కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 27

“యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి”

“యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి”

“యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి; ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి.”కీర్త. 27:14.

పాట 128 అంతం వరకు సహిద్దాం

ఈ ఆర్టికల్‌లో. . . *

1. (ఎ) తనను ప్రేమించే వాళ్లందరికీ యెహోవా ఏ నిరీక్షణ ఇచ్చాడు? (బి) “యెహోవా కోసం కనిపెట్టుకొని” ఉండడం అంటే ఏంటి? (“పదాల వివరణ” చూడండి.)

 తనను ప్రేమించే వాళ్లందరికీ యెహోవా గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆయన త్వరలోనే అనారోగ్యాన్ని, బాధల్ని, మరణాన్ని తీసేస్తాడు. (ప్రక. 21:3, 4) ఈ భూమిని పరదైసుగా మార్చడానికి, తన కోసం కనిపెట్టుకుని ఉన్న ‘సాత్వికులకు’ ఆయన సహాయం చేస్తాడు. (కీర్త. 37:9-11) అలాగే ఇప్పుడు తనతో ఉన్న దగ్గరి స్నేహం కన్నా, ఇంకా బలమైన స్నేహాన్ని కలిగి ఉండేలా మనలో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తాడు. అదెంత గొప్ప నిరీక్షణో కదా! అయితే యెహోవా చేసిన వాగ్దానాలన్నీ నిజమౌతాయని మనమెలా నమ్మవచ్చు? ఆయన ఏదైనా మాటిస్తే అస్సలు తప్పడు, దాన్ని ఖచ్చితంగా చేసి తీరతాడు. ఈ కారణం బట్టి మనం “యెహోవా కోసం కనిపెట్టుకొని” ఉండవచ్చు. * (కీర్త. 27:14) యెహోవా తన వాగ్దానాల్ని నెరవేర్చే వరకు మనం ఓపిక చూపిస్తూ సంతోషంగా ఉండడం ద్వారా అలా చేయవచ్చు.—యెష. 55:10, 11.

2. యెహోవా తానిచ్చిన మాటను ఇప్పటికే నిలబెట్టుకుంటున్నాడని ఎలా చూపించాడు?

2 యెహోవా తానిచ్చిన మాటను నిలబెట్టుకుంటాడని ఇప్పటికే చూపించాడు. అలాంటి ఒక చక్కటి ఉదాహరణని మనం ప్రకటన పుస్తకంలో చూస్తాం. ప్రతీ దేశం, జాతి, భాష నుండి ప్రజల్ని సమకూరుస్తానని, వాళ్లు తనను ఐక్యంగా ఆరాధిస్తారని యెహోవా అక్కడ మాట ఇచ్చాడు. ఆ ప్రత్యేకమైన గుంపునే ఇప్పుడు “గొప్పసమూహం” అని పిలుస్తున్నాం. (ప్రక. 7:9, 10) అందులో వేర్వేరు జాతుల, భాషల, నేపథ్యాల నుండి వచ్చిన పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉన్నా వాళ్లందరూ శాంతిగా, ఒకే కుటుంబంగా ఉన్నారు. (కీర్త. 133:1; యోహా. 10:16) ఈ గొప్ప సమూహంలోని వాళ్లు మంచివార్తను కూడా ఉత్సాహంగా ప్రకటిస్తారు. కొత్తలోకం గురించి తెలుసుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో, వాళ్లకు తమ నిరీక్షణ గురించి చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. (మత్త. 28:19, 20; ప్రక. 14:6, 7; 22:17) మీరు కూడా గొప్ప సమూహంలో ఒకరైతే, బాధలు-కష్టాలు పోయి మంచి పరిస్థితులు వస్తాయనే నిరీక్షణ నిజంగా మీకెంతో విలువైనది.

3. మనమేం చేయాలని సాతాను కోరుకుంటున్నాడు?

3 మనకున్న నిరీక్షణను పాడు చేయాలన్నదే సాతాను కోరిక. యెహోవా మనల్ని పట్టించుకోడని, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోడని మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అతను విజయం సాధిస్తే, మనం అధైర్యపడి చివరికి యెహోవా సేవను ఆపేసే ప్రమాదముంది. యోబు విషయంలో అలాగే చేయడానికి సాతాను ప్రయత్నించాడు.

4. ఈ ఆర్టికల్‌లో మనమేం చూస్తాం? (యోబు 1:9-12)

4 యోబు యెహోవాకు నమ్మకంగా ఉండకుండా చేయడానికి సాతాను ఏయే విధాలుగా ప్రయత్నించాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. (యోబు 1:9-12 చదవండి.) మనం యోబు జీవితం నుండి ఏం నేర్చుకోవచ్చో, అలాగే యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన చేసిన వాగ్దానాల్ని నెరవేరుస్తాడని మనమెందుకు గుర్తుపెట్టుకోవాలో కూడా చూస్తాం.

యోబు తన నిరీక్షణను వదిలేసేలా సాతాను ప్రయత్నించాడు

5-6. యోబు జీవితంలో ఒక్కసారిగా ఏం జరిగింది?

5 యోబు జీవితం చాలా ప్రశాంతంగా ఉండేది. అతనికి యెహోవాతో దగ్గరి స్నేహం ఉండేది. అతను తన పెద్ద కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు. అలాగే అతను చాలా ధనవంతుడు. (యోబు 1:1-5) కానీ ఒక్క రోజులోనే యోబు జీవితం తల్లకిందులైంది. అతను తన దగ్గరున్న వాటన్నిటినీ కోల్పోయాడు. ముందు, తన జంతువులన్నిటినీ శత్రువులు పట్టుకుపోయారు. (యోబు 1:13-17) ఆ తర్వాత తానెంతో ప్రేమించిన పిల్లలందరూ ఒకేసారి చనిపోయారు. సాధారణంగా తల్లిదండ్రులు, తమ పిల్లల్లో ఒక్కరు చనిపోతేనే బాధలో మునిగిపోతారు. అలాంటిది పదిమంది పిల్లలు ఒకేరోజు చనిపోయినప్పుడు, యోబు అతని భార్య ఎంత గుండెకోత అనుభవించి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఆ వార్త విని యోబు బాధలో బట్టలు చింపుకుని నేలమీద కుప్పకూలాడు.—యోబు 1:18-20.

6 సాతాను ఆ తర్వాత యోబుకు చాలా నొప్పి, బాధ, అవమానం కలిగే జబ్బు వచ్చేలా చేశాడు. (యోబు 2:6-8; 7:5) అప్పటివరకు యోబును ఎంతో గౌరవించి, అతని దగ్గర సలహాలు తీసుకున్న ప్రజలు గౌరవించడం మానేశారు. (యోబు 29:7, 8, 21) అలాగే అతని సహోదరులు, దగ్గరి స్నేహితులు, తన ఇంట్లో పనిచేసే సేవకులు అతన్ని దూరం పెట్టారు.—యోబు 19:13, 14, 16.

తీవ్రమైన కష్టాలు ఎదురైనప్పుడు యోబుకు ఎలా అనిపించి ఉంటుందో, నేడున్న చాలామంది సహోదర సహోదరీలు అర్థం చేసుకోగలరు (7వ పేరా చూడండి) *

7. (ఎ) యోబు తన బాధలన్నిటికీ కారణం ఎవరని అనుకున్నాడు? అయినా అతను ఏం చేయలేదు? (బి) 7వ పేరాకు సంబంధించిన చిత్రాన్నిబట్టి నేడున్న క్రైస్తవులకు ఎలాంటి కష్టాలు ఎదురవ్వొచ్చు?

7 యెహోవా తనమీద కోపంగా ఉన్నాడు కాబట్టి తనకు ఇన్ని కష్టాలు వచ్చాయని యోబును నమ్మించడానికి సాతాను ప్రయత్నించాడు. ఉదాహరణకు, పరలోకం నుండి వచ్చిన అగ్ని వల్ల యోబు జంతువులు, వాటిని కాస్తున్న సేవకులు నాశనమయ్యేలా సాతాను చేశాడు. (యోబు 1:16) అలాగే తన పదిమంది పిల్లలు భోంచేస్తూ సంతోషంగా సమయం గడుపుతున్నప్పుడు, ఒక పెద్ద సుడిగాలి వల్ల వాళ్లున్న ఇళ్లు కూలిపోయేలా అతను చేశాడు. (యోబు 1:18, 19) ఆ అగ్ని, గాలి ఆకాశం నుండి వచ్చాయి కాబట్టి యెహోవాయే వాటిని రప్పించాడని యోబు అనుకున్నాడు. దాంతో తాను చేసిన పనులవల్ల యెహోవా కోపంగా ఉన్నాడని యోబుకు అనిపించింది. అయినా అతను తన పరలోక తండ్రిని తప్పుగా ఒక్కమాట కూడా అనలేదు. ఎన్నో సంవత్సరాలుగా యెహోవా తనకు మంచి చేశాడని యోబు ఒప్పుకున్నాడు. అందుకే యెహోవా చేసిన మేలుని తీసుకుంటే, ఆయన నుండి వచ్చే కీడును కూడా తీసుకోవాలని చెప్పాడు. కాబట్టి అతను ఇలా అన్నాడు: “యెహోవా పేరు స్తుతించబడుతూ ఉండాలి.” (యోబు 1:20, 21; 2:10) యోబు తన ఆస్తిని, పిల్లల్ని, ఆరోగ్యాన్ని కోల్పోయినా యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. కానీ సాతాను అంతటితో అతన్ని విడిచిపెట్టలేదు.

8. సాతాను యోబు విషయంలో ఇంకా ఏం చేశాడు?

8 ఆ తర్వాత, యోబు తాను ఎందుకూ పనికిరానివాణ్ణని అనుకునేలా చేయాలని సాతాను ప్రయత్నించాడు. దానికోసం యోబు స్నేహితులని చెప్పుకున్న ముగ్గుర్ని అతను ఉపయోగించాడు. యోబు ఎన్నో తప్పుడు పనులు చేశాడు కాబట్టే ఇలాంటి పరిస్థితి వచ్చిందని వాళ్లన్నారు. (యోబు 22:5-9) అలాగే, అతను ఎన్ని మంచి పనులు చేసినా వాటిని దేవుడు అస్సలు పట్టించుకోడని యోబు అనుకునేలా చేయడానికి వాళ్లు ప్రయత్నించారు. (యోబు 4:18; 22:2, 3; 25:4) అంటే దేవుడు అతన్ని ప్రేమించట్లేదని, అతని గురించి అసలు ఆలోచించట్లేదని, ఆయన్ని ఎంత ఆరాధించినా ఎలాంటి ఉపయోగం ఉండదని యోబు సందేహపడేలా చేయాలనుకున్నారు. వాళ్ల ముగ్గురి మాటలు, ఇక తన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని యోబు అనుకునేలా చేసుంటాయి.

9. తన స్నేహితులతో ధైర్యంగా మాట్లాడడానికి యోబుకి ఏది సహాయం చేసింది?

9 యోబు బూడిదలో కూర్చొని చాలా నొప్పితో బాధపడుతున్నాడు. (యోబు 2:8) అతనికి వచ్చిన కష్టాలు బరువైన రాళ్లలా అతన్ని కృంగదీశాయి. అలాగే పిల్లలు చనిపోవడంవల్ల అతనికి గుండె పిండేసినట్టుగా అనిపించింది. అంతేకాదు అతని ముగ్గురు స్నేహితులు యోబు మంచి వ్యక్తికాడని, దేవునికి నచ్చిన పనులు చేయలేదని పదేపదే అంటూ అతని మంచిపేరును పాడు చేయాలనుకున్నారు. వాళ్లు మాట్లాడిన మాటలకు మొదట్లో యోబు ఏమీ అనలేదు. (యోబు 2:13–3:1) అది చూసి యోబు యెహోవాను విడిచిపెట్టేస్తాడని వాళ్లనుకొని ఉంటే అది పొరపాటే. ఎందుకంటే యోబు ఆ తర్వాత తన తల పైకెత్తి వాళ్ల వైపు చూస్తూ, “చనిపోయేంతవరకు నా యథార్థతను విడిచిపెట్టను!” అని అన్నాడు. (యోబు 27:5) యోబు అంత బాధలో ఉన్నా ధైర్యంగా మాట్లాడడానికి ఏది సహాయం చేసింది? తీవ్రమైన నిరుత్సాహంలో ఉన్నా, తన ప్రేమగల తండ్రి ఖచ్చితంగా ఊరటనిస్తాడనే ఆశను అతను వదులుకోలేదు. అలాగే ఒకవేళ తాను చనిపోయినా యెహోవా తనని తిరిగి బ్రతికిస్తాడని నమ్మాడు.—యోబు 14:13-15.

యోబు నుండి మనమేం నేర్చుకోవచ్చు?

10. యోబు జీవితం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

10 మనం యెహోవాను విడిచిపెట్టేలా సాతాను బలవంతం చేయలేడని, మన జీవితంలో జరిగే ప్రతీదాని గురించి యెహోవాకు తెలుసని యోబు ఉదాహరణలో చూశాం. మనం యెహోవాకు నమ్మకంగా ఉండకుండా చేయడానికి సాతాను ఎలాంటి పన్నాగాల్ని ఉపయోగిస్తాడో కూడా యోబు జీవితం నుండి నేర్చుకోవచ్చు. దాని గురించి ఇప్పుడు చూద్దాం.

11. మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే ఏ ధైర్యంతో ఉండవచ్చు? (యాకోబు 4:7)

11 మనం యెహోవా మీద నమ్మకం ఉంచితే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకుని, సాతాన్ని విజయవంతంగా ఎదిరించవచ్చని యోబు నిరూపించాడు. అలా చేసినప్పుడు సాతాను మన నుండి పారిపోతాడనే ధైర్యంతో ఉండవచ్చు.—యాకోబు 4:7 చదవండి.

12. పునరుత్థాన నిరీక్షణ మీదున్న నమ్మకం యోబుకు ఎలా సహాయం చేసింది?

12 ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు, చనిపోతామనే భయాన్ని ఉపయోగించి మనం యెహోవా సేవను ఆపేసేలా చేయడానికి సాతాను ప్రయత్నిస్తాడు. అందుకే పునరుత్థాన నిరీక్షణ మీద మనకు బలమైన విశ్వాసం ఉండాలి. యోబు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాడని, చివరికి యెహోవాను సేవించడం కూడా ఆపేస్తాడని సాతాను అన్నాడు. కానీ అతను అనుకున్నట్లు జరగలేదు. యోబు ఎంతో నిరాశా నిస్పృహలో ఉండి, చివరికి చనిపోయే పరిస్థితి వచ్చినా యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. యెహోవా మంచితనం అలాగే పరిస్థితుల్ని ఆయన సరిచేస్తాడనే బలమైన నమ్మకం వాటిని తట్టుకోవడానికి అతనికి సహాయం చేశాయి. ఒకవేళ తాను బతికున్నప్పుడు యెహోవా సహాయం చేయకపోయినా, భవిష్యత్తులో తనని పునరుత్థానం చేస్తాడని యోబు నమ్మాడు. దీన్నిబట్టి, యోబు పునరుత్థాన నిరీక్షణను బలంగా నమ్మాడని అర్థమౌతుంది. కాబట్టి మనం కూడా పునరుత్థాన నిరీక్షణను బలంగా నమ్మితే, చనిపోతామనే భయం ఉన్నా యెహోవాకు నమ్మకంగా ఉంటాం.

13. సాతాను యోబు మీద ఉపయోగించిన పన్నాగాల విషయంలో మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి?

13 సాతాను యోబు మీద ఎలాంటి పన్నాగాల్ని ఉపయోగించాడో, వాటినే మన మీద కూడా ఉపయోగిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అతను ఈ మాటల్ని అంటూ మనుషులందర్నీ నిందించాడు: “తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకున్నవన్నీ [యోబు ఒక్కడే కాదు] మనిషి ఇచ్చేస్తాడు.” (యోబు 2:4, 5) అలా చెప్పడం ద్వారా మనం యెహోవాను నిజంగా ప్రేమించట్లేదని, మన ప్రాణాల మీదికి వస్తే ఆయన్ని విడిచిపెట్టేస్తామని సాతాను అంటున్నాడు. అంతేకాదు దేవుడు మనల్ని ప్రేమించట్లేదని, ఆయన్ని సంతోషపెట్టడానికి మనం చేసే పనుల్ని అస్సలు పట్టించుకోడని సాతాను అంటున్నాడు. అతను ఏం చేయాలి అనుకుంటున్నాడో మనకు ముందే తెలుసు. అందుకే అతను చెప్పే అబద్ధాల వల్ల మోసపోం.

14. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనకే విషయాలు తెలుస్తాయి? ఉదాహరణతో చెప్పండి.

14 మనకు కష్టాలు ఎదురైతే, వాటిని మన గురించి మనం తెలుసుకునే అవకాశాలుగా చూడాలి. యోబు తనకెదురైన కష్టాలవల్ల, తన లోపాలేంటో తెలుసుకొని వాటిని సరిచేసుకోగలిగాడు. ఉదాహరణకు, ఇంకా ఎక్కువ వినయాన్ని పెంచుకోవాలని అతను అర్థంచేసుకున్నాడు. (యోబు 42:3) ఒకసారి నీకోలై అనే సహోదరుడి గురించి ఆలోచించండి. * అతనికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా జైలు జీవితాన్ని గడిపాడు. అతనిలా అంటున్నాడు: “జైలు జీవితం ఒక ఎక్సరే లాంటిది. అక్కడ ఉండడం వల్ల ఒక క్రైస్తవుడిగా మనం ఎలాంటి లక్షణాల్ని పెంచుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది.” కాబట్టి మనకు పరీక్షలు ఎదురైనప్పుడు మన గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం. అప్పుడు మన లోపాలేంటో గుర్తించి, వాటిని సరిచేసుకోవడానికి కృషి చేయాలి.

15. మనం ఎవరి మాట వినాలి? ఎందుకు వినాలి?

15 మనం శత్రువుల మాటల్ని వినకూడదు బదులుగా యెహోవా మాటల్ని వినాలి. యెహోవా మాట్లాడుతున్నప్పుడు యోబు శ్రద్ధగా విన్నాడు. యెహోవా యోబుని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా, అతనిమీద తనకెంత పట్టింపు ఉందో చూపించాడు. మరోమాటలో యెహోవా యోబును ఇలా అడిగాడు: ‘నేను ఏమేం తయారు చేశానో నువ్వు చూస్తున్నావా? నీ జీవితంలో జరుగుతున్న ప్రతీదీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను నీ మీద శ్రద్ధ చూపిస్తూ నిన్ను పట్టించుకోను అనుకున్నావా?’ ఆ మాటలు విన్న తర్వాత, యోబు హృదయం యెహోవా మంచితనం గురించి కృతజ్ఞతతో నిండిపోయింది. దాంతో అతను వినయంగా ఇలా అన్నాడు: “నా చెవులు నీ గురించి విన్నాయి, అయితే ఇప్పుడు నేను నిన్ను కళ్లారా చూస్తున్నాను.” (యోబు 42:5) ఆ మాటలు అనే సమయానికి యోబు పరిస్థితి ఏం మారలేదు. అతనింకా ఒంటినిండా పుండ్లతో, బూడిదలో కూర్చుని ఉన్నాడు. తన పిల్లలు చనిపోయారనే బాధలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా తనను ప్రేమిస్తున్నానని, తనను చూసి సంతోషిస్తున్నానని యోబు అర్థం చేసుకునేలా యెహోవా సహాయం చేశాడు.—యోబు 42:7, 8.

16. యెషయా 49:15,16 ప్రకారం, మనం ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి?

16 ఈ రోజుల్లో కూడా ప్రజలు మనల్ని ఎగతాళి చేస్తూ, మనం దేనికీ పనికిరాని వాళ్లమన్నట్టు చిన్నచూపు చూస్తుండవచ్చు. మన పేరును, సంస్థ పేరును పాడు చేయడానికి ప్రయత్నిస్తూ వాళ్లు “అబద్ధంగా అన్నిరకాల చెడ్డమాటలు” మాట్లాడవచ్చు. (మత్త. 5:11) మరి యోబు జీవితం నుండి మనమేం నేర్చుకుంటాం? మనకెన్ని కష్టాలు వచ్చినా ఆయన్ని అంటిపెట్టుకొని ఉంటామని యెహోవా నమ్ముతున్నాడు. అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, తన కోసం కనిపెట్టుకొని ఉన్నవాళ్లను ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. (యెషయా 49:15, 16 చదవండి.) కాబట్టి దేవుని శత్రువులు మన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు వాటిని అస్సలు పట్టించుకోకండి. టర్కీలో ఉంటున్న జేమ్స్‌ అనే సహోదరుడి గురించి ఆలోచించండి. అతను తన కుటుంబంతోపాటు తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొన్నాడు. అతను ఇలా చెప్తున్నాడు: “దేవుని ప్రజల గురించి చెప్పే అబద్ధాలను వింటే నిరాశే మిగులుతుందని మాకర్థమైంది. అందుకే దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తూ యెహోవా సేవలో బిజీగా ఉన్నాం. దానివల్ల మా సంతోషాన్ని కాపాడుకున్నాం.” యోబులాగే మనం కూడా శత్రువులు చెప్పే అబద్ధాలను వినకుండా, యెహోవా చెప్పే మాటల్ని వింటే మన నిరీక్షణను కాపాడుకుంటాం.

మీ నిరీక్షణ వల్ల కష్టాల్ని సహించగలరు

యోబు నమ్మకంగా ఉన్నందుకు యెహోవా అతన్ని దీవించాడు. ఆ తర్వాత యోబు, అతని భార్య చాలాకాలం సంతోషంగా జీవించారు (17వ పేరా చూడండి) *

17. హెబ్రీయులు 11వ అధ్యాయంలో చెప్పబడిన నమ్మకమైన స్త్రీ, పురుషుల ఆదర్శం నుండి మీరేం నేర్చుకోవచ్చు?

17 తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొని, ధైర్యంగా ఉన్న యెహోవా సేవకుల్లో యోబు ఒక్కడు మాత్రమే. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో ఇంకా చాలామంది గురించి చెప్తూ, మేఘంలా ఉన్న “పెద్ద సాక్షుల సమూహం” అని వాళ్లని పిలుస్తున్నాడు. (హెబ్రీ. 12:1) తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొన్నా, వాళ్లు కూడా జీవించినంతకాలం యెహోవాకు నమ్మకంగా ఉన్నారు. (హెబ్రీ. 11:36-40) అయితే వాళ్లు జీవించి ఉన్నప్పుడు యెహోవా చేసిన వాగ్దానాలన్నీ నిజమవ్వడాన్ని చూడలేకపోయారు. కానీ వాళ్లు చూపించిన సహనం, వాళ్లు పడ్డ కష్టం వృథా కాలేదు. యెహోవా వాళ్లను చూసి సంతోషిస్తున్నాడని వాళ్లకు తెలుసు కాబట్టి ఆయన తన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడని వాళ్లు నమ్మారు. (హెబ్రీ. 11:4, 5) మనం కూడా యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండాలని గట్టిగా నిర్ణయించుకోడానికి వాళ్ల ఆదర్శం సహాయం చేస్తుంది.

18. మీరేం చేయాలని నిర్ణయించుకున్నారు? (హెబ్రీయులు 11:6)

18 మనం జీవిస్తున్న ఈ లోకం రోజురోజుకు ఇంకా చెడ్డగా తయారౌతుంది. (2 తిమో. 3:13) సాతాను దేవుని ప్రజలకు ఒకదాని తర్వాత మరొక కష్టాన్ని తెస్తూనే ఉన్నాడు. ముందుముందు మనకెలాంటి కష్టాలు వచ్చినాసరే, “మనం జీవంగల దేవుని మీద నిరీక్షణ” ఉంచుతున్నాం అనే నమ్మకంతో యెహోవా కోసం కష్టపడి పని చేయాలని నిర్ణయించుకుందాం. (1 తిమో. 4:10) అలాగే యెహోవా యోబును ఎలా దీవించాడో గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన “ఎంతో వాత్సల్యం గలవాడని, కరుణామయుడని” మనకు తెలుస్తుంది. (యాకో. 5:11) కాబట్టి మనం కూడా యెహోవాకు నమ్మకంగా ఉంటూ, “తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు” ఆయన ప్రతిఫలం ఇస్తాడనే ఆశతో ఉందాం.—హెబ్రీయులు 11:6 చదవండి.

పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

^ తీవ్రమైన కష్టాలు సహించిన వాళ్ల గురించి ఆలోచించినప్పుడు మనకు వెంటనే యోబు గుర్తొస్తాడు. ఆ నమ్మకమైన వ్యక్తి జీవితం నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం మూడు విషయాల్ని నేర్చుకోవచ్చు. యెహోవా దేవున్ని విడిచిపెట్టేసేలా సాతాను మనల్ని బలవంతం చేయలేడు. అలాగే మనకు ఎదురయ్యే ప్రతీ పరిస్థితి గురించి యెహోవాకు తెలుసు. అంతేకాదు యోబుకు వచ్చిన కష్టాల్ని యెహోవా తీసేసినట్టే, మన కష్టాల్ని కూడా ఆయన తీసేస్తాడు. ఈ వాస్తవాల్ని ఖచ్చితంగా నమ్ముతున్నామని మన పనుల ద్వారా చూపించినప్పుడు, “యెహోవా కోసం కనిపెట్టుకొని” ఉన్నవాళ్లలో మనం కూడా ఒకరిగా ఉంటాం.

^ పదాల వివరణ: “నిరీక్షణ” అనే హీబ్రూ పదానికి సాధారణంగా దేనికోసమైనా “ఆసక్తితో ఎదురు చూడడం” అనే అర్థం ఉంది. అలాగే ఎవరినైనా నమ్మడం లేదా అతనిపై ఆధారపడడం అనే అర్థం కూడా ఉంది.—కీర్త. 25:2, 3; 62:5.

^ కొన్ని అసలు పేర్లు కావు.

^ చిత్రాల వివరణ: యోబు, అతని భార్య ఒక ప్రమాదంలో తమ పిల్లల్ని పోగొట్టుకున్నారు.

^ చిత్రాల వివరణ: యోబు తన కష్టాలన్నిటినీ నమ్మకంగా సహించాడు. అతను, అతని భార్య యెహోవా వాళ్లని ఎంత గొప్పగా దీవించాడో ఆలోచిస్తున్నారు.