కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 40

నీతిమంతులయ్యేలా చాలామందికి సహాయం దొరుకుతుంది

నీతిమంతులయ్యేలా చాలామందికి సహాయం దొరుకుతుంది

“నీతిమంతులయ్యేలా చాలామందికి సహాయం చేసేవాళ్లు నక్షత్రాల్లా యుగయుగాలు మెరుస్తారు.”దాని. 12:3.

పాట 151 ఆయన పిలుస్తాడు

ఈ ఆర్టికల్‌లో. . . *

1. వెయ్యేళ్ల పరిపాలన సమయంలో ఎలాంటి సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి?

 క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనలో, ఈ భూమ్మీద పునరుత్థానం మొదలయ్యే రోజు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! చనిపోయిన తమ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని మళ్లీ చూడాలని అందరూ కోరుకుంటారు. వాళ్లను మళ్లీ చూడాలని యెహోవా కూడా కోరుకుంటున్నాడు. (యోబు 14:15) పునరుత్థానమైన వాళ్లను కలుసుకున్నప్పుడు, భూమ్మీద ప్రతీఒక్కరు ఎంత ఆనందంగా ఉంటారో ఊహించండి. మనం ముందటి ఆర్టికల్‌లో తెలుసుకున్నట్టు, జీవగ్రంథంలో పేర్లు రాయబడిన “నీతిమంతులు” “జీవించడానికి బ్రతికించబడతారు.” (అపొ. 24:15; యోహా. 5:29) బహుశా చనిపోయిన మన కుటుంబ సభ్యుల్లో, స్నేహితుల్లో చాలామంది హార్‌మెగిద్దోన్‌ ముగిసిన కొంతకాలానికే ఈ భూమ్మీద పునరుత్థానం అవ్వవచ్చు. * అంతేకాదు చనిపోవడానికి ముందు యెహోవా గురించి తెలుసుకునే అవకాశం దొరకని, ఆయన్ని సేవించని “అనీతిమంతులు” “తీర్పు పొందడానికి బ్రతికించబడతారు.”

2-3. (ఎ) యెషయా 11:9, 10 ప్రకారం, భూమ్మీద ముందెన్నడూ జరగని గొప్ప బోధనా పనిలో ఏం నేర్పిస్తారు? ఎందుకు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏం తెలుసుకుంటాం?

2 పునరుత్థానమైన వాళ్లందరూ చాలా విషయాలు నేర్చుకోవాలి. (యెష. 26:9; 61:11) కాబట్టి భూమ్మీద ముందెన్నడూ జరగని ఒక గొప్ప బోధనా పని మొదలవ్వాలి. (యెషయా 11:9, 10 చదవండి.) పునరుత్థానమైన అనీతిమంతులు యేసుక్రీస్తు, దేవుని రాజ్యం, విమోచన క్రయధనం గురించి, అలాగే యెహోవా పేరు, సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశం గురించి నేర్చుకోవాలి. పునరుత్థానమైన నీతిమంతులు కూడా, భూమి విషయంలో తన సంకల్పం గురించి యెహోవా క్రమక్రమంగా తెలియజేసిన విషయాల్ని నేర్చుకోవాలి. ఈ నమ్మకమైన వాళ్లలో చాలామంది బైబిలు రాయడం పూర్తికాకముందే చనిపోయారు. నిజంగానే అనీతిమంతులు, నీతిమంతులు చాలా విషయాలు నేర్చుకోవాలి.

3 ఈ ఆర్టికల్‌లో మనం కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: ఈ గొప్ప బోధనా పని ఎలా జరుగుతుంది? ఈ గొప్ప బోధనా పనికి ప్రజలు చక్కగా స్పందిస్తే ఏమౌతుంది? వాళ్లు దాన్ని ఇష్టపడకపోతే ఏమౌతుంది? ఈ ప్రశ్నలకు మనం జవాబులు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. దానియేలు, ప్రకటన పుస్తకాల్లోని కొన్ని ఆసక్తికరమైన ప్రవచనాల్ని పరిశీలిస్తూ, చనిపోయినవాళ్లు పునరుత్థానం అయినప్పుడు ఏం జరుగుతుందనే విషయంలో, మన అవగాహనలో వచ్చిన మార్పును ఇప్పుడు చూద్దాం. మొదటిగా, దానియేలు 12:1, 2 ముందే చెప్పిన ఆసక్తికరమైన సంఘటనల్ని పరిశీలిద్దాం.

“చనిపోయిన చాలామంది లేస్తారు”

4-5. అంత్యకాలం గురించి దానియేలు 12:1 ఏం చెప్తుంది?

4 దానియేలు 12:1 చదవండి. అంత్యకాలంలో జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనల్ని, దానియేలు పుస్తకం ఒక వరుస ప్రకారం వివరిస్తుంది. ఉదాహరణకు, మిఖాయేలు అంటే యేసుక్రీస్తు “[దేవుని] ప్రజల పక్షాన నిలబడుతూ” ఉంటాడని దానియేలు 12:1 చెప్తుంది. ఈ మాట యేసు 1914 లో పరలోక రాజ్యానికి రాజైనప్పుడు నెరవేరడం మొదలైంది.

5 అయితే దానియేలు ఇంకో విషయం కూడా రాశాడు. “జనాలు ఏర్పడినప్పటి నుండి అప్పటివరకు కలగని శ్రమల కాలం వస్తుంది” అని, ఆ కాలంలో యేసు “నిలబడతాడు” అని దానియేలు రాశాడు. ఈ “శ్రమల కాలం” మత్తయి 24:21 లో చెప్తున్న “మహాశ్రమ” రెండూ ఒకటే. ఈ శ్రమల కాలం చివర్లో, అంటే హార్‌మెగిద్దోన్‌లో దేవుని ప్రజల పక్షాన యేసు నిలబడతాడు లేదా వాళ్లను కాపాడడానికి చర్య తీసుకుంటాడు. ప్రకటన పుస్తకం ఈ దేవుని ప్రజల గుంపును, “మహాశ్రమను దాటి వచ్చే” గొప్పసమూహం అని పిలుస్తుంది.—ప్రక. 7:9, 14.

6. గొప్పసమూహం మహాశ్రమను దాటిన తర్వాత ఏం జరుగుతుంది? వివరించండి. (ఈ పత్రికలో, భూమ్మీద జరగబోయే పునరుత్థానం గురించి వివరించే “పాఠకుల ప్రశ్న” కూడా చూడండి.)

6 దానియేలు 12:2, అధస్సూచి చదవండి. గొప్పసమూహం మహాశ్రమను దాటిన తర్వాత ఏం జరుగుతుంది? “మట్టిలో నిద్రిస్తున్న చాలామంది లేస్తారు” అని ఆ వచనం చెప్తుంది. అది 1918 లో వ్యతిరేకులు మన ప్రకటనా పనిని దాదాపు ఆపేసిన తర్వాత, ఆ పని మళ్లీ ఎక్కువ అవ్వడం గురించి మాట్లాడుతుందని మనం ఇదివరకు అనుకున్నాం. * అయితే ఈ ప్రవచనం కొత్తలోకంలో జరిగే పునరుత్థానం గురించి మాట్లాడుతుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు అంటే, దానియేలు 12:2 లో ఉన్న “మట్టి” అనే పదం యోబు 17:16 లో కూడా ఉపయోగించబడింది. ఆ వచనం “మట్టి” అనే పదానికి “సమాధి” అనే అర్థం ఉందని చెప్పింది. కాబట్టి దానియేలు 12:2, హార్‌మెగిద్దోన్‌ పూర్తయిన తర్వాత జరిగే పునరుత్థానం గురించే మాట్లాడుతుందని చెప్పవచ్చు.

7. (ఎ) “కొంతమంది శాశ్వత జీవితం కోసం లేస్తారు” అంటే ఏంటి? (బి) ఇది “మెరుగైన పునరుత్థానం” అని ఎందుకు చెప్పవచ్చు?

7 దానియేలు 12:2 “కొంతమంది శాశ్వత జీవితం కోసం లేస్తారు” అని చెప్తుంది. దానర్థం ఏంటి? వెయ్యేళ్లలో పునరుత్థానం అయినవాళ్లు యెహోవా గురించి, యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటూ వాళ్లకు లోబడినప్పుడు చివరికి శాశ్వత జీవితం పొందుతారని అర్థం. (యోహా. 17:3) ఇది భూమ్మీద ఇంతకుముందు జరిగిన పునరుత్థానాల కన్నా “మెరుగైన పునరుత్థానం” అని చెప్పవచ్చు. (హెబ్రీ. 11:35) ఎందుకంటే, ఇంతకుముందు పునరుత్థానమైన అపరిపూర్ణ మనుషులు మళ్లీ చనిపోయారు.

8. కొంతమంది “నిందలపాలు కావడం కోసం, శాశ్వత తిరస్కారానికి గురవ్వడం కోసం లేస్తారు” అంటే ఏంటి?

8 అయితే పునరుత్థానం అయిన వాళ్లలో ప్రతీఒక్కరు యెహోవా ఏర్పాటు చేసిన బోధనా పనిని ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే, కొంతమంది “నిందలపాలు కావడం కోసం, శాశ్వత తిరస్కారానికి గురవ్వడం కోసం లేస్తారు” అని కూడా దానియేలు ప్రవచనం చెప్తుంది. వాళ్లు దేవుని ప్రమాణాల్ని పాటించడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ల పేర్లు జీవగ్రంథంలో రాయబడవు. వాళ్లు శాశ్వత జీవితం పొందరు, బదులుగా “శాశ్వత తిరస్కారాన్ని” లేదా నాశనాన్ని పొందుతారు. కాబట్టి దానియేలు 12:2, పునరుత్థానమైన వాళ్లందరూ చివరికి ఏం పొందుతారో చెప్తుంది. అది పునరుత్థానమైన తర్వాత వాళ్లు ఏం చేస్తారు అనే దానిపై ఆధారపడుతుంది. * (ప్రక. 20:12) కొంతమంది శాశ్వత జీవితాన్ని పొందుతారు, కొంతమంది పొందరు.

నీతిమంతులయ్యేలా చాలామందికి సహాయం దొరుకుతుంది

9-10. దానియేలు 12:3 ప్రకారం, మహాశ్రమ తర్వాత ఇంకా ఏం జరుగుతుంది? ‘ఆకాశ విశాలంలా ప్రకాశవంతంగా మెరిసేవాళ్లు’ ఎవరు?

9 దానియేలు 12:3 చదవండి. “శ్రమల కాలం” ముగిసిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది? దానియేలు 12:2 తో పాటు 3వ వచనం కూడా మహాశ్రమ తర్వాత జరిగే ఒక సంఘటన గురించి మాట్లాడుతుంది.

10 ‘ఆకాశ విశాలంలా ప్రకాశవంతంగా మెరిసేవాళ్లు’ ఎవరు? దానికి జవాబు తెలుసుకోవడానికి మత్తయి 13:43 లో ఉన్న యేసు మాటలు సహాయం చేస్తాయి. అక్కడ ఇలా ఉంది: “ఆ కాలంలో నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా తేజోవంతంగా ప్రకాశిస్తారు.” ఈ సందర్భంలో యేసు “రాజ్య కుమారుల” గురించి, అంటే పరలోక రాజ్యంలో తనతో కలిసి పరిపాలించే అభిషిక్త సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు. (మత్త. 13:38) కాబట్టి దానియేలు 12:3 అభిషిక్త క్రైస్తవుల గురించి, వెయ్యేళ్ల పరిపాలనలో వాళ్లు చేసేపని గురించి మాట్లాడుతుందని స్పష్టమౌతుంది.

వెయ్యేళ్లలో భూమ్మీద జరిగే బోధనా పనిని చూసుకునే విషయంలో 1,44,000 మంది యేసుక్రీస్తుతో కలిసి పనిచేస్తారు (11వ పేరా చూడండి)

11-12. వెయ్యేళ్ల పరిపాలనలో 1,44,000 మంది ఏం చేస్తారు?

11 అభిషిక్త క్రైస్తవులు “నీతిమంతులయ్యేలా చాలామందికి” ఎలా సహాయం చేస్తారు? వెయ్యేళ్లలో భూమ్మీద జరిగే బోధనా పనిని చూసుకునే విషయంలో అభిషిక్త క్రైస్తవులు యేసుక్రీస్తుతో కలిసి పనిచేస్తారు. ఈ 1,44,000 మంది రాజులుగా పరిపాలించడమే కాదు, యాజకులుగా కూడా సేవచేస్తారు. (ప్రక. 1:6; 5:10; 20:6) కాబట్టి ‘దేశాల్ని స్వస్థపర్చే’ పనిలో, అంటే మనుషులందర్నీ క్రమక్రమంగా పరిపూర్ణులుగా చేసేపనిలో వాళ్లు యేసుకు సహాయం చేస్తారు. (ప్రక. 22:1, 2; యెహె. 47:12) ఆ పని చేస్తున్నప్పుడు అభిషిక్త క్రైస్తవులకు ఎంత సంతోషంగా ఉంటుందో కదా!

12 నీతిమంతులయ్యే ‘చాలామందిలో’ ఎవరెవరు ఉంటారు? పునరుత్థానం అయినవాళ్లు, హార్‌మెగిద్దోన్‌ను దాటినవాళ్లు అలాగే కొత్తలోకంలో పుట్టే పిల్లలు ఉంటారు. వెయ్యేళ్ల చివరికల్లా భూమ్మీదున్న వాళ్లందరూ పరిపూర్ణులు అయిపోతారు. మరి జీవగ్రంథంలో వాళ్ల పేర్లు పెన్సిల్‌తో రాసినట్టుగా కాకుండా, ఎప్పటికీ ఉండిపోయేలా ఒక విధంగా పెన్‌తో ఎప్పుడు రాయబడతాయి?

చివరి పరీక్ష

13-14. శాశ్వత జీవితం పొందాలంటే భూమ్మీద ఉన్న పరిపూర్ణులందరూ ఏం చేయాలి?

13 మనుషులు పరిపూర్ణులు అయ్యారంటే, వాళ్లకు శాశ్వత జీవితం దొరికినట్టే అని మనం అనుకోకూడదు. ఆదాముహవ్వల గురించి ఆలోచించండి. యెహోవా వాళ్లను పరిపూర్ణులుగా సృష్టించాడు. అయితే శాశ్వత జీవితం పొందాలంటే, వాళ్లు ఆయనకు లోబడాలి. కానీ విచారకరంగా వాళ్లు ఆయనకు లోబడలేదు.—రోమా. 5:12.

14 మరి వెయ్యేళ్ల చివర్లో భూమ్మీద ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటి? అప్పటికి వాళ్లందరూ పరిపూర్ణులు అవుతారు. పరిపూర్ణులైన ఆ ప్రజలందరూ యెహోవా పరిపాలనకు పూర్తిగా మద్దతిస్తారా? లేదా వాళ్లలో కొంతమంది ఆదాముహవ్వల్లా పరిపూర్ణులు అయినప్పటికీ, దేవునికి లోబడకుండా ఉంటారా? ఆ ప్రశ్నలకు జవాబులు ఎలా తెలుస్తాయి?

15-16. (ఎ) యెహోవా వైపు ఉంటారా లేదా అని నిరూపించుకునే అవకాశం మనుషులందరికీ ఎప్పుడు దొరుకుతుంది? (బి) ఆ చివరి పరీక్షలో ఏం జరుగుతుంది?

15 సాతాను వెయ్యేళ్ల పాటు బంధించబడతాడు. ఆ సమయంలో అతను ఎవ్వర్నీ తప్పుదారి పట్టించలేడు. అయితే వెయ్యేళ్లు పూర్తవ్వగానే, సాతాను చెరలో నుండి విడుదల చేయబడతాడు. అప్పుడు అతను పరిపూర్ణులైన మనుషుల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు. ఆ చివరి పరీక్షలో దేవుని పేరు, ఆయన సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశం విషయంలో ఎవరి వైపు ఉంటారో నిరూపించుకునే అవకాశం, భూమ్మీద ఉన్న పరిపూర్ణులందరికీ దొరుకుతుంది. (ప్రక. 20:7-10) ఆ సమయంలో వాళ్లు ఏం చేస్తారు అనేదాన్ని బట్టి, వాళ్ల పేర్లు ఎప్పటికీ ఉండిపోయేలా జీవగ్రంథంలో రాయబడాలా లేదా అనేది నిర్ణయించబడుతుంది.

16 కొంతమంది ఆదాముహవ్వల్లా యెహోవాకు లోబడకుండా, ఆయన పరిపాలనను వద్దనుకుంటారని బైబిలు చెప్తుంది. వాళ్లకు ఏం జరుగుతుంది? ప్రకటన 20:15 ఇలా చెప్తుంది: “ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో లేవో వాళ్లు అగ్ని సరస్సులో పడేయబడ్డారు.” అవును, దేవుని పరిపాలనకు ఎదురుతిరిగేవాళ్లు శాశ్వతంగా నాశనమౌతారు. కానీ పరిపూర్ణులైన మనుషుల్లో చాలామంది ఆ చివరి పరీక్షలో యెహోవా వైపు ఉంటారు. అప్పుడు వాళ్ల పేర్లు జీవగ్రంథంలో ఎప్పటికీ ఉండిపోయేలా ఒక విధంగా పెన్‌తో రాయబడతాయి.

అంత్యకాలంలో

17. మన కాలంలో ఏం జరుగుతుందని దేవదూత దానియేలుకు చెప్పాడు? (దానియేలు 12:4, 8-10)

17 భవిష్యత్తులో జరగబోయే ఈ సంఘటనల గురించి ఆలోచించడం ఎంత ఆసక్తికరంగా ఉందో కదా! అయితే మన కాలం గురించి అంటే “అంత్యకాలం” గురించి దేవదూత దానియేలుకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. (దానియేలు 12:4, 8-10 చదవండి; 2 తిమో. 3:1-5) దేవదూత దానియేలుకు ఇలా చెప్పాడు: “నిజమైన జ్ఞానం ఎక్కువౌతుంది.” అవును, దానియేలు పుస్తకంలోని మాటల్ని దేవుని ప్రజలు మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో “చెడ్డవాళ్లు చెడ్డపనులు చేస్తారు, చెడ్డవాళ్లలో ఎవ్వరూ ఈ మాటల్ని అర్థం చేసుకోలేరు” అని కూడా దేవదూత చెప్పాడు.

18. త్వరలో చెడ్డవాళ్లకు ఏం జరుగుతుంది?

18 ఈరోజుల్లో, చెడ్డపనులు చేసేవాళ్లకు శిక్ష పడట్లేదని మనకు అనిపించవచ్చు. (మలా. 3:14, 15) కానీ త్వరలోనే, యేసు మేకల్లాంటి చెడ్డవాళ్లకు తీర్పు తీర్చి, వాళ్లను గొర్రెల్లాంటి వాళ్లనుండి వేరుచేస్తాడు. (మత్త. 25:31-33) ఈ చెడ్డవాళ్లు మహాశ్రమను తప్పించుకోలేరు, కొత్తలోకంలో పునరుత్థానం కూడా అవ్వరు. మలాకీ 3:16 చెప్తున్న ‘జ్ఞాపకార్థ గ్రంథంలో’ వాళ్ల పేర్లు ఉండవు.

19. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు? (మలాకీ 3:16-18)

19 మనం అలాంటి చెడ్డవాళ్లం కాదు అని నిరూపించుకునే సమయం ఇదే. (మలాకీ 3:16-18 చదవండి.) యెహోవా, తాను “ప్రత్యేకమైన సొత్తుగా” లేదా “విలువైన సంపదగా” చూసే వాళ్లందర్నీ సమకూరుస్తున్నాడు. వాళ్లలో మనమూ ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటాం.

కొత్తలోకంలో దానియేలు, మన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇంకా ఎంతోమంది తమ వంతు కోసం ‘నిలబడడం’ చూసినప్పుడు మనకు ఎంత సంతోషంగా ఉంటుందో కదా! (20వ పేరా చూడండి)

20. యెహోవా చివరిగా దానియేలుకు ఏమని మాటిచ్చాడు? అది నెరవేరే రోజు కోసం మీరు ఎందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?

20 నిజంగా, మనం చాలా ఆసక్తికరమైన సమయంలో జీవిస్తున్నాం. అయితే భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన విషయాల్ని చూస్తాం. త్వరలో చెడ్డ వాళ్లందరూ నాశనమవ్వడం చూస్తాం. ఆ తర్వాత, దానియేలుకు యెహోవా ఇచ్చిన ఈ మాట నెరవేరడం చూస్తాం: “రోజుల చివర్లో నీ వంతు కోసం నిలబడతావు.” (దాని. 12:13) దానియేలు అలాగే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ‘నిలబడే’ రోజు లేదా పునరుత్థానం అయ్యే రోజు కోసం మీరు ఎదురుచూస్తున్నారా? అయితే, దేవునికి నమ్మకంగా ఉండడానికి ఇప్పుడు మీరు చేయగలిగినదంతా చేయండి. అలా చేస్తే, మీ పేరు జీవగ్రంథంలో ఎప్పటికీ ఉండిపోతుంది అనే నమ్మకంతో ఉండవచ్చు.

పాట 80 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి

^ దానియేలు 12:2, 3 చెప్తున్న గొప్ప బోధనా పని గురించి మన అవగాహనలో వచ్చిన మార్పును ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ఈ పని ఎప్పుడు జరుగుతుందో, దానిలో ఎవరు పాల్గొంటారో కూడా చూస్తాం. వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో జరిగే చివరి పరీక్షకు, భూమ్మీద ఉన్నవాళ్లను ఈ బోధనా పని ఎలా సిద్ధం చేస్తుందో కూడా పరిశీలిస్తాం.

^ చివరి రోజుల్లో నమ్మకంగా జీవించి చనిపోయినవాళ్లు బహుశా ముందు పునరుత్థానం అవ్వవచ్చు. తర్వాత వాళ్ల ముందటి తరంవాళ్లు, ఆ తర్వాత ఇంకాస్త ముందటి తరంవాళ్లు పునరుత్థానం అవుతుండవచ్చు. ఒకవేళ అదే నిజమైతే, ప్రతీ తరం వాళ్లకు తమకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవాళ్లను ఆహ్వానించే అవకాశం దొరుకుతుంది. అది ఏ క్రమంలో జరిగినా సరే మనం ఒక విషయం గుర్తుంచుకోవచ్చు. అదేంటంటే, పరలోకంలో పునరుత్థానం అయ్యే ప్రతీఒక్కరు “తమతమ వరుసలో బ్రతికించబడతారు” అని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి భూమ్మీద జరిగే పునరుత్థానం కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని చెప్పవచ్చు.—1 కొరిం. 14:33; 15:23.

^ ఈ వివరణ దానియేలు ప్రవచనానికి అవధానం ఇవ్వండి! (ఇంగ్లీష్‌) 17వ అధ్యాయంలో, అలాగే 1987 జూలై 1 కావలికోట (ఇంగ్లీష్‌) 21-25 పేజీల్లో ఉన్న మన అవగాహనలో వచ్చిన మార్పు.

^ దీనికి భిన్నంగా అపొస్తలుల కార్యాలు 24:15 లోని “నీతిమంతులు, అనీతిమంతులు” అనే మాటలు అలాగే యోహాను 5:29 లోని “మంచిపనులు చేసినవాళ్లు,” “అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు” అనే మాటలు, ప్రజలు చనిపోకముందు చేసిన పనుల గురించి చెప్తున్నాయి.