కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా గురించి నేర్చుకోవడం, బోధించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది

యెహోవా గురించి నేర్చుకోవడం, బోధించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది

నేను అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న ఈస్టన్‌లో పెరిగాను. నేను పెద్దపెద్ద చదువులు చదువుకొని గొప్ప స్థాయికి చేరాలనుకున్నాను. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్‌లో, సైన్స్‌లో మంచి మార్కులు వచ్చేవి. 1956 లో నల్లజాతి స్టూడెంట్స్‌ అందరిలో నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి. దాంతో ఒక పౌర హక్కుల సంస్థ 25 డాలర్లు బహుమతిగా ఇచ్చింది. కానీ తర్వాత నా లక్ష్యాలు మారిపోయాయి. ఎందుకో ఇప్పుడు చెప్తాను.

యెహోవా గురించి ఎలా నేర్చుకున్నానంటే

1940 తర్వాత, మా అమ్మానాన్నలు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు. స్టడీ ఎక్కువకాలం కొనసాగకపోయినా, కావలికోట, తేజరిల్లు! పత్రికలు మా ఇంటికి వస్తూ ఉండేవి. 1950 లో, న్యూయార్క్‌ నగరంలో ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది, దానికి మా కుటుంబమంతా వెళ్లాం.

కొన్నిరోజుల తర్వాత, లారన్స్‌ జెఫ్రీస్‌ అనే సహోదరుడు బైబిలు విషయాలు చెప్పడానికి మా ఇంటికి వచ్చేవాడు. ఆయన నాకు బైబిలు సత్యాల్ని నేర్పించడానికి ప్రయత్నించాడు. యెహోవాసాక్షులు రాజకీయాల్లో, మిలిటరీలో ఎందుకు చేరరు అని మొదట్లో వాదించేవాణ్ణి. అమెరికాలో ఉన్న ప్రతీఒక్కరూ యుద్ధం చేయకుండా ఉంటే, శత్రువులు దాడిచేసినప్పుడు దేశాన్ని ఎవరు కాపాడతారని అడిగేవాణ్ణి. అప్పుడు సహోదరుడు జెఫ్రీస్‌ ఓపిగ్గా ఇలా అడిగాడు: “అమెరికాలో ఉన్న వాళ్లందరూ యెహోవాసాక్షులై, శత్రువులు వాళ్లమీద దాడిచేస్తే యెహోవా దేవుడు ఏం చేస్తాడని నీకు అనిపిస్తుంది?” దాని గురించి, ఇంకా వేరే విషయాల గురించి ఆయన చెప్పిన మాటలు నా అభిప్రాయం తప్పని నిరూపించాయి. దాంతో బైబిలు గురించి నేర్చుకోవాలనే కోరిక నాలో పెరిగింది.

నా బాప్తిస్మం అప్పుడు

ఇంట్లో ఉన్న పాత కావలికోట, తేజరిల్లు! పత్రికల్ని చాలాసేపు చదువుతూ ఉండేవాణ్ణి. నేను నేర్చుకుంటున్నవన్నీ సత్యమేనని కొంతకాలానికి నాకు అర్థమైంది. అందుకే బ్రదర్‌ జెఫ్రీస్‌ దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకున్నాను. మీటింగ్స్‌కి కూడా క్రమంగా వెళ్లాను. నేర్చుకుంటున్న విషయాలు నాకు ఎంతగా నచ్చాయంటే నేను పబ్లిషర్‌ అయ్యాను. “యెహోవా మహారోజు దగ్గరపడింది!” అని తెలుసుకున్నప్పుడు, నా లక్ష్యాలు కూడా మారిపోయాయి. (జెఫ. 1:14) పెద్దపెద్ద చదువులు చదివే బదులు, ఇతరులకు బైబిలు సత్యాలు నేర్పించాలని నిర్ణయించుకున్నాను.

1956, జూన్‌ 13న నా స్కూలు చదువును పూర్తి చేసుకున్నాను. మూడు రోజుల తర్వాత, ఒక ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను. యెహోవా గురించి నేర్చుకుంటూ ఇతరులకు బోధించడానికి నా జీవితాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. దానివల్ల, యెహోవా నన్ను ఎంతగా దీవిస్తాడో అప్పుడు నేను అస్సలు ఊహించలేదు.

పయినీరుగా నేర్చుకుంటూ, బోధిస్తూ ఉండడం

బాప్తిస్మం తీసుకున్న ఆరు నెలలకు నేను క్రమ పయినీరు అయ్యాను. 1956, డిసెంబరు మన రాజ్య పరిచర్యలో “అవసరం ఎక్కువున్న చోట మీరు సేవచేయగలరా?” అనే ఆర్టికల్‌ వచ్చింది. ఆ ప్రశ్న నన్నే అడిగినట్టు అనిపించింది. మంచి వార్తను ప్రకటించేవాళ్లు తక్కువమంది ఉన్నచోటికి వెళ్లి సహాయం చేయాలనుకున్నాను.—మత్త. 24:14.

నేను సౌత్‌ కారోలీనాలోని ఎడ్జ్‌ఫీల్డ్‌ ప్రాంతానికి వెళ్లాను. ఆ సంఘంలో నలుగురు పబ్లిషర్స్‌ మాత్రమే ఉన్నారు. నేను వెళ్లాక ఐదుగురం అయ్యాం. మేము ఒక సహోదరుని ఇంట్లో మీటింగ్స్‌ జరుపుకునేవాళ్లం. నేను ప్రతీనెల పరిచర్యలో 100 గంటలు గడిపేవాణ్ణి. పరిచర్యలో ముందుంటూ, మీటింగ్స్‌లో ప్రసంగాలు ఇస్తూ బిజీగా ఉండేవాణ్ణి. సంఘంలో పని ఎక్కువగా చేసే కొద్దీ, యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను.

నేను ఒకామెకు బైబిలు స్టడీ ఇచ్చేవాణ్ణి. ఆమెకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న జాన్స్‌టన్‌ నగరంలో ఒక ఫ్యునరల్‌ హోమ్‌ (అంటే, చనిపోయినవాళ్లను సమాధి చేయడానికి సిద్ధం చేసే స్థలం) ఉండేది. ఆమె దయతో నాకు పార్ట్‌టైం ఉద్యోగం ఇచ్చింది. అది నాకు నిజంగా చాలా అవసరం. ఆమె మాకు మీటింగ్స్‌ జరుపుకోవడానికి ఒక చిన్న బిల్డింగ్‌ కూడా ఇచ్చింది.

నాకు స్టడీ ఇచ్చిన బ్రదర్‌ వాళ్ల అబ్బాయి, జాలీ జెఫ్రీస్‌ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ నుండి నేను ఉంటున్న ప్రాంతానికి వచ్చాడు. మేమిద్దరం కలిసి పయినీరింగ్‌ చేశాం. మేము, ఒక సహోదరుడు ఇచ్చిన చిన్న వ్యాన్‌లో ఉండేవాళ్లం.

మేము ఉంటున్న ప్రాంతంలో జీతాలు చాలా తక్కువగా ఉండేవి. రోజంతా పనిచేసినా రెండుమూడు డాలర్లే ఇచ్చేవాళ్లు. ఒకసారైతే, నా దగ్గర కొంత డబ్బే మిగిలింది. ఆ డబ్బంతా ఇచ్చేసి కొన్ని సరుకులు కొనుక్కున్నాను. అలా కొనుక్కుని షాపు నుండి బయటికి వచ్చాక, ఒకతను నా దగ్గరికి వచ్చి “నేను నీకు పని ఇస్తాను చేస్తావా? గంటకు ఒక డాలరు ఇస్తా” అన్నాడు. నేను దానికి ఒప్పుకున్నాను. ఆయన నాకు మూడురోజుల పని ఇచ్చాడు. అదేంటంటే, నిర్మాణం జరుగుతున్న ఒక స్థలాన్ని శుభ్రం చేయడం. నేను ఎడ్జ్‌ఫీల్డ్‌లో ఉండడానికి యెహోవా సహాయం చేస్తున్నాడని నాకు అప్పుడు అర్థమైంది. అంతేకాదు నా దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా, 1958 లో న్యూయార్క్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి వెళ్లగలిగాను.

మా పెళ్లి రోజున

ఆ సమావేశం రెండో రోజును నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే, ఆరోజు నేను రూబీ వాడ్లింటన్‌ అనే సహోదరిని కలిశాను. ఆమె అప్పుడు టెనెసీలోని గ్యాలటీన్‌లో క్రమ పయినీరుగా సేవచేస్తోంది. మా ఇద్దరికి మిషనరీ సేవ చేయాలనే కోరిక ఉంది కాబట్టి ఆ సమావేశంలో జరిగిన గిలియడ్‌ మీటింగ్‌కి హాజరయ్యాం. తర్వాత ఉత్తరాల ద్వారా ఒకరితో ఒకరం మాట్లాడుకునేవాళ్లం. కొంతకాలానికి, గ్యాలటీన్‌ సంఘంలో బహిరంగ ప్రసంగం ఇవ్వమని నన్ను ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్లినప్పుడు, ‘నన్ను పెళ్లిచేసుకుంటావా’ అని రూబీని అడిగాను. ఆ తర్వాత రూబీ వాళ్ల సంఘానికి మారాను. 1959 లో మేము పెళ్లిచేసుకున్నాం.

సంఘంలో నేర్చుకుంటూ, బోధిస్తూ ఉండడం

నాకు 23 ఏళ్లున్నప్పుడు, నన్ను గ్యాలటీన్‌లో కాంగ్రిగేషన్‌ సర్వెంట్‌గా (ఇప్పుడు పెద్దల సభ సమన్వయకర్త అని పిలుస్తారు) నియమించారు. కొత్తగా ప్రాంతీయ పర్యవేక్షకుడైన బ్రదర్‌ ఛార్లెస్‌ థాంప్సన్‌, మొదటిగా మా సంఘాన్నే సందర్శించాడు. ఆయనకు చాలా అనుభవం ఉంది. అయినా, సహోదరులకు ఏం అవసరమో, అంతకుముందు వచ్చిన ప్రాంతీయ పర్యవేక్షకులు వాళ్లకు ఎలా సహాయం చేశారో నన్ను అడిగి తెలుసుకునేవాడు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రశ్నలు అడగడం, వాస్తవాలన్నీ తెలుసుకోవడం మంచిదని నేను ఆయన నుండి నేర్చుకున్నాను.

1964, మేలో ఒక నెలపాటు జరిగే రాజ్య పరిచర్య పాఠశాలకు నన్ను ఆహ్వానించారు. అది న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌లో జరిగింది. ఆ పాఠశాలను నిర్వహించిన సహోదరులు యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఆయనకు మరింత దగ్గరవ్వాలి అనే కోరికను నాలో పెంచారు.

ప్రాంతీయ పర్యవేక్షకునిగా, జిల్లా పర్యవేక్షకునిగా నేర్చుకుంటూ, బోధిస్తూ ఉండడం

1965, జనవరిలో బ్రాంచి నన్ను ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించింది. నేను, రూబీ వెళ్లాల్సిన సర్క్యూట్‌ చాలా పెద్దది. టెనెసీలోని నాక్స్‌విల్‌ నుండి దాదాపు వర్జీనియాలోని రిచ్మండ్‌ వరకు మేము ప్రయాణించాలి. అంటే నార్త్‌ కారోలీనా, కెంటకీ, వెస్ట్‌ వర్జీనియాలోని సంఘాల్ని మేము సందర్శించాలి. నల్ల జాతి సహోదరులున్న సంఘాలకు మాత్రమే నేను వెళ్లేవాణ్ణి. ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చట్టాల ప్రకారం నల్ల జాతివాళ్లు, తెల్ల జాతివాళ్లతో కలవకూడదు. అక్కడున్న సహోదరులు చాలా పేదవాళ్లు. అవసరంలో ఉన్నవాళ్లతో మాకున్న వాటిని పంచుకోవడం మేము నేర్చుకున్నాం. ఎన్నో సంవత్సరాలు ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేసిన ఒక సహోదరుడు నాకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. అదేంటంటే: “సంఘానికి వెళ్లినప్పుడు ఒక బాస్‌లా కాకుండా ఒక సహోదరునిలా ఉండు. నిన్ను వాళ్లు ఒక సహోదరునిగా చూడగలిగితేనే నువ్వు వాళ్లకు సహాయం చేయగలవు.”

మేము ఒక చిన్న సంఘాన్ని సందర్శిస్తున్నప్పుడు, రూబీ ఒకామెతో బైబిలు స్టడీ మొదలుపెట్టింది. ఆమెకు ఏడాది వయసున్న ఒక పాప ఉంది. ఆ స్టడీని కొనసాగించడానికి సంఘంలో ఎవరికీ వీలు అవ్వనప్పుడు రూబీ ఉత్తరాల ద్వారా స్టడీ చేసేది. మేము మళ్లీ ఆ సంఘాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు, స్టడీ తీసుకుంటున్న ఆ స్త్రీ ప్రతీ మీటింగ్‌కి వచ్చింది. తర్వాత ఆ సంఘానికి ఇద్దరు ప్రత్యేక పయినీరు సహోదరీలు వెళ్లారు. ఆ స్టడీని వాళ్లు కొనసాగించారు. కొంతకాలానికి ఆ స్త్రీ బాప్తిస్మం తీసుకుంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత, 1995 లో ప్యాటర్‌సన్‌ బెతెల్‌లో ఉన్నప్పుడు, ఒక యువ సహోదరి రూబీ దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుంది. ఆమె ఎవరోకాదు, ఒకప్పుడు రూబీ స్టడీ ఇచ్చిన ఆ స్త్రీ కూతురు. ఆమె, తన భర్త గిలియడ్‌ పాఠశాలలోని 100వ తరగతికి హాజరయ్యారు.

మేము తర్వాత సెంట్రల్‌ ఫ్లోరిడా సర్క్యూట్‌కు వెళ్లాం. ఆ సమయానికి మాకు ఒక కారు అవసరం కాబట్టి, తక్కువ ధరకు ఒక కారు కొనుక్కున్నాం. అయితే మొదటి వారంలోనే, ఇంజన్‌లో వాటర్‌ పంప్‌ పాడైంది. దాన్ని రిపేరు చేయించడానికి మా దగ్గర డబ్బుల్లేవు. అప్పుడు నేను ఒక సహోదరునికి మా కారు రిపేరు గురించి చెప్పాను. ఆయన తన దగ్గర పనిచేసేవాళ్లతో కారును రిపేరు చేయించాడు. ఆయన రిపేరుకి డబ్బులు తీసుకోకపోగా, మాకే బహుమతిగా కొంత డబ్బులు ఇచ్చాడు. యెహోవా తన సేవకుల్ని ఎంత పట్టించుకుంటాడో, ఆ సందర్భంలో మా కళ్లారా చూశాం. మేము కూడా ఇతరులకు ఉదారంగా సహాయం చేయాలని అది మాకు గుర్తుచేసింది.

మేము ఏదైనా సంఘాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు, సహోదరుల ఇళ్లలోనే ఉండేవాళ్లం. దానివల్ల ఎంతోమంది మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాం. ఒక రోజు నేను సంఘానికి సంబంధించిన రిపోర్టును టైప్‌ చేస్తున్నాను. సగం రిపోర్టు టైప్‌ చేసి, ఆ పేపరును టైప్‌రైటర్‌లో అలాగే ఉంచి, ఏదో పనిమీద బయటికి వెళ్లాను. తిరిగి ఇంటికి వచ్చేసరికి సహోదరుని మూడేళ్ల అబ్బాయి, టైప్‌రైటర్‌లో ఏవేవో నొక్కేశాడు. దాంతో నేను మళ్లీ రిపోర్టు అంతా టైపు చేయాల్సి వచ్చింది. “నువ్వు చాలా పెద్ద సహాయం చేశావు” అని ఎన్నో సంవత్సరాలు ఆ అబ్బాయిని ఆటపట్టించాను.

1971 లో, న్యూయార్క్‌ నగరంలో జిల్లా పర్యవేక్షకునిగా సేవచేసే నియామకాన్ని పొందాను. ఆ నియామకాన్ని పొందుతానని అస్సలు ఊహించలేదు. అప్పటికి, నాకు కేవలం 34 ఏళ్లే. నేను ఆ ప్రాంతానికి వెళ్లిన మొట్టమొదటి నల్లజాతి జిల్లా పర్యవేక్షకుణ్ణి. సహోదరులు నన్ను ఎంతో ప్రేమగా ఆహ్వానించారు.

జిల్లా పర్యవేక్షకునిగా, ప్రతీవారం జరిగే ప్రాంతీయ సమావేశానికి హాజరై, యెహోవా గురించి బోధించే అవకాశాన్ని నేను ఎంతో ఆనందించాను. చాలామంది ప్రాంతీయ పర్యవేక్షకులకు నాకన్నా ఎక్కువ అనుభవం ఉంది. వాళ్లలో ఒకరు నా బాప్తిస్మ ప్రసంగం ఇచ్చారు. ఇంకో సహోదరుడేమో, బ్రదర్‌ థియోడోర్‌ జారస్‌. ఆయన ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా సేవచేశాడు. అంతేకాదు, బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవ చేస్తున్న ఎంతోమంది అనుభవం గల సహోదరులతో కలిసి నేను పనిచేశాను. అక్కడి ప్రాంతీయ పర్యవేక్షకులు, బెతెల్‌ సభ్యులు నేను ఏమాత్రం ఇబ్బంది పడకుండా చాలా సహాయం చేశారు. నేను వాళ్లను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రేమగల ఈ కాపరులు దేవుని వాక్యం మీద ఎంత ఆధారపడే వాళ్లో, ఆయన సంస్థకు ఎంత నమ్మకంగా మద్దతు ఇచ్చే వాళ్లో నేను కళ్లారా చూశాను. వాళ్లు వినయాన్ని చూపించారు కాబట్టి, జిల్లా పర్యవేక్షకునిగా సేవచేయడం నాకు సులువైంది.

తిరిగి ప్రాంతీయ పర్యవేక్షకునిగా ...

1974 లో, పరిపాలక సభ ఇంకొంతమంది ప్రాంతీయ పర్యవేక్షకుల్ని జిల్లా పర్యవేక్షకులుగా నియమించింది. అప్పుడు నన్ను తిరిగి ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. ఈసారి నేను సేవ చేసే ప్రాంతం, సౌత్‌ కారోలీనా. అయితే ఈ సమయానికి నల్ల జాతివాళ్లు, తెల్ల జాతివాళ్లు వేర్వేరుగా ఉండాలి అనే నియమం తీసేయబడింది. దాంతో సంఘాల్లో, సర్క్యూట్‌లలో సహోదరులందరూ సంతోషంగా కలుసుకునేవాళ్లు.

1976 చివర్లో అట్లాంటా, కొలంబస్‌ ప్రాంతాల మధ్య ఉండే జార్జియా సర్క్యూట్‌లో సేవ చేసే నియామకాన్ని పొందాను. అక్కడ నేను ఇచ్చిన ఒక ఫ్యునరల్‌ టాక్‌ ఇప్పటికీ గుర్తుంది. అక్కడ కొందరు, ఒక నల్ల జాతి సహోదరుడు ఉంటున్న ఇంటిని తగలబెట్టారు. అప్పుడు ఆయన ఐదుగురు పిల్లలు చనిపోయారు. ఆయన భార్య గాయాలతో హాస్పిటల్‌లో ఉంది. ఆయన్ని, ఆయన భార్యను ఓదార్చడానికి నల్ల జాతి సహోదరులు, తెల్ల జాతి సహోదరులు హాస్పిటల్‌కు వస్తూనే ఉన్నారు. ఆ సమయంలో వాళ్లమీద సహోదరులు చూపించిన ప్రేమ సాటిలేనిది. అలా సహోదర సహోదరీలు ఒకరిమీద ఒకరు కనికరాన్ని చూపించుకున్నప్పుడు, ఎంత పెద్ద కష్టాన్నైనా సహించగలరు.

బెతెల్‌లో నేర్చుకుంటూ, బోధిస్తూ ఉండడం

1977 లో, ఒక ప్రాజెక్టు కోసం మమ్మల్ని కొన్ని నెలలపాటు బ్రూక్లిన్‌ బెతెల్‌కు రమ్మన్నారు. ఆ ప్రాజెక్టు దాదాపు పూర్తి అవుతున్నప్పుడు, ఇద్దరు పరిపాలక సభ సభ్యులు నన్ను కలిసి బెతెల్‌ సేవలో ఉండిపోవడం మాకు ఇష్టమేనా అని అడిగారు. దానికి సంతోషంగా ఒప్పుకున్నాం.

నేను సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌లో 24 సంవత్సరాలు పనిచేశాను. ఆ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సహోదరులు చాలా కష్టమైన ప్రశ్నలకు జవాబులు ఇస్తుంటారు. ఎన్నో సంవత్సరాలుగా పరిపాలక సభ బైబిలు సూత్రాల ఆధారంగా నిర్దేశాలు ఇస్తూ ఉంది. వాటి ఆధారంగానే సహోదరులు ఆ ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. అంతేకాదు ప్రాంతీయ పర్యవేక్షకులకు, పెద్దలకు, పయినీర్లకు వాటి ఆధారంగానే శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ వల్ల చాలామంది సహోదర సహోదరీలు పరిణతి సాధించారు. దాంతో యెహోవా సంస్థ చక్కగా ముందుకెళ్తోంది.

1995 నుండి 2018 వరకు, ప్రపంచ ప్రధాన కార్యాలయ ప్రతినిధిగా (అప్పట్లో జోన్‌ ఓవర్‌సీర్‌ అని పిలిచేవాళ్లు) చాలా బ్రాంచీలకు వెళ్లాను. బ్రాంచి కమిటీ సభ్యుల్ని, బెతెల్‌ సభ్యుల్ని, మిషనరీల్ని కలిసి వాళ్లను ప్రోత్సహించేవాణ్ణి. వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని సహాయం చేయడానికి ప్రయత్నించేవాణ్ణి. వాళ్ల అనుభవాలు విన్నప్పుడు నేను, రూబీ ఎంతో ప్రోత్సాహం పొందాం. ఉదాహరణకు 2000 సంవత్సరంలో మేము రువాండాకు వెళ్లాం. అక్కడి సహోదరులు, బెతెల్‌ కుటుంబ సభ్యులు 1994 లో జరిగిన ‘జాతి నిర్మూలన దాడుల్ని’ ఎలా సహించారో విన్నప్పుడు మా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వాళ్లలో చాలామంది తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. అన్ని హింసలు ఎదుర్కొన్నా వాళ్లు ఆశ వదులుకోకుండా, విశ్వాసం చూపిస్తూ సంతోషంగా ఉన్నారు.

మా పెళ్లయి, 50 సంవత్సరాలు పూర్తయినప్పుడు

మా ఇద్దరికీ ఇప్పుడు 80 ఏళ్లు దాటాయి. గత 20 ఏళ్లుగా, నేను అమెరికా బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తున్నాను. నేను ఎప్పుడూ యూనివర్సిటీకి వెళ్లి చదువుకోలేదు; కానీ అంతకంటే గొప్ప విద్యను యెహోవా నుండి, ఆయన సంస్థ నుండి నేర్చుకున్నాను. దానివల్ల ఎప్పటికీ ఉపయోగపడే బైబిలు సత్యాల్ని ఇతరులకు బోధించగలిగాను. (2 కొరిం. 3:5; 2 తిమో. 2:2) బైబిలు సత్యాల వల్ల ప్రజలు తమ జీవితంలో మార్పులు చేసుకుని, తమ సృష్టికర్తకు స్నేహితులు అవ్వడాన్ని నేను చూశాను. (యాకో. 4:8) యెహోవా గురించి నేర్చుకుంటూ, బైబిలు సత్యాల్ని ఇతరులకు బోధించే అవకాశాన్ని విలువైనదిగా చూడమని సహోదర సహోదరీల్ని నేను, రూబీ ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటాం. యెహోవా సేవకులకు అంతకన్నా గొప్ప ఆనందం ఏముంటుంది!