కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 37

సహోదర సహోదరీల్ని మీరు నమ్మవచ్చు

సహోదర సహోదరీల్ని మీరు నమ్మవచ్చు

“ప్రేమ . . . అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది.”1 కొరిం. 13:4, 7.

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

ఈ ఆర్టికల్‌లో. . . *

1. నేడు లోకంలో ఎలాంటి పరిస్థితి ఉంది? అది చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోం?

 సాతాను లోకంలోని ప్రజలకు ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలీదు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మతనాయకులు చేసే పనులతో వాళ్లు విసుగెత్తిపోయారు. కనీసం స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్లను, చివరికి కుటుంబ సభ్యుల్ని కూడా నమ్మలేమని చాలామంది అనుకుంటున్నారు. ఇదంతా చూసి మనం ఆశ్చర్యపోం. బైబిలు ముందే ఇలా చెప్పింది: ‘చివరి రోజుల్లో ఇలాంటి మనుషులు ఉంటారు: విశ్వసనీయంగా ఉండనివాళ్లు, లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, నమ్మకద్రోహులు.’ ఇంకో మాటలో చెప్పాలంటే, అస్సలు నమ్మలేని ఈ లోక దేవుడైన సాతానులా ప్రజలు ఉంటారు.—2 తిమో. 3:1-4; 2 కొరిం. 4:4.

2. (ఎ) మనం ఎవర్ని, అలాగే దేన్ని పూర్తిగా నమ్మవచ్చు? (బి) కొంతమంది ఏం అనుకోవచ్చు?

2 కానీ క్రైస్తవులుగా, మనం యెహోవాను పూర్తిగా నమ్మవచ్చు. (యిర్మీ. 17:7, 8) ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, మనల్ని ‘ఎన్నడూ వదిలేయడని’ మనకు ఖచ్చితంగా తెలుసు. (కీర్త. 9:10) మనం యేసుక్రీస్తును కూడా నమ్మవచ్చు, ఎందుకంటే ఆయన మనకోసం తన ప్రాణాల్ని ఇచ్చాడు. (1 పేతు. 3:18) అలాగే బైబిల్లోని నిర్దేశాలు ఎంత నమ్మదగినవో మనం రుచిచూసి తెలుసుకున్నాం. (2 తిమో. 3:16, 17) కాబట్టి మనం యెహోవాను, యేసును అలాగే బైబిల్ని ఖచ్చితంగా నమ్మవచ్చు. అయితే, ‘మన సహోదర సహోదరీల్ని అన్ని సందర్భాల్లో నమ్మవచ్చా?’ అని కొంతమంది అనుకోవచ్చు. ఒకవేళ నమ్మవచ్చు అంటే, ఎందుకు నమ్మవచ్చు?

మనకు మన సహోదర సహోదరీలు అవసరం

యెహోవాను ప్రేమించే నమ్మకమైన సహోదర సహోదరీలు ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నారు (3వ పేరా చూడండి)

3. మనకు ఎలాంటి గొప్ప గౌరవం ఉంది? (మార్కు 10:29, 30)

3 తన ప్రపంచవ్యాప్త కుటుంబంలో ఉండేలా యెహోవా మనల్ని ఎంచుకున్నాడు. అది ఎంత గొప్ప గౌరవమో, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. (మార్కు 10:29, 30 చదవండి.) ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదర సహోదరీలు మనలాగే యెహోవాను ప్రేమిస్తూ, ఆయన ప్రమాణాల్ని పాటించడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు. మనం వాళ్లను మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల భాష, సంస్కృతి, బట్టలు వేరుగా ఉన్నా వాళ్లు మనవాళ్లే అని మనకు అనిపిస్తుంది. మరిముఖ్యంగా, వాళ్లతో కలిసి మన ప్రేమగల పరలోక తండ్రిని స్తుతించడాన్ని, ఆరాధించడాన్ని మనమెంతో ఇష్టపడతాం.—కీర్త. 133:1.

4. మనకు సహోదర సహోదరీలు ఎందుకు అవసరం?

4 ముందెప్పటి కన్నా ఇప్పుడు మనం సహోదర సహోదరీలతో ఐక్యంగా ఉండాలి. కొన్నిసార్లు, మన భారాన్ని మోయడానికి వాళ్లు మనకు సహాయం చేస్తారు. (రోమా. 15:1; గల. 6:2) యెహోవా సేవలో బిజీగా ఉండమని, ఆయనతో దగ్గరి సంబంధం కలిగి ఉండమని వాళ్లు మనల్ని ప్రోత్సహిస్తారు. (1 థెస్స. 5:11; హెబ్రీ. 10:23-25) మనందరి శత్రువు అపవాది అయిన సాతాను. అతని చెడ్డ లోకం కూడా మన శత్రువే. వాళ్లను ఎదిరిస్తూ స్థిరంగా ఉండేలా సంఘం మనకు సహాయం చేస్తుంది. ఒకవేళ సంఘమే లేకపోయుంటే, మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి. త్వరలోనే సాతాను, అతని చెప్పుచేతల్లో ఉన్నవాళ్లు మనమీద దాడిచేస్తారు. అలాంటి సమయంలో మన సహోదర సహోదరీలు మన పక్కనే ఉన్నప్పుడు మనకెంత ధైర్యంగా అనిపిస్తుందో కదా!

5. కొంతమందికి సహోదర సహోదరీల్ని నమ్మడం ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

5 కానీ కొంతమందికి సహోదర సహోదరీల్ని నమ్మడం కష్టంగా ఉండవచ్చు. ఎందుకంటే, కొందరు ఇచ్చిన మాటను తప్పి ఉండవచ్చు. ఇంకొందరేమో, ఎంతో నమ్మకంతో మనం ఒక విషయాన్ని చెప్తే దాన్ని వేరేవాళ్లకు చెప్పి ఉండవచ్చు. లేదా సంఘంలో ఎవరైనా తమ మాటల ద్వారా, పనుల ద్వారా మనల్ని బాగా నొప్పించి ఉండవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ఇతరుల్ని నమ్మడం కష్టంగా ఉంటుంది. మరైతే, మన సహోదర సహోదరీల మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రేమ సహాయం చేస్తుంది

6. నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రేమ మనకెలా సహాయం చేస్తుంది? (1 కొరింథీయులు 13:4-8)

6 ఎవరినైనా నమ్మాలంటే, ముందు మనకు వాళ్లమీద ప్రేమ ఉండాలి. ఇతరులమీద నమ్మకాన్ని పెంచుకోవడానికి లేదా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పెంచుకోవడానికి ప్రేమ ఎలా సహాయం చేస్తుందో మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం చెప్తుంది. (1 కొరింథీయులు 13:4-8 చదవండి.) ఉదాహరణకు, “ప్రేమ ఓర్పు, దయ చూపిస్తుంది” అని 4వ వచనం చెప్తుంది. మనం యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినాసరే, ఆయన మన విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. కాబట్టి మన సహోదరులు తమ మాటల ద్వారా, పనుల ద్వారా మనకు చిరాకు తెప్పించినా లేదా బాధపెట్టినా మనం కూడా వాళ్ల విషయంలో ఓర్పు చూపించాలి. ప్రేమ ‘త్వరగా కోపం తెచ్చుకోదు, హానిని మనసులో పెట్టుకోదు’ అని 5వ వచనం చెప్తుంది. సహోదరులు చేసిన “హానిని మనసులో పెట్టుకోకూడదు” అంటే, వాళ్లు మనల్ని బాధపెట్టిన సందర్భాల గురించి అదేపనిగా ఆలోచించకూడదు. ప్రసంగి 7:9 కూడా “త్వరగా కోపం తెచ్చుకోకు” అని చెప్తోంది. “సూర్యుడు అస్తమించే లోపే మీ కోపాన్ని తీసేసుకోండి” అని ఎఫెసీయులు 4:26 లో ఉన్న సలహా పాటించడం ఎంత మంచిదో కదా!

7. నమ్మకాన్ని పెంచుకోవడానికి మత్తయి 7:1-5 లో ఉన్న సూత్రాలు ఎలా సహాయం చేస్తాయి?

7 నమ్మకాన్ని పెంచుకోవడానికి మనం ఇంకో పని చేయాలి. అదేంటంటే, మన సహోదర సహోదరీల్ని యెహోవా చూసినట్టే చూడాలి. యెహోవా దేవుడు వాళ్లను ప్రేమిస్తున్నాడు, వాళ్ల తప్పుల్ని ఆయన లెక్కపెట్టట్లేదు. మనం కూడా లెక్కపెట్టకూడదు. (కీర్త. 130:3) వాళ్లలో ఉన్న లోపాల్ని కాకుండా, వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని చూడడానికి ప్రయత్నించాలి. అంతేకాదు వాళ్లు చేయగలిగే మంచిపనుల మీదే మనసుపెట్టాలి. (మత్తయి 7:1-5 చదవండి.) ప్రేమ “అన్నిటినీ నమ్ముతుంది” కాబట్టి, మన సహోదరులు మంచి చేయాలనుకుంటున్నారని, మనల్ని కావాలని నొప్పించలేదని నమ్ముతాం. (1 కొరిం. 13:7) అలాగని మనం అందరినీ గుడ్డిగా నమ్మేయాలని యెహోవా కోరుకోవట్లేదు. మన సహోదరులు నమ్మకస్థులని నిరూపించుకున్నారు కాబట్టి, మనం వాళ్లను నమ్మాలని ఆయన కోరుకుంటున్నాడు. *

8. సహోదరుల మీద నమ్మకం పెంచుకోవడానికి మనం ఏం చేయాలి?

8 సహోదరుల మీద నమ్మకం పెంచుకోవడానికి సమయం పడుతుంది. అందుకోసం మనం ఏం చేయాలి? ముందుగా వాళ్ల గురించి బాగా తెలుసుకోండి. మీటింగ్స్‌లో వాళ్లతో మాట్లాడండి. వాళ్లతో కలిసి పరిచర్య చేయండి. వాళ్లతో ఓపిగ్గా ఉంటూ, వాళ్లు నమ్మకస్థులని నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. మొదట్లో మీ వ్యక్తిగత విషయాలన్నీ మీరు వాళ్లకు చెప్పకపోవచ్చు. అయితే వాళ్లతో స్నేహం పెరిగేకొద్దీ వాళ్లతో మనసువిప్పి మాట్లాడడం మీకు తేలిక అవ్వచ్చు. (లూకా 16:10) కానీ మీరెంతో నమ్మిన సహోదరుడు మిమ్మల్ని బాధపెడితే, అప్పుడేం చేయవచ్చు? ఇక వాళ్లని ఎప్పుడూ నమ్మకూడదని అనుకునే బదులు, కొంచెం సమయం గడవనివ్వండి. అలాగే ఎవరో కొంతమంది మిమ్మల్ని బాధపెట్టినందుకు, సహోదరులందరి మీద నమ్మకాన్ని కోల్పోకండి. కొంతమంది నమ్మకమైన యెహోవా సేవకులకు ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు వాళ్లు ఏం చేశారో ఇప్పుడు చూద్దాం.

ఇతరుల మీద నమ్మకం కోల్పోని వాళ్ల నుండి నేర్చుకోండి

ఏలీ మొదట్లో తప్పుగా మాట్లాడినా, యెహోవా ఏర్పాట్ల మీద హన్నా తన నమ్మకాన్ని కోల్పోలేదు (9వ పేరా చూడండి)

9. (ఎ) బాధ్యతల్లో ఉన్న యెహోవా సేవకులు తప్పు చేసినా హన్నా దేవుని ఏర్పాట్ల మీద నమ్మకాన్ని ఎలా కోల్పోలేదు? (బి) యెహోవా చేసిన ఏర్పాట్ల మీద నమ్మకం ఉంచడం గురించి హన్నా ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం చూడండి.)

9 బాధ్యతలో ఉన్న సహోదరుడి ప్రవర్తన వల్ల మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? అలాగైతే, హన్నా ఉంచిన ఆదర్శం మీకెంతో సహాయం చేస్తుంది. ఆమె కాలంలో యెహోవా ఆరాధనను ముందుండి నడిపిస్తున్నది ప్రధానయాజకుడైన ఏలీ. కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం మంచి ఆదర్శాన్ని ఉంచలేదు. యాజకులుగా సేవచేస్తున్న ఆయన కొడుకులు లైంగిక పాపం లాంటి చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. కానీ ఏలీ వాళ్లను సరిదిద్దడానికి పెద్దగా ప్రయత్నించలేదు. అప్పుడు యెహోవా ఏలీని ప్రధానయాజకుడి స్థానం నుండి వెంటనే తీసేయలేదు. అయినా, ఏలీ ప్రధానయాజకుడిగా ఉన్నంతవరకు గుడారానికి వెళ్లి ఆరాధించనని హన్నా అనుకోలేదు. బదులుగా, యెహోవా చేసిన ఏర్పాట్ల మీద నమ్మకం ఉంచింది. ఒకసారి హన్నా ఎంతో బాధతో ప్రార్థిస్తున్నప్పుడు, ఆమె తాగి ఉందని ఏలీ తప్పుగా అనుకున్నాడు. ఏ వివరాలూ తెలుసుకోకుండా, బాధలో ఉన్న ఆమెను ఏలీ తప్పుపట్టాడు. (1 సమూ. 1:12-16) ఇంత జరిగినాసరే, తనకు బాబు పుడితే ఆ గుడారంలో సేవచేయడానికి పంపిస్తానని హన్నా ప్రమాణం చేసింది. అలా పంపిస్తే, తన బాబును చూసుకునే బాధ్యత ఏలీదే అని తెలిసినా అలా చేసింది. (1 సమూ. 1:11) మరి ఏలీ కుమారుల సంగతేంటి? యెహోవా వాళ్లను సరైన సమయంలో శిక్షించాడు. (1 సమూ. 4:17) ఈలోపు, సమూయేలును ఇచ్చి హన్నాను దీవించాడు.—1 సమూ. 1:17-20.

10. కొంతమంది తనకు నమ్మకద్రోహం చేసినంత మాత్రాన, దావీదు అందరి మీద నమ్మకం కోల్పోయాడా? వివరించండి.

10 మీ దగ్గరి స్నేహితులెవరైనా మీకు నమ్మకద్రోహం చేశారా? అలాగైతే రాజైన దావీదు ఉంచిన ఆదర్శం మీకు సహాయం చేస్తుంది. దావీదు కొడుకైన అబ్షాలోము తన తండ్రిని రాజుగా తీసేసి, తాను రాజవ్వాలని అనుకున్నాడు. అప్పుడు దావీదు స్నేహితుల్లో ఒకడైన అహీతోపెలు అబ్షాలోముతో చేతులు కలిపాడు. తన కొడుకు, తన స్నేహితుడు ఇద్దరూ ఒకేసారి తనకు నమ్మకద్రోహం చేశారని తెలిసినప్పుడు దావీదు ఎంత బాధపడి ఉంటాడో ఊహించండి! అంతమాత్రాన, దావీదు అందరి మీద నమ్మకం కోల్పోలేదు. తిరుగుబాటు చేసేవాళ్లతో కలిసిపోకుండా, తనను అంటిపెట్టుకుని ఉన్న ఇంకో స్నేహితుడైన హూషై మీద ఆయన నమ్మకం ఉంచాడు. దావీదు అలా హూషైను నమ్మడం సరైన నిర్ణయమే. ఎందుకంటే హూషై తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ, తాను ఒక మంచి స్నేహితుణ్ణని నిరూపించుకున్నాడు.—2 సమూ. 17:1-16.

11. అబీగయీలు మీద నమ్మకం ఉందని నాబాలు సేవకుడు ఎలా చూపించాడు?

11 నాబాలు సేవకుడి ఉదాహరణ గురించి కూడా ఆలోచించండి. నాబాలు అనే ఇశ్రాయేలీయుడి సేవకులకు దావీదు, ఆయన మనుషులు ఒక రక్షణగా ఉన్నారు. అయితే ఒకసారి దావీదు తన మనుషుల కోసం ఆహారం ఇవ్వమని ధనవంతుడైన నాబాలును అడిగాడు. అది కూడా తను ఇవ్వగలిగిందే ఇవ్వమని వినయంగా అడిగాడు. అయినాసరే నాబాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడు దావీదుకు ఎంత కోపం వచ్చిందంటే, నాబాలు ఇంట్లోని మగవాళ్లందర్నీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక సేవకుడు, జరిగినదంతా నాబాలు భార్య అయిన అబీగయీలుకు చెప్పాడు. అతను కూడా నాబాలు ఇంట్లోవాడే కాబట్టి, అబీగయీలు తన ప్రాణాల్ని కాపాడగలదని అతనికి తెలుసు. ఆ సమయంలో పారిపోయే బదులు, ఆ సమస్యను అబీగయీలు పరిష్కరించగలదని అతను నమ్మాడు. అబీగయీలుకు వివేచనగల స్త్రీ అనే పేరుంది కాబట్టి అతను ఆమెను నమ్మగలిగాడు. నిజంగా అతను చాలా మంచి పనిచేశాడు, ఎందుకంటే అబీగయీలు ధైర్యం చూపించి దావీదును ఆపగలిగింది. (1 సమూ. 25:2-35) ఆమె కూడా దావీదు సరైన నిర్ణయం తీసుకుంటాడని నమ్మింది.

12. తన శిష్యులు తప్పులు చేసినా వాళ్లను నమ్ముతున్నానని యేసు ఎలా చూపించాడు?

12 తన శిష్యులు తప్పులు చేస్తారని తెలిసినా, యేసు వాళ్లను నమ్మాడు. (యోహా. 15:15, 16) ఒకసారి యాకోబు, యోహానులు రాజ్యంలో తమకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వమని యేసును అడిగారు. అప్పుడు యేసు, వాళ్లు స్వార్థంతోనే యెహోవాను ఆరాధిస్తున్నారు అని అనడం గానీ, వాళ్లను అపొస్తలులుగా తీసేయడం గానీ చేయలేదు. (మార్కు 10:35-40) ఇంకొకసారి యేసును బంధించిన రాత్రి, శిష్యులందరూ ఆయన్ని విడిచి వెళ్లిపోయారు. (మత్త. 26:56) అయినా, యేసు వాళ్లమీద నమ్మకం కోల్పోలేదు. వాళ్ల లోపాలన్నీ ఆయనకు బాగా తెలిసినా, “చివరి వరకూ వాళ్లను ప్రేమిస్తూనే ఉన్నాడు.” (యోహా. 13:1) పునరుత్థానమైన తర్వాత, యేసు తన 11 మంది నమ్మకమైన అపొస్తలులకు ఎన్నో బరువైన బాధ్యతల్ని కూడా ఇచ్చాడు. వాళ్లు శిష్యుల్ని చేసే పనిని ముందుండి నడిపించాలి, అలాగే అమూల్యమైన యేసు గొర్రెల్ని చూసుకోవాలి. (మత్త. 28:19, 20; యోహా. 21:15-17) ఆ అపరిపూర్ణ మనుషుల్ని యేసు నమ్మడం సరైనదే. ఎందుకంటే, వాళ్లందరూ చనిపోయేంత వరకు యెహోవాకు నమ్మకంగా సేవచేశారు. నిజంగా హన్నా, దావీదు, నాబాలు సేవకుడు, అబీగయీలు, యేసు అపరిపూర్ణ మనుషుల్ని నమ్మే విషయంలో మంచి ఆదర్శాన్ని ఉంచారు.

నమ్మకాన్ని తిరిగి పెంచుకోండి

13. ఇతరుల్ని నమ్మడం మనకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

13 మీరు ఒక సహోదరుణ్ణి నమ్మి, ఏదైనా విషయాన్ని ఆయనకు చెప్పినప్పుడు, ఆయన దాన్ని వేరేవాళ్లకు చెప్పి మీ నమ్మకాన్ని పోగొట్టాడు అనుకోండి. అప్పుడు మీకెలా అనిపిస్తుంది? చాలా బాధేస్తుంది కదా. ఒక సహోదరికి అదే జరిగింది. ఆమె తన వ్యక్తిగత విషయాన్ని ఒక సంఘ పెద్దకు చెప్పింది. అయితే తర్వాతి రోజు, ఆ సంఘ పెద్ద భార్య ఆమెను ప్రోత్సహించడానికి ఫోన్‌ చేసింది. అప్పుడు, ఆ సంఘ పెద్ద ఆ విషయాన్ని తన భార్యకు చెప్పాడని ఆ సహోదరికి అర్థమైంది. మళ్లీ ఆ సంఘ పెద్దను నమ్మడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. అయితే ఆ సహోదరి అలానే ఉండిపోకుండా, ఇంకెవరైనా సహాయం చేస్తారేమో అని చూసింది. ఆమె జరిగినదాని గురించి ఇంకో సంఘ పెద్దతో మాట్లాడింది. పెద్దల మీద తన నమ్మకాన్ని తిరిగి పెంచుకోవడానికి ఆ సహోదరుడు ఆమెకు సహాయం చేశాడు.

14. తిరిగి నమ్మకం పెంచుకోవడానికి ఒక సహోదరుడికి ఏది సహాయం చేసింది?

14 చాలా సంవత్సరాల నుండి ఒక సహోదరుడికి ఇద్దరు పెద్దలతో పడేదికాదు. అందుకే ఆయన వాళ్లను అస్సలు నమ్మలేకపోయాడు. అయితే ఆయన ఎంతో గౌరవించే ఒక సహోదరుడు చెప్పిన ఈ మాట గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు: “మన శత్రువు సాతానే గానీ మన సహోదరులు కాదు.” ఆయన ఆ మాటల గురించి లోతుగా ఆలోచించాడు, యెహోవాకు ప్రార్థించాడు. చివరికి ఆ ఇద్దరు సంఘ పెద్దలతో సమాధానపడ్డాడు.

15. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పెంచుకోవడానికి ఎందుకు సమయం పట్టవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

15 ఎప్పుడైనా మీరు మీ సేవావకాశాల్ని కోల్పోయారా? అలాగైతే, అప్పుడు ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసు. ఇద్దరు సహోదరీల అనుభవం గురించి ఆలోచించండి. గ్రెటా, అలాగే వాళ్ల అమ్మ 1930లలో మన పనిని నిషేధించిన నాజీ జర్మనీలో యెహోవాకు నమ్మకంగా సేవచేశారు. తన సహోదరుల కోసం కావలికోట కాపీలను తయారుచేసే గొప్ప అవకాశాన్ని గ్రెటా ఆనందించింది. అయితే వాళ్ల నాన్న సత్యాన్ని వ్యతిరేకిస్తున్నాడని సహోదరులకు తెలిసింది. వాళ్ల నాన్న సంఘం గురించిన వివరాల్ని వ్యతిరేకులకు ఎక్కడ చెప్పేస్తాడేమో అనే భయంతో సహోదరులు గ్రెటాకు ఇక ఆ పని ఇవ్వలేదు. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధం జరిగినన్ని సంవత్సరాలు సహోదరులు గ్రెటాకు, వాళ్ల అమ్మకు పత్రికలు ఇచ్చేవాళ్లు కాదు. అలాగే దారిలో ఎక్కడైనా కనబడితే, వాళ్లతో మాట్లాడేవాళ్లు కూడా కాదు. ఇదంతా చూసి ఆమె మనసు విరిగిపోయింది! ఆమె ఎంతగా బాధ పడిందంటే, ఆ సహోదరుల్ని క్షమించడానికి, వాళ్లను తిరిగి నమ్మడానికి తనకు చాలా సమయం పట్టిందని చెప్తుంది. కానీ కొంతకాలం తర్వాత, యెహోవాయే వాళ్లను క్షమిస్తున్నాడు కాబట్టి, తాను కూడా వాళ్లను క్షమించాలని గ్రెటా అర్థంచేసుకుంది. *

“మన శత్రువు సాతానే కానీ మన సహోదరులు కాదు”

16. సహోదర సహోదరీల మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి మనం ఎందుకు కృషి చేయాలి?

16 మీకు కూడా అలా బాధపడిన అనుభవం ఏదైనా ఉందా? అలాగైతే, వేరేవాళ్ల మీద తిరిగి నమ్మకాన్ని పెంచుకోవడానికి మీరు కృషి చేయాలి. దానికి సమయం పట్టవచ్చు, కానీ మీరు చేసే కృషికి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఒకసారి దీనిగురించి ఆలోచించండి. పాడైపోయిన ఆహారం తినడంవల్ల మనకు అనారోగ్యం రావచ్చు. దాంతో ఈసారి తినేటప్పుడు ఏం తింటున్నామో జాగ్రత్తగా చూసుకుంటాం. అంతేగానీ అసలు తినడమే మానేయం కదా? అదేవిధంగా ఏదో ఒక్క చేదు అనుభవంవల్ల సహోదర సహోదరీలందరి మీద మన నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్లందరూ అపరిపూర్ణులని మనకు తెలుసు. మనం నమ్మకాన్ని తిరిగి పెంచుకున్నప్పుడు మరింత సంతోషంగా ఉంటాం. అలాగే సంఘంలో ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోవడానికి మనం ఏం చేయగలం అనే దానిమీద మనసుపెట్టగలుగుతాం.

17. సహోదరుల మీద నమ్మకాన్ని పెంచుకోవడం ఎందుకు ముఖ్యం? తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

17 సాతాను లోకంలో ఎవరూ ఎవర్నీ నమ్మలేరు. కానీ మనం మన సహోదర సహోదరీల్ని నమ్మవచ్చు. ఎందుకంటే మనం వాళ్లను ప్రేమిస్తాం, వాళ్లూ మనల్ని ప్రేమిస్తారు. అలాంటి నమ్మకం వల్ల ఇప్పుడు మనం సంతోషంగా, ఐక్యంగా ఉంటాం. అలాగే భవిష్యత్తులో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అది మనకు సహాయం చేస్తుంది. అయితే ఎవరైనా మీ నమ్మకాన్ని కోల్పోతే అప్పుడేంటి? పరిస్థితిని యెహోవా చూసినట్టు చూడడానికి ప్రయత్నించండి. బైబిలు సూత్రాల్ని పాటించండి. సహోదరుల మీద నిజమైన ప్రేమను పెంచుకోండి. అలాగే బైబిలు ఉదాహరణల నుండి నేర్చుకోండి. అలా చేస్తే బాధ నుండి బయటపడతాం, ఇతరుల మీద నమ్మకాన్ని తిరిగి పెంచుకుంటాం. అంతేకాదు, “సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే” లెక్కలేనంత మంది స్నేహితుల్ని పొందుతాం. అది నిజంగా గొప్ప దీవెన కదా! (సామె. 18:24) అయితే మనం ఇతరుల్ని నమ్మడమే కాదు, ఇతరులు కూడా మనల్ని నమ్మగలిగేలా మనం ఉండాలి. తర్వాతి ఆర్టికల్‌లో, మనం నమ్మదగిన వాళ్లమని ఎలా నిరూపించుకోవచ్చో చూస్తాం.

పాట 99 వేవేల సహోదరులు

^ మనం మన సహోదర సహోదరీల్ని నమ్మాలి. కానీ అలా చేయడం అన్నిసార్లు తేలిక కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్లు మనల్ని బాధపెట్టవచ్చు. సహోదర సహోదరీల మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి మనం పాటించాల్సిన కొన్ని బైబిలు సూత్రాల్ని, ధ్యానించాల్సిన కొందరి ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలా చేయడం వల్ల మనల్ని బాధపెట్టిన వాళ్లమీద కూడా తిరిగి నమ్మకాన్ని పెంచుకోగలుగుతాం.

^ సంఘంలో కొంతమందిని నమ్మకూడదని బైబిలు హెచ్చరిస్తుంది. (యూదా 4) కొంతమంది అబద్ధ సహోదరులు “తప్పుడు బోధలు” బోధిస్తూ మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ, అది చాలా అరుదుగా జరుగుతుంది. (అపొ. 20:30) అలాంటి వాళ్లను నమ్మకూడదని, వాళ్లు చెప్పేది వినకూడదని మనం నిర్ణయించుకోవాలి.

^ గ్రెటా అనుభవం గురించి మరిన్ని వివరాల కోసం, యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం 1974 (ఇంగ్లీష్‌), 129-131 పేజీలు చూడండి.