కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

విశ్వాసంగల వాళ్లను యెహోవా దీవించడం నేను చూశాను

విశ్వాసంగల వాళ్లను యెహోవా దీవించడం నేను చూశాను

జీవితంలో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నవి ఎప్పటికీ మర్చిపోలేము. నా జీవితంలో కూడా 50 ఏళ్ల క్రితం ఒకసారి అలా జరిగింది. నేనూ, నా స్నేహితుడు ఎన్నో నెలలుగా కలిసి ప్రయాణిస్తున్నాం. ఒకరోజు మేమిద్దరం కెన్యాలో చలిమంట కాచుకుంటూ ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో మతానికి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. అప్పుడు నా స్నేహితుడు “ఈ సినిమా బైబిలు గురించి తప్పుగా మాట్లాడింది” అని అన్నాడు.

అతను బైబిలు గురించి మాట్లాడేసరికి నాకు నవ్వొచ్చింది. అతనికి మతం అన్నా, దేవుడు అన్నా అంత ఇష్టం ఉండదేమో అని నేను అనుకున్నాను. “బైబిలు గురించి నీకేం తెలుసు?” అని నేను అతన్ని అడిగాను. దానికి అతను వెంటనే జవాబు ఇవ్వలేదు. కానీ వాళ్ల అమ్మ ఒక యెహోవాసాక్షి అనీ, ఆమె బైబిలు గురించి కొన్ని విషయాలు తనకు నేర్పించిందనీ అతను చెప్పాడు. నేను ఆరోజు అతన్ని చాలా ప్రశ్నలు అడిగాను.

మేము ఆ రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ లోకాన్ని పరిపాలిస్తున్నది సాతానని అతను నాకు చెప్పాడు. (యోహా. 14:30) బహుశా మీకు ఆ విషయం చిన్నప్పటి నుండే తెలుసేమో, కానీ నాకు మాత్రం అది చాలా కొత్తగా, ఆసక్తిగా అనిపించింది. ఇంతకాలం ఒక ప్రేమగల, న్యాయంగల దేవుడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు అని నేను అనుకున్నాను. కానీ లోకంలో మాత్రం ఆ ప్రేమ, న్యాయం నాకు ఎక్కడా కనిపించలేదు. నా 26 ఏళ్ల జీవితంలో ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చూసి నేను ఎంతో కలవరపడ్డాను.

మా నాన్న అమెరికా ఎర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా పనిచేసేవాడు కాబట్టి చిన్నప్పటి నుండే నేను అణు యుద్ధాల గురించి ఎక్కువగా వింటూ వచ్చాను. అణు బాంబులు వేయడానికి ఎప్పుడైనా సరే మిలిటరీ సిద్ధంగా ఉండేది. కాలిఫోర్నియాలో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు వియత్నాం యుద్ధం జరిగింది. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసే పోరాటంలో నేనూ పాల్గొన్నాను. పోలీసులు మమ్మల్ని లాటీలతో కొట్టేవాళ్లు, మా మీద టీయర్‌ గ్యాస్‌ ప్రయోగించేవాళ్లు. అప్పుడు మేము ఊపిరాడక, సరిగ్గా కనిపించక పరిగెత్తుకుంటూ పారిపోయేవాళ్లం. ఎక్కడ చూసినా అల్లర్లు, గొడవలు ఉండేవి. రాజకీయ నాయకుల హత్య జరిగినప్పుడు ప్రజలు ధర్నాలు, పోరాటాలు చేసేవాళ్లు. జరుగుతున్నవాటి గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండేది. అంతా గందరగోళంగా ఉండేది.

లండన్‌ నుండి మధ్య ఆఫ్రికా వరకు

1970 లో అలాస్కా ఉత్తర తీరాన నేను ఒక ఉద్యోగం చేశాను. అక్కడ చాలా డబ్బు సంపాదించాను. తర్వాత నేను లండన్‌కి వెళ్లి అక్కడ ఒక బైక్‌ కొనుక్కున్నాను. ఏ గమ్యం లేకుండా దక్షిణ వైపుగా ప్రయాణించడం మొదలుపెట్టాను. అలా కొన్ని నెలలు ప్రయాణిస్తూ ఆఫ్రికా చేరుకున్నాను. ఆ ప్రయాణంలో నాలా ఆలోచించే చాలామందిని కలిశాను. వాళ్లు సమస్యల్ని తప్పించుకుని స్వేచ్ఛగా ఎక్కడికైనా పారిపోవాలని కోరుకునేవాళ్లు.

కాబట్టి ఈ లోకంలో నేను చూసినదాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి సాతానే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు అని బైబిలు చెప్పే మాట నమ్మవచ్చని అనిపించింది. మరి ఇంతకీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? దాని గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను.

తర్వాత కొంతకాలానికి నేను నా ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నాను. అలాగే అన్నిరకాల పరిస్థితుల్లో సత్యదేవుని మీద విశ్వాసం చూపించిన మంచి స్నేహితులు నాకు దొరికారు. వాళ్లంటే నాకు చాలా ఇష్టం.

ఉత్తర ఐర్లాండ్‌—“బాంబులతో, బులెట్లతో హడలెత్తిన ప్రాంతం”

నేను మళ్లీ లండన్‌కు వెళ్లాక నా ఫ్రెండ్‌ వాళ్ల అమ్మను కలిశాను. ఆమె నాకొక బైబిలు ఇచ్చింది. తర్వాత నేను నెదర్లాండ్స్‌లోని ఆమ్‌ స్టర్‌ డామ్‌కి వెళ్లాను. ఒక స్ట్రీట్‌ లైట్‌ కింద ఆ బైబిల్ని చదువుతున్నప్పుడు ఒక యెహోవాసాక్షి నన్ను చూసి, నాకు బైబిలు విషయాలు నేర్పించాడు. ఆ తర్వాత నేను ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కి వెళ్లాను. అక్కడ నాకు యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం కనిపించింది. నేను ఎంతో అనుభవమున్న ఆర్థర్‌ మాథ్యూస్‌ అనే సహోదరుడిని అక్కడ కలిశాను. నేను ఆయన్ని బైబిలు గురించి నేర్పించమని అడిగాను. ఆయనే నాకు స్టడీ ఇచ్చాడు.

నేను ఒక పుస్తకాల పురుగులా యెహోవాసాక్షుల పత్రికల్ని, పుస్తకాల్ని చదివేశాను. బైబిల్ని కూడా బాగా చదివాను. నాకు అవి చాలా నచ్చాయి. నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే, ‘చెడు ఎందుకు జరుగుతుంది? దేవుడు ఎవరు? చనిపోయాక ఏమౌతుంది?’ వంటి ప్రశ్నలకు మేధావులకు కూడా జవాబులు తెలియవు కానీ మీటింగ్స్‌లో చిన్నచిన్న పిల్లలు కూడా అలాంటి పెద్దపెద్ద ప్రశ్నలకు జవాబులు చెప్పడం చూశాను. నా స్నేహితులందరూ యెహోవాసాక్షులే. ఎందుకంటే నాకు ఆ దేశంలో ఇంకెవరు తెలీదు. యెహోవాను ప్రేమించేలా, ఆయన ఇష్టాన్ని చేసేలా వాళ్లు నాకు సహాయం చేశారు.

నిజెల్‌, డెనిస్‌, నేను

1972 లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. సంవత్సరం తర్వాత పయినీరు సేవ మొదలుపెట్టాను. ఉత్తర ఐర్లాండ్‌లో న్యూరీలో ఉన్న ఒక చిన్న సంఘానికి వెళ్లాను. పర్వత ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాను. పక్కనే పొలంలో ఆవులు మేస్తూ ఉంటే, నేను వాటిని చూస్తూ నా ప్రసంగాలు ప్రాక్టీస్‌ చేసేవాడిని. అవి ఆహారాన్ని నెమరేస్తూ నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నట్టు అనిపించేది. అవి సలహాలు ఏమీ ఇవ్వలేవు గానీ ప్రేక్షకుల్ని చూస్తూ మాట్లాడడం నేర్చుకునేలా నాకు సహాయం చేశాయి. 1974 లో నేను ప్రత్యేక పయినీరును అయ్యాను. అప్పుడు నైజెల్‌ పిట్‌ అనే బ్రదర్‌ నాకు పార్ట్‌నర్‌గా ఉన్నాడు. ఆయన నాకు చిరకాల స్నేహితుడయ్యాడు.

ఆ సమయంలో ఉత్తర ఐర్లాండ్‌లో “గొడవలు” ఎక్కువయ్యాయి. అందుకే కొంతమంది ఉత్తర ఐర్లాండ్‌ “బాంబులతో, బులెట్లతో హడలెత్తుతున్న ప్రాంతం” అని అన్నారు. ఎటు చూసినా గొడవలు, కాల్పులు, బాంబు పేలుళ్లు ఉండేవి. ఎక్కువ శాతం ఈ గొడవలకు రాజకీయాలు, మతాలే కారణం. కానీ మంచి విషయం ఏంటంటే, యెహోవాసాక్షులు రాజకీయాల్లో తలదూర్చరనే విషయం ప్రొటెస్టెంట్లకు, క్యాథలిక్కులకు తెలుసు. కాబట్టి మేము ఏ భయం లేకుండా, స్వేచ్ఛగా ప్రకటించగలిగాం. సాధారణంగా గొడవలు ఎప్పుడు-ఎక్కడ జరుగుతాయో ఇంటివాళ్లకు తెలుసు కాబట్టి వాళ్లు మమ్మల్ని ముందే హెచ్చరించేవాళ్లు. దాంతో మేము ఆ పక్కకు వెళ్లేవాళ్లం కాదు.

అయినా పరిస్థితులు కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉండేవి. ఒకరోజు నేనూ డెనిస్‌ కారిగన్‌ అనే ఇంకో పయినీరు బ్రదర్‌ దగ్గర్లో ఉన్న ఒక ఊరిలో ప్రకటించాం. అక్కడ యెహోవాసాక్షులు ఎవ్వరూ లేరు. మేము అక్కడికి ప్రకటనా పని కోసం వెళ్లడం ఇది రెండోసారి. స్థానికుల యాసలో మేము మాట్లాడలేదు కాబట్టి మమ్మల్ని రహస్యంగా పనిచేస్తున్న బ్రిటీష్‌ సైనికులు అని అక్కడ ఒకామె అంది. అలా అనేసరికి మాకు భయమేసింది. ఎందుకంటే సాధారణంగా బ్రిటీష్‌ సైనికులతో ఎవరైన కొంచెం చనువుగా మాట్లాడినా సరే ప్రజలు వాళ్లను చంపేస్తారు లేదా మోకాళ్లమీద తుపాకీతో కాలుస్తారు. అలా భయంభయంగా మేము బస్టాప్‌ దగ్గర బస్సు కోసం చలిలో ఎదురుచూస్తున్నాం. తర్వాత మమ్మల్ని బ్రిటీష్‌ సైనికులు అని పిలిచిన స్త్రీ దగ్గరికి ఒక ఇద్దరు కారులో వచ్చారు, ఆమె మా వైపు వేలు చూపిస్తూ వాళ్లకు ఏదో చెప్పింది. వెంటనే వాళ్లు మా దగ్గరికి వచ్చి బస్సు ఎప్పుడు వస్తుంది అని అడిగారు. బస్సు వచ్చాక వాళ్లు డ్రైవర్‌తో ఏదో మాట్లాడారు. వాళ్లు ఏం మాట్లాడారో మాకు వినబడలేదు. బస్సులో మేము తప్ప ఇంకా ఎవరూ లేరు కాబట్టి మమ్మల్ని ఊరు బయటికి తీసుకెళ్లి ఏదోకటి చేసేస్తారు అనుకున్నాం. కానీ అలా జరగలేదు. నేను బస్సు దిగాక డ్రైవర్‌ని “ఆ ఇద్దరు మా గురించి ఏమైనా అడిగారా?” అని అన్నాను. అప్పుడాయన, “నాకు మీరెవరో తెలుసు. వాళ్లకు అదే చెప్పాను. కంగారుపడకండి, మీకేం కాదు” అని అన్నాడు.

1977, మార్చిలో మా పెళ్లిరోజున

1976 లో డబ్లిన్‌లో జరిగిన ఒక జిల్లా సమావేశంలో a ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన పౌలిన్‌ లోమాక్స్‌ అనే ప్రత్యేక పయినీరు సిస్టర్‌ని కలిశాను. ఆమె వినయంగల ఆధ్యాత్మిక స్త్రీ. ఆమె, ఆమె తమ్ముడు రేయ్‌ చిన్నప్పటి నుండే సత్యంలో ఉన్నారు. ఒక సంవత్సరం తర్వాత, నేనూ పౌలిన్‌ పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఉత్తర ఐర్లాండ్‌లోని బాలీమీనాలో ప్రత్యేక పయినీరు సేవను కొనసాగించాం.

తర్వాత కొంతకాలం మేము బెల్‌ఫాస్ట్‌లో, లండన్‌డెర్రీలో, కొన్ని ఇతర ప్రమాదకరమైన ప్రాంతాల్లో ప్రాంతీయ పర్యవేక్షకులుగా సేవచేశాం. సహోదర సహోదరీల విశ్వాసం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. వాళ్లు బలంగా పాతుకుపోయిన మత నమ్మకాల్ని, వివక్షను, జాతి ద్వేషాన్ని విడిచిపెట్టి యెహోవాను ఆరాధించారు. అందుకు యెహోవా వాళ్లను ఎంతగానో ఆశీర్వదించాడు, కాపాడాడు.

నేను ఐర్లాండ్‌లో పది సంవత్సరాలు ఉన్నాను. తర్వాత 1981 లో 72వ గిలియడ్‌ తరగతికి మాకు ఆహ్వానం వచ్చింది. ఆ పాఠశాల పూర్తయ్యాక మమ్మల్ని పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రా లియోన్‌కు పంపించారు.

సియర్రా లియోన్‌—పేదవాళ్లే గానీ విశ్వాసంలో ధనవంతులు

మేము 11 మంది సహోదర సహోదరీలతో కలిసి మిషనరీ హోమ్‌లో ఉండేవాళ్లం. వాళ్లంతా చాలా మంచోళ్లు. మా అందరికి కలిపి ఒక కిచెన్‌, రెండు బాత్రూమ్‌లు, మూడు టాయిలెట్లు, ఒక టెలిఫోన్‌, ఒక వాషింగ్‌ మెషీన్‌, ఒక డ్రయర్‌ ఉండేవి. కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేం. అలాగే ఇంట్లోకి పిలవని అతిథులుగా ఎలుకలు, పాములు వస్తుండేవి.

దగ్గర్లో ఉన్న గినీలో జరుగుతున్న సమావేశానికి వెళ్లడానికి నది దాటుతున్నప్పుడు

అక్కడ బ్రతకడం కష్టంగా ఉన్నా పరిచర్యలో మాత్రం చాలా ఆనందించేవాళ్లం. అక్కడివాళ్లు బైబిల్ని గౌరవించేవాళ్లు, మేము చెప్పేది శ్రద్ధగా వినేవాళ్లు. చాలామంది స్టడీ తీసుకుని సత్యంలోకి వచ్చారు. అక్కడ ఉండేవాళ్లు నన్ను “మిస్టర్‌ రాబర్ట్‌” అని పౌలిన్‌ని “మిసెస్‌ రాబర్ట్‌” అని పిలిచేవాళ్లు. కొంతకాలం తర్వాత నాకు బ్రాంచి కార్యాలయం పనులు ఎక్కువైపోయేసరికి నేను చాలావరకు ఆఫీసులోనే ఉండి అప్పుడప్పుడే పరిచర్యకు వెళ్తుండేవాణ్ణి. దాంతో వాళ్లు పౌలిన్‌ని “మిసెస్‌ పౌలిన్‌” అని నన్ను “మిస్టర్‌ పౌలిన్‌” అని పిలవడం మొదలుపెట్టారు. అలా పిలవడం పౌలిన్‌కి నచ్చింది.

సియర్రా లియోన్‌లో కొత్త ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్తున్నప్పుడు

అక్కడ చాలామంది సహోదర సహోదరీలు పేదవాళ్లు. అయితే యెహోవా వాళ్ల అవసరాలన్నిటిని తీర్చేవాడు. కొన్నిసార్లు ఊహించని విధంగా ఆయన సహాయం చేసేవాడు. (మత్త. 6:33) ఒకసారి ఒక సహోదరి దగ్గర, ఆమెకు-ఆమె పిల్లలకు ఆ రోజుకు సరిపడా డబ్బు మాత్రమే ఉంది. కానీ ఒక సహోదరునికి మలేరియా వచ్చి, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయేసరికి ఆమె తన దగ్గరున్న డబ్బంతా ఆయనకు ఇచ్చేసింది. అయితే, అనుకోకుండా అదే రోజు ఒకామె ఆ సహోదరి దగ్గరికి హెయిర్‌ కట్‌ చేయించుకోవడానికి వచ్చి, ఆమె అవసరాలకు సరిపోయే డబ్బు ఇచ్చింది. ఇలాంటి అనుభవాలు ఒకట్రెండు కాదు చాలానే చూశాను.

నైజీరియా—కొత్త సంస్కృతికి అలవాటుపడడం

మేము సియర్రా లియోన్‌లో తొమ్మిదేళ్లు ఉన్నాం. ఆ తర్వాత మమ్మల్ని నైజీరియా బెతెల్‌కి పంపించారు. ఇక్కడున్న బ్రాంచి కార్యాలయం చాలా పెద్దది. నేను సియర్రా లియోన్‌లో చేసిన ఆఫీసు పనినే ఇక్కడ కూడా చేశాను. కానీ పౌలిన్‌ పని విషయంలో మాత్రం పెద్ద మార్పు వచ్చింది. తను ఇదివరకు పరిచర్యలో 130 గంటలు చేసేది. మంచి బైబిలు స్టడీలు చేసేది. కానీ ఇప్పుడు తను కూడా నాలాగే బెతెల్‌లో పనిచేయాల్సి వచ్చింది. ఆమెకు కుట్టుపని అప్పగించారు. ఆమె చినిగిపోయిన బట్టల్ని కుడుతుండేది. ఆ పనికి అలవాటుపడడానికి ఆమెకు కాస్త సమయం పట్టింది. కానీ సహోదర సహోదరీలు ఆమె చేస్తున్న పనిని విలువైనదిగా చూస్తున్నారని ఆమె గుర్తించింది. పౌలిన్‌ కూడా తోటి బెతెలైట్స్‌ను ప్రోత్సహించడానికి తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది.

మాకు నైజీరియా సంస్కృతి గానీ ఇక్కడి అలవాట్లు గానీ ఏమీ తెలీదు. మేము వాటి గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. ఒకసారి ఒక బ్రదర్‌ బెతెల్‌కి కొత్తగా వచ్చిన సిస్టర్‌ని నా ఆఫీసుకు తీసుకొచ్చి పరిచయం చేశాడు. నేను షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి నా చేయి చాపాను, అప్పుడామె వెంటనే నా కాళ్లమీద పడి నమస్కారం చేసింది. ఆశ్చర్యంలో నాకు ఏం చేయాలో అర్థంకాలేదు. నాకు వెంటనే రెండు లేఖనాలు గుర్తుకొచ్చాయి: అపొస్తలుల కార్యాలు 10:25, 26, ప్రకటన 19:10. ఇలా చేయొద్దు అని ఆమెకు చెప్పాలనుకున్నాను. కానీ ఆమె బెతెల్‌కి వచ్చిందంటేనే బైబిలు ఏం చెప్తుందో ఆమెకు పూర్తిగా తెలిసే ఉంటుందని అనుకున్నాను.

అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏం మాట్లాడాలో అర్థంకాలేదు. తర్వాత నేను దానిగురించి పరిశోధన చేశాను. ఆమె స్థానిక సంప్రదాయాన్ని పాటిస్తూ అలా చేసిందని నాకు అర్థమైంది. అప్పట్లో ఆ దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆ పద్ధతిని పాటిస్తున్నారు. ఆడవాళ్లే కాదు మగవాళ్లు కూడా అలా కాళ్లమీద పడి నమస్కారం చేస్తారు. దానర్థం ఎదుటివాళ్లమీద గౌరవం చూపిస్తున్నట్టే గానీ ఆరాధిస్తున్నట్టు కాదు. అలాంటి ఉదాహరణలు బైబిల్లో కూడా ఉన్నాయి. (1 సమూ. 24:8) నేను తొందరపడి ఆ సిస్టర్‌ని సరిదిద్దకపోవడం మంచిదైంది.

తర్వాతి సంవత్సరాల్లో బలమైన విశ్వాసాన్ని చూపించిన ఎంతోమంది సహోదర సహోదరీల్ని మేము నైజీరియాలో కలిశాం. అందులో ఒకరు ఐజేయ అడగ్‌బోన. b ఆయన యువకుడిగా ఉన్నప్పుడే సత్యం తెలుసుకున్నాడు. కానీ తర్వాత ఆయనకు కుష్ఠురోగం వచ్చింది. అప్పుడు ఆయన్ని కుష్ఠురోగులు ఉండే చోటుకు పంపించారు. అక్కడ ఆయన ఒక్కడే యెహోవాసాక్షి. వ్యతిరేకత ఉన్నా సత్యం తెలుసుకునేలా 30 మందికి సహాయం చేశాడు. అక్కడ ఒక సంఘాన్ని కూడా స్థాపించాడు.

కెన్యా—సహోదరులు ఎంతో ఓర్పు చూపించారు

కెన్యాలో ఒక చిన్న ఖడ్గమృగంతో

1996 లో మమ్మల్ని కెన్యా బ్రాంచికి పంపించారు. నా స్నేహితునితో జరిగిన సంభాషణ గురించి మొదట్లో చెప్పాను కదా. అది జరిగిన చాలా ఏళ్లకు మళ్లీ నేనిప్పుడు కెన్యాకు వచ్చాను. మేము ఇక్కడ బెతెల్‌లో ఉన్నాం. మా బెతెల్‌ని చూడ్డానికి మనుషులే కాదు, కోతులు కూడా వచ్చేవి. అవి సిస్టర్స్‌ దగ్గర నుండి పండ్లు ఎత్తుకెళ్లిపోయేవి. ఒకసారి బెతెల్‌లో ఒక సిస్టర్‌ తన రూమ్‌ కిటికీని మూసిరావడం మర్చిపోయింది. ఆమె తిరిగి రూమ్‌కి వెళ్లి తలుపు తెరిచేసరికి పెద్ద కోతుల గుంపు ఇంట్లో ఉన్నవన్నీ తినేస్తున్నాయి. దాంతో ఆ సిస్టర్‌ గట్టిగా అరుచుకుంటూ అక్కడినుండి పరుగెత్తింది. అప్పుడు ఆ కోతులు కూడా అరుచుకుంటూ కిటికీలో నుండి పారిపోయాయి.

మేము స్వాహిలీ భాష సంఘానికి వెళ్లాం. కొన్ని రోజులకే నన్ను సంఘ పుస్తక అధ్యయనం చేయమన్నారు (ఇప్పుడు దాని సంఘ బైబిలు అధ్యయనం అని అంటున్నాం). అయితే ఆ భాష నాకు కనీసం పిల్లలకు వచ్చినంత కూడా రాదు. కాబట్టి నేను సమాచారాన్ని ముందే బాగా సిద్ధపడి వెళ్లేవాణ్ణి. దానివల్ల ప్రశ్నల్ని కాస్త సరిగ్గానే చదవగలిగేవాణ్ణి. అయితే, ఎవరైనా పుస్తకంలో ఉన్నదున్నట్టు కాకుండా సొంత మాటల్లో చెప్తే నాకేమీ అర్థమయ్యేది కాదు. పాపం ఆ బ్రదర్స్‌ సిస్టర్స్‌ ఓర్పుగా, వినయంగా నన్ను భరించేవాళ్లు. అది నన్ను ఎంతో ఆకట్టుకుంది.

అమెరికా—విశ్వాసంలోనూ ధనవంతులే

మేము కెన్యాలో కనీసం ఒక్క సంవత్సరం కూడా లేము. 1997 లో మమ్మల్ని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ బెతెల్‌కి ఆహ్వానించారు. ఇప్పుడు మేము సిరిసంపదలు ఉన్న దేశంలో అడుగుపెట్టాం. అవి కూడా కొన్ని రకాల సమస్యల్ని తెచ్చిపెడతాయి. (సామె. 30:8, 9) అయినా, ఇలాంటి దేశంలో కూడా మన సహోదర సహోదరీలు బలమైన విశ్వాసాన్ని చూపిస్తున్నారు. సహోదర సహోదరీలు ఆస్తిపాస్తుల్ని కూడబెట్టుకోవడానికి ప్రయత్నించట్లేదు గానీ తమ సమయాన్ని, వస్తువుల్ని ఉపయోగించి యెహోవా సంస్థలో జరుగుతున్న పనికి మద్దతిస్తున్నారు.

వేర్వేరు పరిస్థితుల్లో తోటి సాక్షులు చూపించిన విశ్వాసాన్ని మేము కళ్లారా చూశాం. ఐర్లాండ్‌లో అల్లర్లు-గొడవలు ఉన్నా, ఆఫ్రికాలో పేదరికం-రోగాలు ఉన్నా, అమెరికాలో సిరిసంపదలు ఉన్నా సహోదర సహోదరీలు బలమైన విశ్వాసం చూపించారు. యెహోవా పరలోకం నుండి చూస్తున్నప్పుడు, అన్నిరకాల పరిస్థితుల్లోనూ ప్రజలు తనమీద ప్రేమ చూపించడం ఆయనకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా.

పౌలిన్‌తో కలిసి వార్విక్‌ బెతెల్‌లో

కాలం చాలా త్వరగా గడిచిపోయింది. (యోబు 7:6) మేము ఇప్పుడు వార్విక్‌లోని ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్నాం. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకునే వాళ్లతో పనిచేయడంలో ఉన్న ఆనందాన్ని మేము ఇప్పటికీ రుచిచూస్తున్నాం. మన రాజైన యేసుక్రీస్తుకు మద్దతివ్వడానికి చేయగలిగినదంతా చేస్తున్నందుకు మేము సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాం. విశ్వాసంగల వాళ్లందరికీ ఆయన త్వరలోనే ఎన్నో దీవెనల్ని తీసుకొస్తాడు.—మత్త. 25:34.

a ప్రాదేశిక సమావేశాల్ని అప్పట్లో జిల్లా సమావేశాలని పిలిచేవాళ్లు.

b ఐజేయ అడగ్‌బోన జీవిత కథను 1998, ఏప్రిల్‌ 1 కావలికోట 22-27 పేజీల్లో చూడవచ్చు. ఆయన 2010 లో చనిపోయాడు.