కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా చూపించిన దారిలో వెళ్లాలనుకున్నాను

యెహోవా చూపించిన దారిలో వెళ్లాలనుకున్నాను

టీనేజీలో ఉన్నప్పుడు, నాకు నచ్చిన దారిని, అంటే నేను బాగా ఇష్టపడే కెరీర్‌ని ఎంచుకున్నాను. కానీ యెహోవా నన్ను వేరే దారిలోకి ఆహ్వానిస్తూ, ప్రేమతో ఇలా చెప్పినట్టు అనిపించింది: “నేను నీకు లోతైన అవగాహనను ఇస్తాను, నువ్వు నడవాల్సిన మార్గాన్ని నీకు ఉపదేశిస్తాను.” (కీర్త. 32:8) నేను యెహోవా చూపించిన దారిలో వెళ్లి, ఆధ్యాత్మిక కెరీర్‌ని ఎంచుకున్నాను. దానివల్ల మంచిమంచి అవకాశాలు, ఆశీర్వాదాలు పొందాను. అందులో ఒకటి, ఆఫ్రికాలో 52 ఏళ్లపాటు సేవ చేయడం.

ఇంగ్లండ్‌ నుండి ఆఫ్రికాకు

నేను 1935 లో డర్లాస్టన్‌లో పుట్టాను, అది ఇంగ్లండ్‌లోని “నల్లదేశం” అనే ప్రాంతంలో ఉంది. చుట్టుపక్కలున్న చాలా ఫ్యాక్టరీల నుండి వచ్చే దట్టమైన నల్లటి పొగ వల్ల దానికి ఆ పేరు వచ్చింది. నాకు దాదాపు నాలుగేళ్లు ఉన్నప్పుడు, మా అమ్మానాన్నలు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు. నేను టీనేజీలోకి అడుగుపెట్టినప్పుడు, ఇదే సత్యమని నాకు నమ్మకం కుదిరింది. తర్వాత 16 ఏళ్ల వయసులో, అంటే 1952 లో నేను బాప్తిస్మం తీసుకున్నాను.

అదే సమయంలో, నేను ఒక పెద్ద ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌గా చేరి, కంపెనీ సెక్రెటరీగా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాను. అది పనిముట్లు, మోటారు వాహనాల విడిభాగాలు తయారుచేసే ఫ్యాక్టరీ. అక్కడ పని చేయడం నాకు చాలా నచ్చింది.

అయితే, నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. విల్లెన్‌హాల్‌లో ఉన్న మా సంఘంలో, వారం మధ్యలో జరిగే సంఘ పుస్తక అధ్యయనం చేయమని ఒక ప్రయాణ పర్యవేక్షకుడు నన్ను ఆహ్వానించాడు. నేను ఎటూ తేల్చుకోలేకపోయాను, ఎందుకంటే ఆ సమయంలో నేను రెండు సంఘాల్లో మీటింగ్స్‌కి హాజరౌతున్నాను. వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌కేమో, మా ఫ్యాక్టరీకి దగ్గర్లో ఉన్న బ్రోమ్స్‌గ్రోవ్‌ సంఘానికి వెళ్లేవాడిని. అది మా ఇంటి నుండి దాదాపు 32 కిలోమీటర్లు దూరంలో ఉంది. వారాంతంలోనేమో మా అమ్మానాన్నల ఇంటికి వెళ్లేవాడిని కాబట్టి, విల్లెన్‌హాల్‌లో ఉన్న సంఘానికి వెళ్లేవాడిని.

యెహోవా సంస్థకు మద్దతివ్వాలనే కోరికతో, నేను ఆ ప్రయాణ పర్యవేక్షకుడు చెప్పినదానికి ఒప్పుకున్నాను. దానికోసం, నాకు ఎంతో ఇష్టమైన ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. నేను యెహోవా చూపించిన దారిలో వెళ్లాలనుకున్నాను, కాబట్టి ఒక మంచి జీవితానికి మార్గం తెరుచుకుంది. ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు.

బ్రోమ్స్‌గ్రోవ్‌ సంఘానికి హాజరౌతున్న సమయంలో నేను ఒక అందమైన, ఆధ్యాత్మిక సహోదరిని కలిశాను. తన పేరు ఆన్‌. మేము 1957 లో పెళ్లి చేసుకున్నాం. తర్వాత ఇద్దరం కలిసి క్రమ పయినీరు సేవ, ప్రత్యేక పయినీరు సేవ, ప్రయాణ సేవ, బెతెల్‌ సేవ చేశాం. ఆన్‌ను పెళ్లి చేసుకున్నాక, నా జీవితంలో సంతోషం రెట్టింపు అయ్యింది.

1966 లో, మాకొక గొప్ప అవకాశం దొరికింది. మేము గిలియడ్‌ పాఠశాల 42వ తరగతికి హాజరయ్యాం. పాఠశాల అయిపోయిన తర్వాత, మమ్మల్ని మలావీకి నియమించారు. కొత్తవాళ్లను దయగా, స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తారు అనే మంచి పేరు ఆ దేశానికి ఉంది. అయితే, కొన్ని నెలలకే మేము మలావీని విడిచిపెట్టాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు.

మలావీలో ఒడిదుడుకుల మధ్య సేవ చేయడం

మలావీలో ప్రయాణ పని కోసం ఉపయోగించిన కైజర్‌ జీపు

మేము 1967, ఫిబ్రవరి 1న మలావీలో అడుగుపెట్టాం. ఒక నెలపాటు అక్కడి భాషను బాగా నేర్చుకున్న తర్వాత, నేను జిల్లా పర్యవేక్షకునిగా సేవ చేయడం మొదలుపెట్టాను. మాకు కైజర్‌ జీపు ఉండేది. ఆ జీపుతో ఎక్కడికంటే అక్కడికి వెళ్లవచ్చని, ఆఖరికి నదుల్ని కూడా దాటవచ్చని కొంతమంది అనుకుంటారు. కానీ మేము ఆ జీపుతో, లోతు తక్కువున్న నీళ్లను మాత్రమే దాటగలిగాం. కొన్నిసార్లు, మేము గడ్డి కప్పి ఉన్న మట్టి గుడిసెల్లో ఉండాల్సి వచ్చేది. వర్షం పడిందంటే, దానిపైన టార్పాలిన్‌ పట్టా కప్పాల్సి వచ్చేది. అలా మా మిషనరీ సేవ ఎన్నో ఇబ్బందుల మధ్య మొదలైనా, మేము దాన్ని చాలా ఆనందించాం.

ఏప్రిల్‌ నెలలో నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడి ప్రభుత్వం నుండి మాకు సమస్యలు ఎదురవ్వబోతున్నాయి. మలావీ ప్రధాని, డాక్టర్‌ హాస్టింగ్స్‌ బాండా, రేడియోలో ఇచ్చిన ఒక ప్రసంగం నేను విన్నాను. యెహోవాసాక్షులు పన్నులు కట్టట్లేదని, అలాగే వాళ్లు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారని ఆయన అన్నాడు. అవి అబద్ధ ఆరోపణలు. అసలు విషయం ఏంటంటే, మేము తటస్థంగా ఉన్నందుకు, మరిముఖ్యంగా రాజకీయ పార్టీ కార్డులు కొననందుకు ఆయన అలా చెప్పాడు.

సెప్టెంబరు కల్లా, వార్తాపత్రికలో ఒక వార్త వచ్చింది. అదేంటంటే, సహోదరులు అన్నిచోట్లా సమస్యలు సృష్టిస్తున్నారని ప్రధాని ఆరోపించాడు. త్వరలోనే ప్రభుత్వం యెహోవాసాక్షుల్ని నిషేధించబోతుందని ఆయన వాళ్ల పార్టీ సభలో ప్రకటన చేశాడు. ఆ నిషేధం 1967, అక్టోబరు 20న అమల్లోకి వచ్చింది. వెంటనే పోలీసులు, ఇమిగ్రేషన్‌ అధికారులు మా బ్రాంచి కార్యాలయానికి వచ్చి, దాన్ని మూసేసి, మలావీ నుండి మిషనరీల్ని పంపించేశారు.

1967 లో, మమ్మల్ని అరెస్టు చేసి మలావీ నుండి పంపించేస్తున్నప్పుడు, తోటి మిషనరీలైన జాక్‌ జొహాన్సన్‌, ఆయన భార్య లిండతో

తర్వాత మమ్మల్ని మూడు రోజులు జైల్లో ఉంచి, బ్రిటన్‌ పరిపాలన కింద ఉన్న మారిషస్‌ అనే దేశానికి పంపించారు. మారిషస్‌లోని అధికారులు మేము అక్కడ మిషనరీలుగా ఉండడానికి అనుమతించలేదు. కాబట్టి, సంస్థ మమ్మల్ని జింబాబ్వేకు నియమించింది. అప్పట్లో దాన్ని రొడేషియా అని పిలిచేవాళ్లు. అక్కడికి వెళ్లగానే, ఒక కోపిష్ఠి ఇమిగ్రేషన్‌ అధికారి మాకు ఎదురుపడ్డాడు. ఆయన మమ్మల్ని రానివ్వకుండా, “మిమ్మల్ని మలావీలో నిషేధించారు, మారిషస్‌లో కూడా ఉండనివ్వలేదు. ఇప్పుడు ఇక్కడికి తయారయ్యారా?” అని కోపంగా అన్నాడు. ఆన్‌ ఏడ్వడం మొదలుపెట్టింది. మమ్మల్ని ఎవ్వరూ రానివ్వట్లేదు అని మాకు అనిపించింది! ఆ క్షణం, ఇదంతా వదిలేసి ఇంగ్లండ్‌కు తిరిగెళ్లిపోదాం అనుకున్నాను. చివరికి, ఇమిగ్రేషన్‌ అధికారులు ఆ రాత్రికి మేము బ్రాంచి కార్యాలయంలో ఉండడానికి అనుమతించారు. అయితే, తర్వాతి రోజు వాళ్ల ఆఫీసుకు వచ్చి కనబడాలని షరతు పెట్టారు. మేము విసిగిపోయాం, అలసిపోయాం, కానీ విషయాల్ని యెహోవా చేతికి వదిలేయాలని నిర్ణయించుకున్నాం. తర్వాతి రోజు మధ్యాహ్నం కల్లా, ఊహించని విధంగా, మాకు జింబాబ్వేలో సందర్శకులుగా ఉండడానికి అనుమతి లభించింది. మేము ఏ దారిలో వెళ్లాలో యెహోవాయే చూపిస్తున్నాడని నాకు నమ్మకం కుదిరింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను.

ఒక కొత్త నియామకం—జింబాబ్వేలో ఉంటూ మలావీ కోసం పని చేయడం

1968 లో, జింబాబ్వే బెతెల్‌లో ఆన్‌తో కలిసి

జింబాబ్వే బ్రాంచి కార్యాలయంలో, నేను సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాను. అక్కడ నేను మలావీ, మొజాంబిక్‌ దేశాల్లో జరుగుతున్న పనిని చూసుకోవాలి. మలావీలోని సహోదరులు తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారు. నా పనిలో భాగంగా, మలావీలోని ప్రాంతీయ పర్యవేక్షకులు పంపించే రిపోర్టులను అనువదించేవాణ్ణి. ఒకసారి, ఒక రిపోర్టును అనువదించడం పూర్తయ్యే సరికి రాత్రి అయిపోయింది. నా సహోదర సహోదరీలు మలావీలో ఎంత హింసను అనుభవిస్తున్నారో చదివి నాకు ఏడ్పు వచ్చేసింది. a అయినా వాళ్ల విశ్వసనీయత, విశ్వాసం, సహనం నన్ను ఎంతో కదిలించాయి.—2 కొరిం. 6:4, 5.

మలావీలోని హింసను తట్టుకోలేక మొజాంబిక్‌కు పారిపోయి తలదాచుకున్న సహోదరులకు, అలాగే మలావీలో ఉండిపోయిన సహోదరులకు ఆధ్యాత్మిక ఆహారం అందించడానికి మేము చేయగలిగినదంతా చేశాం. మలావీలో ఎక్కువగా మాట్లాడే భాష చిచేవా. చిచేవాలో బైబిలు ప్రచురణల్ని అనువదిస్తున్న అనువాద బృందాన్ని జింబాబ్వేకు మార్చారు. అక్కడ ఒక సహోదరుడు ప్రేమతో, తనకున్న పెద్ద స్థలంలో ఆ అనువాదకుల కోసం కొన్ని ఇళ్లు అలాగే ఒక ఆఫీసు కట్టించాడు. అక్కడినుండి వాళ్లు బైబిలు ప్రచురణల్ని అనువదించే ప్రాముఖ్యమైన పనిని కొనసాగించారు.

మలావీలోని ప్రాంతీయ పర్యవేక్షకులు ప్రతీ సంవత్సరం జింబాబ్వేకు వచ్చి, చిచేవా భాషలో జిల్లా సమావేశానికి హాజరయ్యేలా మేము ఏర్పాట్లు చేశాం. అక్కడ వాళ్లకు సమావేశ ప్రసంగ సంక్షిప్త ప్రతులు ఇచ్చేవాళ్లు. వాళ్లు మలావీకి తిరిగి వెళ్లినప్పుడు, ఆ సంక్షిప్త ప్రతులు ఉపయోగించి ప్రోత్సాహకరమైన ప్రసంగాలు ఇచ్చేవాళ్లు. ఒక సంవత్సరం, వాళ్లు అలా జింబాబ్వేకు వచ్చినప్పుడు, ధైర్యవంతులైన ఆ ప్రాంతీయ పర్యవేక్షకుల్ని ప్రోత్సహించడానికి మేము రాజ్య పరిచర్య పాఠశాలను ఏర్పాటు చేయగలిగాం.

జింబాబ్వేలో చిచేవా, షోనా భాషల్లో జరుగుతున్న సమావేశంలో చిచేవా భాషలో ప్రసంగం ఇస్తూ

1975, ఫిబ్రవరిలో నేను మొజాంబిక్‌కు వెళ్లి, అక్కడి క్యాంపుల్లో తలదాచుకున్న మలావీ సాక్షుల్ని కలిశాను. ఆ సహోదరులు యెహోవా సంస్థ ఇస్తున్న నిర్దేశాలన్నిటినీ, ఆఖరికి పెద్దల సభ ఏర్పాటుకు సంబంధించి కొత్తగా వచ్చిన నిర్దేశాల్ని కూడా పాటిస్తున్నారు. కొత్త సంఘపెద్దలు ఎన్నో ఆధ్యాత్మిక ఏర్పాట్లు చేశారు. ఉదాహరణకు వాళ్లు బహిరంగ ప్రసంగాలు ఇచ్చేవాళ్లు, దినవచనం అలాగే కావలికోట చర్చించేవాళ్లు, ఆఖరికి ప్రాంతీయ సమావేశాల్ని కూడా ఏర్పాటు చేసేవాళ్లు. అంతేకాదు సమావేశంలో ఏర్పాటు చేసినట్టే, క్యాంపుల్లో కూడా శుభ్రత కోసం, ఆహారం పంచిపెట్టడం కోసం, భద్రత కోసం కొన్ని డిపార్ట్‌మెంట్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నమ్మకమైన సాక్షులు యెహోవా ఆశీర్వాదంతో చేస్తున్న పనులన్నిటినీ చూసి, నాకు చాలా ప్రోత్సాహంగా అనిపించింది.

దాదాపు 1979 లో, మలావీని ఇక జాంబియా బ్రాంచి కార్యాలయం చూసుకోవడం మొదలుపెట్టింది. అయినప్పటికీ, నేను మలావీలోని సహోదరుల గురించి ఆలోచిస్తూ వాళ్ల గురించి ప్రార్థించేవాడిని. నేనే కాదు, ఇంకా చాలామంది అలా ప్రార్థించేవాళ్లు. జింబాబ్వే బ్రాంచి కమిటీ సభ్యునిగా నేను ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన ప్రతినిధుల్ని, అలాగే మలావీ, దక్షిణ ఆఫ్రికా, జాంబియా నుండి వచ్చిన బాధ్యతగల సహోదరుల్ని తరచూ కలిసేవాడిని. మేము ప్రతీసారి, “మలావీలోని సహోదరులకు ఇంకా ఎలా సహాయం చేయగలం?” అని చర్చించుకునేవాళ్లం.

కాలం గడుస్తుండగా, హింస తగ్గింది. మలావీ నుండి వెళ్లిపోయిన సహోదరులు తిరిగి రావడం మొదలుపెట్టారు. అలాగే మలావీలో ఉండిపోయిన సహోదరులు ఎదుర్కొంటున్న హింస తగ్గుతూ వచ్చింది. చుట్టుపక్కల దేశాలు యెహోవాసాక్షులకు చట్టబద్ధమైన గుర్తింపును ఇస్తూ, ఆంక్షలు ఎత్తేస్తున్నాయి. 1991 లో, మొజాంబిక్‌లోని యెహోవాసాక్షులకు చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. అయితే, మలావీలోని యెహోవాసాక్షులకు ఎప్పుడు విడుదల వస్తుందా అని మేము ఎదురుచూశాం.

మలావీకి తిరిగెళ్లడం

చివరికి మలావీలో పరిస్థితులు మారాయి. 1993 లో, ప్రభుత్వం యెహోవాసాక్షుల మీదున్న నిషేధాన్ని ఎత్తేసింది. తర్వాత నేను ఒక మిషనరీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నన్ను, “మీరు తిరిగి మలావీకి వెళ్తారా?” అని అడిగాడు. అప్పుడు నాకు 59 ఏళ్లు, కాబట్టి “ఈ వయసులో ఏం వెళ్తాను” అని అన్నాను. కానీ, అదే రోజు పరిపాలక సభ మమ్మల్ని తిరిగి మలావీకి ఆహ్వానిస్తూ ఫ్యాక్స్‌ పంపింది.

అయితే, జింబాబ్వేలో మేము చేస్తున్న పని మాకు చాలా నచ్చింది. ఇక్కడ మేము సంతోషంగా ఉన్నాం, పైగా మంచిమంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాం. కాబట్టి దాన్ని వదిలేసి వెళ్లడం మనసుకు కష్టంగా అనిపించింది. అయితే పరిపాలక సభ మామీద ఎంతో దయ చూపిస్తూ, మాకు ఇష్టమైతేనే వెళ్లమని అంది. కాబట్టి, మేము మాకు నచ్చిన దారిని ఎంచుకుని జింబాబ్వేలోనే ఉండాలని నిర్ణయించుకోవచ్చు. కానీ నేను అబ్రాహాము, శారాల గురించి ఆలోచించాను. వాళ్లు వృద్ధాప్యంలో, సౌకర్యవంతమైన ఇంటిని వదిలేసి, యెహోవా చూపించిన దారిలో వెళ్లారు.—ఆది. 12:1-5.

మేము సంస్థ ఇచ్చిన నిర్దేశానికి లోబడి 1995, ఫిబ్రవరి 1న తిరిగి మలావీకి వెళ్లాం. సరిగ్గా 28 సంవత్సరాల క్రితం, అదే రోజున మేము మలావీలో అడుగుపెట్టాం. పరిపాలక సభ ఒక బ్రాంచి కమిటీని ఏర్పాటు చేసింది. అందులో నాతోపాటు ఇద్దరు సహోదరులు ఉన్నారు. మేము వెంటనే, యెహోవాసాక్షుల పనులు తిరిగి క్రమపద్ధతిలో జరగడానికి ఏర్పాట్లు మొదలుపెట్టాం.

యెహోవాయే పెరిగేలా చేశాడు

మలావీలో జరుగుతున్న పనిని యెహోవా ఎలా ఆశీర్వదించాడో చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది! ప్రచారకుల సంఖ్య వేగంగా పెరిగింది. 1993 లో దాదాపు 30,000 ఉన్న ప్రచారకుల సంఖ్య, 1998 లో 42,000 కన్నా ఎక్కువైంది. b అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి, కొత్త బ్రాంచి కార్యాలయాన్ని కట్టడానికి పరిపాలక సభ అనుమతిని ఇచ్చింది. దాంతో మేము లిలోంగ్వేలో 30 ఎకరాల భూమిని తీసుకున్నాం. ఆ నిర్మాణ పనిని చూసుకునే కమిటీలో నన్ను నియమించారు.

2001, మే నెలలో ఆ కొత్త బ్రాంచి కార్యాలయానికి పరిపాలక సభ సభ్యుడైన గయ్‌ పియర్స్‌ వచ్చి, సమర్పణ ప్రసంగం ఇచ్చాడు. దానికి 2,000 కన్నా ఎక్కువమంది మలావీ సాక్షులు హాజరయ్యారు. వాళ్లలో చాలామంది, బాప్తిస్మం తీసుకుని 40 ఏళ్లు దాటినవాళ్లే. ఈ నమ్మకమైన సహోదర సహోదరీలు ఎన్నో ఏళ్లపాటు, నిషేధం కింద విపరీతమైన హింసను అనుభవించారు. వాళ్లు ఆర్థికంగా పేదవాళ్లేమో కానీ, ఆధ్యాత్మికంగా మాత్రం చాలా ధనవంతులు. ఇప్పుడు వాళ్లు కొత్త బెతెల్‌ను చూసి చాలా సంతోషించారు. వాళ్లు బెతెల్‌లో ఎక్కడికి వెళ్లినా ఆఫ్రికా స్టైల్‌లో రాజ్యగీతాల్ని పాడారు, వాళ్ల పాటలతో బెతెల్‌ మారుమోగిపోయింది. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను! కష్టాల్ని నమ్మకంగా సహించినవాళ్లను యెహోవా మెండుగా ఆశీర్వదిస్తాడు అనడానికి వాళ్లే సజీవ సాక్ష్యం.

బ్రాంచి నిర్మాణం పూర్తయిన తర్వాత, నాకు రాజ్యమందిరాల్ని సమర్పించే నియామకాలు రావడం మొదలైంది. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. తక్కువ వనరులు ఉన్న దేశాల్లో రాజ్యమందిర నిర్మాణం కోసం సంస్థ చేసిన ఏర్పాటు నుండి మలావీలోని సంఘాలు ప్రయోజనం పొందుతున్నాయి. అంతకుముందైతే, కొన్ని సంఘాలు జామాయిల్‌ చెట్ల కొయ్యల మీద గడ్డి పరిచి, ఆ పందిరి కింద మీటింగ్స్‌ జరుపుకునేవాళ్లు. మట్టితో చేసిన పొడవాటి బెంచీల మీద కూర్చునేవాళ్లు. ఇప్పుడైతే సహోదరులు సొంతగా కట్టుకున్న బట్టీల్లో ఇటుకల్ని కాల్చి, వాటితో అందమైన రాజ్యమందిరాల్ని నిర్మించారు. అయితే, వాళ్లు ఇప్పటికీ కుర్చీల కన్నా బెంచీలనే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, వాళ్లు ఇలా అంటూ ఉంటారు: “బెంచీ మీద అయితే ఎప్పుడూ ఇంకో వ్యక్తికి చోటు ఉంటుంది!”

సహోదరులు ఆధ్యాత్మికంగా ఎదిగేలా యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో కూడా చూసి నేను చాలా సంతోషించాను. అక్కడి యువ సహోదరులు స్వచ్ఛందంగా ముందుకు రావడం, చక్కని అనుభవాన్ని సంపాదించుకోవడం నా మనసుకు హత్తుకుంది. వాళ్లు సంస్థ ఇస్తున్న శిక్షణ నుండి ఎన్నో విషయాలు త్వరగా నేర్చుకుని, వాటిని పాటించారు. వాళ్లు బెతెల్‌లో, సంఘాల్లో మరిన్ని బాధ్యతలు చేపట్టారు. కొత్తగా నియమించబడిన స్థానిక ప్రాంతీయ పర్యవేక్షకుల వల్ల సంఘాలు ఇంకా బలంగా తయారయ్యాయి. వాళ్లలో చాలామంది పెళ్లయినవాళ్లు ఉన్నారు. ఆ దంపతులు కుటుంబం నుండి, చుట్టుపక్కలవాళ్ల నుండి ఒత్తిడి వచ్చినా, పిల్లల్ని వద్దనుకుని యెహోవా సేవ ఎక్కువగా చేయాలని నిర్ణయించుకున్నారు.

నా నిర్ణయాలు నాకు సంతృప్తిని ఇచ్చాయి

బ్రిటన్‌ బెతెల్‌లో ఆన్‌తో కలిసి

ఆఫ్రికాలో 52 ఏళ్లు సేవ చేసిన తర్వాత, నాకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి. దాంతో, బ్రాంచి కమిటీ సిఫారసు మీద పరిపాలక సభ మమ్మల్ని తిరిగి బ్రిటన్‌కు నియమించడానికి ఒప్పుకుంది. మాకు ఇష్టమైన నియామకాన్ని వదులుకున్నందుకు బాధపడ్డాం. కానీ బ్రిటన్‌ బెతెల్‌ కుటుంబం, వృద్ధులైన మమ్మల్ని చాలా బాగా చూసుకుంటోంది.

యెహోవా చూపించిన దారిలో వెళ్లాలని నిర్ణయించుకోవడం నేను తీసుకున్న నిర్ణయాలన్నిటిలో అత్యంత శ్రేష్ఠమైనదని నాకు నమ్మకం కుదిరింది. ఒకవేళ నా సొంత అవగాహన మీద ఆధారపడి ఉంటే, నేను ఎంచుకున్న కెరీర్‌ నన్ను ఎటు తీసుకెళ్లేదో ఎవరికి తెలుసు? కానీ, ‘నా దారుల్ని తిన్నగా చేయడం’ ఎలాగో యెహోవాకు బాగా తెలుసు. (సామె. 3:5, 6 అధస్సూచి.) యువకుడిగా ఉన్నప్పుడు, ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తూ, కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటూ నేను చాలా ఆనందించాను. అయితే, యెహోవా భూవ్యాప్త సంస్థ ఇచ్చిన ఆధ్యాత్మిక కెరీర్‌లో అంతకన్నా ఎక్కువ ఆనందం పొందాను. నా వరకైతే యెహోవాను సేవించడం ఇప్పుడూ, ఎప్పుడూ చాలా సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తుంది!

a మలావీలోని యెహోవాసాక్షుల చరిత్ర తెలుసుకోవడానికి, 1999 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకంలోని (ఇంగ్లీష్‌) 148-223 పేజీలు చూడండి.

b మలావీలో ఇప్పుడు 1,00,000 కన్నా ఎక్కువ ప్రచారకులు ఉన్నారు.