతో అలాగే ఇతరులతో నా సంబంధం పాడైపోతుందని నాకనిపించింది.” ఇప్పుడు తన మాజీ భర్త మీద కోపం లేదని, అతనికి ఏ చెడు జరగాలని కోరుకోవట్లేదని మైరా చెప్తుంది. అలాగే ఏదోక రోజు అతను యెహోవా సేవకుడు అవ్వాలని ఆమె కోరుకుంటుంది. మైరా జరిగిందంతా పక్కనపెట్టి భవిష్యత్తు మీద దృష్టిపెట్టింది. ఆమె ఒంటరిగానే తన ఇద్దరి పిల్లల్ని పెంచి యెహోవాను సేవించేలా వాళ్లకు సహాయం చేసింది. ఇప్పుడు తన పిల్లలు, వాళ్ల కుటుంబాలతో కలిసి మైరా యెహోవాను సంతోషంగా సేవిస్తుంది.

యెహోవా పరిపూర్ణుడైన న్యాయమూర్తి

18. విశ్వంలోనే గొప్ప న్యాయమూర్తిగా యెహోవా ఏం చేస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు?

18 ఇతరులకు ఎలా న్యాయం తీర్చాలో నిర్ణయించే బాధ్యత మనకు లేదని తెలుసుకోవడం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈ విశ్వంలోనే అందరికన్నా గొప్ప న్యాయమూర్తి యెహోవాయే కాబట్టి తీర్పు తీర్చే ప్రాముఖ్యమైన పనిని ఆయనే చేస్తాడు. (రోమా. 14:10-12) మంచిచెడ్డల విషయంలో తనకున్న పరిపూర్ణ ప్రమాణాల ప్రకారమే ఆయన తీర్పుతీరుస్తాడని పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. (ఆది. 18:25; 1 రాజు. 8:32) అలాగే ఆయన అస్సలు అన్యాయం చేయడనే నమ్మకంతో కూడా మనం ఉండవచ్చు.

19. యెహోవా తన పరిపూర్ణ న్యాయంతో ఏం చేస్తాడు?

19 పాపంవల్ల, అపరిపూర్ణతవల్ల వచ్చిన చెడు అంతటినీ యెహోవా పూర్తిగా తీసేసే రోజు కోసం మనమెంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. ఆ సమయం వచ్చినప్పుడు మన శరీరానికి మనసుకు తగిలిన గాయాలు పూర్తిగా నయమౌతాయి. (కీర్త. 72:12-14; ప్రక. 21:3, 4) అవి ఇంకెప్పటికీ మనకు గుర్తురావు. ఆ అద్భుతమైన సమయం వచ్చేలోపు యెహోవాలాగే ఇతరుల్ని క్షమించే అవకాశం మనకు దొరికినందుకు కృతజ్ఞతతో ఉందాం.

పాట 18 విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత

^ పశ్చాత్తాపం చూపించే పాపుల్ని క్షమించాలని యెహోవా ఎంతో కోరుకుంటున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఆయన్ను అనుకరిస్తూ మనల్ని ఎవరైనా బాధపెడితే వాళ్లను క్షమించాలి. కొన్నిసార్లు ఇతరులు చేసిన పాపాల్ని మనమే క్షమించవచ్చు. ఇంకొన్నిసార్లు మనం పెద్దలకు చెప్పాల్సి రావచ్చు. ఈ విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అలాగే మనం ఒకరినొకరం క్షమించుకోవాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడో, అలా క్షమిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో కూడా చర్చిస్తాం.

^ 1996 ఏప్రిల్‌ 15, కావలికోటలోని “పాఠకుల నుండి ప్రశ్నలు” చూడండి.

^ కొన్ని అసలు పేర్లు కావు.

^ 1992 జనవరి 8, తేజరిల్లు!లో (ఇంగ్లీష్‌) 9-13 పేజీలు చూడండి. అలాగే JW బ్రాడ్‌కాస్టింగ్‌లో పీటర్‌, సూ షూల్జ్‌: ఎంతో తీవ్రమైన వేదన నుండి బయటపడ్డాం (ఇంగ్లీష్‌) అనే వీడియోను చూడండి.