కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 1

దేవుని వాక్యం సత్యం అనే నమ్మకంతో ఉండండి

దేవుని వాక్యం సత్యం అనే నమ్మకంతో ఉండండి

2023 వార్షిక వచనం: “నీ వాక్య సారం సత్యం.”కీర్త. 119:160.

పాట 96 దేవుడిచ్చిన గ్రంథం ఒక నిధి

ఈ ఆర్టికల్‌లో . . . a

1. ఈ రోజుల్లో చాలామంది బైబిల్ని ఎందుకు నమ్మట్లేదు?

 ఈ రోజుల్లో చాలామందికి ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలియట్లేదు. ‘రాజకీయ నాయకులు, సైంటిస్ట్‌లు, వ్యాపారవేత్తలు నిజంగా మన మంచి కోరుకుంటున్నారా?’ అని ప్రజలు సందేహిస్తున్నారు. అంతేకాదు ప్రజలకు క్రైస్తవ మతనాయకుల మీద గౌరవం పోయింది. అందుకే వాళ్లు బోధిస్తున్న బైబిల్ని కూడా ప్రజలు నమ్మట్లేదు.

2. కీర్తన 119:160 ప్రకారం, మనం ఏ విషయాన్ని పూర్తిగా నమ్ముతాం?

2 దేవుడు “సత్యవంతుడు,” ఆయన ఎప్పుడూ మన మంచి కోరుకుంటాడు అని యెహోవా సేవకులందరూ పూర్తిగా నమ్ముతారు. (కీర్త. 31:5; యెష. 48:17) “[దేవుని] వాక్య సారం సత్యం” b కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతీ మాట నిజమని మనం నమ్ముతాం. (కీర్తన 119:160 చదవండి.) ఒక బైబిలు పండితుడు రాసిన ఈ మాటల్ని మనం ఒప్పుకుంటాం: “దేవుడు చెప్పేదేదీ అబద్ధం కాదు లేదా ఆయన చెప్పినవి జరగకపోవడం అంటూ ఉండదు. దేవుని ప్రజలు ఆయన్ని నమ్ముతారు కాబట్టి, ఆయన చెప్పే మాటల్ని కూడా నమ్ముతారు.”

3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?

3 మనలాగే దేవుని వాక్యాన్ని నమ్మేలా ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు? బైబిల్ని నమ్మడానికి గల మూడు కారణాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. అవేంటంటే: బైబిలు సందేశం మారకపోవడం, బైబిలు ప్రవచనాలు నెరవేరడం, ప్రజల జీవితాల్ని బైబిలు మార్చడం.

బైబిలు సందేశం మారలేదు

4. బైబిల్లోని విషయాల్ని కొంతమంది ఎందుకు సందేహిస్తారు?

4 నమ్మకమైన 40 మందిని ఉపయోగించి యెహోవా బైబిల్ని రాయించాడు. అయితే వాళ్లు మొదట్లో రాసిన అసలు రాతప్రతులేవీ ఇప్పుడు లేవు. c వాటి నకళ్లు మాత్రమే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ‘ఇప్పుడు మన బైబిల్లో ఉన్నవి మొదట్లో వాళ్లు రాసినట్టే ఉన్నాయా?’ అని కొంతమంది సందేహిస్తారు. మరి బైబిల్లోని సందేశం మారలేదని మనం ఎలా చెప్పవచ్చు?

నకలు రాయడంలో నైపుణ్యం ఉన్నవాళ్లు హీబ్రూ లేఖనాల్ని ఉన్నదున్నట్టుగా, చాలా జాగ్రత్తగా నకలు చేశారు (5వ పేరా చూడండి)

5. హీబ్రూ లేఖనాల్ని ఎలా నకలు రాసేవాళ్లు? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

5 బైబిల్లోని సందేశాన్ని తర్వాతి తరాల వాళ్లకు అందజేయడానికి దాని నకళ్లు తయారుచేసుకోమని యెహోవా చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని తీసుకుని దాన్ని తమ కోసం నకలు రాసుకోవాలని యెహోవా ఇశ్రాయేలు రాజులకు చెప్పాడు. అలాగే ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించడానికి లేవీయుల్ని నియమించాడు. (ద్వితీ. 17:18; 31:24-26; నెహె. 8:7) యూదులు బబులోను చెర నుండి తిరిగొచ్చిన తర్వాత నకలు రాయడంలో నైపుణ్యం ఉన్న కొంతమంది, హీబ్రూ లేఖనాల్ని నకలు రాయడం మొదలుపెట్టి ఎన్నో కాపీల్ని తయారుచేశారు. (ఎజ్రా 7:6, అధస్సూచి) వాళ్లు ఆ పనిని చాలా జాగ్రత్తగా చేశారు. వాళ్లు సరిగ్గా నకలు చేశారో లేదో చూసుకోడానికి పదాల్ని లెక్కపెట్టేవాళ్లు. తర్వాత్తర్వాత అక్షరాల్ని కూడా లెక్కపెట్టడం మొదలుపెట్టారు. అయితే, వాళ్లు కూడా మనుషులే కాబట్టి చిన్నచిన్న తప్పులు దొర్లాయి. కానీ చాలా నకళ్లు రాశారు కాబట్టి, ఆ చిన్నచిన్న తప్పుల్ని కనిపెట్టడం సాధ్యమైంది. ఎలా?

6. బైబిలు నకళ్లలో తప్పుల్ని ఎలా కనిపెట్టవచ్చు?

6 బైబిలు నకళ్లలోని తప్పుల్ని కనిపెట్టడానికి ఆధునిక పండితులు ఒక మంచి పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ ఉదాహరణను పరిశీలించండి: ఒక పేజీని వందమంది నకలు రాశారు అనుకోండి. వాళ్లలో ఒకరు రాసిన నకలులో చిన్న తప్పు వచ్చింది. ఆ తప్పును ఎలా కనిపెట్టవచ్చు? అతను రాసిన నకలును ఇతరులు రాసిన నకళ్లతో పోల్చి చూడవచ్చు. అదేవిధంగా, బైబిలు రాతప్రతుల్లో తప్పుల్ని కనుగొనడానికి పండితులు ఎన్నో రాతప్రతుల్ని పోల్చి చూస్తున్నారు.

7. బైబిల్ని నకలు రాసినవాళ్లు, ఆ పనిని జాగ్రత్తగా చేశారని ఎలా చెప్పవచ్చు?

7 బైబిల్ని నకలు రాసినవాళ్లు ఆ పనిని చాలా జాగ్రత్తగా చేశారు అనడానికి ఈ రుజువును పరిశీలించండి. హీబ్రూ లేఖనాల అతి పూరాతనమైన పూర్తి చేతిరాత ప్రతి, లెనిన్‌గ్రాడ్‌ కోడెక్స్‌. ఇది క్రీస్తు శకం 1008 లేదా 1009 సంవత్సరానికి చెందినది. అయితే ఈ మధ్యకాలంలో చాలా బైబిలు రాతప్రతులు, రాతప్రతుల భాగాలు కనుగొన్నారు. అవి లెనిన్‌గ్రాడ్‌ కోడెక్స్‌ కన్నా 1000 సంవత్సరాలు పాతవి. ‘1000 సంవత్సరాలకు పైగా నకలు చేస్తూ చేస్తూ వచ్చారు, కాబట్టి ఈ లెనిన్‌గ్రాడ్‌ కోడెక్స్‌లోని సమాచారానికి, ఆ పాత ప్రతుల్లోని సమాచారానికి పోలికే ఉండదు’ అని కొంతమంది అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు. పాత రాతప్రతుల్ని, ఆ తర్వాతి కాలపు రాతప్రతులతో పండితులు పోల్చి చూశారు. పదాల్లో చిన్నచిన్న మార్పులు వచ్చాయే కానీ, బైబిలు సందేశం ఏమాత్రం మారలేదని వాళ్లు గమనించారు.

8. క్రైస్తవ గ్రీకు లేఖనాల రాతప్రతుల్ని, ఆ కాలం నాటి ఇతర పుస్తకాల్ని పోల్చి చూసినప్పుడు ఏం తేలింది?

8 హీబ్రూ లేఖనాల్ని నకలు చేసిన పద్ధతిని, తొలి క్రైస్తవులు కూడా అనుసరించారు. వాళ్లు గ్రీకు లేఖనాల్లోని 27 పుస్తకాల్ని జాగ్రత్తగా నకలు రాశారు. వాటిని కూటాల్లో, పరిచర్యలో ఉపయోగించారు. గ్రీకు లేఖనాల రాతప్రతుల్ని, అలాగే ఆ కాలం నాటి ఇతర పుస్తకాల్ని పోల్చి చూసిన తర్వాత ఒక పండితుడు ఇలా అంటున్నాడు: ‘గ్రీకు లేఖనాల నకళ్లు చాలా ఉన్నాయి, అలాగే అందులో ఉన్న సమాచారమంతా పూర్తిగా ఉంది.’ అనాటమీ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌ అనే పుస్తకంలో ఇలా ఉంది: ‘గ్రీకు లేఖనాల్ని జాగ్రత్తగా అనువదించిన ఏదైనా బైబిల్ని మీరు చదువుతుంటే, పూర్వకాలంలోని రాతప్రతుల్లో ఉన్న సమాచారమే అందులో ఉందని మీరు నమ్మవచ్చు.’

9. యెషయా 40:8 ప్రకారం, బైబిలు సందేశం గురించి మనం ఏం చెప్పవచ్చు?

9 వందల సంవత్సరాలుగా ఎంతోమంది చాలా జాగ్రత్తగా, కష్టపడి లేఖనాల్ని నకలు రాశారు. దానివల్ల నేడు మనం చదువుతున్న బైబిల్లో ఉన్న సందేశం ఏమాత్రం మారలేదు. d ఆ సందేశం అలా ఉన్నదున్నట్టుగా మన వరకు వచ్చేలా చేసింది యెహోవాయే అని మనకు తెలుసు. (యెషయా 40:8 చదవండి.) అయితే ఈ ఒక్క కారణాన్ని బట్టి, బైబిల్ని దేవుడే రాయించాడని చెప్పలేమని కొంతమంది అనవచ్చు. బైబిల్ని దేవుడే రాయించాడు అనడానికి ఇంకో రుజువును ఇప్పుడు పరిశీలిద్దాం.

బైబిలు ప్రవచనాల్ని నమ్మవచ్చు

ఎడమ వైపు చిత్రం: C. Sappa/DeAgostini/Getty Images; కుడి వైపు చిత్రం: Image © Homo Cosmicos/Shutterstock

బైబిలు ప్రవచనం గతంలో నెరవేరింది, ఇప్పుడు కూడా నెరవేరుతోంది (10-11 పేరాలు చూడండి) f

10. రెండో పేతురు 1:21లోని మాటలు నిజమని నిరూపించే ఒక ప్రవచనం గురించి చెప్పండి. (చిత్రాలు చూడండి.)

10 బైబిల్లో, నెరవేరిన ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. కొన్నైతే రాసిన వందల సంవత్సరాల తర్వాత నెరవేరాయి. ఆ ప్రవచనాలన్నీ నిజమయ్యాయి అని చరిత్ర రుజువు చేస్తుంది. దానికి మనం ఆశ్చర్యపోం, ఎందుకంటే ఈ ప్రవచనాల్ని రాయించింది యెహోవాయే అని మనకు తెలుసు. (2 పేతురు 1:21 చదవండి.) బబులోను నగరం గురించిన ప్రవచనాల్ని పరిశీలించండి. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో యెషయా ప్రవక్త, శక్తివంతమైన బబులోను నగరం పతనం అవుతుందని ప్రవచించాడు. ఆ నగరాన్ని జయించే రాజు పేరు కోరెషు అని ఆయన చెప్పాడు. అలాగే ఆ నగరాన్ని ఎలా ఓడిస్తారో స్పష్టమైన వివరాల్ని కూడా చెప్పాడు. (యెష. 44:27–45:2) బబులోను నగరం చివరికి నాశనమౌతుందని, పాడుబడిపోతుందని కూడా యెషయా ప్రవచించాడు. (యెష. 13:19, 20) ఆయన చెప్పినట్టే జరిగింది. క్రీస్తు పూర్వం 539 లో మాదీయులు, పారసీకులు బబులోనును ఓడించారు. ఒకప్పుడు గొప్ప నగరంగా ఉన్న బబులోను ఇప్పుడు పాడుబడిపోయింది.—ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 3వ పాఠం, 5వ పాయింట్‌ కింద బబులోను పతనం గురించి బైబిలు ముందే చెప్పింది వీడియో చూడండి.

11. దానియేలు 2:41-43 లో ఉన్న ప్రవచనం, నేడు ఎలా నెరవేరుతుందో వివరించండి.

11 గతంలోనే కాదు, బైబిలు ప్రవచనాలు ఇప్పుడు కూడా నెరవేరుతున్నాయి. ఉదాహరణకు ఆంగ్లో-అమెరికా ప్రపంచాధిపత్యం గురించి దానియేలు చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరుతుందో పరిశీలించండి. (దానియేలు 2:41-43 చదవండి.) ఈ ప్రపంచాధిపత్యం ఒక విషయంలో ఇనుములా “బలంగా,” మరో విషయంలో బంకమట్టిలా “బలహీనంగా” ఉంటుందని దానియేలు ముందే చెప్పాడు. ఆ మాట నిజమని, నేడు మనం కళ్లారా చూస్తున్నాం. రెండు ప్రపంచ యుద్ధాల్ని గెలవడంలో బ్రిటన్‌, అమెరికా దేశాలు ముఖ్య పాత్ర పోషించాయి. అలాగే అవి గొప్ప సైనిక శక్తిని సంపాదించుకున్నాయి. ఆ విధంగా ఇనుములా అవి బలంగా ఉన్నాయి. కానీ కార్మిక సంఘాలు, పౌర హక్కుల పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలు వంటి వాటి ద్వారా ఆ దేశాల పౌరులు ఆ ప్రపంచాధిపత్యానికి ఉన్న బలాన్ని తగ్గిస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్ని జాగ్రత్తగా గమనించే ఒక నిపుణుడు ఈ మధ్యకాలంలో ఇలా అన్నాడు: ‘అమెరికాలో ఆధునిక ప్రజాస్వామ్యం ఉన్నా, రాజకీయంగా దానంత విభజనలున్న దేశం ఇంకొకటి లేదు.’ ఈ ప్రపంచాధిపత్యంలో ఇంకో దేశమైన బ్రిటన్‌లో, విభజనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలనే దానిగురించి, ఆ దేశ ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు ఉండడమే దానికి ఒక కారణం. ఇలాంటి విభజనల వల్ల, తాను అనుకున్న వాటిని చేయడం ఆంగ్లో-అమెరికా ప్రపంచాధిపత్యానికి కష్టమైపోతోంది.

12. ప్రవచనాల్ని బట్టి కూడా మనం ఏం నమ్మవచ్చు?

12 ఇప్పటివరకు నెరవేరిన ప్రవచనాలన్నీ, భవిష్యత్తు గురించి దేవుడు మాటిచ్చినవి ఖచ్చితంగా జరుగుతాయనే మన నమ్మకాన్ని పెంచుతాయి. కీర్తనకర్తలాగే మనకు కూడా ఇలా అనిపిస్తుంది: “నువ్విచ్చే రక్షణ కోసం నేను తపిస్తున్నాను, నీ మాట మీదే నేను ఆశపెట్టుకున్నాను.” (కీర్త. 119:81) యెహోవా బైబిలు ద్వారా మనకు “మంచి భవిష్యత్తు, నిరీక్షణ” ఇచ్చాడు. (యిర్మీ. 29:11) మనుషులు చేసే ప్రయత్నాల వల్ల కాదుగానీ, యెహోవా ఇచ్చిన మాట వల్లే మనకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది. కాబట్టి బైబిలు ప్రవచనాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ దేవుని వాక్యం సత్యం అనే మన నమ్మకాన్ని బలపర్చుకుందాం.

బైబిల్లోని సలహాలు లక్షలమందికి సహాయం చేస్తున్నాయి

13. కీర్తన 119:66, 138 ప్రకారం బైబిల్ని నమ్మవచ్చు అనడానికి ఇంకో రుజువు ఏంటి?

13 బైబిల్ని నమ్మవచ్చు అనడానికి ఇంకో రుజువు ఏంటంటే, దానిలోని సలహాల్ని పాటించడం వల్ల చాలామంది ప్రయోజనం పొందారు. (కీర్తన 119:66, 138 చదవండి.) ఉదాహరణకు, విడాకుల దాకా వెళ్లిన చాలామంది భార్యాభర్తలు, బైబిలు సలహాల్ని పాటించడం వల్ల ఇప్పుడు కలిసిమెలిసి ఉంటున్నారు. వాళ్ల పిల్లలు కూడా ప్రేమానురాగాల మధ్య సురక్షితంగా పెరుగుతున్నారు.—ఎఫె. 5:22-29.

14. బైబిలు సత్యాలు ప్రజల జీవితాల్ని మార్చగలవని చూపించే ఒక ఉదాహరణ చెప్పండి.

14 బైబిలు సలహాల వల్ల కరడుగట్టిన నేరస్తులు కూడా మంచిగా మారారు. జాక్‌ అనే ఖైదీకి బైబిలు సలహాలు ఎలా సహాయం చేశాయో చూడండి. e ఆయన చాలా క్రూరుడు, మరణశిక్ష పొందిన ప్రమాదకరమైన నేరస్తుడు. అయితే ఒకరోజు జైల్లో యెహోవాసాక్షులు స్టడీ ఇస్తుంటే, ఆయన కూడా కూర్చున్నాడు. సాక్షులు ఆయన మీద చూపించిన ప్రేమ, దయ ఆయనను ఎంతో ఆకట్టుకున్నాయి. దాంతో ఆయన కూడా స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. నేర్చుకున్న సత్యాల్ని పాటించి తన ప్రవర్తనలో, అలవాట్లలో మార్పులు చేసుకున్నాడు. కొంతకాలానికి జాక్‌ బాప్తిస్మం తీసుకుని, యెహోవాసాక్షి అయ్యాడు. దేవుని రాజ్యం గురించి తన తోటి ఖైదీలకు ఉత్సాహంగా ప్రకటించి, సత్యం తెలుసుకునేలా కనీసం నలుగురు ఖైదీలకు సహాయం చేశాడు. మరణశిక్ష వేసే సమయానికి, ఆయన పూర్తిగా మారిపోయాడు. ఆయన లాయర్లలో ఒకామె ఇలా అంది: “20 ఏళ్ల క్రితం నేను చూసిన జాక్‌కి, ఇప్పుడు నేను చూస్తున్న జాక్‌కి అసలు ఏ పోలికాలేదు. యెహోవాసాక్షులు బోధించిన విషయాలు ఆయన జీవితాన్ని మార్చేశాయి.” మరణశిక్ష వల్ల జాక్‌ చనిపోయాడు. అయితే ఆయన ఉదాహరణ దేవుని వాక్యాన్ని నమ్మవచ్చని, ప్రజల జీవితాల్ని మార్చే శక్తి దానికి ఉందని స్పష్టంగా చూపిస్తుంది.—యెష. 11:6-9.

రకరకాల ప్రజల జీవితాల్ని బైబిలు మార్చింది (15వ పేరా చూడండి) g

15. బైబిలు సత్యాల్ని పాటించడం వల్ల నేడు యెహోవా ప్రజలు ఎలా ప్రత్యేకంగా ఉన్నారు? (చిత్రం చూడండి.)

15 యెహోవా ప్రజలు బైబిలు సత్యాల్ని పాటిస్తారు కాబట్టి వాళ్లు ఐక్యంగా ఉంటారు. (యోహా. 13:35; 1 కొరిం. 1:10) మన మధ్య ఉన్న శాంతి, ఐక్యత చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే లోకం రాజకీయాలు, జాతులు, కులాల పేర్లతో విడిపోయింది. యెహోవాసాక్షుల మధ్య ఉన్న ఐక్యతను చూసి ఆఫ్రికాలో ఉంటున్న జాన్‌ అనే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆయన ఉంటున్న దేశంలో అల్లర్లు చెలరేగినప్పుడు ఆయన సైన్యంలో చేరాడు. కానీ ఆ తర్వాత వేరే దేశానికి పారిపోయాడు. అక్కడ ఆయన యెహోవాసాక్షుల్ని కలిశాడు. జాన్‌ ఇలా అంటున్నాడు: “నిజమైన మతంలో ఉన్నవాళ్లు రాజకీయాల్లో తలదూర్చరు. వాళ్లు ఎలాంటి భేదాలు లేకుండా ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకుంటారు. నేను ఇంతకుముందు నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశాను. కానీ బైబిలు సత్యం నేర్చుకున్న తర్వాత నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాను.” జాన్‌ ఎన్నో మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వేరే దేశం-జాతి వాళ్లతో యుద్ధం చేయకుండా, ప్రజల్ని ఐక్యం చేసే బైబిలు సత్యాల్ని అందరితో పంచుకుంటున్నాడు. వేర్వేరు దేశాలకు చెందిన రకరకాల ప్రజలకు బైబిలు సలహాలు సహాయం చేయడం మనం చూశాం. బైబిలు దేవుని వాక్యమని ఇది రుజువు చేస్తుంది.

దేవుని వాక్యం సత్యమని ఎప్పుడూ నమ్మండి

16. దేవుని వాక్యం మీద మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

16 లోకంలోని పరిస్థితులు రోజురోజుకు చెడుగా మారుతుండగా దేవుని వాక్యాన్ని నమ్మడం మనకు కష్టం అవ్వవచ్చు. ‘బైబిలు నిజంగా దేవుని వాక్యమేనా? యెహోవా నిజంగా నమ్మకమైన బుద్ధిగల దాసున్ని నియమించాడా?’ అనే సందేహాల్ని ప్రజలు మనలో నాటడానికి ప్రయత్నించవచ్చు. దేవుని వాక్యంలో ఉన్నవన్నీ సత్యమేనని మనం పూర్తిగా నమ్మితే అలాంటి సందేహాలకు చోటివ్వం. “అన్ని సమయాల్లో, చివరివరకూ [యెహోవా] నియమాలకు లోబడాలని” తీర్మానించుకుంటాం. (కీర్త. 119:112) ఏమాత్రం ‘సిగ్గుపడకుండా’ బైబిలు సత్యాల్ని ప్రకటిస్తూ, వాటికి తగ్గట్టు జీవించమని ఇతరుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. (కీర్త. 119:46) తీవ్రమైన కష్టాల్ని, చివరికి హింసను కూడా “ఓర్పుతో, సంతోషంతో” సహిస్తాం.—కొలొ. 1:11; కీర్త. 119:143, 157.

17. ఈ సంవత్సరం, వార్షిక వచనం మనకు ఎలా సహాయం చేస్తుంది?

17 సత్యం తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మనం యెహోవాకు ఎంతో రుణపడి ఉన్నాం. గందరగోళంగా-అయోమయంగా ఉన్న ఈ లోకంలో, సత్యం తెలుసుకోవడం వల్ల మనం ప్రశాంతంగా, ధైర్యంగా జీవించగలుగుతున్నాం. అంతేకాదు దేవుని రాజ్య పరిపాలన కింద మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశను సత్యం మనలో నింపుతుంది. 2023 వార్షిక వచనం, ‘దేవుని వాక్య సారం సత్యం’ అనే మీ నమ్మకాన్ని బలపరుస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.—కీర్త. 119:160.

పాట 94 దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత

a మన విశ్వాసాన్ని బలపర్చే ఒక వచనాన్ని, 2023 వార్షిక వచనంగా ఎంచుకున్నారు. అది: “నీ వాక్య సారం సత్యం.” (కీర్త. 119:160) మనమైతే ఆ మాటను పూర్తిగా నమ్ముతాం. కానీ చాలామంది బైబిల్ని నమ్మరు. అందులో ఉన్న సలహాలు మనకు ఉపయోగపడతాయని అనుకోరు. అయితే బైబిల్ని, అందులో ఉన్న సలహాల్ని నమ్మగలిగేలా మంచి మనసున్న వాళ్లకు సహాయం చేసే మూడు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

b పదాల వివరణ: ఈ లేఖనంలో “సారం” అని అనువదించిన హీబ్రూ పదానికి సారాంశం, మొత్తం, పూర్తిగా, అంతా అనే అర్థాలు కూడా ఉన్నాయి.

c “రాతప్రతి” అంటే పూర్వకాలంలో చేత్తో రాసిన దస్తావేజు లేదా పత్రం.

d బైబిల్లోని సందేశం మారలేదనే దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, jw.orgలో “చరిత్ర, బైబిలు” అని టైప్‌ చేసి వెదకండి.

e కొన్ని అసలు పేర్లు కావు.

f చిత్రాల వివరణ: గొప్ప నగరమైన బబులోను నాశనమౌతుందని దేవుడు ముందే చెప్పాడు.

g చిత్రాల వివరణ: పునర్నటన—ఒక యువకుడు బైబిలు సత్యం నేర్చుకుని యుద్ధం చేయకుండా, శాంతిగా ఉంటూ; ఇతరులు కూడా అలా ఉండేలా సహాయం చేస్తున్నాడు.