కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 12

సృష్టిని చూసి యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోండి

సృష్టిని చూసి యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోండి

“ఆయన అదృశ్య లక్షణాలు, … లోకం సృష్టించబడినప్పటి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి; ఆయన చేసినవాటిని గమనించడం ద్వారా ఆ లక్షణాల్ని తెలుసుకోవచ్చు.”—రోమా. 1:20.

పాట 6 ఆకాశాలు యెహోవా మహిమను ప్రకటిస్తున్నాయి

ఈ ఆర్టికల్‌లో a

1. యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి యోబుకు సహాయం చేసిన ఒక విషయం ఏంటి?

 యోబు చాలామందితో మాట్లాడివుంటాడు. కానీ యెహోవాతో మాట్లాడిన మాటల్ని ఆయన జీవితంలో మర్చిపోయి ఉండడు. యెహోవా ప్రకృతిలోని కొన్ని అద్భుతమైన విషయాల్ని చూపించి తన తెలివి మీద, తన సేవకుల్ని చూసుకునే సామర్థ్యం మీద యోబు నమ్మకాన్ని బలపర్చాడు. ఉదాహరణకు, తాను జంతువుల్నే చూసుకున్నప్పుడు యోబును కూడా చూసుకోగలడని యెహోవా గుర్తుచేశాడు. (యోబు 38:39-41; 39:1, 5, 13-16) సృష్టిని గమనించడం ద్వారా యెహోవాకున్న లక్షణాల్ని యోబు చాలావరకు అర్థంచేసుకోగలిగాడు.

2. సృష్టిని గమనించడం మనకు ఎందుకు కష్టంగా అనిపించవచ్చు?

2 మనం కూడా సృష్టిని గమనించినప్పుడు యెహోవా గురించి ఎక్కువ తెలుసుకుంటాం. అయితే, అన్నిసార్లు అది ఈజీ కాకపోవచ్చు. ఒకవేళ మనం సిటీలో ఉంటే, ప్రకృతికి దూరంగా ఉన్నామని అనిపించవచ్చు. అదే మనం పల్లెటూరిలో ఉండి, ప్రకృతికి దగ్గరగా ఉన్నా, దాన్ని గమనించడానికి టైం లేదని అనిపించవచ్చు. కానీ సృష్టిని గమనించడానికి మనం సమయాన్ని, శక్తిని ఎందుకు పెట్టాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే యెహోవా, యేసు బోధించినప్పుడు సృష్టిని ఎలా ఉపయోగించారో చూస్తాం. ఇంకా, ప్రకృతి మనకు నేర్పించే పాఠాలేంటో తెలుసుకుంటాం.

సృష్టిని ఎందుకు గమనించాలి?

ఆదాము ఈ సృష్టిని ఆస్వాదించాలని, జంతువులన్నిటికీ పేర్లు పెట్టాలని యెహోవా కోరుకున్నాడు (3వ పేరా చూడండి)

3. సృష్టిని ఆదాము ఆస్వాదించాలని యెహోవా కోరుకున్నాడని ఎలా చెప్పవచ్చు?

3 తన సృష్టిని ఆదాము ఆస్వాదించాలని యెహోవా కోరుకున్నాడు. యెహోవా ఆదామును చేసినప్పుడు స్వచ్ఛమైన పరదైసును అతని చేతిలో పెట్టాడు. ఆదాము ఆ అందమైన పరదైసు అంతా తిరిగి, పంట పండించి, ఆ పరదైసును విస్తరించాలని యెహోవా కోరుకున్నాడు. (ఆది. 2:8, 9, 15) విత్తనాలు మొలకెత్తడం, పువ్వులు వికసించడం చూసినప్పుడు ఆదాముకు భలే వింతగా అనిపించివుంటుంది. ఆ అందమైన ఏదెను తోటను చూసుకోవడం ఆదాముకు దొరికిన గొప్ప అవకాశం. అంతేకాదు, జంతువులన్నిటికీ పేర్లు పెట్టమని కూడా యెహోవా చెప్పాడు. (ఆది. 2:19, 20) నిజానికి యెహోవాయే ఆ పేర్లు పెట్టొచ్చు, కానీ ఆ బాధ్యతను ఆయన ఆదాముకు ఇచ్చాడు. వాటికి పేర్లు పెడుతున్నప్పుడు ఆదాము జంతువులన్నిటినీ జాగ్రత్తగా గమనించివుంటాడు. వాటి ప్రత్యేకతలు, చేష్టలు, కదలికల్ని గమనించి అతను పేర్లు పెట్టివుంటాడు. ఆ పని ఆదాముకు బాగా నచ్చివుంటుంది. తన తండ్రి ఇంత అందంగా, తెలివిగా చెక్కిన సృష్టిని చూసి ఆదాము ఆశ్చర్యంతో మైమరిచిపోయి ఉంటాడు.

4. (ఎ) సృష్టిని గమనించడానికి గల ఒక కారణం ఏంటి? (బి) ఈ సృష్టిలో మీకు బాగా నచ్చింది ఏంటి?

4 సృష్టిని గమనించడానికి గల ఒక కారణం ఏంటంటే, అలా చేయమని యెహోవాయే చెప్తున్నాడు. “మీ కళ్లు పైకెత్తి ఆకాశాన్ని చూడండి” అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత, “వీటిని ఎవరు సృష్టించారు?” అని అడిగాడు. దానికి జవాబు మనకు తెలుసు. (యెష. 40:26) యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని ఎన్నో వింతలు-విశేషాలతో నింపాడు. వాటిని చూసినప్పుడు మనం ఆయన గురించి ఎంతో నేర్చుకుంటాం. (కీర్త. 104:24, 25) ఆయన మనల్ని తయారుచేసిన విధానం గురించి ఒకసారి ఆలోచించండి. చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన లాంటి ఐదు జ్ఞానేంద్రియాలతో మనల్ని చేసి ప్రకృతిలోని అందాల్ని ఆస్వాదిస్తూ, ఆనందించేలా ఆయన సృష్టించాడు.

5. రోమీయులు 1:20 ప్రకారం, సృష్టిని గమనించడం వల్ల ఏంటి ప్రయోజనం?

5 సృష్టిని గమనించడానికి గల ఇంకో కారణాన్ని బైబిలు చెప్తుంది. అదేంటంటే, సృష్టిని చూసి మనం యెహోవా లక్షణాల్ని తెలుసుకుంటాం. (రోమీయులు 1:20 చదవండి.) ఉదాహరణకు, కనువిందు చేసే ఎన్నో ప్రకృతి అందాల్ని యెహోవా చెక్కాడు. వాటిని చూసినప్పుడు యెహోవా తెలివి మనకు కనిపిస్తుంది కదా! అలాగే మన నోటికి రుచించే రకరకాల ఆహార పదార్థాల్ని ఆయన ఇచ్చాడు. వాటిని చూసినప్పుడు యెహోవాకు మనమీద ఎంత ప్రేముందో స్పష్టంగా తెలుస్తుంది. ఆయన చేసిన వాటిల్లో ఆయన లక్షణాల్ని చూసినప్పుడు ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని, ఆయనకు ఇంకా దగ్గరవ్వాలని మనకు అనిపిస్తుంది. యెహోవా మనకు ముఖ్యమైన పాఠాల్ని నేర్పించడానికి సృష్టిని ఏయే విధాలుగా ఉపయోగించాడో ఇప్పుడు చూద్దాం.

యెహోవా, సృష్టిని ఉపయోగించి తన గురించి మనకు నేర్పిస్తున్నాడు

6. వలస వెళ్లే పక్షుల నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

6 యెహోవా అన్నిటికీ ఒక సమయాన్ని నియమించాడు. ప్రతీ సంవత్సరం, ఫిబ్రవరి నుండి మే మధ్యకాలంలో, సంకుబుడి కొంగలు ఉత్తరం వైపుకు వలస వెళ్లడం ఇశ్రాయేలీయులు చూసేవాళ్లు. “ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు కూడా దాని నియమిత సమయాలు తెలుసు” అని యెహోవా ఇశ్రాయేలీయులతో చెప్పాడు. (యిర్మీ. 8:7) ఈ పక్షులు వలస వెళ్లే సమయాన్ని యెహోవా నిర్ణయించినట్టే, తన తీర్పుల్ని ఏ సమయంలో అమలు చేయాలో కూడా నిర్ణయించాడు. కాబట్టి ఈసారి మనం వలస వెళ్లే పక్షుల్ని చూసినప్పుడు, యెహోవా ఈ దుష్టలోకాన్ని అంతం చేసే సమయం నిర్ణయించాడని గుర్తుచేసుకుందాం.—హబ. 2:3.

7. పక్షులు ఎగిరే విధానాన్ని చూసినప్పుడు మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (యెషయా 40:31)

7 యెహోవా తన సేవకుల్లో శక్తిని నింపుతాడు. తన ప్రజల్ని బలపరుస్తానని యెహోవా యెషయా ద్వారా మాటిచ్చాడు. వాళ్లు అలసిపోయినప్పుడు లేదా కృంగిపోయినప్పుడు ‘గద్దలా రెక్కలు చాపి పైకి ఎగిరేలా’ చేస్తానని యెహోవా చెప్పాడు. (యెషయా 40:31 చదవండి.) గద్దలు, తమ రెక్కల్ని అంతగా ఆడించకుండానే గాలివాటంతో సునాయాసంగా పైకి ఎగరడం ఇశ్రాయేలీయులు చూసే ఉంటారు. ఆ పక్షులకే యెహోవా శక్తిని ఇచ్చాడంటే తన సేవకులకు శక్తిని ఇవ్వలేడా? కాబట్టి మీరెప్పుడైనా ఒక పెద్ద పక్షిని తన రెక్కల్ని అంతగా ఆడించకుండా పైకి ఎగరడం చూసినప్పుడు, యెహోవా సహాయంతో మీరు సమస్యల్ని అవలీలగా దాటగలరని గుర్తుంచుకోండి.

8. సృష్టి నుండి యోబు ఏం నేర్చుకున్నాడు? మనం ఏం నేర్చుకోవచ్చు?

8 యెహోవాను మనం పూర్తిగా నమ్మవచ్చు. తన మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి యెహోవా యోబుకు సహాయం చేశాడు. (యోబు 32:2; 40:6-8) ఆయన యోబుతో మాట్లాడుతున్నప్పుడు సృష్టిలోని చాలా వాటిని అంటే నక్షత్రాల గురించి, మబ్బుల గురించి, మెరుపుల గురించి చెప్పాడు. అలాగే యెహోవా అడవి ఎద్దు, గుర్రం లాంటి జంతువుల గురించి కూడా మాట్లాడాడు. (యోబు 38:32-35; 39:9, 19, 20) అవన్నీ యెహోవాకున్న అపారమైన శక్తికే కాదు ఆయనకున్న ప్రేమకు, తెలివికి నిలువెత్తు నిదర్శనం. అలా యెహోవా మాట్లాడడంవల్ల యోబుకు ఆయన మీద ఇంతకుముందుకన్నా ఎక్కువ నమ్మకం పెరిగింది. (యోబు 42:1-6) అదేవిధంగా, మనం కూడా సృష్టిని బాగా గమనించినప్పుడు యెహోవాకు మన ఊహకు అందనంత తెలివి, శక్తి ఉన్నాయని అర్థమౌతుంది. మనకున్న సమస్యల్ని ఆయన తీసేయగలడు, తీసేస్తాడు కూడా. ఇది యెహోవా మీద మన నమ్మకాన్ని పెంచట్లేదా?

యేసు, సృష్టిని ఉపయోగించి యెహోవా గురించి నేర్పించాడు

9-10. సూర్యుడు, వర్షం యెహోవా గురించి ఏం నేర్పిస్తున్నాయి?

9 యేసుకు సృష్టిలోని ప్రతీ అంగులం తెలుసు. ఆయన “ప్రధానశిల్పిగా” తన తండ్రితో కలిసి ఈ విశ్వాన్ని సృష్టించే గొప్ప అవకాశాన్ని పొందాడు. (సామె. 8:30) తర్వాత ఆయన భూమ్మీద ఉన్నప్పుడు, తన తండ్రి గురించి శిష్యులకు నేర్పించడానికి సృష్టిని ఉపయోగించాడు. ఆయన నేర్పించిన కొన్ని పాఠాల్ని ఇప్పుడు చూద్దాం.

10 యెహోవా ప్రతీఒక్కర్ని ప్రేమిస్తాడు. యేసు కొండమీది ప్రసంగంలో, సృష్టిలో చాలామంది అంతగా పట్టించుకోని రెండు విషయాల్ని తన శిష్యుల దృష్టికి తీసుకొచ్చాడు. అవేంటంటే సూర్యుడు, వర్షం. మనుషుల జీవనం సాగాలంటే ఆ రెండు చాలా అవసరం. కావాలనుకుంటే, తనని ఆరాధించని వాళ్లకు అవి అందకుండా యెహోవా ఆపగలడు. కానీ ఆయన అలా చేయకుండా ప్రేమతో అందరికీ సూర్యుడ్ని, వర్షాన్ని ఇస్తున్నాడు. (మత్త. 5:43-45) యేసు దీన్ని ఉపయోగించుకుని, యెహోవా అందర్నీ ప్రేమిస్తాడని తన శిష్యులకు నేర్పించాడు. కాబట్టి, మీరెప్పుడైనా ఆహ్లాదకరమైన సూర్యాస్తమయాన్ని చూసినా లేదా సేదదీర్పునిచ్చే వర్షాన్ని చూసినా యెహోవాకు ఉన్న పక్షపాతం లేని ప్రేమను గుర్తుచేసుకోండి. అలా గుర్తుచేసుకున్నప్పుడు, ప్రేమతో అందరికీ ప్రకటించాలనే కోరిక మీలో కలుగుతుంది.

11. ఆకాశ పక్షుల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

11 యెహోవా మనం బ్రతకడానికి కావాల్సినవి ఇస్తాడు. అదే కొండమీది ప్రసంగంలో యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఆకాశపక్షుల్ని బాగా గమనించండి; అవి విత్తవు, కోయవు, గోదాముల్లో పోగుచేసుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికన్నా విలువైనవాళ్లు కారా?” అని యేసు అన్నప్పుడు ఆయన మాటలు వింటున్నవాళ్లు తమ పైనుండి పక్షులు ఎగరడం చూసుంటారు. (మత్త. 6:26) యెహోవా మనం బ్రతకడానికి కావాల్సినవి ఇస్తాడని యేసు మాటలు భరోసా ఇస్తున్నాయి. (మత్త. 6:31, 32) దేవుని నమ్మకమైన సేవకులు సృష్టి నుండి అప్పుడే కాదు ఇప్పుడు కూడా పాఠాలు నేర్చుకుంటున్నారు. స్పెయిన్‌లో ఉంటున్న ఒక పయినీరు సిస్టర్‌కి, ఉండడానికి ఇల్లు దొరక్క చాలా ఇబ్బందిపడింది. అప్పుడు ఆమె, పక్షులు కాయల్ని, గింజల్ని తినడం చూసి ధైర్యం తెచ్చుకుని “యెహోవా వాటినే పోషిస్తున్నాడంటే నన్ను పోషించలేడా” అని అనుకుంది. కొంతకాలానికి ఆ సిస్టర్‌కి ఉండడానికి ఒక చోటు దొరికింది.

12. మత్తయి 10:29-31 ప్రకారం, పిచ్చుకలు యెహోవా గురించి ఏం నేర్పిస్తున్నాయి?

12 యెహోవా మనలో ప్రతీఒక్కర్ని విలువైనవాళ్లుగా చూస్తాడు. యేసు తన అపొస్తలుల్ని పరిచర్యకు పంపించే ముందు, వ్యతిరేకత వస్తుందేమో అనే భయాన్ని పోగొట్టడానికి వాళ్లకు సహాయం చేశాడు. (మత్తయి 10:29-31 చదవండి.) దానికోసం ఆయన ఇశ్రాయేలు దేశంలో తరచుగా కనిపించే పిచ్చుకల గురించి మాట్లాడాడు. యేసు కాలంలో ఆ పిచ్చుకలకు చాలా తక్కువ విలువుండేది. కానీ ఆయన తన శిష్యులతో ఏం అన్నాడంటే, “మీ తండ్రికి తెలియకుండా వాటిలో ఒక్కటి కూడా నేలమీద పడదు.” ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.” తన శిష్యుల్లో ప్రతీఒక్కరు యెహోవాకు విలువైనవాళ్లని యేసు భరోసా ఇచ్చాడు. కాబట్టి వాళ్లు వ్యతిరేకత వస్తుందేమోనని భయపడాల్సిన అవసరంలేదు. యేసు శిష్యులు పట్టణాల్లో, పల్లెల్లో పరిచర్య చేస్తున్నప్పుడు, ఈ పిచ్చుకల్ని చూసి ఆయన మాటల్ని ఖచ్చితంగా గుర్తుచేసుకొని ఉంటారు. ఈసారి మీరెప్పుడైనా చిన్న పక్షుల్ని చూసినప్పుడు, యెహోవా మిమ్మల్ని పట్టించుకుంటాడని, “మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు” అని గుర్తుంచుకోండి. కాబట్టి వ్యతిరేకత వచ్చినా ఆయన సహాయంతో మీరు వాటిని నమ్మకంగా తట్టుకోగలరు.—కీర్త. 118:6.

సృష్టిని చూసి యెహోవా గురించి ఇంకా ఎక్కువ ఎలా తెలుసుకోవచ్చు?

13. సృష్టి నుండి పాఠాలు నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి?

13 సృష్టిని చూసి యెహోవా గురించి ఇంకా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఎలా? ముందుగా, సృష్టిని చూడడానికి సమయం తీసుకోవాలి. తర్వాత, అది యెహోవా గురించి ఏం నేర్పిస్తుందో ఆలోచించాలి. అలా చేయడం అన్నిసార్లు తేలిక కాకపోవచ్చు. కామెరూన్‌లో ఉంటున్న జెరాల్డిన్‌ అనే సిస్టర్‌ ఇలా అంటుంది: “నేను సిటీలోనే పుట్టి, పెరిగాను కాబట్టి ప్రకృతిని చూడడానికి నేను నా వంతు ప్రయత్నం చేయాలని అర్థంచేసుకున్నాను.” అల్ఫెంన్సో అనే సంఘపెద్ద ఇలా అంటున్నాడు: “నా ఉరుకులుపరుగుల జీవితంలో యెహోవా సృష్టిని గమనించడానికి అలాగే అది ఆయన గురించి నాకేం నేర్పిస్తుందో ఆలోచించడానికి నేను సమయం తీసుకోవాలని నేర్చుకున్నాను.”

దావీదు తన చుట్టూవున్న ప్రకృతిని గమనిస్తూ, అది యెహోవా గురించి ఏం నేర్పిస్తుందో ఆలోచించాడు (14వ పేరా చూడండి)

14. సృష్టి గురించి ఆలోచించినప్పుడు దావీదు ఏం నేర్చుకున్నాడు?

14 యెహోవా సృష్టి గురించి దావీదు లోతుగా ఆలోచించాడు. ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “నేను నీ చేతి పని అయిన నీ ఆకాశాన్ని, నువ్వు చేసిన చంద్రుణ్ణి, నక్షత్రాల్ని చూసినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది: నువ్వు గుర్తుంచుకోవడానికి మనిషి ఎంతటివాడు?” (కీర్త. 8:3, 4) అవును, దావీదు నక్షత్రాలు నిండిన ఆకాశాన్ని చూస్తూ సంబరపడడమే కాదు, ఆ నక్షత్రాలు యెహోవా గురించి ఏం నేర్పించాయో ఆలోచించాడు. అలా యెహోవా ఎంత గొప్పవాడో ఆయన అర్థంచేసుకున్నాడు. ఇంకొన్నిసార్లు, తల్లి గర్భంలో తన శరీరం ఎంత అద్భుతంగా తయారు చేయబడిందో ఆలోచించి, యెహోవా తెలివికి ఆయన ముగ్ధుడయ్యాడు.—కీర్త. 139:14-17.

15. మీరు యెహోవా సృష్టిలో ఆయన లక్షణాల్ని చూసిన సందర్భాల్ని చెప్పండి. (కీర్తన 148:7-10)

15 దావీదులాగే, సృష్టి గురించి ఆలోచించడానికి మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరంలేదు. మన చుట్టూనే చాలా విషయాలున్నాయి. వాటిని గమనించినప్పుడు యెహోవా లక్షణాల్ని తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకు, సూర్యకిరణాలు మీ శరీరం మీద పడినప్పుడు, యెహోవా శక్తి గురించి ఆలోచించండి. (యిర్మీ. 31:35) ఒక పక్షి గూడు కట్టుకోవడం చూసినప్పుడు, యెహోవా తెలివి గురించి ఆలోచించండి. ఒక కుక్క పిల్ల తన తోకను తనే పట్టుకోవడానికి గిరగిరా తిరుగుతున్నప్పుడు, యెహోవాలో ఉన్న నవ్వించే గుణం గురించి ఆలోచించండి. ఒక తల్లి తన బిడ్డతో ఆడుకుంటున్నప్పుడు, యెహోవా ప్రేమ గురించి ఆలోచించండి. సృష్టిలో మనకు దగ్గరగా ఉన్నవి, దూరంగా ఉన్నవి, చిన్నవి-పెద్దవి అన్నీ యెహోవాను స్తుతిస్తున్నాయి. కాబట్టి ఆయన గురించి నేర్చుకోవడానికి మనకు ఎన్నో అవకాశాలున్నాయి.—కీర్తన 148:7-10 చదవండి.

16. మనం ఏం చేయాలని నిశ్చయించుకుందాం?

16 యెహోవా చాలా తెలివిగల, ప్రేమగల, శక్తిగల దేవుడు. ఆయన అన్నిటినీ అందంగా చెక్కాడు. సృష్టిని చూడాలే గానీ ఈ లక్షణాలే కాదు ఇంకా ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మనం సృష్టిని ఆస్వాదించడానికి ఎప్పటికప్పుడు సమయం తీసుకుని, అది యెహోవా గురించి ఏం నేర్పిస్తుందో ఆలోచిద్దాం. అలా చేసినప్పుడు మన సృష్టికర్తకు మనం దగ్గరౌతాం. (యాకో. 4:8) అయితే, పిల్లలు యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేయడానికి తల్లిదండ్రులు ఈ సృష్టిని ఎలా ఉపయోగించవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 5 దేవుని అద్భుత కార్యాలు

a యెహోవా సృష్టి చాలా అద్భుతం. భగభగ మండే సూర్యుడి నుండి సుతిమెత్తని పూలరెమ్మల వరకు ఆయన చేసినవన్నీ మనల్ని అబ్బురపరుస్తాయి. సృష్టిని గమనించినప్పుడు యెహోవా ఎలాంటి దేవుడో కూడా మనం తెలుసుకుంటాం. మనం ఎందుకు సమయం తీసుకుని సృష్టిని జాగ్రత్తగా గమనించాలో, అలా గమనించడం వల్ల యెహోవాకు ఎలా దగ్గరవ్వవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.